కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

వారు మెస్సీయ కోసం ఎదురుచూశారు

వారు మెస్సీయ కోసం ఎదురుచూశారు

వారు మెస్సీయ కోసం ఎదురుచూశారు

‘ప్రజలు కనిపెట్టుచు, ఇతడు క్రీస్తయి యుండునేమో అని అందరును యోహానును గూర్చి తమ హృదయములలో ఆలోచించుకొనుచుండిరి.’—లూకా 3:15.

1. గొర్రెల కాపరులకు దూత ఏ సంతోషకరమైన వార్త చెప్పాడు?

 గొర్రెల కాపరులు రాత్రిపూట పొలాల్లో తమ మందలను కాస్తున్నప్పుడు, అకస్మాత్తుగా యెహోవా దూత వారి దగ్గరికి రావడంతో వారి చుట్టూ గొప్ప వెలుగు ప్రకాశించింది. అప్పుడు వారెంతో భయపడినా దూత చెప్పిన ఈ సంతోషకరమైన వార్తను విన్నారు: ‘భయపడకుడి, ఇదిగో ప్రజలందరికిని కలుగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను, నేడు రక్షకుడు మీకొరకు పుట్టియున్నాడు. ఈయన ప్రభువైన క్రీస్తు.’ దూత చెప్పిన ఆ శిశువే క్రీస్తు లేదా మెస్సీయ అవుతాడు. దగ్గర్లోని పట్టణంలోవున్న ఒక పశువుల తొట్టిలో ఆ శిశువు ఉన్నాడని దూత వారితో చెప్పాడు. ఉన్నట్టుండి చాలామంది దూతలు కనిపించి యెహోవాను ఇలా స్తుతించారు: “సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకిష్టులైన మనుష్యులకు భూమిమీద సమాధానమును కలుగునుగాక.”—లూకా 2:8-14.

2. “మెస్సీయ” అంటే అర్థమేమిటి? ఆయనను ఎలా గుర్తించవచ్చు?

2 ఆ యూదా కాపరులకు “మెస్సీయ” లేదా “క్రీస్తు” అంటే దేవుని “అభిషిక్తుడు” అని తెలుసు. (నిర్గ. 29:5-7) దేవదూత చెప్పిన ఆ శిశువే యెహోవా ఎంపిక చేసుకున్న మెస్సీయ అని స్పష్టంగా గ్రహించి వారెలా ఇతరులను ఒప్పించవచ్చు? హెబ్రీ లేఖనాల్లో ఉన్న ప్రవచనాలను పరిశీలించి, వాటిని ఆ శిశువు చేయబోయే పనులతో, ఆయన జీవితంతో పోల్చి చూడడం ద్వారా ఆయనే మెస్సీయ అనే నిర్ధారణకు రావచ్చు.

మెస్సీయ కోసం ప్రజలెందుకు ఎదురుచూశారు?

3, 4. దానియేలు 9:24, 25లోని ప్రవచనం ఎలా నెరవేరింది?

3 చాలా సంవత్సరాల తర్వాత బాప్తిస్మమిచ్చు యోహాను ప్రకటనా పని మొదలుపెట్టాడు. ఆయన మాటలను, చేతలను చూసి చాలామంది ఆయనే మెస్సీయ అనుకున్నారు. (లూకా 3:15 చదవండి.) కానీ బైబిల్లోని 70 వారాలకు సంబంధించిన ప్రవచనం వల్ల మెస్సీయ ఎప్పుడు కనిపిస్తాడో ప్రజలు అర్థం చేసుకోగలిగారు. ఆ ప్రవచనం ఇలా చెబుతోంది: ‘నీ జనమునకు డెబ్బదివారములు విధింపబడెను. యెరూషలేమును మరల కట్టించవచ్చునని ఆజ్ఞ బయలుదేరిన సమయము మొదలుకొని అభిషిక్తుడగు అధిపతి వచ్చు వరకు ఏడు వారములు, అరువది రెండు వారములు పట్టును.’ (దాని. 9:24, 25) అవి ఏడు రోజులు ఉండే వారాలు కావనీ, ఒక్కో రోజు ఒక్కో సంవత్సరాన్ని సూచించే 70 వారాలనీ బైబిలు పండితులు ఒప్పుకుంటున్నారు. రివైజ్డ్‌ స్టాండర్డ్‌ వర్షన్‌ ఆంగ్ల బైబిల్లో దానియేలు 9:24 ఇలా ఉంది: ‘ఒక్కో రోజు ఒక్కో సంవత్సరాన్ని సూచించే 70 వారాలు నియమించబడ్డాయి.’

4 దానియేలు 9:25లోని 69 వారాలు 483 సంవత్సరాలకు సమానమనీ అవి సా.శ.పూ. 455లో ప్రారంభమయ్యాయనీ నేటి యెహోవా ప్రజలకు తెలుసు. ఆ సంవత్సరంలో, యెరూషలేమును మరమ్మతు చేసి తిరిగి కట్టించమని పారసీక రాజైన అర్తహషస్త నెహెమ్యాకు చెప్పాడు. (నెహె. 2:1-8) ఆ 483 సంవత్సరాలు, యేసు బాప్తిస్మం తీసుకున్నప్పుడు అంటే సా.శ. 29లో ముగిశాయి. అప్పుడే యెహోవా తన పరిశుద్ధాత్మతో అభిషేకించడంతో యేసు మెస్సీయ అయ్యాడు.—మత్త. 3:13-17. a

5. మనం ఏ ప్రవచనాల గురించి తెలుసుకోబోతున్నాం?

5 మెస్సీయ గురించి బైబిల్లో ఇంకా అనేక ప్రవచనాలున్నాయి. వాటిలో కొన్నిటిని ఈ ఆర్టికల్‌లో పరిశీలిస్తాం. అవి మెస్సీయ జీవితం గురించి అంటే ఆయన జననం, బాల్యం, పరిచర్య గురించి చెబుతున్నాయి. యేసు జీవితంలో ఆ ప్రవచనాలు ఎలా నెరవేరాయో మనం తెలుసుకుంటాం. అలా తెలుసుకోవడం వల్ల మన విశ్వాసం బలపడుతుంది, ప్రజలు ఎదురుచూసిన మెస్సీయ యేసే అని రుజువౌతుంది.

మెస్సీయ జననానికి, బాల్యానికి సంబంధించిన ప్రవచనాలు

6. ఆదికాండము 49:10లోని ప్రవచనం ఎలా నెరవేరింది?

6 యూదా గోత్రంలో జన్మిస్తాడు. యాకోబు చనిపోయేముందు తన కుమారుల్ని ఆశీర్వదిస్తూ యూదాతో ఇలా అన్నాడు: “షిలోహు వచ్చువరకు యూదా యొద్దనుండి దండము తొలగదు అతని కాళ్ల మధ్యనుండి రాజదండము తొలగదు ప్రజలు అతనికి విధేయులై యుందురు.” (ఆది. 49:10) ఆయన మెస్సీయ గురించే ఆ మాటలు చెప్పాడని యూదులు నమ్మేవారు. యాకోబు మాటల అర్థమేమిటి? దండము, రాజదండము అనేవి రాజుకున్న పరిపాలించే హక్కును, ఆజ్ఞలిచ్చే హక్కును సూచిస్తాయి కాబట్టి ఆయన ఒక రాజు గురించి మాట్లాడుతున్నాడని మనకు అర్థమౌతుంది. ఈ ప్రవచనం చెబుతున్నట్లుగా పరిపాలించే హక్కు ఉన్న రాజు యూదా గోత్రం నుండి రావాలి. యూదా నుండి వచ్చిన మొదటి రాజు దావీదు, చివరి రాజు సిద్కియా. కానీ ఆ ప్రవచనం, సిద్కియా తర్వాత వచ్చే మరో రాజు గురించి మాట్లాడుతోంది. ఆ రాజు నిరంతరం పరిపాలిస్తాడు. ఆయన షిలోహు అని పిలువబడ్డాడు, ఆ మాటకు “స్వాస్థ్యకర్త” అని అర్థం. ఆ రాజుకే న్యాయపరమైన హక్కు ఉందని దేవుడు సిద్కియాతో చెప్పాడు. (యెహె. 21:26, 27) యేసు పుట్టడానికి ముందు గబ్రియేలు దూత మరియతో ఇలా చెప్పాడు: “ప్రభువైన దేవుడు ఆయన తండ్రియైన దావీదు సింహాసనమును ఆయనకిచ్చును. ఆయన యాకోబు వంశస్థులను యుగయుగములు ఏలును; ఆయన రాజ్యము అంతములేనిదై యుండును.” (లూకా 1:32, 33) యూదా గోత్రానికి చెందిన దావీదు కుటుంబం నుండి యేసు వచ్చాడు. ఆయనకే యెహోవా పరిపాలనా హక్కును వాగ్దానం చేశాడు. కాబట్టి యేసుక్రీస్తే షిలోహు అయ్యుండాలి.—మత్త. 1:1-3, 6; లూకా 3:23, 31-34, 38.

7. మెస్సీయ జననం గురించిన ప్రవచనం ఎలా నెరవేరింది?

7 బేత్లెహేములో పుడతాడు. మీకా ప్రవక్త ఇలా రాశాడు: “బేత్లెహేము ఎఫ్రాతా, యూదావారి కుటుంబములలో నీవు స్వల్పగ్రామమైనను నాకొరకు ఇశ్రాయేలీయులను ఏలబోవువాడు నీలోనుండి వచ్చును; పురాతన కాలము మొదలుకొని శాశ్వత కాలము ఆయన ప్రత్యక్షమగుచుండెను.” (మీకా 5:2) మెస్సీయ బేత్లెహేములో పుడతాడని ఆ ప్రవచనం చెబుతోంది. యూదయలోని ఆ పట్టణం ఒకప్పుడు ఎఫ్రాతా అని పిలువబడేది. కానీ యేసు తల్లి మరియ, ఆమె భర్త యోసేపు నజరేతులో నివసించేవారు. యేసు పుట్టడానికి కొన్ని రోజుల ముందు, ప్రజలందరూ తమ తండ్రులు పుట్టిన స్థలాలకు వెళ్ళి పేర్లు నమోదు చేసుకోవాలని రోమా పరిపాలకుడు ఆజ్ఞ జారీచేశాడు. అందుకే మరియ, యోసేపు బేత్లెహేముకు తిరిగి వెళ్ళారు, అక్కడే మరియ యేసుకు జన్మనిచ్చింది. (మత్త. 2:1, 5, 6) కాబట్టి ప్రవచించబడినట్లుగానే యేసు బేత్లెహేములో పుట్టాడు.

8, 9. మెస్సీయ జననం గురించి, ఆయన పుట్టిన తర్వాత జరిగే సంఘటనల గురించి ఏమి ప్రవచించబడింది?

8 ఒక కన్యక ఆయనకు జన్మనిస్తుంది. (యెషయా 7:14 చదవండి.) ఈ వచనం ఒక “కన్యక” మగ శిశువును కంటుందని ప్రవచించింది. మత్తయి దైవ ప్రేరణతో, యేసు జననం విషయంలో ఆ ప్రవచనం నెరవేరిందని రాశాడు. కన్యకయైన మరియ దేవుని పరిశుద్ధాత్మ వల్ల గర్భం ధరించిందని సువార్త రచయితలు మత్తయి, లూకా రాశారు.—మత్త. 1:18-25; లూకా 1:26-35.

9 ఆయన పుట్టిన తర్వాత పిల్లలు చంపబడతారు. మెస్సీయ పుట్టడానికి శతాబ్దాల క్రితం అలాంటిదే జరిగింది. ఐగుప్తు రాజైన ఫరో హెబ్రీయులకు పుట్టిన మగ పిల్లలనందరినీ నైలు నదిలో పడేయమని ప్రజలకు ఆజ్ఞాపించాడు. (నిర్గ. 1:22) తన పిల్లలు చనిపోయినందుకు ‘రాహేలు ఏడ్వడం’ గురించి యిర్మీయా 31:15, 16 ప్రవచించింది. ఆమె ఏడ్పు, ఎక్కడో యెరూషలేముకు ఉత్తరాన ఉన్న బెన్యామీను పట్టణంలోని రామాలో వినిపించింది. హేరోదు రాజు బేత్లెహేములోని మగ పిల్లలనందరినీ చంపించినప్పుడు ఆ ప్రవచనం నెరవేరిందని మత్తయి రాశాడు. (మత్తయి 2:16-18 చదవండి.) ఆ ప్రజలు ఎంతగా ఏడ్చివుంటారో ఒక్కసారి ఆలోచించండి!

10. హోషేయ 11:1లోని ప్రవచనం ఎలా నెరవేరింది?

10 ఐగుప్తు నుండి పిలువబడతాడు. (హోషే. 11:1) హేరోదు రాజు నుండి యేసును కాపాడడానికి, ఆయనను తీసుకొని ఇశ్రాయేలు దేశాన్ని విడిచి ఐగుప్తుకు వెళ్ళమని దూత యోసేపు మరియలకు చెప్పాడు. హేరోదు చనిపోయేంతవరకూ వారు అక్కడే ఉండి ఆ తర్వాత యేసును తీసుకొని ఇశ్రాయేలు దేశానికి తిరిగి వెళ్ళారు. “ఐగుప్తులోనుండి నా కుమారుని పిలిచితిని” అని యెహోవా హోషేయతో చెప్పిన మాట నెరవేరింది. (మత్త. 2:13-15) నిజానికి తన జనన సమయంలో, బాల్యంలో తన చుట్టూ జరుగుతున్నవాటిని యేసు అదుపు చేయగలిగి ఉండేవాడు కాదు.

మెస్సీయ పరిచర్యను మొదలుపెడతాడు

11. మెస్సీయ కోసం ఎవరు మార్గాన్ని సిద్ధం చేశారు?

11 ఒక ప్రవక్త మెస్సీయ కోసం మార్గాన్ని సిద్ధం చేస్తాడు. మెస్సీయ వచ్చినప్పుడు ప్రజలు ఆయనను అంగీకరించేలా ఏలీయా ప్రవక్త మార్గాన్ని సిద్ధం చేస్తాడని మలాకీ ప్రవచించాడు. (మలాకీ 4:5, 6 చదవండి.) ప్రవచింపబడిన ఆ ఏలీయా మరెవరో కాదు బాప్తిస్మమిచ్చు యోహానే అని యేసు చెప్పాడు. (మత్త. 11:12-14) యెషయా ప్రవచించినట్లుగానే యోహాను యేసుకు మార్గాన్ని సిద్ధం చేశాడని మార్కు రాశాడు. (యెష. 40:3; మార్కు 1:1-4) తన కోసం మార్గాన్ని సిద్ధం చేయమని యేసు యోహానుకు చెప్పలేదు. మెస్సీయ ఎవరో తన ప్రజలు తెలుసుకోవాలని దేవుడు కోరుకున్నాడు కాబట్టి ఏలీయా ప్రవక్త చేసినలాంటి పని చేయడానికి, ప్రజలు మెస్సీయను స్వాగతించేలా చేయడానికి యోహానును దేవుడే ఎంపిక చేసుకున్నాడు.

12. మెస్సీయకు ఏ ప్రత్యేకమైన పని అప్పగించబడింది?

12 దేవుడు ఆయనకు ఒక ప్రత్యేకమైన పని అప్పగిస్తాడు. యేసు ఒకరోజు తాను పెరిగిన నజరేతులోని సమాజమందిరంలో గ్రంథపు చుట్ట తెరచి యెషయా రాసిన ఈ మాటలు చదివాడు: “ప్రభువు ఆత్మ నామీద ఉన్నది బీదలకు సువార్త ప్రకటించుటకై ఆయన నన్ను అభిషేకించెను చెరలోనున్న వారికి విడుదలను, గ్రుడ్డివారికి చూపును, (కలుగునని) ప్రకటించుటకును నలిగినవారిని విడిపించుటకును ప్రభువు హితవత్సరము ప్రకటించుటకును ఆయన నన్ను పంపియున్నాడు.” ఆ ప్రవచనం తన గురించే చెప్పబడిందని యేసు అన్నాడు. అవును ఆయనే మెస్సీయ. అందుకే, “నేడు మీ వినికిడిలో ఈ లేఖనము నెరవేరినది” అని ఆయన చెప్పగలిగాడు.—లూకా 4:16-21.

13. యేసు గలిలయలో పరిచర్య మొదలుపెట్టడం గురించి యెషయా ఏమి చెప్పాడు?

13 గలిలయలో పరిచర్య మొదలుపెడతాడని ప్రవచించబడింది. ‘జెబూలూను దేశము, నఫ్తాలి దేశము, అన్యజనుల గలిలయ ప్రదేశము’ గురించి యెషయా ఇలా ప్రవచించాడు: “చీకటిలో నడుచు జనులు గొప్ప వెలుగును చూచుచున్నారు మరణచ్ఛాయగల దేశనివాసులమీద వెలుగు ప్రకాశించును.” (యెష. 9:1, 2) గలిలయలోని కపెర్నహూము పట్టణంలో యేసు పరిచర్య ప్రారంభించాడు. అంతేకాక ఆయన జెబూలూను, నఫ్తాలి దేశాల్లోని ప్రజలపై గొప్ప వెలుగును ప్రకాశింపజేసే సత్యాలను బోధించి వారికి సహాయం చేశాడు. (మత్త. 4:12-16) యేసు గలిలయలోనే కొండమీది ప్రసంగం ఇచ్చాడు, అపొస్తలుల్ని ఎంపిక చేసుకున్నాడు, మొదటి అద్భుతం చేశాడు. యేసు పునరుత్థానం చేయబడిన తర్వాత గలిలయలోనే 500 కన్నా ఎక్కువమంది శిష్యులకు కనిపించాడు. (మత్త. 5:1–7:27; 28:16-20; లూకా 6:12, 13; యోహా. 2:8-11; 1 కొరిం. 15:6) ‘జెబూలూను, నఫ్తాలి దేశాల్లో’ యేసు ప్రకటించినప్పుడు యెషయా ప్రవచనం నెరవేరింది. దేవుని రాజ్య సువార్తను యేసు ఇశ్రాయేలులోని ఇతర ప్రాంతాల్లో కూడా ప్రకటించాడు.

మెస్సీయకు సంబంధించిన మరిన్ని ప్రవచనాలు

14. కీర్తన 78:2 ఎలా నెరవేరింది?

14 కథలతో, ఉపమానాలతో బోధిస్తాడు. ఆసాపు ఒక కీర్తనలో ఇలా పాడాడు: “నేను నోరు తెరచి ఉపమానము చెప్పెదను.” (కీర్త. 78:2) ఈ ప్రవచనం ఎలా నెరవేరిందో మత్తయి చెబుతున్నాడు. యేసు ఎల్లప్పుడూ ఉపమానాలతో లేదా ఉదాహరణలతో బోధించేవాడు. దేవుని రాజ్యం గురించి ప్రజలకు బోధించడానికి యేసు ఆవగింజను, పులిసిన పిండిని ఉపమానాలుగా ఉపయోగించిన సందర్భం గురించి మత్తయి ఇలా రాశాడు: “నేను నా నోరు తెరచి ఉపమానరీతిగా బోధించెదను, లోకము పుట్టినది మొదలుకొని మరుగుచేయబడిన సంగతులను తెలియజెప్పెదను అని ప్రవక్త చెప్పినమాట నెరవేరునట్లు యేసు ఈ సంగతులనన్నిటిని జనసమూహములకు ఉపమానరీతిగా బోధించెను; ఉపమానము లేక వారికేమియు బోధింపలేదు.” (మత్త. 13:31-35) కథలు, ఉపమానాలు ఉపయోగించి యేసు బోధించడం వల్ల చాలామంది యెహోవా గురించిన సత్యాన్ని అర్థం చేసుకోగలిగారు.

15. యెషయా 53:4లోని ప్రవచనం ఎలా నెరవేరింది?

15 ప్రజల్ని స్వస్థపరుస్తాడు. యెషయా ఇలా ప్రవచించాడు: “నిశ్చయముగా అతడు మన రోగములను భరించెను మన వ్యసనములను వహించెను.” (యెష. 53:4) పేతురు అత్త అనారోగ్యంతో బాధపడుతున్నప్పుడు యేసు ఆమెను స్వస్థపర్చాడు. ఆ తర్వాత చాలామంది రోగులు పేతురు ఇంటికి రావడంతో యేసు వారిని కూడా స్వస్థపర్చాడు. “ఆయనే మన బలహీనతలను వహించుకొని మన రోగములను భరించెను” అని ప్రవక్తయైన యెషయా చెప్పిన మాటలు నెరవేరాయని మత్తయి రాశాడు. (మత్త. 8:14-17) అంతేకాక యేసు అనేక ఇతర సందర్భాల్లో కూడా స్వస్థతలు చేశాడని బైబిలు చెబుతోంది.

16. యెషయా 53:1లోని మాటలు యేసు గురించే చెబుతున్నాయి అనేందుకు అపొస్తలుడైన యోహాను ఏ రుజువునిచ్చాడు?

16 మెస్సీయ ఎన్నో మంచి పనులు చేసినా ప్రజలు ఆయనను నమ్మరు. (యెషయా 53:1 చదవండి.) ఆ ప్రవచనం నెరవేరిందని చెబుతూ అపొస్తలుడైన యోహాను ఇలా రాశాడు: “ఆయన వారి యెదుట యిన్ని సూచకక్రియలు చేసినను వారాయనయందు విశ్వాసముంచరైరి. —ప్రభువా, మా వర్తమానము నమ్మిన వాడెవడు? ప్రభువు యొక్క బాహువు ఎవనికి బయలుపరచబడెను? అని ప్రవక్తయైన యెషయా చెప్పిన వాక్యము నెరవేరునట్లు ఇది జరిగెను.” (యోహా. 12:37, 38) అంతెందుకు ఎన్నో సంవత్సరాల తర్వాత అపొస్తలుడైన పౌలు సువార్త ప్రకటించినప్పుడు కూడా యేసే మెస్సీయ అని చాలామంది నమ్మలేదు.—రోమా. 10:16, 17.

17. కీర్తన 69:4లోని ప్రవచనం ఎలా నెరవేరింది?

17 ప్రజలు అకారణంగా ఆయనను ద్వేషిస్తారు. (కీర్త. 69:4) యేసు ఇలా అన్నాడు: “ఎవడును చేయని క్రియలు నేను వారి మధ్య చేయకుండినయెడల వారికి పాపము లేకపోవును; ఇప్పుడైతే వారు నన్నును నా తండ్రినిని చూచి ద్వేషించియున్నారు. అయితే—నన్ను నిర్హేతుకముగా ద్వేషించిరి అని వారి ధర్మశాస్త్రములో వ్రాయబడిన వాక్యము నెరవేరునట్లు ఈలాగు జరిగెను.” (యోహా. 15:24, 25) ఈ లేఖనంలోవున్న “ధర్మశాస్త్రము” అనే మాట ఆ కాలంలో అందుబాటులోవున్న లేఖనాలన్నిటినీ సూచిస్తోంది. (యోహా. 10:34; 12:34) చాలామంది, ముఖ్యంగా యూదా మతనాయకులు యేసును ద్వేషించారని సువార్త వృత్తాంతాలు స్పష్టంగా చెబుతున్నాయి. అంతేకాక క్రీస్తు ఇలా చెప్పాడు: “లోకము మిమ్మును ద్వేషింపనేరదు గాని, దాని క్రియలు చెడ్డవని నేను దానినిగూర్చి సాక్ష్యమిచ్చుచున్నాను గనుక అది నన్ను ద్వేషించుచున్నది.”—యోహా. 7:7.

18. యేసుక్రీస్తే మెస్సీయ అనే నమ్మకం బలపడాలంటే మనం ఇంకా ఏమి పరిశీలించాలి?

18 హెబ్రీ లేఖనాల్లోని మెస్సీయ సంబంధిత ప్రవచనాలు యేసు విషయంలో నెరవేరాయి కాబట్టి మొదటి శతాబ్దంలోని ఆయన అనుచరులు ఆయనే మెస్సీయ అని నమ్మారు. (మత్త. 16:16) యేసు బాల్యంలో, పరిచర్యలో నెరవేరిన కొన్ని ప్రవచనాలను ఈ ఆర్టికల్‌లో చూశాం. తర్వాతి ఆర్టికల్‌లో మరిన్ని ప్రవచనాలను పరిశీలిస్తాం. ఆ ప్రవచనాల గురించి ప్రార్థనాపూర్వకంగా ధ్యానిస్తే, మన పరలోక తండ్రియైన యెహోవా ఎంచుకున్న మెస్సీయ యేసుక్రీస్తే అన్న నమ్మకం బలపడుతుంది.

[అధస్సూచి]

a ‘డెబ్బై వారాల’ గురించి ఎక్కువ తెలుసుకోవాలంటే బైబిలు నిజంగా ఏమి బోధిస్తోంది? పుస్తకంలోని 198-199 పేజీలు చదవండి.

మీరెలా జవాబిస్తారు?

• యేసు జననం విషయంలో ఏ ప్రవచనాలు నెరవేరాయి?

• మెస్సీయ కోసం మార్గం ఎలా సిద్ధం చేయబడింది?

• యెషయా 53వ అధ్యాయంలోని ఏ ప్రవచనాలు యేసులో నెరవేరాయి?

[అధ్యయన ప్రశ్నలు]