కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

దుష్టలోకంలో “యాత్రికులు”

దుష్టలోకంలో “యాత్రికులు”

దుష్టలోకంలో “యాత్రికులు”

‘వీరందరు విశ్వాసముగలవారై తాము భూమి మీద పరదేశులమును యాత్రికులమునై యున్నామని ఒప్పుకున్నారు.’—హెబ్రీ. 11:13.

1. ఈ లోకంలో తన శిష్యులు ఎలా ఉంటారని యేసు చెప్పాడు?

 యేసు తన శిష్యుల గురించి మాట్లాడుతూ, “వీరు లోకములో ఉన్నారు” అన్నాడు. అయితే తర్వాత వివరంగా, “నేను లోకసంబంధిని కానట్టు వారును లోకసంబంధులు కారు” అని చెప్పాడు. (యోహా. 17:11, 14) సాతాను పరిపాలిస్తున్న ఈ లోకంలో తనను నిజంగా అనుసరించే వాళ్లు ఎలా ఉండాలో యేసు ఆ మాటల్లో స్పష్టం చేశాడు. (2 కొరిం. 4:4) వాళ్లు ఈ దుష్ట లోకంలో జీవిస్తున్నప్పటికీ దానితో ఎలాంటి సంబంధమూ పెట్టుకోరు, ఈ విధానంలో ‘పరదేశుల్లా, యాత్రికుల్లా’ ఉంటారు.—1 పేతు. 2:11.

వాళ్లు ‘యాత్రికుల్లా’ జీవించారు

2, 3. హనోకు, నోవహు, అబ్రాహాము, శారా ‘పరదేశుల్లా, యాత్రికుల్లా’ జీవించారని ఎందుకు చెప్పవచ్చు?

2 పూర్వకాలం నుండి యెహోవా నమ్మకమైన సేవకులు తమ చుట్టూవున్న భక్తిహీనుల్లా జీవించలేదు. జలప్రళయానికి ముందు హనోకు, నోవహు ‘దేవునితో నడిచారు.’ (ఆది. 5:22-24; 6:9) వాళ్లిద్దరూ సాతాను దుష్ట లోకం పైకి యెహోవా తీసుకువచ్చే తీర్పులను ధైర్యంగా ప్రకటించారు. (2 పేతురు 2:5; యూదా 14, 15 చదవండి.) భక్తిహీన లోకంలో దేవునితో నడిచినందువల్ల హనోకు “దేవునికి ఇష్టుడైయుండెను,” నోవహు ‘తన తరములో నిందారహితునిగా ఉండెను.’—హెబ్రీ. 11:5; ఆది. 6:9.

3 అబ్రాహాము, శారా దేవుని మాటకు లోబడి ఊరు అనే కల్దీయుల పట్టణంలోని సౌఖ్యాలను వదిలేసి వచ్చి, పరాయి దేశంలో సంచారులుగా జీవించడం మొదలుపెట్టారు. (ఆది. 11:27, 28; 12:1) “అబ్రాహాము పిలువబడినప్పుడు విశ్వాసమునుబట్టి ఆ పిలుపునకు లోబడి, తాను స్వాస్థ్యముగా పొందనైయున్న ప్రదేశమునకు బయలువెళ్లెను. మరియు ఎక్కడికి వెళ్లవలెనో అది ఎరుగక బయలువెళ్లెను. విశ్వాసమునుబట్టి అతడును, అతనితో ఆ వాగ్దానమునకు సమానవారసులైన ఇస్సాకు యాకోబు అనువారును, గుడారములలో నివసించుచు, అన్యుల దేశములో ఉన్నట్టుగా వాగ్దత్తదేశములో పరవాసులైరి” అని అపొస్తలుడైన పౌలు రాశాడు. (హెబ్రీ. 11:8, 9) అలాంటి నమ్మకమైన యెహోవా సేవకుల గురించి ఆయన ఇంకా ఇలా చెప్పాడు: “వీరందరు ఆ వాగ్దానముల ఫలము అనుభవింపక పోయినను, దూరమునుండి చూచి వందనముచేసి, తాము భూమిమీద పరదేశులమును యాత్రికులమునై యున్నామని ఒప్పుకొని, విశ్వాసముగలవారై మృతినొందిరి.”—హెబ్రీ. 11:13.

ఇశ్రాయేలీయులకు ఒక హెచ్చరిక

4. ఇశ్రాయేలీయులు వాగ్దానదేశంలో స్థిరపడక ముందు యెహోవా వాళ్లను ఏమని హెచ్చరించాడు?

4 అబ్రాహాము వంశస్థులైన ఇశ్రాయేలీయులు ఎంతోమందిగా వృద్ధి చెందారు. దేవుడు వాళ్లను ఇశ్రాయేలు జనాంగంగా ఏర్పరచి వాళ్లకు ధర్మశాస్త్రాన్ని, సొంత భూమిని ఇచ్చాడు. (ఆది. 48:4; ద్వితీ. 6:2) తమ భూమి నిజానికి యెహోవాకే చెందుతుందనే విషయాన్ని ఇశ్రాయేలీయులు ఎప్పటికీ మరిచిపోకూడదు. (లేవీ. 25:23) వాళ్లు అద్దెకున్న వాళ్లలా సొంతదారుని ఇష్టాయిష్టాలకు అనుగుణంగా నడుచుకోవాలి. అంతేగాక, ‘నరులు బ్రతికేది ఆహారం వల్ల మాత్రమే కాదు’ అని వాళ్లు గుర్తుంచుకోవాలి, ఆస్తిపాస్తులు పెరగడం వల్ల యెహోవాను మరిచిపోయే పరిస్థితి రాకుండా చూసుకోవాలి. (ద్వితీ. 8:1-3) ఇశ్రాయేలీయులు వాగ్దానదేశంలో స్థిరపడక ముందు యెహోవా వాళ్లను ఇలా హెచ్చరించాడు, “నీ దేవుడైన యెహోవా నీ పితరులైన అబ్రాహాము ఇస్సాకు యాకోబులతో చేసిన ప్రమాణమునుబట్టి నిన్ను ఆ దేశములో ప్రవేశపెట్టి, నీవు కట్టని గొప్పవగు మంచి పురములను, నీవు నింపని మంచి ద్రవ్యములచేత నింపబడిన ఇండ్లను, నీవు త్రవ్వకపోయినను త్రవ్వబడిన బావులను, నీవు నాటని ద్రాక్షతోటలను ఒలీవల తోటలను నీకిచ్చిన తరువాత నీవు తిని తృప్తిపొందినప్పుడు దాసుల గృహమైన ఐగుప్తుదేశములోనుండి నిన్ను రప్పించిన యెహోవాను మరువకుండ నీవు జాగ్రత్తపడుము.”—ద్వితీ. 6:10-12.

5. యెహోవా ఇశ్రాయేలీయులను ఎందుకు తిరస్కరించాడు, ఆయన ఏ కొత్త జనాంగం పట్ల తన అనుగ్రహం చూపించాడు?

5 అలా హెచ్చరించడం అవసరమేనని ఆ తర్వాత రుజువైంది. ఇశ్రాయేలీయులు వాగ్దానదేశంలో ప్రవేశించిన తర్వాత జరిగినదాన్ని నెహెమ్యా కాలంలో కొంతమంది లేవీయులు గుర్తుతెచ్చుకుని సిగ్గుపడ్డారు. ఇశ్రాయేలీయులు సౌకర్యవంతమైన ఇళ్లలో ఉంటూ తమకు మంచి ఆహారం, ద్రాక్షారసం పుష్కలంగా ఉన్నప్పుడు, వాళ్లు ‘తిని తృప్తిపొంది మదించారు.’ అంతేకాదు, తమను హెచ్చరించడానికి పంపిన ప్రవక్తలను చంపి దేవునికి ఎదురుతిరిగారు. కాబట్టి యెహోవా వాళ్లను వాళ్ల శత్రువుల చేతికి అప్పగించాడు. (నెహెమ్యా 9:25-27 చదవండి; హోషే. 13:6-9) ఆ తర్వాత రోమన్ల పరిపాలనలో, విశ్వాసంలేని యూదులు వాగ్దానం చేయబడిన మెస్సీయను కూడా చంపేశారు! యెహోవా వాళ్లను తిరస్కరించి, మరో కొత్త జనాంగం పట్ల అంటే ఆధ్యాత్మిక ఇశ్రాయేలు పట్ల అనుగ్రహం చూపించాడు.—మత్త. 21:43; అపొ. 7:51, 52; గల. 6:16.

“లోకసంబంధులు కారు”

6, 7. (ఎ) తన అనుచరులు లోకంతో ఎలాంటి సంబంధం కలిగివుంటారనే దాని గురించి యేసు చెప్పిన విషయాన్ని మీరెలా వివరిస్తారు? (బి) నిజ క్రైస్తవులు సాతాను విధానం నుండి ఎందుకు వేరుగా ఉన్నారు?

6 ఈ ఆర్టికల్‌లో ముందు మనం చూసినట్లుగా, తన అనుచరులు లోకం నుండి, అంటే సాతాను దుష్ట విధానం నుండి వేరుగా ఉంటారని క్రైస్తవ సంఘ శిరస్సు అయిన యేసుక్రీస్తు తెలియజేశాడు. యేసు చనిపోవడానికి కొంచెం ముందు తన శిష్యులతో ఇలా చెప్పాడు, “మీరు లోకసంబంధులైన యెడల లోకము తన వారిని స్నేహించును; అయితే మీరు లోకసంబంధులు కారు; నేను మిమ్మును లోకములోనుండి ఏర్పరచుకొంటిని; అందుచేతనే లోకము మిమ్మును ద్వేషించుచున్నది.”—యోహా. 15:19.

7 క్రైస్తవత్వం వ్యాప్తిచెందుతుండగా, క్రైస్తవులు లోకంలోని ఆచారాలను పాటిస్తూ దానిలో భాగమై లోకంతో మంచి సంబంధం ఏర్పర్చుకున్నారా? లేదు. వాళ్లు ఎక్కడున్నా సాతాను విధానం నుండి వేరుగా ఉండేవాళ్లు. క్రీస్తు చనిపోయిన దాదాపు 30 సంవత్సరాల తర్వాత, రోమాలోని వివిధ ప్రాంతాల్లో నివసిస్తున్న క్రైస్తవులకు అపొస్తలుడైన పేతురు ఇలా రాశాడు, ‘ప్రియులారా, మీరు పరదేశులును యాత్రికులునై యున్నారు గనుక ఆత్మకు విరోధముగా పోరాడు శరీరాశలను విసర్జించి, అన్యజనుల మధ్య మంచి ప్రవర్తనగలవారై ఉండవలెనని మిమ్మును బతిమాలుకొనుచున్నాను.’—1 పేతు. 1:1; 2:11, 12.

8. తొలి క్రైస్తవులకు లోకంతో ఎలాంటి సంబంధం ఉండేదని ఒక చరిత్రకారుడు చెబుతున్నాడు?

8 తొలి క్రైస్తవులు రోమా పరిపాలన క్రింద ‘పరదేశుల్లా, యాత్రికుల్లా’ ఉన్నారని చెబుతూ కెనెత్‌ స్కాట్‌ లాట్యూరెట్‌ అనే చరిత్రకారుడు ఇలా రాశాడు, “క్రైస్తవత్వం మొదలైన మొదటి మూడు శతాబ్దాల్లో క్రైస్తవులు ఎంతో కాలంపాటు తరచూ హింసల పాలయ్యేవారన్న విషయం అందరికీ తెలిసిందే . . . వాళ్లమీద ఎన్నో రకాల నిందలు వేశారు. క్రైస్తవులు అన్యుల ఆచారాలను పాటించేవాళ్లు కాదు కాబట్టి వాళ్లను నాస్తికులు అన్నారు. అంతేకాక దైవభక్తిలేని నమ్మకాలతో, ఆచారాలతో, అవినీతికరమైన పనులతో నిండివుంటాయి కాబట్టి క్రైస్తవులు అన్యుల పండుగల్లో, వినోదకార్యక్రమాల్లో పాల్గొనేవాళ్లు కాదు. అలా వాళ్లు నలుగురితో అంతగా కలవకుండా దూరంగా ఉండేవాళ్లు. అందుకే వాళ్లపై మానవజాతిని ద్వేషించేవాళ్లనే నిందపడింది.”

లోకమును అమితముగా ఉపయోగించుకోరు

9. నిజ క్రైస్తవులముగా మనం ‘మానవజాతిని ద్వేషించేవాళ్లం’ కాదని ఎలా చూపిస్తాం?

9 ఈ రోజుల్లో పరిస్థితి ఏమిటి? “ప్రస్తుతపు దుష్టకాలములో” మనం కూడా తొలి క్రైస్తవుల్లాగే నడుచుకుంటాం. (గల. 1:4) అందుకే మనల్ని చాలామంది అపార్థం చేసుకుంటారు, కొంతమంది మనల్ని ద్వేషిస్తారు కూడా. అయినా మనం ‘మానవజాతిని ద్వేషించేవాళ్లం’ కాదని ఖచ్చితంగా చెప్పవచ్చు. ఎందుకంటే, పొరుగువాళ్లమీదున్న ప్రేమవల్లే మనం ఇంటింటికీ వెళ్లి ప్రతీ ఒక్కరికి దేవుని “రాజ్య సువార్త” ప్రకటిస్తాం. (మత్త. 22:39; 24:14) క్రీస్తు పరిపాలించే యెహోవా రాజ్యం అపరిపూర్ణ మానవ పరిపాలనను నిర్మూలించి నీతియుక్తమైన కొత్త విధానాన్ని స్థాపిస్తుందని మనం గట్టిగా నమ్ముతున్నాం కాబట్టే అలా చేస్తాం.—దాని. 2:44; 2 పేతు. 3:13.

10, 11. (ఎ) లోకాన్ని అమితంగా ఉపయోగించుకోకూడదంటే మనం ఎలా ఉండాలి? (బి) జాగ్రత్తగా ఉండే క్రైస్తవులు లోకాన్ని అమితంగా ఉపయోగించుకోకుండా ఎలాంటి చర్యలు తీసుకుంటారు?

10 ప్రస్తుత విధానం త్వరలోనే నాశనం కాబోతుంది కాబట్టి ఇది ఈ విధానంలో స్థిరపడాల్సిన సమయం కాదని యెహోవా సేవకులమైన మనకు తెలుసు. “సహోదరులారా, నేను చెప్పునదేమనగా, కాలము సంకుచితమై యున్నది గనుక . . . కొనువారు తాము కొనినది తమది కానట్టును, ఈ లోకము అనుభవించువారు అమితముగా అనుభవింపనట్టును ఉండవలెను; ఏలయనగా ఈ లోకపు నటన గతించుచున్నది” అని అపొస్తలుడైన పౌలు చెప్పిన మాటలను పాటిస్తాం. (1 కొరిం. 7:29-31) కానీ ఈ రోజుల్లో క్రైస్తవులు లోకాన్ని ఎలా ఉపయోగించుకుంటున్నారు? ప్రపంచవ్యాప్తంగా వందలాది భాషల్లో బైబిలు జ్ఞానాన్ని అందరికీ అందజేయడానికి ఆధునిక సాంకేతికతను, సమాచార మాధ్యమాల్ని ఉపయోగించుకుంటున్నారు. వాళ్లు తమ బ్రతుకుతెరువు కోసం కొంతవరకు లోకాన్ని ఉపయోగించుకుంటారు. ఈ లోకంలో అందుబాటులోవున్న వస్తువులను కొనుక్కుంటారు, డబ్బు చెల్లించి సేవలను వినియోగించుకుంటారు. అయితే వాళ్లు లోకమును అమితముగా ఉపయోగించుకోరు అంటే ఆస్తిపాస్తులకు, ఉద్యోగాలకు అనవసరమైన ప్రాధాన్యతను ఇవ్వరు.—1 తిమోతి 6:9, 10 చదవండి.

11 జాగ్రత్తగా ఉండే క్రైస్తవులు ఉన్నత విద్యకు కూడా అనవసరమైన ప్రాధాన్యతను ఇవ్వరు. ఉన్నత విద్యను అభ్యసిస్తే గౌరవప్రదమైన, విలాసవంతమైన జీవితాన్ని గడపవచ్చని ఈ లోకంలో చాలామంది అనుకుంటారు. కానీ క్రైస్తవులమైన మనం యాత్రికుల్లా జీవిస్తూ, లోకానికి భిన్నంగా ఉండే లక్ష్యాలను చేరుకోవడానికి ప్రయాసపడతాం. మనం “హెచ్చు వాటియందు మనస్సుంచం.” (రోమా. 12:16; యిర్మీ. 45:5) మనం యేసు అనుచరులం కాబట్టి ఆయన ఇచ్చిన ఈ హెచ్చరికను లక్ష్యపెడతాం, “మీరు ఏ విధమైన లోభమునకు ఎడమియ్యక జాగ్రత్తపడుడి; ఒకని కలిమి విస్తరించుట వాని జీవమునకు మూలము కాదు.” (లూకా 12:15) అందుకే క్రైస్తవ యౌవనులు తమ అవసరాలు తీర్చుకోవడానికి సరిపడేంత విద్యను మాత్రమే సంపాదించుకొని, ఆధ్యాత్మిక లక్ష్యాలను సాధించడానికి కృషి చేయాలని ప్రోత్సహించబడుతున్నారు. అప్పుడే వాళ్లు ‘పూర్ణహృదయంతో, పూర్ణమనస్సుతో, పూర్ణశక్తితో, పూర్ణవివేకంతో’ యెహోవాను ఆరాధించడానికి సిద్ధపడగలుగుతారు. (లూకా 10:27) అలా చేస్తే వాళ్లు ‘దేవునియెడల ధనవంతులు’ అవుతారు.—లూకా 12:21; మత్తయి 6:19-21 చదవండి.

జీవిత చింతలతో కృంగిపోకండి

12, 13. మత్తయి 6:31-33 వచనాల్లో యేసు ఇచ్చిన హెచ్చరికను పాటిస్తే మనకు, లోకానికి ఎలాంటి తేడా ఉంటుంది?

12 ఆస్తిపాస్తుల విషయంలో యెహోవా సేవకులు లోకంలోని ప్రజల్లా ఆలోచించరు. ఈ విషయం గురించి యేసు తన అనుచరులతో మాట్లాడుతూ, “ఏమి తిందుమో యేమి త్రాగుదుమో యేమి ధరించుకొందుమో అని చింతింపకుడి; అన్యజనులు వీటన్నిటి విషయమై విచారింతురు. ఇవన్నియు మీకు కావలెనని మీ పరలోకపు తండ్రికి తెలియును. కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెదకుడి; అప్పుడవన్నియు మీకనుగ్రహింపబడును” అని చెప్పాడు. (మత్త. 6:31-33) పరలోకంలో ఉన్న తండ్రి తమ అవసరాలను చూసుకుంటాడని మన తోటి విశ్వాసుల్లో చాలామంది సొంత అనుభవం ద్వారా తెలుసుకున్నారు.

13 “సంతుష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభసాధనము.” (1 తిమో. 6:6) లోకంలో ఉన్న ప్రజలు అలా ఎప్పుడూ ఆలోచించరు. ఉదాహరణకు కొంతమంది యౌవనస్థులు పెళ్లి చేసుకోగానే మంచి ఇల్లు, కారు, అన్ని రకాల వసతులు, అధునాతన ఎలక్ట్రానిక్‌ పరికరాలు వంటివన్నీ తమకు ఉండాలని కోరుకుంటారు. అయితే యాత్రికుల్లా జీవించే క్రైస్తవులు తమ స్తోమతకు మించినవాటి కోసం అనవసరంగా ఆరాటపడరు. చాలామంది క్రైస్తవులు కొన్ని సౌకర్యాలను వదులుకొని యెహోవా సేవ కోసం తమ సమయాన్ని, శక్తిని ఎక్కువగా ఉపయోగిస్తూ ఉత్సాహంగా రాజ్యం గురించి ప్రకటించడం మెచ్చుకోదగిన విషయం. కొంతమంది పయినీర్లుగా, బెతెల్‌ సభ్యులుగా, ప్రయాణ పర్యవేక్షకులుగా, మిషనరీలుగా సేవ చేస్తున్నారు. మన తోటి ఆరాధకులు యెహోవాను పూర్ణహృదయంతో సేవిస్తున్నందుకు మనం వాళ్లను తప్పకుండా అభినందించాలి.

14. విత్తువాని గురించి యేసు చెప్పిన ఉపమానం నుండి ఏమి నేర్చుకోవచ్చు?

14 విత్తువాని గురించిన ఉపమానం చెబుతూ ‘ఐహికవిచారము, ధనమోసము’ మన హృదయంలోని దేవుని వాక్యాన్ని అణచివేసి మనల్ని నిష్ఫలుల్ని చేస్తాయని యేసు వివరించాడు. (మత్త. 13:22) ఆ ప్రమాదంలో చిక్కుకోకూడదంటే మనం ఈ లోకంలో యాత్రికుల్లా, ఉన్నదానితో సంతృప్తిగా జీవించాలి. అలా జీవిస్తే మన కంటిని “తేటగా” ఉంచుకొని, ఒకే దానిమీద దృష్టి పెట్టగలుగుతాం అంటే దేవుని రాజ్యానికి సంబంధించిన వాటికే మన జీవితంలో ప్రాధాన్యత ఇవ్వగలుగుతాం.—మత్త. 6:22.

‘లోకము గతించిపోవుచున్నది’

15. ఈ లోకం విషయంలో నిజ క్రైస్తవుల ఆలోచనా తీరు, ప్రవర్తన ఎలా ఉండాలని అపొస్తలుడైన యోహాను సలహా ఇచ్చాడు?

15 నిజక్రైస్తవులమైన మనం ఈ లోకం త్వరలోనే నాశనమౌతుందని ఖచ్చితంగా నమ్ముతాం కాబట్టే ఈ విధానంలో ‘పరదేశుల్లా, యాత్రికుల్లా’ జీవిస్తాం. (1 పేతు. 2:11; 2 పేతు. 3:7) ఆ ఆలోచనా తీరును బట్టే మనం ఎంచుకునేవి, కోరుకునేవి, ఇష్టపడేవి ఉంటాయి. “లోకమును దాని ఆశయు గతించిపోవుచున్నవి గాని, దేవుని చిత్తమును జరిగించువాడు నిరంతరమును నిలుచును” కాబట్టి లోకాన్ని, దానిలో ఉన్నవాటిని ప్రేమించవద్దని అపొస్తలుడైన యోహాను తన తోటి విశ్వాసులకు సలహా ఇచ్చాడు.—1 యోహా. 2:15-17.

16. ఇతరుల నుండి మనం వేరుగా ఉన్నామని ఎలా చూపించవచ్చు?

16 ఇశ్రాయేలీయులు యెహోవాకు విధేయత చూపిస్తే వాళ్లు “సమస్తదేశ జనులలో” ఆయనకు “స్వకీయ సంపాద్యమగుదురు” అని వాళ్లకు చెప్పబడింది. (నిర్గ. 19:5) ఇతర జనాంగాలతో పోలిస్తే, ఇశ్రాయేలీయులు దేవునికి నమ్మకంగా ఉన్నంతవరకు వాళ్ల ఆరాధన, జీవన విధానం ఎంతో భిన్నంగా ఉండేవి. ఈ రోజుల్లో కూడా సాతాను లోకం నుండి ఎంతో వేరుగా ఉంటున్నవాళ్లను యెహోవా తన ప్రజలుగా చేసుకున్నాడు. బైబిలు మనకిలా చెబుతోంది, “భక్తిహీనతను, ఇహలోక సంబంధమైన దురాశలను విసర్జించి, శుభప్రదమైన నిరీక్షణ నిమిత్తము, అనగా మహా దేవుడును మన రక్షకుడునైన యేసుక్రీస్తు మహిమయొక్క ప్రత్యక్షతకొరకు ఎదురుచూచుచు, ఈ లోకములో స్వస్థబుద్ధితోను నీతితోను, భక్తితోను బ్రదుకుచుండవలెను.” ఎందుకంటే, “ఆయన సమస్తమైన దుర్నీతినుండి మనలను విమోచించి, సత్క్రియలయందాసక్తిగల ప్రజలను తన కోసరము పవిత్రపరచుకొని తన సొత్తుగా చేసికొనుటకు తన్ను తానే మనకొరకు అర్పించుకొనెను.” (తీతు 2:11-14) అభిషిక్త క్రైస్తవులు, వాళ్లకు సహాయం చేసే లక్షలాదిమంది ‘వేరేగొర్రెలు’ కలిసి ఆ ‘ప్రజలుగా’ ఏర్పడ్డారు.—యోహా. 10:16.

17. ఈ దుష్ట లోకంలో యాత్రికుల్లా జీవించినందుకు అభిషిక్త క్రైస్తవులు గానీ వేరే గొర్రెలు గానీ ఎందుకు బాధపడరు?

17 అభిషిక్త క్రైస్తవులకు పరలోకంలో క్రీస్తుతో పాటు పరిపాలించే చక్కని “నిరీక్షణ” ఉంది. (ప్రక. 5:9, 10) ఈ భూమ్మీద నిరంతరం జీవించాలనే వేరేగొర్రెల నిరీక్షణ నిజమైనప్పుడు వాళ్లకు ఈ దుష్టలోకంలో యాత్రికుల్లా జీవించాల్సిన అవసరం ఉండదు. వాళ్లు అందమైన ఇళ్లల్లో, తినడానికి కొదువ లేకుండా జీవిస్తారు. (కీర్త. 37:10, 11; యెష. 25:6; 65:21, 22) ఇశ్రాయేలీయుల్లా కాకుండా వాళ్లు, “సర్వలోకమునకు దేవుడు” అయిన యెహోవాయే వీటన్నిటినీ ఇచ్చాడని ఎప్పుడూ గుర్తుపెట్టుకుంటారు. (యెష. 54:5) ఈ దుష్ట లోకంలో యాత్రికుల్లా జీవించినందుకు అభిషిక్త క్రైస్తవులు గానీ వేరే గొర్రెలు గానీ బాధపడరు.

మీరెలా జవాబిస్తారు?

• పూర్వకాలంలోని నమ్మకస్థులు యాత్రికుల్లా ఎలా జీవించారు?

• తొలి క్రైస్తవులకు లోకంతో ఎలాంటి సంబంధం ఉండేది?

• నిజ క్రైస్తవులు లోకాన్ని ఎలా కొంతవరకు మాత్రమే ఉపయోగించుకుంటారు?

• ఈ దుష్టలోకంలో యాత్రికుల్లా జీవించినందుకు మనం ఎందుకు బాధపడం?

[అధ్యయన ప్రశ్నలు]

[18వ పేజీలోని చిత్రం]

హింస, అవినీతి నిండిన వినోదాలకు తొలి క్రైస్తవులు దూరంగా ఉన్నారు