కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

యెహోవా ప్రేమతో ఇస్తున్న నడిపింపును మీరు అనుసరిస్తారా?

యెహోవా ప్రేమతో ఇస్తున్న నడిపింపును మీరు అనుసరిస్తారా?

యెహోవా ప్రేమతో ఇస్తున్న నడిపింపును మీరు అనుసరిస్తారా?

“అబద్ధమార్గములన్నియు నా కసహ్యములు.”—కీర్త. 119:128.

1, 2. (ఎ) సూచనల కోసం మీ స్నేహితుణ్ణి అడిగినప్పుడు ఆయన ఎలాంటి హెచ్చరికలు ఇవ్వాలని మీరు కోరుకుంటారు? ఎందుకు? (బి) యెహోవా వేటి గురించి హెచ్చరిస్తున్నాడు? ఎందుకు?

 ఈ సన్నివేశాన్ని ఊహించుకోండి. మీరు ఒకచోటికి వెళ్ళాలి, కానీ అక్కడికి ఎలా వెళ్ళాలో మీకు సరిగ్గా తెలియదు. అయితే మీ స్నేహితునికి అక్కడికి వెళ్ళే దారి బాగా తెలుసు. ఆయనపై మీకు నమ్మకముంది కాబట్టి మీరు ఆయన సహాయం కోరతారు. మీకు కావాల్సిన సూచనలు ఇచ్చి, దారిలో మీకు ఎలాంటి ప్రమాదమూ జరగకుండా ఉండేలా కొన్ని సలహాలు కూడా ఇస్తాడు. ఉదాహరణకు, అంత స్పష్టంగా లేని సైన్‌బోర్డు ఒకటి రోడ్డు మీద ఉందనీ దానివల్ల చాలామంది దారి తప్పిపోయారనీ ఆయన మిమ్మల్ని హెచ్చరిస్తాడు. అలాంటి హెచ్చరికలను జాగ్రత్తగా విని, పాటించాలనుకోరా? ఒక విధంగా చూస్తే మనం ఒక ప్రయాణంలో ఉన్నాం. అది నిరంతర జీవితానికి నడిపించే ప్రయాణం. యెహోవా మన స్నేహితుడు, మనం నిరంతరం జీవించడానికి కావాల్సిన సూచనలను ఆయన మనకు ఇస్తున్నాడు. అంతేగాక మనం ఆయనకు ఎదురుతిరిగేలా చేసే ప్రమాదాల గురించి కూడా ఆయన మనల్ని హెచ్చరిస్తున్నాడు.—ద్వితీ. 5:32, 33; యెష. 30:21.

2 అలాంటి కొన్ని ప్రమాదాల గురించి ఈ ఆర్టికల్‌లో, తర్వాతి ఆర్టికల్‌లో మనం చూస్తాం. మన స్నేహితుడైన యెహోవా మనల్ని ప్రేమిస్తున్నాడు కాబట్టే ఆ ప్రమాదాల గురించి మనల్ని హెచ్చరిస్తున్నాడు. మనం నిరంతరం జీవించాలని ఆయన కోరుకుంటున్నాడు. మానవులు తప్పుడు నిర్ణయాలు తీసుకొని, ఆయనను సేవించడం మానేసినప్పుడు ఆయన ఎంతో బాధపడతాడు. (యెహె. 33:11) ఈ ఆర్టికల్‌లో మనం మూడు ప్రమాదాల గురించి చూస్తాం. మొదటి ప్రమాదం ఇతరులనుండి వస్తుంది. రెండవది, మనలో నుండే వస్తుంది. మూడవది, అవాస్తవమైన వాటినుండి వస్తుంది. ఆ ప్రమాదాల గురించి, వాటినుండి దూరంగా ఉండడానికి యెహోవా మనకు ఎలా సహాయం చేస్తాడనే దాని గురించి మనం తెలుసుకోవాలి. ఈ ప్రమాదాల గురించి తెలిసిన ఒక బైబిలు రచయిత ఇలా రాశాడు: “అబద్ధమార్గములన్నియు నాకసహ్యములు.” (కీర్త. 119:128) యెహోవాకు ఎదురుతిరిగేలా చేసే ప్రతీదాన్ని ఆయన అసహ్యించుకున్నాడు. మీరు కూడా అలాగే చేస్తారా? ప్రతీ ‘అబద్ధమార్గానికి’ దూరంగా ఉండాలనే నిర్ణయాన్ని ఎలా బలపర్చుకోవచ్చో చూద్దాం.

‘సమూహాన్ని వెంబడించకండి’

3. (ఎ) ఏది సరైన దారో మనకు తెలియనప్పుడు ఇతరులను వెంబడించడం ఎందుకు ప్రమాదకరం? (బి) నిర్గమకాండము 23:2లో మనకు ఏ సూత్రం ఉంది?

3 మీరు సుదూర ప్రయాణంలో ఉన్నారని ఊహించుకోండి. హఠాత్తుగా, ఏది సరైన దారో మీకు తెలియడం లేదు. చాలామంది ఫలానా దారిలో వెళ్తున్నారని చూసి మనం కూడా వారిని వెంబడించే అవకాశం ఉంది. కానీ అలా వెంబడించడం ప్రమాదకరం. ఎందుకంటే వారు వేరే చోటికి వెళ్తుండవచ్చు. లేదా మీలాగే వారూ దారి తప్పివుండవచ్చు. యెహోవా ఇశ్రాయేలీయులకు ఇచ్చిన ఒక నియమం ద్వారా తాను నేర్పించాలనుకున్న సూత్రాన్ని లేదా పాఠాన్ని అర్థం చేసుకోవడానికి ఆ ఉదాహరణ సహాయం చేస్తుంది. కేవలం వేరేవారిని సంతోషపెట్టడం కోసం సమూహాన్ని వెంబడించవద్దని, తప్పుడు తీర్పు ఇవ్వవద్దని న్యాయాధిపతులను, న్యాయపరమైన వివాదాల్లో సాక్షులుగా ఉన్నవారిని యెహోవా హెచ్చరించాడు. (నిర్గమకాండము 23:2 చదవండి.) అపరిపూర్ణ మానవులు అలాంటి ప్రమాదంలో చాలా సులభంగా చిక్కుకుంటారు. కాబట్టి “సమూహమును వెంబడించవద్దు” అనే సూత్రం న్యాయాధిపతులకు, న్యాయపరమైన వివాదాల్లో సాక్షులుగా ఉన్నవారికి మాత్రమే కాదు, అందరికీ వర్తిస్తుంది.

4, 5. యెహోషువ కాలేబులకు సమూహాన్ని వెంబడించే ప్రమాదం ఎప్పుడు ఎదురైంది? వారికి ఏది ధైర్యాన్నిచ్చింది?

4 మన జీవితంలోని దాదాపు అన్ని సందర్భాల్లో ‘సమూహాన్ని వెంబడించే’ ప్రమాదం ఉంది. అలాంటి సందర్భాలు హఠాత్తుగా రావచ్చు. అప్పుడు ఇతరులు చేసినట్లు చేయకుండా ఉండడం చాలా కష్టం. ఉదాహరణకు, యెహోషువ కాలేబుల విషయంలో ఏం జరిగిందో గుర్తుచేసుకోండి. వీరు మరో పదిమందితో కలిసి వేగుచూడడానికి వాగ్దానదేశానికి వెళ్ళారు. తిరిగి వచ్చిన తర్వాత ఆ పదిమంది వేగులవారు ఇతర ఇశ్రాయేలీయుల్ని భయపెట్టేలా మాట్లాడారు. ఉదాహరణకు, అక్కడి ప్రజలు నెఫీలీయుల కుటుంబానికి చెందిన శూరులని వారు చెప్పారు. (ఆది. 6:4) అది అబద్ధం, ఎందుకంటే అప్పటికి వందల సంవత్సరాల క్రితమే నోవహు జలప్రళయంలో నెఫీలీయులు చనిపోయారు, పైగా వారికి పిల్లలే లేరు. అయితే ఇశ్రాయేలీయుల విశ్వాసం బలహీనంగా ఉండడం వల్ల ఆ పదిమంది చెప్పినదాన్నే వారు నమ్మారు. విశ్వాసం బలహీనంగా ఉన్నవారు దేవుణ్ణి నమ్మకుండా మానవుల తప్పుడు అభిప్రాయాలనే నమ్ముతారు. అందుకే అనేకమంది ఇశ్రాయేలీయులు వాగ్దాన దేశంలోకి వెళ్ళాలనే యెహోవా నిర్దేశాన్ని అనుసరించకూడదని అనుకున్నారు. అలాంటి క్లిష్ట పరిస్థితిలో యెహోషువ కాలేబులు ఏమి చేశారు?—సంఖ్యా. 13:25-33.

5 యెహోషువ కాలేబులు సమూహాన్ని వెంబడించలేదు. ఇశ్రాయేలీయులు వాస్తవమేమిటో తెలుసుకోవడానికి ఇష్టపడకపోయినా యెహోషువ కాలేబులు మాత్రం సత్యం చెప్పడానికి భయపడలేదు. ఇశ్రాయేలీయులందరూ వారిని చంపాలనుకున్నా వారు సరైనదే చేశారు. అంత ధైర్యం వారికెలా వచ్చింది? యెహోవాపై వారికున్న విశ్వాసం వల్లే వచ్చింది. యెహోవాపై బలమైన విశ్వాసం ఉన్నవారు ఆయన చెప్పేదాన్ని నమ్ముతారు కానీ, తప్పుడు అభిప్రాయాలతో మానవులు చెప్పేదాన్ని కాదు. కొంతకాలం తర్వాత యెహోషువ కాలేబులు యెహోవాపై తమకున్న విశ్వాసం గురించి చెబుతూ ఆయన ఎల్లప్పుడూ తన వాగ్దానాల్ని నెరవేరుస్తాడని అన్నారు. (యెహోషువ 14:6, 8; 23:1, 2, 14 చదవండి.) యెహోషువ కాలేబులు తమ దేవుడైన యెహోవాను ప్రేమించారు, ఆయనపై విశ్వాసం ఉంచారు. కేవలం ఇతరులను సంతోషపెట్టడం కోసం యెహోవాను బాధపెట్టే పనులేమీ చేయాలనుకోలేదు. అందుకే వారు సమూహాన్ని వెంబడించలేదు. వారు నేడు మనకు మంచి మాదిరులుగా ఉన్నారు.—సంఖ్యా. 14:1-10.

6. ఎలాంటి విషయాల్లో సమూహాన్ని వెంబడించే ప్రమాదం ఉంది?

6 కొన్నిసార్లు మీకు సమూహాన్ని వెంబడించాలి అనిపిస్తుందా? నేడు చాలామంది యెహోవాను గౌరవించడం లేదు. తప్పొప్పుల విషయంలో ఆయన ఇస్తున్న నిర్దేశం సరైనది కాదని అనుకొని, తప్పొప్పుల గురించి వారికున్న తప్పుడు అభిప్రాయాలను మనపై రుద్దడానికి ప్రయత్నిస్తారు. ఉదాహరణకు లైంగిక అనైతికతను, హింసను, భూతప్రేత వ్యవహారాలను చూపించే టీవీ కార్యక్రమాల్లో, సినిమాల్లో, వీడియో గేముల్లో తప్పేమీ లేదని వారు చెబుతారు. (2 తిమో. 3:1-5) మీరు, మీ కుటుంబం వినోదాన్ని ఆస్వాదించడానికి ఏమి చేయాలో మీరెలా నిర్ణయించుకుంటారు? ఇతరులు చెప్పేదాన్ని లేక చేసేదాన్ని బట్టే అది తప్పు, ఇది ఒప్పు అని నిర్ణయించుకుంటారా? అలాగైతే మీరు సమూహాన్ని వెంబడిస్తున్నట్లే.

7, 8. (ఎ) మన ‘జ్ఞానేంద్రియాలకు’ ఎలా శిక్షణనివ్వవచ్చు? అలాంటి శిక్షణ, ఒక నియమాల లిస్టు పాటించడం కన్నా ఎందుకు మంచిది? (బి) ఎంతోమంది క్రైస్తవ పిల్లల మంచి మాదిరిని బట్టి మీరు ఎందుకు సంతోషిస్తారు?

7 నిర్ణయాలు తీసుకోవడానికి సహాయం చేసేలా యెహోవా మనకు ఎంతో విలువైన బహుమానాన్ని అంటే విషయాల గురించి జాగ్రత్తగా ఆలోచించి, ఏది తప్పో ఏది ఒప్పో నిర్ణయించుకునే సామర్థ్యాన్ని ఇచ్చాడు. ఆ బహుమానాన్ని బైబిలు “జ్ఞానేంద్రియములు” అని పిలుస్తూ, వాటికి “అభ్యాసముచేత” శిక్షణనివ్వాలని చెబుతోంది. (హెబ్రీ. 5:14) ఇతరులు ఏమి చేస్తారో అదే చేస్తూ, లేదా మనం చేయాల్సిన దాని గురించి ఇతరులు ఏమి చెబుతారా అని ఎదురుచూస్తూ ఉంటే మనం జ్ఞానేంద్రియాలకు శిక్షణనివ్వలేం. చాలా విషయాల్లో మనం మనస్సాక్షితో నిర్ణయాలు తీసుకోవాల్సివుంటుంది. ఉదాహరణకు ఎలాంటి సినిమాలను చూడకూడదు, ఎలాంటి పుస్తకాలను చదవకూడదు, ఎలాంటి ఇంటర్నెట్‌ సైట్లను సంప్రదించకూడదు అనేవాటి గురించి ఇతరులు తమకొక లిస్టు ఇవ్వాలని యెహోవా ప్రజలు అనుకోరు. అలా మనం ఒక లిస్టును అనుసరిస్తే ప్రతీసారి ఒక కొత్త లిస్టు అవసరమవుతుంది. (1 కొరిం. 7:31) అయితే ఇతరులు మనకోసం నిర్ణయాలు తీసుకోవాలని మనం ఆశించకపోవడానికి ప్రాముఖ్యమైన కారణం ఏమిటంటే నిర్ణయాలు తీసుకోవడానికి యెహోవా మనకిచ్చిన సామర్థ్యాన్ని ఉపయోగించాలనుకోవడమే. మనం బైబిలు చెబుతున్నదాన్ని జాగ్రత్తగా పరిశీలించి, నిర్దేశం కోసం ప్రార్థించి ఆ తర్వాత తనను సంతోషపెట్టే నిర్ణయాలు తీసుకోవాలని యెహోవా కోరుతున్నాడు.—ఎఫె. 5:10.

8 మనం బైబిలుకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకున్నప్పుడు కొంతమంది ఇష్టపడరు. ఉదాహరణకు స్కూల్‌కు వెళ్తున్న మన పిల్లలు చాలా ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు, అక్కడ అందరూ ఏమి చేస్తే అదే చేయాలని తోటి పిల్లలు ఒత్తిడి చేస్తారు. (1 పేతు. 4:4) కానీ మన పిల్లల్లో చాలామంది సమూహాన్ని వెంబడించరు. యెహోషువ కాలేబులు చూపించినట్లే క్రైస్తవ పిల్లలూ పెద్దలూ విశ్వాసం చూపించడం ఎంతో సంతోషకరమైన విషయం.

‘కోరినవాటిని, చూసినవాటిని’ అనుసరించకండి

9. (ఎ) మీరు ఎక్కడికైనా వెళ్ళాలనుకుంటే, నచ్చిన రోడ్డును ఎంచుకోవడం ఎందుకు ప్రమాదకరం? (బి) సంఖ్యాకాండము 15:37-39లోని ఆజ్ఞ ఇశ్రాయేలీయులకు ఎందుకు ప్రాముఖ్యమైనదిగా ఉండేది?

9 మనం చూడబోయే రెండవ ప్రమాదం మనలోనుండే వస్తుంది. ఈ సన్నివేశాన్ని ఊహించుకోండి: మీరు ఒకచోటికి వెళ్ళాలనుకున్నారు, అక్కడికి వెళ్ళే దారిని చూపించే మ్యాప్‌ మీ దగ్గర ఉంది. ఒకవేళ మీరు ఆ మ్యాప్‌ని పక్కనబెట్టి, చూడడానికి బాగుంది కదా అని మీకు నచ్చిన రోడ్లను ఎంచుకుంటే ఏమౌతుంది? మీరు వెళ్ళాలనుకున్న చోటికి ఎన్నటికీ వెళ్ళలేరు. ఈ ఉదాహరణ, ఇశ్రాయేలీయులకు యెహోవా నేర్పించాలనుకున్న మరో సూత్రాన్ని అర్థం చేసుకునేందుకు సహాయం చేస్తుంది. ఆయన వారికిచ్చిన మరో ఆజ్ఞలో అది కనిపిస్తుంది. కుచ్చుల గురించి, నీలిసూత్రం గురించి దేవుడు ఎందుకు ఆజ్ఞ ఇచ్చాడో నేడు చాలామందికి అర్థం కాదు. (సంఖ్యాకాండము 15:37-39 చదవండి.) అది ఎందుకు ప్రాముఖ్యమో మీకు అర్థమైందా? ఒక కారణం ఏమిటంటే దానివల్ల దేవుని ప్రజలు ఇతర జనాంగాల నుండి వేరుగా కనిపించేవారు. నిజంగా యెహోవాను సంతోషపెట్టాలనుకుంటే వారు ఇతర జనాంగాల నుండి వేరుగా ఉండాలి. (లేవీ. 18:24, 25) అయితే ఆ ఆజ్ఞకు మరో కారణం కూడా ఉంది. దాని గురించి పరిశీలించి, యెహోవాకు ఎదురు తిరిగేలా చేయగల రెండవ ప్రమాదం గురించి మరింత తెలుసుకుందాం.

10. మానవుల గురించి బాగా తెలుసని యెహోవా ఎలా చూపించాడు?

10 యెహోవా ఆ ఆజ్ఞను తన ప్రజలకు ఇస్తూ ఈ కారణం చెప్పాడు: ‘కోరినవాటిని, చూసినవాటిని అనుసరించకండి.’ మానవుల గురించి ఆయనకు బాగా తెలుసు కాబట్టే అలా చెప్పాడు. కంటికి కనిపించే వాటిని మన హృదయం కోరుకుంటుందని ఆయనకు తెలుసు. హృదయం ప్రమాదకరమైనదని, మనతో చెడ్డ పనులు చేయిస్తుందని యెహోవాకు తెలుసు కాబట్టే ఆయన మనల్ని ఇలా హెచ్చరిస్తున్నాడు: “హృదయము అన్నిటికంటె మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధికలది, దాని గ్రహింపగలవాడెవడు?” (యిర్మీ. 17:9) అందుకే కోరుకున్నవాటిని, చూసినవాటిని అనుసరించవద్దని యెహోవా ఇశ్రాయేలీయులకు చెప్పాడు. తనను ఆరాధించని ఇతర జనాంగాలను చూసి ఇశ్రాయేలీయులు కూడా వారిలాగే ఉండాలనుకొని వారిలాగే ప్రవర్తించే అవకాశముందని యెహోవాకు తెలుసు.—సామె. 13:20.

11. మన కళ్ళను, హృదయాన్ని ఎప్పుడు అనుసరించే ప్రమాదం ఉంది?

11 ప్రమాదకరమైన మన హృదయం, కంటికి కనిపించేవాటిని కోరుకునే అవకాశం ఈ రోజుల్లో మరింత ఎక్కువగా ఉంది. తప్పుడు కోరికలను ఇట్టే అనుసరించేలా చేసే లోకంలో మనం జీవిస్తున్నాం. సంఖ్యాకాండము 15:39లోని సూత్రం మనకు ఎప్పుడు సహాయకరంగా ఉండవచ్చు? వస్త్రధారణ విషయంలో మన కళ్ళను, హృదయాన్ని అనుసరించే ప్రమాదం ఉంది. ఇతరుల్లో అనైతికమైన ఆలోచనలు కలిగించాలనే ఉద్దేశం తమకుందని చూపించేలా ప్రజలు బట్టలు వేసుకుంటున్నారు. అలాంటివారిని స్కూల్లో, ఉద్యోగ స్థలంలో, మన చుట్టు పక్కల ప్రాంతాల్లో చూడవచ్చు. వారిని ఎప్పుడూ చూస్తుంటాం కాబట్టి వారిలా కనిపించాలనే కోరిక మరింత బలపడి మెల్లమెల్లగా క్రైస్తవుల్లా కాక వారిలాగే బట్టలు వేసుకోవడం మొదలుపెట్టే అవకాశం ఉంది.—రోమా. 12:1, 2.

12, 13. (ఎ) కొన్నిసార్లు చెడ్డవాటిని చూడాలని మనకు అనిపిస్తే మనం ఏమి చేయాలి? (బి) ఇతరుల్లో చెడు కోరికలను కలిగించే పనులు మనం ఎందుకు చేయకూడదు?

12 మన కోరికల్ని అదుపుచేసుకోవడం చాలా ప్రాముఖ్యం. చెడ్డవాటిని చూడకుండా మన కళ్లను పక్కకు తిప్పేసుకోవడం చాలా అవసరం. నమ్మకస్థుడైన యోబు ఉదాహరణ ఈ విషయంలో సహాయకరంగా ఉంటుంది. ఆయన తన కళ్ళతో నిబంధన చేసుకున్నాడు. ఇతర స్త్రీలను అనైతిక ఆలోచనలతో చూడకూడదని గట్టిగా నిర్ణయించుకున్నాడు. (యోబు 31:1) రాజైన దావీదు కూడా అలాగే నిర్ణయించుకున్నాడు. ఆయనిలా అన్నాడు: “నా కన్నులయెదుట నేను ఏ దుష్కార్యమును ఉంచుకొనను.” (కీర్త. 101:3) మనం కూడా ఎలాంటి దుష్కార్యాన్నీ లేదా వ్యర్థమైన దేన్నీ చూడకూడదని దావీదులాగే నిర్ణయించుకోవాలి. యెహోవాతో మన స్నేహాన్ని తెంచివేయగలదేదైనా సరే అది వ్యర్థమైనదే. మన కంటపడినదేదైనా మన హృదయంలో చెడు కోరిక కలిగించి, మనం తప్పు చేసేలా నడిపించేదైతే అది వ్యర్థమైనదే.

13 ఇతరుల్లో చెడు కోరికలను కలిగించే పనులను చేస్తే మనం కూడా వ్యర్థమైనవారమైపోతాం. మన వస్త్రధారణ ద్వారా అలా చేసే ప్రమాదం ఉంది. అందుకే, ‘అణుకువతో తగుమాత్రపు వస్త్రములను’ వేసుకోమని బైబిలు చెబుతున్నదానికి లోబడాలి. (1 తిమో. 2:9) మనం అణుకువతో బట్టలు వేసుకోవడం ద్వారా మన ఇష్టాలనే కాక ఇతరుల అభిప్రాయాలను కూడా పరిగణనలోకి తీసుకుంటున్నామని, మనకన్నా ఎక్కువగా ఇతరులను సంతోషపరచాలని కోరుకుంటున్నామని చూపిస్తాం. (రోమా. 15:1, 2) మాదిరికరంగా బట్టలు వేసుకొనే వేలాదిమంది యౌవనస్థులు క్రైస్తవ సంఘంలో ఉన్నారు. వారు చేసే ప్రతీ దానిలో యెహోవాను సంతోషపెట్టాలనుకుంటారు కాబట్టి తాము చూసినవాటిని, కోరినవాటిని అనుసరించరు. అది చూసినప్పుడు మనకు ఎంతో సంతోషం కలుగుతుంది.

‘ప్రయోజనంలేనివాటిని’ అనుసరించకండి

14. ‘ప్రయోజనంలేని’ విషయాల గురించి సమూయేలు ఏ హెచ్చరికను ఇచ్చాడు?

14 ఇప్పుడు మీరు ఒక పెద్ద ఎడారి గుండా ప్రయాణిస్తున్నట్లు ఊహించుకోండి. ఒకానొక చోట నీళ్ళు ఉన్నట్లు మీకు కనిపించింది. కానీ నిజానికి అక్కడ నీళ్ళు లేవు. మీకు కనిపించినవి నీళ్ళు అనుకొని మీరు దారి విడిచిపెట్టి వెళ్తే ఏమౌతుంది? మీరు దారితప్పి ఎడారిలో చనిపోయే ప్రమాదం ఉంది. అలాగే, నిజం కానివాటిని నమ్మడం ఎంత ప్రమాదకరమో యెహోవాకు తెలుసు. ఒకానొక సమయంలో ఈ ప్రమాదం గురించి యెహోవా ఇశ్రాయేలీయులను హెచ్చరించాల్సివచ్చింది. చుట్టుపక్కల జనాంగాలన్నిటికీ మానవ రాజు ఉన్నాడు కాబట్టి తమకు కూడా అలాంటి ఒక రాజు కావాలని ఇశ్రాయేలీయులు కోరుకున్నారు. అలా కోరుకోవడం పెద్ద పాపం. ఎందుకంటే, యెహోవా తమకు రాజుగా ఉండాలని తాము కోరుకోవడం లేదని అది చూపించింది. చివరికి, తమకు ఒక మానవ రాజు ఉండేందుకు యెహోవా అనుమతించాడు. కానీ, వారికి ఒక హెచ్చరికను ఇవ్వడానికి ఆయన సమూయేలు ప్రవక్తను పంపించాడు. ‘ప్రయోజనంలేని’ విషయాలను అనుసరించే అంటే తమకు ఏమాత్రం సహాయం చేయనివాటిపై నమ్మకం ఉంచే ప్రమాదముందని సమూయేలు ఇశ్రాయేలీయులను హెచ్చరించాడు.—1 సమూయేలు 12:21 చదవండి.

15. ఏయే విధాలుగా ఇశ్రాయేలీయులు ‘ప్రయోజనంలేని’ విషయాలను అనుసరించారు?

15 యెహోవా కన్నా మానవ రాజుపై ఎక్కువ నమ్మకం ఉంచగలుగుతామని ఇశ్రాయేలీయులు అనుకొని ఉండవచ్చు. ఒకవేళ వారి ఆలోచన అదే అయితే మాత్రం వారు ‘ప్రయోజనంలేనివాటిని’ అనుసరిస్తున్నట్లే. ఎందుకంటే వారు ప్రయోజనంలేని ఒకదాన్ని నమ్మారు కాబట్టి సాతాను ఎరగా చూపించే ప్రయోజనంలేని ఇతర విషయాలను ఇట్టే నమ్మే ప్రమాదం ఉంది. ఉదాహరణకు మానవ రాజు, విగ్రహారాధన చేసేలా వారిని ప్రేరేపించే ప్రమాదం ఉంది. విగ్రహాలను ఆరాధించేవారు వాటిని చూడగలుగుతారు, ముట్టుకోగలుగుతారు కాబట్టి చెక్కతో లేక రాయితో చేయబడిన దేవుళ్ళను తాము నమ్మవచ్చని అనుకుంటారు. వారు సమస్తాన్ని సృష్టించిన అదృశ్య దేవుడైన యెహోవాను నమ్మరు. విగ్రహాలు ‘వట్టివని’ అపొస్తలుడైన పౌలు అన్నాడు. (1 కొరిం. 8:4) అవి చూడలేవు, వినలేవు, మాట్లాడలేవు, ఏమీ చేయలేవు. కేవలం వాటిని చూడవచ్చు, ముట్టుకోవచ్చు అనే ఒక్క కారణాన్ని బట్టి వాటిని ఆరాధించడం అవివేకం. అవి ఎవ్వరికీ సహాయం చేయలేవు. అవి ‘ప్రయోజనంలేనివి.’ వాటిపై నమ్మకముంచేవారు ‘వాటివంటివారే.’—కీర్త. 115:4-8.

16. (ఎ) ప్రజలు ప్రయోజనంలేని విషయాలను వెంబడించేలా చేయడానికి సాతాను ఎలా ప్రయత్నిస్తున్నాడు? (బి) యెహోవాతో పోలిస్తే డబ్బు, ఇతర వస్తువులు ప్రయోజనంలేనివి అని ఎందుకు చెప్పవచ్చు?

16 సాతాను చాలా తెలివైనవాడు. నేడు కూడా ప్రజలు ‘ప్రయోజనంలేనివాటిని’ అనుసరించేలా చేస్తున్నాడు. ఉదాహరణకు డబ్బు, మంచి ఉద్యోగం, ఇతర మంచి విషయాలు ఉంటే సంతోషంగా, సురక్షితంగా ఉండవచ్చని ప్రజలు నమ్మేలా సాతాను చేస్తున్నాడు. అవి ఉంటే తమ సమస్యలన్నీ తీరతాయని వారు అనుకుంటారు. కానీ అనారోగ్యం పాలైనప్పుడు, ఆర్థిక వ్యవస్థ బాగా లేనప్పుడు లేదా ప్రకృతి విపత్తులు వచ్చినప్పుడు అవి ప్రజలకు ఎంతమేర సహాయం చేయగలవు? తమ జీవితానికి అర్థం లేదని వారికి అనిపించినప్పుడు అవి ఎలా సహాయం చేస్తాయి? జీవితానికి సంబంధించిన ప్రాముఖ్యమైన ప్రశ్నలకు అవి జవాబులు ఇవ్వగలవా? చావు దగ్గరపడినప్పుడు అవి ప్రజలకు సహాయం చేయగలవా? డబ్బును, ఇతర వస్తువులను నమ్ముకుంటే మిగిలేది నిరాశే. అవి మనకు సంతోషాన్ని ఇవ్వలేవు. అనారోగ్యం నుండి, చావు నుండి మనల్ని కాపాడలేవు. అవి ‘ప్రయోజనంలేనివి.’ (సామె. 23:4, 5) కానీ యెహోవా దేవుడు అవాస్తవికమైన వ్యక్తి కాడు. ఆయన సత్య దేవుడు. ఆయనతో మంచి స్నేహం ఉన్నప్పుడే మనం సంతోషంగా, సురక్షితంగా ఉంటాం. ఆయన మాత్రమే మన సమస్యలన్నిటిలో మనకు సహాయం చేయగలడు. మనం ఆయన స్నేహితులుగా ఉన్నందుకు ఎంతో సంతోషిస్తున్నాం. ఆయనను విడిచిపెట్టి ‘ప్రయోజనంలేని’ విషయాలను ఎన్నడూ అనుసరించాలనుకోం.

17. ఈ ఆర్టికల్‌లో ఇవ్వబడిన హెచ్చరికల్ని మీరు పాటిస్తారా?

17 యెహోవా మన స్నేహితునిగా ఉన్నందుకు, నిరంతర జీవితానికి మనం చేసే ప్రయాణంలో మనకు సూచనలు ఇస్తున్నందుకు మనం ఎంతో సంతోషిస్తున్నాం. ఆయనిచ్చే హెచ్చరికలను విని, పాటిస్తూ ఉంటే మనం నిరంతరం జీవించవచ్చు. చాలామందిని తప్పుదారి పట్టించే మూడు ప్రమాదాల గురించి అంటే, సమూహము, మన హృదయం, ‘ప్రయోజనంలేని’ విషయాలు అనే వాటి గురించి మనం ఈ ఆర్టికల్‌లో చూశాం. ప్రతీ ‘అబద్ధమార్గాన్ని’ ద్వేషించి, దానికి దూరంగా ఉండడానికి మనకు యెహోవా ఇస్తున్న మరో మూడు హెచ్చరికల్ని తర్వాతి ఆర్టికల్‌లో చూస్తాం.—కీర్త. 119:128.

మీరేమి అనుకుంటున్నారు?

ఈ కింది లేఖనాల్లోని సూత్రాలను మీరు ఎలా పాటించవచ్చు?

నిర్గమకాండము 23:2

సంఖ్యాకాండము 15:37-39

1 సమూయేలు 12:21

కీర్తన 119:128

[అధ్యయన ప్రశ్నలు]

[11వ పేజీలోని చిత్రం]

సమూహాన్ని వెంబడించాలని మీరెప్పుడైనా అనుకున్నారా?

[13వ పేజీలోని చిత్రం]

కోరినవాటిని, చూసినవాటిని అనుసరించడం ఎందుకు ప్రమాదకరం?

[14వ పేజీలోని చిత్రం]

మీరు ప్రయోజనంలేని విషయాలను అనుసరిస్తున్నారా?