కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

సమస్యలు వచ్చినప్పుడు మీరు ఫీనెహాసులా ఉండగలరా?

సమస్యలు వచ్చినప్పుడు మీరు ఫీనెహాసులా ఉండగలరా?

సమస్యలు వచ్చినప్పుడు మీరు ఫీనెహాసులా ఉండగలరా?

సంఘ పెద్దలుగా ఉండడం వల్ల ఎంతో చక్కని సేవ చేసే అవకాశాలు దొరుకుతాయి. అయితే వాళ్ళకు సమస్యలు కూడా వస్తాయని దేవుని వాక్యం చెబుతోంది. కొన్నిసార్లు సంఘంలో ఎవరైనా తప్పుచేసినప్పుడు వాళ్ళ విషయంలో పెద్దలు ఒక నిర్ణయం తీసుకోవాల్సివుంటుంది. అలాంటప్పుడు వాళ్ళు ‘యెహోవా తరఫున తీర్పు తీరుస్తారు.’ (2 దిన. 19:6, పరిశుద్ధ బైబల్‌: తెలుగు ఈజీ-టు-రీడ్‌ వర్షన్‌) అంతేగాక, ఒక సంఘ పర్యవేక్షకుడు తనకు అప్పగించబడిన ఒక నియామకానికి తాను అస్సలు సిద్ధంగా లేనని అనుకోవచ్చు. మోషే కూడా అలాగే అనుకొని తనకివ్వబడిన ఒక నియామకం గురించి వినయంగా ‘ఫరో వద్దకు వెళ్ళుటకు నేను ఎంతటివాడను?’ అని దేవుణ్ణి అడిగాడు.—నిర్గ. 3:11.

దేవుని ప్రజల మధ్య సమస్యలు వచ్చినప్పుడు వాటిని చక్కగా పరిష్కరించిన పెద్దల ఉదాహరణలు పరిశుద్ధాత్మ ప్రేరణతో రాయబడిన లేఖనాల్లో ఉన్నాయి. కాబట్టి పరిశుద్ధాత్మ సహాయంతో నియమించబడే పెద్దలకు వాటిలో నుండే నిర్దేశం దొరుకుతుంది. ఉదాహరణకు ఎలియాజరు కుమారుడూ అహరోను మనుమడూ అయిన ఫీనెహాసు వాళ్ళ తర్వాత ప్రధానయాజకుడయ్యాడు. ఆయన జీవితంలో జరిగిన మూడు సంఘటనల్లో ఆయన ధైర్యంతో, బుద్ధివివేచనలతో, యెహోవాపై నమ్మకంతో సమస్యల్ని పరిష్కరించాడు. ఆ సంఘటనలను పరిశీలిస్తే, సంఘంలో సమస్యలు వచ్చినప్పుడు ఈ రోజుల్లో పెద్దలు కూడా అలా వ్యవహరించడం ఎంత ప్రాముఖ్యమో తెలుసుకోవచ్చు.

వెంటనే ‘లేచి వెళ్ళాడు’

ఇశ్రాయేలీయులు మోయాబు మైదానాల్లో గుడారాలు వేసుకొని ఉన్నప్పుడు ఫీనెహాసు యువకుడు. అప్పుడు ‘ప్రజలు మోయాబురాండ్రతో వ్యభిచారము చేయసాగిరి. వీరు భోజనముచేసి వారి దేవతలకు నమస్కరించిరి’ అని బైబిలు చెబుతోంది. (సంఖ్యా. 25:1, 2) తప్పుచేసిన వాళ్ళ మీదికి యెహోవా మరణకరమైన తెగులు రప్పించాడు. ప్రజలు తప్పు చేశారని, దానివల్ల వాళ్ళ మీదికి తెగులు వచ్చిందని విన్నప్పుడు ఫీనెహాసుకు ఎలా అనిపించి ఉంటుందో మీరు ఊహించగలరా?

ఆ వృత్తాంతం ఇంకా ఇలా చెబుతోంది: “ఇదిగో మోషే కన్నులయెదుటను, ప్రత్యక్షపు గుడారముయొక్క ద్వారమునొద్ద ఏడ్చుచుండిన ఇశ్రాయేలీయుల సర్వసమాజముయొక్క కన్నులయెదుటను, ఇశ్రాయేలీయులలో ఒకడు తన సహోదరుల యొద్దకు ఒక మిద్యాను స్త్రీని తోడుకొనివచ్చెను.” (సంఖ్యా. 25:6) యాజకుడైన ఫీనెహాసు అప్పటికి యువకుడు, అయితే తప్పుచేసిన ఇశ్రాయేలీయుడు ఆరాధన విషయంలో దేవుని ప్రజలకు నాయకత్వం వహిస్తున్న ప్రధాని. ఆ సందర్భంలో ఫీనెహాసు ఏమి చేశాడు?—సంఖ్యా. 25:14.

ఫీనెహాసు మనుష్యులకు కాదు యెహోవాకు భయపడ్డాడు. ఆయన వాళ్ళను చూడగానే ఈటె తీసుకొని వాళ్ళ వెనకాలే గుడారంలోకి వెళ్ళి ఒకేసారి వాళ్ళిద్దర్నీ పొడిచేశాడు. అప్పటికప్పుడు నిర్ణయానికి వచ్చే విషయంలో ఫీనెహాసు తీసుకున్న చొరవను, ఆయన చూపించిన ధైర్యాన్ని యెహోవా ఎలా ఎంచాడు? యెహోవా వెంటనే ఆ తెగులు ఆపేసి ఫీనెహాసుకు ఒక ఆశీర్వాదం ఇచ్చాడు. ఆయన వంశస్థులు ‘నిత్యం’ యాజకులుగా సేవ చేస్తారని యెహోవా ఆయనతో నిబంధన చేశాడు.—సంఖ్యా. 25:7-13.

ఈ రోజుల్లో క్రైస్తవ పెద్దలు హింసాత్మకంగా ప్రవర్తించరు. అయితే వాళ్ళు ఫీనెహాసులా ధైర్యం చూపించాలి, చొరవ తీసుకొని వెంటనే ఒక నిర్ణయానికి రావాలి. ఉదాహరణకు, గీల్యెర్మ అనే సహోదరుడు సంఘ పెద్దగా నియమించబడిన కొన్ని నెలలకే ఒక న్యాయనిర్ణయ కమిటీలో సేవ చేయమని ఆయనను అడిగారు. ఆ కేసు ఒక సంఘ పెద్దపై మోపబడిన అభియోగానికి సంబంధించినది, ఆ సంఘ పెద్ద గీల్యెర్మకు చిన్నప్పుడు ఎంతో సహాయం చేశాడు. గీల్యెర్మ ఇలా అంటున్నాడు: “ఆ న్యాయనిర్ణయ కమిటీలో ఉండడం నాకు చాలా ఇబ్బందిగా అనిపించింది. రాత్రి నిద్రపట్టేది కాదు. ఈ కేసును నిష్పక్షపాతంగా యెహోవా ప్రమాణాలకు తగ్గట్లు తీర్పుతీర్చడానికి వివిధ మార్గాల గురించి ఆలోచించేవాణ్ణి. ఎన్నో రోజులపాటు దాని గురించి ప్రార్థించి, బైబిలు ప్రచురణల్లో పరిశోధన చేశాను.” దానివల్ల ఆయన ఈ ప్రత్యేకమైన కేసును ధైర్యంగా పరిష్కరించగలిగాడు, తప్పు చేసిన ఆ సహోదరునికి ఆధ్యాత్మిక సహాయం అందించగలిగాడు.—1 తిమో. 4:11, 12.

సంఘంలో సమస్యలు తలెత్తినప్పుడు సంఘ పెద్దలు ధైర్యం చూపించాలి, వెంటనే నిర్ణయానికి వచ్చే విషయంలో చొరవ తీసుకోవాలి. అలా చేస్తే వాళ్ళు విశ్వాసం విషయంలో, నమ్మకంగా ఉండే విషయంలో చక్కని మాదిరిగా ఉండగలుగుతారు. ఎవరైనా తప్పు చేశారని తెలిసినప్పుడు దాన్ని సంఘ పెద్దలకు చెప్పడం ద్వారా సంఘంలోని ఇతర క్రైస్తవులు కూడా ధైర్యం చూపించాలి. అలాగే, మనం యెహోవాకు నమ్మకంగా ఉండాలంటే సంఘం నుండి బహిష్కరించబడిన బంధువులతో లేదా స్నేహితులతో సహవసించడం మానేయాలి.—1 కొరిం. 5:11-13.

బుద్ధివివేచనలతో సమస్య పరిష్కారమౌతుంది

పైన చూసినట్లుగా యౌవనుడైన ఫీనెహాసు ధైర్యంగా చర్య తీసుకున్నాడు, అయితే ఆయన యౌవనంలో ఉండే దుడుకుతనంతో అలా ప్రవర్తించలేదు. మరో వార్త విన్నప్పుడు ఆయన బుద్ధివివేచనలు ఎలా చూపించాడో పరిశీలించండి. రూబేనీయులు, గాదీయులు, మనష్షే అర్ధగోత్రపు వారు యొర్దాను నది దగ్గర ఒక బలిపీఠాన్ని కట్టారు. మిగతా ఇశ్రాయేలీయులు దాని గురించి వినగానే అది అబద్ధ ఆరాధన కోసమే అనుకొని వాళ్ళతో యుద్ధం చేయడానికి బయలుదేరారు.—యెహో. 22:11, 12.

అప్పుడు ఫీనెహాసు ఏమి చేశాడు? ఫీనెహాసు ఇశ్రాయేలీయుల ప్రధానులతో వెళ్ళి, బలిపీఠం కట్టిన వాళ్ళతో ఆ విషయం గురించి జ్ఞానయుక్తంగా చర్చించాడు. నిజానికి ‘యెహోవా సేవ’ కోసమే బలిపీఠం కట్టామని చెబుతూ వాళ్ళు అసలు విషయాన్ని వివరించారు. అలా సమస్య పరిష్కారమైంది.—యెహో. 22:13-34.

మన తోటి సహోదరుని మీద ఎవరైనా నింద మోపినప్పుడు లేదా ఆయన గురించి చెడుగా చెప్పినప్పుడు దాన్ని విన్న మనం ఫీనెహాసులా ప్రవర్తించడం తెలివైన పని. అప్పుడు మనం బుద్ధివివేచనలతో వ్యవహరిస్తే విన్నదాన్ని నమ్మి వెంటనే తోటి సహోదరుని గురించి తప్పుగా అనుకోం లేదా నిర్దయగా ఆయనపై ఇంకో నాలుగు మాటలు చెప్పం.—సామె. 19:11.

సంఘ పెద్దలు ఫీనెహాసులా బుద్ధివివేచనలతో ఎలా ప్రవర్తించవచ్చు? పది కన్నా ఎక్కువ సంవత్సరాలుగా సంఘ పెద్దగా సేవచేస్తున్న హైమే అనే సహోదరుడు ఇలా చెబుతున్నాడు, “ప్రచారకులెవరైనా వచ్చి తోటి క్రైస్తవులతో తమకు ఎదురైన సమస్య గురించి నాతో చెప్పడం మొదలుపెట్టిన వెంటనే నేను యెహోవాకు ప్రార్థించి, ముందే ఎవరో ఒకరి పక్షం వహించకుండా, వాళ్ళకు లేఖన నిర్దేశం ఇచ్చేలా సహాయం చేయమని వేడుకుంటాను. ఒక సహోదరి తన వ్యక్తిగత సమస్య గురించి చెప్పడానికి నా దగ్గరకు వచ్చింది. వేరే సంఘంలోని బాధ్యత గల ఒక సహోదరుడు తనతో సరిగ్గా వ్యవహరించలేదని చెప్పింది. ఆ సహోదరుడు నా స్నేహితుడే కాబట్టి దాని గురించి ఆయనతో మాట్లాడడం నాకు పెద్ద కష్టమేమీ కాదు. కానీ నేనూ ఆ సహోదరీ కలిసి ఎన్నో బైబిలు సూత్రాలను చర్చించుకున్నాం. ముందు తనే వెళ్ళి ఆ సహోదరునితో మాట్లాడడానికి ఆమె ఒప్పుకుంది. (మత్త. 5:23, 24) అయితే వెంటనే వాళ్ళిద్దరి మధ్య సమస్య పరిష్కారమైపోలేదు. కాబట్టి ఇతర లేఖన సూత్రాలను అన్వయించుకోవడం గురించి ఆలోచించమని ఆమెకు చెప్పాను. ఆ విషయం గురించి మళ్ళీ ప్రార్థించి, క్షమించడానికి కృషి చేయాలని ఆమె నిర్ణయించుకుంది.”

అలా చేయడం వల్ల ఎలాంటి ఫలితం వచ్చింది? హైమే ఇలా గుర్తుచేసుకుంటున్నాడు, “కొంతకాలానికి ఆ సహోదరుడు తానన్న మాటల గురించి బాధపడ్డాడని కొన్ని నెలల తర్వాత ఆమె నాతో చెప్పింది. ఆయన ఆ సహోదరితో పాటు పరిచర్యకు వెళ్ళి, ఆమెను ఎంతో మెచ్చుకున్నాడు. అలా సమస్య పరిష్కారమైంది. నేను పక్షపాతం చూపిస్తున్నానని ఆమె అనుకుంటుందనే భయంతో ఈ గొడవలో నేను అనవసరంగా కలుగజేసుకోలేదు. ఒకవేళ అలా కలుగజేసుకొనివుంటే ఇంతకన్నా చక్కని ఫలితం వచ్చి ఉండేదా?” బైబిలు ఇలా సలహా ఇస్తోంది, “ఆలోచన లేక వ్యాజ్యెమాడుటకు పోకుము.” (సామె. 25:8) క్రైస్తవుల మధ్య సమస్యలు తలెత్తినప్పుడు వాటిని పరిష్కరించుకొని సమాధానపడి, సంఘంలో శాంతిని పెంపొందించడానికి లేఖన సూత్రాలను అన్వయించుకోమని బుద్ధివివేచనలు గల పెద్దలు వాళ్ళను జ్ఞానయుక్తంగా ప్రోత్సహిస్తారు.

ఆయన యెహోవా వద్ద విచారణ చేశాడు

దేవుడు ఏర్పర్చుకున్న ప్రజలకు ఫీనెహాసు యాజకుడిగా సేవ చేశాడు. యువకుడిగా ఉన్నప్పుడే ఆయనకు చాలా ధైర్యం, బుద్ధివివేచనలు ఉన్నాయని పైన చూశాం. అయితే ఆయనకు యెహోవా మీద నమ్మకం ఉంది కాబట్టే తన ముందున్న సమస్యలను పరిష్కరించగలిగాడు.

బెన్యామీను గోత్రానికి చెందిన గిబియాలోని ప్రజలు ఒక లేవీయుని ఉపపత్నిని బలవంతం చేసి చంపేసినప్పుడు ఇతర గోత్రాలవాళ్ళు బెన్యామీనీయులతో యుద్ధం చేయడానికి సిద్ధమయ్యారు. (న్యాయా. 20:1-11) అయితే యుద్ధానికి పోయే ముందు యెహోవా సహాయం కోసం ప్రార్థించారు, కానీ వాళ్ళు రెండుసార్లు ఓడిపోయారు, ఎంతోమంది చనిపోయారు. (న్యాయా. 20:14-25) దేవుడు తమ ప్రార్థనలు వినడంలేదనీ, బెన్యామీనీయుల మీదికి తాము యుద్ధానికి వెళ్ళడాన్ని యెహోవా ఆమోదించడం లేదనీ ఇతర గోత్రాలవాళ్ళు అనుకొని ఉండవచ్చు.

అప్పటికి ఇశ్రాయేలీయులకు ప్రధానయాజకునిగా సేవ చేస్తున్న ఫీనెహాసు గట్టి విశ్వాసంతో మళ్ళీ రంగంలోకి దిగాడు. ‘మా సహోదరులైన బెన్యామీనీయులతో మరల యుద్ధమునకు పోదుమా, మానుదుమా?’ అని ఫీనెహాసు యెహోవాకు ప్రార్థన చేశాడు. దానికి సమాధానంగా యెహోవా బెన్యామీనీయులను వాళ్ళ చేతికి అప్పగించాడు, గిబియా సమూలంగా నాశనమైంది.—న్యాయా. 20:27-48.

దీని నుండి మనం ఏమి నేర్చుకోవచ్చు? సంఘ పెద్దలు ఎన్ని ప్రయత్నాలు చేసినా, దేవుని సహాయం కోసం ఎంత ప్రార్థించినా సంఘంలో కొన్ని సమస్యలు పరిష్కారమవ్వవు. ఒకవేళ అలా జరుగుతుంటే, “అడుగుడి, [లేదా ప్రార్థించుడి] మీ కియ్యబడును; వెదకుడి, మీకు దొరకును; తట్టుడి, మీకు తీయబడును” అని యేసు చెప్పిన మాటలను వాళ్ళు గుర్తుంచుకోవాలి. (లూకా 11:9) కొన్నిసార్లు ప్రార్థనలకు జవాబు రావడం ఆలస్యమవుతున్నట్లు అనిపించినా యెహోవా తగిన సమయంలో జవాబిస్తాడని సంఘ పెద్దలు నమ్మవచ్చు.

ఉదాహరణకు, ఐర్లాండ్‌లోని ఒక సంఘానికి రాజ్యమందిరం ఎంతో అవసరమైంది, అయితే స్థానిక ప్లానింగ్‌ ఆఫీసర్‌ రాజ్యమందిరం కట్టడానికి అనుమతి ఇవ్వలేదు. రాజ్యమందిరం కట్టడానికి ఎన్ని రకాల ప్రణాళికలు ప్రతిపాదించినా ఆయన వేటికీ ఒప్పుకోలేదు. ఇక తమకు అనుమతి ఇవ్వగల అధికారం ఉన్న వ్యక్తి నగర ప్రధాన ప్లానింగ్‌ ఆఫీసర్‌ మాత్రమే అని వాళ్ళకు అనిపించింది. ఫీనెహాసు కాలంలోలాగే, ప్రార్థన చేయడం వల్ల వీళ్ళకు ప్రయోజనం ఉంటుందా?

అక్కడి సంఘ పెద్ద ఇలా చెప్పాడు, “ఎన్నోసార్లు ప్రార్థించిన తర్వాత మేము ప్రధాన ప్లానింగ్‌ ఆఫీసుకు వెళ్ళాం. కొన్ని వారాల వరకు ఆఫీసర్‌ను కలవడం కుదరదని అక్కడ నాకు చెప్పారు. అయినా ఏదో విధంగా ఆయనతో మేము ఐదు నిమిషాలు మాట్లాడగలిగాం. రాజ్యమందిరానికి సంబంధించి మేము మళ్ళీ గీసిన ప్లాన్‌లు చూపించినప్పుడు ఆయన మాకు అనుమతినిచ్చాడు, ఇక అప్పటినుండి స్థానిక ప్లానింగ్‌ ఆఫీసర్‌ మాకెంతో సహాయం చేశాడు. ఈ అనుభవంతో, ప్రార్థనకు ఎంత శక్తి ఉందో మేము గ్రహించాం.” యెహోవా తన మీద ఆధారపడే సంఘ పెద్దల హృదయపూర్వక ప్రార్థనలకు జవాబిస్తాడు.

ప్రాచీన ఇశ్రాయేలులో ఫీనెహాసుకు ఎన్నో బరువైన బాధ్యతలు ఉండేవి, అయినా ఆయన ధైర్యంతో, బుద్ధివివేచనలతో, యెహోవాపై నమ్మకంతో సమస్యల్ని సమర్థవంతంగా పరిష్కరించగలిగాడు. దేవుని సంఘం విషయంలో ఫీనెహాసు చూపించిన శ్రద్ధను యెహోవా ఆమోదించాడు. దాదాపు 1,000 సంవత్సరాల తర్వాత ఎజ్రా ఇలా రాయడానికి ప్రేరేపించబడ్డాడు, “ఎలియాజరు కుమారుడైన ఫీనెహాసు మునుపు వారిమీద అధికారియైయుండెను, యెహోవా అతనితోకూడ నుండెను.” (1 దిన. 9:20) ఈ రోజుల్లో దేవుని ప్రజల మధ్య నాయకత్వం వహిస్తున్న పెద్దలందరి విషయంలో, అలాగే ఆయనను నమ్మకంగా సేవిస్తున్న క్రైస్తవులందరి విషయంలో ఆ మాటలు నిజమవును గాక.