కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

దేవుని విశ్రాంతి అంటే ఏమిటి?

దేవుని విశ్రాంతి అంటే ఏమిటి?

దేవుని విశ్రాంతి అంటే ఏమిటి?

“దేవుని ప్రజలకు విశ్రాంతి నిలిచియున్నది.”—హెబ్రీ. 4:9.

1, 2. ఆదికాండము 2:3లోని మాటలను బట్టి మనకు ఏమి అర్థమౌతోంది? మనం ఇప్పుడు ఏ ప్రశ్నలకు జవాబు చూస్తాం?

 దేవుడు సూచనార్థకమైన ఆరు దినాల్లో మానవుల కోసం భూమిని తయారుచేశాడని ఆదికాండము మొదటి అధ్యాయం నుండి మనం తెలుసుకోవచ్చు. వాటిలో ఒక్కో దినం ముగిసిన విధానం గురించి, ‘అస్తమయమును ఉదయమును కలిగెను’ అని బైబిలు చెబుతోంది. (ఆది. 1:5, 8, 13, 19, 23, 31) అయితే, ఏడవ దినం గురించి బైబిలు ఇలా చెబుతోంది: ‘దేవుడు ఆ యేడవ దినమును ఆశీర్వదించి పరిశుద్ధపరచెను. ఏలయనగా దానిలో దేవుడు తాను సృజించినట్టి తన పని అంతటినుండి విశ్రమించెను [“విశ్రమించుచుండెను,” NW].’—ఆది. 2:3.

2 ‘విశ్రమించుచుండెను’ అనే పదాన్ని బట్టి, మోషే ఆదికాండము పుస్తకాన్ని రాసే సమయానికి అంటే సా.శ.పూ. 1513లో దేవుడు ఇంకా విశ్రమిస్తున్నాడని అర్థమౌతోంది. అయితే దేవుని విశ్రాంతి దినం ఇంకా కొనసాగుతోందా? అలాగైతే ఇప్పుడు మనం దానిలోకి ప్రవేశించగలమా? ఈ ప్రశ్నలకు జవాబు తెలుసుకోవడం ఎంతో ప్రాముఖ్యం.

యెహోవా ఇంకా ‘విశ్రమిస్తున్నాడా’?

3. ఏడవ దినం మొదటి శతాబ్దంలో కూడా కొనసాగుతూనే ఉందని యోహాను 5:16, 17లోని యేసు మాటలు ఎలా చూపిస్తున్నాయి?

3 ఏడవ దినం సా.శ. మొదటి శతాబ్దంలో కూడా కొనసాగుతూనే ఉందని చెప్పడానికి రెండు రుజువులు ఉన్నాయి. మొదటి రుజువును పరిశీలించండి. యేసు సబ్బాతు రోజున స్వస్థత చేసినందుకు ఆయన పనిచేశాడంటూ వ్యతిరేకులు ఆయనను నిందించారు. దానికి యేసు ఏమన్నాడో గమనించండి: “నా తండ్రి యిదివరకు పనిచేయుచున్నాడు, నేనును చేయుచున్నాను.” (యోహా. 5:16, 17) ఆయన మాటలకు అర్థమేమిటి? యేసు సబ్బాతు రోజున పనిచేశాడని వ్యతిరేకులు ఆయనను నిందించారు. ‘నా తండ్రి పనిచేయుచున్నాడు’ అని చెప్పడం ద్వారా యేసు వారి నిందకు జవాబిచ్చాడు. మరో మాటలో చెప్పాలంటే యేసు వారితో ఇలా అన్నాడు: ‘నేను, నా తండ్రి ఒకేలాంటి పని చేస్తున్నాం. వేల సంవత్సరాలుగా సాగుతున్న సబ్బాతు దినంలో ఆయన పనిచేస్తూనే ఉన్నాడు కాబట్టి నేను కూడా సబ్బాతు రోజున పనిచేయడం తప్పేమీకాదు.’ దేవుని గొప్ప విశ్రాంతి దినం లేక ఏడవ దినం తన కాలంలో కూడా కొనసాగుతూనే ఉందని యేసు మాటలను బట్టి తెలుస్తోంది. a

4. తన కాలంలో కూడా ఏడవ దినం కొనసాగుతూనే ఉందని చూపించడానికి పౌలు ఏ రుజువునిచ్చాడు?

4 రెండవ రుజువును అపొస్తలుడైన పౌలు ఇచ్చాడు. దేవుని విశ్రాంతి గురించి చెబుతున్న ఆదికాండము 2:2లోని మాటలను ఎత్తి చెబుతూ దైవప్రేరణతో ఆయన ఇలా రాశాడు: “విశ్వాసులమైన మనము ఆ విశ్రాంతిలో ప్రవేశించుచున్నాము.” (హెబ్రీ. 4:3, 4, 6, 9) దీన్నిబట్టి, పౌలు కాలంలో కూడా ఏడవ దినం కొనసాగుతూనే ఉందని అర్థమౌతోంది. ఇంతకీ అది ఎప్పటివరకు కొనసాగుతుంది?

5. ఏడవ దినం విషయంలో దేవుని ఉద్దేశం ఏమిటి? ఆ ఉద్దేశం ఎప్పుడు పూర్తిగా నెరవేరుతుంది?

5 ఏడవ దినం ఎప్పటివరకు కొనసాగుతుందో తెలుసుకోవాలంటే, దాని విషయంలో దేవుని ఉద్దేశం ఏమిటో మనం గుర్తుంచుకోవాలి. ఆ ఉద్దేశం గురించి ఆదికాండము 2:3 ఇలా చెబుతోంది: “దేవుడు ఆ యేడవ దినమును ఆశీర్వదించి పరిశుద్ధపరచెను.” తన సంకల్పాన్ని పూర్తిగా నెరవేర్చడానికి యెహోవా దేవుడు దాన్ని ‘పరిశుద్ధపరిచాడు’ లేదా ప్రత్యేకించాడు. తనకు లోబడే మానవులతో భూమి నిండాలని, వారు భూమినీ దానిపైనున్న ఇతర ప్రాణులనూ చూసుకోవాలని దేవుడు ఉద్దేశించాడు. (ఆది. 1:28) దాన్ని పూర్తిగా నెరవేర్చడానికి యెహోవా దేవుడు మరియు “విశ్రాంతి దినమునకు ప్రభువైయున్న” యేసుక్రీస్తు ‘ఇప్పటి వరకు పని చేస్తూనే ఉన్నారు.’ (మత్త. 12:8) ఏడవ దినం విషయంలో దేవుని ఉద్దేశం క్రీస్తు వెయ్యేళ్ల పరిపాలన ముగింపులో పూర్తిగా నెరవేరుతుంది. అంతవరకు దేవుని విశ్రాంతి దినం కొనసాగుతుంది.

వారిలా “అవిధేయత” చూపించకండి

6. ఎవరి ఉదాహరణలు మనకు హెచ్చరికగా ఉన్నాయి? మనం ఏ పాఠం నేర్చుకోవచ్చు?

6 ఆదాముహవ్వలకు దేవుడు తన ఉద్దేశాన్ని స్పష్టంగా చెప్పాడు. కానీ వారు దానికి అనుగుణంగా ప్రవర్తించలేదు. వారే కాదు, అప్పటినుండి లక్షలాదిమంది దేవునికి అవిధేయత చూపించారు. చివరకు, దేవుని సొత్తుగా ఉన్న ఇశ్రాయేలు జనాంగం కూడా ఆయనకు అవిధేయత చూపించింది. అందుకే, వారిలా ప్రవర్తించే ప్రమాదం గురించి పౌలు మొదటి శతాబ్దంలోని క్రైస్తవులను హెచ్చరించాడు. ఆయనిలా రాశాడు: “అవిధేయతవలన వారు పడిపోయినట్లుగా మనలో ఎవడును పడిపోకుండ ఆ విశ్రాంతిలో ప్రవేశించుటకు జాగ్రత్త పడుదము.” (హెబ్రీ. 4:11) అవిధేయత చూపిస్తే దేవుని విశ్రాంతిలోకి ప్రవేశించలేమని పౌలు చెప్పాడు. అంటే ఏవిధంగానైనా దేవుని ఉద్దేశానికి వ్యతిరేకంగా నడుచుకుంటే మనం ఆయన విశ్రాంతిలోకి ప్రవేశించలేమని దానర్థమా? ఈ ప్రశ్నకు జవాబు తెలుసుకోవడం చాలా ప్రాముఖ్యం కాబట్టి, దీని గురించి ఇప్పుడు మనం మరిన్ని వివరాలు చూద్దాం. మొదటిగా ఇశ్రాయేలీయుల చెడ్డ ఉదాహరణను పరిశీలించి, వారు ఎందుకు దేవుని విశ్రాంతిలోకి ప్రవేశించలేకపోయారో చూద్దాం.

“వారు నా విశ్రాంతిలో ప్రవేశింపరు”

7. ఇశ్రాయేలీయులను ఐగుప్తీయుల బానిసత్వం నుండి యెహోవా ఎందుకు విడిపించాడు? వారు ఏమి చేయాలి?

7 ఇశ్రాయేలీయుల విషయంలో తన ఉద్దేశం ఏమిటో సా.శ.పూ. 1513లో యెహోవా మోషేకు తెలియజేశాడు. యెహోవా ఇలా చెప్పాడు: ‘ఐగుప్తీయుల చేతిలోనుండి వారిని విడిపించడానికి, ఆ దేశములో నుండి విశాలమైన మంచి దేశానికి, అంటే పాలు తేనెలు ప్రవహించే దేశానికి వారిని నడిపించడానికి దిగివచ్చాను.’ (నిర్గ. 3:8) పితరుడైన అబ్రాహాముకు తాను ప్రమాణం చేసినట్లుగా ఇశ్రాయేలీయులను తన ప్రజలుగా చేసుకోవడానికే యెహోవా “ఐగుప్తీయుల చేతిలోనుండి వారిని” విడిపించాడు. (ఆది. 22:17) తనతో సమాధానపడి తన స్నేహితులుగా ఉండేందుకు సహాయంచేసే నియమాలను యెహోవా వారికిచ్చాడు. (యెష. 48:17, 18) ఆయన వారికిలా చెప్పాడు: “మీరు నా మాట శ్రద్ధగా విని, [ధర్మశాస్త్రంలో ఉన్న] నా నిబంధన ననుసరించి నడిచినయెడల మీరు సమస్తదేశ జనులలో నాకు స్వకీయ సంపాద్యమగుదురు. సమస్తభూమియు నాదేగదా.” (నిర్గ. 19:5, 6) యెహోవా మాట వింటేనే వారు ఆయన ప్రజలుగా ఉంటారు.

8. ఇశ్రాయేలీయులు యెహోవా మాట వినుంటే పరిస్థితి ఎలా ఉండేది?

8 ఇశ్రాయేలీయులు యెహోవా మాట వినుంటే పరిస్థితి ఎలా ఉండేదో ఆలోచించండి. యెహోవా వారి పొలాలను, ద్రాక్షతోటలను, మందలను ఆశీర్వదించడమే కాక వారిని శత్రువుల నుండి కూడా కాపాడివుండేవాడు. (1 రాజులు 10:23-27 చదవండి.) అంతేకాక, మెస్సీయ వచ్చే సమయానికి వారు రోమన్ల క్రూర పరిపాలన కింద కాక ఒక ప్రత్యేకమైన జనాంగంగా ఉండివుండేవారు. ఇశ్రాయేలీయులు ఇతర జనాంగాలకు మంచి మాదిరిగా ఉండి, సత్యదేవునికి లోబడితే ఎన్ని ఆశీర్వాదాలు పొందవచ్చో చూపించి ఉండేవారు.

9, 10. (ఎ) ఐగుప్తుకు తిరిగి వెళ్లాలనే ఇశ్రాయేలీయుల ఆలోచన ఎందుకు తప్పు? (బి) అలా వెళ్లివుంటే వారు యెహోవా కోరిన విధంగా ఆయనను ఆరాధించి ఉండేవారా?

9 యెహోవా ఉద్దేశం ప్రకారం నడుచుకునే గొప్ప అవకాశం ఇశ్రాయేలీయులకు ఉండేది. వారలా నడుచుకొనివుంటే వారితోపాటు మానవులందరికీ ఎన్నో ఆశీర్వాదాలు వచ్చి ఉండేవి. (ఆది. 22:18) అయితే ఒక జనాంగంగా వారు దేవుని పరిపాలన కింద మాదిరికరమైన రాజ్యంగా ఉండడం గురించి పట్టించుకోలేదు. పైగా, తిరిగి ఐగుప్తుకు వెళ్లిపోతామని కూడా అన్నారు! (సంఖ్యాకాండము 14:2-4 చదవండి.) ఒకవేళ వారలా ఐగుప్తుకు తిరిగివెళ్తే, ఇశ్రాయేలు జనాంగాన్ని మాదిరికరమైన రాజ్యంగా చేయాలన్న దేవుని ఉద్దేశం నెరవేరుతుందా? లేదు. నిజానికి అన్యజనాంగాల బానిసత్వం కిందికి వెళ్తే యెహోవా ఇచ్చిన ధర్మశాస్త్రాన్ని పాటించే అవకాశం వారికి ఉండదు. పాప క్షమాపణ పొందడానికి ఆయన చేసిన ఏర్పాటు నుండి ప్రయోజనం పొందే అవకాశం కూడా ఉండదు. ఆ స్వార్థపరులు యెహోవా గురించి, ఆయన ఉద్దేశం గురించి ఆలోచించలేదు. అందుకే యెహోవా ఆ తిరుగుబాటుదారుల గురించి ఇలా అన్నాడు: “నేను ఆ తరమువారివలన విసిగి—వీరెల్లప్పుడును తమ హృదయాలోచనలలో తప్పిపోవుచున్నారు. నా మార్గములను తెలిసికొనలేదు గనుక నేను కోపముతో ప్రమాణము చేసినట్టు వారు నా విశ్రాంతిలో ప్రవేశింపరని చెప్పితిని.”—హెబ్రీ. 3:10, 11; కీర్త. 95:10, 11.

10 ఐగుప్తుకు తిరిగివెళ్లాలని కోరుకోవడం ద్వారా యెహోవా ఆశీర్వాదాలను విలువైనవిగా ఎంచడం లేదని వారు చూపించారు. ఆ ఆశీర్వాదాలకు బదులు ఐగుప్తులో తిన్న మంచి ఆహారాన్నే వారు కోరుకున్నారు. (సంఖ్యా. 11:5) జ్యేష్ఠ కుమారునిగా తనకున్న హక్కును విలువైనదిగా ఎంచకుండా ఒక పూట భోజనం కోసం దాన్ని అమ్మేసిన ఏశావులా వారు ప్రవర్తించారు.—ఆది. 25:30-32; హెబ్రీ. 12:16.

11. ఐగుప్తును విడిచివచ్చిన ఇశ్రాయేలీయులు తనమీద విశ్వాసం ఉంచలేదని యెహోవా తన ఉద్దేశాన్ని మార్చుకున్నాడా?

11 ఐగుప్తును విడిచివచ్చిన ఆ ఇశ్రాయేలీయులు తనమీద విశ్వాసం ఉంచకపోయినా వారిపట్ల తన ఉద్దేశాన్ని యెహోవా మార్చుకోలేదు. అయితే వారి పిల్లలు మాత్రం వారికంటే ఎక్కువ విధేయతను చూపించారు. వాగ్దానదేశంలోకి అడుగుపెట్టి దాన్ని స్వాధీనపర్చుకోమనే యెహోవా ఆజ్ఞను వారు పాటించారు. యెహోషువ 24:31 ఇలా చెబుతోంది: “యెహోషువ దినములన్నిటను యెహోషువ తరువాత ఇంక బ్రతికి, యెహోవా ఇశ్రాయేలీయులకొరకు చేసిన క్రియలన్నిటిని ఎరిగిన పెద్దల దినములన్నిటను ఇశ్రాయేలీయులు యెహోవాను సేవించుచు వచ్చిరి.”

12. నేడు దేవుని విశ్రాంతిలోకి ప్రవేశించడం సాధ్యమేనని ఎందుకు చెప్పవచ్చు?

12 అలా విధేయత చూపించినవారు కొంతకాలానికి చనిపోయారు. ‘వారి తర్వాత యెహోవాను గానీ, ఆయన ఇశ్రాయేలీయుల కొరకు చేసిన కార్యాలను గానీ ఎరుగని తరమొకటి పుట్టగా ఇశ్రాయేలీయులు యెహోవా కన్నుల యెదుట కీడుచేసి బయలు దేవతలను పూజించిరి.’ (న్యాయా. 2:10, 11) వారు దేవునికి అవిధేయత చూపించినందువల్ల ఆయనతో వారికి సమాధానకరమైన సంబంధం లేకుండా పోయింది. కాబట్టి, వాగ్దానదేశం వారికి నిజమైన “విశ్రాంతి” స్థలంగా లేదు. పౌలు ఆ ఇశ్రాయేలీయుల గురించి ఇలా రాశాడు: “యెహోషువ వారికి విశ్రాంతి కలుగజేసినయెడల ఆ తరువాత మరియొక దినమునుగూర్చి ఆయన చెప్పకపోవును. కాబట్టి దేవుని ప్రజలకు విశ్రాంతి నిలిచియున్నది.” (హెబ్రీ. 4:8, 9) “దేవుని ప్రజలు” అని అన్నప్పుడు ఆయన క్రైస్తవులనే సూచించాడు. అవును, అంతకుముందు యూదులైనా కాకపోయినా క్రైస్తవులుగా మారిన వారందరూ దేవుని విశ్రాంతిలోకి ప్రవేశించవచ్చు.

దేవుని విశ్రాంతిలోకి కొందరు ప్రవేశించలేదు

13, 14. దేవుని విశ్రాంతిలోకి ప్రవేశించడానికి మోషే కాలంలోని ఇశ్రాయేలీయులు, పౌలు కాలంలోని క్రైస్తవులు ఏమి చేయాల్సివచ్చింది?

13 హెబ్రీ క్రైస్తవుల్లో కొందరు దేవుని ఉద్దేశానికి వ్యతిరేకంగా ప్రవర్తించారు కాబట్టి పౌలు వారికి పత్రిక రాశాడు. (హెబ్రీయులు 4:1 చదవండి.) ఇంతకీ ఆ సమయానికి వారేమి చేస్తున్నారు? వారింకా మోషే ధర్మశాస్త్రంలోని కొన్ని ఆచారాలను పాటిస్తున్నారు. దాదాపు 1,500 సంవత్సరాల పాటు దేవుని ప్రజలు ఆయన చిత్తాన్ని చేయడానికి మోషే ధర్మశాస్త్రాన్ని పాటించాల్సి వచ్చిందనేది నిజమే. కానీ, యేసు చనిపోయిన తర్వాత మోషే ధర్మశాస్త్రాన్ని పాటించాల్సిన అవసరం లేదు. కొంతమంది క్రైస్తవులు ఆ విషయాన్ని అర్థం చేసుకోలేదు కాబట్టి ధర్మశాస్త్రంలోని కొన్ని ఆచారాలను ఇంకా పాటించాలని నమ్మారు. b

14 ఏ అపరిపూర్ణ ప్రధానయాజకుని కన్నా కూడా యేసు ఉత్తమమైన ప్రధానయాజకుడని పౌలు ఆ హెబ్రీ క్రైస్తవులకు వివరించాడు. ఇశ్రాయేలీయులతో చేయబడిన నిబంధన కన్నా కొత్త నిబంధనే ఉత్తమమైనదని ఆయన చూపించాడు. ‘హస్తకృతమైన’ ఆలయం కన్నా యెహోవా గొప్ప ఆలయం ‘మరింత ఘనమైనది, పరిపూర్ణమైనది’ అని కూడా ఆయన చూపించాడు. (హెబ్రీ. 7:26-28; 8:7-10; 9:11, 12) క్రైస్తవులు యెహోవా విశ్రాంతిలోకి ఎలా ప్రవేశించవచ్చో వివరించడానికి పౌలు ధర్మశాస్త్రంలోని సబ్బాతును ఉదాహరణగా తీసుకున్నాడు. ఆయనిలా రాశాడు: “దేవుని ప్రజలకు విశ్రాంతి నిలిచియున్నది. ఎందుకనగా దేవుడు తన కార్యములను ముగించి విశ్రమించిన ప్రకారము, ఆయనయొక్క విశ్రాంతిలో ప్రవేశించినవాడు కూడ తన కార్యములను ముగించి విశ్రమించును.” (హెబ్రీ. 4:8-10) కాబట్టి ఆ హెబ్రీ క్రైస్తవులు ‘తమ కార్యములను’ బట్టి అంటే మోషే ధర్మశాస్త్రానికి లోబడి చేసిన పనులను బట్టి దేవుని ఆమోదాన్ని పొందవచ్చనే ఆలోచనను తమ మనసుల్లో నుండి తీసేసుకోవాలి. ఎందుకంటే సా.శ. 33 పెంతెకొస్తు నుండి, యేసుక్రీస్తుపై విశ్వాసం ఉంచిన వారందరికీ యెహోవా తన ఆమోదాన్ని బహుమతిగా ఇచ్చాడు.

15. దేవుని విశ్రాంతిలోకి ప్రవేశించాలంటే మనం ఆయనకు లోబడాలని ఎందుకు చెప్పవచ్చు?

15 మోషే కాలంలోని ఇశ్రాయేలీయులు ఎందుకు వాగ్దానదేశంలోకి ప్రవేశించలేకపోయారు? పౌలు కాలంలోని క్రైస్తవుల్లో కొంతమంది ఎందుకు దేవుని విశ్రాంతిలోకి ప్రవేశించలేకపోయారు? ఎందుకంటే వారు దేవునికి లోబడలేదు. పౌలు కాలంలోని క్రైస్తవులు తాము మోషే ధర్మశాస్త్రాన్ని పాటించడం మానేసి కొత్త పద్ధతిలో తనను ఆరాధించాలని యెహోవా కోరుతున్నాడనే విషయాన్ని నమ్మలేదు.

మనం దేవుని విశ్రాంతిలోకి ఎలా ప్రవేశించవచ్చు?

16, 17. (ఎ) నేటి క్రైస్తవులు దేవుని విశ్రాంతిలోకి ఎలా ప్రవేశించవచ్చు? (బి) మనం తర్వాతి ఆర్టికల్‌లో ఏమి చూస్తాం?

16 రక్షణ కోసం ఇప్పుడు మోషే ధర్మశాస్త్రాన్ని పాటించాలని మనలో ఎవ్వరమూ నమ్మం. ఎఫెసీయులకు పౌలు స్పష్టంగా ఇలా రాశాడు: “మీరు విశ్వాసముద్వారా కృపచేతనే రక్షింపబడియున్నారు; ఇది మీవలన కలిగినది కాదు, దేవుని వరమే. అది క్రియలవలన కలిగినదికాదు.” (ఎఫె. 2:8, 9) కాబట్టి, నేటి క్రైస్తవులు దేవుని విశ్రాంతిలోకి ఎలా ప్రవేశించవచ్చు? భూమి విషయంలో, విధేయులైన మానవుల విషయంలో తాను ఉద్దేశించింది పూర్తిగా నెరవేర్చడానికే యెహోవా తన విశ్రాంతి దినాన్ని ఏర్పర్చుకున్నాడని గుర్తుంచుకోండి. తన ఉద్దేశం గురించి, ఆయన మన నుండి కోరేదాని గురించి యెహోవా తన సంస్థ ద్వారా మనకు తెలియజేస్తున్నాడు. మనం యెహోవాకు లోబడుతూ, ఆయన సంస్థతో కలిసి పనిచేస్తేనే ఆయన విశ్రాంతిలోకి ప్రవేశించగలుగుతాం.

17 నమ్మకమైనవాడును బుద్ధిమంతుడునైన దాసునికి లోబడకపోతే లేదా ప్రాముఖ్యమైనదని మనకు అనిపించినదాన్నే చేస్తే మనం యెహోవా ఉద్దేశానికి వ్యతిరేకంగా ప్రవర్తించినట్లే. అలా ప్రవర్తిస్తే మనం ఆయన స్నేహితులుగా ఉండలేం. మనం ఆయనకు లోబడుతున్నామని చూపించే అవకాశాన్నిచ్చే కొన్ని సందర్భాల గురించి తర్వాతి ఆర్టికల్‌లో చూస్తాం. ఆ సందర్భాల్లో మనం తీసుకునే నిర్ణయాలను బట్టే మనం దేవుని విశ్రాంతిలోకి ప్రవేశించామో లేదో తెలుస్తుంది.

[అధస్సూచీలు]

a యాజకులు, లేవీయులు సబ్బాతు రోజున ఆలయ సంబంధమైన పనులు చేసినా వారు ‘నిర్దోషులుగానే’ పరిగణించబడేవారు. కాబట్టి దేవుని గొప్ప ఆధ్యాత్మిక ఆలయానికి ప్రధాన యాజకునిగా ఉన్న యేసు కూడా యెహోవా తనకిచ్చిన పనిని సబ్బాతు రోజున చేయడం తప్పేమీ కాదు.—మత్త. 12:5, 6.

b సా.శ. 33 పెంతెకొస్తు తర్వాత హెబ్రీ క్రైస్తవుల్లో ఎవరైనా ప్రాయశ్చిత్తార్థ దినాన బలులు అర్పించారో లేదో మనకు తెలియదు. కానీ, వారలా చేసివుంటే మాత్రం యేసు అర్పించిన బలి పట్ల అసలు ఏమాత్రం గౌరవం చూపించనట్లే. హెబ్రీ క్రైస్తవుల్లో కొందరు అప్పటికింకా మోషే ధర్మశాస్త్రంలోని ఆచారాలను పాటిస్తున్నారని మాత్రం మనకు తెలుసు.—గల. 4:9-11.

ధ్యానించడానికి ప్రశ్నలు

• ఏడవ దినంలో యెహోవా ఏమి చేయాలనుకున్నాడు?

• ఏడవ దినం ఇప్పటికీ కొనసాగుతూనే ఉందని మనకెలా తెలుసు?

• మోషే కాలంలోని ఇశ్రాయేలీయులు, పౌలు కాలంలోని కొంతమంది క్రైస్తవులు ఎందుకు దేవుని విశ్రాంతిలోకి ప్రవేశించలేకపోయారు?

• నేడు మనం దేవుని విశ్రాంతిలోకి ఎలా ప్రవేశించవచ్చు?

[అధ్యయన ప్రశ్నలు]

[27వ పేజీలోని బ్లర్బ్‌]

మనం యెహోవాకు లోబడుతూ, ఆయన సంస్థతో కలిసి పనిచేస్తేనే ఆయన విశ్రాంతిలోకి ప్రవేశించగలుగుతాం.

[26, 27 పేజీల్లోని చిత్రాలు]

దేవుని ప్రజలు ఆయన విశ్రాంతిలోకి ప్రవేశించాలంటే ఏమి చేయాలి?