కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

‘సమస్తమైన ఆదరణ అనుగ్రహించే దేవుడైన’ యెహోవాపై నమ్మకం ఉంచండి

‘సమస్తమైన ఆదరణ అనుగ్రహించే దేవుడైన’ యెహోవాపై నమ్మకం ఉంచండి

‘సమస్తమైన ఆదరణ అనుగ్రహించే దేవుడైన’ యెహోవాపై నమ్మకం ఉంచండి

“కనికరము చూపు తండ్రి, సమస్తమైన ఆదరణను అనుగ్రహించు దేవుడు, మన ప్రభువైన యేసుక్రీస్తు తండ్రియునైన దేవుడు స్తుతింపబడునుగాక.”—2 కొరిం. 1:3.

1. ప్రతి ఒక్కరికీ ఏమి అవసరం?

 మనం పుట్టినప్పటి నుండి మనకు ఆదరణ అవసరం. ఒక పసిపాప ఎవరైనా తనను ఎత్తుకోవాలనో, తనకు ఆకలేస్తుందని చూపించాలనో ఏడుస్తుంది. కాబట్టి పసిబిడ్డకు కూడా ఆదరణ అవసరమని తెలుస్తోంది. మనం పెద్దవాళ్ళమైన తర్వాత కూడా ఎవరో ఒకరు మనకు ఆదరణ ఇవ్వాలని కోరుకుంటాం. ముఖ్యంగా కష్టాల్లో ఉన్నప్పుడు మనం అలా కోరుకుంటాం.

2. తనపై నమ్మకం ఉంచేవాళ్ళకు యెహోవా ఏ అభయమిస్తున్నాడు?

2 మన కుటుంబ సభ్యులు, స్నేహితులు మనకు ఆదరణ ఇవ్వగలుగుతారు. కానీ మనకు బాధ కలిగించే అన్ని పరిస్థితుల్లో వాళ్ళు మనకు సహాయం చేయలేరు. కొన్ని పరిస్థితుల్లో దేవుడు మాత్రమే మనకు ఆదరణ ఇవ్వగలడు. ఆయన వాక్యం ఇలా అభయమిస్తోంది, ‘తనకు మొఱ్ఱపెట్టువారి కందరికి యెహోవా సమీపముగా ఉన్నాడు. ఆయన వారి మొఱ్ఱ ఆలకిస్తాడు.’ (కీర్త. 145:18, 19) అంతేకాక, “యెహోవా దృష్టి నీతిమంతులమీద నున్నది. ఆయన చెవులు వారి మొరలకు ఒగ్గియున్నవి” అని కూడా ఆయన వాక్యం చెబుతోంది. (కీర్త. 34:15) అయితే యెహోవా మనకు ఆదరణ ఇవ్వాలంటే మనం ఆయనపై నమ్మకం ఉంచాలి. దావీదు ఇలా అన్నాడు, “నలిగినవారికి తాను [యెహోవా] మహా దుర్గమగును, ఆపత్కాలములలో వారికి మహా దుర్గమగును. యెహోవా, నిన్ను ఆశ్రయించువారిని నీవు విడిచి పెట్టువాడవు కావు. కావున నీ నామమెరిగినవారు నిన్ను నమ్ముకొందురు.”—కీర్త. 9:9, 10.

3. యెహోవా మనల్ని ఎంతగా ప్రేమిస్తున్నాడో మనం అర్థం చేసుకోవడానికి యేసు ఏమి చెప్పాడు?

3 యెహోవా తన ఆరాధకులను అమూల్యమైనవాళ్ళుగా చూస్తాడు. యేసు ఇలా అన్నాడు, “అయిదు పిచ్చుకలు రెండు కాసులకు అమ్మబడును గదా; అయినను వాటిలో ఒకటైనను దేవునియెదుట మరువబడదు. మీ తలవెండ్రుకలన్నియు లెక్కింపబడియున్నవి. భయపడకుడి; మీరు అనేకమైన పిచ్చుకలకంటె శ్రేష్ఠులు కారా?” (లూకా 12:6, 7) యెహోవా ఇశ్రాయేలీయులకు ఇలా చెప్పాడు, “శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను గనుక విడువక నీయెడల కృప చూపుచున్నాను.”—యిర్మీ. 31:3.

4. మనం యెహోవా చేసిన వాగ్దానాలను ఎందుకు నమ్మవచ్చు?

4 యెహోవాపై, ఆయన వాగ్దానాలపై నమ్మకం ఉంచితే, కష్టాలొచ్చినప్పుడు మనం ఆదరణ పొందవచ్చు. దేవునిపై యెహోషువ చూపించినలాంటి నమ్మకాన్ని మనం కూడా చూపించాలి. ఆయనిలా అన్నాడు, ‘మీ దేవుడైన యెహోవా మీ విషయమై సెలవిచ్చిన మంచి మాటలన్నిటిలో ఒక్కటియైనను తప్పియుండలేదు; అవి అన్నియు మీకు కలిగెను, వాటిలో ఒక్కటియైనను తప్పియుండలేదు.’ (యెహో. 23:14) ఇప్పుడు మనకు వచ్చే కష్టాల వల్ల మనకు బాధ కలిగినా, “దేవుడు నమ్మదగినవాడు” కాబట్టి విశ్వాసంగల తన సేవకులను ఎన్నడూ విడిచిపెట్టడని నమ్మవచ్చు.—1 కొరింథీయులు 10:13 చదవండి.

5. ఇతరులకు ఆదరణ ఇవ్వడం మనకెలా సాధ్యమౌతుంది?

5 యెహోవా “సమస్తమైన ఆదరణను అనుగ్రహించు దేవుడు” అని అపొస్తలుడైన పౌలు అన్నాడు. ‘ఆదరణ అనుగ్రహించడం’ అంటే బాధపడుతున్నవాళ్ళను ఊరడించడం లేదా ఓదార్చడం అని అర్థం. అంటే వాళ్ళ బాధను పోగొట్టడమని అర్థం. యెహోవా ఇచ్చేది అలాంటి ఆదరణే. (2 కొరింథీయులు 1:3, 4 చదవండి.) ఆదరణ అనుగ్రహించకుండా మన పరలోక తండ్రిని ఎవ్వరూ ఆపలేరు, ఏదీ ఆపలేదు. అందుకే తనను ప్రేమించేవాళ్ళను ఓదార్చడానికి అవసరమైన దేన్నైనా యెహోవా చేయగలడు. యెహోవా మనకు ఆదరణ ఇస్తున్నాడు కాబట్టి ‘ఎలాంటి శ్రమల్లోనైనా’ మనం మన సహోదరులకు ఆదరణ ఇవ్వగలుగుతున్నాం. అయితే, యెహోవా అంత చక్కగా ఎవ్వరూ మనకు ఆదరణ ఇవ్వలేరు.

వేటివల్ల మనకు బాధ కలగవచ్చు?

6. వేటివల్ల మనకు బాధ కలగవచ్చు?

6 ఎన్నో పరిస్థితుల్లో మనకు ఆదరణ అవసరమౌతుంది. మన ప్రియమైనవాళ్ళు అంటే భర్త, భార్య లేదా పిల్లలు చనిపోయినప్పుడు చాలా బాధ కలుగుతుంది. ఎవరైనా వివక్ష చూపిస్తే మనకు బాధ కలగవచ్చు. అలాగే అనారోగ్యం, వృద్ధాప్యం, పేదరికం, ఈ లోకంలో ఉన్న దుష్టత్వం వంటి వాటివల్ల కూడా మనకు బాధ కలగవచ్చు.

7. (ఎ) కష్టాలొచ్చినప్పుడు మనకు ఏమి అవసరం? (బి) ‘విరిగి, నలిగిన’ హృదయాన్ని బాగుచేయడానికి యెహోవా ఏమి చేయగలడు?

7 కష్టాలొచ్చినప్పుడు మన హృదయానికి, మనసుకు, మన భావోద్వేగాలకు ఆదరణ అవసరం. అంతేకాక మన శారీరక ఆరోగ్యం, ఆధ్యాత్మిక ఆరోగ్యం బాగాలేనప్పుడు కూడా మనకు ఆదరణ అవసరం. ఉదాహరణకు, హృదయం గురించి ఆలోచించండి. అది ‘విరిగి, నలిగిపోయే’ అవకాశముందని దేవుని వాక్యం చెబుతోంది. (కీర్త. 51:17) అలాంటి పరిస్థితి వచ్చినప్పుడు యెహోవా మనకు సహాయం చేయగలడు. ‘ఆయన గుండె చెదరినవారిని బాగుచేస్తాడు, వారి గాయములు కడతాడు.’ (కీర్త. 147:3) మనం ఆయనకు ప్రార్థిస్తే, ఆయనపై విశ్వాసం ఉంచితే, ఆయన ఆజ్ఞలకు లోబడితే ఎంతో కష్టమైన పరిస్థితుల్లో కూడా ఆయన మనకు ఆదరణ ఇవ్వగలడు.—1 యోహాను 3:19-22; 5:14, 15 చదవండి.

8. మన మనసుకు ఆదరణ అవసరమైనప్పుడు యెహోవా ఎలా సహాయం చేస్తాడు?

8 మనం ఎన్నో రకాలైన కష్టాలను ఎదుర్కొంటాం కాబట్టి మన మనసుకు కొన్నిసార్లు ఆదరణ అవసరమౌతుంది. అలాంటి పరిస్థితిలో మనకు సహాయం అవసరం. కీర్తన 94:19 రాసిన వ్యక్తి ఇలా అన్నాడు, “నా అంతరంగమందు విచారములు హెచ్చగా నీ గొప్ప ఆదరణ నా ప్రాణమునకు నెమ్మది కలుగజేయుచున్నది.” అంతేకాక, పౌలు కూడా ఇలా రాశాడు, “దేనినిగూర్చియు చింతపడకుడి గాని ప్రతి విషయములోను ప్రార్థన విజ్ఞాపనములచేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియజేయుడి. అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును కావలియుండును.” (ఫిలి. 4:6, 7) మన మనసుకు ఆదరణ అవసరమైనప్పుడు మనం బైబిలు చదివి, ధ్యానించాలి. అప్పుడు గొప్ప ఆదరణ లభిస్తుంది.—2 తిమో. 3:14-17.

9. మనలో ప్రతికూల భావోద్వేగాలు కలిగినప్పుడు మనకు ఎవరు సహాయం చేస్తారు?

9 కొన్నిసార్లు మనం ఎంతో నిరుత్సాహానికి గురైనప్పుడు మనలో ప్రతికూల భావోద్వేగాలు కలుగుతాయి. యెహోవా మన నుండి కోరుతున్న ఒకానొక పనిని చేయలేమని లేదా సంఘంలో ఒకానొక బాధ్యతను నిర్వర్తించలేమని బహుశా మనకు అనిపించవచ్చు. అలాంటి సందర్భంలో కూడా యెహోవా మనకు ఆదరణ ఇచ్చి సహాయం చేయగలడు. ఉదాహరణకు, బలమైన శత్రు సైన్యాలతో యుద్ధం చేయడానికి ఇశ్రాయేలీయులను నడిపించడానికి యెహోషువ నియమించబడినప్పుడు ప్రజలతో మోషే ఇలా అన్నాడు, “నిబ్బరము గలిగి ధైర్యముగా నుండుడి. భయపడకుడి, వారిని చూచి దిగులుపడకుడి, నీతోకూడ వచ్చువాడు నీ దేవుడైన యెహోవాయే; ఆయన నిన్ను విడువడు, నిన్నెడబాయడు.” (ద్వితీ. 31:5, 6) యెహోవా సహాయంతో యెహోషువ ఇశ్రాయేలీయులను వాగ్దానదేశంలోకి నడిపించి శత్రు సైన్యాలన్నిటిపై విజయం సాధించగలిగాడు. అంతకుముందు, ఎర్ర సముద్రం దగ్గర యెహోవా మోషేకు కూడా అలాంటి సహాయాన్నే చేశాడు.—నిర్గ. 14:13, 14, 29-31.

10. మన చుట్టూ జరుగుతున్న చెడు సంఘటనల వల్ల మన ఆరోగ్యం పాడైతే ఏమి చేయడం మంచిది?

10 మన చుట్టూ జరుగుతున్న చెడు సంఘటనల వల్ల మన శారీరక ఆరోగ్యం పాడయ్యే అవకాశముంది. అయితే మనం సరిగ్గా తింటూ, తగిన విశ్రాంతి తీసుకుంటూ, క్రమంగా వ్యాయామం చేస్తూ, మన ఇంటిని, ఒంటిని శుభ్రంగా ఉంచుకుంటే మన ఆరోగ్యం కొంతవరకు బావుంటుంది. అంతేకాక, భవిష్యత్తు విషయంలో బైబిలు చెబుతున్న దానిగురించి ఆలోచించడం వల్ల కూడా ఆరోగ్యంగా ఉండగలుగుతాం. కాబట్టి, మనకు శ్రమలు లేదా సమస్యలు ఎదురైనప్పుడు బాధ కలిగితే, పౌలు కూడా అలాంటి పరిస్థితుల్నే ఎదుర్కొన్నాడని గుర్తుంచుకోవడం మంచిది. అంతేకాక, ఆయన చెప్పిన ప్రోత్సాహకరమైన ఈ మాటల గురించి ఆలోచించడం కూడా మంచిది, “ఎటుబోయినను శ్రమపడుచున్నను ఇరికింపబడువారము కాము; అపాయములో నున్నను కేవలము ఉపాయము లేనివారము కాము; తరుమబడుచున్నను దిక్కులేనివారము కాము; పడద్రోయబడినను నశించువారము కాము.”—2 కొరిం. 4:8, 9.

11. మన ఆధ్యాత్మిక ఆరోగ్యం పాడౌతున్నట్లు మనకు అనిపిస్తే మనం ఏమి చేయవచ్చు?

11 కొన్ని శ్రమలు వచ్చినప్పుడు మన ఆధ్యాత్మిక ఆరోగ్యం పాడయ్యే అవకాశముంది. అప్పుడు కూడా యెహోవా మనకు సహాయం చేయగలడు. ఆయన వాక్యం మనకు ఇలా అభయాన్నిస్తోంది, “యెహోవా పడిపోవువారినందరిని ఉద్ధరించువాడు, క్రుంగిపోయిన వారినందరిని లేవనెత్తువాడు.” (కీర్త. 145:14) మన ఆధ్యాత్మిక ఆరోగ్యం పాడౌతున్నట్లు అంటే, మన విశ్వాసం బలహీనమౌతున్నట్లు మనకు అనిపిస్తే సంఘ పెద్దల సహాయాన్ని కోరాలి. (యాకో. 5:14, 15) భూమిపై మనం అనుభవించబోయే నిరంతర జీవితం గురించి ఆలోచిస్తూ ఉన్నట్లైతే మన విశ్వాసానికి పరీక్షలు ఎదురైనప్పుడు బలాన్ని పొందగలుగుతాం.—యోహా. 17:3.

దేవుని నుండి ఆదరణ పొందినవాళ్ళ ఉదాహరణలు

12. యెహోవా అబ్రాహాముకు ఎలా ఆదరణను ఇచ్చాడు?

12 “నీ సేవకునికి దయచేయబడిన మాట జ్ఞాపకము చేసికొనుము. దానివలన నీవు నాకు నిరీక్షణ పుట్టించియున్నావు. నీ వాక్యము నన్ను బ్రదికించి యున్నది. నా బాధలో ఇదే నాకు నెమ్మది [‘ఆదరణ,’ NW] కలిగించుచున్నది” అని 119వ కీర్తనను రాసిన వ్యక్తి యెహోవాతో అన్నాడు. (కీర్త. 119:49, 50) ఇప్పుడు మన దగ్గర యెహోవా వాక్యం ఉంది. గతంలో తన సేవకులకు యెహోవా ఎలా ఆదరణను ఇచ్చాడో చూపించే ఎన్నో ఉదాహరణలు దానిలో ఉన్నాయి. ఉదాహరణకు, సొదొమ గొమొఱ్ఱా పట్టణాలను యెహోవా నాశనం చేయబోతున్నాడని తెలుసుకున్నప్పుడు అబ్రాహాము చాలా ఆందోళనపడ్డాడు. “దుష్టులతోకూడ నీతిమంతులను నాశనము చేయుదువా?” అని ఆయన దేవుణ్ణి అడిగాడు. ఒకవేళ 50 మంది నీతిమంతులు ఉంటే సొదొమను నాశనం చేయనని అభయమిస్తూ యెహోవా అబ్రాహాముకు ఆదరణను ఇచ్చాడు. కానీ అబ్రాహాము ఇంకా ఐదుసార్లు యెహోవాను బ్రతిమాలాడు. ఒకవేళ కేవలం 45 మంది నీతిమంతులు ఉంటే నాశనం చేయవా? అని అడిగి 40, 30, 20 అంటూ ఆ సంఖ్యను 10 వరకు తగ్గిస్తూ వచ్చాడు. ఒకవేళ 10 మంది నీతిమంతులు ఉన్నా ఆ పట్టణాన్ని నాశనం చేయనని చెబుతూ యెహోవా ఓపిగ్గా, దయగా అబ్రాహాముకు మాటిచ్చాడు. అక్కడ పది మంది నీతిమంతులు కూడా లేకపోవడంతో యెహోవా దాన్ని నాశనం చేసి, లోతును, ఆయన కూతుర్లను కాపాడాడు.—ఆది. 18:22-32; 19:15, 16, 26.

13. యెహోవాపై తనకు నమ్మకం ఉందని హన్నా ఎలా చూపించింది?

13 ఎల్కానా భార్య హన్నా తనకు పిల్లలు పుట్టాలని ఎంతగానో కోరుకుంది. కానీ ఆమెకు పిల్లలు పుట్టకపోవడంతో ఎంతో నిరాశపడింది. ఆమె ఆ విషయం గురించి యెహోవాకు ప్రార్థించినప్పుడు, “ఇశ్రాయేలు దేవునితో నీవు చేసికొనిన మనవిని ఆయన దయచేయును గాక” అని ప్రధాన యాజకుడైన ఏలీ ఆమెతో అన్నాడు. దానివల్ల ఆమెకు ఆదరణ కలిగింది కాబట్టి ఆమె, “నాటనుండి దుఃఖముఖిగా నుండుట మానెను.” (1 సమూ. 1:8, 17, 18) తన సమస్య గురించి యెహోవా చూసుకుంటాడనే నమ్మకంతో హన్నా ఆ విషయాన్ని యెహోవాకే వదిలేసింది. తర్వాత ఏమి జరుగుతుందో తెలియకపోయినా హన్నా మనశ్శాంతితో ఉండగలిగింది. కొంతకాలానికి యెహోవా ఆమె ప్రార్థనకు జవాబిచ్చాడు. ఆమె గర్భవతియై ఒక కుమారుణ్ణి కని, ఆయనకు సమూయేలు అని పేరు పెట్టింది.—1 సమూ. 1:20.

14. దావీదుకు ఆదరణ ఎందుకు అవసరమైంది? ఆయన దానికోసం ఎవరిని ఆశ్రయించాడు?

14 దావీదు రాజుకు కూడా యెహోవా ఆదరణ ఇచ్చాడు. యెహోవా ‘హృదయాన్ని లక్ష్యపెడతాడు.’ కాబట్టి, ఇశ్రాయేలీయులమీద రాజుగా ఉండేందుకు దావీదును ఎంచుకున్నప్పుడు ఆయన సరైనది చేయాలనుకుంటున్నాడనీ, సత్యారాధనను ప్రేమిస్తున్నాడనీ యెహోవాకు తెలుసు. (1 సమూ. 16:7; 2 సమూ. 5:10) కానీ తర్వాత, దావీదు బత్షెబతో వ్యభిచారం చేసి, ఆ తప్పును కప్పిపుచ్చడానికి ప్రయత్నించాడు. తాను చేసిన పాపం ఎంత ఘోరమైనదో గ్రహించినప్పుడు ఆయనిలా ప్రార్థించాడు, “నీ వాత్సల్య బాహుళ్యముచొప్పున నా అతిక్రమములను తుడిచివేయుము, నా దోషము పోవునట్లు నన్ను బాగుగా కడుగుము. నా పాపము పోవునట్లు నన్ను పవిత్రపరచుము. నా అతిక్రమములు నాకు తెలిసేయున్నవి, నా పాపమెల్లప్పుడు నాయెదుట నున్నది.” (కీర్త. 51:1-3) చేసిన పాపానికి దావీదు నిజంగా పశ్చాత్తాపపడ్డాడు కాబట్టి యెహోవా ఆయనను క్షమించాడు. కానీ, దావీదు తాను చేసిన పాపం వల్ల వచ్చిన చెడు ఫలితాలను మాత్రం అనుభవించక తప్పలేదు. (2 సమూ. 12:9-12) అయితే యెహోవా చూపించిన వాత్సల్యం వల్ల దావీదు ఆదరణ పొందాడు.

15. యేసు చనిపోవడానికి కొంచెం ముందు యెహోవా ఆయనకు ఏ సహాయం చేశాడు?

15 భూమ్మీద ఉన్నప్పుడు యేసు ఎన్నో పరీక్షలు ఎదుర్కొన్నాడు. దేవుడు ఆ పరీక్షలను అనుమతించాడు. అయితే యేసు ఎల్లప్పుడూ యెహోవాకు నమ్మకంగానే ఉన్నాడు. పరిపూర్ణ మానవుడిగా ఉన్న యేసు ఎల్లప్పుడూ యెహోవాపై నమ్మకం ఉంచి ఆయన సర్వాధిపత్యానికి విధేయత చూపించాడు. అప్పగించబడి చంపబడడానికి ముందు యేసు, “నా యిష్టముకాదు, నీ చిత్తమే సిద్ధించునుగాక” అని యెహోవాకు ప్రార్థించాడు. అప్పుడు ఒక దూత కనిపించి యేసును బలపరిచాడు. (లూకా 22:42, 43) ఆ సమయంలో ఆయనకు అవసరమైన ఆదరణను, బలాన్ని, సహాయాన్ని యెహోవా ఇచ్చాడు.

16. మన విశ్వాసం కారణంగా మన ప్రాణాలు అపాయంలో ఉన్నప్పుడు యెహోవా మనకు ఎలా సహాయం చేయగలడు?

16 మన విశ్వాసం కారణంగా మన ప్రాణాలు అపాయంలో ఉన్నప్పుడు కూడా మనం తనకు నమ్మకంగా ఉండడానికి యెహోవా మనకు సహాయం చేయగలడు, చేస్తాడు. పునరుత్థాన నిరీక్షణ వల్ల కూడా మనం ఆదరణ పొందుతాం. కడపటి శత్రువైన మరణం ‘నశింపజేయబడే’ రోజు కోసం మనం ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నాం. (1 కొరిం. 15:26) యెహోవా నమ్మకమైన సేవకులతో సహా ఇప్పటివరకు మరణించినవాళ్ళంతా ఆయన జ్ఞాపకంలో ఉన్నారు. యెహోవా వాళ్ళను మరచిపోయే అవకాశమే లేదు. ఆయన వాళ్ళను పునరుత్థానం చేస్తాడు. (యోహా. 5:28, 29; అపొ. 24:15) హింసలు ఎదురైనప్పుడు, పునరుత్థానం గురించి యెహోవా చేసిన వాగ్దానంపై విశ్వాసం ఉంచడం వల్ల మనం ఆదరణను, తిరిగి బ్రతికించబడతామనే నమ్మకాన్ని పొందగలుగుతాం.

17. మన ప్రియమైనవాళ్ళు చనిపోయినప్పుడు యెహోవా మనకు ఎలా ఆదరణ ఇస్తాడు?

17 చనిపోయిన మన ప్రియమైనవాళ్ళు అద్భుతమైన నూతనలోకంలో జీవించేలా పునరుత్థానం చేయబడతారని తెలుసుకొని మనం ఎంతో ఆదరణ పొందుతున్నాం. అప్పుడు మనల్ని బాధకు గురిచేసేవి ఏవీ ఉండవు. పునరుత్థానం చేయబడినవాళ్ళను ఆహ్వానించి వాళ్ళకు బోధించే చక్కని అవకాశం ఈ దుష్ట విధానాంతాన్ని తప్పించుకునే ‘గొప్ప సమూహానికి’ ఉంటుంది.—ప్రక. 7:9, 10.

యెహోవా నిత్య బాహువులు మన కింద ఉన్నాయి

18, 19. తన సేవకులు హింసలు అనుభవిస్తున్నప్పుడు యెహోవా వాళ్ళకెలా ఆదరణ ఇచ్చాడు?

18 మోషే ప్రవక్త ఇశ్రాయేలీయులకు ప్రోత్సాహాన్ని, ఆదరణను ఇచ్చే ఒక పాట రాశాడు. ఆ పాటలో ఆయనిలా అన్నాడు, ‘శాశ్వతుడైన దేవుడు మీకు నివాసస్థలము, నిత్యముగనుండు బాహువులు మీ క్రిందనుండును.’ (ద్వితీ. 33:27) ఆ తర్వాతి కాలంలో సమూయేలు ప్రవక్త ఇశ్రాయేలీయులతో ఇలా చెప్పాడు, “యెహోవాను విసర్జింపకుండ ఆయనను అనుసరించుచు పూర్ణహృదయముతో ఆయనను సేవించుడి. . . . తన ఘనమైన నామము నిమిత్తము తన జనులను ఆయన విడనాడడు.” (1 సమూ. 12:20-22) మనం నమ్మకంగా తనను సేవించినంతకాలం యెహోవా మనల్ని వదిలేయడు. మనకు కావాల్సిన సహాయాన్ని చేస్తూనే ఉంటాడు.

19 ఎంతో కష్టంగా ఉన్న ఈ అంత్యదినాల్లో యెహోవా తన ప్రజలకు సహాయాన్ని, ఆదరణను ఇస్తున్నాడు. యెహోవా సేవ చేస్తున్నందుకు ప్రపంచవ్యాప్తంగా మన సహోదరసహోదరీలు ఎంతోమంది ఈ మధ్య కాలంలో హింసించబడ్డారు, జైళ్ళలో వేయబడ్డారు. శ్రమలు వచ్చినప్పుడు యెహోవా నిజంగా తన సేవకులకు ఆదరణ ఇస్తాడని వాళ్ళ అనుభవాలు చూపిస్తున్నాయి. ఉదాహరణకు, సోవియట్‌ యూనియన్‌లో ఒక సహోదరునికి తన విశ్వాసం కారణంగా 23 ఏళ్ళ జైలు శిక్ష విధించబడింది. అక్కడ ఉన్నప్పుడు కూడా తనకు బలాన్ని, ఆదరణను ఇచ్చే బైబిలు సాహిత్యాలను క్రమంగా పొందాడు. ఆయనిలా అన్నాడు, “ఆ సంవత్సరాలన్నిటిలో నేను యెహోవాపై నమ్మకం ఉంచడం నేర్చుకున్నాను, ఆయననుండి బలాన్ని పొందాను.”—1 పేతురు 5:6, 7 చదవండి.

20. యెహోవా మనల్ని ఎడబాయడని మనం ఎందుకు నమ్మవచ్చు?

20 భవిష్యత్తులో మనకు ఏమి జరిగినా సరే, ఆదరణ ఇచ్చే ఈ మాటల్ని గుర్తుంచుకోవడం మంచిది, “యెహోవా తన ప్రజలను ఎడబాయువాడు కాడు.” (కీర్త. 94:14) మనకు ఆదరణ అవసరమే అయినా, మనం కూడా ఇతరులకు ఆదరణ ఇవ్వవచ్చు. కష్టాలతో నిండిన ఈ లోకంలో బాధలను అనుభవిస్తున్నవాళ్ళకు మనం ఎలా ఆదరణ ఇవ్వవచ్చో తర్వాతి ఆర్టికల్‌లో తెలుసుకుంటాం.

మీరెలా జవాబిస్తారు?

• వేటివల్ల మనకు బాధ కలగవచ్చు?

• యెహోవా తన సేవకులకు ఆదరణ ఎలా ఇస్తాడు?

• మన ప్రాణాలు అపాయంలో ఉన్నప్పుడు మనకు ఏది ఆదరణ ఇస్తుంది?

[అధ్యయన ప్రశ్నలు]

[25వ పేజీలోని బాక్సు/చిత్రాలు]

ఇవి ప్రభావితమైనప్పుడు ఎలా తట్టుకోవచ్చు?

హృదయం కీర్త. 147:3; 1 యోహా. 3:19-22; 5:14, 15

మనసు కీర్త. 94:19; ఫిలి. 4:6, 7

భావోద్వేగాలు నిర్గ. 14:13, 14; ద్వితీ. 31:6

శారీరక ఆరోగ్యం 2 కొరిం. 4:8, 9

ఆధ్యాత్మిక ఆరోగ్యం కీర్త. 145:14; యాకో. 5:14, 15