కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

పాఠకుల ప్రశ్నలు

పాఠకుల ప్రశ్నలు

పాఠకుల ప్రశ్నలు

బైబిలు చదువుతున్నప్పుడు అందులో నాకు ఏదైనా సందేహం వచ్చినా, నాకు ఏదైనా సమస్య ఎదురైతే దాని విషయంలో సలహా కావాలన్నా నేనేమి చేయాలి?

‘దాచబడిన ధనాన్ని’ వెదకినట్లు జ్ఞానవివేచనల కోసం ‘వెదకుతూనే’ ఉండాలని సామెతలు 2:1-5 వచనాలు మనల్ని ప్రోత్సహిస్తున్నాయి. బైబిలు చదివేటప్పుడు మనకు వచ్చే ప్రశ్నలకు సమాధానాలు పరిశోధించడానికి, మనకు ఎదురయ్యే సమస్యలను పరిష్కరించుకోవడానికి కృషిచేయాలని ఆ వచనాలు చూపిస్తున్నాయి. దీన్ని మనం ఎలా చేయవచ్చు?

“నమ్మకమైనవాడును బుద్ధిమంతుడునైన దాసుడు” అందించిన ఉపకరణాలను ఉపయోగిస్తూ “పరిశోధన ఎలా చెయ్యాలి?” అనే దాని గురించి దైవపరిపాలనా పరిచర్య పాఠశాల విద్య నుండి ప్రయోజనం పొందండి పుస్తకంలోని 33-38 పేజీలు వివరిస్తున్నాయి. (మత్త. 24:45) వాచ్‌టవర్‌ పబ్లికేషన్స్‌ ఇండెక్స్‌ను ఎలా ఉపయోగించాలో 36వ పేజీ వివరిస్తుంది, దీనిలో విషయ సూచిక, లేఖనాల సూచిక అని రెండు భాగాలు ఉంటాయి. కాబట్టి మనం వెదకాలనుకున్న సమాచారానికి సంబంధించిన ఏదైనా పదాన్ని గానీ లేఖనాన్ని గానీ ఇండెక్స్‌లో వెదికితే దానికి సంబంధించిన రెఫరెన్సులు ఎన్నో దొరుకుతాయి. అంతేకాక, ప్రతీ సంవత్సరం కావలికోట డిసెంబరు అధ్యయన సంచికలో వచ్చే విషయసూచికను కూడా మనం ఉపయోగించుకోవచ్చు. మీకు కావాల్సిన సమాధానం లేదా నిర్దేశం దొరికేంత వరకు ఓపిగ్గా పరిశోధన చేయండి. మీరు ‘దాచబడిన ధనాన్ని’ వెదకుతున్నారని గుర్తుంచుకోండి, దానికి సమయం, కృషి అవసరం.

కొన్ని విషయాల గురించి, లేఖనాల గురించి మన ప్రచురణలు ప్రత్యేకంగా వివరించలేదు. ఒకవేళ ఏదైనా బైబిలు లేఖనం గురించి వివరించినా మీ మనసులో ఉన్న ప్రశ్నకు వాటిలో జవాబు ఉండకపోవచ్చు. అంతేకాక కొన్ని బైబిలు వృత్తాంతాల్లో అన్ని వివరాలు ఉండవు కాబట్టి, వాటిని చదివినప్పుడు మనకు సందేహాలు రావచ్చు. కానీ మనకు వచ్చిన ప్రతీ సందేహానికి వెంటనే సమాధానం దొరక్కపోవచ్చు. జవాబు లేని అలాంటి ప్రశ్నలకు సమాధానం ఇదేనేమో అని ఊహాగానాలు చేయకూడదు. అలా చేస్తే “విశ్వాససంబంధమైన దేవుని యేర్పాటుతో కాక వివాదములతోనే సంబంధము కలిగియున్న” చర్చల్లో చిక్కుకుంటాం. (1 తిమో. 1:3, 4; 2 తిమో. 2:23; తీతు 3:9) బ్రాంచి కార్యాలయం గానీ, ప్రపంచ ప్రధాన కార్యాలయం గానీ మన ప్రచురణల్లో వివరణలేని అలాంటి ప్రశ్నలన్నిటినీ పరిశీలించి వాటికి జవాబిచ్చే స్థితిలో లేదు. మన జీవితమంతటిలో మనల్ని నడిపించడానికి తగినంత సమాచారాన్ని బైబిలు ఇస్తోంది కానీ బైబిలు రచయితయైన దేవునిపై బలమైన విశ్వాసాన్ని చూపించాల్సి వచ్చే కొన్ని విషయాలను అది వివరించడం లేదు. కాబట్టి అంతటితో మనం సంతృప్తి కలిగివుండవచ్చు.—యెహోవాకు సన్నిహితమవండి పుస్తకంలోని 185-187 పేజీలు చూడండి.

బైబిలు చదివేటప్పుడు మనకు వచ్చే ప్రశ్నలకు సంబంధించి, మనకు ఎదురయ్యే సమస్యలకు సంబంధించి ఎంతో పరిశోధన చేసిన తర్వాత కూడా అవసరమైన నడిపింపు గానీ, పరిష్కారం గానీ దొరక్కపోతే ఏమి చేయాలి? పరిణతి గల తోటి విశ్వాసిని, బహుశా స్థానిక సంఘ పెద్దల్లో ఒకరిని సహాయం కోసం అడగడానికి వెనుకాడకూడదు. వాళ్ళకు బైబిలు జ్ఞానం ఎక్కువగా ఉండడమే కాక క్రైస్తవులుగా జీవించడంలో అనుభవం కూడా ఉంటుంది. మీ సమస్య గురించి లేదా మీరు తీసుకోవాల్సిన నిర్ణయం గురించి మీకు సలహా అవసరమైతే వాళ్ళు వివిధ విషయాలను పరిగణనలోకి తీసుకొని మీకు సహాయం చేయగలుగుతారు. ఎందుకంటే మీ గురించి, మీ పరిస్థితి గురించి వాళ్ళకు బాగా తెలిసివుంటుంది. ‘యెహోవాయే జ్ఞానం, వివేచన ఇచ్చేవాడు’ కాబట్టి మీకున్న సందేహాల గురించి, సమస్యల గురించి ఆయనకు ప్రార్థించి, తన పరిశుద్ధాత్మ ద్వారా మీ ఆలోచనను నిర్దేశించమని అడగడం మర్చిపోకండి.—సామె. 2:6; లూకా 11:13.