కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

యెహోవా నా స్వాస్థ్యం

యెహోవా నా స్వాస్థ్యం

యెహోవా నా స్వాస్థ్యం

‘ఇశ్రాయేలీయుల మధ్య నీ పాలు, నీ స్వాస్థ్యం నేనే.’—సంఖ్యా. 18:20.

1, 2. (ఎ) లేవీయులకు భూమి స్వాస్థ్యంగా వచ్చిందా? (బి) యెహోవా లేవీయులకు ఏ హామీ ఇచ్చాడు?

 ఇశ్రాయేలీయులు వాగ్దానదేశంలో చాలా భాగాన్ని స్వాధీనం చేసుకున్న తర్వాత, యెహోషువ చీట్లు వేసి భూమిని వివిధ గోత్రాలకు పంచిపెట్టాడు. ఆయన ఈ పనిని, ప్రధానయాజకుడైన ఎలియాజరుతో, గోత్రాల ప్రధానులతో కలిసి చేశాడు. (సంఖ్యా. 34:13-29) అయితే వాగ్దానదేశంలో ఇతర గోత్రాలకు భూమి స్వాస్థ్యంగా వచ్చినట్లు లేవీయులకు రాలేదు. (యెహో. 14:1-5) ఎందుకు? వాళ్ళకు వంతు ఇవ్వబడలేదా?

2 యెహోవా లేవీయులకు చెప్పిన దానిలో ఆ ప్రశ్నలకు జవాబు ఉంది. యెహోవా వాళ్ళను అలక్ష్యం చేయలేదని చూపిస్తూ ‘ఇశ్రాయేలీయుల మధ్య నీ పాలు, నీ స్వాస్థ్యం నేనే’ అని వాళ్ళకు చెప్పాడు. (సంఖ్యా. 18:20) ‘నీ స్వాస్థ్యం నేనే’ అన్నది ఎంత గొప్ప హామీ! ఒకవేళ యెహోవా మీతోనే అలా చెప్పాడనుకోండి, మీకెలా అనిపిస్తుంది? ‘సర్వశక్తిమంతుడు నాకు అంత గొప్ప హామీ ఇవ్వడానికి నేను అర్హుణ్ణేనా?’ అని మొదట మీకు అనిపించవచ్చు. ‘ఈ రోజుల్లో అపరిపూర్ణ క్రైస్తవులెవరికైనా యెహోవా అసలు స్వాస్థ్యంగా ఉంటాడా?’ అని కూడా మీకు అనిపించవచ్చు. మీ బంధుమిత్రులకు కూడా అలాంటి సందేహాలు రావచ్చు. కాబట్టి దేవుడు చెప్పిన ఆ మాటలకు అర్థం ఏమిటో ఇప్పుడు పరిశీలిద్దాం. అలా చేస్తే, ఈ రోజుల్లో క్రైస్తవులకు యెహోవా ఎలా స్వాస్థ్యంగా ఉంటాడో అర్థం చేసుకోగలుగుతాం. మరింత సూటిగా చెప్పాలంటే, మీకు పరలోక నిరీక్షణ ఉన్నా పరదైసుగా మారే భూమ్మీద జీవించే నిరీక్షణ ఉన్నా యెహోవా మీకు స్వాస్థ్యంగా ఉంటాడు.

యెహోవా లేవీయుల అవసరాలు తీర్చాడు

3. దేవుడు తన సేవకోసం లేవీయులను తీసుకోవడమనేది ఎలా జరిగింది?

3 యెహోవా ఇశ్రాయేలీయులకు ధర్మశాస్త్రం ఇవ్వకముందు వాళ్ళ మధ్య కుటుంబ పెద్దలే యాజకులుగా సేవచేసేవాళ్ళు. కానీ ధర్మశాస్త్రాన్ని ఇచ్చిన తర్వాత, లేవీ గోత్రానికి చెందినవాళ్ళు పూర్తికాలం యాజకులుగా, వాళ్ళ సహాయకులుగా సేవచేసేలా యెహోవా ఏర్పాటు చేశాడు. అదంతా ఎలా జరిగింది? దేవుడు ఐగుప్తీయుల మొదటి సంతానాన్ని నాశనం చేసి, ఇశ్రాయేలీయుల మొదటి సంతానాన్ని తన సొత్తుగా ప్రత్యేకపర్చి పరిశుద్ధపర్చాడు. ఆ తర్వాత దేవుడు ఈ విశేషమైన మార్పు చేస్తూ, ‘ఇశ్రాయేలీయులలో తొలిచూలుయైన ప్రతి మగపిల్లకు మారుగా లేవీయులను తీసుకుంటాను’ అని చెప్పాడు. ప్రజా సంఖ్య తీసుకున్నప్పుడు ఇశ్రాయేలీయుల మొదటి సంతానంలోని మగవాళ్ళ సంఖ్య లేవీయుల సంఖ్య కన్నా ఎక్కువ ఉండడంతో ఆ తేడాను పూరించడానికి పరిహారం చెల్లించబడింది. (సంఖ్యా. 3:11-13, 41, 46, 47) అలా లేవీయులు దేవుని సేవలో తమ బాధ్యతల్ని సరిగ్గా నిర్వర్తించగలిగారు.

4, 5. (ఎ) యెహోవా లేవీయులకు స్వాస్థ్యంగా ఉంటాడంటే దానర్థం ఏమిటి? (బి) దేవుడు లేవీయుల అవసరాలను ఎలా తీర్చాడు?

4 లేవీయులు తమ బాధ్యతల్ని నిర్వర్తించాలంటే ఏమి చేయాలి? పైన చూసినట్లుగా యెహోవా వాళ్ళకు స్వాస్థ్యంగా ఉంటానని చెప్పాడు. అంటే, వాళ్ళు భూమిని స్వాస్థ్యంగా పొందరు కానీ, ఆయన సేవ చేసే అమూల్యమైన అవకాశాన్ని పొందుతారు. ‘యెహోవాకు యాజక ధర్మము చేయడమే’ వాళ్ళకు స్వాస్థ్యం. (యెహో. 18:7) సంఖ్యాకాండము 18:20లోని సందర్భాన్ని చూస్తే వాళ్ళు చేసే ఆ పనివల్ల వాళ్ళ కనీసావసరాలకు ఏ లోటూ ఉండేదికాదని తెలుస్తోంది. (సంఖ్యాకాండము 18:19, 21, 24 చదవండి.) లేవీయులు చేసే సేవకు ‘ఇశ్రాయేలీయుల దశమభాగములన్నీ స్వాస్థ్యంగా ఇవ్వబడాలి.’ ఇశ్రాయేలీయుల పంట పొలాల ఉత్పత్తిలో నుండి, పశు సంపదలో నుండి 10 శాతాన్ని లేవీయులు పొందుతారు. ఆ తర్వాత వాళ్ళు తాము పొందిన దానిలోనుండి పదియవ భాగాన్ని యాజకుల కోసం ఇవ్వాలి, అలా వాళ్ళిచ్చే భాగం ‘ప్రశస్తమైనదై’ ఉండాలి. a (సంఖ్యా. 18:25-29) అంతేకాదు, ఇశ్రాయేలీయులు దేవుని ఆలయానికి తీసుకువచ్చిన ‘పరిశుద్ధమైన ప్రతిష్ఠార్పణములన్నీ’ యాజకులకు ఇవ్వబడేవి. కాబట్టి యెహోవా తమ అవసరాలు తీరుస్తాడని యాజకులు నమ్మవచ్చు.

5 మోషే ధర్మశాస్త్రం ప్రకారం ఇశ్రాయేలీయులు రెండవ దశమభాగాన్ని కూడా వేరుచేసి ఉంచేవాళ్ళు అనిపిస్తోంది. ప్రతీ సంవత్సరం పరిశుద్ధ పండుగల సమయంలో తమ అవసరాల కోసం, సంతోషంగా గడపడం కోసం ఆ భాగాన్ని ఉపయోగించుకునేవాళ్ళు. (ద్వితీ. 14:22-27) అయితే ఏడు సంవత్సరాల సబ్బాతు కాలంలోని ప్రతీ మూడవ, ఆరవ సంవత్సరాల ముగింపులో పేదల కోసం, లేవీయుల కోసం ఆ దశమభాగాన్ని తమ ఇంటి బయటకు తీసుకువచ్చి పెట్టేవాళ్ళు. వాటిని లేవీయులు కూడా ఎందుకు తీసుకునేవాళ్ళు? ఇశ్రాయేలులో వాళ్ళకు ‘పాలైనను స్వాస్థ్యమైనను లేదు’ కాబట్టి అలా తీసుకునేవాళ్ళు.—ద్వితీ. 14:28, 29.

6. లేవీయులకు భూమి స్వాస్థ్యంగా ఇవ్వబడకపోయినా వాళ్ళు ఎక్కడ నివసించేవాళ్ళు?

6 ‘లేవీయులకు భూమి స్వాస్థ్యంగా ఇవ్వబడలేదు కాబట్టి వాళ్ళు ఎక్కడ నివసిస్తారు?’ అనే ప్రశ్న మీకు రావచ్చు. దేవుడు ఆ అవసరాన్ని కూడా తీర్చాడు. ఆయన వాళ్ళకు 48 నగరాలు, వాటి చుట్టుప్రక్కల ఉన్న మైదానాలు ఇచ్చాడు. వాటిలోనే ఆరు ఆశ్రయపురాలు కూడా ఉండేవి. (సంఖ్యా. 35:6-8) అలా, లేవీయులు దేవుని ఆలయంలోని పరిశుద్ధ స్థలంలో సేవ చేయని సమయంలో నివసించడానికి వాళ్ళకు ఒక స్థలం ఉండేది. తన సేవకోసం తమను తాము సమర్పించుకున్నవాళ్ళ అవసరాలన్నీ యెహోవా తీర్చాడు. కాబట్టి, తమ అవసరాలను తీర్చాలనే కోరిక, అలా చేసే శక్తి యెహోవాకు ఉన్నాయని నమ్మడం ద్వారా లేవీయులు యెహోవా తమ స్వాస్థ్యమని చూపించవచ్చు.

7. యెహోవా తమకు స్వాస్థ్యంగా ఉండాలంటే లేవీయులకు ఏమి అవసరం?

7 దశమభాగాన్ని ఇవ్వని ఇశ్రాయేలీయులకు ధర్మశాస్త్రం ప్రకారం ఎలాంటి శిక్షా విధించబడేది కాదు. కానీ దశమభాగం గురించి యెహోవా ఇచ్చిన నియమాన్ని ప్రజలు పాటించనప్పుడు యాజకులకు, లేవీయులకు కష్టమయ్యేది. నెహెమ్యా కాలంలో అలాగే జరిగింది. దానివల్ల లేవీయులు పొలాల్లో పనిచేయాల్సి రావడంతో ఆలయంలో సేవచేయలేకపోయారు. (నెహెమ్యా 13:10 చదవండి.) ఇశ్రాయేలు జనాంగం యెహోవా నియమాన్ని పాటించినప్పుడు మాత్రమే లేవీయుల అవసరాలు తీరేవి. అంతేకాక యాజకులు, లేవీయులు యెహోవాపై, తమ అవసరాలు తీర్చడానికి ఆయన ఉపయోగించే విధానాలపై విశ్వాసముంచాలి.

కొంతమంది లేవీయులు యెహోవాను తమ స్వాస్థ్యంగా చేసుకున్నారు

8. లేవీయుడైన ఆసాపుకు ఎందుకు మనశ్శాంతి లేకుండా పోయింది?

8 ఒక గోత్రంగా లేవీయులు యెహోవాను తమ స్వాస్థ్యంగా చేసుకున్నారు. అయితే, యెహోవాతో తమకున్న స్నేహం గురించి, ఆయనపై తమకున్న నమ్మకం గురించి మాట్లాడుతూ కొంతమంది లేవీయులు వ్యక్తిగతంగా “యెహోవా నా భాగము” అన్నారు. (విలా. 3:24) ఉదాహరణకు, యెహోవా తన స్వాస్థ్యమని చెప్పిన గాయకుడూ సంగీతకారుడూ అయిన ఒక లేవీయుని గురించి బైబిల్లో ఉంది. ఆయన పేరు ఆసాపు అనుకుందాం. బహుశా ఆయన దావీదు రాజు కాలంలో ఉన్న లేవీయుల్లోని ముఖ్య గాయకుడైన ఆసాపు కుటుంబానికి చెందిన వ్యక్తి కూడా అయ్యుండవచ్చు. (1 దిన. 6:31-43) మంచి జీవితాన్ని అనుభవిస్తున్న దుష్టులను చూసి అసూయపడి, వాళ్ళెందుకు అలా ఉన్నారో ఆసాపు (లేదా ఆయన సంతానంలోని ఒకరు) అర్థం చేసుకోలేకపోయాడని 73వ కీర్తనలో ఉంది. ఆయన చివరకు, “నా హృదయమును నేను శుద్ధిచేసికొని యుండుట వ్యర్థమే. నా చేతులు కడుగుకొని నిర్మలుడనై యుండుట వ్యర్థమే” అని అన్నాడు. యెహోవా తనకు ఇచ్చిన పని ఎంతో ప్రత్యేకమైనదనే విషయాన్ని ఆసాపు తాత్కాలికంగా మరచిపోయాడనిపిస్తోంది. యెహోవా తన స్వాస్థ్యమనే విషయాన్ని ఆయన మరచిపోయాడు. ‘దేవుని పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళేంతవరకు’ ఆయనకు మనశ్శాంతి లేకుండా పోయింది.—కీర్త. 73:2, 3, 12, 13, 17.

9, 10. దేవుడు ‘నిత్యం తన స్వాస్థ్యం’ అని ఆసాపు ఎందుకు అనగలిగాడు?

9 పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళిన తర్వాత ఆయన ఆలోచనా తీరు మారింది. బహుశా మీకు కూడా అలాగే జరిగివుంటుంది. యెహోవా సేవ చేయడం ఎంత ప్రత్యేకమైనదో మీరు కూడా తాత్కాలికంగా మరచిపోయి, మీరు సంపాదించుకోగల వస్తువుల గురించి ఆలోచించివుంటారు. కానీ బైబిలు అధ్యయనం చేయడం ద్వారా, క్రైస్తవ కూటాలకు వెళ్ళడం ద్వారా మీరు మళ్ళీ యెహోవాలా ఆలోచించడం మొదలుపెట్టివుంటారు. ఆసాపు చివరికి దుష్టులకు ఏమౌతుందో గ్రహించాడు. దేవుని సేవకునిగా ఉన్నందువల్ల తాను పొందిన ప్రయోజనాల గురించి ఆయన ఆలోచించాడు. చివరకు ఆయన, యెహోవా తన కుడిచెయ్యి పట్టుకొని నడిపిస్తాడని అన్నాడు. అంతేకాక, “నీవు నాకుండగా లోకములోనిది ఏదియు నా కక్కరలేదు” అని ఆయన యెహోవాతో అనగలిగాడు. (కీర్త. 73:23, 25) ఆ తర్వాత, యెహోవా తనకు స్వాస్థ్యమని ఆయన అన్నాడు. (కీర్తన 73:26 చదవండి.) ‘నా శరీరం, నా హృదయం క్షీణించిపోయాయి’ అని ఆయన రాశాడు. అయితే, దేవుడు ‘నిత్యం తన స్వాస్థ్యం’ అని కూడా ఆయన అన్నాడు. యెహోవా తనను ఒక స్నేహితునిగా గుర్తుంచుకుంటాడని, నమ్మకంగా తాను చేసిన సేవను ఆయన మరచిపోడని ఆసాపుకు తెలుసు. (ప్రసం. 7:1) అది ఆయనకు ఎంతో ఓదార్పును ఇచ్చివుంటుంది. ‘నాకైతే దేవుని పొందు ధన్యకరము. నేను ప్రభువైన యెహోవా శరణుజొచ్చియున్నాను’ అని ఆయన పాడాడు.—కీర్త. 73:28.

10 ఆసాపు లేవీయునిగా తాను పొందిన వస్తుపర ప్రయోజనాల కన్నా యెహోవా తన స్వాస్థ్యంగా ఉండడాన్నే ఎక్కువ విలువైనదిగా ఎంచాడు. ఆయన ముఖ్యంగా, తాను యెహోవాకు చేసిన సేవ గురించి, సర్వోన్నతునితో తనకున్న స్నేహం గురించి మాట్లాడాడు. (యాకో. 2:21-23) యెహోవా స్నేహితునిగా కొనసాగాలంటే ఆసాపు యెహోవాపై విశ్వాసాన్ని, నమ్మకాన్ని కాపాడుకోవాలి. యెహోవాకు విధేయత చూపిస్తే ఆయన సంతోషకరమైన భవిష్యత్తును ఆశీర్వాదంగా ఇస్తాడని ఆసాపు నమ్మాలి. యెహోవా మిమ్మల్ని కూడా అలాగే ఆశీర్వదిస్తాడనే నమ్మకంతో ఉండవచ్చు.

11. యిర్మీయా యెహోవాను ఏమని అడిగాడు? యెహోవా ఆ ప్రశ్నకు ఎలా జవాబిచ్చాడు?

11 యెహోవా తన స్వాస్థ్యమని చెప్పిన మరో లేవీయుడు యిర్మీయా ప్రవక్త. ఆయన ఏ ఉద్దేశంతో అలా చెప్పాడో ఇప్పుడు చూద్దాం. ఆయన యెరూషలేముకు దగ్గర్లో ఉన్న లేవీయుల పట్టణమైన అనాతోతులో నివసించేవాడు. (యిర్మీ. 1:1) మంచివాళ్ళు బాధపడుతుంటే దుష్టులు ఎందుకు సుఖంగా ఉన్నారని ఒకసారి ఆయన కూడా యెహోవాను అడిగాడు. (యిర్మీ. 12:1) యెరూషలేములో, యూదాలో జరుగుతున్న వాటిని చూసి ఆయన యెహోవాకు ఫిర్యాదు చేశాడు. యెహోవా నీతిమంతుడని ఆయనకు తెలుసు. నాశనం గురించిన వార్తను ప్రకటించమని చెప్పడం ద్వారా యెహోవా ఆయన ప్రశ్నకు జవాబిచ్చాడు. ఆ తర్వాత యెహోవా ఆ ప్రవచనాన్ని నెరవేర్చాడు. యెహోవా మాట విన్నవాళ్ళు బ్రతికి బయటపడ్డారు కానీ దుష్టులు మాత్రం ఆ హెచ్చరికను పట్టించుకోనందువల్ల చనిపోయారు.—యిర్మీ. 21:9.

12, 13. (ఎ) “యెహోవా నా భాగము” అని యిర్మీయా ఎందుకు చెప్పగలిగాడు? ఆయన ఎలాంటి లక్షణాన్ని చూపించాడు? (బి) ఇశ్రాయేలులోని అన్ని గోత్రాల ప్రజలు ఎందుకు యిర్మీయాలాగే ఓపిగ్గా వేచి చూడాలి?

12 ఆ తర్వాత పాడుగా, నిర్జనంగా ఉన్న తన స్వదేశాన్ని చూసినప్పుడు యిర్మీయాకు చీకట్లో నడుస్తున్నట్లు అనిపించింది. యెహోవా తనను ‘పూర్వకాలమున చనిపోయినవారిలా’ చేశాడని ఆయనకు అనిపించింది. (విలా. 1:1, 16; 3:6) తమ పరలోక తండ్రి దగ్గరకు తిరిగి రమ్మని యిర్మీయా ఇశ్రాయేలీయులకు చెప్పాడు. కానీ వాళ్ళు ఎంతగా చెడిపోయారంటే యెహోవా చివరకు యెరూషలేమును, యూదాను నాశనం చేయాల్సి వచ్చింది. యిర్మీయా ఏ తప్పూ చేయకపోయినా ఆ నాశనాన్ని చూసి ఎంతో బాధపడ్డాడు. అంత దుఃఖకరమైన పరిస్థితిలో ఆయన యెహోవా వాత్సల్యాన్ని గుర్తుచేసుకుంటూ, ‘గనుకనే మేము నిర్మూలం కాలేదు’ అన్నాడు. నిజానికి యెహోవా వాత్సల్యం ‘అనుదినం నూతనంగానే’ ఉంటుంది. ఆ తర్వాత యిర్మీయా, “యెహోవా నా భాగము” అని అన్నాడు. ఒక ప్రవక్తగా ఆయన యెహోవా సేవలో అలాగే కొనసాగాడు.—విలాపవాక్యములు 3:22-24 చదవండి.

13 ఇశ్రాయేలీయుల స్వదేశం 70 సంవత్సరాలు పాడుగా, నిర్జనంగా ఉండిపోయింది. (యిర్మీ. 25:11) “యెహోవా నా భాగము” అని యిర్మీయా అనడాన్ని బట్టి ఆయన యెహోవాపై నమ్మకం ఉంచాడని తెలుస్తోంది. యెహోవా తీసుకునే చర్య విషయంలో ఆయన ఓపిగ్గా వేచి చూశాడు. ఇశ్రాయేలులోని అన్ని గోత్రాల ప్రజలు తమ స్వాస్థ్యాన్ని కోల్పోయారు కాబట్టి వాళ్ళు కూడా యిర్మీయాలాగే ఓపిగ్గా వేచిచూడాలి. యెహోవా మాత్రమే వాళ్ళకు సహాయం చేయగలడు. 70 సంవత్సరాల తర్వాత వాళ్ళు మళ్ళీ తమ దేశానికి తిరిగి వచ్చి అక్కడ యెహోవాకు సేవచేశారు.—2 దిన. 36:20-23.

ఇతరులు కూడా యెహోవాను తమ స్వాస్థ్యంగా చేసుకోవచ్చు

14, 15. లేవీయులు మాత్రమే కాదు, ఇంకా ఎవరు కూడా యెహోవాను తమ స్వాస్థ్యంగా చేసుకున్నారు? ఎందుకు?

14 లేవీయులైన ఆసాపు, యిర్మీయా మాత్రమే కాదు లేవీయులుకాని ఇతరులు కూడా యెహోవా సేవ చేశారు. యౌవనుడైన దావీదు ఇశ్రాయేలీయులకు రాజు కాకముందు ‘సజీవులున్న భూమ్మీద యెహోవా నా స్వాస్థ్యము’ అని అన్నాడు. (కీర్తన 142:1, 5 చదవండి.) రాజభవనంలోనో తన ఇంట్లోనో ఉండి దావీదు ఆ కీర్తన రాయలేదు. ఆ సమయంలో ఆయన తన శత్రువుల నుండి తప్పించుకోవడానికి ఒక గుహలో దాక్కొని ఉన్నాడు. కనీసం రెండుసార్లు దావీదు గుహల్లో దాక్కోవాల్సి వచ్చింది. ఒకసారి అదుల్లాము దగ్గర దాక్కున్నాడు, మరోసారి ఎన్గెదీ అరణ్యంలో దాక్కున్నాడు. ఆయన ఆ గుహల్లోని ఏదో ఒక దానిలో 142వ కీర్తన రాసివుంటాడు.

15 ఒకవేళ దావీదు ఒక గుహలో ఉన్నప్పుడు ఆ కీర్తన రాసివుంటే, అది ఆయన సౌలు రాజు నుండి పారిపోతున్న సందర్భం అయ్యుండవచ్చు. సౌలు దావీదును చంపాలనుకున్నాడు కాబట్టి కనుక్కోవడానికి కష్టంగా ఉండే ఒక గుహలో దావీదు దాక్కున్నాడు. (1 సమూ. 22:1, 4) ఆ మారుమూల ప్రాంతంలో తనను కాపాడే స్నేహితులు ఎవ్వరూ లేరని దావీదుకు అనిపించి ఉంటుంది. (కీర్త. 142:4) అప్పుడే ఆయన యెహోవా సహాయాన్ని కోరాడు.

16, 17. (ఎ) తనకు సహాయం చేసేవాళ్ళెవ్వరూ లేరని దావీదు ఎందుకు అనుకొని ఉంటాడు? (బి) దావీదు ఎవరి సహాయాన్ని కోరాడు?

16 దావీదు 142వ కీర్తన రాయడానికి ముందు, ప్రధాన యాజకుడైన అహీమెలెకుకు జరిగినదాని గురించి వినుంటాడు. దావీదు సౌలు నుండి పారిపోతున్నాడని తెలియక అహీమెలెకు దావీదుకు సహాయం చేశాడు. దాంతో, అసూయాపరుడైన సౌలు రాజు అహీమెలెకును, ఆయన ఇంటివాళ్ళను చంపించాడు. (1 సమూ. 22:11, 18, 19) వాళ్ళ మరణానికి తానే బాధ్యుణ్ణని దావీదు అనుకున్నాడు. తనకు సహాయం చేసిన యాజకుణ్ణి తానే చంపేసినట్లు దావీదు భావించాడు. దావీదుకు ఎదురైన పరిస్థితి మీకు ఎదురైవుంటే మీరు కూడా అలా అనుకొని ఉండేవాళ్ళా? అయితే, సౌలు దావీదును ఇంకా వెంటాడుతూనే ఉండడంతో ఆయన పరిస్థితి మరింత ఘోరంగా తయారైంది.

17 ఇశ్రాయేలీయులపై రాజుగా ఉండడానికి దావీదును అభిషేకించిన సమూయేలు ప్రవక్త, అహీమెలెకు చంపబడిన కొంతకాలానికే చనిపోయాడు. (1 సమూ. 25:1) ఇక తనకు సహాయం చేసేవాళ్ళెవ్వరూ లేరన్నట్లు దావీదు ఒంటరితనంతో బాధపడివుంటాడు. కానీ యెహోవా తనకు సహాయం చేస్తాడని దావీదుకు తెలుసు. లేవీయులకున్నలాంటి ప్రత్యేకమైన పని దావీదుకు లేదు కానీ మరో ప్రత్యేకమైన పనికోసం ఆయన అభిషేకించబడ్డాడు. ఆయన దేవుని ప్రజలకు రాజు కావాల్సిన వ్యక్తి. (1 సమూ. 16:1, 13) కాబట్టి దావీదు తన ఆలోచనలను, భావావేశాలను యెహోవాకు తెలియజేస్తూ ఆయనపై నమ్మకం ఉంచాడు. మీరు కూడా యెహోవాను మీ స్వాస్థ్యంగా చేసుకోవచ్చు. ఆయన సేవలో మీరు చేయగలిగినదంతా చేస్తూ ఆయనపై నమ్మకం ఉంచవచ్చు.

18. ఆసాపు, యిర్మీయా, దావీదు యెహోవాను తమ స్వాస్థ్యంగా చేసుకున్నామని ఎలా చూపించారు?

18 ఆసాపు, యిర్మీయా, దావీదు యెహోవాను తమ స్వాస్థ్యంగా చేసుకున్నారంటే దాని అర్థమేమిటి? వాళ్ళందరూ యెహోవా సేవలో ఒక నియామకాన్ని పొందారు. అంతేకాక యెహోవా తమ అవసరాలను తీరుస్తాడని వాళ్ళు నమ్మారు. లేవీయులూ, ఇతర గోత్రాలకు చెందిన దావీదులాంటి వాళ్ళూ యెహోవాను తమ స్వాస్థ్యంగా చేసుకోగలిగారు. వాళ్ళలాగే మనం కూడా యెహోవాను మన స్వాస్థ్యంగా ఎలా చేసుకోవచ్చు? దీని గురించి మనం తర్వాతి ఆర్టికల్‌లో చూద్దాం.

[అధస్సూచి]

a యాజకుల అవసరాలు ఎలా తీర్చబడేవో తెలుసుకోవడానికి లేఖనములపై అంతర్దృష్టి (ఆంగ్లం) 2వ సంపుటిలోని 684వ పేజీ చూడండి.

మీరెలా జవాబిస్తారు?

• లేవీయులకు యెహోవా ఎలా స్వాస్థ్యంగా ఉన్నాడు?

• ఆసాపు, యిర్మీయా, దావీదు యెహోవాను తమ స్వాస్థ్యంగా చేసుకున్నామని ఎలా చూపించారు?

• యెహోవా మన స్వాస్థ్యంగా ఉండాలంటే మనకు ఏ లక్షణం అవసరం?

[అధ్యయన ప్రశ్నలు]

[8వ పేజీలోని బ్లర్బ్‌]

లేవీయులు భూమిని స్వాస్థ్యంగా పొందలేదు. కానీ, యెహోవా సేవ చేసే గొప్ప అవకాశం వాళ్ళకుంది కాబట్టి యెహోవాయే వాళ్ళ స్వాస్థ్యం

[7వ పేజీలోని చిత్రం]

యెహోవా యాజకులకు, లేవీయులకు ఎలా స్వాస్థ్యంగా ఉన్నాడు?

[9వ పేజీలోని చిత్రం]

ఆసాపు యెహోవాను ఎల్లప్పుడూ తన స్వాస్థ్యంగా ఎలా ఉంచుకోగలిగాడు?