కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

యెహోవా సేవలో నేను ఇప్పటికీ సంతోషిస్తున్నాను

యెహోవా సేవలో నేను ఇప్పటికీ సంతోషిస్తున్నాను

యెహోవా సేవలో నేను ఇప్పటికీ సంతోషిస్తున్నాను

ఫ్రెడ్‌ రస్క్‌ చెప్పినది

“నా తలిదండ్రులు నన్ను విడిచినను యెహోవా నన్ను చేరదీయును” అని కీర్తన 27:10లో దావీదు రాసిన మాటలు నా జీవితంలో చిన్నప్పుడే నిజమయ్యాయి. అది ఎలాగో చెబుతాను.

నే ను 1930లలో తీవ్రమైన ఆర్థిక సంక్షోభం ఉన్న రోజుల్లో, అమెరికాలోని జార్జియా రాష్ట్రంలో మా తాతయ్య దగ్గర పెరిగాను. ఆయనకు అక్కడ పత్తి ఫామ్‌లు ఉండేవి. మా అమ్మతో సహా అప్పుడే పుట్టిన మా తమ్ముడు చనిపోవడంతో చాలా కృంగిపోయిన మా నాన్న నన్ను మా తాతయ్య దగ్గరే వదిలేసి ఉద్యోగం కోసం ఎక్కడో దూరంలో ఉన్న ఒక పట్టణానికి వెళ్లిపోయాడు. అప్పటికే మా నానమ్మ చనిపోయింది. ఆ తర్వాత, మా నాన్న నన్ను తన దగ్గరికి తీసుకుపోవడానికి ఎంతో ప్రయత్నించాడు కానీ వీలు కాలేదు.

మా నాన్నవాళ్ల అక్కలు అంటే మా అత్తలు ఇంటిని చూసుకునేవాళ్లు. మా తాతయ్య మత సంబంధ విషయాలను అంతగా పట్టించుకోకపోయినా, మా అత్తయ్యలు మాత్రం బాప్టిస్టు చర్చిలో నిష్ఠగల వ్యక్తులు. చర్చికి రాకపోతే కొడతామని వాళ్లు నన్ను బెదిరించేవాళ్లు కాబట్టి బలవంతంగా ప్రతీ ఆదివారం చర్చికి వెళ్లేవాణ్ణి. అందుకే నాకు చిన్నప్పటి నుండి మతమంటే అంత గౌరవం ఉండేది కాదు. అయితే స్కూలుకు వెళ్లడాన్ని, క్రీడల్ని నేను ఇష్టపడేవాణ్ణి.

నా జీవితాన్ని మార్చేసిన సందర్శనం

నాకు 15 ఏళ్లున్నప్పుడు అంటే 1941లో ఒకరోజు మధ్యాహ్నం ఒక వృద్ధుడు, ఆయన భార్య మా ఇంటికి వచ్చారు. ‘నా పేరు టాల్మాజ్‌ రస్క్‌, నేను మీ అంకుల్ని’ అని ఆయన తనను తాను పరిచయం చేసుకున్నాడు. ఆయన గురించి నేను అంతకుముందెప్పుడూ వినలేదు కానీ ఆయన, ఆయన భార్య యెహోవాసాక్షులని తెలుసుకున్నాను. మనుష్యులు భూమ్మీద నిరంతరం జీవించాలన్నదే దేవుని సంకల్పమని ఆయన వివరించాడు. అప్పటికే నేను చర్చిలో విన్నదానికి, ఆయన చెప్పిన దానికి చాలా తేడా ఉంది. ఇంట్లో చాలామంది వాళ్లు చెప్పిన దానికి ఒప్పుకోకుండా వాళ్లను వ్యతిరేకించారు. వాళ్లను ఆ తర్వాత మళ్లీ ఎప్పుడూ మా ఇంటికి రానివ్వలేదు. అయితే, నాకన్నా మూడు సంవత్సరాలు పెద్దదైన మా చిన్నత్త మేరీ మాత్రం బైబిలును, దాన్ని వివరించే సాహిత్యాలను తీసుకుంది.

మేరీ వాటిని చదివిన వెంటనే అదే సత్యమని గ్రహించింది. ఆమె 1942లో బాప్తిస్మం తీసుకొని యెహోవాసాక్షి అయ్యింది. “ఒక మనుష్యుని యింటివారే అతనికి శత్రువులగుదురు” అని యేసు చెప్పిన మాటలు ఆమె విషయంలో నిజమయ్యాయి. (మత్త. 10:34-36) కుటుంబంలో ఆమెకు చాలా వ్యతిరేకత ఎదురైంది. మా పెద్దత్తకు కొంతమంది రాజకీయ నాయకులు తెలుసు. కాబట్టి నగర మేయరుతో కలిసి కుట్రపన్ని టాల్మాజ్‌ అంకుల్ని అరెస్ట్‌ చేయించింది. లైసెన్సు లేకుండా పుస్తకాలు అమ్ముతున్నాడనే అభియోగంతో ఆయనను అదుపులోకి తీసుకున్నారు. ఆ తర్వాత ఆయనకు శిక్ష పడింది.

ఆ మేయరు నగర కోర్టులో జడ్జీ కూడా. ‘ఈ వ్యక్తి పంపిణీ చేస్తున్న సాహిత్యాలు విషమంత ప్రమాదకరమైనవి’ అని ఆయన కోర్టులో ప్రకటించాడని మా నగర వార్తాపత్రికలో వచ్చింది. కానీ టాల్మాజ్‌ అంకుల్‌ కోర్టుకు అప్పీలు చేసుకొని కేసు గెలిచాడు. అప్పటికే ఆయన పది రోజులు జైలు శిక్ష అనుభవించాల్సి వచ్చింది.

మేరీ నాకు సహాయం చేసింది

మేరీ తన కొత్త నమ్మకాల గురించి నాతో మాట్లాడడమే కాక మా ఇరుగుపొరుగువాళ్లకు కూడా ప్రకటించడం మొదలుపెట్టింది. ఆమె నూతన లోకం (ఆంగ్లం) a అనే పుస్తకాన్ని తీసుకున్న వ్యక్తితో బైబిలు అధ్యయనం చేయడానికి వెళ్లినప్పుడు నేను ఆమెతోపాటు వెళ్లాను. ఆయన రాత్రంతా ఆ పుస్తకం చదువుతూనే ఉన్నాడని ఆయన భార్య చెప్పింది. నేను తొందరపడి ఏ మతాన్నీ అంగీకరించకూడదని అనుకున్నా, నేను అప్పుడు తెలుసుకుంటున్న విషయాలు నాకు నచ్చాయి. అయితే, ముఖ్యంగా యెహోవాసాక్షుల బైబిలు బోధల వల్ల కాదు గానీ ప్రజలు వాళ్లతో వ్యవహరించిన తీరువల్లే వాళ్లు దేవుని ప్రజలని నాకు నమ్మకం కుదిరింది.

ఉదాహరణకు, ఒకరోజు మేరీ వాళ్ల అక్కలు ఆమె సాహిత్యాలను, ఒక ఫోనోగ్రాఫును, బైబిలు సందేశాలున్న రికార్డింగులను చెత్తకాల్చే చోట తగలబెట్టేశారనడానికి రుజువులను నేను, మేరీ కనుగొన్నాం. నాకు చాలా కోపమొచ్చింది కానీ మా పెద్దత్తల్లో ఒకామె నా కోపాన్ని ఎగతాళి చేస్తూ, ‘మేము చేసినదానికి ఎప్పుడో ఒకసారి నువ్వు కృతజ్ఞతలు చెప్తావు చూడు’ అంది.

మేరీ తన కొత్త నమ్మకాలను వదిలిపెట్టకపోవడంతో, పొరుగువాళ్లకు ప్రకటించడం మానకపోవడంతో ఆమెను 1943లో ఇంట్లో నుంచి గెంటేశారు. అప్పటికే నేను, దేవునికి యెహోవా అనే పేరు ఉందనీ ఆయన ప్రేమ, కనికరం కలిగిన దేవుడనీ మనుష్యుల్ని అగ్నిలో వేసి కాల్చడనీ తెలుసుకున్నాను. అంతేకాక, అప్పటికి కూటాలకు వెళ్లడం మొదలుపెట్టకపోయినా యెహోవాకు ఒక ప్రేమగల సంస్థ ఉందని కూడా నేను తెలుసుకున్నాను.

ఒకరోజు, నేను తోటలో పనిచేస్తున్నప్పుడు ఒక కారు మెల్లగా నా దగ్గరకు వచ్చి ఆగింది. అందులో ఉన్న ఇద్దరిలో ఒకరు, ‘ఫ్రెడ్‌ అంటే నువ్వేనా?’ అని అడిగారు. వాళ్లు యెహోవాసాక్షులని నాకు అర్థమైన వెంటనే, ‘నేను కూడా కారులో కూర్చుంటాను. మనమెక్కడికైనా సురక్షితమైన చోటుకు వెళ్దాం’ అన్నాను. మేరీయే వాళ్లను నా దగ్గరికి పంపించింది. వాళ్లలో ఒకరి పేరు షీల్డ్‌ టూట్జీన్‌. ఆయన ప్రయాణ సేవలో ఉన్న సహోదరుడు. ఆయనే నాకు సరైన సమయంలో ప్రోత్సాహాన్ని, ఆధ్యాత్మిక నడిపింపును ఇచ్చాడు. యెహోవాసాక్షుల నమ్మకాలను సమర్థించినందుకు కుటుంబంలోని వాళ్లంతా నన్ను వ్యతిరేకించడం మొదలుపెట్టారు.

వర్జీనియాలో ఉంటున్న మేరీ నాకు ఉత్తరం రాసింది. ఒకవేళ యెహోవాను సేవించాలని నేను నిర్ణయించుకుంటే వచ్చి తన దగ్గర ఉండవచ్చని ఆ ఉత్తరంలో రాసింది. వెంటనే నేను అక్కడికి వెళ్లిపోవాలని నిర్ణయించుకున్నాను. 1943 అక్టోబరులో ఒక శుక్రవారం సాయంకాలం, అవసరమైన కొన్ని వస్తువులను ఒక పెట్టెలో సర్ది ఇంటినుండి కొంచెం దూరంలో ఉన్న ఒక చెట్టుకు దాన్ని కట్టి ఉంచాను. శనివారం ఆ పెట్టెను తీసుకొని మా పొరుగువాళ్ల ఇంటి వెనకాల నుండి తప్పించుకొని పట్టణానికి వెళ్లిపోయాను. అక్కడ నుండి రోవనాక్‌ నగరంలో ఉన్న ఎడ్న ఫావుల్స్‌ వాళ్ల ఇంటికి చేరుకున్నాను. మేరీ అక్కడే ఉంది.

ఆధ్యాత్మిక ప్రగతి, బాప్తిస్మం, బెతెల్‌ సేవ

ఎడ్న కనికరంగల అభిషిక్త క్రైస్తవురాలు. ఆమె ఆధునికకాల లూదియ అని చెప్పవచ్చు. ఆమె ఒక పెద్ద ఇల్లు అద్దెకు తీసుకొని మేరీకే కాక తన అన్న భార్యకు, వాళ్ల ఇద్దరు కూతుర్లకు తన ఇంట్లో ఆశ్రయమిచ్చింది. ఆ ఇద్దరు అమ్మాయిలు అంటే గ్లాడస్‌ గ్రెగరీ, గ్రేస్‌ గ్రెగరీ ఆ తర్వాత మిషనరీలు అయ్యారు. గ్లాడస్‌ ఇప్పుడు 90లలో ఉంది. ఇప్పటికీ జపాన్‌ బ్రాంచి కార్యాలయంలో నమ్మకంగా సేవ చేస్తోంది.

ఎడ్న వాళ్ల ఇంట్లో ఉన్నంత కాలం నేను కూటాలకు క్రమంగా వెళ్లాను, పరిచర్య ఎలా చేయాలో తెలుసుకున్నాను. దేవుని వాక్యాన్ని చదివే, కూటాలకు హాజరయ్యే స్వేచ్ఛ ఉన్నందువల్ల నా ఆధ్యాత్మిక ఆకలి తీరింది. 1944 జూన్‌ 14న నేను బాప్తిస్మం తీసుకున్నాను. మేరీ, గ్లాడస్‌ గ్రెగరీ, గ్రేస్‌ గ్రెగరీ పయినీరు సేవ మొదలుపెట్టి, ఉత్తర వర్జీనియాలో సేవచేసే నియామకాన్ని పొందారు. అక్కడ లీస్‌బర్గ్‌లో సంఘాన్ని స్థాపించడానికి వాళ్ల కృషి ఎంతగానో దోహదపడింది. 1946 ఆరంభంలో, నేను దానికి దగ్గర్లోని ఒక ఊర్లో పయినీరు సేవ మొదలుపెట్టాను. అదే సంవత్సరం వేసవిలో, ఒహాయోలోని క్లీవ్‌లాండ్‌లో ఆగస్టు 4-11 తారీఖుల్లో జరిగిన అంతర్జాతీయ సమావేశానికి మేమంతా కలిసి వెళ్లాం. ఆ సమావేశం నాకు ఇప్పటికీ గుర్తుంది.

ఆ సమావేశంలో, అప్పుడు మన సంస్థకు నాయకత్వం వహిస్తున్న నేథన్‌ నార్‌ బ్రూక్లిన్‌ బెతెల్‌ను విస్తరించడానికి సంబంధించిన ప్రణాళికల్ని వివరించాడు. బెతెల్‌ సభ్యుల నివాసం కోసం కొత్త భవనాన్ని నిర్మించాలని, ప్రింటరీని విస్తరించాలని అనుకుంటున్నట్లు ఆయన చెప్పాడు. దానికి చాలామంది యువకులు అవసరం. నేను అక్కడే యెహోవా సేవ చేయాలని కోరుకున్నాను కాబట్టి, దానికి దరఖాస్తు పెట్టుకున్నాను. కొన్ని నెలల్లోనే అంటే 1946 డిసెంబరు 1న నేను బెతెల్‌లో అడుగుపెట్టాను.

దాదాపు ఒక ఏడాది తర్వాత, ప్రింటరీ పర్యవేక్షకుడిగా సేవ చేస్తున్న మ్యాక్స్‌ లార్సన్‌ మెయిలింగ్‌ డిపార్ట్‌మెంట్‌లో పనిచేస్తున్న నా దగ్గరికి వచ్చి నన్ను సర్వీస్‌ డిపార్ట్‌మెంటుకు నియమిస్తున్నట్లు చెప్పాడు. ఆ నియామకంలో ముఖ్యంగా ఆ డిపార్ట్‌మెంట్‌ పర్యవేక్షకుడిగా ఉన్న టీ.జె. (బడ్‌) సల్లివన్‌తో కలిసి పనిచేస్తున్నప్పుడు నేను బైబిలు సూత్రాలను అన్వయించుకోవడం గురించి, యెహోవా సంస్థ పనితీరు గురించి మరింత తెలుసుకున్నాను.

మా నాన్న నన్ను చూడడానికి చాలాసార్లు బెతెల్‌కు వచ్చాడు. తర్వాతి కాలంలో ఆయన మతసంబంధమైన విషయాల్లో ఆసక్తి చూపించాడు. ఆయన 1965లో చివరిసారి బెతెల్‌కు వచ్చినప్పుడు, ‘నువ్వు నన్ను చూడడానికి రావచ్చు, కానీ నేను నిన్ను చూడడానికి ఇక్కడికి మాత్రం ఇంకెప్పుడూ రాను’ అన్నాడు. ఆయన చనిపోకముందు నేను కొన్నిసార్లు ఆయనను చూడడానికి వెళ్లాను. తాను పరలోకానికి వెళ్తానని ఆయన బలంగా నమ్మాడు. ఆయన యెహోవా జ్ఞాపకంలో ఉన్నాడని నేను నమ్ముతున్నాను, ఒకవేళ అలా ఉంటే, ఆయన పునరుత్థానం చేయబడిన తర్వాత తాను అనుకున్నట్లు పరలోకంలో కాదుగానీ నిత్యం జీవించే నిరీక్షణతో పరదైసు భూమ్మీద ఉంటాడు.

నాకు గుర్తుండిపోయిన ఇతర సమావేశాలు, నిర్మాణ పనులు

సమావేశాలు ఆధ్యాత్మిక ప్రగతికి మైలురాళ్ల వంటివి. ముఖ్యంగా 1950లలో న్యూయార్క్‌లోని యాంకీ స్టేడియంలో జరిగిన అంతర్జాతీయ సమావేశాలు అలాంటివే. 1958లో ఒక సెషన్‌కు యాంకీ స్టేడియంలో, పోలో గ్రౌండ్స్‌లో మొత్తం కలిపి 123 దేశాల నుండి 2,53,922 మంది హాజరయ్యారు. ఆ సమావేశంలో జరిగిన ఒక సంఘటనను నేను ఎన్నడూ మరచిపోలేను. నేను సమావేశ ఆఫీసులో ఏదో పని చేస్తుండగా సహోదరుడు నార్‌ హడావిడిగా నా దగ్గరకు వచ్చాడు. ‘ఫ్రెడ్‌, దగ్గర్లో మనం అద్దెకు తీసుకున్న హాల్‌లో పయినీర్లంతా కూర్చొని ఉన్నారు. ఏదో పనిలోపడి, వాళ్ల కోసం ప్రసంగాన్నివ్వడానికి ఒక సహోదరుణ్ణి నియమించడం మరచిపోయాను. నువ్వు గబగబా అక్కడికి వెళ్లి ఒక మంచి ప్రసంగం ఇవ్వగలవా? నువ్వు అక్కడికి చేరుకునేలోపు నీకు ఏది తడితే దాని గురించి ఒక ప్రసంగం ఇవ్వు’ అని సహోదరుడు నార్‌ నాకు చెప్పాడు. నేను ఆయాసపడుతూ అక్కడికి చేరుకునేలోపు యెహోవాకు ఎన్నోసార్లు ప్రార్థించాను.

1950లలో, 1960లలో న్యూయార్క్‌ నగరంలో సంఘాల సంఖ్య ఒక్కసారిగా పెరిగిపోవడంతో రాజ్యమందిరాల కోసం మనం అద్దెకు తీసుకున్న భవనాలు సరిపోలేదు. కాబట్టి మాన్‌హాటన్‌లో 1970-1990 మధ్యకాలంలో మనం మూడు భవనాలను కొని, కూటాలు జరుపుకోవడానికి అనుగుణంగా వాటిలో మార్పులు చేశాం. ఆ పనికి నేనే బిల్డింగ్‌ కమిటీ చైర్మన్‌గా పనిచేశాను. ఈ భవనాలకు కావాల్సిన డబ్బును సమకూర్చడానికి, వాటిని నిర్మించడానికి సంఘ సభ్యులు కలిసి పనిచేసినందుకు యెహోవా ఎంతగా ఆశీర్వదించాడో చూసే చక్కని అవకాశం నాకు దొరికింది. ఆ భవనాలు ఇప్పటికీ సత్యారాధనకు ఎంతో చక్కగా ఉపయోగపడుతున్నాయి.

జీవితంలో మార్పులు

1957లో ఒకరోజు నేను బెతెల్‌లో నా రూమ్‌ నుండి పార్కు గుండా ప్రింటరీకి నడుస్తున్నప్పుడు వర్షం మొదలైంది. అప్పుడే నేను, కొత్తగా బెతెల్‌లో సేవచేయడానికి వచ్చిన ఒక అందమైన అమ్మాయి నా ముందు నడుచుకుంటూ వెళ్లడం చూశాను. ఆమెకు గొడుగు లేకపోవడంతో నా గొడుగు పట్టాను. అలా నేను మార్జ్‌రీని కలిశాను. 1960లో మేము పెళ్లి చేసుకున్నాం. అప్పటినుండి మేము కష్టాల్లోనూ సుఖాల్లోనూ యెహోవా సేవలో సంతోషంగా కలిసి గడుపుతున్నాం. మేము 2010 సెప్టెంబరులో మా 50వ పెళ్లి రోజు జరుపుకున్నాం.

మేము హనీమూన్‌ నుండి వచ్చీరాగానే, సహోదరుడు నార్‌ నా దగ్గరికి వచ్చి నేను గిలియడ్‌ పాఠశాల ఉపదేశకునిగా నియమించబడినట్లు తెలిపారు. అది నిజంగా ప్రత్యేకమైన సేవావకాశం. 1961 నుండి 1965 మధ్యకాలంలో ఎక్కువ నిడివి ఉన్న 5 తరగతులు జరిగాయి. ఆ తరగతుల్లో, ముఖ్యంగా బ్రాంచి నిర్వహణ చూసుకోవడానికి బ్రాంచి కమిటీ సభ్యులకు ప్రత్యేకమైన శిక్షణ ఇవ్వబడింది. 1965 చివర్లో, ఆ తరగతులు మళ్లీ ఐదు నెలలపాటే జరగడం మొదలైంది. మళ్లీ మిషనరీలకు శిక్షణ ఇవ్వడంపైనే దృష్టి సారించబడింది.

అప్పటివరకు గిలియడ్‌ పాఠశాలలో పనిచేస్తున్న నేను 1972లో రైటింగ్‌ కరెస్పాండెన్స్‌ డిపార్ట్‌మెంట్‌కు నియమించబడ్డాను. అక్కడ డిపార్ట్‌మెంట్‌ పర్యవేక్షకుడిగా పనిచేశాను. వివిధ రకాలైన ప్రశ్నలకు, సమస్యలకు జవాబు ఇవ్వడం కోసం పరిశోధన చేయడం వల్ల నేను దేవుని వాక్యంలోని బోధల గురించి, ఇతరులకు సహాయం చేసే విషయంలో దేవుని ఉన్నత ప్రమాణాలను అన్వయించుకోవడం గురించి మరింత తెలుసుకోగలిగాను.

1987లో హాస్పిటల్‌ ఇన్ఫర్మేషన్‌ సర్వీసెస్‌ అనే కొత్త డిపార్ట్‌మెంట్‌కు నియమించబడ్డాను. రక్తం విషయంలో లేఖనాధారంగా మనకున్న నమ్మకం గురించి వైద్యులతో, జడ్జీలతో, సమాజ సేవకులతో ఎలా మాట్లాడాలో ఆసుపత్రి అనుసంధాన కమిటీల్లో సేవచేసే పెద్దలకు నేర్పించడానికి ప్రత్యేకమైన సెమినార్లు ఏర్పాటు చేయబడ్డాయి. అప్పట్లో వైద్యులతో వచ్చిన సమస్య ఏమిటంటే, వాళ్లు తరచూ కోర్టు ఆర్డర్లు తెచ్చుకొని తల్లిదండ్రుల అనుమతి లేకుండానే పిల్లలకు రక్తం ఎక్కించేవాళ్లు.

ప్రత్యామ్నాయాల గురించి చెప్పినప్పుడు, వైద్యులు సాధారణంగా అవి అందుబాటులో లేవని లేదా చాలా ఖర్చౌతుందని అంటుండేవాళ్లు. ఎవరైనా వైద్యుడు అలాంటి మాటలు నాతో అంటే నేను తరచూ, ‘కొంచెం ఆలోచించండి, అంతా మీ చేతుల్లోనే ఉంది’ అని చెప్పేవాణ్ణి. వైద్యుడు తన చేతుల్ని చూసుకున్నప్పుడు, ‘రక్తానికి ప్రత్యామ్నాయం వాటిలోనే ఉంది’ అని చెప్పేవాణ్ణి. అప్పుడు వాళ్లకు బాగా తెలిసిన విషయం అంటే, ఆపరేషన్‌ చేసేటప్పుడు కత్తులను జాగ్రత్తగా ఉపయోగిస్తే రక్తం ఎక్కువగా నష్టపోకుండా ఉంటుందనే విషయం వైద్యులకు గుర్తుకువచ్చేది.

గత రెండు దశాబ్దాల్లో వైద్యులకు, జడ్జీలకు తగిన సమాచారాన్ని అందించడానికి జరిగిన ప్రయత్నాలను యెహోవా మెండుగా ఆశీర్వదించాడు. లేఖనాధారంగా మనకున్న నమ్మకాన్ని వైద్యులు మరింత బాగా అర్థం చేసుకున్నప్పుడు వాళ్ల అభిప్రాయం ఎంతగానో మారింది. చికిత్స చేయడానికి ప్రత్యామ్నాయాలు బాగానే పనిచేస్తాయన్న విషయాన్ని వైద్య పరిశోధనలు నిరూపిస్తున్నాయని, అలా చికిత్స చేసేందుకు సుముఖంగా ఉన్న వైద్యులు ఎంతోమంది ఉన్నారని వాళ్లు గ్రహించారు. అంతేకాక అలాంటి చికిత్సను అందించే ఆసుపత్రులు ఉన్నాయని, ఒక రోగి అలాంటి చికిత్స దొరికే ఆసుపత్రికి మారవచ్చని కూడా వాళ్లు గ్రహించారు.

నేను, నా భార్య మార్జ్‌రీ బ్రూక్లిన్‌కు ఉత్తరాన 110 కి.మీ. దూరంలో న్యూయార్క్‌ నగరంలోని ప్యాటర్సన్‌లో ఉన్న వాచ్‌టవర్‌ ఎడ్యుకేషనల్‌ సెంటర్‌లో 1996 నుండి సేవచేస్తున్నాం. అక్కడ నేను కొంతకాలంపాటు సర్వీస్‌ డిపార్ట్‌మెంట్‌లో పనిచేశాను. ఆ తర్వాత బ్రాంచి కమిటీ సభ్యుల కోసం, ప్రయాణ పర్యవేక్షకుల కోసం నిర్వహించబడే తరగతుల్లో ఉపదేశకుడిగా పనిచేశాను. బ్రూక్లిన్‌ నుండి ప్యాటర్సన్‌కు మారిన రైటింగ్‌ కరెస్పాండెన్స్‌ డిపార్ట్‌మెంట్‌కు గత 12 సంవత్సరాలుగా నేను మళ్లీ పర్యవేక్షకుడిగా పనిచేస్తున్నాను.

వృద్ధాప్యంలో మేము ఎదుర్కొంటున్న సమస్యలు

నాకు ఇప్పుడు దాదాపు 85 ఏళ్లు కాబట్టి బెతెల్‌లో నా బాధ్యతల్ని నిర్వర్తించడం చాలా కష్టంగా ఉంది. 10కన్నా ఎక్కువ సంవత్సరాలుగా క్యాన్సర్‌ వ్యాధితో పోరాడుతున్నాను. యెహోవా హిజ్కియా ఆయుష్షును పొడిగించినప్పుడు ఆయనకు ఎలా అనిపించివుంటుందో నాకు అలాగే అనిపిస్తోంది. (యెష. 38:5) నా భార్య ఆరోగ్య పరిస్థితి కూడా అంత బాగాలేదు, ఆమె అల్జీమర్స్‌ వ్యాధితో బాధపడుతోంది. ఆమె ఆ వ్యాధితో పోరాడేందుకు నేను సహకరిస్తున్నాను. ఆమె తన ఆరోగ్యం బాగున్నప్పుడు సమర్థురాలైన యెహోవా సేవకురాలిగా ఉండేది, యౌవనస్థులకు మంచి సలహాలు ఇచ్చేది, నాకు నమ్మకమైన సహాయకురాలిగా, చక్కని తోడుగా ఉండేది. ఆమె క్రమంగా బైబిలు చదవడమే కాక వేరేవాళ్లకు దాన్ని చక్కగా బోధించేది. ఇప్పటికీ మా ఆధ్యాత్మిక పిల్లలు చాలామంది మా బాగోగులు తెలుసుకుంటుంటారు.

మా చిన్నత్త మేరీ 2010 మార్చిలో చనిపోయింది. అప్పటికి ఆమెకు 87 ఏళ్లు. ఆమె దేవుని వాక్య బోధకురాలిగా ఎంతో ప్రగతి సాధించి, సత్యారాధనను సమర్థించేందుకు ఇతరులకు సహాయం చేసింది. ఆమె ఎన్నో సంవత్సరాలు పూర్తికాల సేవ చేసింది. దేవుని వాక్యంలోని సత్యాన్ని తెలుసుకొని, ప్రేమగల దేవుడైన యెహోవాను తనలాగే ఆరాధించడానికి ఆమె నాకు చేసిన సహాయానికి నేను రుణపడివున్నాను. ఆమెను తన భర్త సమాధి పక్కనే సమాధి చేశారు. ఆమె భర్త ఇశ్రాయేల్‌ దేశంలో మిషనరీగా సేవచేశాడు. వాళ్లు యెహోవా జ్ఞాపకంలో ఉన్నారని, పునరుత్థానం చేయబడతారని నేను బలంగా నమ్ముతున్నాను.

నేను 67 ఏళ్లపాటు యెహోవా సేవలో ఎన్నో ఆశీర్వాదాలు పొందాను. అందుకు నేను ఆయనకు కృతజ్ఞుణ్ణి. ఆయన చిత్తం చేస్తూ నేను ఎంతో సంతోషిస్తున్నాను. ఆయన చూపించే కృపపై నమ్మకం ఉంచినందువల్ల నేను తన కుమారుడు చేసిన ఈ వాగ్దాన నెరవేర్పును చూడాలని ఎంతో పట్టుదలగా ఎదురుచూస్తున్నాను, “నా నామము నిమిత్తము అన్నదమ్ములనైనను అక్క చెల్లెండ్రనైనను తండ్రినైనను తల్లినైనను పిల్లలనైనను భూములనైనను ఇండ్లనైనను విడిచిపెట్టిన ప్రతివాడును నూరురెట్లు పొందును; ఇదిగాక నిత్యజీవమును స్వతంత్రించుకొనును.”మత్త. 19:29.

[అధస్సూచి]

a 1942లో ప్రచురించబడింది, కానీ ఇప్పుడు ముద్రణలో లేదు.

[19వ పేజీలోని చిత్రం]

1928లో నేను అమెరికాలోని జార్జియాలో మా తాతయ్య వాళ్ల పత్తి ఫామ్‌లో

[19వ పేజీలోని చిత్రం]

మా చిన్నత్త మేరీ, టాల్మాజ్‌ అంకుల్‌

[20వ పేజీలోని చిత్రం]

మేరీ, గ్లాడస్‌, గ్రేస్‌

[20వ పేజీలోని చిత్రం]

1944 జూన్‌ 14న నా బాప్తిస్మం

[20వ పేజీలోని చిత్రం]

బెతెల్‌లోని సర్వీస్‌ డిపార్ట్‌మెంట్‌లో

[21వ పేజీలోని చిత్రం]

1958లో యాంకీ స్టేడియంలో జరిగిన అంతర్జాతీయ సమావేశంలో మేరీతో

[21వ పేజీలోని చిత్రం]

మా పెళ్లి రోజున మార్జ్‌రీతో

[21వ పేజీలోని చిత్రం]

2008లో మేమిద్దరం