కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

పాఠకుల ప్రశ్నలు

పాఠకుల ప్రశ్నలు

పాఠకుల ప్రశ్నలు

యేసుక్రీస్తును ఖచ్చితంగా ఎన్ని గంటలకు మ్రానుమీద వేలాడదీశారో చెప్పడం సాధ్యమేనా?

యేసు మరణం గురించి సువార్త రచయితయైన మార్కు రాసిన దానికి, అపొస్తలుడైన యోహాను రాసిన దానికి తేడా కనిపిస్తున్నందు వల్ల అలాంటి ప్రశ్న తలెత్తుతుంది. సైనికులు “ఆయనను సిలువవేసినప్పుడు పగలు తొమ్మిది గంటలాయెను” అని మార్కు రాశాడు. (మార్కు 15:25) పిలాతు యేసును మ్రానుమీద వేలాడదీయడానికి యూదులకు అప్పగించేసరికి “ఉదయము ఆరు ఘంటలు [‘మధ్యాహ్నం 12 గంటలు,’ NW అధస్సూచి] కావచ్చెను” అని యోహాను రాశాడు. (యోహా. 19:14-16) మార్కు, యోహాను రాసిన దానిలో ఎందుకు అంత తేడా ఉందో చెప్పే ప్రయత్నంలో బైబిలు వ్యాఖ్యాతలు రకరకాల వివరణలు ఇచ్చారు. ఈ రెండు వృత్తాంతాల మధ్య ఉన్న తేడాను వివరించడానికి కావాల్సినంత సమాచారం బైబిల్లో లేదు. అయినప్పటికీ ఆ కాలంలోని ప్రజలు సమయాన్ని ఎలా లెక్కించేవాళ్ళో తెలుసుకోవడం సహాయకరంగా ఉండవచ్చు.

మొదటి శతాబ్దంలో ఖచ్చితమైన సమయాన్ని చూపించే గడియారాలు అందుబాటులో లేవు. ఆకాశంలో సూర్యుడున్న స్థానాన్ని బట్టి పగలు ఎన్ని గంటలైందో చెప్పేవాళ్ళు. సూర్యుడు ఉదయించే, అస్తమించే సమయాలు సంవత్సరమంతటిలో మారుతూ ఉంటాయి కాబట్టి, సమయాన్ని కేవలం అంచనా వేసి చెప్పేవాళ్ళు. క్రైస్తవ గ్రీకు లేఖనాల్లో ఫలానా సంఘటన దాదాపు 9 గంటలకు, దాదాపు 12 గంటలకు, దాదాపు 3 గంటలకు జరిగిందని చెప్పినప్పుడు ఆ సమయాలు అంచనా వేసి చెప్పినవి మాత్రమే. (మత్త. 20:3, 5; అపొ. 10:3, 9, 30) ఏదైనా ఒక సంఘటన ఖచ్చితంగా ఎప్పుడు జరిగిందో చెప్పాల్సి వచ్చినప్పుడు మాత్రమే ఫలానా సంఘటన “ఒంటి గంటకు” జరిగిందంటూ నిర్దిష్టంగా చెప్పేవాళ్ళు.—యోహా. 4:52.

యేసు భూజీవితపు చివరి రోజున ఆయా సంఘటనలు జరిగిన సమయాల గురించి అన్ని సువార్తలూ ఒకేలా చెబుతున్నాయి. సూర్యోదయం తర్వాత యాజకులు, పెద్దలు సమకూడి, రోమా అధిపతియైన పొంతి పిలాతు దగ్గరకు యేసును తీసుకువెళ్ళారని నాలుగు సువార్తలూ సూచిస్తున్నాయి. (మత్త. 27:1; మార్కు 15:1; లూకా 22:66; యోహా. 18:28) మధ్యాహ్నం 12 అయ్యేసరికే యేసు మ్రానుమీద ఉన్నాడు, అప్పటి నుండి “మూడు గంటలవరకు” ఆ దేశమంతటా చీకటి కమ్మిందని మత్తయి, మార్కు, లూకా నివేదించారు.—మత్త. 27:45, 46; మార్కు 15:33, 34; లూకా 23:44.

యేసును ఏ సమయానికి మ్రానుమీద వేలాడదీశారనేది చెప్పడానికి ఒక విషయం సహాయం చేస్తుండవచ్చు. అదేమిటంటే ఆ రోజుల్లో, కొరడాలతో కొట్టడాన్ని మ్రానుమీద వేలాడదీయడంలో భాగంగా పరిగణించేవాళ్ళు. ఒక్కోసారి కొరడాలతో ఎంత తీవ్రంగా కొట్టేవాళ్ళంటే ఆ ధాటికి శిక్ష అనుభవిస్తున్న వ్యక్తి చనిపోయేవాడు. యేసును కూడా ఎంతో తీవ్రంగా కొట్టివుండవచ్చు. అందుకే, ఆయన ఆ మ్రానును ఒంటరిగా మోయలేకపోవడంతో మరో వ్యక్తి సహాయం చేయాల్సివచ్చింది. (లూకా 23:26; యోహా. 19:17) మ్రానుమీద వేలాడదీయడంలో మొదటి ఘట్టం కొరడాలతో కొట్టడమైతే, దానికీ యేసును మేకులతో మ్రానుకు కొట్టడానికీ మధ్య కొంత సమయం గడవాలి. ఆ ఇద్దరు సువార్త రచయితల్లో ఒకరు కొరడా దెబ్బలు కొట్టిన సమయాన్ని పరిగణనలోకి తీసుకునివుంటే, మరొకరు మ్రానుమీద వేలాడదీసిన సమయాన్ని పరిగణనలోకి తీసుకునివుంటారు. అందుకే యేసును ఎన్ని గంటలకు మ్రానుమీద వేలాడదీశారనే దాని గురించి ఇద్దరు రచయితలు వేర్వేరుగా రాసివుంటారు.

మిగతా సువార్త రచయితలు రాసిన చాలా సంవత్సరాల తర్వాత అపొస్తలుడైన యోహాను తన సువార్త పుస్తకాన్ని రాశాడు. కాబట్టి ఆయనకు వాళ్ళు రాసిన సువార్తలు అందుబాటులో ఉన్నాయి. నిజమే, ఏ సమయానికి యేసును మ్రానుమీద వేలాడదీశారనే దాని గురించి మార్కు రాసిన దానికి, యోహాను రాసిన దానికి తేడా ఉన్నట్లు అనిపిస్తోంది. అయితే, యోహాను మార్కుసువార్తను చూసి ఉన్నదున్నట్లు రాయలేదు కానీ తన సొంతగా రాశాడని దీన్నిబట్టి స్పష్టంగా తెలుస్తోంది. యోహాను, మార్కు ఇద్దరూ దేవుని ప్రేరేపణతోనే రాశారు. వాళ్ళిద్దరూ రాసిన దానిలో ఎందుకు తేడా ఉందో వివరించడానికి కావాల్సినంత సమాచారం బైబిల్లో లేకపోయినా మనం ఆ సువార్త వృత్తాంతాలను పూర్తిగా నమ్మవచ్చు.