కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

పాఠకుల ప్రశ్నలు

పాఠకుల ప్రశ్నలు

పాఠకుల ప్రశ్నలు

హెబ్రీ లేఖనాల్లో మెస్సీయకు సంబంధించిన ప్రవచనాలు ఖచ్చితంగా ఎన్ని ఉన్నాయో చెప్పడం సాధ్యమేనా?

హెబ్రీ లేఖనాలను జాగ్రత్తగా అధ్యయనం చేస్తే, యేసుక్రీస్తులో నెరవేరిన ఎన్నో ప్రవచనాలను గుర్తించగలుగుతాం. ఆ ప్రవచనాలు మెస్సీయ జననం, ఆయన ఎప్పుడు వస్తాడు, ఆయన ఏమి చేస్తాడు, ప్రజలు ఆయనతో ఎలా వ్యవహరిస్తారు, యెహోవా దేవుని ఏర్పాటులో ఆయన స్థానం ఏమిటి అనేవాటి గురించి వివరంగా ముందే తెలియజేశాయి. వాటన్నిటిని ఒక దగ్గర పెట్టి చూస్తే యేసే మెస్సీయ అని గుర్తించవచ్చు. అయితే, హెబ్రీ లేఖనాల్లో మెస్సీయకు సంబంధించిన ప్రవచనాలు ఖచ్చితంగా ఎన్ని ఉన్నాయనేది నిర్ధారించాలనుకుంటే కాస్త జాగ్రత్త వహించాలి.

ఏది మెస్సీయకు సంబంధించిన ప్రవచనం, ఏది కాదు అనే విషయంలో అందరికీ ఏకాభిప్రాయం లేదు. ద లైఫ్‌ అండ్‌ టైమ్స్‌ ఆఫ్‌ జీసస్‌ ద మెస్సాయ అనే పుస్తకంలో ఆల్‌ఫ్రేట్‌ ఎడర్‌షైమ్‌, ప్రాచీన రబ్బీల రాతలు హెబ్రీ లేఖనాల్లోని 456 భాగాలను మెస్సీయకు సంబంధించిన ప్రవచనాలుగా వర్గీకరించిందని, అయితే వాటిలో అనేకం మెస్సీయ గురించి నిర్దిష్టంగా చెప్పడం లేదని అన్నాడు. ఈ 456 భాగాలను క్షుణ్ణంగా పరిశీలిస్తే, వాటిలో కొన్ని నిజానికి యేసుక్రీస్తు గురించి ప్రవచిస్తున్నాయా లేదా అనే విషయంలో ప్రశ్నలు తలెత్తుతాయి. ఉదాహరణకు, యూదులు ఆదికాండము 8:11 ను మెస్సీయకు సంబంధించిన ప్రవచనంగా పరిగణించారని ఎడర్‌షైమ్‌ చెప్పాడు. “పావురం తీసుకొచ్చిన ఓలీవ ఆకు మెస్సీయ పర్వతం మీదున్న ఓలీవ చెట్టుది” అని వాళ్లు నమ్మేవారు. ఆయన నిర్గమకాండము 12:42 గురించి కూడా ప్రస్తావించాడు. ఈ వచనాన్ని యూదులు తప్పుగా ఎలా అర్థం చేసుకున్నారో వివరిస్తూ, “మోషే అరణ్యం నుండి వచ్చినట్లు మెస్సీయ రోము నుండి వస్తాడు” అని ఆయన రాశాడు. ఈ రెండు వాక్యాలు, వాటి తప్పుడు వివరణలు యేసుక్రీస్తుకు ఎలా వర్తిస్తాయనే దాని గురించి చాలామంది పండితులు, ఇతరులు వివరించలేకపోతున్నారు.

యేసుక్రీస్తులో నిజంగా నెరవేరిన ప్రవచనాలను మాత్రమే తీసుకున్నా, అవి ఖచ్చితంగా ఎన్ని అనేది తెలుసుకోవడం కష్టం. ఉదాహరణకు, యెషయా 53వ అధ్యాయాన్ని తీసుకుందాం. దానిలో మెస్సీయ గురించిన ప్రవచన అంశాలు ఎన్నో ఉన్నాయి. యెషయా 53:2-7 వచనాల్లో ఇలా ఉంది, ‘ఆయనకు సురూపము లేదు. ఆయన తృణీకరింపబడి, మనుష్యుల వలన విసర్జింపబడ్డాడు. ఆయన మన రోగాలను భరించాడు. మన అతిక్రమ క్రియలనుబట్టి ఆయన గాయపరచబడ్డాడు. ఆయన గొర్రెపిల్లలా వధకు తేబడ్డాడు.’ యెషయా 53వ అధ్యాయంలో ఉన్న ఈ భాగమంతటినీ ఒకే ప్రవచనంగా పరిగణించాలా లేక ఒక్కో అంశాన్ని ఒక్కో ప్రవచనంగా పరిగణించాలా?

యెషయా 11:1 ని కూడా పరిశీలించండి. అక్కడ ఇలా ఉంది, “యెష్షయి మొద్దు నుండి చిగురు పుట్టును. వాని వేరుల నుండి అంకురము ఎదిగి ఫలించును.” 10వ వచనంలో ఈ ప్రవచనం మళ్లీ కనిపిస్తుంది, అక్కడ కూడా అలాంటి పదాలే ఉన్నాయి. ఈ రెండు వచనాలను, రెండు వేర్వేరు ప్రవచనాలుగా పరిగణించాలా లేక ఒకే ప్రవచనం మళ్ళీ చెప్పబడినట్లు పరిగణించాలా? యెషయా 53వ అధ్యాయంలోని, 11వ అధ్యాయంలోని ప్రవచనాలను లెక్కపెట్టే తీరులో తేడా ఉండవచ్చు కాబట్టి మెస్సీయకు సంబంధించి ఖచ్చితంగా ఇన్ని ప్రవచనాలు ఉన్నాయని చెప్పడం కష్టం.

కాబట్టి, హెబ్రీ లేఖనాల్లో మెస్సీయకు సంబంధించిన ప్రవచనాలు ఖచ్చితంగా ఎన్ని ఉన్నాయో తెలుసుకోవడం అంత ప్రాముఖ్యం కాదు. యేసుకు సంబంధించిన ఎన్నో ప్రవచనాల, వాటి నెరవేర్పుల గురించిన పట్టికలను యెహోవా సంస్థ ప్రచురించింది. a వ్యక్తిగత, కుటుంబ అధ్యయనంలో, అలాగే పరిచర్యలో ఈ పట్టికలు మనకు సహాయం చేయడమే కాదు మన విశ్వాసాన్ని కూడా బలపరుస్తాయి. అంతేకాదు, మెస్సీయకు సంబంధించిన ఎన్నో ప్రవచనాలు, అవి ఎన్నైనా సరే, అవి యేసే క్రీస్తు అని లేదా మెస్సీయ అని గట్టి రుజువును మనకు ఇస్తాయి.

[అధస్సూచి]

a యెషయా ప్రవచనం—సర్వమానవాళికి వెలుగు, 2వ సంపుటి, 212వ పేజీ; బైబిలు నిజంగా ఏమి బోధిస్తోంది? 200వ పేజీ.