కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

సుదీర్ఘ న్యాయ పోరాటంలో చివరికి గెలిచాం!

సుదీర్ఘ న్యాయ పోరాటంలో చివరికి గెలిచాం!

సుదీర్ఘ న్యాయ పోరాటంలో చివరికి గెలిచాం!

ఆ పోరాటం 1995లో మొదలై 15 సంవత్సరాలపాటు కొనసాగింది. ఆ సంవత్సరాలన్నిటిలో రష్యాలోని నిజక్రైస్తవులు మతస్వేచ్ఛను వ్యతిరేకించేవారి దాడికి గురయ్యారు. ఆ వ్యతిరేకులు మాస్కోలో, దాని పరిసర ప్రాంతాల్లో యెహోవాసాక్షులను నిషేధించాలని తీర్మానించుకున్నారు. అయినప్పటికీ, రష్యాలో యథార్థంగా యెహోవాను సేవిస్తున్న మన ప్రియ సహోదర సహోదరీలకు చట్టపరమైన విజయాన్ని ఇవ్వడం సముచితమని యెహోవాకు అనిపించింది. ఇంతకీ ఆ పోరాటం ఎలా మొదలైంది?

చివరకు స్వేచ్ఛ

1917లో తాము కోల్పోయిన మతస్వేచ్ఛను రష్యాలోని మన సహోదరులు 1990-95 మధ్యకాలంలో తిరిగి పొందారు. 1991లో సోవియట్‌ యూనియన్‌ ప్రభుత్వం యెహోవాసాక్షులను చట్టబద్ధం చేసింది. సోవియట్‌ యూనియన్‌ చీలిపోయిన తర్వాత యెహోవాసాక్షులు రష్యా సంయుక్త రాజ్యంలో రిజిస్టరు చేయబడ్డారు. అంతేకాక, దశాబ్దాల క్రితం మత హింసను ఎదుర్కొన్న యెహోవాసాక్షులు రాజకీయ అణచివేతకు గురయ్యారని ప్రభుత్వం అధికారికంగా గుర్తించింది. 1993లో మాస్కో న్యాయశాఖ అక్కడి సహోదరులను, ‘మాస్కోలోని యెహోవాసాక్షుల సమాజం’ అనే పేరుమీద చట్టపరంగా రిజిస్టరు చేసింది. అదే సంవత్సరం రష్యాలో మతస్వేచ్ఛను హామీ ఇచ్చే కొత్త రాజ్యాంగం అమల్లోకి వచ్చింది. అందుకే ఒక సహోదరుడు ఆశ్చర్యంతో ఇలా అన్నాడు: “ఇలాంటి స్వేచ్ఛను చూస్తామని మేము కలలో కూడా అనుకోలేదు. దీని కోసం మేము 50 ఏళ్లపాటు ఎదురుచూశాం!”

వెంటనే ప్రకటనా పనిని ముమ్మరం చేయడం ద్వారా రష్యాలోని మన సహోదర సహోదరీలు ఆ అనుకూలమైన ‘సమయాన్ని’ చక్కగా ఉపయోగించుకున్నారు. దానివల్ల ఎంతోమంది సానుకూలంగా స్పందించారు. (2 తిమో. 4:2) “అప్పట్లో ప్రజలకు మతం పట్ల ఎంతో ఆసక్తి ఉండేది” అని ఒకామె అంది. త్వరలోనే ప్రచారకుల, పయినీర్ల, సంఘాల సంఖ్య ఎన్నో రెట్లు పెరిగింది. 1990లో అక్కడ దాదాపు 300 మంది యెహోవాసాక్షులు ఉండేవారు. కానీ 1995కల్లా ఆ సంఖ్య 5,000 దాటింది! దాన్ని చూసి మతస్వేచ్ఛను వ్యతిరేకించేవారు ఎంతో ఆందోళన చెందారు. కాబట్టి వారు 1995లో చట్టపరమైన పోరాటాన్ని ఉసిగొల్పడం ద్వారా దాడిచేశారు. ఎన్నో సంవత్సరాలపాటు సాగిన ఆ పోరాటం ముగిసేటప్పటికి నాలుగు దశలు మారింది.

నేరవిచారణలు చివర్లో ఓ కొత్త మలుపు తిరిగాయి

ఆ పోరాటపు మొదటి దశ 1995 జూన్‌లో ప్రారంభమైంది. మాస్కోలో రష్యన్‌ ఆర్థొడాక్స్‌ చర్చితో బహిరంగంగా పొత్తు పెట్టుకున్న ఒక గుంపు మన సహోదరులు నేరాలకు పాల్పడుతున్నారని నిందిస్తూ ఫిర్యాదు దాఖలు చేసింది. తమ వివాహ జత లేదా పిల్లలు సాక్షులుగా మారినందుకు కోపంగా ఉన్న కుటుంబ సభ్యుల తరఫున తాము పని చేస్తున్నామని ఆ గుంపు చెప్పుకుంది. 1996 జూన్‌లో దానికి సంబంధించి దర్యాప్తు మొదలైంది. కానీ సాక్షులు నేరం చేశారని చూపించే రుజువు ఒక్కటి కూడా దొరకలేదు. అయినా అదే గుంపు మన సహోదరులు నేరాలు చేస్తున్నారని మళ్లీ ఫిర్యాదు దాఖలు చేసింది. అధికారులు మళ్లీ విచారణ జరిపారు కానీ సహోదరుల మీద మోపబడిన నిందలన్నీ తప్పు అని తేలింది. అయితే వ్యతిరేకులు అవే ఆరోపణలతో మూడోసారి ఫిర్యాదు దాఖలు చేశారు. దాంతో మళ్లీ మాస్కోలోని యెహోవాసాక్షులపై విచారణ జరిగింది. కానీ వారు నేరం చేశారని కేసు పెట్టడానికి ఏ ఆధారమూ లేదనే ముగింపుకు ప్రాసిక్యూటర్‌ (ప్రభుత్వ న్యాయవాది) వచ్చింది. ఆ తర్వాత, వ్యతిరేకులు అదే ఆరోపణలతో నాల్గవసారి ఫిర్యాదు దాఖలు చేశారు. ఈసారి కూడా ప్రాసిక్యూటర్‌కు ఏ రుజువూ దొరకలేదు. ఆశ్చర్యకరంగా అదే గుంపు మరోసారి విచారణ జరిపించాలని కోరింది. విచారణ జరిపిన ఓ కొత్త వ్యక్తి 1998 ఏప్రిల్‌ 13న ఆ కేసును కొట్టేశారు.

“కానీ అప్పుడు అస్సలు ఊహించనిది ఒకటి జరిగింది” అని ఆ కేసును విచారించిన ఒక లాయరు అన్నాడు. ఐదవసారి విచారణ జరిపిన న్యాయశాఖ ప్రతినిధి మన సహోదరులు నేరాలు చేశారనడానికి ఆధారాలు లేవని ఒప్పుకున్నా, వారిపై పౌరసంబంధ దావా వేయాలని అంది. ‘మాస్కోలోని యెహోవాసాక్షుల సమాజం’ జాతీయ, అంతర్జాతీయ నియమాలను ఉల్లంఘించిందని ఆమె ఆరోపించింది. ఉత్తర మాస్కో పరిపాలక విభాగపు ప్రాసిక్యూటర్‌ దానికి ఒప్పుకొని పౌరసంబంధ దావా వేశాడు. a 1998 సెప్టెంబరు 29న మాస్కోలోని గలవిన్‌స్కీ జిల్లా కోర్టులో విచారణలు మొదలయ్యాయి. దాంతో రెండో దశ ఆరంభమైంది.

కోర్టులో బైబిలు

ఉత్తర మాస్కోలో ఇరుకుగావున్న ఓ కోర్టు గదిలో ప్రాసిక్యూటర్‌ టాట్యాన కొన్‌డ్రాట్యేవ దాడికి దిగింది. 1997లో ఆమోదించబడిన సమాఖ్య చట్టం ఆధారంగా ఆమె వాదనను మొదలుపెట్టింది. ఆర్థొడాక్స్‌ క్రైస్తవత్వం, ఇస్లాం, జూడాయిజమ్‌, బౌద్ధ మతం వంటివి సాంప్రదాయ మతాలు అని ఆ చట్టం వివరించింది. b నిజానికి, ఆ చట్టం వల్లే ఇతర మతాలు చట్టపరమైన గుర్తింపును పొందడం కష్టమైంది. ఆ చట్టం, ద్వేషాన్ని పెంపొందించే మతాలను నిషేధించే అధికారాన్ని కోర్టులకు కల్పించింది. యెహోవాసాక్షులు ద్వేషాన్ని పెంపొందిస్తారని, కుటుంబాలను నాశనం చేస్తారని తప్పుగా ఆరోపిస్తూ వారిని నిషేధించాలని ఆ చట్టాన్నే ఉపయోగించి ప్రాసిక్యూటర్‌ వాదించింది.

మన సహోదరుల తరఫున వాదించే ఓ న్యాయవాది ఇలా ప్రశ్నించాడు: “మాస్కోలోని యెహోవాసాక్షుల సంఘంలో ఎవరు చట్టాన్ని మీరారు?” దానికి ప్రాసిక్యూటర్‌ ఒక్క పేరు కూడా చెప్పలేకపోయింది. అయితే, యెహోవాసాక్షుల ప్రచురణలు మతపరమైన ద్వేషాన్ని ఉసిగొల్పుతున్నాయని ఆమె ఆరోపించింది. ఆ విషయాన్ని నిరూపించడానికి ఆమె కావలికోట, తేజరిల్లు!, మరితర ప్రచురణల నుండి (పైన చూడండి) కొంతభాగాన్ని చదివి వినిపించింది. ఆ ప్రచురణలు ఏ విధంగా మతపరమైన ద్వేషాన్ని పెంపొందిస్తున్నాయని అడిగినప్పుడు ఆమె, “తమదే నిజమైన మతం అని యెహోవాసాక్షులు బోధిస్తారు” అని చెప్పింది.

మన సహోదరుడైన ఒక న్యాయవాది జడ్జికి, ప్రాసిక్యూటర్‌కి చెరొక బైబిలు ఇచ్చి, “ప్రభువు ఒక్కడే, విశ్వాస మొక్కటే, బాప్తిస్మ మొక్కటే” అని చెబుతున్న ఎఫెసీయులు 4:5ను చదివి వినిపించాడు. కాసేపటికే జడ్జి, ప్రాసిక్యూటర్‌, మన న్యాయవాది తమ దగ్గర ఉన్న బైబిళ్ల నుండి యోహాను 17:18, యాకోబు 1:27 వంటి లేఖనాలను చర్చించసాగారు. జడ్జి ఇలా అడిగింది: “ఈ లేఖనాలు మతపరమైన ద్వేషాన్ని ఉసిగొల్పుతున్నాయా?” దానికి ప్రాసిక్యూటర్‌ తనకు బైబిలుపై వ్యాఖ్యానించేంత సామర్థ్యం లేదంది. అందుకు మన న్యాయవాది, యెహోవాసాక్షులను తీవ్రంగా విమర్శించే రష్యన్‌ ఆర్థొడాక్స్‌ చర్చి ప్రచురణలను చూపించి “ఈ వాక్యాలు చట్టాన్ని మీరుతున్నాయా?” అని అడిగాడు. దానికి ఆ ప్రాసిక్యూటర్‌, “మతనాయకుల వాదనలపై వ్యాఖ్యానించేంత సామర్థ్యం నాకు లేదు” అని అంది.

అభియోగం బలహీనపడింది

యెహోవాసాక్షులు కుటుంబాలను నాశనం చేస్తున్నారనే ఆరోపణను బలపర్చడానికి, వారు క్రిస్మస్‌ వంటి సెలవుదినాలను ఆచరించరని ఆ ప్రాసిక్యూటర్‌ అంది. అయితే, పౌరులు తప్పక క్రిస్మస్‌ ఆచరించాలని రష్యా చట్టం కోరడం లేదని ఆమె ఆ తర్వాత ఒప్పుకుంది. రష్యన్లందరికీ అంటే రష్యాలో ఉన్న యెహోవాసాక్షులకు కూడా ఈ విషయంలో ఎంపిక చేసుకునే స్వేచ్ఛ ఉంది. మన సంస్థ, పిల్లలకు తగిన విశ్రాంతీ ఉల్లాసమూ లేకుండా చేస్తోంది అని కూడా ఆమె బలంగా వాదించింది. అయితే దాని గురించి ప్రశ్నించినప్పుడు, తాను యెహోవాసాక్షుల పిల్లలతో ఎప్పుడూ మాట్లాడలేదని ఆమె అంగీకరించింది. ‘మీరు యెహోవాసాక్షుల కూటాలకు ఎప్పుడైనా హాజరయ్యారా?’ అని ఒక న్యాయవాది అడిగినప్పుడు ఆమె, “నాకు ఆ అవసరం లేదు” అని జవాబిచ్చింది.

మానసిక రోగాలు, వాటి చికిత్సకు సంబంధించిన శాస్త్రంలో ప్రొఫెసర్‌ అయిన ఒక వ్యక్తిని తిరుగులేని సాక్షి అన్నట్లుగా ఆమె ప్రవేశపెట్టింది. మన ప్రచురణలను చదవడం వల్ల మానసిక సమస్యలు వస్తాయని ఆయన ఆరోపించాడు. ఆ ప్రొఫెసర్‌ కోర్టుకు సమర్పించిన రాతపూర్వక సాక్ష్యం రష్యన్‌ ఆర్థొడాక్స్‌ చర్చికి చెందిన మాస్కో పేట్రియార్కీ తయారుచేసిన పత్రంలాగే ఉందని మన తరఫున వాదించే ఒక న్యాయవాది అంది. అప్పుడు, దానిలోని కొన్ని భాగాలు ఉన్నవున్నట్లుగా అందులోనివేనని ఆ ప్రొఫెసర్‌ ఒప్పుకున్నాడు. మరిన్ని ప్రశ్నలు వేసినప్పుడు ఆయన యెహోవాసాక్షులకు ఎప్పుడూ చికిత్స చేయలేదని తేలింది. అదే శాస్త్రంలోని మరో ప్రొఫెసర్‌ తాను మాస్కోలో 100 కన్నా ఎక్కువమంది యెహోవాసాక్షులను పరిశీలించానని కోర్టులో సాక్ష్యం చెప్పాడు. వారు మానసికంగా ఆరోగ్యంగా ఉంటారని చెబుతూ యెహోవాసాక్షులుగా మారినప్పటినుండి వారు మరింత మత సహనం చూపించారని కూడా అన్నాడు.

తాత్కాలిక విజయం

యెహోవాసాక్షుల ప్రచురణలను అధ్యయనం చేయడానికి 1999 మార్చి 12న జడ్జి ఐదుగురు పరిశోధకులను నియమించి, కేసును వాయిదా వేసింది. మాస్కోలోని ఈ విచారణతో సంబంధం లేకుండా రష్యా కేంద్ర ప్రభుత్వపు జస్టిస్‌ మినిస్ట్రీ కూడా మన ప్రచురణలను అధ్యయనం చేయడానికి అప్పటికే పరిశోధకుల జట్టును నియమించింది. మన ప్రచురణల్లో హానికరమైన దేన్నీ కనుగొనలేదని చెబుతూ ఆ జట్టు 1999 ఏప్రిల్‌ 15న నివేదికను సమర్పించింది. కాబట్టి 1999 ఏప్రిల్‌ 29న జస్టిస్‌ మినిస్ట్రీ దేశంలోని యెహోవాసాక్షులను మళ్లీ చట్టబద్ధం చేసింది. యెహోవాసాక్షులకు అనుకూలంగా ఉన్న ఈ కొత్త నివేదిక తమ దగ్గర ఉన్నప్పటికీ మరో కొత్త జట్టు మన ప్రచురణలను పరిశీలించాలని మాస్కో కోర్టు పట్టుబట్టింది. దానివల్ల ఓ వింత పరిస్థితి తలెత్తింది. ఒకవైపేమో, రష్యా జస్టిస్‌ మినిస్ట్రీ యెహోవాసాక్షులను చట్టానికి కట్టుబడివుండే ఆమోదించబడిన మతంగా గుర్తించింది. మరోవైపేమో, యెహోవాసాక్షులు చట్టాన్ని మీరారంటూ మాస్కో న్యాయశాఖ వారిపై విచారణ జరిపింది!

దాదాపు రెండేళ్ల తర్వాత మళ్లీ విచారణ మొదలైంది. చివరకు 2001 ఫిబ్రవరి 23న జడ్జి యెలేనా ప్రొహోరీచేవ తన తీర్పును ప్రకటించింది. తాను నియమించిన పరిశోధకులు సమర్పించిన నివేదికను పరిశీలించిన తర్వాత ఆమె తన తీర్పును ఇలా ప్రకటించింది: “మాస్కోలోని యెహోవాసాక్షుల మత సమాజపు కార్యకలాపాలను నిషేధించడానికి, నిలిపివేయడానికి ఎలాంటి ఆధారమూ లేదు.” చివరకు, మన సహోదరులపై మోపబడిన నిందలన్నీ తప్పు అని అధికారికంగా నిరూపించబడింది! అయితే ప్రాసిక్యూటర్‌ ఆ తీర్పును నిరాకరించి మాస్కో జిల్లా కోర్టుకు అప్పీలు చేసుకుంది. మూడు నెలల తర్వాత 2001 మే 30న జడ్జి ప్రొహోరీచేవ ఇచ్చిన తీర్పును ఆ కోర్టు కొట్టేసింది. అదే ప్రాసిక్యూటర్‌ మరో జడ్జి ఆధ్వర్యంలో కేసును మళ్లీ విచారించాలని ఆ కోర్టు ఆజ్ఞ జారీ చేసింది. దాంతో మూడవ దశ ఆరంభమైంది.

తాత్కాలిక ఓటమి

2001 అక్టోబరు 30న జడ్జి వెర డ్యూబిన్‌స్కయ ఆధ్వర్యంలో మళ్లీ విచారణ మొదలైంది. c ప్రాసిక్యూటర్‌ కొన్‌డ్రాట్యేవ యెహోవాసాక్షులు మతపరమైన ద్వేషాన్ని పెంపొందిస్తారని ఆరోపిస్తూ మళ్లీ అదే పాట పాడింది. అయితే, ఈసారి ఆమె యెహోవాసాక్షుల చట్టబద్ధమైన సమాజాన్ని నిషేధిస్తే మాస్కోలోని యెహోవాసాక్షుల హక్కులను కాపాడవచ్చు అనే వాదనను చేర్చింది! తమ హక్కులను “కాపాడవచ్చు” అనే అర్థంలేని ఆ వాదనను తిరస్కరించాలని కోర్టును కోరుతూ మాస్కోలోని మొత్తం 10,000 మంది యెహోవాసాక్షులు వెంటనే వినతి పత్రం మీద సంతకాలు చేశారు.

యెహోవాసాక్షులు తప్పు చేశారని నిరూపించేందుకు ఆధారాలు చూపించాల్సిన అవసరం తనకు లేదని ప్రాసిక్యూటర్‌ చెప్పింది. ఎందుకంటే, వారి కార్యకలాపాలపై కాదుగానీ వారి ప్రచురణలపై, నమ్మకాలపై విచారణ జరుగుతోందని ఆమె అంది. కోర్టులో బలమైన సాక్ష్యంగా రష్యన్‌ ఆర్థొడాక్స్‌ చర్చి ప్రతినిధిని ప్రవేశపెడతానని ఆమె ప్రకటించింది. యెహోవాసాక్షులను నిషేధించడానికి జరుగుతున్న ప్రయత్నాల్లో మతనాయకుల పాత్ర ఎంతో ఉందని ఆ ప్రకటనను బట్టి అర్థమైంది. 2003 మే 22న మళ్లీ ఓ నిపుణుల జట్టు యెహోవాసాక్షుల ప్రచురణలను అధ్యయనం చేయాలని జడ్జి ఆజ్ఞాపించింది.

ఆ జట్టు చేసిన అధ్యయన ఫలితాలను సమీక్షించడానికి 2004 ఫిబ్రవరి 17న మళ్లీ విచారణ మొదలైంది. మన ప్రచురణలు “కుటుంబాన్ని, వివాహాన్ని కాపాడుకోమని” పాఠకులను ప్రోత్సహిస్తాయని, అయితే అవి ద్వేషాన్ని పెంపొందిస్తాయనే ఆరోపణకు “ఆధారం లేదు” అని ఆ నిపుణులు తేల్చిచెప్పారు. ఆ విషయాన్ని ఇతర పండితులు అంగీకరించారు. “యెహోవాసాక్షులు ఎందుకు ప్రకటిస్తారు?” అని మత చరిత్రకు సంబంధించిన ఓ ప్రొఫెసర్‌ని అడిగినప్పుడు కోర్టుకు ఆయన, “క్రైస్తవులు తప్పక ప్రకటించాలి. సువార్త పుస్తకం అదే చెబుతోంది. ‘అన్ని దేశాలకు వెళ్లి ప్రకటించండి’ అంటూ క్రీస్తు కూడా తన శిష్యులకు అదే ఆజ్ఞాపించాడు” అని జవాబిచ్చాడు. అయినప్పటికీ 2004 మార్చి 26న జడ్జి మాస్కోలోని యెహోవాసాక్షుల కార్యకలాపాలను నిషేధించింది. 2004 జూన్‌ 16న మాస్కో జిల్లా కోర్టు ఆ నిర్ణయాన్ని సమర్థించింది. d ఎంతోకాలం నుంచి యెహోవాసాక్షిగా ఉన్న ఓ వ్యక్తి ఆ తీర్పు గురించి ఇలా అన్నాడు: “సోవియట్‌ పరిపాలనలో రష్యన్లు నాస్తికులుగా ఉండాల్సి వస్తే, ఇప్పుడేమో వారు ఆర్థొడాక్సులుగా ఉండాల్సి వస్తోంది.”

ఆ నిషేధానికి మన సహోదరులు ఎలా స్పందించారు? పూర్వం అలాంటి పరిస్థితుల్లో నెహెమ్యా ఎలా ప్రవర్తించాడో వారూ అలాగే ప్రవర్తించారు. నెహెమ్యా యెరూషలేము గోడలను కట్టడానికి చేస్తున్న ప్రయత్నాలను దేవుని ప్రజల శత్రువులు వ్యతిరేకించారు. అప్పుడు తమకు ఎదురైన ఏ వ్యతిరేకతను బట్టీ ఆయన, ఆయన ప్రజలు ఆ పనిని ఆపలేదు. బదులుగా వారు ‘పనిచేయుటకు మనస్సు కలిగివుండి కడుతూ’ వెళ్లారు. (నెహె. 4:1-6) అలాగే, నేడు జరగాల్సిన సువార్త ప్రకటనా పనిని మాస్కోలోని మన సహోదరులు తమకు ఎదురైన వ్యతిరేకతను బట్టి ఆపేయలేదు. (1 పేతు. 4:12, 16) యెహోవా తమపై తగిన శ్రద్ధ తీసుకుంటాడనే నమ్మకంతో వారు తమ పోరాటంలోని నాల్గవ దశను ఎదుర్కోవడానికి సిద్ధపడ్డారు.

వ్యతిరేకత ఎక్కువైంది

2004 ఆగస్టు 25న మన సహోదరులు అప్పటి రష్యా అధ్యక్షుడైన వ్లాడిమీర్‌ పుతిన్‌ పేరుమీద కేంద్ర ప్రభుత్వానికి అర్జీ పెట్టుకున్నారు. నిషేధంపై తీవ్రమైన విచారాన్ని వ్యక్తం చేసిన ఆ అర్జీలో 76 సంపుటులూ 3,15,000 సంతకాలూ ఉన్నాయి. అప్పుడు రష్యన్‌ ఆర్థొడాక్స్‌ మతనాయకులు తమ అసలు రంగును బయటపెట్టారు. మాస్కో పేట్రియార్కీ ప్రతినిధి ఒకాయన ఇలా అన్నాడు: “మేము యెహోవాసాక్షుల కార్యకలాపాలను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం.” యెహోవాసాక్షులను నిషేధించడం వల్ల “ఓ మైలురాయిని చేరుకున్నాం. అది ఓ సానుకూల చర్య” అని ఒక ముస్లిం నాయకుడు అన్నాడు.

ఆ తప్పుడు మాటలను నమ్మిన రష్యన్‌ సమాజపు ప్రజలు యెహోవాసాక్షులపై దాడి చేయడానికి ధైర్యం తెచ్చుకున్నారు. మాస్కోలో ప్రకటనా పని చేస్తున్న కొంతమంది సాక్షులను వ్యతిరేకులు గుద్దారు, తన్నారు. ఒక వ్యక్తి ఆగ్రహంతో మన సహోదరిని బిల్డింగ్‌ బయటిదాకా తరిమి ఆమె వెన్ను మీద గట్టిగా తన్నడంతో ఆమె కిందపడి తలకు దెబ్బతగిలింది. ఆమెకు వైద్య సహాయం అవసరమైంది. అయినా పోలీసులు మాత్రం దాడి చేసిన వ్యక్తిపై ఎలాంటి చర్యా తీసుకోలేదు. మరికొంతమంది సాక్షులను పోలీసులు అరెస్ట్‌ చేశారు, వారి వేలిముద్రలు తీసుకున్నారు, వారిని ఫోటో తీశారు, రాత్రంతా కస్టడీలో ఉంచారు. మాస్కోలో కూటాలు జరుపుకోవడానికి యెహోవాసాక్షులకు హాళ్లను కిరాయికి ఇస్తే పనిలో నుండి తీసేస్తామని మేనేజర్లను బెదిరించారు. కొంతకాలానికే, చాలా సంఘాలు తాము కూటాలు జరుపుకునే స్థలాలను కోల్పోయారు. నాలుగు హాళ్లున్న ఓ రాజ్యమందిర భవనాన్ని 40 సంఘాలు ఉపయోగించుకోవాల్సి వచ్చింది. ఆ సంఘాల్లో ఒకటి తమ బహిరంగ కూటాన్ని ఉదయం 7:30కి జరుపుకోవాల్సి వచ్చింది. ఆ సంఘం గురించి ఓ ప్రయాణ పర్యవేక్షకుడు ఇలా అన్నాడు: “ప్రచారకులు కూటానికి హాజరవ్వడానికి ఉదయం ఐదు గంటలకు లేవాల్సి వచ్చేది. అయినా వారు సంవత్సరం కన్నా ఎక్కువ కాలంపాటు ఎంతో సంతోషంగా అలా చేశారు.”

‘సాక్ష్యంగా’ పనిచేసింది

మాస్కో విధించిన నిషేధం అన్యాయమైనదని నిరూపించడానికి మన తరఫు న్యాయవాదులు 2004 డిసెంబరులో యూరోపియన్‌ కోర్ట్‌ ఆఫ్‌ హ్యూమన్‌ రైట్స్‌ను ఆశ్రయించారు. (6వ పేజీలో ఉన్న “రష్యా తీర్పును ఫ్రాన్స్‌లో ఎందుకు మళ్లీ సమీక్షించారు?” అనే బాక్సు చూడండి.) ఆరు సంవత్సరాల తర్వాత 2010 జూన్‌ 10న యెహోవాసాక్షులు నిర్దోషులు అనే ఏకగ్రీవ నిర్ణయాన్ని కోర్టు ప్రకటించింది. e మనపై మోపబడిన నిందలన్నిటినీ పరిశీలించి, వాటికి అసలు ఏ ఆధారాలూ లేవని కోర్టు కనుగొంది. “కోర్టు దృష్టికి వచ్చిన ఆ నిషేధాన్ని ఎత్తివేసి, జరిగిన నష్టాన్ని సాధ్యమైనంత మేరకు పూరించాల్సిన” చట్టపరమైన బాధ్యత రష్యాపై ఉందని కూడా చెప్పింది.—8వ పేజీలో ఉన్న “కోర్టు తీర్పు” అనే బాక్సు చూడండి.

యూరోపియన్‌ కన్వెన్షన్‌ ఆఫ్‌ హ్యూమన్‌ రైట్స్‌ యెహోవాసాక్షుల కార్యకలాపాలను ఎలా కాపాడుతుందో వివరిస్తూ కోర్టు స్పష్టంగా వెల్లడిచేసిన తీర్పు కేవలం రష్యాకే కాక యూరోపియన్‌ కౌన్సిల్‌లో సభ్యత్వం కలిగివున్న 46 ఇతర దేశాలకు కూడా వర్తిస్తుంది. అంతేకాక అందులో చట్టాన్ని, వాస్తవాల్ని ఎంతో విశదంగా విశ్లేషించారు కాబట్టి ప్రపంచవ్యాప్తంగా ఉన్న న్యాయశాస్త్ర పండితులు, జడ్జీలు, శాసనకర్తలు, మానవ హక్కుల ప్రవీణులు దాన్ని ఎంతో ఆసక్తిగా చదువుతారు. ఎందుకు? ఎందుకంటే, కోర్టు ఆ తీర్పుకు రావడానికి ముందు, అప్పటికే యెహోవాసాక్షులకు అనుకూలంగా ఆ కోర్టు ఇచ్చిన ఎనిమిది తీర్పుల గురించే కాక అర్జెంటీనా, కెనడా, జపాన్‌, రష్యా, దక్షిణ ఆఫ్రికా, స్పెయిన్‌, యునైటెడ్‌ కింగ్‌డమ్‌, యునైటెడ్‌ స్టేట్స్‌ వంటి దేశాల అత్యున్నత న్యాయస్థానాల్లో యెహోవాసాక్షులు సాధించిన తొమ్మిది విజయాల గురించి కూడా ప్రస్తావించింది. ప్రపంచవ్యాప్త యెహోవాసాక్షుల సమాజం తమ విశ్వాసాన్ని, కార్యకలాపాలను సమర్థించుకోవడానికి ఈ అధికారిక నివేదికలూ మాస్కో ప్రాసిక్యూటర్‌ చేసిన ఆరోపణలు తప్పని చూపించే బలమైన సాక్ష్యాలూ శక్తివంతమైన సాధనాలుగా ఉన్నాయి.

యేసు తన అనుచరులకు ఇలా చెప్పాడు: ‘అన్యజనులకు సాక్ష్యార్థమై నా నిమిత్తము మీరు అధిపతులయొద్దకును రాజులయొద్దకును తేబడుదురు.’ (మత్త. 10:18) గత 15 సంవత్సరాలపాటు సాగిన పోరాటం వల్ల మాస్కోలో, దాని చుట్టుపక్కల ప్రాంతాల్లో యెహోవా నామం గురించి ముందెన్నడూ లేనంత ఎక్కువగా ప్రకటించే అవకాశం మన సహోదరులకు దొరికింది. విచారణలు, కోర్టు కేసులు, అంతర్జాతీయ కోర్టు ఇచ్చిన తీర్పు వల్ల యెహోవాసాక్షులు ఎంతగా ప్రజల దృష్టిలో పడ్డారంటే నిజానికి అవి ఓ ‘సాక్ష్యంగా’ పనిచేసి, “సువార్త మరియెక్కువగా ప్రబలమగుటకే” దోహదపడ్డాయి. (ఫిలి. 1:12) ప్రస్తుతం మాస్కోలోని యెహోవాసాక్షులు ప్రకటనా పని చేస్తున్నప్పుడు చాలామంది గృహస్థులు ఇలా అడుగుతున్నారు: “వారు మిమ్మల్ని నిషేధించారు కదా?” ఆ ప్రశ్న వల్ల వారికి మన నమ్మకాల గురించి మరింత సమాచారాన్ని ఇచ్చే అవకాశం సహోదరులకు దొరుకుతోంది. మనల్ని వ్యతిరేకించే ఏ శక్తీ మనల్ని ప్రకటించకుండా ఆపలేదని స్పష్టమౌతోంది. రష్యాలోని ధైర్యవంతులైన మన ప్రియ సహోదర సహోదరీలను యెహోవా ఆశీర్వదిస్తూ కాపాడాలని మనం ప్రార్థిద్దాం.

[అధస్సూచీలు]

a ఆ ఫిర్యాదు 1998 ఏప్రిల్‌ 20న దాఖలైంది. రెండు వారాల తర్వాత, మే 5న యూరోపియన్‌ కన్వెన్షన్‌ ఆన్‌ హ్యూమన్‌ రైట్స్‌ను అధికారికం చేసేందుకు రష్యా తన ఆమోదాన్ని తెలిపింది.

b “రష్యాలో తన స్థానాన్ని పటిష్ఠం చేసుకోవడానికి ప్రయత్నిస్తూ, యెహోవాసాక్షులు నిషేధించబడాలని ఎంతగానో కోరుకున్న రష్యన్‌ ఆర్థొడాక్స్‌ చర్చి బలంగా ఒత్తిడి చేయడం వల్లే ఆ చట్టం అమల్లోకి వచ్చింది.”—అసోసియేటెడ్‌ ప్రెస్‌, జూన్‌ 25, 1999.

c వింతేమిటంటే సరిగ్గా పది సంవత్సరాల క్రితం అదే రోజున, సోవియట్‌ పరిపాలనలో యెహోవాసాక్షులు మతపరమైన అణచివేతకు గురయ్యారని రష్యా గుర్తించినట్లు ఆదేశం జారీ అయ్యింది.

d ఆ నిషేధం వల్ల, మాస్కోలోని సంఘాలు ఉపయోగించుకుంటున్న చట్టపరమైన రిజిస్ట్రేషన్‌ కొట్టివేయబడింది. దాంతో, పరిచర్య చేయడం మన సహోదరులకు కష్టమౌతుంది అని ఆ వ్యతిరేకులు అనుకున్నారు.

e 2010 నవంబరు 22న యూరోపియన్‌ కోర్ట్‌ ఆఫ్‌ హ్యూమన్‌ రైట్స్‌కు సంబంధించిన గ్రాండ్‌ చాంబర్‌లో అంటే న్యాయస్థానంలో విచారించనక్కరలేని దావాలను పరిశీలించడానికి కోర్టులో ఏర్పాటు చేయబడిన గదిలో ఐదుగురు జడ్జీలు కలిసి, కేసును విచారించమని తమకు రష్యా పెట్టుకున్న అర్జీని నిరాకరించారు. దానివల్ల 2010 జూన్‌ 10న వెలువడిన తీర్పే అంతిమ తీర్పుగా అమలు చేయబడింది.

[6వ పేజీలోని బాక్సు/చిత్రం]

రష్యా తీర్పును ఫ్రాన్స్‌లో ఎందుకు మళ్లీ సమీక్షించారు?

1996 ఫిబ్రవరి 28న యూరోపియన్‌ కన్వెన్షన్‌ ఆన్‌ హ్యూమన్‌ రైట్స్‌ ఒప్పందంపై రష్యా సంతకం చేసింది. (1998 మే 5న ఆ కన్వెన్షన్‌ను అధికారికం చేసేందుకు రష్యా తన ఆమోదాన్ని తెలిపింది.) ఆ ఒప్పందంపై సంతకం చేయడం ద్వారా రష్యా ప్రభుత్వం తమ పౌరులకు ఈ కింది హక్కులు ఉన్నాయని ప్రకటించింది:

‘మత స్వాతంత్ర్యపు హక్కు, ఇంట్లోనూ బహిరంగంగానూ తమ మతాన్ని అనుసరించే హక్కు, కావాలంటే తమ మతాన్ని మార్చుకునే హక్కు.’ —ఆర్టికల్‌ 9.

‘తమ ఆలోచనలను బాధ్యతాయుతంగా చెప్పే, రాసే హక్కు. ఇతరులకు సమాచారాన్ని అందించే హక్కు.’—ఆర్టికల్‌ 10.

‘శాంతియుతమైన కూటాల్లో భాగం వహించే హక్కు.’—ఆర్టికల్‌ 11.

ఆ ఒప్పందపు అతిక్రమణకు గురైన వ్యక్తులు లేదా సంస్థలు న్యాయం కోసం ఆ దేశపు చట్టపరమైన విధానాలను పూర్తిగా ఉపయోగించుకున్న తర్వాత కూడా న్యాయం జరగకపోతే తమ కేసులను ఫ్రాన్స్‌లోని స్ట్రాస్‌బర్గ్‌లో ఉన్న యూరోపియన్‌ కోర్ట్‌ ఆఫ్‌ హ్యూమన్‌ రైట్స్‌కు (పైన చూపించబడింది) తీసుకురావచ్చు. ఆ కోర్టులో 47 మంది జడ్జులు ఉన్నారు అంటే, ఆ ఒప్పందంపై సంతకం చేసిన ప్రతీ దేశం నుండి ఒక జడ్జి అందులో ఉన్నారు. ఆ కోర్టు తీసుకున్న నిర్ణయాలను ఆ 47 దేశాలు తప్పక పాటించాలి.

[8వ పేజీలోని బాక్సు]

కోర్టు తీర్పు

కోర్టు ఇచ్చిన తీర్పులోని మూడు సంక్షిప్త భాగాలు ఇక్కడున్నాయి.

యెహోవాసాక్షులు కుటుంబాలను విచ్ఛిన్నం చేస్తారనేది ఒక ఆరోపణ. దానికి కోర్టు ఇచ్చిన తీర్పు ఇలా ఉంది:

“సొంత మతాన్ని అనుసరించే, ప్రచారం చేసే విషయంలో తమ కుటుంబ సభ్యునికి/సభ్యురాలికి ఉన్న స్వేచ్ఛను మతంపట్ల ఆసక్తిలేని కుటుంబ సభ్యులు గౌరవించలేకపోవడం, దాన్ని తిరస్కరించడమే గొడవలకు అసలు కారణం.”—111వ పేరా.

యెహోవాసాక్షులు “మనసును అదుపు చేస్తారు” అనే ఆరోపణకు కూడా ఎలాంటి ఆధారాలు లేనందువల్ల కోర్టు ఇలా తీర్పునిచ్చింది:

“అలాంటి పద్ధతుల వల్ల మనస్సాక్షిని అనుసరించే హక్కును కోల్పోయిన కనీసం ఒక్క వ్యక్తి పేరును కూడా [రష్యన్‌] కోర్టులు చెప్పలేకపోవడం గమనార్హమని కోర్టు (యూరోపియన్‌ కోర్ట్‌ ఆఫ్‌ హ్యూమన్‌ రైట్స్‌) భావిస్తోంది.”—129వ పేరా.

యెహోవాసాక్షులు రక్తమార్పిడులను నిరాకరించి తమ మత విశ్వాసుల ఆరోగ్యాన్ని పాడుచేస్తారనేది మరో ఆరోపణ. దానికి కోర్టు ఇలా తీర్పునిచ్చింది:

“ఫలానా చికిత్సను అంగీకరించే లేదా నిరాకరించే స్వేచ్ఛ, ప్రత్యామ్నాయ చికిత్సను ఎంచుకునే స్వేచ్ఛ సొంతగా నిర్ణయాలు తీసుకునే సామర్థ్యానికి ఎంతగానో అవసరం. సరిగ్గా ఆలోచించగల యుక్తవయసు రోగికి నిర్ణయం తీసుకునే స్వేచ్ఛ ఉంది. ఉదాహరణకు, చికిత్సను లేదా శస్త్రచికిత్సను అంగీకరించాలో వద్దో మరియు రక్తమార్పిడి చేసుకోవాలో వద్దో నిర్ణయించుకునే స్వేచ్ఛ రోగికి ఉంటుంది.”—136వ పేరా.