కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

ఒంటరితనానికి, వివాహానికి సంబంధించిన జ్ఞానయుక్త సలహాలు

ఒంటరితనానికి, వివాహానికి సంబంధించిన జ్ఞానయుక్త సలహాలు

ఒంటరితనానికి, వివాహానికి సంబంధించిన జ్ఞానయుక్త సలహాలు

‘మీరు యోగ్య ప్రవర్తనులై, తొందర యేమియు లేక ప్రభువు సన్నిధానవర్తనులై యుండవలెనని చెప్పుచున్నాను.’—1 కొరిం. 7:35.

1, 2. ఒంటరితనానికి, వివాహానికి సంబంధించి బైబిలు చెబుతున్నదాన్ని మనం ఎందుకు తెలుసుకోవాలి?

 స్త్రీపురుషులు ఒకరితో ఒకరు వ్యవహరిస్తున్నప్పుడు తరచూ ఎక్కువ సంతోషం కలుగుతుంది లేదా విసుగొస్తుంది లేదా ఆందోళన కలుగుతుంది. మనకు ఇన్ని రకాల భావావేశాలు కలుగుతాయి కాబట్టి మనం దేవుని నడిపింపు కోసం అడగాలి. ఆయన నడిపింపు మనకు అవసరమని చెప్పేందుకు ఎన్నో కారణాలు ఉన్నాయి. ఉదాహరణకు, ఒంటరి జీవితాన్ని సంతోషంగా గడుపుతున్న కొంతమంది క్రైస్తవులను వాళ్ళ కుటుంబ సభ్యులు లేదా స్నేహితులు పెళ్ళి చేసుకోమని వాళ్ళను ఒత్తిడి చేస్తుండవచ్చు. ఇంకొంతమందికి పెళ్ళి చేసుకోవాలని ఉన్నా తగిన వ్యక్తి దొరక్కపోవచ్చు. మరికొన్ని సందర్భాల్లో, పెళ్ళి చేసుకోవాలని నిర్ణయించుకున్న అమ్మాయి, అబ్బాయి భార్యాభర్తలకు ఉండే బాధ్యతల కోసం సిద్ధపడేందుకు పెళ్ళికి ముందున్న సమయాన్ని ఉపయోగించుకోవాలంటే వాళ్ళకు నడిపింపు అవసరం. అవివాహితులైనా, వివాహితులైనా లైంగిక దుర్నీతికి పాల్పడకుండా తమను తాము కాపాడుకోవాలి.

2 అవివాహితులుగా ఉన్నా, వివాహితులుగా ఉన్నా ఈ రెండు పరిస్థితులు మన సంతోషాన్ని ప్రభావితం చేస్తాయి. అంతకంటే ముఖ్యంగా అవి యెహోవాతో మనకున్న స్నేహంపై ప్రభావం చూపిస్తాయి. 1 కొరింథీయులు 7వ అధ్యాయంలో అపొస్తలుడైన పౌలు ఒంటరితనం విషయంలో, వివాహం విషయంలో సలహాలిచ్చాడు. తన పత్రిక చదివినవాళ్ళు సరైనది చేస్తూ పక్కకు మళ్ళకుండా హృదయపూర్వకంగా దేవుని సేవలో కొనసాగాలని ఆయన కోరుకున్నాడు. (1 కొరిం. 7:35) ప్రాముఖ్యమైన ఆ విషయాల్లో పౌలు ఇచ్చిన సలహాలు మీకు సహాయం చేయగలవు. అవివాహితులుగా ఉన్నా, వివాహితులుగా ఉన్నా క్రైస్తవులు తమ స్థితిని యెహోవా సేవలో చక్కగా ఉపయోగించుకోవాలని ఆయన కోరుకున్నాడు.

ప్రతీ ఒక్కరు తీసుకునే అత్యంత ప్రాముఖ్యమైన నిర్ణయం

3, 4. (ఎ) పెళ్ళి చేసుకోమని ఒక వ్యక్తిని తన కుటుంబ సభ్యులు, స్నేహితులు ఒత్తిడి చేస్తే ఏమి జరగవచ్చు? (బి) పెళ్ళి విషయంలో సరైన ఆలోచనను కలిగివుండేందుకు పౌలు మాటలు ఎలా సహాయం చేస్తాయి?

3 పెళ్ళి చేసుకోవడం చాలా ప్రాముఖ్యమని మొదటి శతాబ్దంలోని యూదులు నమ్మేవాళ్ళు. ఇప్పుడు కూడా చాలామంది అలాగే ఆలోచిస్తున్నారు. వయసు దాటిపోతున్నా ఒక వ్యక్తి పెళ్ళి చేసుకోలేదంటే కుటుంబ సభ్యులు, స్నేహితులు ఆయన గురించి ఆందోళన చెందుతూ పెళ్ళి విషయంలో ఆయనకు సలహా ఇవ్వాలని అనుకుంటారు. తగిన వ్యక్తి కోసం మరింత ఎక్కువగా ప్రయత్నించమని వాళ్ళు చెప్పవచ్చు. లేదా ఫలానా వాళ్ళను చేసుకోమని సిఫారసు చేయవచ్చు. లేదా పెళ్ళి చేసుకోవాల్సిందేననే ఉద్దేశంతో పెళ్ళి చూపులు ఏర్పాటు చేస్తారు. అలాంటి పనులు చేయడం వల్ల ఒక వ్యక్తికి ఎంతో ఇబ్బంది, బాధ కలుగుతాయి, స్నేహాలు కూడా దెబ్బతింటాయి.

4 ఒంటరిగా ఉండమనో, పెళ్ళి చేసుకోమనో పౌలు ఎవరినీ ఒత్తిడి చేయలేదు. (1 కొరిం. 7:7) భార్య లేకుండానే ఆయన యెహోవా సేవలో సంతోషంగా గడిపాడు. అయితే పెళ్ళి చేసుకోవాలనుకునేవాళ్ళను విమర్శించలేదు. పెళ్ళి చేసుకోవాలో వద్దో నిర్ణయించుకునే హక్కు క్రైస్తవులందరికీ ఉంది. ఏమి చేయాలనే దానిగురించి ఇతరులు వాళ్ళకు సలహాలు ఇవ్వకూడదు.

ఒంటరిగా ఉన్న కాలాన్ని చక్కగా ఉపయోగించుకోండి

5, 6. ఒంటరిగా ఉండడం గురించి పౌలు ఎందుకు సిఫారసు చేశాడు?

5 పౌలు కొరింథీయులకు రాసిన మాటలను బట్టి, ఒంటరిగా ఉన్న క్రైస్తవులు తమ స్థితిని దేవుని సేవలో చక్కగా ఉపయోగించుకోవచ్చని తెలుస్తోంది. (1 కొరింథీయులు 7:8 చదవండి.) పెళ్ళి చేసుకోని కొంతమంది నామకార్థ క్రైస్తవమత నాయకులు పెళ్ళి చేసుకున్నవాళ్ళకన్నా తామే ఉత్తములమని అనుకుంటారు. కానీ పౌలు పెళ్ళి చేసుకోకపోయినా పెళ్ళైన వాళ్ళకన్నా తానే ఉత్తముణ్ణని అనుకోలేదు. ఒంటరిగా ఉన్న క్రైస్తవులు పెళ్ళైన క్రైస్తవులు చేయలేని కొన్ని విధానాల్లో దేవుని సేవ చేసే అవకాశముందని ఆయన వివరించాడు. ఆయన ఏ ఉద్దేశంతో అలా అన్నాడు?

6 ఒంటరిగా ఉన్న క్రైస్తవులు తరచూ యెహోవా సేవలో పెళ్ళైన క్రైస్తవులు అంగీకరించలేని నియామకాల్ని అంగీకరించగలుగుతారు. ‘అన్యజనులకు అపొస్తలుడిగా’ ఉండే అరుదైన అవకాశం పౌలుకు దొరికింది. (రోమా. 11:14) పౌలు అనుభవాల గురించి అపొస్తలుల కార్యములు 13-20 అధ్యాయాల్లో మనం చదవవచ్చు. పౌలు ఇతర మిషనరీలతో కలిసి కొత్త ప్రాంతాలకు వెళ్ళి సువార్త ప్రకటించాడు. అక్కడ వాళ్ళు చాలా కొత్త సంఘాలను స్థాపించారు. ఇప్పుడు మనం ఎదుర్కొనే అవకాశంలేని కష్టాలను అప్పుడు ఆయన పరిచర్యలో ఎదుర్కొన్నాడు. (2 కొరిం. 11:23-27, 32, 33) కానీ, శిష్యులను చేయడానికి పౌలు ఆ కష్టాలన్నిటినీ సహించడానికి ఇష్టపడ్డాడు. దానివల్ల ఆయనెంతో సంతోషించాడు. (1 థెస్స. 1:2-7, 9; 2:19) పౌలు ఒంటరిగా ఉండి యెహోవా సేవలో ఎంతో చేశాడు. ఒకవేళ ఆయన పెళ్ళి చేసుకొని ఉంటే అదంతా చేయగలిగేవాడు కాదు.

7. ఇద్దరు ఒంటరి సహోదరీలు తమ స్థితిని రాజ్యసువార్త ప్రకటించడానికి ఎలా ఉపయోగించుకున్నారు?

7 అవివాహితులుగా ఉన్న చాలామంది తమ స్థితిని ప్రకటనా పనిలో ఎక్కువగా పాల్గొనేందుకు ఉపయోగించుకుంటారు. బొలీవియాలో పయినీర్లుగా సేవస్తున్న సారా, లింబానియా అనే ఇద్దరు ఒంటరి సహోదరీల ఉదాహరణను పరిశీలించండి. చాలా సంవత్సరాలపాటు అసలు ఎవ్వరూ ప్రకటించని ఒక పల్లెటూరికి వాళ్ళు వెళ్ళారు. అక్కడ విద్యుత్తు సదుపాయం లేదు కాబట్టి ప్రజలు రేడియోలకు, టీవీలకు అతుక్కుపోయేవారు కాదు. అందుకే అక్కడి ప్రజలు చదవడానికి ఎక్కువ ఇష్టపడేవాళ్ళు. మన సహోదరీలు అక్కడికి వెళ్ళే సమయానికి కొంతమంది ప్రజలైతే యెహోవాసాక్షులు ఒకప్పుడు ప్రచురించిన పాత పత్రికలను, పుస్తకాలను ఇంకా చదువుతున్నారు. దాదాపు ప్రతీ ఇంట్లో బైబిలు సత్యాన్ని ఎక్కువగా తెలుసుకోవాలని కోరుకునే ప్రజలే ఉన్నందువల్ల ఆ క్షేత్రాన్ని పూర్తిచేయడానికి సహోదరీలకు చాలా సమయం పట్టింది. ఆ సహోదరీలతో ఒక పెద్దావిడ ఇలా అంది, “చిట్టచివరకు యెహోవాసాక్షులు మా ఊరికి వచ్చేశారు, అంటే అంతం చాలా దగ్గర్లో ఉందన్నమాట.” కొంతకాలానికే ఆ ఊర్లోవాళ్ళు సంఘ కూటాలకు హాజరవడం మొదలుపెట్టారు.

8, 9. (ఎ) పౌలు ఏ ఉద్దేశంతో ఒంటరిగా ఉండడం గురించి సిఫారసు చేశాడు? (బి) పెళ్ళికాని క్రైస్తవులకు ఏ చక్కని అవకాశాలు ఉంటాయి?

8 పరిస్థితులు అంత బాగాలేని క్షేత్రాల్లో సేవ చేయడం వల్ల పెళ్ళైన క్రైస్తవులు కూడా మంచి ఫలితాలు సాధిస్తారన్నది నిజమే. కానీ, ఒంటరి పయినీర్లు అంగీకరించగలిగే కొన్ని నియామకాల్ని అంగీకరించడం పెళ్ళైనవాళ్ళకూ పిల్లలున్న దంపతులకూ కష్టమౌతుంది. సంఘాలకు పౌలు పత్రికలు రాసే సమయానికి, రాజ్యసువార్త ప్రకటించే విషయంలో చేయాల్సిన పని ఇంకా ఎంతో ఉందని ఆయనకు తెలుసు. శిష్యులను చేస్తున్నప్పుడు తాను పొందిన ఆనందాన్ని ఇతరులు కూడా పొందాలని ఆయన కోరుకున్నాడు. అందుకే, ఒంటరిగా ఉండి యెహోవా సేవచేయడం మంచిదని ఆయన సిఫారసు చేశాడు.

9 అమెరికాలోని ఒక పయినీరు సహోదరి ఒంటరిగా ఉండడం గురించి తానెలా భావిస్తోందో వివరిస్తూ ఇలా రాసింది, “ఒంటరిగా ఉంటే సంతోషంగా ఉండలేరని కొంతమంది అనుకుంటారు. కానీ యెహోవాతో స్నేహాన్ని కలిగివుంటే ఎప్పటికీ సంతోషంగా ఉండవచ్చని నేను గ్రహించాను. ఒంటరిగా ఉండడం త్యాగమే అయినా ఆ స్థితిని చక్కగా ఉపయోగించుకుంటే అది గొప్ప బహుమానంగా ఉండగలదు.” సంతోషాన్ని ఎలా పొందవచ్చనే దాని గురించి మాట్లాడుతూ ఆమె ఇంకా ఇలా రాసింది, “ఒంటరిగా ఉంటే సంతోషాన్ని ఇట్టే సంపాదించుకోవచ్చు. సంతోషానికి అదో అడ్డంకు కాదు. యెహోవా తన ఆప్యాయతను ఒంటరివాళ్ళ మీద పెళ్ళైనవాళ్ళ మీద ఏ తేడా లేకుండా సమానంగా చూపిస్తాడని నాకు తెలుసు.” ఇప్పుడు ఆమె రాజ్య ప్రచారకుల అవసరం ఎక్కువగా ఉన్నచోట సంతోషంగా సేవ చేస్తోంది. మీరు ఒంటరివాళ్ళైతే, ఇతరులకు సత్యాన్ని బోధించే పనిలో ఎక్కువగా పాల్గొనడానికి మీ స్వేచ్ఛను ఉపయోగించుకోగలరా? అలా చేస్తే మీరు కూడా ఒంటరితనాన్ని యెహోవా ఇచ్చిన అమూల్యమైన బహుమానంగా ఎంచుతారు.

పెళ్ళి చేసుకోవాలనుకుంటున్న ఒంటరివాళ్ళు

10, 11. పెళ్ళి చేసుకోవడానికి తగిన వ్యక్తి దొరకనివాళ్ళకు యెహోవా ఎలా సహాయం చేస్తాడు?

10 కొంతకాలంపాటు అవివాహితునిగా ఉన్న తర్వాత ఒక యెహోవా సేవకుడు పెళ్ళి చేసుకోవాలని నిర్ణయించుకోవచ్చు. తనకు నడిపింపు అవసరమని ఆయనకు తెలుసు కాబట్టి, తాను పెళ్ళి చేసుకొని సంతోషంగా ఉండడానికి తగిన వ్యక్తి దొరికేలా సహాయం చేయమని ఆయన యెహోవాకు ప్రార్థిస్తాడు. పౌలు ఇలా రాశాడు, ‘తన అవివాహిత స్థితి విషయంలో తాను సరిగ్గా ప్రవర్తించడం లేదని ఒక వ్యక్తికి అనిపించడమే గాక శారీరక కోరికలు ఎక్కువగా ఉండే వయసు దాటిపోయి ఉంటే ఆయన వివాహం చేసుకోవాలనుకోవచ్చు. అందులో తప్పేమీ లేదు. అలాంటివారు వివాహం చేసుకోవచ్చు.’—1 కొరింథీయులు 7:36, NW.

11 హృదయపూర్వకంగా యెహోవాను సేవిస్తున్న ఒక వ్యక్తిని పెళ్ళి చేసుకోవాలని మీరు కోరుకుంటున్నట్లైతే దాని గురించి యెహోవాకు ప్రార్థిస్తూ ఉండండి. (ఫిలి. 4:6, 7) పెళ్ళి చేసుకోవాలని మీరు ఎంతోకాలం నుండి ఎదురుచూస్తున్నట్లు మీకు అనిపించినా నిరాశపడకండి. మీకేమి కావాలో యెహోవాకు తెలుసు, మీరు ఆయనపై నమ్మకం ఉంచితే, మీ పరిస్థితిని తాళుకోవడానికి ఆయన మీకు సహాయం చేస్తాడు.—హెబ్రీ. 13:6.

12. ఒకవ్యక్తి పెళ్ళి చేసుకోమని మిమ్మల్ని అడిగితే, మీరు జవాబిచ్చే ముందు దేని గురించి జాగ్రత్తగా ఆలోచించాలి?

12 ఒకవేళ యెహోవాతో మంచి స్నేహం లేని వ్యక్తి లేదా యెహోవాసాక్షికాని ఒకవ్యక్తి పెళ్ళి చేసుకోమని అడిగితే మీరు ఏమి చేయాలి? పెళ్ళి చేసుకోవాలని మీరు ఎంతగానో కోరుకుంటుండవచ్చు. కానీ మీరు తప్పుడు నిర్ణయం తీసుకుంటే, ఒంటరిగా ఉన్నప్పుడు పడిన బాధకన్నా పెళ్ళి చేసుకున్న తర్వాత పడే బాధ ఎక్కువగా ఉంటుంది. ఒకటి గుర్తుంచుకోండి, మీరు పెళ్ళి చేసుకోబోయే వ్యక్తితోనే జీవితాంతం ఉండాలి. మీరు ఇప్పుడు తీసుకునే నిర్ణయాన్ని బట్టే పెళ్ళి తర్వాత జీవితంలో సంతోషాన్ని పొందుతారు లేదా బాధలు పడతారు. (1 కొరిం. 7:27) కాబట్టి, తొందరపడి ఒక వ్యక్తిని పెళ్ళి చేసుకోవాలని నిర్ణయించుకోకండి. ఆ నిర్ణయం వల్ల మీరు తర్వాత బాధపడవచ్చు.—1 కొరింథీయులు 7:39 చదవండి.

పెళ్ళి తర్వాత ఉండే సాధకబాధకాల కోసం సిద్ధపడండి

13-15. ప్రేమించుకుంటున్నవాళ్ళు పెళ్ళికి ముందు ఏయే విషయాల గురించి చర్చించుకోవాలి?

13 ఒంటరిగా ఉండి యెహోవా సేవ చేస్తే మంచిదని పౌలు అన్నాడు. అలాగని, పెళ్ళి చేసుకోవాలని నిర్ణయించుకున్నవాళ్ళ కన్నా తానే ఉత్తముణ్ణని పౌలు అనుకోలేదు. పౌలు పెళ్ళి చేసుకోవాలనుకునేవాళ్ళకు సహాయం చేయాలనుకున్నాడు. ఆయనిచ్చిన సలహాలను పాటిస్తే, పెళ్ళి తర్వాత ఎలాంటి సుఖదుఃఖాలు ఉంటాయో, జీవితాంతం ఎలా కలిసివుండవచ్చో అర్థంచేసుకోగలుగుతారు.

14 పెళ్ళి చేసుకోవాలనుకునేవాళ్ళు పెళ్ళి తర్వాత ఉండే జీవితం గురించి తమకున్న అభిప్రాయాలను మార్చుకోవాల్సి రావచ్చు. ప్రేమించుకుంటున్న జంటలు తమ ప్రేమ చాలా ప్రత్యేకమైనదని, పెళ్ళి తర్వాత తమ జీవితం చాలా సంతోషంగా సాగుతుందని అనుకోవచ్చు. వాళ్ళు అలాంటి ఊహాలోకాల్లో విహరిస్తూ పెళ్ళిచేసుకుంటారు, తమ సంతోషాన్ని ఏదీ దెబ్బతీయలేదని అనుకుంటారు. కానీ నిజ జీవితం అలా ఉండదు. ఎప్పుడూ సంతోషంగానే ఉండడం సాధ్యం కాదు. ప్రేమగా కలిసి ఉండడం సంతోషాన్నిచ్చినా, వివాహజీవితంలో వచ్చే సమస్యల్ని, కష్టాల్ని తట్టుకోవడానికి అది మాత్రమే సరిపోదు.—1 కొరింథీయులు 7:28 చదవండి. a

15 పెళ్ళి చేసుకున్న తర్వాత, చాలా ప్రాముఖ్యమైన విషయాల్లో తామిద్దరికి వేర్వేరు అభిప్రాయాలు ఉండడం చూసి దంపతులు ఆశ్చర్యపోతారు లేదా నిరాశపడతారు. ఉదాహరణకు, డబ్బును ఎలా ఖర్చు పెట్టాలనే విషయంలో వారికి వేర్వేరు ఆలోచనలు ఉండవచ్చు. లేదా ఉల్లాసం కోసం వేటిని ఎంచుకోవాలి, ఎక్కడ నివసించాలి, ఎంత తరచుగా తమ కుటుంబ సభ్యులను కలవడానికి వెళ్ళాలి వంటి విషయాల్లో ఏకాభిప్రాయం ఉండకపోవచ్చు. అంతేకాక, ఒకరి అపరిపూర్ణతలు మరొకరికి చికాకు కలిగించవచ్చు. ఆ ప్రాముఖ్యమైన విషయాలన్నిటి గురించి చర్చించుకోవాల్సిన అవసరం లేదని ప్రేమించుకుంటున్న వ్యక్తులకు అనిపించవచ్చు. కానీ ఆ విషయాల గురించి మాట్లాడుకోకపోతే, భవిష్యత్తులో సమస్యలు రావచ్చు. కాబట్టి వాళ్ళు పెళ్ళికి ముందే ఆ విషయాల గురించి చర్చించుకోవడం మంచిది.

16. సమస్యల్ని ఎలా పరిష్కరించుకోవాలనే దాని గురించి దంపతులు ఎందుకు ఆలోచించాలి?

16 వివాహ జీవితం సంతోషంగా సాగాలంటే తమ బాధ్యతల్ని ఎలా నిర్వహించాలనేది ఇద్దరు కలిసి చర్చించుకోవాలి. పిల్లల్ని ఎలా పెంచాలనే దాని గురించి ఒక అభిప్రాయానికి రావాలి. అంతేకాక, తమ తల్లిదండ్రులు వృద్ధులైనప్పుడు వాళ్ళ అవసరాలను ఎలా చూసుకోవాలనే దాని గురించి కూడా బాగా ఆలోచించాలి. ప్రతీ కుటుంబంలో సమస్యలు ఉంటాయి. కానీ ఆ సమస్యల వల్ల దంపతులు విడిపోయే పరిస్థితి రాకుండా చూసుకోవాలి. బైబిలు సలహాను పాటిస్తే సమస్యల్ని పరిష్కరించుకోగలుగుతారు, సులభంగా పరిష్కరించుకోలేనివాటిని సహించగలుగుతారు, ఇద్దరూ కలిసి సంతోషంగా ఉండగలుగుతారు.—1 కొరిం. 7:10, 11.

17. పెళ్ళైనవాళ్ళు ఎందుకు ‘లోకవిషయమైనవాటి గురించి చింతిస్తారు?’

17 పౌలు 1 కొరింథీయులు 7:32-34లో వివాహ జీవితం గురించి మరింత వివరణ ఇచ్చాడు. (చదవండి.) పెళ్ళైన వాళ్ళు ‘లోకవిషయమైనవాటి గురించి చింతిస్తారు.’ ఆహారం, వస్త్రాలు, వసతి మరితర కనీస అవసరాల గురించి వాళ్ళు ఆలోచిస్తారు. వాళ్ళు ఎందుకు ‘లోకవిషయమైనవాటి గురించి చింతిస్తారు?’ ఉదాహరణకు, ఒక సహోదరుడు ఒంటరిగా ఉన్నప్పుడు పరిచర్యలో చాలా సమయాన్ని, శక్తిని వెచ్చించి ఉండవచ్చు. కానీ, పెళ్ళైన తర్వాత పరిచర్యలో అంతకుముందు చేసినంతగా చేయలేకపోవచ్చు. ఎందుకంటే కొంత సమయాన్ని, శక్తిని తన భార్య కోసం కూడా వెచ్చించాలి. భార్యాభర్తలిద్దరూ ఒకరినొకరు సంతోషపెట్టాలనుకుంటారని యెహోవాకు తెలుసు. పెళ్ళికాకముందు ఆ ఇద్దరూ తన సేవలో వెచ్చించినంత సమయాన్ని, శక్తిని పెళ్ళైన తర్వాత వెచ్చించలేరని యెహోవాకు తెలుసు. వాళ్ళు తమ వివాహ జీవితాన్ని బలపర్చుకోవడానికి అందులో కొంత సమయాన్ని, శక్తిని వెచ్చించాల్సిరావచ్చు.

18. ఉల్లాసకార్యకలాపాలకు వెచ్చించే సమయం విషయంలో దంపతులు ఏ మార్పులు చేసుకోవాల్సి రావచ్చు?

18 పెళ్ళైన తర్వాత యెహోవా సేవలో వెచ్చించే సమయం విషయంలో మార్పులు చేసుకున్నట్లే వాళ్ళు ఉల్లాసకార్యకలాపాలకు విడివిడిగా వెచ్చించే సమయం విషయంలో మార్పులు చేసుకోవాలి. ఒకవేళ భర్త ముందులాగే తన స్నేహితులతో కలిసి ఆడుకోవడానికి ఎక్కువ సమయాన్ని వెచ్చిస్తే భార్యకు ఎలా అనిపిస్తుందో ఆలోచించండి. లేదా భార్య కూడా ముందులాగే తన స్నేహితురాళ్ళతో ఎక్కువ సమయాన్ని వెచ్చిస్తే భర్తకు ఎలా అనిపిస్తుందో ఆలోచించండి. వాళ్ళు తన భర్త/భార్య తనను ప్రేమించడం లేదని, ఒంటరితనంతో బాధపడవచ్చు. అలా జరగకుండా ఉండాలంటే, తమ వివాహాన్ని బలపర్చుకోవడానికి ఇద్దరూ తాము చేయగలిగినదంతా చేయాలి.—ఎఫె. 5:31.

మనం నైతిక విషయాల్లో పవిత్రంగా ఉండాలని యెహోవా కోరుతున్నాడు

19, 20. (ఎ) వివాహ దంపతులు లైంగిక అనైతికతకు పాల్పడకుండా ఎందుకు జాగ్రత్తపడాలి? (బి) దంపతులు చాలాకాలంపాటు ఒకరికి ఒకరు దూరంగా ఉంటే ఎలాంటి ప్రమాదం ఉంటుంది?

19 నైతిక విషయాల్లో పవిత్రంగా ఉండడానికి యెహోవా సేవకులు తాము చేయగలిగినదంతా చేస్తారు. కొంతమంది లైంగిక అనైతికతకు పాల్పడకుండా ఉండడానికి పెళ్ళి చేసుకుంటారు. కానీ లైంగిక అనైతికతకు పాల్పడకుండా ఉండాలంటే పెళ్ళి చేసుకోవడం మాత్రమే సరిపోదు. పెళ్ళైన తర్వాత కూడా నైతిక విషయాల్లో పవిత్రంగా ఉండడానికి కృషి చేస్తూనే ఉండాలి. ప్రాచీన కాలాల్లో, పట్టణాల చుట్టూ బలమైన పెద్ద ప్రహరి గోడలు ఉండేవి. ఒక వ్యక్తి పట్టణం లోపల ఉంటే సురక్షితంగా ఉంటాడు, కానీ ఆ గోడల బయట దొంగలు, నేరస్థులు ఉంటారు కాబట్టి బయటకు వెళ్ళడం ప్రమాదకరం. వివాహ దంపతుల కోసం యెహోవా పెట్టిన హద్దులు పట్టణం చుట్టూ ఉండే బలమైన ప్రహరి గోడల్లాంటివి. వివాహం విషయంలో యెహోవా పెట్టిన నియమాలకు, హద్దులకు లోబడినప్పుడు మాత్రమే దంపతులు లైంగిక అనైతికతకు పాల్పడకుండా ఉండగలుగుతారు.

20 పౌలు 1 కొరింథీయులు 7:2-5లో ఆ హద్దులేమిటో వివరించాడు. తన భర్తతో లైంగిక సంబంధాలు కలిగివుండడం అనేది భార్యకు మాత్రమే ఉండే హక్కు. అలాగే తన భార్యతో లైంగిక సంబంధాలు కలిగివుండడం అనేది భర్తకు మాత్రమే ఉండే హక్కు. భార్యాభర్తలు తమ వివాహ “ధర్మములు” జరపాలని అంటే భార్యాభర్తలు మాత్రమే ఒకరితో ఒకరు లైంగిక సంబంధాలు కలిగివుండాలని యెహోవా చెబుతున్నాడు. ఒకవేళ వివాహ దంపతులు చాలాకాలంపాటు దూరంగా ఉంటే వాళ్ళు తమతమ “ధర్మములు” జరపలేరు. కొంతమంది దంపతులు సెలవులకు వేర్వేరుగా వెళ్తారు. మరికొందరేమో తమ ఉద్యోగం వల్ల చాలాకాలంపాటు తమ వివాహజత నుండి దూరంగా వేరే ప్రాంతంలో ఉంటారు. అలాంటి పరిస్థితులను సాతాను అవకాశంగా తీసుకోవచ్చు. భార్యాభర్తలు ఒకరి లైంగిక అవసరాలను ఒకరు పట్టించుకోకపోతే వాళ్ళు వ్యభిచారానికి పాల్పడేందుకు శోధింపబడే ప్రమాదం ఉంది. తమ వివాహ జీవితాన్ని ప్రమాదంలో పడవేసుకోకుండా తమ కుటుంబాల మీద శ్రద్ధ తీసుకునే కుటుంబ శిరస్సులను యెహోవా ఆశీర్వదిస్తాడు.—కీర్త. 37:25.

బైబిలు సలహాలను పాటించండి

21. (ఎ) ఒంటరిగా ఉండాలా పెళ్ళి చేసుకోవాలా అనేది నిర్ణయించుకోవడం ఎందుకు అంత సులభం కాదు? (బి) 1 కొరింథీయులు 7వ అధ్యాయంలోని సలహాలు మనకు ఎలా సహాయం చేస్తాయి?

21 ఒంటరిగా ఉండాలా పెళ్ళి చేసుకోవాలా అనేది నిర్ణయించుకోవడం అంత సులభమేమీ కాదు. మనందరం అపరిపూర్ణులం కాబట్టి ఒంటరిగా ఉండాలని నిర్ణయించుకున్నా, పెళ్ళి చేసుకోవాలనుకున్నా సమస్యలు ఉండనే ఉంటాయి. అంతేకాక, యెహోవా తన ప్రజల్ని ఆశీర్వదించినప్పటికీ వాళ్ళ జీవితాల్లో జరిగే సంఘటనల్ని బట్టి కొన్నిసార్లు నిరాశపడే అవకాశముంది. కానీ, 1 కొరింథీయులు 7వ అధ్యాయంలో పౌలు ఇచ్చిన జ్ఞానయుక్తమైన సలహాలను పాటిస్తే ఈ ఆర్టికల్‌లో చర్చించిన చాలా సమస్యలకు దూరంగా ఉండవచ్చు. మనం ఒంటరిగా ఉన్నా పెళ్ళి చేసుకున్నా యెహోవాకు ఇష్టమైన పనులు చేయవచ్చు. పౌలు ఇలా అన్నాడు, ‘తాను వివాహం చేసుకోవాల్సిన అవసరం లేదని ఒక వ్యక్తికి అనిపించి, అవివాహితునిగా ఉండాలని స్థిరంగా నిశ్చయించుకుని, తన మనసును అదుపులో ఉంచుకోగలిగితే ఆయన అలాగే చేయవచ్చు. ఆయన బాగా ప్రవర్తిస్తున్నాడు. వివాహం చేసుకునే వ్యక్తి కూడా బాగా ప్రవర్తిస్తున్నట్లే. కానీ వివాహం చేసుకోని వ్యక్తి మరింత బాగా ప్రవర్తిస్తున్నాడు.’ (1 కొరింథీయులు 7:37, 38, NW) యెహోవా ఆమోదాన్ని పొందడమే చాలా గొప్ప ఆశీర్వాదం. ఇప్పుడు, దేవుడు వాగ్దానం చేసిన నూతనలోకంలో జీవిస్తున్నప్పుడు మనం ఆయన ఆమోదాన్ని పొందవచ్చు. ఈ రోజుల్లో స్త్రీపురుషులు ఎదుర్కొంటున్న ఒత్తిళ్ళు, సమస్యలు అప్పుడు ఉండవు.

[అధస్సూచి]

మీరు జవాబివ్వగలరా?

• పెళ్ళి చేసుకోమని ఇతరులు ఒక వ్యక్తిని ఎందుకు ఒత్తిడి చేయకూడదు?

• ఒంటరి క్రైస్తవులు తమ సమయాన్ని చక్కగా ఎలా ఉపయోగించుకోవచ్చు?

• ప్రేమించుకుంటున్న వ్యక్తులు వివాహ జీవితంలో ఉండే సమస్యల కోసం ఎలా సిద్ధపడవచ్చు?

• లైంగిక అనైతికతకు పాల్పడకుండా ఉండాలంటే పెళ్ళి చేసుకోవడం మాత్రమే ఎందుకు సరిపోదు?

[అధ్యయన ప్రశ్నలు]

[14వ పేజీలోని చిత్రాలు]

ఒంటరి క్రైస్తవులు పరిచర్యలో ఎక్కువగా పాల్గొనేందుకు తమ సమయాన్ని ఉపయోగించుకుంటే ఎంతో సంతోషాన్ని పొందవచ్చు

[16వ పేజీలోని చిత్రం]

పెళ్ళి తర్వాత కొంతమంది ఎలాంటి మార్పులు చేసుకోవాల్సి రావచ్చు?