కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

ఆత్మానుసారంగా నడుచుకుంటూ జీవాన్ని, సమాధానాన్ని పొందండి

ఆత్మానుసారంగా నడుచుకుంటూ జీవాన్ని, సమాధానాన్ని పొందండి

ఆత్మానుసారంగా నడుచుకుంటూ జీవాన్ని, సమాధానాన్ని పొందండి

‘శరీరమును అనుసరింపక ఆత్మను అనుసరించి నడుచుకొనుడి.’—రోమా. 8:3, 4.

1, 2. (ఎ) వాహనం నడుపుతున్నప్పుడు ఒక వ్యక్తి వేరే విషయాలపై అవధానం ఉంచడం వల్ల ఎలాంటి దుర్ఘటనలు చోటుచేసుకుంటున్నాయి? (బి) దేవునికి సంబంధించిన విషయాల్లో అవధానం నిలపలేకపోతున్న వ్యక్తి ఎలాంటి ప్రమాదానికి గురయ్యే అవకాశం ఉంటుంది?

 “వాహనాలు నడుపుతూ వేరే విషయాలపై అవధానం ఉంచడం వల్ల దుర్ఘటనలు జరిగి ఎంతోమంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఆ సమస్య అంతకంతకూ పెరుగుతున్నట్లే ఉంది” అని పరిశీలనలో తేలినట్లు అమెరికా రవాణా శాఖ సెక్రటరీ చెప్పాడు. వాహనాలు నడుపుతున్నప్పుడు చాలామంది సెల్‌ఫోన్‌లో మాట్లాడడం వల్ల అవధానం నిలపలేకపోతున్నారు. రోడ్డు ప్రమాదానికి గురైనవాళ్ళను, తృటిలో ప్రమాదం నుండి తప్పించుకున్నవాళ్ళను ఇంటర్వ్యూ చేసినప్పుడు, వాహనం నడుపుతున్న వ్యక్తి సెల్‌ఫోన్‌లో మాట్లాడుతుండడమే ప్రమాదం జరగడానికి కారణమని వాళ్ళలో మూడొంతుల మంది చెప్పారు. వాహనం నడుపుతున్నప్పుడు ఒకేసారి రెండు మూడు పనులు చేయడం వీరోచితంగా అనిపించినా దాని వల్ల ప్రమాదాలు సంభవిస్తాయి.

2 దేవునితో మనకున్న సంబంధం విషయంలో కూడా అలా జరిగే అవకాశం ఉంది. వాహనం నడుపుతూ వేరే విషయాలపై అవధానం ఉంచే వ్యక్తి రానున్న ప్రమాదాన్ని గమనించడు, అలాగే దేవునికి సంబంధించిన విషయాల్లో అవధానం నిలపలేకపోతున్న వ్యక్తి కూడా ప్రమాదానికి గురయ్యే అవకాశం ఉంటుంది. ఒకవేళ మనం కూడా క్రైస్తవులముగా మనం చేయాల్సినవాటిలో, ఆరాధనకు సంబంధించిన కార్యక్రమాల్లో అవధానం నిలపలేకపోతే విశ్వాసమనే మన ఓడ బద్దలైపోయే ప్రమాదం ఉంది. (1 తిమో. 1:18, 19) “శరీరానుసారమైన మనస్సు మరణము; ఆత్మానుసారమైన మనస్సు జీవమును సమాధానమునై యున్నది” అని అపొస్తలుడైన పౌలు రోమాలోవున్న తన తోటి క్రైస్తవులను హెచ్చరించినప్పుడు ఆయన ఆ ప్రమాదం గురించే చెప్పాడు. (రోమా. 8:5, 6) అంటే పౌలు ఉద్దేశం ఏమిటి? మన మనస్సు ‘శరీరానుసారంగా’ ఉండకుండా ఎలా కాపాడుకోవచ్చు? మన మనస్సును ‘ఆత్మానుసారంగా’ ఉంచుకోవడానికి ఏమి చేయవచ్చు?

వాళ్ళకు ‘ఎలాంటి శిక్షావిధీ లేదు’

3, 4. (ఎ) పౌలు తాను ఎలాంటి పోరాటాన్ని పోరాడానని రాశాడు? (బి) పౌలు పరిస్థితి గురించి మనమెందుకు తెలుసుకోవాలి?

3 శరీరానికి, మనస్సుకు మధ్య జరిగే పోరాటం గురించి పౌలు రోమీయులకు రాస్తూ అది తాను కూడా అనుభవించానని చెప్పాడు. (రోమీయులు 7:21-23 చదవండి.) పౌలు, తనమీద పాపభారం విపరీతంగా ఉండడం వల్ల తాను చేయగలిగింది ఏమీ లేదన్నట్లు చెప్పుకుంటూ తనను తాను సమర్థించుకోవడం లేదు, లేదా తనమీద తాను జాలి చూపించుకోవడం లేదు. ఎంతైనా ఆయన పరిణతిగల ఆత్మాభిషిక్త క్రైస్తవుడు, “అన్యజనులకు అపొస్తలుడు.” (రోమా. 1:1; 11:13, 14) మరైతే పౌలు తాను అనుభవించిన పోరాటం గురించి ఎందుకు రాశాడు?

4 దేవుని చిత్తాన్ని తాను చేయాలనుకుంటున్నంత ఎక్కువగా తన సొంత శక్తితో చేయలేనని పౌలు నిజాయితీగా అంగీకరిస్తున్నాడు. అలా చేయలేకపోవడానికి కారణం ఏమిటి? “అందరును పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేక పోవుచున్నారు” అని ఆయన చెబుతున్నాడు. (రోమా. 3:23) పౌలు కూడా ఆదాము సంతానమే కాబట్టి ఆయన అపరిపూర్ణ శరీరం మీద కూడా పాపపు ప్రభావం పడింది. మనందరం కూడా అపరిపూర్ణత వల్ల ప్రతీరోజు అలాంటి పోరాటాన్నే ఎదుర్కొంటాం కాబట్టి ఆయన చెబుతున్న విషయాన్ని మనం అర్థం చేసుకోవచ్చు. ‘జీవానికి నడిపించే సంకుచితమైన దారి’ నుండి మన అవధానాన్ని మళ్ళించి, మనం ప్రక్కకు తొలగిపోయేలా చేసే విషయాలు చాలా ఉన్నాయి. (మత్త. 7:13, 14) అయితే అప్పట్లో పౌలు పరిస్థితి గానీ, ఇప్పుడు మన పరిస్థితి గానీ నిరాశాజనకంగా లేదని చెప్పవచ్చు.

5. పౌలుకు సహాయం, విడుదల ఎలా లభించాయి?

5 పౌలు తనను ఎవరు విడిపిస్తారని అడిగిన తర్వాత, ‘మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా దేవుడు విడిపిస్తాడు’ అని రాశాడు. (రోమా. 7:24-25, NW) ఆ తర్వాత పౌలు “క్రీస్తుయేసునందున్న” వాళ్ళతో అంటే అభిషిక్త క్రైస్తవులతో మాట్లాడాడు. (రోమీయులు 8:1, 2ఎ చదవండి.) వాళ్ళను యెహోవా తన పరిశుద్ధాత్మ ద్వారా కుమారులుగా దత్తత తీసుకొని ‘క్రీస్తుతోడి వారసుల్ని’ చేశాడు. (రోమా. 8:14-17) పౌలు వర్ణించిన పోరాటాన్ని విజయవంతంగా పోరాడి, ‘ఎలాంటి శిక్షావిధికీ’ గురవకుండా తప్పించుకోవడానికి క్రీస్తు విమోచన క్రయధనంపై వాళ్ళకున్న విశ్వాసం, అలాగే దేవుని ఆత్మ వాళ్ళకు సహాయం చేస్తాయి. అలా వాళ్ళు “పాపమరణముల నియమమునుండి” విడిపించబడగలుగుతారు.

6. పౌలు మాటలను దేవుని సేవకులందరూ అర్థం చేసుకోవడం ఎందుకు ప్రాముఖ్యం?

6 పౌలు అభిషిక్త క్రైస్తవులకే ఆ మాటలు రాసినా దేవుని ఆత్మ గురించి, క్రీస్తు విమోచన క్రయధనంపై విశ్వాసం ఉంచడం గురించి ఆయన చెప్పిన విషయం పరలోక నిరీక్షణ ఉన్నవాళ్ళకైనా, భూనిరీక్షణ ఉన్నవాళ్ళకైనా ప్రయోజనకరంగా ఉంటుంది. పౌలు దైవప్రేరణతో అభిషిక్త క్రైస్తవులకు అలాంటి సలహా రాసినప్పటికీ, యెహోవా సేవకులందరూ దాన్ని అర్థం చేసుకొని దాని నుండి ప్రయోజనం పొందడం ప్రాముఖ్యం.

‘శరీరమందు పాపానికి’ దేవుడు ఎలా ‘శిక్ష విధించాడు’?

7, 8. (ఎ) ధర్మశాస్త్రం దేన్ని చేయలేకపోయింది? (బి) దేవుడు తన ఆత్మ ద్వారా, విమోచన క్రయధనం ద్వారా దేనిని సాధించాడు?

7 రోమీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయంలో, అపరిపూర్ణ శరీరంపై పాపం ప్రభావం చూపించగలదని పౌలు అన్నాడు. 8వ అధ్యాయంలో ఆయన పరిశుద్ధాత్మ ప్రభావం గురించి మాట్లాడాడు. యెహోవా చిత్తానికి అనుగుణంగా జీవించి ఆయన ఆమోదం పొందగలిగేలా క్రైస్తవులు పాపపు ప్రభావంతో పోరాడడానికి దేవుని ఆత్మ ఎలా సహాయం చేయగలదో అపొస్తలుడైన పౌలు వివరించాడు. ధర్మశాస్త్రం చేయలేని దానిని, దేవుడు తన ఆత్మ ద్వారా, తన కుమారుని విమోచన క్రయధన బలి ద్వారా సాధించాడని పౌలు వివరించాడు.

8 చాలా ఆజ్ఞలున్న ధర్మశాస్త్రం పాపులను శిక్షించింది. అంతేకాక, ఇశ్రాయేలులో ధర్మశాస్త్రం కింద సేవచేస్తున్న ప్రధాన యాజకులు కూడా అపరిపూర్ణులు కాబట్టి వాళ్లు పాపానికి తగిన బలిని అర్పించలేకపోయారు. అందుకే దేవుడు, తన సొంత కుమారుణ్ణి ‘పాపశరీరాకారములో’ పంపడం ద్వారా పాపానికి శిక్ష విధించాడు. అలా యేసు విమోచన క్రయధన బలి ‘ధర్మశాస్త్రము దేన్ని చేయలేకపోయిందో దాన్ని’ చేసింది. ఫలితంగా అభిషిక్త క్రైస్తవులు యేసు విమోచన క్రయధన బలిమీద విశ్వాసం ఉంచినందుకు నీతిమంతులుగా గుర్తించబడుతున్నారు. ‘శరీరము ననుసరింపక ఆత్మ ననుసరించియే నడుచుకోవాలి’ అని వాళ్ళకు చెప్పబడింది. (రోమీయులు 8:2బి-4 చదవండి.) వాళ్ళు ‘జీవకిరీటం’ పొందాలంటే భూజీవితం ముగిసేవరకు నమ్మకంగా అలా చేయాలి.—ప్రక. 2:10.

9. రోమీయులు 8:2లో ప్రస్తావించబడిన ‘నియమం’ అనే పదానికి అర్థం ఏమిటి?

9 పౌలు “ధర్మశాస్త్రము” గురించే కాక “ఆత్మయొక్క నియమము” గురించి, “పాపమరణముల నియమము” గురించి మాట్లాడాడు. (రోమా. 8:2) ఇక్కడ ప్రస్తావించబడిన నియమాల అర్థమేమిటి? ముందుగా, ‘నియమం’ అనే పదం గురించి ఆలోచిద్దాం. ఈ లేఖనంలో ‘నియమం’ అని అనువదించబడిన గ్రీకు పదం మోషే ధర్మశాస్త్రంలో ఉన్న ఆజ్ఞల్లాంటి వాటిని సూచించడం లేదు. ఒక రెఫరెన్సు గ్రంథం ప్రకారం, ఈ వచనంలో ‘నియమం’ అని అనువదించబడిన గ్రీకు పదం, ప్రజలు చేసే మంచి పనులను లేదా చెడ్డపనులను సూచిస్తుంది, అవి వాళ్ళను ఒక చట్టంలా నియంత్రిస్తాయి. ఆ పదం ప్రజలు తమ జీవితాల్లో పాటించాలనుకునే సూత్రాలను కూడా సూచిస్తుంది.

10. పాపమరణాల నియమం మనమీద ఎలా ప్రభావం చూపిస్తుంది?

10 “ఒక మనుష్యునిద్వారా పాపమును పాపము ద్వారా మరణమును లోకములో ఏలాగు ప్రవేశించెనో, ఆలాగుననే మనుష్యులందరు పాపము చేసినందున మరణము అందరికిని సంప్రాప్తమాయెను” అని అపొస్తలుడైన పౌలు రాశాడు. (రోమా. 5:12) మనందరం ఆదాము నుండి వచ్చాం కాబట్టి మనమీద కూడా పాపమరణాల నియమం ప్రభావం చూపిస్తోంది. మనం అపరిపూర్ణులం కాబట్టి దేవునికి ఇష్టంలేని పనులు చేస్తాం, చివరకు మరణిస్తాం. పౌలు గలతీయులకు రాసిన పత్రికలో అలాంటి పనులను, గుణాలను “శరీరకార్యములు” అంటూ, “వాటిని చేయువారు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొనరు” అని చెప్పాడు. (గల. 5:19-21) ఇలాంటి ప్రజలు శరీరానుసారంగా నడుచుకుంటారు. (రోమా. 8:3-5) వాళ్ళ అపరిపూర్ణ శరీరం ఏమి చెబితే అదే చేస్తారు. జారత్వానికి పాల్పడితే, విగ్రహారాధన చేస్తే, భూతప్రేత వ్యవహారాల్లో పాల్గొంటే, ఇంకా ఇతర ఘోరమైన పాపాలు చేస్తే మాత్రమే శరీరానుసారంగా నడుచుకున్నట్లా? అలాగని కాదు, ఎందుకంటే పౌలు రాసినట్లు మత్సరము, క్రోధము, కక్ష, అసూయ కూడా శరీరకార్యాలే. అవి కొంతమంది అనుకుంటున్నట్లు వ్యక్తుల్లోని లోపాలు మాత్రమే కాదు. కాబట్టి శరీరానుసారంగా నడుచుకోవడం పూర్తిగా మానేశామని మనలో ఎవరమూ చెప్పలేం.

11, 12. పాపమరణాల నియమం నుండి మనల్ని విడిపించడానికి యెహోవా ఎలాంటి ఏర్పాట్లు చేశాడు? దేవుని ఆమోదాన్ని పొందాలంటే మనం ఏమి చేయాలి?

11 పాపమరణాల నియమం నుండి మనల్ని విడిపించడానికి ఏర్పాట్లు చేసినందుకు మనం దేవునికి ఎంత కృతజ్ఞులమో కదా! “దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. కాగా ఆయన తన అద్వితీయకుమారునిగా పుట్టిన వానియందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్యజీవము పొందునట్లు ఆయనను అనుగ్రహించెను” అని యేసు చెప్పాడు. దేవుని ప్రేమకు కృతజ్ఞులముగా ఉంటూ, యేసుక్రీస్తు విమోచన క్రయధన బలిమీద విశ్వాసం ఉంచడం ద్వారా మనం వారసత్వంగా సంక్రమించిన పాపం వల్ల వచ్చే శిక్షను తప్పించుకోగలుగుతాం. (యోహా. 3:16-18) కాబట్టి, మన ప్రభువైన యేసుక్రీస్తుద్వారా దేవుడు మనల్ని విడిపిస్తాడని పౌలు అన్నట్లే మనం కూడా అనవచ్చు.

12 మన పరిస్థితి, భయంకరమైన ఒక వ్యాధి నయమౌతున్నప్పుడు ఉండే పరిస్థితిలా ఉంది. మనం పూర్తిగా బాగుపడాలంటే డాక్టరు ఏమి చేయమంటే అది చేయాలి. విమోచన క్రయధనంపై విశ్వాసం ఉంచడం వల్ల పాపమరణాల నియమం నుండి బయటపడే అవకాశం ఉన్నా మనం అపరిపూర్ణులమే, పాపులమే. కాబట్టి దేవునితో మంచి సంబంధం ఏర్పర్చుకొని ఆయన ఆమోదాన్ని, ఆశీర్వాదాన్ని పొందాలంటే మనం చేయాల్సింది ఇంకా ఉంది. పౌలు “ధర్మశాస్త్ర సంబంధమైన నీతివిధి” నెరవేర్చబడడం గురించి చెబుతున్నప్పుడు, ఆత్మానుసారంగా నడుచుకోవడం గురించి కూడా చెప్పాడు.

ఆత్మానుసారంగా నడుచుకోవాలంటే ఏమి చేయాలి?

13. ఆత్మానుసారంగా నడవాలంటే ఏమి చేయాలి?

13 సాధారణంగా మనం నడుస్తున్నప్పుడు, చేరుకోవాలనుకుంటున్న గమ్యం వైపుగా ముందుకు వెళ్తాం. అలాగే ఆత్మానుసారంగా నడవాలంటే మనం క్రమేణా ఆధ్యాత్మిక ప్రగతి సాధించాలి. అంతేగానీ ఆధ్యాత్మిక పరిపూర్ణత సంపాదించనవసరం లేదు. (1 తిమో. 4:15) ప్రతీరోజు ఆత్మానుసారంగా నడుచుకోవడానికి లేదా జీవించడానికి మనం సాధ్యమైనంతవరకు కృషిచేయాలి. ‘ఆత్మానుసారంగా నడుచుకుంటే’ దేవుని ఆమోదం ఉంటుంది.—గల. 5:16.

14. “శరీరానుసారులు” ఏమి చేస్తారు?

14 పౌలు రోమీయులకు రాసిన పత్రికలోని తర్వాతి వచనంలో భిన్న మనస్తత్వాలున్న రెండు రకాల మనుష్యుల గురించి చెప్పాడు. (రోమీయులు 8:5 చదవండి.) బైబిల్లో కొన్నిసార్లు ‘శరీరం’ అనే పదం అపరిపూర్ణతను సూచించడానికి ఉపయోగించబడింది. పౌలు ముందు చెప్పినట్లుగా దానివల్లే శరీరానికి, మనస్సుకు మధ్య పోరాటం జరుగుతుంది. అయితే ‘శరీరానుసారంగా’ నడుచుకునేవాళ్ళు పౌలులా పోరాడడానికి కనీసం ప్రయత్నమైనా చేయరు. వాళ్ళు దేవుడు తమనుండి ఏమి కోరుతున్నాడనేది పరిశీలించకుండా, ఆయనిచ్చే సహాయాన్ని అంగీకరించకుండా ‘శరీరవిషయాల మీద మనస్సునుంచడానికే’ మొగ్గుచూపిస్తారు. వాళ్ళు సుఖభోగాల గురించే, తమ శారీరక కోరికలను తీర్చుకోవడం గురించే ఎక్కువగా ఆలోచిస్తుంటారు. వాళ్ళలా కాక “ఆత్మానుసారులు ఆత్మవిషయములమీద” అంటే ఆధ్యాత్మిక కార్యకలాపాలమీద, దేవుడు చేసిన ఏర్పాట్ల మీద మనస్సుపెడతారు.

15, 16. (ఎ) మనం దేనిమీద మనస్సు పెడుతున్నామనే దాన్నిబట్టి మన ఆలోచనా తీరు ఎలా మారుతుంది? (బి) ఈ రోజుల్లో చాలామంది ఎలాంటి విషయాల్లో నిమగ్నమై ఉంటున్నారు?

15 రోమీయులు 8:5, 6 చదవండి. మంచైనా, చెడైనా చేయాలంటే ముందుగా ఒక వ్యక్తి దాని గురించి ఆలోచించాలి లేదా దానిమీద మనస్సు పెట్టాలి. ఎప్పుడూ శరీరకార్యాల మీదే మనస్సు పెట్టేవాళ్ళు కొంతకాలానికి శరీరసంబంధ విషయాల గురించి మాత్రమే ఆలోచిస్తూ ఉంటారు. వాళ్ళు అలాంటి వాటినే ఇష్టపడతారు, అభిమానిస్తారు.

16 ఈ రోజుల్లో చాలామంది ఎలాంటి విషయాల్లో నిమగ్నమై ఉంటున్నారు? అపొస్తలుడైన యోహాను ఇలా రాశాడు, “లోకములో ఉన్నదంతయు, అనగా శరీరాశయు నేత్రాశయు జీవపుడంబమును తండ్రివలన పుట్టినవి కావు; అవి లోకసంబంధమైనవే.” (1 యోహా. 2:16) ఆస్తిపాస్తులు సంపాదించుకోవడం, సమాజంలో హోదా కలిగివుండడం, ఎక్కువమందితో లైంగిక సంబంధాలు పెట్టుకోవడం వంటివన్నీ అలాంటి ఆశలే. ప్రజలు అలాంటి వాటినే ఎక్కువగా ఇష్టపడుతున్నారు, వాటినే కోరుకుంటున్నారు కాబట్టే పుస్తకాల్లో, పత్రికల్లో, వార్తాపత్రికల్లో, సినిమాల్లో, టీవీ కార్యక్రమాల్లో, ఇంటర్నెట్‌లో అలాంటివే ఎక్కువగా ఉంటున్నాయి. “శరీరానుసారమైన మనస్సు మరణము” అని పౌలు అన్నాడు. శరీరానుసారమైన మనసు వల్ల ఇప్పుడు దేవునితో ఉన్న సంబంధం తెగిపోతుంది, భవిష్యత్తులో నిత్యజీవాన్ని కూడా పొందలేం. ఎందుకు? “శరీరానుసారమైన మనస్సు దేవునికి విరోధమైయున్నది; అది దేవుని ధర్మశాస్త్రమునకు లోబడదు, ఏమాత్రమును లోబడనేరదు. కాగా శరీరస్వభావము గలవారు దేవుని సంతోషపరచనేరరు.”—రోమా. 8:7, 8.

17, 18. మనం “ఆత్మానుసారమైన మనస్సు” సంపాదించుకోవాలంటే ఏమి చేయాలి? అలాచేస్తే వచ్చే ప్రయోజనాలు ఏమిటి?

17 దానికి భిన్నంగా, “ఆత్మానుసారమైన మనస్సు జీవమును సమాధానమునై యున్నది.” ఆత్మానుసారమైన మనస్సు వల్ల భవిష్యత్తులో నిరంతర జీవితం, ప్రస్తుతం మనశ్శాంతి దొరుకుతాయి, దేవునితో సమాధానంగా ఉండగలుగుతాం. మనం “ఆత్మానుసారమైన మనస్సు” సంపాదించుకోవాలంటే ఏమి చేయాలి? ఆత్మానుసారమైన విషయాలపైనే మనసుపెట్టి, దేవునితో సంబంధం మెరుగుపడేలా చేసే వాటినే చేయడానికి ప్రయత్నించాలి. అప్పుడు మనం “దేవుని ధర్మశాస్త్రమునకు లోబడి,” ఆయన ఆలోచనకు అనుగుణంగా ఆలోచిస్తాం. పరీక్షలు ఎదురైనప్పుడు ఏమి చేయాలనేది మనకు తెలిసివుంటుంది కాబట్టి ఆత్మానుసారంగా ఉండే సరైన నిర్ణయాలు తీసుకుంటాం.

18 అందుకే ఆత్మానుసారమైన విషయాల మీద మనస్సు ఉంచడం చాలా ప్రాముఖ్యం. అలా మనసు ఉంచాలంటే ప్రార్థన చేయడం, బైబిలు చదివి అధ్యయనం చేయడం, కూటాలకు హాజరవడం, క్రైస్తవ పరిచర్యలో భాగం వహించడం వంటి ఆధ్యాత్మిక కార్యకలాపాలను క్రమం తప్పకుండా చేస్తూ మన ‘మనస్సు అను నడుముకట్టుకోవాలి.’ (1 పేతు. 1:13) శరీర సంబంధమైన విషయాల వల్ల ఏకాగ్రత కోల్పోయి ప్రక్కదారి పట్టే బదులు ఆత్మసంబంధమైన విషయాల మీద మనస్సునుంచుదాం. అలా మనం ఆత్మానుసారంగా నడుచుకుంటాం. దానివల్ల మనకు ఆశీర్వాదాలు లభిస్తాయి, ఎందుకంటే ఆత్మానుసారమైన ‘మనస్సు జీవమును, సమాధానమునై యున్నది.’—గల. 6:7, 8.

మీరు వివరించగలరా?

• ‘ధర్మశాస్త్రం చేయలేనిది’ ఏమిటి? దాన్ని దేవుడు ఎలా సాధించాడు?

• “పాపమరణముల నియమము” అంటే ఏమిటి? దాని నుండి మనమెలా విడుదల పొందుతాం?

• “ఆత్మానుసారమైన మనస్సు” సంపాదించుకోవాలంటే మనం ఏమి చేయాలి?

[అధ్యయన ప్రశ్నలు]

[12, 13 పేజీల్లోని చిత్రాలు]

మీరు శరీరానుసారంగా నడుచుకుంటారా, ఆత్మానుసారంగా నడుచుకుంటారా?