కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

చరిత్ర సృష్టించిన కూటం!

చరిత్ర సృష్టించిన కూటం!

చరిత్ర సృష్టించిన కూటం!

“ఈ కూటం ముగిసే సమయానికి, ‘ఇది దైవపరిపాలనా సంబంధంగా చరిత్ర సృష్టించిన వార్షిక కూటం!’ అని మీరనుకుంటారు.” ఆ మాటలతో యెహోవాసాక్షుల పరిపాలక సభ సభ్యుడైన స్టీఫెన్‌ లెట్‌, ఆ కూటానికి వచ్చిన వేలాదిమంది ప్రేక్షకుల్లో ఎంతో కుతూహలం రేపాడు. 2010 అక్టోబరు 2న, వాచ్‌టవర్‌ బైబిల్‌ అండ్‌ ట్రాక్ట్‌ సొసైటీ ఆఫ్‌ పెన్సిల్వేనియా 126వ వార్షిక కూటం జెర్సీ నగరంలోని యెహోవాసాక్షుల సమావేశ హాలులో జరిగింది. ఆ నగరం, అమెరికాలోని న్యూజెర్సీ రాష్ట్రంలో ఉంది. ఆ చారిత్రక కూటంలోని కొన్ని ముఖ్యాంశాలను పరిశీలించండి.

ప్రారంభ ప్రసంగాన్ని సహోదరుడు లెట్‌ ఇచ్చాడు. అందులో ఆయన యెహెజ్కేలు గ్రంథంలో వర్ణించబడిన యెహోవా పరలోక రథం గురించి ఉత్సాహంగా చర్చించాడు. మహిమాన్వితమైన ఆ పెద్ద రథం, పూర్తిగా యెహోవా అధీనంలో ఉన్న ఆయన సంస్థను సూచిస్తోంది. ఆత్మ ప్రాణులతో కూడిన ఆయన సంస్థలోని పరలోక భాగం మెరుపువేగంతో అంటే యెహోవా ఆలోచనలకు తగిన వేగంతో ముందుకు సాగుతోందని సహోదరుడు లెట్‌ అన్నాడు. యెహోవా సంస్థలోని భూభాగం కూడా అలాగే ముందుకు సాగుతోంది. ఇటీవలి సంవత్సరాల్లో దేవుని దృశ్య సంస్థ ఎన్నో సంతోషకరమైన ఫలితాలను సాధించింది. వాటి గురించి సహోదరుడు లెట్‌ మాట్లాడాడు.

ఉదాహరణకు అనేక చిన్న బ్రాంచి కార్యాలయాలను పెద్ద బ్రాంచి కార్యాలయాలతో కలిపేశారు. దానివల్ల, ఆ దేశాల్లో ఒకప్పుడు బెతెల్‌లో సేవచేసిన వాళ్ళు ఇప్పుడు ప్రకటనా పనిపై దృష్టి నిలపగలుగుతారు. దాసుని తరగతికి ప్రాతినిధ్యం వహిస్తున్న పరిపాలక సభ నమ్మకంగానే కాక బుద్ధితో అంటే జ్ఞానంతో కూడా పనిచేసేలా సహాయం చేయమని యెహోవాకు ప్రార్థిస్తూ ఉండమని సహోదరుడు లెట్‌ ప్రేక్షకులను కోరాడు.—మత్త. 24:45-47.

ప్రోత్సాహకరమైన నివేదికలు, సంతోషకరమైన ఇంటర్వ్యూలు

హయిటీలో 2010 జనవరి 12న భూకంపం వచ్చినప్పుడు దాదాపు 3,00,000 మంది చనిపోయారు. ఆ తర్వాత అక్కడి పరిస్థితి గురించి హయిటీ బ్రాంచి కమిటీ సభ్యునిగా సేవచేస్తున్న సహోదరుడు టాబ్‌ హాన్స్‌బర్గర్‌ హృదయాన్ని తాకే నివేదికను ఇచ్చాడు. దేవుడు భక్తిహీనులను నాశనం చేసి మంచివాళ్లను కాపాడాడని అక్కడి మతనాయకులు ప్రజలకు చెబుతూ వచ్చారని ఆయన అన్నాడు. మరోవైపున, భూకంపం వల్ల ఒక జైలు గోడలు కూలినప్పుడు వేలమంది నేరస్థులు పారిపోయారు. కాబట్టి అక్కడి ప్రజల్లో చాలామంది యథార్థ హృదయులు, మనకాలంలో పరిస్థితులు ఎందుకు ఇంత చెడుగా ఉన్నాయనే దాని గురించిన సత్యం తెలుసుకొని ఊరట పొందుతున్నారు. భూకంపంలో తన భార్యను కోల్పోయిన నమ్మకమైన ఒక సహోదరుని మాటలను సహోదరుడు హాన్స్‌బర్గర్‌ ప్రేక్షకులకు చెప్పాడు. “నేను ఇప్పటికీ ఏడుస్తూనేవున్నాను. ఇలా ఎంతకాలం దుఃఖిస్తానో తెలియదు కానీ యెహోవా సంస్థ చూపిస్తున్న ప్రేమను పొందుతున్నందుకు సంతోషిస్తున్నాను. నాకు భవిష్యత్తుపై నిరీక్షణ ఉంది, దాన్ని ఇతరులతో పంచుకోవాలని గట్టిగా నిర్ణయించుకున్నాను” అని ఆ సహోదరుడు అన్నాడని హాన్స్‌బర్గర్‌ చెప్పాడు.

ఇప్పుడు బ్రూక్లిన్‌ బెతెల్‌లో సేవచేస్తున్న సహోదరుడు మార్క్‌ సాండర్సన్‌ ఫిలిప్పీన్స్‌ దేశంపై ఒక నివేదికను ఇచ్చాడు. అంతకుముందు ఫిలిప్పీన్స్‌ బ్రాంచి కమిటీ సభ్యునిగా సేవచేసిన ఆయన, గత 32 సంవత్సరాల్లో అక్కడ అంచెలంచెలుగా పెరుగుతూ వచ్చిన రాజ్యప్రచారకుల సంఖ్య గురించి, రాజ్య ప్రచారకుల సంఖ్యకన్నా బైబిలు అధ్యయనాల సంఖ్య ఎంతో ఎక్కువగా ఉండడం గురించి మాట్లాడుతున్నప్పుడు ఆయన ముఖం వెలిగిపోయింది. ఆయన మీగెల్‌ అనే సహోదరుని గురించి మాట్లాడాడు. మీగెల్‌ వాళ్ల మనవడిని ఒక వ్యక్తి హత్య చేశాడు. హత్య చేసిన వ్యక్తికి జైలు శిక్షపడేలా చేయడానికి మీగెల్‌ చాలా ప్రయత్నించాడు. తర్వాత మీగెల్‌ ఆ జైల్లో ప్రకటిస్తున్నప్పుడు ఆ హంతకుణ్ణి కలిశాడు. అతణ్ణి చూడగానే ఎంతో కోపం వచ్చినా మీగెల్‌ అతణ్ణి మృదువుగా, దయగా పలకరించాడు. కొంతకాలానికి మీగెల్‌ అతనితో బైబిలు అధ్యయనం చేయడంతో అతను చక్కగా స్పందించి యెహోవాను ప్రేమించడం మొదలుపెట్టాడు. ఇప్పుడు అతను బాప్తిస్మం తీసుకున్నాడు. అంతేకాక మీగెల్‌ అతనికి మంచి స్నేహితుడు. ఇప్పుడు మీగెల్‌ తన కొత్త సహోదరుణ్ణి వీలైనంత త్వరగా జైలు నుండి విడిపించడానికి ప్రయత్నిస్తున్నాడు. a

కార్యక్రమంలోని తర్వాతి భాగాన్ని దైవపరిపాలనా పాఠశాలల విభాగంలో ఉపదేశకునిగా పనిచేస్తున్న సహోదరుడు మార్క్‌ నూమర్‌ నిర్వహించాడు. దానిలో ఆయన ముగ్గురు దంపతులను అంటే ఆలిక్స్‌ రైన్‌మ్యుయెల్లర్‌ను ఆయన భార్య సేర్రాను, డేవిడ్‌ షేఫర్‌ను ఆయన భార్య క్రిస్టను, రాబర్ట్‌ సిరాంకోను ఆయన భార్య కెట్రను ఇంటర్వ్యూ చేశాడు. పబ్లిషింగ్‌ కమిటీకి సహాయకునిగా పనిచేస్తున్న సహోదరుడు ఆలిక్స్‌ రైన్‌మ్యుయెల్లర్‌ 15 ఏళ్ల వయసులోనే కెనడాలో పయినీరు సేవచేస్తూ సత్యాన్ని ఎలా సొంతం చేసుకున్నాడో చెప్పాడు. అప్పట్లో ఆయన తరచూ ఒంటరిగా ప్రకటనా పనికి వెళ్లేవాడు. బెతెల్‌లో ఆయనను ఎక్కువగా ప్రభావితం చేసిన వ్యక్తులెవరని అడిగినప్పుడు ఆయన ముగ్గురు సహోదరుల పేర్లు చెప్పి, తాను ఆధ్యాత్మికంగా ఎదగడానికి వారెలా సహాయం చేశారో చెప్పాడు. ఆయన భార్య సేర్రా ఒక సహోదరితో తనకున్న స్నేహం గురించి మాట్లాడింది. ఆ సహోదరి చైనాలో తన విశ్వాసం కోసం దశాబ్దాలపాటు జైలు శిక్షను అనుభవించింది. వ్యక్తిగత ప్రార్థన ద్వారా యెహోవాపై ఆధారపడడం నేర్చుకున్నానని సేర్రా చెప్పింది.

టీచింగ్‌ కమిటీకి సహాయకునిగా పనిచేస్తున్న సహోదరుడు డేవిడ్‌ షేఫర్‌, వాళ్ల అమ్మ చూపించిన బలమైన విశ్వాసాన్ని కొనియాడాడు. అంతేకాక, తాను యౌవనుడిగా ఉన్నప్పుడు కొంతమంది సహోదరులు కట్టెలుకొట్టే పనిచేసి సహాయ పయినీరు సేవ చేసేలా తనకు సహాయం చేశారని ఆయన చెప్పాడు. ఎంతోకాలంగా బెతెల్‌ సేవ చేస్తూ యేసు ఆజ్ఞాపించినట్లు “మిక్కిలి కొంచెములో నమ్మకముగా” ఉన్న కొందరు తనపై చూపించిన ప్రభావం గురించి ఆయన భార్య క్రిస్ట ఎంతో ఇష్టంగా మాట్లాడింది.—లూకా 16:10.

రైటింగ్‌ కమిటీకి సహాయకునిగా ఉన్న రాబర్ట్‌ సిరాంకో అభిషిక్తులైన తన అమ్మమ్మ, నానమ్మ, ఇద్దరు తాతయ్యలను గుర్తుచేసుకున్నాడు. వారు అక్కడికి వచ్చి స్థిరపడిన హంగేరియన్లు. ఆయన బాలుడిగా ఉన్నప్పుడు 1950లలో జరిగిన పెద్ద సమావేశాలు ఆయనను ఎంతగానో ఆకట్టుకున్నాయి. అంతేకాక, యెహోవా సంస్థ తాను సహవసిస్తున్న సంఘంకన్నా చాలా పెద్దదని ఆయన అర్థం చేసుకున్నాడు. ఆయన భార్య కెట్ర మాట్లాడుతూ, మతభ్రష్టత్వంలో మరితర సమస్యల్లో చిక్కుకున్న ఒక సంఘంలో పయినీరుగా సేవ చేసినప్పుడు యెహోవాకు, ఆయన సంస్థకు నమ్మకంగా ఉండడం గురించి తాను నేర్చుకున్న విషయాలను చెప్పింది. ఆమె ఆ పరిస్థితిని తాళుకొన్న కొంతకాలానికి, హృదయాన్ని స్పృశించే ఐక్యత ఉన్న మరో సంఘంలో ప్రత్యేక పయినీరుగా నియమించబడింది.

ఆ తర్వాత సహోదరుడు మాన్‌ఫ్రేట్‌ టోనాక్‌ ఇతియోపియా దేశంపై ఒక నివేదికను ఇచ్చాడు. ఆ దేశం బైబిలు కాలం నాటిది. ఇప్పుడు అక్కడ 9,000 కన్నా ఎక్కువమంది రాజ్య ప్రచారకులు ఉన్నారు. వారిలో చాలామంది, రాజధాని పట్టణమైన ఆడిస్‌ ఆబబలో లేదా దానికి దగ్గర్లో ఉంటారు. కాబట్టి మారుమూల ప్రాంతాల్లో సువార్త ప్రకటించడానికి ఎక్కువమంది ప్రచారకులు అవసరం. దానికోసం వేరే దేశాల్లో నివసిస్తున్న ఇతియోపియన్‌ సాక్షులకు ఆ దేశాన్ని సందర్శించమని ఆహ్వానం ఇవ్వబడినప్పుడు చాలామంది వచ్చి స్థానిక సాక్షులను ప్రోత్సహించారు, సువార్తకు స్పందించే ప్రజలను కనుగొన్నారు.

రష్యాలోని యెహోవాసాక్షుల మీద, వారి న్యాయపరమైన పోరాటాల మీద ఇవ్వబడిన గోష్ఠి ఆ రోజు కార్యక్రమంలో ఒక ముఖ్యాంశం. రష్యాలో బ్రాంచి కమిటీ సభ్యునిగా సేవచేస్తున్న సహోదరుడు ఆలిస్‌ బర్గ్‌డాల్‌ రష్యాలోని సాక్షులు ముఖ్యంగా, మాస్కోలోని సహోదరులు ఎదుర్కొన్న హింస గురించిన చరిత్రను వివరించాడు. ఆ తర్వాత అమెరికా బ్రాంచి కార్యాలయంలోని న్యాయ విభాగంలో పనిచేస్తున్న సహోదరుడు ఫిలిప్‌ బ్రమ్లీ మాట్లాడాడు. సాక్షుల మీద మోపబడిన తొమ్మిది ఆరోపణలను యూరోపియన్‌ కోర్ట్‌ ఆఫ్‌ హ్యూమన్‌ రైట్స్‌ (ECHR) పరిశీలించడంతో గత కొన్ని నెలల్లో వచ్చిన సంతోషకరమైన ఫలితాల గురించి ఆయన చెప్పాడు. ఆ తొమ్మిది ఆరోపణల్లో దేనికీ సరైన ఆధారం లేదని కోర్టు ఏకగ్రీవంగా అంగీకరించింది. అంతేకాక, ఆ ఆరోపణలు ఎందుకు తప్పో వివరించేందుకు కోర్టు ప్రత్యేక ప్రయత్నం చేసింది. వాటి ఫలితాలు ఎలా ఉంటాయో ప్రస్తుతం మనకు తెలియకపోయినా, ఆ కోర్టు ఇచ్చిన వివరణ ఇతర దేశాల్లోని కేసులకు సహాయకరంగా ఉంటుందని సహోదరుడు బ్రమ్లీ ఆశాభావాన్ని వ్యక్తం చేశాడు.

ఆ శుభవార్త తర్వాత, ఫ్రాన్స్‌ దేశంలోని ప్రభుత్వానికీ యెహోవాసాక్షులకూ మధ్య ఎంతోకాలంగా సాగుతున్న పన్నులకు సంబంధించిన కేసును విచారించేందుకు యూరోపియన్‌ కోర్ట్‌ ఆఫ్‌ హ్యూమన్‌ రైట్స్‌ అంగీకరించిందని సహోదరుడు లెట్‌ ప్రకటించాడు. అందరూ ఎంతగానో గౌరవించే ఈ కోర్టు తన దగ్గరికి వచ్చిన కేసుల్లో కొన్నింటినే స్వీకరిస్తుంది. ఇప్పటివరకూ ECHR యెహోవాసాక్షులకు సంబంధించిన 39 కేసులను విచారించింది. వాటిలో 37 కేసుల్లో మనకు అనుకూలంగా తీర్పునిచ్చింది. కాబట్టి పన్నులకు సంబంధించిన ఆ కేసు గురించి కూడా యెహోవాకు ప్రార్థించమని దేవుని ప్రజలందరినీ సహోదరుడు లెట్‌ ప్రోత్సహించాడు.

సహోదరుడు రిచర్డ్‌ మొర్లన్‌ చివరి నివేదికను ఇచ్చాడు. ఆయన, క్షేత్రంలో సేవచేస్తూ సంఘ పెద్దల కోసం ఏర్పాటు చేయబడిన పాఠశాలల్లో ఉపదేశకునిగా పనిచేస్తున్నాడు. ఆ పాఠశాల గురించి, దానికి హాజరైన సంఘ పెద్దలు చాలా కృతజ్ఞతను వ్యక్తం చేశారని ఆయన ఎంతో ఉత్సాహంగా చెప్పాడు.

పరిపాలక సభ సభ్యులు ఇచ్చిన ఇతర ప్రసంగాలు

పరిపాలక సభ సభ్యుడైన గయ్‌ పియర్స్‌ ‘యెహోవా నామాన్ని ఆశ్రయించండి’ అనే 2011 వార్షిక వచనంపై ఆధారపడిన ప్రసంగాన్ని హృదయపూర్వకంగా ఇచ్చాడు. (జెఫ. 3:12) ఇది యెహోవా సేవకులకు ఎన్నో రకాలుగా సంతోషకరమైన సమయమే అయినప్పటికీ ఎంతో గంభీరంగా ఆలోచించాల్సిన సమయం కూడా అని ఆయన అన్నాడు. యెహోవా మహాదినం సమీపిస్తున్నా ప్రజలు ఇంకా అబద్ధమతాన్ని, రాజకీయ సంస్థలను, వస్తుసంపదలను, అవాస్తవికమైన వాటిని, మరితర విషయాలను ఆశ్రయిస్తున్నారు. నిజమైన ఆశ్రయాన్ని పొందాలంటే మనందరం యెహోవా నామాన్ని ఉపయోగించాలి. అంటే, మనం ఆయన గురించి తెలుసుకోవాలి, ఆయనను ప్రగాఢంగా గౌరవించాలి, నమ్మాలి, మనకున్న సమస్తంతో ఆయనను ప్రేమించాలి.

తర్వాత, పరిపాలక సభ సభ్యుడైన డేవిడ్‌ స్ప్లేన్‌ “మీరు దేవుని విశ్రాంతిలోకి ప్రవేశించారా?” అనే అంశాన్ని ఆలోచింపజేసే విధంగా, హృదయపూర్వకంగా చర్చించాడు. దేవుని విశ్రాంతి అంటే ఏ పనీ చేయకుండా విశ్రాంతి తీసుకునే సమయం కాదని ఆయన చెప్పాడు. ఎందుకంటే తాను సృష్టించిన వాటి విషయంలో తనకున్న ఉద్దేశాన్ని పూర్తిగా నెరవేర్చేలా యెహోవా, ఆయన కుమారుడైన యేసు సూచనార్థకమైన విశ్రాంతి దినంలో ‘పనిచేస్తూనే’ ఉన్నారనీ ఆ సహోదరుడు వివరించాడు. (యోహా. 5:17) అయితే, మనం దేవుని విశ్రాంతిలోకి ఎలా ప్రవేశించవచ్చు? అందుకోసం మనం పాపం చేయకుండా, మనల్ని మనం సమర్థించుకునే పనులు చేయకుండా ఉండాలి. అంతేకాక మనం విశ్వాసాన్ని చూపించాలి, దేవుని ఉద్దేశాన్ని మనసులో ఉంచుకొని ఎల్లప్పుడూ దానికి అనుగుణంగా జీవించేందుకు శాయశక్తులా కృషిచేయాలి. కొన్నిసార్లు అది పెద్ద సవాలుగా ఉండవచ్చు, అయినప్పటికీ మనం యెహోవా సంస్థ ఇస్తున్న ఉపదేశాన్ని అంగీకరించాలి, దాని నిర్దేశాన్ని పాటించాలి. దేవుని విశ్రాంతిలోకి ప్రవేశించేందుకు చేయగలిగినదంతా చేయమని సహోదరుడు స్ప్లేన్‌ ప్రేక్షకులను ప్రోత్సహించాడు.

“మనం దేని కోసం ఎదురుచూస్తున్నాం?” అనే ముగింపు ప్రసంగాన్ని పరిపాలక సభ సభ్యుడైన ఆంథనీ మారిస్‌ ఇచ్చాడు. అత్యవసర భావంతో, ఆప్యాయతతో ఒక తండ్రిలా మాట్లాడుతూ, విశ్వాసులందరూ ఆశగా ఎదురుచూస్తున్న ప్రవచనాల నెరవేర్పును ఆయన గుర్తుచేశాడు. వాటిలో, “నెమ్మదిగా ఉన్నది, భయమేమియులేదు” అనే కేక మరియు అబద్ధమత నాశనం ఉన్నాయి. (1 థెస్స. 5:2, 3; ప్రక. 17:15-17) అలాంటి ప్రవచనాల నెరవేర్పుతో ఏమాత్రం సంబంధంలేని ప్రపంచ సంఘటనలను చూసి, “ఇదే హార్‌మెగిద్దోను అయ్యుంటుంది” అని అనుకోకూడదని ఆయన హెచ్చరించాడు. మీకా 7:7లో ప్రస్తావించబడినట్లు సంతోషంగా, ఓపిగ్గా ఎదురుచూసే వైఖరిని అలవర్చుకోమని ఆయన ప్రోత్సహించాడు. అంతేకాక, యుద్ధం తీవ్రమైనప్పుడు సైనికులు ఒకరికొకరు దగ్గరగా ఉంటూ కలిసి యుద్ధం చేసినట్లే పరిపాలక సభతో కలిసి సన్నిహితంగా పనిచేయమని ఆయన అందరినీ ప్రోత్సహించాడు. ‘యెహోవాకొరకు కనిపెట్టువారలారా, మీరందరూ నిబ్బరంగా ఉండండి’ అని ఆయన అన్నాడు.—కీర్త. 31:24.

చివర్లో, చరిత్ర సృష్టించే కొన్ని ప్రకటనలు చేయబడ్డాయి. ఆంగ్లం అంతగా రాని వారికోసం సరళమైన ఆంగ్ల భాషలో కావలికోట అధ్యయన ప్రతిని ప్రవేశపెడుతున్నామని పరిపాలక సభ సభ్యుడైన సహోదరుడు జెఫ్రీ జాక్సన్‌ ప్రకటించాడు. అది ఎంతమేర ఉపయోగపడుతుందో పరీక్షించి చూస్తామని చెప్పాడు. అలాగే, అమెరికాలో సేవచేస్తున్న జిల్లా పర్యవేక్షకులకు, వారి భార్యలకు కాపరి సందర్శనాలను పరిపాలక సభ ఏర్పాటు చేయబోతోందని సహోదరుడు స్టీఫెన్‌ లెట్‌ ప్రకటించాడు. పరిచర్య శిక్షణా పాఠశాల ఇప్పటినుండి ఒంటరి సహోదరుల కోసం బైబిలు పాఠశాల అని పిలువబడుతుందనీ త్వరలోనే దానితోపాటు క్రైస్తవ దంపతుల కోసం బైబిలు పాఠశాల మొదలౌతుందనీ ఆయన చెప్పాడు. యెహోవా సంస్థలో మరింతగా సేవ చేయడానికి వీలుగా దంపతులకు ఆ పాఠశాలలో అదనపు శిక్షణ దొరుకుతుంది. అంతేకాక, ఇప్పటి నుండి ప్యాటర్సన్‌లో ప్రతీ సంవత్సరం ప్రయాణ పర్యవేక్షకులకు వారి భార్యలకు జరిగే పాఠశాలను, అలాగే బ్రాంచి కమిటీ సభ్యులకు వారి భార్యలకు జరిగే పాఠశాలను ఇప్పటినుండి సంవత్సరానికి రెండు తరగతులకు పెంచుతామని ప్రకటించాడు. వాటికి ఇంతకుముందు హాజరైనవారికి రెండవసారి కూడా హాజరయ్యే అవకాశం దొరుకుతుంది.

ఎన్నో సంవత్సరాలపాటు పరిపాలక సభ సభ్యునిగా సేవచేసిన 97 ఏళ్ల సహోదరుడు జాన్‌ ఈ. బార్‌ వినయంగా, హృదయపూర్వకంగా చేసిన ప్రార్థనతో ఆ కూటం ముగిసింది. b అది నిజంగానే చరిత్ర సృష్టించిన రోజని హాజరైనవారంతా అనుకున్నారు.

[అధస్సూచీలు]

b సహోదరుడు జాన్‌ ఈ. బార్‌ 2010 డిసెంబరు 4న తన భూజీవితాన్ని ముగించారు.

[19వ పేజీలోని బ్లర్బ్‌]

హాజరైన వారందరూ ఇంటర్వ్యూలను ఇష్టపడ్డారు

[20వ పేజీలోని బ్లర్బ్‌]

ఇతియోపియాలో ప్రకటనా పనిని యెహోవా ఆశీర్వదించాడు