కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

యెహోవా “సమాధానకర్తయగు దేవుడు”

యెహోవా “సమాధానకర్తయగు దేవుడు”

యెహోవా “సమాధానకర్తయగు దేవుడు”

“సమాధానకర్తయగు దేవుడు మీకందరికి తోడై యుండును గాక.”—రోమా. 15:33.

1, 2. ఆదికాండము 32, 33 అధ్యాయాల్లో ఏ సన్నివేశాన్ని చూడవచ్చు? చివరకు ఏమి జరిగింది?

 ఈ సన్నివేశాన్ని ఊహించుకోండి. అన్నదమ్ములైన ఏశావు యాకోబులు చాలాకాలం తర్వాత కలుసుకోబోతున్నారు. వారు యొర్దాను నదికి తూర్పు వైపున ఉన్న యబ్బోకు అనే లోయకు దగ్గర్లోని పెనూయేలులో కలవబోతున్నారు. అప్పటికి ఇరవై ఏళ్ల క్రితం, జ్యేష్ఠ కుమారునిగా తనకున్న హక్కును ఏశావు యాకోబుకు అమ్మేశాడు. యాకోబు తిరిగి వస్తున్నాడని తెలుసుకున్నప్పుడు ఏశావు 400 మందిని వెంటబెట్టుకొని ఆయనను కలవడానికి బయలుదేరాడు. అది విన్న యాకోబు భయపడ్డాడు. ఏశావుకు ఇంకా తనమీద కోపం తగ్గలేదేమో, తనను చంపేస్తాడేమో అని యాకోబు అనుకున్నాడు. కాబట్టి తన పనివాళ్ల చేతికి పశువుల్నిచ్చి ఏశావుకు బహుమానంగా పంపించాడు. ప్రతీ పనివాడు తన ముందు వానికన్నా ఎక్కువ సంఖ్యలో పశువుల్ని తీసుకెళ్లి అవి యాకోబు పంపించిన బహుమానమని ఏశావుకు చెప్పారు. అలా యాకోబు 550 కన్నా ఎక్కువ జంతువులను పంపించాడు.

2 చివరకు ఆ ఇద్దరు కలుసుకునే సమయం రానేవచ్చింది. యాకోబు ధైర్యాన్ని, వినయాన్ని చూపించాడు. తన అన్నయైన ఏశావు వైపుగా నడుస్తూ యాకోబు ఆయన ముందు ఏడుసార్లు సాగిలపడ్డాడు. అయితే ఇదంతా చేయడానికి ముందు యాకోబు అన్నిటికన్నా ప్రాముఖ్యమైన పనొకటి చేశాడు. ఏశావు తనను ఏమీ చేయకుండా కాపాడమని యెహోవాకు ప్రార్థించాడు. యెహోవా ఆయన ప్రార్థనకు జవాబిచ్చాడు. ఏశావు పరుగెత్తుకుంటూ వచ్చి యాకోబును కౌగిలించుకొని మెడమీద పడి ముద్దుపెట్టుకున్నాడని బైబిలు చెబుతోంది.—ఆది. 32:11-20; 33:1-4.

3. యాకోబు ఏశావుల ఉదాహరణ నుండి మనం ఏమి నేర్చుకోవచ్చు?

3 సంఘంలో ఇతరులతో వచ్చే సమస్యల్ని పరిష్కరించుకోవడానికి మనం చేయగలిగినదంతా చేయాలని ఆ ఉదాహరణ చూపిస్తోంది. ఒకవేళ మనం అలా చేయకపోతే సంఘ సమాధానం, ఐక్యత దెబ్బతింటాయి. యాకోబు ఏ తప్పూ చేయలేదు కాబట్టి ఏశావును క్షమాపణ అడగాల్సిన అవసరం లేదు. ఎందుకంటే జ్యేష్ఠ కుమారునిగా ఏశావు తనకున్న హక్కును విలువైనదిగా ఎంచకుండా ఒక్కపూట భోజనం కోసం దాన్ని యాకోబుకు అమ్మేశాడు. అయినా, ఆయనతో సమాధానపడడానికి యాకోబు తాను చేయగలిగినదంతా చేశాడు. (ఆది. 25:31-34; హెబ్రీ. 12:16) మన సహోదర సహోదరీలతో సమాధానంగా ఉండడానికి మనం ఎంతగా ప్రయాసపడాలో యాకోబు ఉదాహరణ చూపిస్తోంది. అంతేకాక, సమాధానపడడానికి సహాయం చేయమని యెహోవాకు ప్రార్థిస్తే ఆయన మనకు సహాయం చేస్తాడని కూడా ఆ ఉదాహరణ చూపిస్తోంది. ఇతరులతో ఎలా సమాధానపడాలో నేర్పించే ఇతర ఉదాహరణలెన్నో బైబిల్లో ఉన్నాయి. ఇప్పుడు మనం వాటిలో కొన్నిటిని పరిశీలిద్దాం.

మనకు గొప్ప మాదిరి

4. పాపమరణాల నుండి మనల్ని విడిపించడానికి యెహోవా ఏమి చేశాడు?

4 ఇతరులతో సమాధానంగా ఉండే విషయంలో యెహోవాయే గొప్ప మాదిరి. ఆయన “సమాధానకర్తయగు దేవుడు.” (రోమా. 15:33) మనం తనకు స్నేహితులుగా ఉండేందుకు యెహోవా ఏమి చేశాడో ఒకసారి ఆలోచించండి. మనం ఆదాము హవ్వల పిల్లలం కాబట్టి పాపం చేస్తుంటాం. పాపం చేసేవారు మరణానికి పాత్రులు. (రోమా. 6:23) అయితే, దేవుడు మనల్ని ఎంతో ప్రేమించాడు కాబట్టే మనల్ని పాపమరణాల నుండి కాపాడాలనుకున్నాడు. అందుకే తన ప్రియ కుమారుడైన యేసు పరిపూర్ణ మానవునిగా జన్మించి, మనకోసం ప్రాణం అర్పించేలా ఆయనను యెహోవా పరలోకం నుండి పంపించాడు. యేసు తన తండ్రి కోరికను నెరవేర్చడానికి సంతోషంగా తన ప్రాణాన్ని అర్పించాడు. (యోహా. 10:17, 18) ఆ తర్వాత యెహోవా ఆయనను తిరిగి పరలోకానికి పునరుత్థానం చేశాడు. యేసు అక్కడే తన బలి విలువను యెహోవాకు సమర్పించాడు. పశ్చాత్తాపపడే పాపులు ఆ విమోచన క్రయధన బలి వల్లే, శాశ్వత మరణాన్ని తప్పించుకోగలుగుతారు.—హెబ్రీయులు 9:14, 24 చదవండి.

5, 6. యేసు బలి వల్ల మానవులు ఎలా దేవుని స్నేహితులౌతారు?

5 పాపం వల్ల మానవులు దేవునికి శత్రువులయ్యారు. యేసు బలి వారికెలా సహాయం చేస్తుంది? యెషయా 53:5 ఇలా చెబుతోంది: “మన సమాధానార్థమైన శిక్ష అతనిమీద పడెను అతడు పొందిన దెబ్బలచేత మనకు స్వస్థత కలుగుచున్నది.” విధేయులైన మానవులు యేసు బలి వల్ల దేవునికి స్నేహితులయ్యే అవకాశం ఉంది. బైబిలు ఇంకా ఇలా చెబుతోంది: “ఆయన రక్తమువలన మనకు విమోచనము, అనగా మన అపరాధములకు క్షమాపణ మనకు కలిగియున్నది.”—ఎఫె. 1:7.

6 యేసు గురించి బైబిలు ఇలా చెబుతోంది: ‘ఆయనయందు సర్వసంపూర్ణత నివసింపవలెనని తండ్రి అభీష్టమాయెను.’ అంటే యెహోవా తన సంకల్పాన్ని యేసు ద్వారా నెరవేరుస్తాడని అర్థం. అయితే యెహోవా సంకల్పం ఏమిటి? యేసుక్రీస్తు ‘రక్తంచేత సంధిచేసి, ఆయనద్వారా సమస్తాన్ని తనతో సమాధానపరచుకోవాలి’ అనేదే ఆ సంకల్పం. యెహోవా ‘పరలోకంలో ఉన్నవాటిని, భూలోకంలో ఉన్నవాటిని’ తనతో సమాధానపర్చుకుంటాడు లేదా తన స్నేహితులుగా చేసుకుంటాడు. ఇంతకీ అవి ఏమిటి?—కొలొస్సయులు 1:19, 20 చదవండి.

7. ‘పరలోకంలో ఉన్నవి, భూలోకంలో ఉన్నవి’ అంటే ఏమిటి?

7 యేసు బలి వల్ల అభిషిక్త క్రైస్తవులు ‘నీతిమంతులుగా తీర్చబడి’ దేవుని కుమారులుగా ‘ఆయనతో సమాధానాన్ని’ కలిగివుంటారు. (రోమీయులు 5:1 చదవండి.) యేసుక్రీస్తుతో కలిసి ఉండేలా వారిని యెహోవా పరలోకానికి పునరుత్థానం చేస్తాడు కాబట్టి వారిని బైబిలు ‘పరలోకంలో ఉన్నవాటిగా’ ప్రస్తావిస్తోంది. వారు అక్కడ నుండి ‘రాజులుగా భూమిని ఏలుతారు,’ యాజకులుగా సేవచేస్తారు. (ప్రక. 5:9, 10) ‘భూలోకంలో ఉన్నవి’ అంటే, తమ పాపాల విషయంలో పశ్చాత్తాపపడి, భూమ్మీద నిరంతరం జీవించబోయే మానవులే.—కీర్త. 37:29.

8. సహోదర సహోదరీలతో సమస్యలు ఎదురైనప్పుడు మనం యెహోవా మాదిరి గురించి ఆలోచించడం ఎందుకు మంచిది?

8 విమోచన క్రయధన బలి పట్ల పౌలుకు ఎంత కృతజ్ఞత ఉందో ఎఫెసులోని అభిషిక్త క్రైస్తవులకు ఆయన రాసిన ఈ మాటల్లో స్పష్టంగా కనిపిస్తోంది: “దేవుడు కరుణాసంపన్నుడైయుండి, మనము మన అపరాధములచేత చచ్చినవారమై యుండినప్పుడు . . . మనలను క్రీసుతోకూడ బ్రదికించెను.” అంతేకాక, దేవుడు తన “కృపచేత” మనలను రక్షించాడని కూడా ఆయన అన్నాడు. (ఎఫె. 2:4, 5) మనం పరలోక నిరీక్షణగల వారమైనా, భూనిరీక్షణగల వారమైనా దేవుడు మనపై చూపించిన కరుణను బట్టి, కృపను బట్టి ఆయనకు రుణపడివున్నాం. మానవులు తనతో సమాధానపడేందుకు యెహోవా చేసినదానంతటిని బట్టి మనం ఆయన పట్ల కృతజ్ఞత కలిగివున్నాం. కొన్నిసార్లు సంఘ సమాధానాన్ని దెబ్బతీసే సమస్యలు మనకు ఎదురుకావచ్చు. అలాంటప్పుడు యెహోవా మాదిరి గురించి ఆలోచించి, మన సహోదర సహోదరీలతో సమాధానపడాలి.

అబ్రాహాము, ఇస్సాకు మాదిరుల నుండి నేర్చుకోండి

9, 10. ఇతరులతో సమాధానంగా ఉండాలనుకుంటున్నట్లు అబ్రాహాము ఎలా చూపించాడు?

9 అబ్రాహాము గురించి బైబిలు ఇలా చెబుతోంది: “అబ్రాహాము దేవుని నమ్మెను అది అతనికి నీతిగా ఎంచబడెను . . . మరియు దేవుని స్నేహితుడని అతనికి పేరుకలిగెను.” (యాకో. 2:23) ఇతరులతో సమాధానంగా ఉండడం ద్వారా కూడా యెహోవాపై తనకు విశ్వాసం ఉందని అబ్రాహాము చూపించాడు. ఉదాహరణకు, ఒకసారి అబ్రాహాము పశువుల కాపరులకు, ఆయన అన్న కొడుకైన లోతు పశువుల కాపరులకు మధ్య తగాదా వచ్చింది. (ఆది. 12:5; 13:7) ఆ తగాదాను పరిష్కరించుకోవడానికి ఇద్దరూ వేర్వేరు ప్రాంతాలకు వెళ్లిపోవడమే మంచిదని అనుకున్నారు. అయితే ఆ సమయంలో అబ్రాహాము ఏమి చేశాడో గమనించండి. వయసులో పెద్దవాడే అయినా, యెహోవాతో ప్రత్యేకమైన సంబంధమున్నవాడే అయినా తానే తుది నిర్ణయం తీసుకోవాలని అబ్రాహాము అనుకోలేదు. బదులుగా, లోతుతో సమాధానంగా ఉండాలని కోరుకుంటున్నట్లు ఆయన చూపించాడు.

10 అబ్రాహాము లోతుతో ఇలా అన్నాడు: “మనము బంధువులము గనుక నాకు నీకును, నా పశువుల కాపరులకు నీ పశువుల కాపరులకును కలహముండకూడదు. ఈ దేశమంతయు నీ యెదుట నున్నదిగదా, దయచేసి నన్ను విడిచి వేరుగానుండుము. నీవు ఎడమతట్టునకు వెళ్లిన యెడల నేను కుడితట్టుకును, నీవు కుడితట్టునకు వెళ్లినయెడల నేను యెడమతట్టునకును వెళ్లుదును.” లోతు మంచి ప్రదేశాన్ని ఎంచుకున్నప్పుడు అబ్రాహాము దానికి ఒప్పుకున్నాడు. లోతుపై ఏమాత్రం కోపగించుకోలేదు. (ఆది. 13:8-11) కొంతకాలానికి, శత్రువులు లోతును బంధించి తీసుకెళ్లినప్పుడు వెంటనే ఆయనను విడిపించడానికి అబ్రాహాము వెళ్లాడు, దీన్నిబట్టి ఆయనకు లోతుపై కోపం లేదని తెలుస్తోంది.—ఆది. 14:14-16.

11. పొరుగువారైన ఫిలిష్తీయులతో అబ్రాహాము ఎలా సమాధానంగా ఉన్నాడు?

11 మరో సందర్భం గురించి కూడా ఆలోచించండి. అబ్రాహాము కనానులో తన పొరుగువారైన ఫిలిష్తీయులతో సమాధానంగా ఉండడానికి శాయశక్తులా కృషి చేశాడు. బెయేర్షెబాలో అబ్రాహాము పనివారు తవ్విన బావిని ఫిలిష్తీయులు దౌర్జన్యంగా తీసుకున్నప్పుడు ఆయన ఏమీ అనలేదు, వారినేమీ చేయలేదు. తర్వాత, సమాధాన నిబంధన చేసుకోవడానికి ఫిలిష్తీయుల రాజు ఆయన దగ్గరికి వచ్చాడు. అబ్రాహాము ఆ రాజు సంతానంతో దయగా వ్యవహరిస్తానని ప్రమాణం చేసిన తర్వాతే, దౌర్జన్యంగా తీసుకోబడిన తన బావి గురించి రాజుతో చెప్పాడు. అప్పుడు రాజు నివ్వెరపోయి, అబ్రాహాముకు ఆ బావిని తిరిగి ఇచ్చేశాడు. అలా అబ్రాహాము సమాధానంగా ఉంటూ పరదేశిగా అక్కడ జీవించాడు.—ఆది. 21:22-31, 34.

12, 13. (ఎ) ఇస్సాకు తన తండ్రి మాదిరిని ఎలా అనుసరించాడు? (బి) సమాధానంగా ఉండడానికి ఇస్సాకు చేసిన ప్రయత్నాలను యెహోవా ఎలా ఆశీర్వదించాడు?

12 అబ్రాహాము కుమారుడైన ఇస్సాకు కూడా తన తండ్రిలాగే సమాధానాన్ని ప్రేమించాడు. ఫిలిష్తీయులతో సమాధానంగా ఉండడానికి ఇస్సాకు కూడా తాను చేయగలిగినదంతా చేశాడు. కరువు వచ్చినప్పుడు, ఇస్సాకు తన కుటుంబంతో కలిసి నెగెబులోని బీడు ప్రాంతమైన బెయేర్‌ లహాయిరోయి నుండి మంచి ప్రదేశమైన గెరారుకు వెళ్లాడు. అది ఫిలిష్తీయుల ప్రాంతం. యెహోవా ఇస్సాకును మంచి పంటతో, ఎన్నో పశువులతో ఆశీర్వదించాడు. అది చూసి ఫిలిష్తీయులు అసూయపడ్డారు. ఇస్సాకు సంపన్నుడవడం వారికి ఇష్టంలేదు కాబట్టి ఆయన బావులను పూడ్చేశారు. చివరకు ఫిలిష్తీయుల రాజు ఇస్సాకుతో, “మాయొద్దనుండి వెళ్లిపొమ్ము” అని అన్నాడు. ఫిలిష్తీయులతో సమాధానంగా ఉండడానికి ఇస్సాకు అక్కడ నుండి వెళ్లిపోయాడు.—ఆది. 24:62; 26:1, 12-17.

13 ఆ తర్వాత ఇస్సాకు పశువుల కాపరులు మరో బావిని తవ్వారు. అప్పుడు కూడా నీళ్లు తమవేనంటూ ఫిలిష్తీయ కాపరులు ఇస్సాకు కాపరులతో వాదించారు. అప్పుడు ఇస్సాకు వారితో గొడవపడకుండా తన తండ్రియైన అబ్రాహాము మంచి మాదిరిని అనుసరించాడు. ఇంకొక బావిని తవ్వమని తన సేవకులకు చెప్పాడు. ఫిలిష్తీయులు మళ్లీ గొడవపడ్డారు. అయినా, వారితో సమాధానంగా ఉండేందుకు ఇస్సాకు తన కుటుంబాన్ని, తనకున్నవాటినన్నిటిని తీసుకొని అక్కడి నుండి వెళ్లిపోయాడు. వారు వెళ్లిన చోట కూడా ఆయన సేవకులు ఒక బావిని తవ్వారు. ఇస్సాకు దానికి రహెబోతు అనే పేరు పెట్టాడు. ఆ తర్వాత ఆయన మరింత సారవంతమైన బెయేర్షెబాకు వెళ్ళాడు. యెహోవా ఆయనను అక్కడ ఆశీర్వదించి ఆయనకిలా చెప్పాడు: “నేను నీకు తోడైయున్నాను గనుక భయపడకుము; నా దాసుడైన అబ్రాహామును బట్టి నిన్ను ఆశీర్వదించి నీ సంతానమును విస్తరింపచేసెదను.”—ఆది. 26:17-25.

14. ఫిలిష్తీయుల రాజు నిబంధన చేసుకోవడానికి వచ్చినప్పుడు, వారితో సమాధానంగా ఉండాలనుకుంటున్నట్లు ఇస్సాకు ఎలా చూపించాడు?

14 తన సేవకులు తవ్విన బావుల విషయంలో తనకున్న హక్కు కోసం ఇస్సాకు పోరాడగలిగేవాడే. ఇస్సాకు చేసిన ప్రతీ పనిని యెహోవా ఆశీర్వదించాడని ఫిలిష్తీయుల రాజుకు తెలుసు. ఆయన తన అధికారులతో కలిసి బెయేర్షెబాకు వచ్చి ఇస్సాకుతో సమాధాన నిబంధన చేస్తూ ఇలా అన్నాడు: “నిశ్చయముగా యెహోవా నీకు తోడైయుండుట చూచితిమి.” అయితే ఇస్సాకు సమాధానంగా ఉండాలనే ఉద్దేశంతో ఎన్నోసార్లు ఒకచోటి నుండి మరో చోటికి వెళ్లాడు. ఆయన వారితో పోరాడాలనుకోలేదు. కాబట్టి ఈసారి కూడా రాజు తన అధికారులతో కలిసి వచ్చినప్పుడు వారితో సమాధానంగా ఉండాలనుకుంటున్నట్లు ఇస్సాకు చూపించాడు. బైబిలు ఇలా చెబుతోంది: “అతడు వారికి విందుచేయగా వారు అన్నపానములు పుచ్చుకొనిరి. తెల్లవారినప్పుడు వారు లేచి ఒకనితో ఒకడు ప్రమాణము చేసికొనిరి; తరువాత ఇస్సాకు వారిని సాగనంపగా వారు అతనియొద్దనుండి సమాధానముగా వెళ్లిరి.”—ఆది. 26:26-31.

యోసేపు మాదిరి నుండి నేర్చుకోండి

15. యోసేపు అన్నలు ఆయనతో ఎందుకు సమాధానంగా మాట్లాడలేకపోయేవారు?

15 ఇస్సాకు కుమారుడైన యాకోబు ‘సాధుస్వభావం’ గలవాడని బైబిలు చెబుతోంది. (ఆది. 25:27) మనం ముందు నేర్చుకున్నట్లుగా తన అన్నయైన ఏశావుతో సమాధానంగా ఉండడానికి యాకోబు చేయగలిగినదంతా చేశాడు. యాకోబు తన తండ్రియైన ఇస్సాకు మంచి మాదిరి నుండి నేర్చుకున్నాడు. మరి యాకోబు కుమారులు యాకోబు మాదిరి నుండి నేర్చుకున్నారా? యాకోబు తన 12 మంది కుమారుల్లో యోసేపునే ఎక్కువగా ప్రేమించాడు. యోసేపు తన తండ్రి మాట విన్నాడు, ఆయనను గౌరవించాడు. అంతేకాక, తన తండ్రి దృష్టిలో యోసేపు నమ్మకస్థుడు. (ఆది. 37:2, 14) యోసేపు అన్నలకు ఆయనమీద ఎంత అసూయ ఉందంటే కనీసం ఆయనతో సమాధానంగా మాట్లాడలేకపోయేవారు. వారు యోసేపును ఎంతగా ద్వేషించారంటే ఆయనను బానిసగా అమ్మేసి, ఇంటికి వచ్చి, ఒక దుష్టమృగం ఆయనను చంపేసిందని తమ తండ్రిని నమ్మించారు.—ఆది. 37:4, 28, 31-33.

16, 17. యోసేపు తన అన్నలతో సమాధానంగా ఉండాలనుకుంటున్నట్లు ఎలా చూపించాడు?

16 యెహోవా యోసేపును ఆశీర్వదించాడు. కొంతకాలానికి ఆయన ఐగుప్తు రాజైన ఫరో తర్వాతి స్థానంలో అంటే ఐగుప్తు ప్రధానమంత్రిగా నియమించబడ్డాడు. కనానులో గొప్ప కరువు వచ్చినప్పుడు యోసేపు అన్నలు ఆహారం కొనుక్కోవడానికి ఐగుప్తుకు వచ్చారు. అక్కడ యోసేపును కలిసినప్పుడు, బహుశా ఆయన ఐగుప్తీయుల వస్త్రధారణలో ఉన్నందువల్ల వారు ఆయనను గుర్తుపట్టలేదు. (ఆది. 42:5-7) తనతో, తన తండ్రితో వారెలా వ్యవహరించారో యోసేపు కూడా వారితో అలాగే వ్యవహరించేవాడే. కానీ, యోసేపు వారితో సమాధానపడడానికి తాను చేయగలిగినదంతా చేశాడు. వారు పశ్చాత్తాపాన్ని చూపించినప్పుడు తానెవరో వారికి చెప్పాడు. ఆయనిలా అన్నాడు: “నేనిక్కడికి వచ్చునట్లు మీరు నన్ను అమ్మివేసినందుకు దుఃఖపడకుడి; అది మీకు సంతాపము పుట్టింపనియ్యకుడి; ప్రాణరక్షణ కొరకు దేవుడు మీకు ముందుగా నన్ను పంపించెను.” ఆ తర్వాత ఆయన, తన సహోదరులందరినీ ముద్దుపెట్టుకొని వారిమీద పడి ఏడ్చాడు.—ఆది. 45:1, 5, 15.

17 తమ తండ్రియైన యాకోబు చనిపోయిన తర్వాత, యోసేపు తమ మీద పగ తీర్చుకుంటాడేమో అని ఆయన అన్నలు అనుకున్నారు. వారు ఆ విషయం గురించి యోసేపుతో మాట్లాడినప్పుడు ఆయన ఎంతో దుఃఖంతో ఇలా అన్నాడు: “భయపడకుడి, నేను మిమ్మును, మీ పిల్లలను పోషించెదను.” ఈ సందర్భంలో కూడా యోసేపు సమాధానాన్ని ప్రేమిస్తున్నాడని చూపించాడు. ఆయన “వారిని ఆదరించి వారితో ప్రీతిగా మాటలాడెను.”—ఆది. 50:15-21.

‘మనకు బోధ కలుగు నిమిత్తం రాయబడ్డాయి’

18, 19. (ఎ) ఈ ఆర్టికల్‌లో చూసిన ఉదాహరణల నుండి మీరు ఏమి నేర్చుకున్నారు? (బి) మనం తర్వాతి ఆర్టికల్‌లో ఏమి చూస్తాం?

18 పౌలు ఇలా రాశాడు: “ఓర్పువలనను, లేఖనములవలని ఆదరణవలనను మనకు నిరీక్షణ కలుగుటకై పూర్వమందు వ్రాయబడినవన్నియు మనకు బోధ కలుగు నిమిత్తము వ్రాయబడియున్నవి.” (రోమా. 15:4) అత్యంత గొప్ప మాదిరియైన యెహోవా నుండి మరియు అబ్రాహాము, ఇస్సాకు, యాకోబు, యోసేపు మాదిరుల నుండి మనం ఏమి నేర్చుకున్నాం?

19 మనం తన స్నేహితులయ్యేలా యెహోవా చేసినదానంతటి గురించి ఆలోచిస్తే ఇతరులతో సమాధానంగా ఉండడానికి మనం కూడా శాయశక్తులా కృషి చేయాలనుకుంటాం. తల్లిదండ్రులు తమ పిల్లలకు మంచి మాదిరిని ఉంచి ఇతరులతో ఎలా సమాధానంగా ఉండాలో నేర్పించవచ్చని అబ్రాహాము, ఇస్సాకు, యాకోబు, యోసేపు ఉదాహరణలు చూపిస్తున్నాయి. ఇతరులతో సమాధానంగా ఉండడానికి కృషి చేసేవారి ప్రయత్నాలను యెహోవా ఆశీర్వదిస్తాడని కూడా చూశాం. అంతేకాక, యెహోవా “సమాధానకర్తయగు దేవుడు” అని పౌలు ఎందుకు రాశాడో అర్థం చేసుకోగలిగాం. (రోమీయులు 15:33; 16:20 చదవండి.) మనం ఇతరులతో సమాధానంగా ఉండాలని పౌలు ఎందుకు చెప్పాడో, ఇతరులతో మనం ఎలా సమాధానంగా ఉండవచ్చో తర్వాతి ఆర్టికల్‌లో చూస్తాం.

మీరేమి నేర్చుకున్నారు?

• ఏశావును కలవడానికి వెళ్తున్నప్పుడు ఆయనతో సమాధానంగా ఉండాలనుకుంటున్నట్లు యాకోబు ఎలా చూపించాడు?

• మానవులు తనతో సమాధానంగా ఉండేలా యెహోవా చేసిన దాని గురించి తెలుసుకున్నారు కాబట్టి మీరు ఏమి చేయాలనుకుంటున్నారు?

• సమాధానపరులైన అబ్రాహాము, ఇస్సాకు, యాకోబు, యోసేపు మాదిరుల నుండి మీరు ఏమి నేర్చుకున్నారు?

[అధ్యయన ప్రశ్నలు]

[23వ పేజీలోని చిత్రాలు]

ఏశావుతో సమాధానపడేందుకు యాకోబు చేసిన ప్రయత్నాల్లో ఏది అత్యంత ప్రాముఖ్యమైనది?