కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

మీరు దేవుని విశ్రాంతిలోకి ప్రవేశించారా?

మీరు దేవుని విశ్రాంతిలోకి ప్రవేశించారా?

మీరు దేవుని విశ్రాంతిలోకి ప్రవేశించారా?

‘దేవుని వాక్యం సజీవమైనది, బలముగలది.’—హెబ్రీ. 4:12.

1. మనం ఏమి చేస్తే దేవుని విశ్రాంతిలోకి ప్రవేశిస్తాం? అది ఎందుకు కష్టమనిపించవచ్చు?

 యెహోవాకు లోబడుతూ ఆయన సంస్థతో కలిసి పనిచేస్తే మనం ఆయన విశ్రాంతిలోకి ప్రవేశించవచ్చని ముందటి ఆర్టికల్‌లో చూశాం. దేవునికి లోబడడం ద్వారా ఆయన ఉద్దేశం నెరవేరాలనే కోరిక మనకుందని చూపిస్తాం. అయితే అన్ని సందర్భాల్లో ఆయనకు లోబడడం సులభం కాకపోవచ్చు. ఉదాహరణకు, మనకు ఇష్టమైన ఒకానొక పని యెహోవాకు ఇష్టం లేదని తెలుసుకున్నప్పుడు వెంటనే దాన్ని ఆపేయడం మనకు కష్టమనిపించవచ్చు. అలాంటప్పుడు, మనం ‘సులభంగా లోబడడాన్ని’ నేర్చుకోవాలి. (యాకో. 3:17) మనం అన్ని సమయాల్లో దేవునికి లోబడడానికి సిద్ధంగా ఉంటామో లేదో చూపించే కొన్ని సందర్భాల గురించి ఈ ఆర్టికల్‌లో చర్చిద్దాం.

2, 3. యెహోవాను సంతోషపెట్టాలంటే మనం ఏమి చేస్తూ ఉండాలి?

2 మీరు ఫలానా మార్పు చేసుకోవాల్సి ఉందని బైబిలు నుండి గ్రహించినప్పుడు ఆ నిర్దేశానికి లోబడేందుకు సిద్ధంగా ఉంటారా? దీనిగురించి ఆలోచించండి: యెహోవా తన సంస్థలోకి తీసుకురావాలనుకుంటున్న ప్రజలు “అన్యజనులందరియొక్క యిష్టవస్తువులు” అని బైబిలు చెబుతోంది. (హగ్గ. 2:7) అంటే, సరైనదాన్ని ప్రేమించే ప్రజలను యెహోవా అమూల్యమైనవారిగా పరిగణించి వారిని ఎంపిక చేసుకుంటాడని దానర్థం. మనందరం సత్యం తెలుసుకోకముందు తప్పులు చేసివుంటాం. అయితే మనం దేవుణ్ణి, ఆయన కుమారుణ్ణి ప్రేమించాం కాబట్టి దేవుణ్ణి సంతోషపెట్టేలా మన ఆలోచనలో, ప్రవర్తనలో పెద్దపెద్ద మార్పులు చేసుకున్నాం. ప్రార్థనలో యెహోవా సహాయాన్ని కోరి, కావాల్సిన మార్పులు చేసుకోవడానికి గట్టిగా కృషి చేశాం. చివరకు, బాప్తిస్మం తీసుకొని యెహోవా ఆమోదాన్ని పొందగలిగాం.—కొలొస్సయులు 1:9-12 చదవండి.

3 కానీ మనం ఇంకా అపరిపూర్ణులమే. కాబట్టి మన జీవితంలో మార్పులు చేసుకుంటూనే ఉండాలి, సరైనది చేయడానికి గట్టిగా కృషి చేస్తూ ఉండాలి. అయితే, యెహోవాను సంతోషపెట్టడానికి మనం చేయగలిగినదంతా చేస్తూ ఉంటే తగిన సహాయం చేస్తానని ఆయన మాటిచ్చాడు.

జీవితంలో మార్పులు చేసుకోవాల్సి వచ్చినప్పుడు

4. మనం ఎలాంటి మార్పులు చేసుకోవాలో గుర్తించడానికి యెహోవా ఏ మూడు విధాలుగా మనకు సహాయం చేస్తాడు?

4 మార్పులు చేసుకోవాలంటే ముందుగా అసలు మనలో ఎలాంటి మార్పులు అవసరమో గుర్తించాలి. ఈ విషయంలో యెహోవా మనకు ఎన్నో విధాలుగా సహాయం చేస్తాడు. మన ఆలోచనలో లేదా ప్రవర్తనలో ఏదైనా తప్పుంటే, రాజ్యమందిరంలో ఒక ప్రసంగం ద్వారా లేదా మన ప్రచురణల్లోని ఒక ఆర్టికల్‌ ద్వారా యెహోవా తెలియజేయవచ్చు. అయితే కొన్నిసార్లు ప్రసంగం విన్నా, ప్రచురణను చదివినా మనం ఏ మార్పులు చేసుకోవాలో గుర్తించలేం కాబట్టి సంఘంలోని ఒక సహోదరుణ్ణి/సహోదరిని ఉపయోగించి యెహోవా దయతో మనల్ని సరిదిద్దవచ్చు.—గలతీయులు 6:1 చదవండి.

5. ఎవరైనా మనల్ని సరిదిద్దినప్పుడు మనం కొన్నిసార్లు ఎలా ప్రవర్తిస్తాం? మనకు క్రైస్తవ పెద్దలు ఎందుకు సహాయం చేస్తూనే ఉండాలి?

5 తోటి అపరిపూర్ణ సహోదరుడు దయగా సరిదిద్దినా దాన్ని అంగీకరించడం మనకు కష్టంగా ఉండవచ్చు. అయితే, మనల్ని ‘సాత్వికమైన మనస్సుతో మంచి దారికి తీసికొని రావాలని’ సంఘ పెద్దలకు యెహోవా ఆజ్ఞాపిస్తున్నాడు. (గల. 6:1) వారి సహాయాన్ని అంగీకరిస్తే మనం యెహోవాకు మరింత ‘ఇష్టమైనవారిగా’ లేదా అమూల్యమైనవారిగా ఉంటాం. మనం అపరిపూర్ణత వల్ల తప్పులు చేస్తున్నామని చాలాసార్లు ప్రార్థనలో యెహోవాకు చెబుతాం. కానీ మనం తప్పు చేశామని ఒక సంఘ పెద్ద చెబితే మాత్రం కొంచెం తేడాగా ప్రవర్తిస్తాం. మనల్ని మనం సమర్థించుకోవడానికి లేదా మనం చేసింది పెద్ద తప్పేమీ కాదని చెప్పడానికి ప్రయత్నిస్తాం. మనల్ని సరిదిద్దిన వ్యక్తికి మనమంటే గిట్టదని లేదా ఆయన మనతో దయగా మాట్లాడలేదని అంటాం. (2 రాజు. 5:11) మనకు ఇష్టంలేని విషయాన్ని ఒకవేళ పెద్దలు చెబితే మనకు కోపం వస్తుంది. ఉదాహరణకు, మన కుటుంబంలోని ఒకరు ఏదో తప్పు చేస్తున్నారని, మనం వేసుకునే దుస్తులు క్రైస్తవులకు తగినట్లుగా లేవని, మనం మరింత పరిశుభ్రంగా ఉండాలని లేదా మనం ఎంచుకున్న వినోదాన్ని యెహోవా ద్వేషిస్తున్నాడని వారు మనతో చెప్పవచ్చు. దానికి కోపం తెచ్చుకొని మనం అనకూడని మాటలు అనే ప్రమాదం ఉంది. అలా చేస్తే మనకే కాక మనకు సహాయం చేయాలనుకున్న సహోదరునికి కూడా బాధ కలగవచ్చు. కానీ, సాధారణంగా మన కోపం తగ్గిన తర్వాత ఆ సహోదరుడు చెప్పింది మన మంచికేనని గుర్తిస్తాం.

6. దేవుని వాక్యం “హృదయముయొక్క తలంపులను, ఆలోచనలను” ఎలా వెల్లడి చేస్తుంది?

6 ఈ ఆర్టికల్‌ ముఖ్య వచనం, ‘దేవుని వాక్యం బలముగలది’ అని చెబుతోంది. అవును, దానికి జీవితాల్ని మార్చే శక్తి ఉంది. అది బాప్తిస్మానికి ముందేకాక ఆ తర్వాత కూడా కావాల్సిన మార్పులు చేసుకోవడానికి మనకు సహాయం చేస్తుంది. దేవుని వాక్యం “హృదయముయొక్క తలంపులను ఆలోచనలను శోధించుచున్నది” అని కూడా హెబ్రీయులకు రాసిన పత్రికలో పౌలు చెప్పాడు. (హెబ్రీ. 4:12) మరో మాటలో చెప్పాలంటే మనం ఏమి చేయాలని దేవుడు కోరుతున్నాడో తెలుసుకున్న తర్వాత దాని విషయంలో మనం ప్రవర్తించే తీరును బట్టి మన వ్యక్తిత్వం ఏమిటో తెలుస్తుంది. కొన్నిసార్లు, మనం బయటకు కనిపించే తీరుకూ మన అసలు వ్యక్తిత్వానికీ మధ్య ఏమైనా తేడా ఉంటోందా? (మత్తయి 23:27, 28 చదవండి.) ఇప్పుడు చూడబోయే పరిస్థితుల్లో మీరైతే ఏమి చేస్తారో పరిశీలించండి.

యెహోవా సంస్థతో కలిసి ముందుకు సాగండి

7, 8. (ఎ) కొందరు యూదులు ఎందుకు మోషే ధర్మశాస్త్రాన్ని పాటించాలనుకొని ఉంటారు? (బి) వెల్లడౌతున్న యెహోవా సంకల్పానికి అనుగుణంగా వారు నడుచుకోలేదని ఎందుకు చెప్పవచ్చు?

7 మనలో చాలామందికి సామెతలు 4:18లోని ఈ మాటలు కంఠస్థమే: “పట్టపగలగువరకు వేకువ వెలుగు తేజరిల్లునట్లు నీతిమంతుల మార్గము అంతకంతకు తేజరిల్లును.” అంటే, కాలం గడుస్తుండగా మన ప్రవర్తన, దేవుని ఉద్దేశాల గురించిన మన అవగాహన మెరుగౌతాయని దానర్థం.

8 ముందటి ఆర్టికల్‌లో చూసినట్లుగా, యేసు చనిపోయిన తర్వాత చాలామంది యూదా క్రైస్తవులకు మోషే ధర్మశాస్త్రంలోని ఆచారాలను మానేయడం కష్టమనిపించింది. (అపొ. 21:20) క్రైస్తవులు ఇక ధర్మశాస్త్రాన్ని పాటించాల్సిన అవసరం లేదని పౌలు చక్కగా వివరించినా దైవ ప్రేరేపణతో ఆయన ఇచ్చిన వివరణను కొంతమంది నిరాకరించారు. (కొలొ. 2:13-15) ధర్మశాస్త్రంలోని ఆచారాల్లో కనీసం కొన్నింటిని పాటించినా హింసను తప్పించుకోవచ్చని వారు అనుకుని ఉంటారు. ఏదేమైనా, వెల్లడౌతున్న దేవుని సంకల్పానికి అనుగుణంగా ప్రవర్తిస్తేనే వారు దేవుని విశ్రాంతిలోకి ప్రవేశించగలుగుతారని పౌలు హెబ్రీ క్రైస్తవులకు రాశాడు. a (హెబ్రీ. 4:1, 2, 6; హెబ్రీయులు 4:11 చదవండి.) యెహోవా తన ప్రజల్ని వేరే దిశలో నడిపిస్తున్నాడనే వాస్తవాన్ని అంగీకరిస్తేనే వారు ఆయన ఆమోదాన్ని పొందుతారు.

9. లేఖనాలపై మనకున్న అవగాహనలో మార్పు చేయబడినప్పుడు మనమెలా స్పందించాలి?

9 మన కాలంలో కూడా బైబిల్లోని కొన్ని బోధలపై ఉన్న అవగాహనలో మార్పులు వచ్చాయి. వాటివల్ల మనం అభ్యంతరపడాల్సిన అవసరం లేదు. బదులుగా నమ్మకమైనవాడును, బుద్ధిమంతుడునైన దాసుని తరగతిపై మన విశ్వాసం బలపడాలి. ఫలానా సత్యం విషయంలో మన అవగాహనను స్పష్టం చేయాల్సిన లేదా సవరించాల్సిన అవసరం ఉందని “దాసుని” తరగతి ప్రతినిధులు గుర్తించినప్పుడు వారు ఆ మార్పు చేయడానికి వెనకాడరు. వెల్లడౌతున్న యెహోవా సంకల్పంతో పాటు వారు ముందుకు సాగాలనుకుంటారే కానీ విమర్శలను తప్పించుకోవాలనే ఉద్దేశంతో మార్పులు చేయడం మానరు. లేఖనాలపై మనకున్న అవగాహనలో మార్పు చేయబడినప్పుడు మీరెలా స్పందిస్తారు?—లూకా 5:39 చదవండి.

10, 11. ప్రకటనా పని చేసే విషయంలో కొత్త పద్ధతులు ప్రవేశపెట్టబడినప్పుడు కొంతమంది స్పందించిన తీరు నుండి మనమేమి నేర్చుకోవచ్చు?

10 మనం మరో ఉదాహరణను పరిశీలిద్దాం. దాదాపు వంద సంవత్సరాల క్రితం, చక్కని బహిరంగ ప్రసంగాలను ఇచ్చే బైబిలు విద్యార్థులు కొందరు తమ ప్రసంగాల ద్వారా ఇతరులకు మరింతెక్కువగా సువార్త ప్రకటించవచ్చని అనుకున్నారు. వారు పదిమందిలో మాట్లాడడాన్ని, పొగడ్తలను ఇష్టపడేవారు. అయితే సువార్త ప్రకటించడానికి బహిరంగ ప్రసంగాలిస్తే సరిపోదని, తన సేవకులు ఇంటింటి పరిచర్యతో పాటు వివిధ పద్ధతుల్లో సువార్త ప్రకటించాలన్నదే యెహోవా కోరిక అని ఆ తర్వాత ఆయన ప్రజలకు అర్థమైంది. కొంతమంది బహిరంగ ప్రసంగీకులకు అది నచ్చలేదు. వారి ప్రసంగాలను విని వారు యెహోవాను ప్రేమిస్తున్నారని, ఆయనకు లోబడుతున్నారని ప్రజలు అనుకున్నారు కానీ ఆ సమయంలో వారి ప్రవర్తన చూస్తే అది నిజంకాదని అర్థమైంది. యెహోవా వారి ప్రవర్తనను ఇష్టపడలేదని మనకు తెలుసు. వారు ఆ తర్వాత ఆయన సంస్థను విడిచిపెట్టారు.—మత్త. 10:1-6; అపొ. 5:42; 20:20.

11 అంటే, యెహోవా సంస్థ పట్ల నమ్మకంగా ఉన్నవారికి బహిరంగంగా ప్రకటించడం సులభంగా ఉందని దానర్థం కాదు. ఎంతోమందికి మొదట్లో చాలా కష్టమనిపించింది. కానీ వారు విధేయత చూపించారు. కొంతకాలానికి వారు తమకున్న భయాన్ని తీసేసుకోగలిగారు, యెహోవా వారిని మెండుగా ఆశీర్వదించాడు. మీకు కొంచెం కష్టమనిపించే పద్ధతిలో ప్రకటనా పని చేయమని అడిగితే మీరేమి చేస్తారు? కొత్త పద్ధతిలో చేయడానికి మీరు సిద్ధంగా ఉంటారా?

మనకు ప్రియమైన వ్యక్తి యెహోవాను విడిచిపెట్టినప్పుడు

12, 13. (ఎ) పశ్చాత్తాపపడని పాపులను సంఘం నుండి బహిష్కరించాలని యెహోవా ఎందుకు చెప్పాడు? (బి) కొంతమంది క్రైస్తవ తల్లిదండ్రులకు ఎలాంటి పరీక్ష ఎదురుకావచ్చు? ఆ పరీక్షను తట్టుకోవడం వారికి ఎందుకు కష్టమనిపించవచ్చు?

12 యెహోవాను సంతోషపెట్టాలంటే మనందరం శారీరకంగా, నైతికంగా, ఆధ్యాత్మికంగా పరిశుభ్రంగా ఉండాలని అంగీకరిస్తాం. (తీతు 2:14 చదవండి.) అయితే దేవుని ఉద్దేశానికి సంబంధించిన ఈ విషయంలో మన విధేయతను పరీక్షించే పరిస్థితులు రావచ్చు. ఉదాహరణకు, మాదిరికరమైన క్రైస్తవ దంపతుల ఒక్కగానొక్క కొడుకు సత్యాన్ని వదిలివెళ్లాడనుకోండి. ఆ యౌవనుడు యెహోవాతో, దైవభక్తిగల తల్లిదండ్రులతో ఉన్న సంబంధం కన్నా ‘అల్పకాలము పాపభోగం అనుభవించడమే’ మేలని అనుకున్నాడు కాబట్టి సంఘం నుండి బహిష్కరించబడ్డాడు.—హెబ్రీ. 11:24-26.

13 అది తల్లిదండ్రులకు కోలుకోలేని దెబ్బ! “సహోదరుడనబడిన వాడెవడైనను జారుడుగాని లోభిగాని విగ్రహారాధకుడుగాని తిట్టుబోతుగాని త్రాగుబోతుగాని దోచుకొనువాడుగాని అయియున్న యెడల, అట్టివానితో సాంగత్యము చేయకూడదు భుజింపనుకూడదు” అని బైబిలు చెబుతోందని వారికి తెలుసు. (1 కొరిం. 5:11, 13) “ఎవడైనను” అనే మాట ఒకే ఇంట్లో నివసించని కుటుంబ సభ్యులకు కూడా వర్తిస్తుందని వారికి తెలుసు. అయితే, తమ అబ్బాయిని ఎంతగానో ప్రేమిస్తున్నారు కాబట్టి వారు ఇలా ఆలోచించే అవకాశం ఉంది: “మా అబ్బాయితో మేము వీలైనంత ఎక్కువగా మాట్లాడాలి. మేము వాడితో మాట్లాడకపోతే యెహోవా దగ్గరకు తిరిగివచ్చేందుకు వాడికి సహాయం చేయలేము కదా.” b

14, 15. బహిష్కరించబడిన కొడుకుతో మాట్లాడాలో వద్దో నిర్ణయించుకుంటున్నప్పుడు తల్లిదండ్రులు ఏమి గుర్తుంచుకోవాలి?

14 ఆ తల్లిదండ్రుల దుఃఖాన్ని చూస్తే మనకు ఎంతో బాధ కలుగుతుంది. వాళ్ల అబ్బాయికి తన నడవడిని మార్చుకునే అవకాశం ఉన్నప్పటికీ తల్లిదండ్రుల కన్నా, సంఘం కన్నా తప్పు చేస్తూ ఉండడానికే ప్రాముఖ్యతనిచ్చాడు. తమ కుమారునికి సహాయం చేయాలని తల్లిదండ్రులకు ఉన్నా వాడి నిర్ణయాన్ని మార్చలేరు. నిజంగానే వారిది ఏమీ చేయలేని పరిస్థితి.

15 అయితే ఆ ప్రేమగల తల్లిదండ్రులు ఏమి చేస్తారు? వారు యెహోవా స్పష్టమైన నిర్దేశానికి లోబడతారా? కొన్నిసార్లు కుటుంబానికి సంబంధించిన కొన్ని అత్యవసరమైన విషయాలు తమ కొడుకుతో చర్చించాల్సిరావచ్చు. దాన్ని అవకాశంగా తీసుకొని, తమ కొడుకుతో తరచూ మాట్లాడడానికి ప్రయత్నిస్తారా? ఈ విషయంలో నిర్ణయం తీసుకుంటున్నప్పుడు, తాము ఏమి చేయాలని యెహోవా కోరుతున్నాడో వారు గుర్తుంచుకోవాలి. తన సంస్థను పరిశుభ్రంగా ఉంచాలని, పాపి తన తప్పును తెలుసుకొని వెనక్కి తిరిగిరావాలని యెహోవా ఉద్దేశిస్తున్నాడు. క్రైస్తవ తల్లిదండ్రులు దానికెలా మద్దతునివ్వవచ్చు?

16, 17. అహరోను ఉదాహరణను ధ్యానిస్తే మనమేమి నేర్చుకోవచ్చు?

16 తన ఇద్దరు కుమారులు చేసిన పని వల్ల అహరోనుకు ఎంతో కష్టమైన పరిస్థితి ఎదురైంది. అహరోను కుమారులైన నాదాబు అబీహులు యెహోవాకు అంగీకారంకాని అగ్నిని అర్పించినందుకు యెహోవా వారికి మరణశిక్ష విధించాడు. అప్పుడు అహరోను ఎంత బాధపడివుంటాడో ఆలోచించండి. వారు చనిపోయారు కాబట్టి ఇక వారితో మాట్లాడే అవకాశం అహరోనుకు లేదు. అయితే మరో పరిస్థితి అహరోనుకు, ఆయన కుటుంబానికి మరింత దుఃఖాన్ని కలుగజేసింది. తాము దుఃఖిస్తున్నట్లు అహరోనుగానీ ఆయన ఇతర కుమారులుగానీ చూపించకూడదని యెహోవా కోరుతున్నాడని మోషే చెప్పాడు. ఆయన ఇలా అన్నాడు: “మీరు చావకుండునట్లును యెహోవా ఈ సర్వసమాజముమీద ఆగ్రహపడకుండునట్లును, మీరు తల విరియబోసికొనకూడదు; బట్టలను చింపుకొనకూడదు.” (లేవీ. 10:1-6) యెహోవా పట్ల నమ్మకంగా లేని కుటుంబ సభ్యుల కన్నా యెహోవానే ఎక్కువగా ప్రేమించాలని దీన్నిబట్టి స్పష్టంగా తెలుస్తోంది.

17 తన నియమాలకు లోబడని వ్యక్తులను యెహోవా ఇప్పుడు వెంటనే చంపేయడం లేదు. తమ తప్పుడు ప్రవర్తనను వదిలి వచ్చేందుకు యెహోవా వారికి ప్రేమతో అవకాశాన్ని ఇస్తున్నాడు. బహిష్కరించబడిన కొడుకుతో లేదా కూతురుతో తల్లిదండ్రులు అనవసరంగా సహవసిస్తూ యెహోవా ఆజ్ఞను మీరితే ఆయనకు ఎలా అనిపిస్తుంది?

18, 19. కుటుంబ సభ్యులు యెహోవాకు నమ్మకంగా ఉంటే ఏ ఆశీర్వాదాలు పొందుతారు?

18 తమ స్నేహితులు, కుటుంబ సభ్యులు యెహోవా ఆజ్ఞను నిక్కచ్చిగా పాటించడం వల్ల తమ తప్పును తెలుసుకోగలిగామని ఒకప్పుడు బహిష్కరించబడి తిరిగి చేర్చుకోబడిన చాలామంది ఒప్పుకుంటున్నారు. ఉదాహరణకు, ఒక యౌవనస్థురాలు తాను సంఘంలోకి తిరిగి రావడానికి తన అన్న ప్రవర్తించిన తీరు కూడా సహాయం చేసిందని సంఘ పెద్దలకు చెప్పింది. ఆమె సంఘం నుండి బహిష్కరించబడినప్పుడు ఆయన యెహోవాకు నమ్మకంగా ఉండి ఆయన ఆజ్ఞకు లోబడ్డాడు. దానివల్ల ఆమె తిరిగి సంఘంలోకి రావాలనుకుంది.

19 మనం జీవితంలోని అన్ని సందర్భాల్లో యెహోవాకు లోబడాలని దీన్నిబట్టి తెలుస్తోంది. అపరిపూర్ణులం కాబట్టి కొన్నిసార్లు అలా చేయడం మనకు కష్టమనిపిస్తుంది. కానీ, యెహోవా చెప్పింది చేస్తే మనకు ఎప్పుడూ మంచే జరుగుతుందని మనం గట్టిగా నమ్మాలి.

‘దేవుని వాక్యం సజీవమైనది’

20. హెబ్రీయులు 4:12ను ఏ రెండు విధాలుగా అన్వయించవచ్చు? (అధస్సూచి చూడండి.)

20 ‘దేవుని వాక్యం సజీవమైనది’ అని అన్నప్పుడు పౌలు కేవలం దేవుని లిఖిత వాక్యమైన బైబిలు గురించి మాత్రమే మాట్లాడడం లేదు. c ఆ లేఖన సందర్భాన్ని బట్టి చూస్తే ఆయన దేవుని వాగ్దానాల గురించి మాట్లాడుతున్నాడని అర్థమౌతోంది. దేవుడు వాగ్దానం చేసి మరచిపోయే వ్యక్తి కాడని పౌలు చెప్పాలనుకున్నాడు. యెహోవా ఆ విషయాన్నే బలపరుస్తూ యెషయా ప్రవక్త ద్వారా ఇలా చెప్పాడు: ‘నా నోటనుండి వచ్చు వచనము నిష్ఫలముగా నాయొద్దకు మరలక నేను పంపిన కార్యమును సఫలముచేయును.’ (యెష. 55:10, 11) కాబట్టి, మనం అనుకున్నంత త్వరగా ఆయన వాగ్దానాలు నెరవేరనప్పుడు మనం సహనాన్ని కోల్పోవాల్సిన అవసరం లేదు. తన ఉద్దేశం పూర్తిగా నెరవేర్చడానికి యెహోవా ‘పనిచేస్తూనే ఉంటాడు.’—యోహా. 5:17.

21. యెహోవాను సేవిస్తూ ఉండడానికి వృద్ధులకు హెబ్రీయులు 4:12 ఎలా సహాయం చేస్తుంది?

21 ‘గొప్ప సమూహానికి’ చెందిన అనేకమంది నమ్మకస్థులైన వృద్ధులు ఇప్పటికే ఎన్నో దశాబ్దాలపాటు యెహోవాను సేవించారు. (ప్రక. 7:9) ఈ విధానంలో తాము వృద్ధులౌతామని చాలామంది అనుకోలేదు. అయినా వారు ఇంకా నమ్మకంగా యెహోవా సేవ చేస్తున్నారు. (కీర్త. 92:15) దేవుని వాక్యం సజీవమైనదని, యెహోవా వాగ్దానాలు తప్పకుండా నెరవేరతాయని వారికి తెలుసు. భూమి విషయంలో, మానవుల విషయంలో తనకున్న ఉద్దేశాన్ని పూర్తిగా నెరవేర్చడానికి యెహోవా పనిచేస్తున్నాడని కూడా వారికి తెలుసు. యెహోవాకు తన సంకల్పం ఎంతో ప్రాముఖ్యం కాబట్టి మనం కూడా దాన్ని ప్రాముఖ్యమైనదిగా ఎంచినప్పుడు ఆయన చాలా సంతోషిస్తాడు. తన విశ్రాంతి దినమైన ఈ ఏడవ దినంలో తన ఉద్దేశాన్ని పూర్తిగా నెరవేర్చకుండా యెహోవాను ఎవ్వరూ ఆపలేరు. ఒక గుంపుగా తన ప్రజలు తన ఉద్దేశానికి అనుగుణంగా నడుచుకుంటారని ఆయనకు తెలుసు. మరి మీ విషయమేమిటి? మీరు దేవుని విశ్రాంతిలోకి ప్రవేశించారా?

[అధస్సూచీలు]

a చాలామంది యూదా నాయకులు మోషే ధర్మశాస్త్రాన్ని తూ.చా. తప్పకుండా పాటించారు కానీ మెస్సీయ వచ్చినప్పుడు మాత్రం వారు ఆయనను గుర్తుపట్టలేకపోయారు. వెల్లడౌతున్న యెహోవా సంకల్పంతో వారు ముందుకు సాగలేదు.

b దేవుని ప్రేమలో నిలిచివుండండి” పుస్తకంలోని 237-239 పేజీలు చూడండి.

c యెహోవా ఇప్పుడు తన లిఖిత వాక్యమైన బైబిలు ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. దానికి మన జీవితాల్ని మార్చే శక్తి ఉంది. కాబట్టి, హెబ్రీయులు 4:12లోని పౌలు మాటలు బైబిలుకు కూడా వర్తిస్తాయి.

మీకు జ్ఞాపకమున్నాయా?

• మనం దేవుని విశ్రాంతిలోకి ప్రవేశించాలంటే ఏమి చేయాలి?

• దేవుడు మన నుండి ఏమి కోరుతున్నాడో బైబిలు ద్వారా గ్రహించినప్పుడు మనం ఆయనను సంతోషపెట్టాలని కోరుకుంటున్నామని ఎలా చూపించవచ్చు?

• యెహోవా చెప్పినట్లు చేయడం మనకు ఏ సందర్భాల్లో కష్టమనిపించవచ్చు? ఆయనకు లోబడడం ఎందుకు ప్రాముఖ్యం?

హెబ్రీయులు 4:12ను ఏ రెండు విధాలుగా అన్వయించవచ్చు?

[అధ్యయన ప్రశ్నలు]

[31వ పేజీలోని చిత్రం]

తల్లిదండ్రులకు కోలుకోలేని దెబ్బ!