బైబిలు చదవడం జీవితమంతా నన్ను బలపర్చింది
బైబిలు చదవడం జీవితమంతా నన్ను బలపర్చింది
మార్సో లర్వా చెప్పినది
నేను నా గదిలో కూర్చొని, “ఆదియందు దేవుడు భూమ్యాకాశములను సృజించెను” అని చదవడం మొదలుపెట్టాను. ఎందుకలా ఎవ్వరికీ తెలియకుండా చాటుగా కూర్చొని చదవాల్సివచ్చింది? ఎందుకంటే నాస్తికుడైన మా నాన్న ఖచ్చితంగా నా చేతిలోవున్న బైబిలును చదవనివ్వడు.
నేను అంతకుముందు ఎప్పుడూ బైబిలు చదవలేదు, ఆదికాండములో ఉన్న ఆ మొదటి మాటలు చదవగానే నా కళ్ళు తెరుచుకున్నాయి. ‘నన్ను ఎప్పుడూ ఎంతో ఆశ్చర్యపరచిన భౌతిక నియమాల మధ్యవున్న సామరస్యానికి కారణమేమిటో అర్థమైంది.’ ముగ్ధుణ్ణయిపోయి నేను రాత్రి ఎనిమిది గంటల నుండి ఉదయం నాలుగు గంటల వరకూ చదువుతూనే ఉన్నాను. నా జీవితంలో దేవుని వాక్యాన్ని చదివే అలవాటు అలా మొదలైంది. బైబిలు చదవడం జీవితమంతా నన్ను ఎలా బలపర్చిందో వివరిస్తాను.
“నువ్వు దాన్ని ప్రతిరోజూ చదవాల్సి వస్తుంది”
నేను 1926లో, బొగ్గుగనులున్న వెర్మెల్ గ్రామంలో జన్మించాను, అది ఉత్తర ఫ్రాన్స్‌లో ఉంది. అక్కడ, రెండవ ప్రపంచ యుద్ధకాలంలో బొగ్గు ఎంతో ప్రాముఖ్యమైన సరుకుగా పరిగణించబడేది. నేను బొగ్గుగనుల్లో పని చేసేవాడిని కాబట్టి సైన్యంలో చేరకపోయినా ఫర్వాలేదు. అయినా నా ఆర్థిక పరిస్థితిని మెరుగుపర్చుకోవడానికి నేను రేడియో, విద్యుత్తు గురించి అధ్యయనం చేయడం మొదలుపెట్టాను, అప్పుడు నేను భౌతిక నియమాల మధ్యవున్న సామరస్యాన్ని తెలుసుకున్నాను. నాకు 21 ఏళ్ళున్నప్పుడు నా తోటి విద్యార్థి నాకొక బైబిలు ఇచ్చి, “ఇది చదవదగ్గ పుస్తకం” అని చెప్పాడు, అదే నాకు దొరికిన మొదటి బైబిలు. నేను దాన్ని చదవడం ముగించే సరికి బైబిలు దేవుని వాక్యమని, అది మానవులకు ఆయనిచ్చిన సందేశమని నమ్మకం కుదిరింది.
మా పొరుగువాళ్ళు కూడా బైబిలు చదవడానికి ఎంతో ఇష్టపడతారనుకొని నేను ఎనిమిది ప్రతులు సంపాదించాను. కానీ ఆశ్చర్యకరంగా, వాళ్ళు నన్ను హేళన చేశారు, వ్యతిరేకించారు. మూఢనమ్మకాలున్న మా బంధువులు, “ఈ పుస్తకం చదవడం మొదలుపెట్టావంటే నువ్వు దాన్ని ప్రతిరోజూ చదవాల్సి వస్తుంది” అని హెచ్చరించారు. నేను నిజంగానే ప్రతిరోజూ చదివాను, అలా చదివినందుకు నేనెప్పుడూ బాధపడలేదు. నేను ఆ అలవాటును అలాగే కొనసాగించాను.
కొంతమంది పొరుగువాళ్ళు బైబిలంటే నాకున్న ఆసక్తి చూసి, ఎవరో తమకు ఇచ్చిన యెహోవాసాక్షుల సాహిత్యాన్ని నాకు ఇచ్చారు. దేవుని రాజ్యం మాత్రమే మానవులకు మంచి పరిస్థితులు తీసుకురాగలదని బైబిలు ఎందుకు చెబుతోందో, ఒకే ప్రపంచం, ఒకే ప్రభుత్వం a (ఫ్రెంచ్‌లో చూపించబడింది) వంటి చిన్న పుస్తకాలు వివరించాయి. (మత్త. 6:9, 10) దానితో, ఆ విషయాన్ని వేరేవాళ్ళకు తెలియజేయాలని నేను మరింత గట్టిగా నిర్ణయించుకున్నాను.
నేనిచ్చిన బైబిళ్ళను తీసుకున్నవాళ్ళలో నా చిన్ననాటి స్నేహితుడైన నోయెల్ మొదటి వ్యక్తి. ఆయన క్యాథలిక్ మతస్థుడు కాబట్టి, ప్రీస్టు కావడానికి చదువుకుంటున్న ఒక వ్యక్తిని నేను కలిసే ఏర్పాటు చేశాడు. నేను కాస్త భయపడ్డాను, అయినా విగ్రహారాధన చేయడాన్ని, ప్రత్యేక గౌరవాన్నిచ్చే పదాలను ఉపయోగించి మత నాయకులను సంబోధించడాన్ని దేవుడు ఆమోదించడని కీర్తన 115:4-8, మత్తయి 23:9, 10 వచనాలు చెబుతున్నాయని నాకు తెలుసు. కాబట్టి నా కొత్త నమ్మకాన్ని సమర్థించుకునే ధైర్యం నాకు వచ్చింది. దానితో నోయెల్ సత్యాన్ని అంగీకరించాడు, ఇప్పటివరకూ ఆయన నమ్మకమైన సాక్షిగానే ఉన్నాడు.
నేను మా అక్క వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళాను. మా బావ దగ్గర దయ్యాలకు సంబంధించిన పుస్తకాలు ఉండేవి కాబట్టి దయ్యాలు ఆయనను పీడించేవి. అది తెలుసుకున్నప్పుడు ఏమిచేయాలో నాకు తోచలేదు కానీ హెబ్రీయులు 1:14 వంటి బైబిలు వచనాల వల్ల, యెహోవా దూతలు నాకు సహాయం చేస్తారనే నమ్మకం నాకు కుదిరింది. మా బావ బైబిలు సూత్రాలు పాటించి, దయ్యాలకు సంబంధించిన వాటన్నిటినీ తీసిపారేయడంతో దయ్యాల బారినుండి తప్పించుకోగలిగాడు. మా అక్క, బావ సాక్షులై ఎంతో ఆసక్తిగా సేవచేస్తున్నారు.
అమెరికా దేశస్థుడైన ఆర్థర్ ఎమ్‌యోట్ అనే సాక్షి 1947లో మా ఇంటికి వచ్చాడు. నేనెంతో సంతోషంగా, యెహోవాసాక్షులు ఎక్కడ కలుసుకుంటారని ఆయనను అడిగాను. అక్కడికి దాదాపు 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న ల్యేవెన్ అనే పట్టణంలో ఒక గుంపు కూడుకుంటుందని ఆయన చెప్పాడు. ఆ రోజుల్లో సైకిలు కొనుక్కోవడం కూడా ఎంతో కష్టమయ్యేది, అందుకే చాలా నెలల పాటు నేను కూటాలకు నడిచే వెళ్ళేవాడిని. ఫ్రాన్స్‌లో యెహోవాసాక్షుల కార్యకలాపాలు ఎనిమిది సంవత్సరాల పాటు నిషేధించబడ్డాయి. మొత్తం దేశంలో 2,380 మంది సాక్షులు మాత్రమే ఉండేవాళ్ళు, వాళ్ళలో చాలామంది పోలండ్ నుండి వలస వచ్చినవాళ్ళు. అయితే 1947 సెప్టెంబరు 1న ఫ్రాన్స్‌లో యెహోవాసాక్షుల కార్యకలాపాలకు చట్టబద్ధమైన గుర్తింపు లభించింది. పారిస్‌లో ఉన్న వీల్లా గీబెర్‌లో బ్రాంచి కార్యాలయం మళ్ళీ స్థాపించబడింది. అప్పట్లో ఫ్రాన్స్‌లో ఒక్క పయినీరు కూడా లేరు కాబట్టి ఇన్ఫార్మెంట్ (ఇప్పుడు మన రాజ్య పరిచర్య) 1947 డిసెంబరు సంచిక క్రమ పయినీరు సేవ చేయమని ప్రోత్సహించింది, క్రమ పయినీర్లు నెలకు 150 గంటలు ప్రకటనా పని చేయాలి. (1949లో ఆ గంటలు 100కు తగ్గించబడ్డాయి.) యోహాను 17:17లో, ‘దేవుని వాక్యమే సత్యము’ అని చెప్పిన యేసు మాటలతో పూర్తిగా ఏకీభవిస్తూ నేను 1948లో బాప్తిస్మం తీసుకున్నాను, 1949 డిసెంబరులో పయినీరు సేవ మొదలుపెట్టాను.
జైలు నుండి మళ్ళీ డన్‌కర్క్ పట్టణానికి
దక్షిణ ఫ్రాన్స్‌లోవున్న ఆజెన్‌లో నేను పయినీరు సేవ మొదలుపెట్టినా, అక్కడ కొంతకాలమే ఉన్నాను. నేను బొగ్గుగనుల్లో పనిచేయడం మానేశాను కాబట్టి సైన్యంలో చేరాలి. కానీ నేను చేరనన్నందుకు నన్ను జైల్లో పెట్టారు. నా దగ్గర బైబిలు ఉంచుకోవడానికి అనుమతించకపోయినా కీర్తనల గ్రంథంలో నుండి కొన్ని పేజీలను సంపాదించగలిగాను. అవి చదివి, ప్రోత్సాహం పొందాను. జైలు నుండి విడుదలయ్యాక పూర్తికాల సేవ మానేసి ఉద్యోగం చేయాలనే ఆలోచన నాకు వచ్చింది. అయితే ఈసారి కూడా బైబిలు లేఖనాల నుండి సహాయం పొందాను. “నన్ను బలపరచువానియందే నేను సమస్తమును చేయగలను” అని ఫిలిప్పీయులు 4:11-13లో ఉన్న పౌలు మాటల గురించి నేను ఆలోచించాను. పయినీరు సేవ కొనసాగించడానికే నిర్ణయించుకున్నాను. నేను ముందు ప్రకటించిన డన్‌కర్క్‌లోనే 1950లో పయినీరుగా నియమించబడ్డాను.
నేను అక్కడకు వెళ్ళినప్పుడు నా దగ్గర ఏమీ లేదు. రెండవ ప్రపంచ యుద్ధంలో ఆ పట్టణం చాలా మేరకు నాశనమైంది, ఉండడానికి ఇల్లు దొరకడం కష్టమయ్యేది. నేను ఒకప్పుడు ఒక కుటుంబానికి ప్రకటించేవాడిని, వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ ఇంటిగలావిడ నన్ను చూసి, “లర్వా గారండీ, మీరు విడుదలయ్యారా? మీలాంటి వాళ్ళు ఎక్కువమంది ఉంటే యుద్ధం జరిగి ఉండేదే కాదని మా ఆయన అంటుంటారు” అని ఎంతో ఆనందంగా అంది. వాళ్ళకు ఒక గెస్ట్ హౌస్ ఉండేది. టూరిస్ట్ సీజన్ మొదలయ్యేవరకు నేను అక్కడ ఉండవచ్చని చెప్పారు. అదే రోజున ఆర్థర్ ఎమ్‌యోట్ వాళ్ళ అన్న ఇవాన్జ్ నా కోసం ఒక పని చూశాడు. b ఆయన ఓడరేవులో అనువాదకుడిగా పనిచేసేవాడు. అప్పటికి ఆ ఓడలో నైట్ వాచ్‌మన్‌గా పనిచేయడానికి ఒక వ్యక్తి కోసం చూస్తున్నారు. ఆయన నన్ను ఓడ అధికారుల్లో ఒకరికి పరిచయం చేశాడు. నేను జైలు నుండి విడుదలయ్యేసరికి బక్కచిక్కిపోయాను. నేను ఎందుకు అలా ఉన్నానో ఇవాన్జ్ వివరించడంతో ఆ అధికారి నన్ను ఫ్రిజ్‌లో ఉన్న ఆహారాన్ని తినమన్నాడు. ఆ ఒక్కరోజులోనే నాకు ఉండడానికి చోటు, పని, ఆహారం అన్నీ దొరికాయి. మత్తయి 6:25-33లో ఉన్న యేసు మాటల మీద నాకున్న నమ్మకం మరింత బలపడింది.
టూరిస్ట్ సీజన్ మొదలవడంతో నేను, నా తోటి పయినీరైన సీమొన్ ఆపాలీనార్స్‌కీ మరో ఇల్లు వెతుక్కోవాల్సి వచ్చింది. అయినా మేము మాత్రం పయినీరు సేవ కొనసాగించాలని నిర్ణయించుకున్నాం. ఒక పాత గుర్రపుశాలలో ఉండడానికి మాకు స్థలం దొరికింది. రోజంతా సేవచేసి అక్కడున్న ఎండు గడ్డిమీదే పడుకునేవాళ్ళం. ఆ గుర్రపుశాల యజమానికి కూడా సాక్ష్యమిచ్చాం. సత్యాన్ని అంగీకరించిన చాలామందిలో ఆయన ఒకడు. కొంతకాలానికే స్థానిక వార్తాపత్రిక, “యెహోవాసాక్షుల పని ఇక్కడ కూడా పెద్ద ఎత్తున మొదలైంది” అంటూ డన్‌కర్క్ వాసులను హెచ్చరించింది. కానీ, నిజానికి అక్కడున్నది నేను, సీమొన్, మరికొంతమంది ప్రచారకులు మాత్రమే. అలాంటి కష్టమైన పరిస్థితుల్లో మన క్రైస్తవ నిరీక్షణ గురించి ధ్యానించడం ద్వారా, యెహోవా మా గురించి ఎలా శ్రద్ధ తీసుకున్నాడో ఆలోచించడం ద్వారా మేము ఎంతో ప్రోత్సాహాన్ని పొందేవాళ్ళం. 1952లో నేను వేరే ప్రాంతానికి నియమించబడే సమయానికి డన్‌కర్క్‌లో దాదాపు 30 మంది ప్రచారకులు ఉన్నారు.
కొత్త బాధ్యతలు చేపట్టడానికి బలాన్ని పొందాను
ఆమియేన్ నగరంలో కొంతకాలం ఉన్న తర్వాత పారిస్ శివార్లలో ఉన్న బూలోన్ బీయాన్‌కూర్‌లో ప్రత్యేక పయినీరుగా సేవచేయడానికి నియమించబడ్డాను. నేను ఎన్నో బైబిలు అధ్యయనాలు నిర్వహించాను, వాళ్ళలో కొంతమంది ఆ తర్వాత పూర్తికాల సేవ, మిషనరీ సేవ చేపట్టారు. గీ మాబీలా అనే యువకుడు సత్యాన్ని అంగీకరించి కొంతకాలానికి ప్రయాణ పర్యవేక్షకుడిగా, జిల్లా పర్యవేక్షకుడిగా సేవచేశాడు. ఆ తర్వాత, పారిస్‌కు కొద్దిదూరంలోవున్న లూవ్యేలోని బెతెల్‌లో ప్రింటరీ నిర్మాణ పనిని పర్యవేక్షించాడు. పరిచర్యలో తరచూ బైబిలు చర్చలు చేయడం వల్ల దేవుని వాక్యం నా మనసులో మరింత బలంగా నాటుకుపోయింది. దాంతో నేనెంతో సంతోషించాను, నా బోధనా సామర్థ్యం కూడా పెరిగింది.
ఆ తర్వాత ఉన్నట్టుండి 1953లో, ఆల్సేస్-లారేన్‌లో ప్రయాణ పర్యవేక్షకుడిగా నియమించబడ్డాను. ఆ ప్రాంతం 1871-1945 మధ్యకాలంలో రెండుసార్లు జర్మనీ అధికారం కిందికి వచ్చింది. ఆ ప్రాంతంలో మాట్లాడేందుకు వీలుగా నేను జర్మన్ భాష కొంచెం నేర్చుకోవాల్సి వచ్చింది. నేను ప్రాంతీయ సేవ మొదలుపెట్టినప్పుడు ఆ ప్రాంతంలో కార్లు, టీవీలు, టైప్‌రైటర్లు కేవలం కొన్నే ఉండేవి. ట్రాన్సిస్టర్ రేడియోలు, వ్యక్తిగత కంప్యూటర్లు అసలు ఉండేవికావు. అయినా నా జీవితం దుఃఖకరంగా ఏమీ లేదు. నిజానికి, అప్పుడు నేను ఎంతో సంతోషంగా గడిపాను. అప్పట్లో యెహోవా సేవచేసేలా ‘కంటిని తేటగా ఉంచుకోవాలి’ అనే బైబిలు సలహాను పాటించడానికి ఇప్పుడు ఉన్నన్ని అడ్డంకులు ఉండేవి కావు.—మత్త. 6:19-22.
1955లో పారిస్‌లో జరిగిన “ట్రయమ్‌ఫంట్ కింగ్‌డమ్” సమావేశం నాకు చిరకాలం గుర్తుండిపోయే సందర్భం. అక్కడే నా కాబోయే భార్య ఇర్రేన కొలోస్కీని కలిశాను. ఆమె నాకన్నా ఒక సంవత్సరం ముందే పూర్తికాల సేవ మొదలుపెట్టింది. పోలండ్ దేశస్థులైన ఆమె తల్లిదండ్రులు ఎంతోకాలంగా ఆసక్తిగా సేవచేస్తున్న సాక్షులు. ఫ్రాన్స్‌లో ఆడాల్ఫ్ వేబెర్ అనే వ్యక్తి వాళ్ళకు సాక్ష్యమిచ్చాడు. సహోదరుడు రస్సెల్ దగ్గర ఆయన తోటమాలిగా పనిచేసేవాడు. సువార్త ప్రకటించడానికి ఆయన ఐరోపాకు వచ్చాడు. నేను,
ఇర్రేన 1956లో పెళ్ళి చేసుకున్నాం. ఆ తర్వాత మేమిద్దరం కలిసి ప్రాంతీయ సేవలో కొనసాగాం. ఎన్నో సంవత్సరాలుగా ఆమె నాకు చక్కగా సహకరిస్తోంది.రెండు సంవత్సరాల తర్వాత, మరో ఆశ్చర్యకరమైన సంఘటన జరిగింది. నేను జిల్లా పర్యవేక్షకుడిగా నియమించబడ్డాను. అర్హతగల సహోదరులు తక్కువమంది ఉండేవాళ్ళు కాబట్టి నేను కొన్ని సంఘాలకు ప్రాంతీయ పర్యవేక్షకుడిగా కూడా వెళ్ళేవాణ్ణి. ఆ సమయంలో చాలా బిజీగా ఉండేవాళ్ళం. నెలకు 100 గంటలు ప్రకటించడంతోపాటు నేను ప్రతీవారం ప్రసంగాలు ఇవ్వాలి, మూడు పుస్తక పఠన గుంపులను సందర్శించాలి, సంఘ ఫైళ్ళను తనిఖీ చేయాలి, రిపోర్టులు సిద్ధం చేయాలి. అన్ని పనులతో దేవుని వాక్యం చదవడానికి సమయం ఎలా దొరుకుతుంది? దానికి ఒకే ఒక్క దారి కనిపించింది, ఒక పాత బైబిల్లో నుండి కొన్ని పేజీలు కత్తిరించి నా దగ్గర పెట్టుకునేవాణ్ణి. ఎవరైనా నన్ను కలవడానికి వస్తున్నారంటే, వాళ్ళ కోసం ఎదురుచూస్తున్నప్పుడు ఆ పేజీలు తీసుకొని చదివేవాణ్ణి. బైబిలు చదవడానికి నాకు దొరికిన ఉత్తేజకరమైన ఆ కొంత సమయం నా నియామకంలో కొనసాగాలనే పట్టుదలను పెంచింది.
బూలోన్ బీయాన్‌కూర్‌లో ఉన్న బెతెల్ కుటుంబంలో శాశ్వత సభ్యులుగా ఉండడానికి 1967లో మాకు ఆహ్వానం అందింది. నేను సేవా విభాగంలో పనిచేయడం మొదలుపెట్టాను, 40 సంవత్సరాలకు పైగా అక్కడే చేస్తున్నాను. బైబిలు ప్రశ్నలడుగుతూ రాసిన ఉత్తరాలకు జవాబు ఇవ్వడమే నా పనిలో నాకెంతో నచ్చే విషయం. దేవుని వాక్యాన్ని లోతుగా అధ్యయనం చేసి ‘సువార్త పక్షాన వాదించడం’ నాకు చాలా ఇష్టం. (ఫిలి. 1:7) అంతేకాక, బెతెల్‌లో బ్రేక్‌ఫాస్ట్‌కు ముందు, బైబిలు ఆధారంగా ప్రసంగిస్తూ ఉదయకాల ఆరాధన నిర్వహించడం కూడా నాకెంతో ఇష్టం. 1976లో నేను ఫ్రాన్స్ బ్రాంచి కార్యాలయంలో బ్రాంచి కమిటీ సభ్యునిగా నియమించబడ్డాను.
శ్రేష్ఠమైన జీవిత విధానం
ఎన్నోసార్లు కష్టాలు అనుభవించినా అంత బాధపడలేదు కానీ ఇప్పుడు వృద్ధాప్యం వల్ల, అనారోగ్యం వల్ల నేను, ఇర్రేన ఇంతకుముందు చేసినంతగా చేయలేకపోతున్నందుకు చాలా బాధపడుతున్నాం. అయితే, మేమిద్దరం కలిసి దేవుని వాక్యాన్ని చదవడం, అధ్యయనం చేయడం వల్ల భవిష్యత్తుపై మాకున్న నిరీక్షణను బలంగా ఉంచుకోగలుగుతున్నాం. ఆ నిరీక్షణను ఇతరులకు తెలియజేయడానికి బస్సులో మా సంఘ క్షేత్రానికి వెళ్ళడమంటే మాకు ఇష్టం. మేమిద్దరం పూర్తికాల సేవలో గడిపిన సంవత్సరాలను కలిపితే 120కి పైనే ఉంటాయి. ఆ సేవలో మేము నిజంగా ఎంతో సంతోషాన్ని అనుభవించాం. అందుకే ఉత్సాహంగా, సంతోషంగా, ప్రయోజనకరంగా జీవించాలని ఇష్టపడేవాళ్ళందరినీ పూర్తికాల సేవ చేపట్టమని మనస్ఫూర్తిగా ప్రోత్సహించగలుగుతున్నాం. కీర్తన 37:25లోని మాటలు రాసే సమయానికి దావీదు రాజు ‘ముసలివాడు.’ కానీ ఆయనలాగే నేను కూడా, ‘నీతిమంతులు విడువబడడం’ చూడలేదు.
నా జీవితమంతటిలో, యెహోవా తన వాక్యం ద్వారా నన్ను బలపర్చాడు. బైబిలు ఒక్కసారి చదివితే జీవితాంతం చదవాల్సిందేనని 60 కన్నా ఎక్కువ సంవత్సరాల క్రితం మా బంధువులు అన్నారు. వాళ్ళన్నది నిజమే. నేను నిజంగానే ప్రతిరోజూ చదివాను, అలా చదివినందుకు నేనెప్పుడూ బాధపడలేదు.
[అధస్సూచీలు]
a 1944లో ప్రచురించబడింది, కానీ ఇప్పుడు ముద్రించబడడం లేదు.
b ఇవాన్జ్ ఎమ్‌యోట్ గురించి మరింత తెలుసుకోవడానికి కావలికోట జనవరి 1, 1999 సంచికలోని 22, 23 పేజీలు చూడండి.
[5వ పేజీలోని చిత్రం]
సీమొన్, నేను
[5వ పేజీలోని చిత్రం]
జిల్లా పర్యవేక్షకుడిగా సేవ చేస్తున్నప్పుడు
[5వ పేజీలోని చిత్రం]
నాకు దొరికిన మొదటి బైబిల్లాంటిది
[6వ పేజీలోని చిత్రం]
మా పెళ్ళి రోజున
[6వ పేజీలోని చిత్రం]
కలిసి దేవుని వాక్యాన్ని చదవడం, అధ్యయనం చేయడం నాకు, ఇర్రేనకు ఎంతో ఇష్టం