కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

భూవ్యాప్తంగా అందుబాటులోవున్న ఇంటర్నెట్‌ను జ్ఞానయుక్తంగా ఎలా ఉపయోగించుకోవచ్చు?

భూవ్యాప్తంగా అందుబాటులోవున్న ఇంటర్నెట్‌ను జ్ఞానయుక్తంగా ఎలా ఉపయోగించుకోవచ్చు?

భూవ్యాప్తంగా అందుబాటులోవున్న ఇంటర్నెట్‌ను జ్ఞానయుక్తంగా ఎలా ఉపయోగించుకోవచ్చు?

శతాబ్దాల క్రితం ముద్రణా యంత్రాన్ని కనిపెట్టినప్పుడు సమాచారాన్ని ఒకరికొకరు చేరవేసుకునే విధానంలో మార్పు వచ్చింది. ఆధునిక కాలంలో ఇంటర్నెట్‌ను కనిపెట్టినందువల్ల కూడా ఎంతో మార్పు వచ్చింది. ఇది భూవ్యాప్తంగా సమాచారాన్ని చేరవేసేందుకు ఉపయోగపడే ఉపకరణం. దీనిలో బ్రౌసింగ్‌ చేస్తున్నప్పుడు ఎన్నో విషయాలకు సంబంధించిన వాస్తవాలను, గణాంకాలను, అభిప్రాయాలను తెలుసుకోవచ్చు.

మన సృష్టికర్త మనకిచ్చిన అద్భుతమైన వరం, సంభాషించే సామర్థ్యం. దీనివల్ల, ఒకరితో ఒకరు తమ ఆలోచనలను చెప్పుకోవచ్చు, సమాచారాన్ని ఇతరులతో పంచుకోవచ్చు. మానవ కుటుంబంతో మొట్టమొదటిగా సంభాషించింది యెహోవానే. సంతోషకరమైన జీవితాన్ని ఎలా గడపవచ్చనే విషయంలో ఆయన ఆ సమయంలోనే స్పష్టమైన సమాచారమిచ్చాడు. (ఆది. 1:28-30) అయితే, మానవ చరిత్ర ఆరంభంలో జరిగినదాన్ని బట్టి స్పష్టమౌతున్నట్లు, సంభాషించే వరాన్ని దుర్వినియోగం చేసే అవకాశముంది. సాతాను హవ్వకు పూర్తిగా తప్పుడు సమాచారమిచ్చాడు. సాతాను చెప్పింది హవ్వ నమ్మి ఆ విషయాన్ని ఆదాముకు కూడా చెప్పింది, అందుకే మానవులందరూ ఆదాము వల్ల కష్టాల పాలయ్యారు.—ఆది. 3:1-6; రోమా. 5:12.

మరి ఇంటర్నెట్‌ వాడకం గురించి ఏమి చెప్పవచ్చు? అది విలువైన సమాచారం అందిస్తుంది, సమయం ఆదా చేస్తుంది, మనకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. అయితే దాని వాడకం వల్ల ప్రమాదం కూడా ఉంది, అది మనకు తప్పుడు సమాచారం అందిస్తుంది, మన సమయాన్నంతా హరించివేస్తుంది, మనం నైతికంగా చెడిపోయేలా చేస్తుంది. భూవ్యాప్తంగా అందుబాటులోవున్న దీన్ని మనకు ప్రయోజనకరంగా ఉండేలా ఎలా ఉపయోగించుకోవచ్చో ఇప్పుడు చూద్దాం.

సమాచారం—నమ్మదగినదా, కాదా?

ఇంటర్నెట్‌లోని సమాచారమంతా మంచిదేనని, ప్రయోజనకరమైనదేనని ఎప్పుడూ అనుకోవద్దు. ఇంటర్నెట్‌ సర్చ్‌ ఇంజిన్లను, మార్కెట్లో ఆకు కూరలు అమ్మే వాళ్లతో పోల్చవచ్చు. మనం కొనే ఆ ఆకు కూరల్లో కొన్ని కలుపు మొక్కలు కూడా ఉండవచ్చు. ఒక్కొక్కటి జాగ్రత్తగా పరిశీలించి కలుపు మొక్కలు తీసేయకుండానే మొత్తం వండేస్తామా? ఖచ్చితంగా అలా చేయం! ఇంటర్నెట్‌ సర్చ్‌ ఇంజిన్లు ఎన్నో కంప్యూటర్లను ఉపయోగించి కోటానుకోట్ల వెబ్‌ పేజీల నుండి మంచి సమాచారమే కాదు పనికిమాలిన సమాచారం కూడా సేకరించి ఒక దగ్గరపెడతాయి. కాబట్టి వివేచన ఉపయోగిస్తే, మనం ఏది మంచిదో ఏది పనికిమాలినదో గుర్తించగలుగుతాం, లేకపోతే తప్పుడు సమాచారంతో మనం మన మనసులను విషపూరితం చేసుకునే అవకాశముంది.

1993లో, ప్రఖ్యాతిగాంచిన ఓ పత్రికలో ఒక కార్టూన్‌ వచ్చింది, దానిలో రెండు కుక్కలు కంప్యూటరు ముందు ఉంటాయి. వాటిలో ఒక కుక్క మరో కుక్కతో, “ఇంటర్నెట్‌లో నువ్వు కుక్కవని ఎవరికీ తెలియదు” అని వివరిస్తుంది. పూర్వం సాతాను సర్పం ద్వారా హవ్వతో “చాట్‌” చేస్తూ దేవునిలా అవుతావని ఆమెతో చెప్పాడు. ఇప్పుడు ఇంటర్నెట్‌ కనెక్షన్‌తో, ఎవరైనా తమ పేర్లు కూడా చెప్పకుండానే అంతా తెలిసిన నిపుణుల్లా నాటకమాడవచ్చు. ఐడియాలను, సమాచారాన్ని, చిత్రాలను, సలహాలను ఇంటర్నెట్‌లో పెట్టే విషయంలో నిబంధనలంటూ ఏవీ లేవు.

ఇంటర్నెట్‌ ఉపయోగిస్తున్నప్పుడు హవ్వలా తెలివితక్కువగా ఉండకండి. ఏదైనా సమాచారాన్ని వెంటనే నమ్మేయకుండా ఇలా ప్రశ్నించుకోండి: (1) దీనిని ఎవరు రాశారు? రాసిన వాళ్లకు అలా రాసే అధికారముందా, దానిలో వాళ్లు ఏదైనా శిక్షణ పొందారా? (2) దాన్ని అసలు ఎందుకు రాశారు? అలా రాయడానికి వాళ్లను ఏది ప్రేరేపించింది? పక్షపాత వైఖరితో రాశారా? (3) ఆ సమాచారం ఎక్కడ నుండి సేకరించారు? పరిశీలించడానికి ఏమైనా ఆధారాలిచ్చారా? (4) సమాచారం ప్రస్తుతం చలామణిలో ఉన్నదేనా? మొదటి శతాబ్దంలో అపొస్తలుడైన పౌలు తిమోతికి ఇచ్చిన ఉపదేశం నేడు కూడా ఎంతో ఉపయోగపడుతుంది. ఆయన ఇలా రాశాడు: ‘నీకు అప్పగించబడిన దాన్ని కాపాడి, అపవిత్రమైన వట్టి మాటలకు, జ్ఞానమని అబద్ధంగా చెప్పబడిన విపరీతవాదాలకు దూరంగా ఉండు.’—1 తిమో. 6:20.

సమయం ఆదా అవుతుందా, వృథా అవుతుందా?

ఇంటర్నెట్‌ను జ్ఞానవంతంగా ఉపయోగిస్తే మన సమయం, శక్తి, వనరులు ఖచ్చితంగా ఆదా అవుతాయి. ఇంట్లో నుండి బయటికి వెళ్ళకుండానే ఏదైనా కొనుక్కోవచ్చు. ధరలు పోల్చి చూసుకొని డబ్బు ఆదా చేసుకోవచ్చు. ఆన్‌లైన్‌ బ్యాంకింగ్‌ వల్ల చాలామందికి ఎన్నో పనులు చేసుకోవడం సులువైంది. ఇంట్లో నుండే ఏ సమయంలోనైనా ఆర్థిక వ్యవహారాలు చూసుకోవచ్చు. మనం ఎక్కడికైనా వెళ్లాలనుకుంటే ఇంటర్నెట్‌ ద్వారా మనకు అనువుగా ఉండే విధంగా, డబ్బు ఆదా అయ్యే విధంగా ప్రయాణాలు ప్రణాళిక వేసుకుని, అవసరమైన బుకింగులు చేసుకోవచ్చు. ఎక్కువ కష్టపడకుండానే మనం చేరుకోవాల్సిన స్థలానికి చేరుకోవడానికి వివిధ మార్గాలు, అవసరమైన ఫోన్‌ నంబర్లు, చిరునామాలు చూసుకోవచ్చు. ప్రపంచవ్యాప్తంగా యెహోవాసాక్షుల బ్రాంచి కార్యాలయాలు సమయం, సిబ్బంది, వనరులు ఆదా చేయడానికి ఈ సేవల్లో చాలా వాటిని ఉపయోగించుకుంటున్నాయి.

అయితే, ఇంటర్నెట్‌ వల్ల చెడు కూడా జరిగే అవకాశముంది. అది ఎంతో సమయం హరించివేయగలదు. కొంతమందికి అది సహాయకరమైన ఉపకరణంగా కాక ఆనందాన్నిచ్చే ఆటవస్తువుగా తయారైంది. వాళ్లు కంప్యూటర్‌ గేమ్స్‌ ఆడడంలో, ఈ-మెయిల్స్‌ పంపించడంలో, షాపింగ్‌, చాటింగ్‌, సర్చింగ్‌, సర్ఫింగ్‌ చేయడంలో ఎంతో సమయం గడుపుతున్నారు. చివరకు వాళ్లు, చాలా ప్రాముఖ్యమైన విషయాలను అంటే కుటుంబాన్ని, స్నేహితులను, సంఘాన్ని నిర్లక్ష్యం చేయడం మొదలుపెట్టవచ్చు. ఇంటర్నెట్‌ ఉపయోగించడం ఒక వ్యసనంలా కూడా మారే ప్రమాదం ఉంది. ఉదాహరణకు, 2010లో ప్రచురించబడిన ఒక అంచనా ప్రకారం, కొరియాలోని యౌవనస్థుల్లో 18.4 శాతం మంది ఇంటర్నెట్‌ వ్యసనానికి బానిసలయ్యారు. “తమ భర్తలు ఈ వ్యసనానికి బానిసలయ్యారని చాలామంది స్త్రీలు ఫిర్యాదు చేస్తున్నారు” అని జర్మన్‌ పరిశోధకులు చెప్పారు. ఇంటర్నెట్‌ మీద ఎక్కువ ఆధారపడడం వల్ల తమ వివాహ జీవితం నాశనమయ్యేంతగా తన భర్త మారిపోయాడని ఒక స్త్రీ ఫిర్యాదు చేసింది.

ఇంటర్నెట్‌ వ్యసనానికి బానిసనైపోయానని చెప్పుకుంటున్న ఒకాయన యెహోవాసాక్షుల బ్రాంచి కార్యాలయాల్లో ఒకదానికి ఉత్తరం రాశాడు. ఒక్కోసారి తను ఒక్క రోజులో పది గంటలు ఇంటర్నెట్‌ చూడడానికే గడిపేవాడు. “మొదట్లో అంతా బాగున్నట్లే అనిపించింది కానీ, కొంతకాలానికి కూటాలకు వెళ్లడం తగ్గించేశాను, ప్రార్థించడం మానేశాను” అని ఆయన చెబుతున్నాడు. కూటాలకు వెళ్లినప్పుడు ఆయన మనసు అక్కడ చెప్పేది వినడానికి సిద్ధంగా ఉండకుండా, “ఎప్పుడెప్పుడు మళ్లీ కంప్యూటర్‌ ఆన్‌ చేస్తానా” అని ఉవ్విళ్లూరేది. సంతోషకరమైన విషయమేమిటంటే, సమస్య ఎంత గంభీరమైనదో ఆయన అర్థం చేసుకుని, దానిని సరిచేసుకోవడానికి అవసరమైన చర్యలు తీసుకున్నాడు. ఇంటర్నెట్‌ వాడకం ఒక వ్యసనంగా మారే పరిస్థితి రాకుండా చూసుకుందాం.

సమాచారం—తగినదా, కాదా?

‘సమస్తాన్ని పరీక్షించి మేలైనదాన్ని చేపట్టండి. ప్రతి విధమైన కీడుకు దూరంగా ఉండండి’ అని 1 థెస్సలొనీకయులు 5:21, 22లో చదువుతాం. ఇంటర్నెట్‌లోవున్న సమాచారం దేవుని ఆమోదం పొందే విధంగా, దేవుని ఉన్నత ప్రమాణాలకు తగిన విధంగా ఉందోలేదో రూఢిపర్చుకోవాలి. అది నైతికపరంగా అభ్యంతరం కలిగించేదిగా ఉండకూడదు, క్రైస్తవులకు తగినదై ఉండాలి. ఇంటర్నెట్‌లో అశ్లీల చిత్రాలు, సాహిత్యం సర్వసాధారణం అయిపోయాయి కాబట్టి మనం జాగ్రత్తగా లేకపోతే సులభంగా దాని వలలో చిక్కుకుపోతాం.

మనల్ని మనం ఇలా ప్రశ్నించుకోవడం జ్ఞానయుక్తం, ‘నేను కంప్యూటరులో చూస్తున్నది నా భర్త/భార్య, నా తల్లిదండ్రులు, లేదా నా క్రైస్తవ సహోదరులు గదిలోకి వస్తే వెంటనే దాచేసేలా ఉందా?’ దానికి జవాబు అవునయితే ఇతరుల సమక్షంలోనే ఇంటర్నెట్‌ ఉపయోగించడం మంచిది. ఇంటర్నెట్‌ మనం సంభాషించే పద్ధతిని, షాపింగ్‌ చేసే విధానాన్ని మార్చేసింది. అంతేకాదు, ‘హృదయంలో వ్యభిచారం చేయడానికి’ అదొక కొత్త మార్గాన్ని తెరిచింది.—మత్త. 5:27, 28.

ఇతరులకు పంపాలా, వద్దా?

ఇంటర్నెట్‌ను ఉపయోగిస్తున్నప్పుడు సమాచారం అందుకుంటాం, అలాగే దానిని ఇతరులకు పంపిస్తాం. సమాచారం అందుకునే, అలాగే ఇతరులకు పంపించే స్వేచ్ఛ మనకున్నా అది ఎంతవరకు నమ్మదగినదో, ఎంతవరకు నైతికంగా సరైనదో రూఢిపర్చుకోవాల్సిన బాధ్యత కూడా మనకుంది. మనం ఇతరులకు రాసేవి లేదా పంపించేవి ఖచ్చితమైనవేనని హామీ ఇవ్వగలమా? ఆ సమాచారం ఇతరులకు పంపించే అనుమతి మనకుందా? a మనం పంపించేది ప్రయోజనాన్ని, ప్రోత్సాహాన్ని ఇస్తుందా? ఇతరులకు పంపించడంలో మన ఉద్దేశమేమిటి? ఇతరులను మెప్పించాలనే అలా చేయాలనుకుంటున్నామా?

ఈ-మెయిల్‌ను సరిగ్గా ఉపయోగిస్తే చాలా ప్రయోజనం ఉంటుంది. అది మనకు ఎంతో సమాచారం కూడా అందిస్తుంది. తాజా వార్తలు లేదా చిన్నచిన్న విషయాలు మనకు తెలిసినవాళ్లందరికీ పంపించడం ద్వారా వాళ్ల మీద ఎక్కువ భారం వేస్తూ వాళ్ల అమూల్యమైన సమయం హరించివేస్తున్నామా? సెండ్‌ బటన్‌ను నొక్కేముందు మన ఉద్దేశాలను పరిశీలించుకోవద్దా? మనం నిజంగా ఏమి సాధించాలనుకుంటున్నాం? ప్రజలు తమ సొంత అనుభవాలను ఇతరులతో పంచుకోవడానికి, తమ జీవితంలో జరుగుతున్న వాటిని ఎప్పటికప్పుడు తమ కుటుంబ సభ్యులకు, స్నేహితులకు తెలియజేయడానికి ఉత్తరాలు రాసేవాళ్లు. మనం ఆ ఉద్దేశంతోనే ఈ-మెయిల్‌ పంపించవద్దా? నిజమని నిరూపించలేని దాన్ని ఇతరులకు పంపించడం దేనికి?

మరైతే, ఇంటర్నెట్‌ విషయంలో మనం ఏమి చేయాలి? దాన్ని పూర్తిగా వాడకుండా ఉండాలా? అలా చేయాల్సిన అవసరం కొంతమందికి ఉండవచ్చు. ఎన్నో సంవత్సరాలుగా ఇంటర్నెట్‌ వ్యసనానికి బానిసైన, ముందు ప్రస్తావించిన వ్యక్తి దాని నుండి బయటపడడానికి అలాగే చేశాడు. అయితే, ‘బుద్ధి మనల్ని కాపాడడానికి, వివేచన మనకు కావలి కాయడానికి’ మనం అనుమతిస్తే ఇంటర్నెట్‌ వాడకం వల్ల ప్రయోజనం ఉంటుంది.—సామె. 2:10, 11.

[అధస్సూచి]

a ఫోటోలకు కూడా ఇదే వర్తిస్తుంది. మనం ఫోటోలను మన కోసమే తీసుకున్నా వాటిని ఇతరులకు పంపించే స్వేచ్ఛ మనకు ఉండకపోవచ్చు, ఆ ఫోటోల్లోవున్న వ్యక్తుల పేర్లు, వాళ్ల చిరునామాలు వేరేవాళ్లకు తెలియజేసే స్వేచ్ఛ మనకు అసలే ఉండదు.

[4వ పేజీలోని చిత్రం]

తప్పుడు సమాచారానికి బలి కాకుండా ఎలా తప్పించుకోవచ్చు?

[5వ పేజీలోని చిత్రం]

సెండ్‌ బటన్‌ నొక్కే ముందు ఏమి పరిశీలించుకోవాలి?