కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

యెహూ సత్యారాధనకు ఆసక్తితో మద్దతిచ్చాడు

యెహూ సత్యారాధనకు ఆసక్తితో మద్దతిచ్చాడు

యెహూ సత్యారాధనకు ఆసక్తితో మద్దతిచ్చాడు

యెహూ సత్యారాధన పక్షాన పోరాడాడు. దానికోసం ఆయన వెంటనే చర్య తీసుకున్నాడు, చురుకుగా, అవిశ్రాంతంగా, ఆసక్తిగా, ధైర్యంగా పనిచేశాడు. యెహూ చూపించిన లక్షణాలనే మనమూ చూపించాలనుకుంటాం.

ఇశ్రాయేలు జనాంగం చెడు పరిస్థితుల్లో ఉన్నప్పుడు దేవుడు యెహూకు ఒక పని అప్పగించాడు. ఆ రాజ్యం యెజెబెలు దుష్ట ప్రభావం కింద మగ్గుతోంది. ఆమె భర్త అహాబు అప్పటికే చనిపోయాడు, అప్పుడు పరిపాలిస్తున్న యెహోరాము ఆమె కుమారుడు. యెహోవాను కాకుండా బయలును ఆరాధించేలా ప్రజలమీద ఆమె ఒత్తిడి తీసుకొచ్చింది, దేవుని ప్రవక్తలను చంపింది. ప్రజలను తన ‘జారత్వాలతో,’ ‘చిల్లంగితనాలతో’ అంటే మంత్రవిద్యలతో భ్రష్టుపట్టించింది. (2 రాజు. 9:22; 1 రాజు. 18:4, 13) యెహోరాము యెజెబెలులతో సహా అహాబు ఇంటి వాళ్లందర్నీ తుడిచిపెట్టమని యెహోవా ఆజ్ఞాపించాడు. ఆ పనికి యెహూ నాయకత్వం వహించాలి.

ఇశ్రాయేలీయులు రామోత్గిలాదులో సిరియన్లతో యుద్ధం చేస్తున్నప్పుడు యెహూ సైన్యాధిపతులతో కూర్చునివున్న సందర్భాన్ని ప్రస్తావిస్తూ లేఖనాలు యెహూను పరిచయం చేస్తున్నాయి. యెహూ ఉన్నత పదవిలో ఉన్నాడు, బహుశా ఆయన ఇశ్రాయేలు సైన్యానికి అధిపతి కూడా అయ్యుంటాడు. యెహూను రాజుగా అభిషేకించడానికి, మతభ్రష్టులైన అహాబు కుటుంబంలో మగవాళ్లందర్నీ చంపమని చెప్పడానికి ప్రవక్తల శిష్యుల్లో ఒకరిని ఎలీషా పంపించాడు.—2 రాజు. 8:28; 9:1-10.

ఆ వ్యక్తి ఎందుకొచ్చాడో చెప్పమని తోటి అధికారులు అడిగినప్పుడు యెహూ చెప్పడానికి సంకోచించాడు. కానీ వాళ్లు బలవంతపెట్టినప్పుడు విషయమేమిటో చెప్పాడు. తర్వాత యెహూ, ఆయన సహచరులు కలిసి యెహోరాముకు వ్యతిరేకంగా కుట్రపన్నారు. (2 రాజు. 9:11-14) అహాబు ఇంటివాళ్ల పరిపాలనా పద్ధతి, యెజెబెలు చెడు ప్రభావం వాళ్లకు నచ్చలేదు కాబట్టి వాళ్లమీద కోపం పెంచుకున్నారని దీన్నిబట్టి తెలుస్తోంది. ఏదైతేనేం, యెహూ తన పనిని పూర్తి చేయడానికి ఏది శ్రేష్ఠమైన మార్గమో చాలా జాగ్రత్తగా ఆలోచించాడు.

యెహోరాము యుద్ధంలో గాయపడడం వల్ల కోలుకోవడానికి యెజ్రెయేలు పట్టణానికి వెళ్లాడు. తన పథకం పారాలంటే, దాని గురించి చిన్న మాట కూడా యెజ్రెయేలుకు చేరకూడదని యెహూకు తెలుసు. అందుకే, “ఈ పట్టణములో నుండి యెవనినైనను యెజ్రెయేలు ఊరికి తప్పించుకొని పోనియ్యకుము” అని ఆయన అన్నాడు. (2 రాజు. 9:14, 15) యెహోరాముకు నమ్మకంగా ఉన్న సైన్యాలు కొంతవరకైనా అడ్డుకుంటాయని యెహూ ఊహించివుంటాడు. ఆయన వాళ్లకు ఆ అవకాశం ఇవ్వకూడదనుకున్నాడు.

రథం మీద మెరుపు వేగంతో . . .

యెహూ హఠాత్తుగా దాడి చేయడానికి, రామోత్గిలాదు నుండి 72 కి.మీ. దూరంలోవున్న యెజ్రెయేలుకు రథం మీద వెళ్లాడు. యెహూ ఆ పట్టణానికి వేగంగా చేరుకుంటున్నప్పుడు కోట మీదున్న కావలివాడు, ‘యెహూతో కలిసి వస్తున్న సైన్యాన్ని’ చూశాడు. (2 రాజు. 9:17) యెహూ చేయబోయే పని అంత సులువైంది కాదు కాబట్టి ఆయన తన వెంట పెద్ద సైన్యాన్ని తీసుకెళ్లివుంటాడు.

ఆ రథాల్లో ఒకదాని మీద ధైర్యశాలి అయిన యెహూ ఉండవచ్చని కావలివాడు గమనించి, గట్టిగా ఇలా అరిచాడు: “అతడు వెఱ్ఱి తోలడము తోలుచున్నాడు.” (2 రాజు. 9:20) యెహూ మామూలుగానే అలా నడిపిస్తే, ప్రత్యేకంగా ఈ పనిని పూర్తిచేయడానికి ఇంకెంతో వేగంగా నడిపించివుంటాడు.

యెహూ తన దగ్గరకు వచ్చిన ఇద్దరు వార్తాహరులకు ఏమీ చెప్పకుండా, తమ రథాల మీదున్న రాజైన యెహోరామును, అతని మిత్రుడూ యూదా రాజూ అయిన అహజ్యాను కలిశాడు. ‘యెహూ సమాధానమా?’ అని యెహోరాము అడిగాడు. దానికి యెహూ కోపంతో, ‘నీ తల్లియైన యెజెబెలు జారత్వాలు, చిల్లంగితనాలు ఇంత అపరిమితమై ఉండగా సమాధానం ఎక్కడనుండి వస్తుంది?’ అన్నాడు. ఆయన మాటల్లోని విషయాన్ని పసిగట్టిన యెహోరాము వెంటనే పారిపోవడానికి ప్రయత్నించాడు. కానీ యెహూ ఎంతో వేగంగా అతణ్ణి వెంబడించాడు. యెహూ విల్లు ఎక్కుపెట్టి, యెహోరాము గుండెలో దూసుకుపోయేలా బాణం వదిలాడు, దాంతో అతను రథం మీదే కుప్పకూలి చనిపోయాడు. అహజ్యా అక్కడనుండి పారిపోయినా, యెహూ అతణ్ణి తరిమి పట్టుకుని చంపాడు.—2 రాజు. 9:22-24, 27.

అహాబు కుటుంబంలో తర్వాత చంపాల్సింది దుష్ట రాణి అయిన యెజెబెలును. యెహూ ఆమె గురించి మాట్లాడుతూ, ‘ఆ శాపగ్రస్తురాలు’ అని సరిగ్గానే అన్నాడు. యెహూ యెజ్రెయేలుకు వచ్చినప్పుడు, కోట కిటికీలో నుండి కిందకు చూస్తున్న ఆమె ఆయన కంటబడింది. ఆమెను అక్కడి నుండి కిందకు తోసివేయమని పరిచారకులకు యెహూ సూటిగా ఆజ్ఞాపిస్తాడు. ఇశ్రాయేలును భ్రష్టుపట్టించిన యెజెబెలును రథాలతో తొక్కించాడు. దుష్టుడైన అహాబు సంతతిలో మిగిలినవాళ్లను ఆ తర్వాత మట్టుపెట్టాడు.—2 రాజు. 9:30-34; 10:1-14.

హింస చెడ్డదే కానీ, ఆ రోజుల్లో తన తీర్పులు అమలుచేయడానికి యెహోవా తన సేవకులను ఉపయోగించుకున్నాడని మనం గ్రహించాలి. “యెహోరాము నొద్దకు అతడు [అహజ్యా] వచ్చుటచేత దేవునివలన అతనికి నాశము కలిగెను; ఎట్లనగా అతడు వచ్చినప్పుడు అహాబు సంతతివారిని నిర్మూలము చేయుటకై యెహోవా అభిషేకించిన నింషీ కుమారుడైన యెహూ మీదికి అతడు యెహోరాముతో కూడ పోయెను” అని లేఖనాలు చెబుతున్నాయి. (2 దిన. 22:7) యెహూ యెహోరాము శవాన్ని రథం నుండి నాబోతు భూభాగంలో పడేయమని ఆజ్ఞాపిస్తున్నప్పుడు, నాబోతును చంపినందుకు అహాబును శిక్షిస్తానని యెహోవా చెప్పిన మాట అప్పుడు నెరవేరిందని గ్రహించాడు. అంతేకాదు, ‘తన [దేవుని] సేవకులను హతము చేసినదానికి’ యెజెబెలుకు ‘ప్రతీకారం చేయమని’ యెహోవా యెహూకు ఆజ్ఞాపించాడు.—2 రాజు. 9:7, 25, 26; 1 రాజు. 21:17-19.

ఈ రోజుల్లో యెహోవా సేవకులెవరూ స్వచ్ఛారాధనను వ్యతిరేకించేవాళ్లతో శారీరకంగా పోరాడరు. ఎందుకంటే, “పగతీర్చుట నా పని” అని దేవుడు చెబుతున్నాడు. (హెబ్రీ. 10:30) కానీ, భ్రష్టుపట్టించే వ్యక్తుల నుండి సంఘాన్ని కాపాడాలంటే క్రైస్తవ పెద్దలు యెహూ చూపించిన ధైర్యం చూపించాలి. (1 కొరిం. 5:9-13) అయితే, బహిష్కరించబడిన వాళ్లతో సహవాసం చేయకూడదని సంఘంలోని సభ్యులందరూ గట్టిగా తీర్మానించుకోవాలి.—2 యోహా. 9-11.

యెహోవా పట్ల ఎలాంటి వ్యతిరేకతనూ యెహూ సహించలేదు

యెహూ నమ్మకస్థుడైన యెహోనాదాబుతో ఇలా అన్నాడు: “యెహోవాను గూర్చి నాకు కలిగిన ఆసక్తిని చూచుటకై నాతో కూడ రమ్ము.” ఆ మాటల్ని బట్టి తనకిచ్చిన పనిని యెహూ ఎందుకు చేస్తున్నాడో స్పష్టంగా తెలుస్తోంది. యెహోనాదాబు ఆ ఆహ్వానాన్ని స్వీకరించి యెహూ రథం ఎక్కి ఆయనతోపాటు సమరయకు వెళ్లాడు. అక్కడ యెహూ, “బయలునకు మ్రొక్కువారిని నాశనము చేయుటకై . . . కపటోపాయము చేసెను.”—2 రాజు. 10:15-17, 19.

బయలుకు “గొప్ప బలి” అర్పించబోతున్నానని యెహూ ఒక ప్రకటన చేశాడు. (2 రాజు. 10:18, 19) “ఈ సందర్భంలో, యెహూ పదాలను చాలా నేర్పుగా ఉపయోగించాడు” అని ఒక విద్వాంసుడు చెబుతున్నాడు. ఇక్కడ ఉపయోగించిన మాటకు “సాధారణంగా ‘బలి’ అనే అర్థమున్నా, అది మతభ్రష్టులను ‘వధించడం’ అనే భావంతో కూడా ఉపయోగించబడింది.” బయలు ఆరాధకులెవరూ తప్పించుకోకూడదని యెహూ అనుకున్నాడు, అందుకే ప్రత్యేకమైన దుస్తుల్లో వాళ్లందర్నీ బయలు గుడిలో సమకూర్చాడు. ‘దహనబలులు అర్పించడం పూర్తి అయినప్పుడు’ ఆయుధాలు పట్టుకున్న 80 మందితో బయలు ఆరాధకులను యెహూ చంపించాడు. ఆ తర్వాత బయలు గుడిని పడగొట్టించి, దాన్ని ఆరాధన కోసం పనికిరాని పెంటయిల్లుగా చేశాడు.—2 రాజు. 10:20-27.

నిజమే, యెహూ ఎంతోమందిని చంపాడు. కానీ యెజెబెలు, ఆమె కుటుంబం క్రూరమైన అధికారం నుండి ఇశ్రాయేలీయులను విడిపించిన ధైర్యవంతుడని లేఖనాలు ఆయనను వర్ణిస్తున్నాయి. ఇశ్రాయేలీయుల్లోని ఏ నాయకుడైనా ఈ పనిని పూర్తి చేయాలంటే ఆయనకు ధైర్యం, కృతనిశ్చయం, ఉత్సాహం ఉండాలి. ఒక బైబిలు డిక్షనరీ ఇలా చెబుతోంది: “అది కష్టమైన పని, దాన్ని ఎప్పుడూ జాగ్రత్తగా చేయాలి. అంత కఠినమైన చర్యలు తీసుకోకపోతే ఇశ్రాయేలు నుండి బయలు ఆరాధనను సమూలంగా నాశనం చేయగలిగే వారు కాదు.”

ఈ రోజుల్లోని పరిస్థితులను ఎదుర్కోవాలంటే క్రైస్తవులు యెహూ చూపించిన లక్షణాలనే చూపించాల్సి ఉంటుందని మీరూ ఒప్పుకుంటారు. ఉదాహరణకు, యెహోవా అసహ్యించుకునే ఎలాంటి పనైనా చేయాలనే శోధన ఎదురైనప్పుడు మనం ఏమి చేయాలి? ధైర్యంతో, ఉత్సాహంతో వెంటనే దాన్ని ఎదిరించాలి. దైవభక్తి విషయానికొస్తే యెహోవా పట్ల ఎలాంటి వ్యతిరేకతనూ మనం సహించకూడదు.

శ్రద్ధతో యెహోవా ధర్మశాస్త్రాన్ని అనుసరించండి

ఈ కథ ముగింపులో మనకు ఒక హెచ్చరిక ఉంది. యెహూ, “బేతేలు, దాను అను స్థలములందున్న బంగారు దూడలను అనుసరించుట మానలేదు.” (2 రాజు. 10:29) సత్యారాధన పట్ల అంత ఆసక్తి చూపించిన వ్యక్తి విగ్రహారాధనను ఎలా ఉండనిచ్చాడు?

ఇశ్రాయేలు రాజ్యం యూదా నుండి స్వతంత్రంగా ఉండాలంటే ఆ రెండు రాజ్యాలు మతపరమైన విషయాల్లో వేరుగా ఉండాలని యెహూ అనుకొని ఉండవచ్చు. అందుకే ఆయన, ఇశ్రాయేలు ముందు రాజుల్లాగే దూడ ఆరాధన కొనసాగడానికి అనుమతిస్తూ ఆ ప్రజలను వేరుగా ఉంచడానికి ప్రయత్నించాడు. కానీ, తనను రాజుగా చేసిన యెహోవా మీద యెహూకు నమ్మకం లేదని అది చూపిస్తుంది.

యెహూ ‘యెహోవా దృష్టికి న్యాయమైంది జరిగించి బాగుగా నెరవేర్చాడు.’ అందుకే దేవుడు ఆయనను మెచ్చుకున్నాడు. అయితే ఆ తర్వాత యెహూ, “ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా నియమించిన ధర్మశాస్త్రమును పూర్ణహృదయముతో అనుసరించుటకు శ్రద్ధాభక్తులు లేనివాడాయెను.” (2 రాజు. 10:30, 31) యెహూ ముందు చేసిన మంచి పనులన్నిటినీ చూస్తే ఆయన చేసిన ఈ పని మనకు ఆశ్చర్యాన్ని, బాధను కలిగిస్తుంది. అయితే దీనిలో మనకు ఒక పాఠం ఉంది. యెహోవాతో మనకున్న సంబంధాన్ని అస్సలు తేలిగ్గా తీసుకోకూడదు. దేవుని వాక్యాన్ని అధ్యయనం చేస్తూ, ధ్యానిస్తూ, మన పరలోక తండ్రితో మనసు విప్పి మాట్లాడుతూ ప్రతీరోజు ఆయనపట్ల యథార్థతను పెంచుకుంటూ ఉండాలి. కాబట్టి మనం ఎల్లప్పుడూ యెహోవా ధర్మశాస్త్రాన్ని పూర్ణహృదయంతో, చాలా జాగ్రత్తగా పాటిద్దాం.—1 కొరిం. 10:12.

[4వ పేజీలోని బాక్సు]

యెహూ గురించి చరిత్ర చెబుతుందా?

బైబిలు ప్రస్తావిస్తున్న వ్యక్తులు నిజంగా జీవించారా అని విమర్శకులు చాలాసార్లు అనుమానం వ్యక్తం చేశారు. యెహూ గురించిన ప్రస్తావన బైబిల్లోనేకాక ఇంకా ఎక్కడైనా ఉందా?

ప్రాచీన అష్షూరులోని కనీసం మూడు దస్తావేజులు, ఇశ్రాయేలు రాజైన యెహూ పేరును ప్రస్తావిస్తున్నాయి. యెహూ లేదా బహుశా ఆయన ప్రతినిధుల్లో ఒకరు అష్షూరు రాజైన షల్మనేసెరు IIIకు వంగి నమస్కరిస్తూ కప్పం చెల్లించారని వాటిలో ఒకటి పేర్కొంటోంది. అక్కడున్న శాసనం మీద ఇలా ఉంది: “ఒమ్రీ (Hu-um-ri ) కుమారుడైన యెహూ (Ia-ú-a) పంపించిన కప్పం; వెండి, బంగారం, బంగారంతో చేసిన ఒక సాప్లూ గిన్నె, సూదిమొనలాంటి అడుగు భాగమున్న బంగారు పాత్ర, బంగారు పానీయ పాత్ర, బంగారు బాల్చీలు, తగరం, రాజు కోసం రాజదండం, చెక్కతో చేసిన వస్తువులు ఆయన నాకు చెల్లించాడు.” యెహూ నిజంగా “ఒమ్రీ కుమారుడు” కాదు. కానీ ఒమ్రీకి మంచి పలుకుబడి ఉండడం వల్ల, ఆయన ఇశ్రాయేలు ముఖ్య పట్టణమైన సమరయను కట్టించడం వల్ల ఆయన తర్వాతి ఇశ్రాయేలు రాజులను సూచించడానికి ఈ పదం ఉపయోగించి ఉండవచ్చు.

యెహూ కప్పం చెల్లించాడని అష్షూరు రాజు చేసిన వాదనను రుజువు చేయలేం. అయినా ఆయన యెహూ పేరును మూడుసార్లు ప్రస్తావించాడు. ఒక పత్రం మీద, షల్మనేసెరు ప్రతిమ మీద, అష్షూరు రాజుల చరిత్రలో వాటిని చూడవచ్చు. బైబిల్లో ప్రస్తావించిన యెహూ నిజంగా జీవించాడని ఆ నివేదికలు రుజువు చేస్తున్నాయి.