పరుగుపందెంలో ఓపికగా పరుగెత్తండి
పరుగుపందెంలో ఓపికగా పరుగెత్తండి
“మన యెదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరుగెత్తుదము.”—హెబ్రీ. 12:1.
1, 2. నిజక్రైస్తవుల జీవితాన్ని బైబిలు దేనితో పోలుస్తోంది?
ప్రపంచవ్యాప్తంగా ప్రతీ సంవత్సరం ఎంతోమంది మారథన్ రేసుల్లో పాల్గొంటారు. వాళ్ళలో చక్కగా పరుగెత్తగల కొంతమంది సమర్థులు పోటీలో తప్పకుండా గెలవాలనే ఉద్దేశంతో పాల్గొంటారు. అయితే మరికొంతమంది పోటీలో గెలవాలనే ఉద్దేశంతో పరుగెత్తరు, పరుగుపందెంలో చివరివరకు పరుగెత్తడమే గర్వించదగిన విషయంగా భావిస్తారు.
2 బైబిలు క్రైస్తవ జీవితాన్ని పరుగుపందెంతో పోలుస్తోంది. దాని గురించి అపొస్తలుడైన పౌలు ప్రాచీన కొరింథు సంఘంలోని క్రైస్తవులకు తన మొదటి పత్రికలో ఇలా రాశాడు, “పందెపు రంగమందు పరుగెత్తు వారందరు పరుగెత్తుదురు గాని యొక్కడే బహుమానము పొందునని మీకు తెలియదా? అటువలె మీరు బహుమానము పొందునట్లుగా పరుగెత్తుడి.”—1 కొరిం. 9:24.
3. ఒక్కరే బహుమానాన్ని పొందుతారని పౌలు ఏ ఉద్దేశంతో రాశాడు?
3 ఒక్కరే బహుమానాన్ని పొందుతారని పౌలు రాశాడు కాబట్టి, ఒకే ఒక్క క్రైస్తవుడు జీవమనే బహుమానాన్ని పొందుతాడని ఆయన ఉద్దేశమా? కాదు. పందెంలో పాల్గొనేవాళ్ళు గెలవాలనే ఉద్దేశంతో మంచి శిక్షణ తీసుకొని ఎంతో కష్టపడేవాళ్ళు. నిత్యజీవాన్ని పొందాలనే ఉద్దేశంతో తన తోటి క్రైస్తవులు కూడా అంతే కష్టపడాలని పౌలు కోరుకున్నాడు. అలా చేస్తే వాళ్ళు జీవమనే బహుమానాన్ని పొందుతామని ఆశించవచ్చు. క్రైస్తవ పరుగుపందెంలో ఆ పందెమును పూర్తి చేసేవాళ్ళందరూ బహుమానాన్ని పొందుతారు.
4. క్రైస్తవుల పరుగుపందెం గురించి మనం తెలుసుకోవాల్సిందేమిటి?
4 పౌలు రాసిన ఆ మాటలు మనకు ప్రోత్సాహాన్నిస్తున్నా, మన జీవన విధానం గురించి జాగ్రత్తగా ఆలోచించేలా చేస్తున్నాయి. యెహోవా ఇష్టపడేవిధంగా జీవిస్తే, పరలోకంలో గానీ పరదైసు భూమ్మీద గానీ నిరంతరం జీవించే అద్భుతమైన అవకాశం మనకుంటుంది. అయితే, క్రైస్తవులుగా జీవించడం అనేది ఎన్నో ప్రమాదాలున్న రోడ్డు మీద పరుగెత్తాల్సి వచ్చే సుదీర్ఘమైన పరుగుపందెం లాంటిది. యెహోవా సేవలో మన ఉత్సాహాన్ని తగ్గించే లేదా ఆయన సేవను ఆపేలా చేసే విషయాలు ఎన్నో ఉన్నాయి. (మత్త. 7:13, 14) గతంలో కొంతమంది యెహోవా సేవకులకు అలాగే జరిగింది. జీవమనే పరుగుపందెంలో ఎలాంటి ఉచ్చులు, ప్రమాదాలు ఉన్నాయి? వాటిని మనమెలా తప్పించుకోవచ్చు? మనమెలా పరుగుపందెమును పూర్తిచేసి విజయం సాధించవచ్చు?
గెలవాలంటే ఓపికగా పరుగెత్తాలి
5. హెబ్రీయులు 12:1లో పౌలు ఏమి వివరించాడు?
5 పౌలు యెరూషలేములో, యూదయలో ఉన్న హెబ్రీ క్రైస్తవులకు రాసిన పత్రికలో కూడా పరుగుపందెంలో పాల్గొనేవాళ్ళ గురించి మాట్లాడాడు. (హెబ్రీయులు 12:1 చదవండి.) క్రైస్తవులు తమ పందెంలో ఎందుకు పరుగెత్తుతూ ఉండాలో, పందెమును పూర్తిచేయడానికి వాళ్ళేమి చేయాలో ఆయన వివరించాడు. అసలు పౌలు హెబ్రీయులకు ఆ పత్రిక ఎందుకు రాశాడో, వాళ్ళేమి చేయాలని ఆయన కోరుకున్నాడో ముందుగా పరిశీలిద్దాం. ఆ తర్వాత ఆయన వాళ్ళకు రాసిన దాని నుండి మనం ఏమి నేర్చుకోవచ్చో చూద్దాం.
6. మతనాయకులు క్రైస్తవులను ఏమి చేయడానికి ప్రయత్నించారు?
6 మొదటి శతాబ్దంలోని క్రైస్తవులు, ముఖ్యంగా యెరూషలేములో, యూదయలో ఉన్న హెబ్రీ క్రైస్తవులు చాలా కష్టతరమైన పరిస్థితుల్లో జీవించారు. ఎందుకంటే ఆ సమయానికి యూదా మతనాయకులు, ప్రజలంతా తమకు లోబడాలని ఒత్తిడి చేయడానికి ప్రయత్నిస్తున్నారు. అంతేకాక, ప్రభుత్వానికి యేసుక్రీస్తు ఎదురుతిరిగాడని, ఆయన మరణ శిక్షకు తగిన నేరస్థుడని అంతకుముందు వాళ్ళు ప్రజలను నమ్మించారు. ఆ మతనాయకులు యేసుక్రీస్తును చంపడమేకాక, ప్రజలు ఆయన గురించి ప్రకటించకుండా ఆపాలని కూడా చూశారు. సా.శ. 33వ సంవత్సరంలో పెంతెకొస్తు తర్వాత ఏమి జరిగిందో అపొస్తలుల కార్యములు పుస్తకంలో చదివి తెలుసుకోవచ్చు. క్రైస్తవులు ప్రకటనా పని చేయకుండా ఆపేందుకు ఆ మతనాయకులు వాళ్ళమీద ఎన్నోసార్లు దాడిచేశారు. అందుకే నమ్మకమైన క్రైస్తవుల జీవితం చాలా కష్టంగా ఉండేది.—అపొ. 4:1-3; 5:17, 18; 6:8-12; 7:59; 8:1, 3.
7. అప్పటి క్రైస్తవుల జీవితం ఎందుకు చాలా కష్టతరంగా తయారైంది?
7 యెరూషలేము నాశనం చాలా దగ్గర్లో ఉన్నందువల్ల కూడా ఆ క్రైస్తవుల జీవితం చాలా కష్టతరంగా తయారైంది. దేవుడు యెరూషలేమును నాశనం చేయబోతున్నాడని యేసు అంతకుముందే హెచ్చరించాడు. నాశనానికి కొంచెం ముందు ఏమి జరుగుతుందో, అప్పుడు క్రైస్తవులు తమ ప్రాణాలు కాపాడుకోవడానికి సరిగ్గా ఏమి చేయాలో ఆయన చెప్పాడు. (లూకా 21:20-22 చదవండి.) యేసు వాళ్ళను ఇలా హెచ్చరించాడు, “మీ హృదయములు ఒకవేళ తిండివలనను మత్తువలనను ఐహిక విచారములవలనను మందముగా ఉన్నందున ఆ దినము అకస్మాత్తుగా మీ మీదికి ఉరివచ్చినట్టు రాకుండ మీ విషయమై మీరు జాగ్రత్తగా ఉండుడి.”—లూకా 21:34.
8. యెహోవా సేవలో కొంతమంది ఉత్సాహం ఎందుకు తగ్గిపోయి ఉంటుంది లేదా ఆయన సేవను వాళ్ళెందుకు ఆపేసి ఉంటారు?
8 యేసు ఆ మాటలు చెప్పిన దాదాపు 30 సంవత్సరాల తర్వాత పౌలు హెబ్రీయులకు పత్రిక రాశాడు. ఆ 30 సంవత్సరాల్లో హెబ్రీ క్రైస్తవులకు ఏమి జరిగింది? సమస్యల వల్ల లేదా రోజువారీ అవసరాల విషయంలో ఆందోళన వల్ల కొంతమంది యెహోవా గురించి నేర్చుకోవడం మానేసి ఆయనతో మంచి స్నేహాన్ని కాపాడుకోలేదు. (హెబ్రీ. 5:11-14) యూదుల్లోని చాలామందిలా జీవించడమే సులభమని కొంతమంది క్రైస్తవులు అనుకొని ఉండవచ్చు. యూదులు దేవుణ్ణి పూర్తిగా విడిచిపెట్టలేదు, పైగా మోషే ధర్మశాస్త్రంలోని చాలా విషయాలను పాటిస్తున్నారు కాబట్టి వాళ్ళలాగే జీవించడం తప్పేమీ కాదని ఆ క్రైస్తవులకు అనిపించివుండవచ్చు. అంతేకాక అప్పటికే సంఘ సభ్యుల్లో కొంతమంది మోషే ధర్మశాస్త్రాన్ని, యూదా మతాచారాలను పాటించాలని ఇతర క్రైస్తవులను ఒత్తిడి చేస్తున్నారు. కొంతమంది క్రైస్తవులు వాళ్ళను నమ్మారు, మరితరులేమో వాళ్ళకు భయపడి వాళ్ళు చెప్పింది విన్నారు. అయితే ఆధ్యాత్మికంగా మెలకువగా ఉండి, పందెంలో ఓపికగా పరుగెత్తాలని ప్రోత్సహించేందుకు పౌలు తన క్రైస్తవ సహోదరులకు ఏమి చెప్పాడు?
9, 10. (ఎ) హెబ్రీయులకు రాసిన పత్రికలోని 10వ అధ్యాయం చివర్లో, ఆ క్రైస్తవులు ఏమి చేయాలని పౌలు చెప్పాడు? (బి) ప్రాచీన కాలంలోని సాక్షులు విశ్వాసంతో చేసిన పనుల గురించి పౌలు ఎందుకు రాశాడు?
9 హెబ్రీ క్రైస్తవులకు ఆ ప్రోత్సాహకరమైన పత్రికను రాసేందుకు యెహోవా పౌలును ప్రేరేపించాడు. మోషే ధర్మశాస్త్రం “రాబోవుచున్న మేలుల ఛాయ” అని, యేసు అర్పించిన బలి ద్వారానే పాపక్షమాపణ సాధ్యమని 10వ అధ్యాయం మొదట్లో పౌలు రాశాడు. ఆ తర్వాత అదే అధ్యాయం చివర్లో, యేసు బలి ద్వారా ప్రయోజనం పొందాలంటే వాళ్ళకు ఓపిక లేదా ఓరిమి అవసరమని చెబుతూ ఆయన ఇలా రాశాడు, “మీరు దేవుని చిత్తమును నెరవేర్చినవారై, వాగ్దానముపొందు నిమిత్తము మీకు ఓరిమి అవసరమై యున్నది. ఇక కాలము బహు కొంచెముగా ఉన్నది, వచ్చుచున్నవాడు ఆలస్యముచేయక వచ్చును.”—హెబ్రీ. 10:1, 36, 37.
10 ఓరిమి చూపించమని పౌలు ఆ వచనంలో హెబ్రీ క్రైస్తవులను ప్రోత్సహించాడు. 12వ అధ్యాయంలో కూడా ఆయన మళ్ళీ అదే విషయాన్ని చెబుతూ తమ ముందున్న పరుగుపందెంలో వాళ్ళు ‘ఓపికతో పరుగెత్తాలి’ అని అన్నాడు. అయితే ఆ మాటలు రాయకముందు మరో విషయాన్ని రాసేలా దేవుడు ఆయనను ప్రేరేపించాడు. ఆ విషయాన్ని మనం 11వ అధ్యాయంలో చూడవచ్చు. నిజమైన విశ్వాసం గల ప్రజలు చేసిన పనుల గురించి రాయడం ద్వారా దేవునిపై నిజమైన విశ్వాసం చూపించడమంటే ఏమిటో ఆయన ఆ అధ్యాయంలో వివరించాడు. ఆయన మళ్ళీ ఓరిమి లేదా ఓపిక గురించి మాట్లాడే ముందు విశ్వాసం గురించి ఎందుకు మాట్లాడాడు? ఎందుకంటే, యెహోవాపై నిజమైన విశ్వాసం చూపించాలంటే ఓరిమి, ధైర్యం అవసరమనే విషయాన్ని వాళ్ళు గుర్తించాలని ఆయన కోరుకున్నాడు. పూర్వం చాలా కష్టతరమైన పరిస్థితుల్లో కూడా యెహోవా పట్ల యథార్థంగా ఉన్న ఎంతోమంది స్త్రీపురుషుల పేర్లను ఆయన ప్రస్తావించాడు. వాళ్ళ మాదిరిని అనుకరిస్తే హెబ్రీ క్రైస్తవులు కష్టతరమైన పరిస్థితుల్లో ఓరిమి చూపించగలుగుతారు. ప్రాచీన కాలంలోని యెహోవా సేవకులందరూ విశ్వాసంతో చేసిన పనుల గురించి మాట్లాడిన తర్వాత పౌలు హెబ్రీయులకు ఇలా చెప్పాడు, “ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘమువలె మనలను ఆవరించియున్నందున మనముకూడ ప్రతిభారమును, సుళువుగా చిక్కులబెట్టు పాపమును విడిచిపెట్టి . . . మన యెదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరుగెత్తుదము.”—హెబ్రీ. 12:1, 2.
‘మేఘంలా ఉన్న సాక్షి సమూహం’
11. ‘మేఘంలా ఉన్న గొప్ప సాక్షి సమూహపు’ మాదిరి గురించి ఆలోచిస్తున్నప్పుడు మనం ఏమి గుర్తుంచుకోవాలి?
11 క్రైస్తవులకు పూర్వం జీవించిన యెహోవా సేవకులు ‘మేఘంలా మనలను ఆవరించియున్న గొప్ప సాక్షి సమూహం’ అని పౌలు అన్నాడు. వాళ్ళు చనిపోయేంతవరకు యెహోవా పట్ల యథార్థంగా ఉన్నారు. చాలా కష్టతరమైన పరిస్థితుల్లో కూడా క్రైస్తవులు యెహోవా పట్ల యథార్థంగా ఉండడం సాధ్యమేనని వాళ్ళ ఉదాహరణ చూపిస్తోంది. ఒక విధంగా చెప్పాలంటే, వాళ్ళు తమ పరుగుపందెమును పూర్తిచేసేశారు. ఇతరులు కూడా తమ పరుగును చివరివరకు కొనసాగించడానికి వాళ్ళ ఉదాహరణ ప్రోత్సాహాన్నిస్తుంది. కాబట్టి, ఆ హెబ్రీ క్రైస్తవులు కూడా ప్రాచీనకాలంలోని యెహోవా సేవకుల ఉదాహరణ గురించి ఆలోచించాలి. వాళ్ళ మాదిరి ఆ క్రైస్తవులకు ధైర్యాన్నిచ్చి, ‘ఓపికతో పరుగెత్తి’ పందెమును పూర్తిచేయడం సాధ్యమేనన్న విషయాన్ని గుర్తుచేసింది. పరుగు పందెమును పూర్తిచేయడం మనకు కూడా సాధ్యమే.
12. పౌలు ప్రస్తావించిన వ్యక్తుల విశ్వాసం నుండి మనం ఏమి నేర్చుకోవచ్చు?
12 పౌలు ప్రస్తావించిన వ్యక్తుల విశ్వాసం నుండి మనం ఎంతో నేర్చుకోవచ్చు. ఎందుకంటే వాళ్ళలో చాలామంది మనం జీవిస్తున్నలాంటి పరిస్థితుల్లోనే జీవించారు. ఉదాహరణకు, యెహోవా జలప్రళయం రప్పించి అప్పటి ప్రపంచాన్ని నాశనం చేయడానికి కొంతకాలం ముందు నోవహు జీవించాడు. ఇప్పుడు మనం కూడా, త్వరలో సాతాను లోకాన్ని యెహోవా నాశనం చేయబోయే కాలంలో జీవిస్తున్నాం. అంతేగాక అబ్రాహాము శారాల గురించి ఆలోచించండి. సొంత ఊరును విడిచి వెళ్ళమని యెహోవా వాళ్ళకు చెప్పాడు. తన సేవచేయడానికి ఒక జనాంగాన్ని వాళ్ళ ద్వారా రప్పిస్తానని యెహోవా వాళ్ళకు వాగ్దానం చేశాడు. ఆ వాగ్దాన నెరవేర్పు కోసం వాళ్ళు ఎదురుచూశారు. మనం కూడా మనకోసం జీవించడం మానేసి తనకోసం జీవించాలని యెహోవా కోరుతున్నాడు. ఒకవేళ అలా చేస్తే మనతో స్నేహం చేస్తానని, మనల్ని ఆశీర్వదిస్తానని ఆయన వాగ్దానం చేస్తున్నాడు. మరో ఉదాహరణ పరిశీలించండి, వాగ్దానదేశానికి వెళ్ళడం కోసం మోషే ప్రమాదకరమైన ప్రదేశం గుండా చాలా దూరం ప్రయాణించాడు. మన విషయంలో కూడా అంతే, దుష్టలోకంలో జీవిస్తూ యెహోవా మనకు వాగ్దానం చేసిన నూతనలోకం కోసం ఎదురుచూస్తున్నాం. మనం ఆ నమ్మకమైన వ్యక్తుల జీవితం గురించి ఆలోచించడం ప్రాముఖ్యం. యెహోవాకు సంతోషం కలిగించేందుకు వాళ్ళు చేసిన పనులను మనమూ చేయవచ్చు. అంతేగాక యెహోవా ఎలాంటి పనులను ఇష్టపడడో కూడా తెలుసుకోవచ్చు.—రోమా. 15:4; 1 కొరిం. 10:11.
వాళ్ళు పందెమును ఎలా పూర్తిచేయగలిగారు?
13. నోవహు ముందు ఎలాంటి సవాళ్ళు ఉన్నాయి? యెహోవా చెప్పినవన్నీ నోవహు ఎలా చేయగలిగాడు?
13 ప్రాచీన కాలంలోని యెహోవా సేవకులు పందెమును ఓపికగా ఎలా పూర్తిచేయగలిగారు? నోవహు గురించి పౌలు ఏమి చెప్పాడో గమనించండి. (హెబ్రీయులు 11:7 చదవండి.) భూమ్మీదున్న ప్రజలందరినీ, జంతువులన్నిటినీ నాశనం చేసిన జలప్రళయాన్ని నోవహు అంతకుముందెన్నడూ చూడలేదు. (ఆది. 6:17) అప్పటివరకు అసలు అలాంటిది రాలేదు కూడా. కానీ జలప్రళయం రావడం అసాధ్యమని నోవహు అనుకోలేదు. ఎందుకంటే యెహోవా చెప్పినవన్నీ నెరవేరుస్తాడని ఆయన నమ్మాడు. కాబట్టి, యెహోవాకు లోబడడం చాలా కష్టమని ఆయన అనుకోలేదు. ఆయన సరిగ్గా యెహోవా చెప్పినట్లే చేశాడని బైబిలు చెబుతోంది. (ఆది. 6:22) దేవుడు నోవహుకు ఎన్నో పనులు అప్పగించాడు. ఆయన ఓడ కట్టాలి, జంతువులను ఒక దగ్గరకు చేర్చాలి, తమ కోసమూ జంతువుల కోసమూ ఆహారాన్ని నిల్వచేయాలి, జలప్రళయం గురించి ప్రజలను హెచ్చరించాలి, యెహోవాపై గట్టి విశ్వాసం ఉంచేలా తన కుటుంబానికి సహాయం చేయాలి. యెహోవా చెప్పినవన్నీ చేయడం నోవహుకు అన్నివేళలా సులభమేమీ కాలేదు. కానీ ఆయనకు యెహోవాపై విశ్వాసం ఉంది కాబట్టి తనకు అప్పగించబడిన పనిని ఓపికగా చేశాడు. దానికి యెహోవా ఆయనను, ఆయన కుటుంబాన్ని కాపాడి వాళ్ళను ఎంతో ఆశీర్వదించాడు.
14. అబ్రాహాము, శారా ఎలాంటి పరిస్థితుల్లో దేవుని మీద విశ్వాసం చూపించారు? వాళ్ళ ఉదాహరణ నుండి మనం ఏమి నేర్చుకోవచ్చు?
14 ‘మేఘంలా మనలను ఆవరించియున్న సాక్షి సమూహంలో’ అబ్రాహాము శారాల పేర్లను కూడా పౌలు ప్రస్తావించాడు. తమ స్వస్థలమైన ఊరును విడిచి వెళ్ళమని యెహోవా చెప్పినప్పుడు వాళ్ళ జీవితం మారిపోయింది. భవిష్యత్తులో తమ పరిస్థితి ఎలా ఉంటుందో వాళ్ళకు తెలియదు. అయినా వాళ్ళు యెహోవాపై గట్టి విశ్వాసముంచి, కష్టతరమైన పరిస్థితుల్లో కూడా ఆయనకు లోబడ్డారు. యెహోవా కోసం అబ్రాహాము ఎన్నో త్యాగాలు చేశాడు కాబట్టి “నమ్మినవారికందరికి అతడు తండ్రి” అని బైబిలు చెబుతోంది. (రోమా. 4:11) అబ్రాహాము జీవితం గురించి, ఆయన కుటుంబం గురించి ఆ హెబ్రీ క్రైస్తవులకు తెలుసు కాబట్టి వాళ్ళు విశ్వాసంతో చేసిన పనుల్లో కొన్నిటినే పౌలు ప్రస్తావించాడు. అయితే వాళ్ళ విశ్వాసం ఎంత బలమైనదో చూపించడానికి ఆ కొన్ని వివరాలు చాలు. వాళ్ళ గురించి పౌలు ఇలా రాశాడు, “వీరందరు ఆ వాగ్దానముల ఫలము అనుభవింపక పోయినను, దూరమునుండి చూచి వందనముచేసి, తాము భూమిమీద పరదేశులమును యాత్రికులమునై యున్నామని ఒప్పుకొని, విశ్వాసముగలవారై మృతినొందిరి.” (హెబ్రీ. 11:13) దేవుని మీద వాళ్ళకున్న విశ్వాసం వల్ల, ఆయనతో వాళ్ళ స్నేహం వల్ల వాళ్ళు ఓపికగా పందెంలో పరుగెత్తగలిగారు.
15. మోషే ఎందుకు త్యాగాలు చేశాడు?
15 ‘మేఘంలా ఉన్న సాక్షి సమూహంలోని’ మరో వ్యక్తి యెహోవా సేవకుడైన మోషే. అబ్రాహాములాగే ఆయన కూడా తన ఇంటిని వదిలేశాడు. ఆయన రాజ భవనంలోని వైభవాన్ని, ధనాన్ని వదిలి వచ్చేశాడు. ఆయన ‘దేవుని ప్రజలతో శ్రమ అనుభవించడానికే’ సిద్ధపడ్డాడు. ఎందుకు? పౌలు దానికిలా జవాబిచ్చాడు, “అతడు ప్రతిఫలముగా కలుగబోవు బహుమానమందు దృష్టి యుంచెను.” అంతేకాక, “విశ్వాసమునుబట్టి అతడు అదృశ్యుడైనవానిని చూచుచున్నట్టు స్థిరబుద్ధిగలవాడై” నడుచుకున్నాడని కూడా పౌలు అన్నాడు. (హెబ్రీయులు 11:24-27 చదవండి.) “అల్పకాలము పాపభోగము అనుభవించుటకంటె” ప్రాముఖ్యమైనది ఒకటుందని మోషేకు తెలుసు. ఆయన దేవుడు ఉన్నాడని నమ్ముతూ తన జీవితమంతా దేవుని చిత్తానికే ప్రాముఖ్యతనిచ్చాడు. దేవుని వాగ్దానాలన్నీ నెరవేరతాయని ఆయనకు తెలుసు. అందుకే ఆయన చాలా ధైర్యాన్ని చూపించగలిగాడు, కష్టతరమైన పరిస్థితుల్లో ఓరిమి చూపించగలిగాడు. అలా ఆయన ఇశ్రాయేలీయులను ఐగుప్తు నుండి వాగ్దానదేశానికి నడిపించేందుకు కష్టపడి పనిచేయగలిగాడు.
16. వాగ్దానదేశంలోకి ప్రవేశించలేకపోతున్నందుకు మోషే యెహోవా సేవ చేయడం ఆపేయలేదని మనకెలా తెలుసు?
16 దేవుడు తమకు చేసిన వాగ్దానాలు నెరవేరకముందే అబ్రాహాము, మోషే చనిపోయారు. ఇశ్రాయేలీయులు వాగ్దానదేశంలోకి ప్రవేశించడానికి కొంతకాలం ముందు దేవుడు మోషేతో, “[దూరం నుండి] ఆ దేశమును చూచెదవు కాని నేను ఇశ్రాయేలీయులకిచ్చుచున్న ఆ దేశమున నీవు ప్రవేశింపవు” అని చెప్పాడు. మోషే అహరోనులు మెరీబా నీళ్ళ దగ్గర తిరుగుబాటుదారులైన ప్రజల వల్ల కోపావేశాలకు లోనై దేవునికి ఘనతనివ్వనందుకు వాగ్దానదేశంలోకి ప్రవేశించలేకపోయారు. (ద్వితీ. 32:51, 52) అలా ప్రవేశించలేకపోతున్నందుకు మోషే యెహోవా సేవ చేయడం ఆపేయలేదు. దేవుని నిర్ణయం అన్యాయమైనదని ఆయన అనుకోలేదు. ఇశ్రాయేలీయులను ఆశీర్వదించమని ఆయన యెహోవాను అడగడాన్ని బట్టి అది రుజువౌతోంది. ఇశ్రాయేలీయులతో ఆయన చివరిగా ఇలా అన్నాడు, “ఇశ్రాయేలూ, నీ భాగ్యమెంత గొప్పది. యెహోవా రక్షించిన నిన్ను పోలినవాడెవడు? ఆయన నీకు సహాయకరమైన కేడెము. నీకు ఔన్నత్యమును కలిగించు ఖడ్గము.”—ద్వితీ. 33:29.
మనకు కొన్ని పాఠాలు
17, 18. (ఎ) ‘మేఘంలా ఉన్న సాక్షి సమూహం’ నుండి మనం ఏమి నేర్చుకోవచ్చు? (బి) మనం తర్వాతి ఆర్టికల్‌లో ఏమి చర్చిస్తాం?
17 పరుగుపందెమును పూర్తిచేయాలంటే దేవునిపై, ఆయన వాగ్దానాలపై గట్టి విశ్వాసం ఉండాలని ‘మేఘంలా మనల్ని ఆవరించియున్న సాక్షి సమూహంలోని’ కొంతమంది జీవితాల నుండి నేర్చుకున్నాం. (హెబ్రీ. 11:6) ఆ విశ్వాసం మన ప్రస్తుత జీవన విధానంపై ప్రభావం చూపించాలి. దేవుడు మనకు మంచి భవిష్యత్తును వాగ్దానం చేశాడని మనకు తెలుసు. మనం “అదృశ్యుడైనవానిని” చూడగలుగుతున్నాం కాబట్టి, దేవుడు ఉన్నాడని నమ్ముతూ మన జీవితంలో ఆయన చిత్తానికే ప్రాముఖ్యతనిస్తూ పరుగుపందెంలో ఓపికగా పరుగెత్తుతాం.—2 కొరిం. 5:7.
18 క్రైస్తవ పరుగుపందెం అంత సులభమైనది కాదు. అయినా మనం పరుగుపందెమును పూర్తిచేయవచ్చు. అయితే అలా పూర్తిచేయడానికి మనకు సహాయం చేసే మరిన్ని విషయాల గురించి తర్వాతి ఆర్టికల్‌లో చర్చిస్తాం.
మీరు వివరించగలరా?
• ప్రాచీనకాలంలోని విశ్వాసంగల సాక్షుల గురించి పౌలు ఎందుకు అంత వివరణ ఇచ్చాడు?
• ‘మేఘంలా మనల్ని ఆవరించియున్న సాక్షి సమూహాన్ని’ చూస్తున్నట్లు ఊహించుకుంటే, పందెంలో ఓపికగా ఎలా పరుగెత్తవచ్చు?
• విశ్వాసంగల సాక్షులైన నోవహు, అబ్రాహాము, శారా, మోషే ఉదాహరణలను పరిశీలించడం వల్ల మీరు ఏమి నేర్చుకున్నారు?
[అధ్యయన ప్రశ్నలు]
[19వ పేజీలోని చిత్రం]
అబ్రాహాము, శారా ఊరు పట్టణంలోని సౌకర్యాలను విడిచి వెళ్ళడానికి ఇష్టపడ్డారు