కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

వారు మెస్సీయను కనుగొన్నారు!

వారు మెస్సీయను కనుగొన్నారు!

వారు మెస్సీయను కనుగొన్నారు!

“మేము మెస్సీయను కనుగొంటిమి.”—యోహా. 1:41.

1. “మేము మెస్సీయను కనుగొంటిమి” అని అంద్రెయ ఎందుకు చెప్పగలిగాడు?

 యేసు తన దగ్గరకు వస్తుండడాన్ని చూసి బాప్తిస్మమిచ్చు యోహాను, “ఇదిగో దేవుని గొఱ్ఱెపిల్ల” అని తన శిష్యులైన అంద్రెయ, యోహానులతో అన్నాడు. వెంటనే ఆ ఇద్దరూ యేసును వెంబడించి ఆ రోజంతా ఆయనతోపాటే ఉన్నారు. తర్వాత అంద్రెయ తన సహోదరుడైన పేతురు దగ్గరకు వెళ్లి సంతోషంతో ఇలా అన్నాడు: “మేము మెస్సీయను కనుగొంటిమి.” ఆ తర్వాత అంద్రెయ పేతురును యేసు దగ్గరకు తీసుకువెళ్లాడు.—యోహా. 1:35-42.

2. మెస్సీయకు సంబంధించిన మరిన్ని ప్రవచనాలను పరిశీలిస్తుండగా మనమెలా ప్రయోజనం పొందుతాం?

2 కొంతకాలానికి అంద్రెయ, పేతురు, మరితరులు లేఖనాలను జాగ్రత్తగా అధ్యయనం చేసి, ఎలాంటి సందేహం లేకుండా యేసే వాగ్దానం చేయబడిన మెస్సీయ అని చెప్పారు. మెస్సీయ గురించిన మరిన్ని ప్రవచనాలను పరిశీలిస్తుండగా దేవుని వాక్యంపై, ఆయన అభిషిక్తునిపై మనకున్న విశ్వాసం బలపడుతుంది.

‘ఇదిగో, నీ రాజు వచ్చుచున్నాడు’

3. యేసు యెరూషలేములోకి రాజుగా ప్రవేశించినప్పుడు ఏ ప్రవచనాలు నెరవేరాయి?

3 యెరూషలేముకు రాజుగా వస్తాడు. జెకర్యా ఇలా ప్రవచించాడు: “సీయోను నివాసులారా, బహుగా సంతోషించుడి; యెరూషలేము నివాసులారా, ఉల్లాసముగా ఉండుడి; నీ రాజు నీతిపరుడును రక్షణగలవాడును దీనుడునై, గాడిదను గాడిద పిల్లను ఎక్కి నీయొద్దకు వచ్చుచున్నాడు.” (జెక. 9:9) కీర్తనకర్త ఇలా రాశాడు: “యెహోవా పేరట వచ్చువాడు ఆశీర్వాదమొందును గాక.” (కీర్త. 118:26) యేసు యెరూషలేములోకి ప్రవేశిస్తున్నప్పుడు చాలామంది సంతోషంతో కేకలు వేశారు. అలా చేయాలని యేసు వారికి చెప్పకపోయినా వారు ఖచ్చితంగా ప్రవచనం చెప్పినట్టే చేశారు. దాని గురించి చదువుతున్నప్పుడు మీరూ అక్కడ ఉన్నట్టు, ఆ ప్రజలు సంతోషంతో వేసే కేకలను వింటున్నట్టు ఊహించుకోండి.—మత్తయి 21:4-9 చదవండి.

4. కీర్తన 118:22, 23 ఎలా నెరవేరిందో వివరించండి.

4 చాలామంది యేసును మెస్సీయగా అంగీకరించకపోయినా దేవుని దృష్టిలో ఆయన విలువైనవాడే. ప్రవచించబడినట్లుగానే, రుజువులను నమ్మనివాళ్ళు యేసును ‘తృణీకరించారు, ఎన్నిక చేయలేదు.’ (యెష. 53:3; మార్కు 9:12) అయితే, “ఇల్లు కట్టువారు నిషేధించిన రాయి మూలకు తలరాయి ఆయెను. అది యెహోవావలన కలిగినది” అని బైబిలు చెబుతోంది. (కీర్త. 118:22, 23) ఒక సందర్భంలో యేసు తనను వ్యతిరేకించే మతనాయకులతో ఆ ప్రవచనం గురించి మాట్లాడాడు. పేతురు కూడా అది యేసు గురించే చెబుతోందని అన్నాడు. (మార్కు 12:10, 11; అపొ. 4:8-11) క్రైస్తవ సంఘానికి యేసే “మూలకు తలరాయి” అయ్యాడు. భక్తిహీనులు ఆయనను తిరస్కరించినా ఆయన ‘దేవుని దృష్టికి ఏర్పరచబడినవాడు, అమూల్యమైనవాడు.’—1 పేతు. 2:4-6.

ఒక శిష్యుడు నమ్మకద్రోహం చేస్తాడు, ఇతరులు ఆయనను వదిలి వెళ్తారు

5, 6. మెస్సీయకు నమ్మకద్రోహం జరగడం గురించి ఏమని ప్రవచించబడింది? అది ఎలా నెరవేరింది?

5 మెస్సీయ స్నేహితుడే ఆయనకు నమ్మకద్రోహం చేస్తాడు. దావీదు ఇలా ప్రవచించాడు: “నేను నమ్ముకొనిన నా విహితుడు నా యింట భోజనము చేసినవాడు నన్ను తన్నుటకై తన మడిమె నెత్తెను.” (కీర్త. 41:9) బైబిలు కాలాల్లో, ఎవరైనా ఇద్దరు కలిసి భోజనం చేశారంటే వారు స్నేహితులుగా ఎంచబడేవారు. (ఆది. 31:54) కాబట్టి మెస్సీయ స్నేహితుడే ఆయనకు ఘోరమైన నమ్మకద్రోహం చేస్తాడని ఆ ప్రవచనం చెబుతోంది. యేసు తన అపొస్తలులతో మాట్లాడుతున్నప్పుడు ఆ ద్రోహి గురించి ఇలా చెప్పాడు: “మిమ్మునందరిని గూర్చి నేను చెప్పలేదు; నేను ఏర్పరచుకొనినవారిని ఎరుగుదును గాని—నాతో కూడ భోజనముచేయువాడు నాకు విరోధముగా తన మడమ యెత్తెను అను లేఖనము నెరవేరుటకై యీలాగు జరుగును.” (యోహా. 13:18) యేసు తన అనుచరుడూ స్నేహితుడూ అయిన ఇస్కరియోతు యూదా గురించే అలా మాట్లాడాడు. ఆయన యేసుకు నమ్మకద్రోహం చేసినప్పుడు దావీదు చెప్పిన ప్రవచనం నెరవేరింది.

6 మెస్సీయకు నమ్మకద్రోహం చేసిన వ్యక్తి 30 వెండి నాణెములకు అంటే, కూలివానికి ఇచ్చే జీతానికి ఆయనను అప్పగిస్తాడు. జెకర్యా 11:12, 13లో ప్రవచించబడినట్లు యూదా ఇస్కరియోతు యేసును 30 వెండి నాణెములకు అప్పగించాడని మత్తయి చెప్పాడు. కానీ ఆ మాటలు ‘ప్రవక్తయైన యిర్మీయా ద్వారా చెప్పబడ్డాయి’ అని మత్తయి ఎందుకు అన్నాడు? మత్తయి కాలంలో, జెకర్యా గ్రంథం కూడా ఉన్న బైబిలు పుస్తకాల సముదాయంలో యిర్మీయా గ్రంథం మొదట ఉండి ఉండవచ్చు. (లూకా 24:44 పోల్చండి.) ఆ 30 వెండి నాణెములను యూదా వాడుకోలేదు. ఆయన వాటిని దేవాలయంలో విసిరేసి, ‘పోయి ఉరి పెట్టుకున్నాడు.’—మత్త. 26:14-16; 27:3-10.

7. జెకర్యా 13:7 ఎలా నెరవేరింది?

7 శిష్యులు ఆయనను వదిలి వెళ్తారు. “గొఱ్ఱెలు చెదరిపోవునట్లు కాపరిని హతము చేయుము” అని జెకర్యా రాశాడు. (జెక. 13:7) సా.శ. 33, నీసాను 14న యేసు తన శిష్యులతో ఇలా అన్నాడు: “ఈ రాత్రి మీరందరు నా విషయమై అభ్యంతరపడెదరు, ఏలయనగా—గొఱ్ఱెల కాపరిని కొట్టుదును, మందలోని గొఱ్ఱెలు చెదరిపోవును అని వ్రాయబడి యున్నది.” సరిగ్గా అలాగే జరిగిందని చెబుతూ మత్తయి ఇలా రాశాడు: “శిష్యులందరు [యేసును] విడిచి పారిపోయిరి.”—మత్త. 26:31, 56.

కొందరు ఆయనను నిందిస్తారు, కొడతారు

8. యెషయా 53:8 ఎలా నెరవేరింది?

8 ప్రజలు మెస్సీయను న్యాయస్థానానికి తీసుకెళ్లి, మరణశిక్ష విధిస్తారు. (యెషయా 53:8 చదవండి.) నీసాను 14 పొద్దున యూదుల మహాసభకు చెందిన వారందరూ కలుసుకొని, యేసును తాళ్లతో కట్టి రోమా అధిపతియైన పొంతి పిలాతు దగ్గరకు తీసుకెళ్లారు. పిలాతు యేసును విచారణ చేసిన తర్వాత ఆయన ఏ తప్పూ చేయలేదని నిర్ధారించాడు. యేసును విడుదల చేయనా అని ఆయన ప్రజలను అడిగినప్పుడు వారు, బరబ్బ అనే నేరస్థుణ్ణి విడుదలచేసి యేసును సిలువ వేయమని కేకలువేశారు. పిలాతు ఆ గుంపును సంతోషపెట్టాలనుకున్నాడు కాబట్టి బరబ్బను విడుదల చేశాడు. యేసును కొరడాలతో కొట్టి సిలువ వేయమని ఆ తర్వాత పిలాతు ఆజ్ఞాపించాడు.—మార్కు 15:1-15.

9. కీర్తన 35:11 ఎలా నెరవేరింది?

9 మెస్సీయ గురించి అబద్ధ సాక్ష్యం చెబుతారు. దావీదు ఇలా రాశాడు: “కూటసాక్షులు లేచుచున్నారు నేనెరుగని సంగతులనుగూర్చి నన్ను అడుగుచున్నారు.” (కీర్త. 35:11) ఆ ప్రవచనం చెప్పినట్లుగానే “ప్రధానయాజకులును, మహా సభవారందరును, యేసును చంపవలెనని ఆయనకు విరోధముగా అబద్ధసాక్ష్యము వెదకుచుండిరి.” (మత్త. 26:59) నిజానికి, “అనేకులు ఆయనమీద అబద్ధసాక్ష్యము పలికినను వారి సాక్ష్యములు ఒకదానికి ఒకటి సరిపడలేదు.” (మార్కు 14:56) సాక్షులు యేసు గురించి అబద్ధాలు చెబుతున్నా ఆయన శత్రువులు ఏమాత్రం పట్టించుకోలేదు. ఎందుకంటే వారు ఆయన చావునే కోరుకున్నారు.

10. యెషయా 53:7 ఎలా నెరవేరింది?

10 నిందించేవారి ముందు మౌనంగా ఉంటాడు. యెషయా ఇలా ప్రవచించాడు: “అతడు దౌర్జన్యము నొందెను, బాధింపబడినను అతడు నోరు తెరవలేదు. వధకు తేబడు గొఱ్ఱెపిల్లయు బొచ్చు కత్తిరించువానియెదుట గొఱ్ఱెయు మౌనముగా నుండునట్లు అతడు నోరు తెరువలేదు.” (యెష. 53:7) ‘ప్రధాన యాజకులు, పెద్దలు యేసు మీద నేరం మోపినప్పుడు ఆయన ప్రత్యుత్తరమేమీ ఇవ్వలేదు.’ పిలాతు, “నీమీద వీరెన్ని నేరములు మోపుచున్నారో నీవు వినలేదా?” అని యేసును అడిగాడు. అయినా యేసు “ఒక మాటకైనను అతనికి ఉత్తరమియ్యలేదు గనుక అధిపతి మిక్కిలి ఆశ్చర్యపడెను.” (మత్త. 27:12-14) తనను నిందించినవారిని యేసు దూషించలేదు.—రోమా. 12:17-21; 1 పేతు. 2:23.

11. యెషయా 50:6, మీకా 5:1 ఎలా నెరవేరాయి?

11 మెస్సీయను కొడతారని యెషయా ప్రవచించాడు. ఆయనిలా రాశాడు: “కొట్టువారికి నా వీపును అప్పగించితిని వెండ్రుకలు పెరికివేయువారికి నా చెంపలను అప్పగించితిని ఉమ్మివేయువారికిని అవమానపరచువారికిని నా ముఖము దాచుకొనలేదు.” (యెష. 50:6) మీకా ఇలా ప్రవచించాడు: “వారు ఇశ్రాయేలీయుల న్యాయాధిపతిని కఱ్ఱతో చెంపమీద కొట్టుచున్నారు.” (మీకా 5:1) సువార్త రచయితయైన మార్కు ఆ ప్రవచనాలు యేసులో నెరవేరాయని చెబుతూ ఇలా రాశాడు: “కొందరు [యేసు] మీద ఉమ్మివేసి ఆయన ముఖమునకు ముసుకువేసి, ఆయనను గుద్దుచు—ప్రవచింపుమని ఆయనతో చెప్పసాగిరి. బంట్రౌతులును ఆయనను అరచేతులతో కొట్టి పట్టుకొనిరి.” అంతేకాక, సైనికులు “రెల్లుతో ఆయన తలమీదకొట్టి, ఆయనమీద ఉమ్మివేసి, [ఎగతాళిగా] మోకాళ్లూని ఆయనకు నమస్కారము చేసిరి” అని కూడా మార్కు రాశాడు. (మార్కు 14:65; 15:19) నిజానికి యేసుతో అలా వ్యవహరించడానికి వారికి ఏ కారణమూ లేదు.

మరణం వరకు ఆయన నమ్మకంగా ఉన్నాడు

12. కీర్తన 22:16, యెషయా 53:12 ఎలా నెరవేరాయి?

12 మ్రానుపై చంపబడతాడు. “దుర్మార్గులు గుంపుకూడి నన్ను ఆవరించియున్నారు వారు నా చేతులను నా పాదములను పొడిచియున్నారు” అని దావీదు అన్నాడు. (కీర్త. 22:16) బైబిలు పాఠకులకు బాగా తెలిసిన సందర్భం గురించి రాస్తూ సువార్త రచయితయైన మార్కు ఇలా అన్నాడు: “ఆయనను సిలువవేసినప్పుడు పగలు తొమ్మిది గంటలాయెను.” (మార్కు 15:25) మెస్సీయ పాపులలో ఒకడిగా లెక్కించబడతాడని కూడా ప్రవచించబడింది. యెషయా ఇలా రాశాడు: “మరణము నొందునట్లు అతడు తన ప్రాణమును ధారపోసెను, అతిక్రమము చేయువారిలో ఎంచబడినవాడాయెను.” (యెష. 53:12) యేసుకు ‘కుడివైపున ఒకడును ఎడమ వైపున ఒకడును ఇద్దరు బందిపోటు దొంగలు ఆయనతోకూడ సిలువవేయబడినప్పుడు’ ఆ మాటలు నెరవేరాయి.—మత్త. 27:38.

13. కీర్తన 22:7, 8 ఎలా నెరవేరింది?

13 మెస్సీయను ప్రజలు ఎగతాళి చేస్తారని దావీదు ప్రవచించాడు. (కీర్తన 22:7, 8 చదవండి.) హింసాకొయ్యపై బాధపడుతున్నప్పుడు యేసును ప్రజలు ఎగతాళి చేశారని చెబుతూ మత్తయి ఇలా రాశాడు: “ఆ మార్గమున వెళ్లుచుండినవారు తలలూచుచు —దేవాలయమును పడగొట్టి మూడు దినములలో కట్టువాడా, నిన్ను నీవే రక్షించుకొనుము; నీవు దేవుని కుమారుడవైతే సిలువమీదనుండి దిగుమని చెప్పుచు ఆయనను దూషించిరి.” అలాగే శాస్త్రులు, పెద్దలు, ప్రధాన యాజకులు కూడా ఆయనను ఎగతాళి చేస్తూ, “వీడు ఇతరులను రక్షించెను, తన్నుతానే రక్షించుకొనలేడు; ఇశ్రాయేలు రాజుగదా, యిప్పుడు సిలువమీదనుండి దిగినయెడల వాని నమ్ముదుము. వాడు దేవునియందు విశ్వాసముంచెను, నేను దేవుని కుమారుడనని చెప్పెను గనుక ఆయనకిష్టుడైతే ఆయన ఇప్పుడు వానిని తప్పించును” అని అన్నారు. (మత్త. 27:39-43) వారు అలా బాధపెట్టినా యేసు మౌనంగా ఉన్నాడేగానీ తిరిగి దూషించలేదు. మనందరికీ ఆయన మంచి మాదిరి.

14, 15. మెస్సీయ అంగీ గురించిన, ఆయనకు చిరక ఇవ్వడం గురించిన ప్రవచనాలు ఎలా నెరవేరాయి?

14 మెస్సీయ అంగీ కోసం చీట్లు వేస్తారు. “నా వస్త్రములు వారు పంచుకొనుచున్నారు నా అంగీకొరకు చీట్లు వేయుచున్నారు” అని కీర్తనకర్త రాశాడు. (కీర్త. 22:18) సరిగ్గా అలాగే జరిగింది, “[రోమా సైనికులు యేసును] సిలువవేసిన పిమ్మట చీట్లువేసి ఆయన వస్త్రములు పంచుకొనిరి.”—మత్త. 27:35; యోహాను 19:23, 24 చదవండి.

15 మెస్సీయకు చేదును, చిరకను ఇస్తారు. కీర్తన కర్త ఇలా రాశాడు: “వారు చేదును నాకు ఆహారముగా పెట్టిరి నాకు దప్పియైనప్పుడు చిరకను త్రాగనిచ్చిరి.” (కీర్త. 69:21) ఈ ప్రవచనం నెరవేరింది ఎందుకంటే, మత్తయి ఇలా చెప్పాడు: “చేదు కలిపిన ద్రాక్షారసమును [యేసుకు] త్రాగనిచ్చిరి గాని ఆయన దానిని రుచి చూచి త్రాగనొల్లకపోయెను.” తర్వాత, “వారిలో ఒకడు పరుగెత్తికొనిపోయి, స్పంజీ తీసికొని చిరకాలో ముంచి, రెల్లున తగిలించి ఆయనకు త్రాగనిచ్చెను.”—మత్త. 27:34, 48.

16. కీర్తన 22:1లోని ప్రవచనం ఎలా నెరవేరింది?

16 మెస్సీయను దేవుడు విడిచిపెట్టినట్లుగా అనిపిస్తుంది. (కీర్తన 22:1 చదవండి.) ప్రవచించబడినట్లుగానే, “మూడు గంటలకు యేసు ఎలోయీ, ఎలోయీ, లామా సబక్తానీ అని బిగ్గరగా కేకవేసెను; ఆ మాటలకు నా దేవా, నా దేవా, నన్ను ఎందుకు చెయ్యి విడిచితివని అర్థము.” (మార్కు 15:34) ఆయన దేవుని మీద విశ్వాసాన్ని కోల్పోయాడని దానర్థం కాదు. ఎందుకంటే, యేసు యథార్థత సంపూర్ణంగా పరీక్షించబడాలనే ఉద్దేశంతో దేవుడే ఆయనను శత్రువుల చేతికి అప్పగించాడు. “నా దేవా, నా దేవా, నన్ను ఎందుకు చెయ్యి విడిచితివి” అని అనడం ద్వారా కీర్తన 22:1లోని ప్రవచనాన్ని యేసు నెరవేర్చాడు.

17. జెకర్యా 12:10, కీర్తన 34:20 ఎలా నెరవేరాయి?

17 మెస్సీయను పొడుస్తారు కానీ ఆయన ఎముకలలో ఒక్కటి కూడా విరిగిపోదు. యెరూషలేము నివాసులు ‘తాము పొడిచిన వానిమీద దృష్టి ఉంచుతారు’ అని జెకర్యా రాశాడు. (జెక. 12:10) అలాగే కీర్తన 34:20 ఇలా చెబుతోంది: “[దేవుడు] వాని యెముకలన్నిటిని కాపాడును వాటిలో ఒక్కటియైనను విరిగిపోదు.” ఆ మాటలు నెరవేరాయని చెబుతూ అపొస్తలుడైన యోహాను ఇలా రాశాడు: “సైనికులలో ఒకడు ఈటెతో [యేసు] ప్రక్కను పొడిచెను, వెంటనే రక్తమును నీళ్లును కారెను. ఇది చూచిన [యోహాను] సాక్ష్యమిచ్చుచున్నాడు, అతని సాక్ష్యము సత్యమే.” యోహాను ఇంకా ఇలా అన్నాడు: “అతని యెముకలలో ఒకటైనను విరువబడదు అను లేఖనము నెరవేరునట్లు ఇవి జరిగెను. మరియు—తాము పొడిచిన వానితట్టు చూతురు అని మరియొక లేఖనము చెప్పుచున్నది.”—యోహా. 19:33-37.

18. యేసు ఏ విధంగా ధనవంతులతోపాటు సమాధి చేయబడ్డాడు?

18 ధనవంతులతోపాటు సమాధి చేయబడతాడు. (యెషయా 53:5, 8, 9 చదవండి.) నీసాను 14 సాయంత్రం “అరిమతయియ యోసేపు అను ఒక ధనవంతుడు” పిలాతు దగ్గరకు వెళ్లి యేసు దేహాన్ని ఇవ్వమని అడిగినప్పుడు ఆయన దానికి అంగీకరించాడు. దాని గురించి మత్తయి ఇలా రాశాడు: “యోసేపు ఆ దేహమును తీసికొని శుభ్రమైన నారబట్టతో చుట్టి తాను రాతిలో తొలిపించుకొనిన క్రొత్త సమాధిలో దానిని ఉంచి, సమాధి ద్వారమునకు పెద్దరాయి పొర్లించి వెళ్లిపోయెను.”—మత్త. 27:57-60.

మన రాజైన మెస్సీయను స్తుతించండి!

19. కీర్తన 16:10లోని ప్రవచనం ఎలా నెరవేరింది?

19 పునరుత్థానం చేయబడతాడు. దావీదు ఇలా రాశాడు: “నీవు నా ఆత్మను పాతాళములో విడచిపెట్టవు.” (కీర్త. 16:10) నీసాను 16న యేసు సమాధి దగ్గరకు కొందరు స్త్రీలు వెళ్లారు. సమాధి లోపల ఒక దేవదూత కూర్చుని ఉండడాన్ని చూసి వారు ఎంతగా ఆశ్చర్యపోయి ఉంటారో ఒక్కసారి ఊహించండి. ఆ దూత వారితో ఇలా చెప్పాడు: “కలవరపడకుడి సిలువ వేయబడిన నజరేయుడగు యేసును మీరు వెదకుచున్నారు; ఆయన లేచియున్నాడు, ఇక్కడలేడు; వారు ఆయనను ఉంచిన స్థలము చూడుడి.” (మార్కు 16:6) ఆ తర్వాత సా.శ. 33 పెంతెకొస్తు రోజున యెరూషలేములో ఉన్న జనసమూహానికి పేతురు ఇలా ప్రకటించాడు: “క్రీస్తు పాతాళములో విడువబడలేదనియు, ఆయన శరీరము కుళ్లిపోలేదనియు దావీదు ముందుగా తెలిసికొని ఆయన పునరుత్థానమును గూర్చి చెప్పెను.” (అపొ. 2:29-31) తన ప్రియ కుమారుని శరీరాన్ని దేవుడు కుళ్లిపోనివ్వలేదు. అంతేకాక ఆయన యేసును అద్భుతరీతిలో ఆత్మప్రాణిగా పునరుత్థానం చేశాడు!—1 పేతు. 3:18.

20. మెస్సీయ పరిపాలన గురించి ప్రవచనాలు ఏమి చెబుతున్నాయి?

20 యేసు తన కుమారుడని దేవుడు ప్రకటిస్తాడు. (కీర్తన 2:7; మత్తయి 3:17 చదవండి.) అంతేకాక జనసమూహాలు యేసును, ఆయన రాజ్యాన్ని స్తుతించారు. అలాగే మనం కూడా ఆయన గురించి, అద్భుతమైన ఆయన రాజ్యం గురించి ప్రకటిస్తాం. (మార్కు 11:7-10) త్వరలోనే ఆయన ‘సత్యాన్ని, వినయంతో కూడిన నీతిని స్థాపించడానికి వాహనమెక్కి బయలుదేరి’ తన శత్రువులను నాశనం చేస్తాడు. (కీర్త. 2:8, 9; 45:1-6) అప్పుడు ఆయన పరిపాలనలో భూవ్యాప్తంగా శాంతి, సమృద్ధి నెలకొంటాయి. (కీర్త. 72:1, 3, 12, 16; యెష. 9:6, 7) యెహోవా ప్రియ కుమారుడైన మెస్సీయ ఇప్పటికే పరలోకంలో రాజుగా పరిపాలిస్తున్నాడు. కాబట్టి యెహోవాకు సాక్షులుగా ఉంటూ, ఆ సత్యాల గురించి ఇతరులకు ప్రకటించగలగడం మనకు దొరికిన గొప్ప అవకాశం.

మీరెలా జవాబిస్తారు?

• యేసుకు నమ్మకద్రోహం జరగడం గురించిన, శిష్యులు ఆయనను వదిలివెళ్లడం గురించిన ప్రవచనాలు ఎలా నెరవేరాయి?

• యేసు మరణం గురించిన ప్రవచనాలు ఎలా నెరవేరాయి?

• యేసే మెస్సీయ అని మీరెందుకు బలంగా నమ్ముతున్నారు?

[అధ్యయన ప్రశ్నలు]

[13వ పేజీలోని చిత్రం]

యేసు యెరూషలేములోకి రాజుగా ప్రవేశించినప్పుడు ఏ ప్రవచనాలు నెరవేరాయి?

[15వ పేజీలోని చిత్రాలు]

యేసు మన పాపాల నిమిత్తం చనిపోయాడు, అయితే ఇప్పుడు రాజుగా పరిపాలిస్తున్నాడు