ఒకప్పుడు నేను చావుకు భయపడ్డాను
ఒకప్పుడు నేను చావుకు భయపడ్డాను
ప్యేరో గాట్టీ చెప్పినది
గొణుగుల శబ్దం మెల్లమెల్లగా పెరిగి అరుపుల స్థాయికి చేరింది. కొద్దిసేపట్లోనే, సైరన్లను మోగిస్తూ ఎక్కడికైనా వెళ్లి దాక్కోండి అని బిగ్గరగా ప్రజల్ని హెచ్చరించారు. ఆ తర్వాత, అప్పటికే గజగజ వణకిపోతున్న ప్రజల చెవిగూబలు పగిలిపోయేంత శబ్దంతో బాంబుల వర్షం కురిసి అంతా ధ్వంసమైపోయింది.
1943/1944లో ఇటలీలోని మీలాన్‌లో పరిస్థితి అలా ఉండేది. శిబిరాల్లో బాంబుల వర్షానికి బలైనవారి శవాలు గుర్తుపట్టలేనంతగా తునాతునకలైపోయి, చెల్లాచెదరుగా పడివుండేవి. యువ సైనికుడిగా ఉన్న నాకు వాటిని పోగుచేయమని చెప్పేవారు. ఇతరులు చనిపోవడాన్ని దగ్గరగా చూడడం మాత్రమే కాదుగానీ, నేను కూడా కొన్నిసార్లు వెంట్రుకవాసిలో చావును తప్పించుకున్నాను. అలాంటి సందర్భాల్లో సామూహిక వధ నుండి నన్ను కాపాడితే తన ఇష్టానుసారంగా జీవిస్తానని ప్రార్థనలో దేవునికి మాటిచ్చేవాణ్ణి.
చావు మీదున్న భయాన్ని తరిమేశాను
స్విస్ సరిహద్దుకు దగ్గర్లో, ఇటలీలోని కోమో అనే చిన్న పట్టణానికి దాదాపు 10 కిలోమీటర్ల దూరంలోవున్న ఓ పల్లెటూర్లో నేను పెరిగాను. చిన్నప్పుడే నా జీవితంలో చావు మీద భయం, దుఃఖం అలుముకున్నాయి. స్పానిష్ ఫ్లూ వల్ల మా ఇద్దరు అక్కలు చనిపోయారు. ఆ తర్వాత 1930లో నాకు కేవలం ఆరేళ్లున్నప్పుడు మా అమ్మ లూయీజా చనిపోయింది. నేను క్యాథలిక్‌గా పెరిగాను కాబట్టి మతపరమైన నియమాలను పాటించేవాణ్ణి, వారం వారం చర్చిలో జరిగే మాస్‌కు వెళ్లేవాణ్ణి. అయితే ఎన్నో సంవత్సరాలు గడిచాక చర్చిలో కాదుగానీ ఓ మంగలి దుకాణంలో నాకున్న భయం పోయింది.
1944లో రెండవ ప్రపంచ యుద్ధం వల్ల ఎంతోమంది చనిపోయారు. వేలాదిమంది ఇటలీ సైనికులు, నేను యుద్ధ భూమిని వదిలేసి ప్రశాంతంగా ఉన్న స్విట్జర్లాండ్‌కు పారిపోయాం. అక్కడికెళ్లిన తర్వాత మమ్మల్ని వేర్వేరు శరణార్థ శిబిరాలకు తీసుకెళ్లారు. నన్ను దేశంలో ఈశాన్యాన ఉన్న ష్టయినాక్ అనే పల్లెటూరికి పంపించారు. మాకు అక్కడ కొంత స్వేచ్ఛను ఇచ్చారు. అక్కడున్న ఒక మంగలివాడు తన దుకాణంలో కొన్ని రోజులపాటు సహాయం చేయమని నన్ను అడిగాడు. నేను అతనితోనే ఉంటూ కేవలం నెల రోజులే అక్కడ పనిచేశాను. అక్కడ నాకు ఒక వ్యక్తి పరిచయమయ్యాడు. దాంతో నా జీవితం ఓ మలుపు తిరిగింది.
ఆడొల్ఫో టెలీనీ అనే వ్యక్తి ఆ దుకాణంలోనే జుట్టు కత్తిరించుకునేవాడు. ఆయన స్విట్జర్లాండ్‌లో ఉంటున్న ఇటలీ దేశస్థుడు. ఆయన ఓ యెహోవాసాక్షి. అంతకుముందెన్నడూ నేను యెహోవాసాక్షుల గురించి వినలేదు. ఎందుకంటే అప్పట్లో ఇటలీ మొత్తం మీద దాదాపు 150 మంది సాక్షులు మాత్రమే ఉండేవారు. శాంతి గురించి, ‘జీవం సమృద్ధిగా’ ఉండడం గురించి దేవుడు చేసిన వాగ్దానాలనూ అద్భుతమైన బైబిలు సత్యాలనూ ఆడొల్ఫో నాకు చెప్పాడు. (యోహా. 10:10; ప్రక. 21:3, 4) యుద్ధం, మరణం ఉండని భవిష్యత్తు గురించి విన్నప్పుడు నాకు ఎంతో ఆసక్తి కలిగింది. నేను వెళ్లి శరణార్థ శిబిరంలో ఉంటున్న జూజెప్పే టూబీనీ అనే యువ ఇటాలియన్‌తో ఆ భవిష్యత్తు గురించి చెప్పాను. ఆయన కూడా దాని పట్ల ఆసక్తి చూపించాడు. ఆడొల్ఫో, మరితర సాక్షులు అప్పుడప్పుడు మా శిబిరానికి వచ్చేవారు.
ష్టయినాక్‌కు దాదాపు 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఆర్బోన్‌లో యెహోవాసాక్షుల చిన్న గుంపు ఒకటి ఇటాలియన్ భాషలో కూటాలు జరుపుకునేది. ఆడొల్ఫో నన్ను అక్కడికి తీసుకెళ్లాడు. అక్కడ విన్న విషయాలు నాకు
ఎంతగా నచ్చాయంటే తర్వాతి వారం నేను కూటానికి నడుచుకుంటూ వెళ్లాను. ఆ తర్వాత, జూరిక్‌లో జరిగిన ఓ యెహోవాసాక్షుల సమావేశానికి హాజరయ్యాను. సామూహిక వధ జరిగిన క్యాంపులను, వాటిలో గుట్టలుగుట్టలుగా పడివున్న శవాలను చూపించిన స్లైడ్ షో నన్ను ఎంతో కదిలించింది. చాలామంది జర్మన్ సాక్షులు తమ విశ్వాసాన్ని బట్టి చంపబడ్డారని నేను తెలుసుకున్నాను. ఆ సమావేశంలో నేను మారీయా పీట్సాటోను కలిశాను. యెహోవాసాక్షిగా తాను చేసే పనిని బట్టి ఇటాలియన్ ఫాసిస్ట్ అధికారులు ఆమెకు 11 ఏళ్ల జైలు శిక్షను విధించారు.యుద్ధం ముగిసిన తర్వాత నేను మళ్లీ ఇటలీకి వెళ్లి, కోమోలో ఉన్న చిన్న సంఘంతో సహవసించడం మొదలుపెట్టాను. నాకు అప్పట్లో బైబిలు అధ్యయనం ఒక క్రమపద్ధతిలో జరగలేదు. కానీ బైబిలు ప్రాథమిక సత్యాలు నాకు స్పష్టంగా తెలుసు. మారీయా పీట్సాటో కూడా అదే సంఘంతో సహవసించేది. బాప్తిస్మం తీసుకోవడం ఎందుకు అవసరమనే దాని గురించి ఆమె నాతో మాట్లాడింది. ఆ తర్వాత, సొన్‌డ్రీయో మండలంలోని కాస్ట్‌యోనె ఆన్‌డేవెన్నోలో నివసించే మార్షెల్లో మార్టీనెల్లీ అనే సహోదరుణ్ణి కలవడానికి రమ్మని నన్ను ఆహ్వానించింది. ఆయన నమ్మకమైన అభిషిక్త సహోదరుడు. అప్పటి నిరంకుశ పరిపాలనలో ఆయనకు 11 ఏళ్ల జైలు శిక్ష విధించబడింది. ఆయనను కలవడానికి నేను 80 కిలోమీటర్లు సైకిల్ తొక్కుకుంటూ వెళ్లాను.
బైబిలును ఉపయోగిస్తూ బాప్తిస్మానికి అర్హతలేమిటో మార్షెల్లో నాకు వివరించాడు. ఆ తర్వాత మేమిద్దరం కలిసి ప్రార్థించి, ఆడ్డా నదికి వెళ్లాం. అక్కడ నేను బాప్తిస్మం తీసుకున్నాను. అది 1946 సెప్టెంబరు. నాకు అదెంతో ప్రత్యేకమైన రోజు. యెహోవాను సేవించాలని నేను తీసుకున్న నిర్ణయాన్ని బట్టి, ఆ తర్వాత భవిష్యత్తుపై ఉన్న నిరీక్షణను బట్టి ఎంత సంతోషించానంటే, నేను ఆ రోజు 160 కిలోమీటర్లు సైకిల్ తొక్కాననే విషయాన్ని సాయంత్రం కూడా గుర్తించనేలేదు.
యుద్ధం ముగిసిన తర్వాత ఇటలీలో జరిగిన సమావేశాల్లో మొట్టమొదటిది 1947 మే నెలలో మీలాన్ అనే పల్లెటూర్లో జరిగింది. ఆ సమావేశానికి దాదాపు 700 మంది హాజరయ్యారు. ఫాసిస్ట్ అధికారుల హింసకు గురైన చాలామంది వారిలో ఉన్నారు. అయితే, ఆ సమావేశంలో ఓ అసాధారణ సంఘటన జరిగింది. శిబిరంలో నేను సాక్ష్యమిచ్చిన జూజెప్పే టూబీనీ అనే వ్యక్తి ఆ రోజు బాప్తిస్మపు ప్రసంగం ఇచ్చాడు. ప్రసంగం తర్వాత ఆయన కూడా బాప్తిస్మం తీసుకున్నాడు!
ఆ సమావేశంలో బ్రూక్లిన్ బెతెల్ నుండి వచ్చిన సహోదరుడు నేథన్ నార్‌ను కలిసే చక్కని అవకాశం నాకు దొరికింది. మా జీవితాలను దేవుని సేవకు అంకితం చేయమని ఆయన జూజెప్పేను, నన్ను ప్రోత్సహించాడు. ఒక నెల తర్వాత పూర్తికాల సేవ మొదలుపెట్టాలని నేను నిర్ణయించుకున్నాను. ఇంటికి వచ్చిన తర్వాత నా నిర్ణయం గురించి మా కుటుంబానికి చెప్పాను. వారందరూ నా నిర్ణయాన్ని మార్చడానికి ప్రయత్నించారు కానీ, నేను మాత్రం స్థిరంగా ఉన్నాను. కాబట్టి, ఒక నెల తర్వాత నేను మీలాన్‌లోవున్న బెతెల్‌లో సేవ చేయడం ఆరంభించాను. అక్కడ నలుగురు మిషనరీలు అంటే, జూజెప్పే (జోసెఫ్) రొమానో, ఆయన భార్య అంజెలీనా, కార్లో బేనాన్‌టీ, ఆయన భార్య కోస్టాన్‌ట్సా సేవ చేస్తున్నారు. జూజెప్పే టూబీనీ కొత్తగా అక్కడ చేరడంతో వారు ఐదుగురు అయ్యారు. నేను ఆరవ వ్యక్తిని.
బెతెల్‌లో ఒక నెలపాటు సేవచేసిన తర్వాత నేను ప్రాంతీయ పర్యవేక్షకుడిగా నియమించబడ్డాను. ఇటలీలో పుట్టి అలా నియమించబడిన వారిలో నేనే మొదటివాణ్ణి. 1946లో అమెరికా నుండి ఇటలీకి మొదటి మిషనరీగా వచ్చిన సహోదరుడు జార్జ్ ఫ్రేడ్యానెల్లీ అప్పటికే ప్రయాణ సేవలో ఉన్నాడు. ఆయన కొన్ని వారాలపాటు నాకు శిక్షణనిచ్చాడు. ఆ తర్వాత నేను ఒంటరిగా ప్రయాణ సేవ చేయడం మొదలుపెట్టాను. నేను మొట్టమొదట సందర్శించిన సంఘం నాకు బాగా గుర్తుంది. దాని పేరు ఫెయేన్‌జా. ఒక్కసారి ఆలోచించండి! అప్పటి వరకు నేను ఒక్క ప్రసంగం కూడా ఇవ్వలేదు! అయినా, కూటానికి వచ్చిన చాలామంది యౌవనులను, మరితరులను పూర్తికాల సేవ గురించి ఆలోచించమని ప్రోత్సహించాను. ఆ తర్వాత వారిలో కొంతమంది యౌవనులు ఇటాలియన్ భాషా క్షేత్రంలో ఎంతో బాధ్యతాయుతమైన నియామకాలను పొందారు.
ప్రయాణ పర్యవేక్షకుడిగా నేను ఎంతో సంతోషకరమైన జీవితాన్ని మొదలుపెట్టాను. అది ఆశ్చర్యాలు, సర్దుబాట్లు, సవాళ్లు, సంతోషాల వంటివాటితో కూడిన జీవితం. అంతేకాక, అది మన ప్రియ సహోదర సహోదరీల గొప్ప ప్రేమను రుచి చూపించింది.
యుద్ధం ముగిసిన తర్వాత ఇటలీలో మత వాతావరణం
అప్పట్లో ఇటలీలోని మత పరిస్థితి ఎలా ఉందో చెబుతాను. క్యాథలిక్ చర్చి ఆధిపత్యానికి తిరుగులేదు. 1948లో కొత్త రాజ్యాంగం అమల్లోకి వచ్చింది. అయినా,
సహోదరులు స్వేచ్ఛగా ప్రకటనా పని చేయకుండా అడ్డుకున్న ఫాసిస్ట్‌ల నియమాలు 1956 వరకు రాజ్యమేలాయి. మతనాయకుల ఒత్తిడి వల్ల ఎన్నోసార్లు మన ప్రాంతీయ సమావేశాలకు ఆటంకాలు ఏర్పడ్డాయి. కానీ, కొన్నిసార్లు మతనాయకుల ప్రయత్నాలు ఘోరంగా విఫలమయ్యాయి. ఉదాహరణకు, 1948లో మధ్య ఇటలీలోని సూల్మోనా అనే చిన్న పట్టణంలో ఏమి జరిగిందో చూడండి.అప్పుడు ఒక థియేటర్‌లో మన సమావేశం జరుగుతోంది. ఆదివారం ఉదయం కార్యక్రమానికి నేను అధ్యక్షుడిగా ఉన్నాను, జూజెప్పే రొమానో బహిరంగ ప్రసంగం ఇచ్చాడు. దేశం మొత్తంలో 500మంది ప్రచారకులు కూడా లేని సమయంలో 2000మందితో ఆ సమావేశపు థియేటర్ కిక్కిరిసిపోయింది. అప్పట్లో అది చాలా ఎక్కువ. అయితే, ఇద్దరు ప్రీస్టుల నడిపింపుతో ఓ యువకుడు ప్రసంగం అయిపోయే సమయంలో స్టేజీ మీదకు దూసుకొచ్చాడు. అయోమయం సృష్టించాలనే ఆలోచనతో ఆయన గట్టిగా కేకలు వేయడం మొదలుపెట్టాడు. నేను వెంటనే అతనితో, “నువ్వు ఏమైనా చెప్పాలనుకుంటే ఒక హాలు అద్దెకు తీసుకో, అప్పుడు నీకు ఇష్టమొచ్చింది చెప్పుకోవచ్చు” అని అన్నాను. హాజరైనవారికి కూడా అతను చేసిన పని నచ్చక, వెళ్లిపొమ్మని అరిచారు. దాంతో అతను స్టేజీ మీద నుండి కిందకు దూకి మాయమైపోయాడు.
ఆ రోజుల్లో ప్రయాణాలు చేయడం ఎంతో కష్టమైన పని. నేను కొన్నిసార్లు ఒక సంఘం నుండి మరో సంఘానికి నడుచుకుంటూ లేదా సైకిల్ తొక్కుకుంటూ వెళ్లేవాణ్ణి, ప్రయాణికులతో కిక్కిరిసిపోయిన డొక్కు బస్సుల్లో లేదా రైలులో వెళ్లేవాణ్ణి. అప్పుడప్పుడు గుర్రపుశాలలో లేదా పరికరాలను ఉంచే గదిలో బసచేయాల్సి వచ్చేది. అప్పటికి యుద్ధం ముగిసి కొంతకాలమే అయింది కాబట్టి, ఇటలీలో చాలామంది పేదరికంలో ఉన్నారు. సహోదరులు కొంతమందే ఉండేవారు. వారు కూడా పేదవాళ్లే. అయినా యెహోవా సేవలో జీవితం ఎంతో అద్భుతంగా సాగింది.
గిలియడ్ పాఠశాలలో శిక్షణ
1950లో జూజెప్పే టూబీనీకి, నాకు గిలియడ్ మిషనరీ పాఠశాల 16వ తరగతికి హాజరవ్వమనే ఆహ్వానం వచ్చింది. ఆంగ్లం నేర్చుకోవడం నాకు చాలా కష్టమని మొదట్లోనే గ్రహించాను. నేను శాయశక్తులా కృషి చేసినా అది ఇంకా కష్టంగానే ఉండేది. అప్పుడు మేము పూర్తి బైబిలును ఆంగ్లంలో చదవాల్సి ఉంది. దాని కోసం నేను కొన్నిసార్లు మధ్యాహ్న భోజనాన్ని కూడా మానేసేవాణ్ణి. కొన్నిరోజులకు ప్రసంగం ఇవ్వడానికి నా వంతు రానే వచ్చింది. ఆ రోజు నేను ప్రసంగం ఇచ్చిన తర్వాత మా ఉపదేశకుడు ఇలా అన్నాడు: “నీ సంజ్ఞలు, నీ ఉత్సాహం చాలా బాగున్నాయి. కానీ నీ ఆంగ్లం మాత్రం అస్సలు అర్థంకాలేదు.” అది నాకు ఎంతగా గుర్తుందంటే, ఆయన నిన్ననే ఆ మాటలు అన్నట్లు నాకనిపిస్తుంది. ఏమైతేనేం, మొత్తానికి నేను కోర్సును పూర్తి చేశాను. ఆ తర్వాత జూజెప్పేను, నన్ను తిరిగి ఇటలీకే నియమించారు. సహోదరులకు సేవచేయడానికి ఆ అదనపు శిక్షణ మమ్మల్ని మరింత సమర్థులను చేసింది.
1955లో నేను లీడ్యాను పెళ్లి చేసుకున్నాను. అప్పటికి ఏడు సంవత్సరాల క్రితం ఆమె బాప్తిస్మం తీసుకున్నప్పుడు బాప్తిస్మ ప్రసంగాన్ని నేనే ఇచ్చాను. వాళ్ల నాన్న డోమేనీకో ఒక ప్రియమైన సహోదరుడు. ఆయన ఫాసిస్ట్ పరిపాలనలో హింసించబడి మూడు సంవత్సరాల పాటు
దేశం నుండి బహిష్కరించబడ్డాడు. అయినా తన ఏడుగురు పిల్లలు సత్యాన్ని హత్తుకొని జీవించేందుకు ఆయన సహాయం చేయగలిగాడు. లీడ్యా కూడా సత్యం పక్షాన గట్టిగా పోరాడింది. ఇంటింటి పరిచర్య చేసే విషయంలో మాకున్న చట్టపరమైన హక్కును ప్రభుత్వం గుర్తించేటప్పటికి ఆమె మూడు కోర్టు కేసులను ఎదుర్కొంది. మా పెళ్లైన ఆరు సంవత్సరాలకు మా మొదటి అబ్బాయి బేన్యామీనో పుట్టాడు. 1972లో మా రెండవ అబ్బాయి మార్కో పుట్టాడు. వారిద్దరూ ఇప్పుడు తమ కుటుంబాలతో కలిసి ఉత్సాహంగా యెహోవా సేవచేయడం చూసి నేను ఎంతో సంతోషిస్తున్నాను.యెహోవా సేవలో చురుకుగా ఉన్నాను
సహోదరులకు సేవ చేస్తూ గడిపిన సంతోషకరమైన జీవితంలో మరపురాని అనుభవాలు ఎన్నో ఎదురయ్యాయి. ఉదాహరణకు, 1980ల ప్రారంభంలో లీడ్యావాళ్ల నాన్న అప్పట్లో ఇటలీ అధ్యక్షుడిగా ఉన్న సాన్‌డ్రో పర్టీనీకి ఉత్తరం రాశాడు. ఫాసిస్ట్ నిరంకుశ పరిపాలనలో వారిద్దరూ దేశం నుండి బహిష్కరించబడి వెన్‌టొటేనే ద్వీపంలో శిక్షను అనుభవించారు. ఫాసిస్ట్ పరిపాలనను ఎదిరించే వ్యక్తులు అని అధికారులకు అనిపించినవారిని ఆ ద్వీపంలో ఉంచేవారు. అధ్యక్షుడైన సాన్‌డ్రోకు సాక్ష్యం ఇవ్వాలనే ఉద్దేశంతో ఆయనను ఇంటర్వ్యూ చేసేందుకు మా మామగారు అనుమతి కోరారు. ఆయనకు అనుమతి లభించడంతో మేమిద్దరం కలిసి ఆయన దగ్గరికి వెళ్లాం. ఆయన మమ్మల్ని ఎంతో సాదరంగా ఆహ్వానించాడు. మేము అలాంటి ఆహ్వానాన్ని అంతకుముందెన్నడూ రుచిచూడలేదు. సాన్‌డ్రో మా మామగారిని చక్కగా పలకరించి కౌగిలించుకున్నాడు. ఆ తర్వాత మేము మా విశ్వాసం గురించి ఆయనతో మాట్లాడి కొన్ని ప్రచురణలను ఇచ్చాం.
ప్రయాణ పర్యవేక్షకుడిగా 44 సంవత్సరాలు పనిచేసిన తర్వాత 1991లో నేను ఆ సేవను ఆపేశాను. అప్పటికి నేను ఇటలీలో ఉన్న సంఘాలన్నిటినీ సందర్శించాను. ఆ తర్వాతి నాలుగు సంవత్సరాలు నేను సమావేశ హాలు పర్యవేక్షకుడిగా సేవ చేశాను. కొంతకాలానికి, తీవ్రమైన అనారోగ్యం వల్ల నా సేవను కాస్త తగ్గించాల్సి వచ్చింది. అయితే, యెహోవా కృప వల్ల నేను ఇంకా పూర్తికాల సేవలో కొనసాగుతున్నాను. సువార్త ప్రకటించడానికి, బోధించడానికి నేను చేయగలిగినదంతా చేస్తూ ప్రస్తుతం కొన్ని బైబిలు అధ్యయనాలు నిర్వహిస్తున్నాను. ఇప్పటికీ నేను ప్రసంగాలను “అత్యంత” ఉత్సాహంతో ఇస్తానని సహోదరులు అంటుంటారు. వయసు పైబడినా నా ఉత్సాహం తగ్గనందుకు నేను యెహోవాకు రుణపడివున్నాను.
యౌవనుడిగా ఉన్నప్పుడు చావంటే ఎంతో భయపడేవాడిని. కానీ ఖచ్చితమైన బైబిలు జ్ఞానాన్ని సంపాదించుకోవడం వల్ల నేను నిరంతర జీవితం కోసం అంటే యేసు అన్నట్లుగా జీవం “సమృద్ధిగా” ఉండే సమయం కోసం నమ్మకంతో ఎదురుచూస్తున్నాను. (యోహా. 10:10) శాంతిభద్రతలు, సంతోషం, యెహోవా మెండైన ఆశీర్వాదాలు ఉండే జీవితం కోసం నేను ఎదురుచూస్తున్నాను. ఎవరి నామాన్నైతే ధరించే గొప్ప అవకాశం మనకు దొరికిందో ఆ ప్రేమగల సృష్టికర్తకే ఘనతంతా చెందును గాక.—కీర్త. 83:18.
[22, 23 పేజీల్లోని మ్యాపు]
(పూర్తిగా ఫార్మా చేయబడిన టెస్ట్ కోసం ప్రచురణ చూడండి)
స్విట్జర్లాండ్
బెర్న్
జూరిక్
ఆర్బోన్
ష్టయినాక్
ఇటలీ
రోమ్
కోమో
మీలాన్
ఆడ్డా నది
కాస్ట్‌యోనె ఆన్‌డేవెన్నో
ఫెయేన్‌జా
సూల్మోనా
వెన్‌టొటేనే
[22వ పేజీలోని చిత్రం]
గిలియడ్ పాఠశాల కోసం వెళ్తున్నప్పుడు
[22వ పేజీలోని చిత్రం]
గిలియడ్ పాఠశాలలో జూజెప్పేతో
[23వ పేజీలోని చిత్రం]
మా పెళ్లి రోజున
[23వ పేజీలోని చిత్రం]
55 కన్నా ఎక్కువ సంవత్సరాలుగా నాకు తోడుగా ఉన్న నా ప్రియమైన భార్య