అనారోగ్యంతో బాధపడుతున్నా మీ సంతోషాన్ని కాపాడుకోండి
అనారోగ్యంతో బాధపడుతున్నా మీ సంతోషాన్ని కాపాడుకోండి
ఉదయం నిద్ర లేవగానే ‘మళ్ళీ ఇంకో రోజు ఈ వేదనంతా అనుభవించాలా?’ అని మీరు అనుకునేవుంటారు. నొప్పీ బాధా భరించలేక, ‘ఈ బాధలన్నీ అనుభవించడం కన్నా చనిపోవడం మేలు’ అని యోబుకు అనిపించినట్లే మీకూ అనిపిస్తుండవచ్చు. (యోబు 7:15, ద న్యూ ఇంగ్లీష్ బైబిల్) అలాంటి బాధాకరమైన పరిస్థితి ఏళ్ళ తరబడి కొనసాగితే అప్పుడెలా?
మెఫీబోషెతు పరిస్థితి అలాగే ఉండేది, ఆయన దావీదు రాజు స్నేహితుడైన యోనాతాను కుమారుడు. మెఫీబోషెతుకు అయిదేళ్ళు ఉన్నప్పుడు ‘పడిపోయి, కుంటివాడైపోయాడు.’ (2 సమూ. 4:4) ఆయనకున్న ఆ శారీరక లోపానికి తోడు, రాజుకు ద్రోహం చేశాడనే అపనింద ఆయన మీద పడడం, ఆయనకు రావలసిన ఆస్తి రాకపోవడం వంటి వాటివల్ల ఆయన ఎంతో కృంగిపోయివుంటాడు. అంగవైకల్యం ఉన్నా, అపనిందకు గురైనా, నిరాశ కలిగినా ఆయన తన ఆనందాన్ని కోల్పోలేదు. అలాంటి పరిస్థితుల్లో ఉన్నవాళ్ళకు ఆయన ఆదర్శంగా ఉన్నాడు.—2 సమూ. 9:6-10; 16:1-4; 19:24-30.
ఈ విషయంలో అపొస్తలుడైన పౌలు కూడా ఆదర్శంగా ఉన్నాడు. తాను పోరాడుతున్న ఒకానొక బలహీనత గురించి చెబుతూ తనకు “శరీరములో ఒక ముల్లు” ఉందని ఆయన ఒకసారి అన్నాడు. (2 కొరిం. 12:7) ఆయన ప్రస్తావించిన ఆ ముల్లు బహుశా ఎంతోకాలంగా ఉన్న వైకల్యం కావచ్చు, లేదా తాను అపొస్తలుడిగా ఉండడాన్ని ప్రశ్నించిన ప్రజలు కావచ్చు. ఆ సమస్య ఏదైనప్పటికీ అది ఆయన జీవితంలో అలాగే కొనసాగింది, దానివల్ల వచ్చే నొప్పిని లేదా బాధను ఆయన అనుభవించాల్సి వచ్చింది.—2 కొరిం. 12:9, 10.
ఈ రోజుల్లో దేవుని సేవకులు కొంతమంది, ఆరోగ్యాన్ని క్షీణింపజేసే దీర్ఘకాల వ్యాధులతో, మానసిక ఒత్తిడితో బాధపడుతున్నారు. మాగ్దాలేనాకు 18 ఏళ్ళున్నప్పుడు ఆమెకు సిస్టమిక్ లూపస్ ఎరిథమెటొసస్ అనే వ్యాధి ఉందని నిర్ధారణ అయ్యింది. ఈ వ్యాధి వచ్చిన వాళ్ళ వ్యాధినిరోధక వ్యవస్థే వాళ్ళ శరీర అవయవాలపై దాడి చేస్తుంది. ఆమె ఇలా అంటోంది, “నాకు చాలా భయమేసింది. సమయం గడిచేకొద్దీ నా పరిస్థితి ఇంకా ఘోరంగా తయారైంది, జీర్ణవ్యవస్థ సరిగా పనిచేసేది కాదు, నోటిలో పుళ్ళు వచ్చేవి, థైరాయిడ్ సమస్యలు కూడా వచ్చాయి.” ఈజాబెలా అనే సహోదరి మరోలాంటి సమస్యతో బాధపడుతోంది, ఆమెకున్న సమస్య బయటకు కనిపించేది కాదు. ఆమె ఇలా చెబుతోంది, “చిన్నప్పటి నుండి నేను డిప్రెషన్‌తో బాధపడుతున్నాను. అనవసరమైన భయాందోళనలకు గురయ్యేదాన్ని, ఊపిరి తీసుకోవడం కష్టమయ్యేది, కడుపు పట్టేసినట్లయ్యేది. నాకు ఎప్పుడూ నిస్సత్తువగానే ఉండేది.”
మీ పరిమితులను అర్థంచేసుకోండి
అనారోగ్యం వల్ల జీవితం అస్తవ్యస్తమౌతుంది. అలాంటప్పుడు సమయం తీసుకొని పరిస్థితిని నిజాయితీగా పరిశీలించుకోవడం మంచిది. కొత్తగా ఏర్పడిన పరిమితులను అంగీకరించడం అంత సులభం కాకపోవచ్చు. మాగ్దాలేనా ఇలా చెబుతోంది, “నాకు వచ్చిన వ్యాధి దినదినానికి ముదిరే వ్యాధి. కొన్నిసార్లయితే నాకు మంచం మీద నుండి లేచే శక్తి కూడా ఉండదు. మరికాసేపట్లో నా పరిస్థితి ఎలా ఉంటుందో చెప్పడం కష్టం కాబట్టి దేన్నీ ముందుగా ప్రణాళిక వేసుకోలేను. యెహోవా సేవలో నేను ఇంతకు ముందు చేసినంతగా ఇప్పుడు చేయలేకపోవడమే నాకు ఎక్కువ బాధ కలిగిస్తుంది.”
జిబిగ్నీవ్ ఇలా చెబుతున్నాడు, “సంవత్సరాలు గడిచేకొద్దీ కీళ్ళనొప్పుల వల్ల నాలో ఏమాత్రం శక్తి ఉండడం లేదు. నా
కీళ్ళు ఒకదాని తర్వాత ఒకటి అరిగిపోతున్నాయి. నొప్పి ఎక్కువగా ఉన్నప్పుడు చిన్నచిన్న పనులు కూడా చేయలేను. దాంతో నేనెంతో కృంగిపోతున్నాను.”బార్బారా పరిస్థితి గురించి ఆలోచించండి. కొన్ని సంవత్సరాల క్రితం, ఆమె మెదడులో కంతి పెరుగుతున్నట్లు తేలింది. తన అనారోగ్యం గురించి ఆమె ఇలా చెప్పింది, “నా శరీరంలో ఒక్కసారిగా ఎన్నో మార్పులు జరిగాయి. నా శక్తి తగ్గిపోతున్నట్లుగా అనిపిస్తుంటుంది, తరచుగా తలనొప్పి వస్తుంటుంది, ఏకాగ్రత నిలపడం కష్టంగా ఉంటుంది. కొత్తగా ఏర్పడిన పరిమితుల వల్ల, అన్ని విషయాల్లో ఇంతకు ముందు చేసినంతగా ఇప్పుడు చేయగలనో లేదో పరిశీలించుకోవాల్సి వచ్చింది.”
పైన చెప్పిన వాళ్ళందరూ యెహోవాకు సమర్పించుకున్న సేవకులే. వాళ్ళకు దేవుని చిత్తం చేయడమే ప్రాముఖ్యం. వాళ్ళు దేవునిపై పూర్తి విశ్వాసముంచి, ఆయన చేసే సహాయం నుండి ప్రయోజనం పొందుతున్నారు.—సామె. 3:5, 6.
యెహోవా ఎలా సహాయం చేస్తాడు?
ఎవరికైనా ఏదైనా ఆరోగ్య సమస్య ఉంటే అది దేవుని అనుగ్రహం లేకపోవడం వల్ల వచ్చిందని అనుకోకూడదు. (విలా. 3:33) యోబు ‘యథార్థవర్తనుడు, న్యాయవంతుడు’ అయినప్పటికీ ఆయన ఎలాంటి పరిస్థితులు ఎదుర్కోవాల్సి వచ్చిందో ఆలోచించండి. (యోబు 1:8) దేవుడు మనకు ఏదైనా కీడు జరిగేలా చేసి మనల్ని శోధించడు. (యాకో. 1:13) దీర్ఘకాలిక, మానసిక రోగాలతో సహా అన్ని రకాల ఆరోగ్య సమస్యలు మన మొదటి తల్లిదండ్రులైన ఆదాముహవ్వల నుండి సంక్రమించినవే.—రోమా. 5:12.
అయినా యెహోవా, యేసు నీతిమంతులకు తప్పకుండా సహాయం చేస్తారు. (కీర్త. 34:15) ముఖ్యంగా మన జీవితంలోని కష్టమైన పరిస్థితుల్లో దేవుడు ‘మన ఆశ్రయం, మన కోట’ అని గ్రహిస్తాం. (కీర్త. 91:2) మరైతే, సులభంగా నయంకాని ఆరోగ్య సమస్యలతో పోరాడుతున్నప్పుడు సంతోషాన్ని ఎలా కాపాడుకోవచ్చు?
ప్రార్థన: పూర్వకాలంలో విశ్వసనీయులైన యెహోవా సేవకులు చేసినట్లే మీరు కూడా ప్రార్థన చేయడం ద్వారా పరలోక తండ్రిపై మీ భారం వేయవచ్చు. (కీర్త. 55:22) అలా చేస్తే ‘సమస్త జ్ఞానానికి మించిన దేవుని సమాధానం’ మీకు దొరుకుతుంది. ఆ సమాధానం, ‘మీ హృదయాలకు, మీ తలంపులకు కావలివుంటుంది.’ (ఫిలి. 4:6, 7) దేవునికి ప్రార్థిస్తూ ఆయనపై ఆధారపడడం ద్వారా, మాగ్దాలేనా తనను క్షీణింపజేస్తున్న వ్యాధిని తట్టుకోగలుగుతోంది. “నా మనసులో ఉన్నవన్నీ యెహోవాకు చెప్పుకోవడం ద్వారా నాకు ఎంతో ఉపశమనం దొరుకుతుంది, నేను మళ్ళీ సంతోషంగా ఉండగలుగుతాను. ప్రతీరోజు దేవునిపై ఆధారపడడమంటే ఏమిటో నేను ఇప్పుడు నిజంగా అర్థం చేసుకోగలుగుతున్నాను” అని ఆమె చెబుతోంది.—2 కొరిం. 1:3, 4.
మీ ప్రార్థనలకు జవాబుగా దేవుడు తన పరిశుద్ధాత్మ ద్వారా, తన వాక్యం ద్వారా, క్రైస్తవ సహోదర సహోదరీల ద్వారా మీకు బలాన్నిస్తాడు. దేవుడు అద్భుతంగా మీ జబ్బు నయం చేయాలని మీరు ఆశించరు. కానీ బాధలన్నిటినీ తట్టుకోవడానికి కావాల్సిన జ్ఞానం, శక్తి దేవుడు ఇస్తాడని మీరు ఎదురుచూడవచ్చు. (సామె. 2:7) దేవుడు మీకు ‘అధిక బలాన్నిచ్చి’ మిమ్మల్ని శక్తిమంతుల్ని చేస్తాడు.—2 కొరిం. 4:7.
కుటుంబం: ఇంట్లో ప్రేమపూర్వక వాతావరణం ఉంటే అది మీకు వ్యాధిని తట్టుకొనే బలాన్నిస్తుంది. అయితే మీ కుటుంబంలోని వాళ్ళు కూడా బాధపడుతుంటారని గుర్తుంచుకోండి. వాళ్ళు కూడా మీలాగే నిస్సహాయ స్థితిలో ఉంటారు. అయినా కష్టకాలాల్లో కూడా వాళ్ళు మీకు అండగా ఉంటారు. కుటుంబమంతా కలిసి ప్రార్థన చేస్తే మనశ్శాంతి లభిస్తుంది.—సామె. 14:30.
బార్బారా తన సొంత కూతురి గురించి, సంఘంలోని ఇతర యౌవన సహోదరీల గురించి ఇలా అంటోంది, “పరిచర్యలో పాల్గొనేందుకు వాళ్ళు నాకు సహాయం చేస్తారు. వాళ్ళ ఉత్సాహం చూస్తే నాకు ఎంతో సంతోషం కలుగుతుంది.” జిబిగ్నీవ్ తన భార్య సహాయాన్ని ఎంతో అమూల్యమైనదిగా ఎంచుతున్నాడు. “ఇంట్లో దాదాపు అన్ని పనులూ తనే చేసుకుంటుంది. నేను బట్టలు వేసుకోవడానికి సహాయం చేస్తుంది. కూటాలకు, పరిచర్యకు వెళ్ళేటప్పుడు నా బ్యాగు తనే మోస్తుంది” అని ఆయన చెబుతున్నాడు.
తోటి విశ్వాసులు: మనం తోటి విశ్వాసుల మధ్య ఉన్నప్పుడు ఎంతో ప్రోత్సాహాన్ని, ఓదార్పును పొందుతాం. కానీ అనారోగ్యం వల్ల మనం సంఘ కూటాలకు హాజరవలేకపోతుంటే అప్పుడెలా? “సంఘ కూటాల నుండి నేను ప్రయోజనం పొందేలా సంఘం నాకు వాటి ఆడియో రికార్డింగులను పంపిస్తుంది. నాకు ఇంకా ఏదైనా సహాయం అవసరమేమో తెలుసుకోవడానికి తోటి విశ్వాసులు తరచూ ఫోను చేస్తారు. అంతేకాక నన్ను ప్రోత్సహించడానికి ఉత్తరాలు రాసి పంపిస్తారు. వాళ్ళు నన్ను గుర్తుపెట్టుకొని, నా బాగోగుల గురించి శ్రద్ధ చూపిస్తున్నందు వల్ల నేను తట్టుకోగలుగుతున్నాను” అని మాగ్దాలేనా చెబుతోంది.
డిప్రెషన్‌తో బాధపడుతున్న ఈజాబెలా ఇలా చెబుతోంది, “సంఘంలో నా బాధ విని, నన్ను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించే ‘తల్లులు,’ ‘తండ్రులు’ చాలామంది ఉన్నారు. సంఘమే నా కుటుంబం. వాళ్ళ మధ్య ఉంటే నాకు ఎంతో మనశ్శాంతి, ఆనందం లభిస్తాయి.”
ఎన్నోరకాల బాధలు అనుభవిస్తున్నవాళ్ళు సంఘంలోని సహోదరసహోదరీలకు దూరంగా ఉండే బదులు వాళ్ళతో సామె. 18:1) అలా వాళ్ళు ఇతరులకు ఎంతో ప్రోత్సాహాన్నిస్తారు. మన అవసరాల గురించి సహోదరసహోదరీలతో చెప్పడానికి మనం కాస్త తటపటాయిస్తుండవచ్చు. కానీ దాపరికం లేకుండా మన అవసరాల గురించి మన తోటి విశ్వాసులతో చెబితే వాళ్ళు చాలా సంతోషిస్తారు. అలా “నిష్కపటమైన సహోదరప్రేమ” చూపించడానికి వాళ్ళకు మంచి అవకాశం దొరుకుతుంది. (1 పేతు. 1:22) సంఘ కూటాలకు తీసుకువెళ్ళమని అడగవచ్చు, కలిసి పరిచర్య చేద్దామని కోరవచ్చు లేదా కష్ట సుఖాలు చెప్పుకోవాలని ఉందని తెలియజేయవచ్చు. అయితే సహాయం చేయాల్సిందేనని పట్టుబట్టకుండా వాళ్ళ సహాయానికి కృతజ్ఞత చూపించాలి.
సహవాసం చేయడాన్ని అమూల్యమైనదిగా ఎంచుతారు. (సానుకూలంగా ఆలోచించండి: దీర్ఘకాల వ్యాధి అనుభవిస్తున్నప్పుడు కూడా ఆనందంగా ఉండడమనేది మీ చేతుల్లోనే ఉంటుంది. నిరాశానిస్పృహల వల్ల ప్రతికూల ఆలోచనలు కలుగుతాయి. బైబిల్లో ఇలా ఉంది, “నరుని ఆత్మ వాని వ్యాధి నోర్చును. నలిగిన హృదయమును ఎవడు సహింపగలడు?”—సామె. 18:14.
మాగ్దాలేనా ఇలా చెబుతోంది, “నా సమస్యల గురించే ఆలోచించకుండా ఉండడానికి ఎంతో ప్రయత్నిస్తాను. నా ఆరోగ్యం కాస్త మెరుగ్గా ఉన్న రోజుల్లో సంతోషంగా గడపడానికి ప్రయత్నిస్తాను. దీర్ఘకాల వ్యాధులు ఉన్నా నమ్మకంగా కొనసాగిన వాళ్ళ జీవిత అనుభవాలను చదివి ప్రోత్సాహం పొందుతాను.” ఈజాబెలా కూడా, యెహోవా తనను ప్రేమిస్తున్నాడని, అమూల్యమైన వ్యక్తిగా పరిగణిస్తున్నాడని గుర్తుకు వచ్చినప్పుడల్లా బలాన్ని పొందుతుంది. “తన సేవలో నేను చేసిన దాన్ని యెహోవా విలువైనదిగా ఎంచుతాడని నాకు తెలుసు, నా జీవితానికి అది చాలు. నాకున్న నిరీక్షణ వల్ల మంచి భవిష్యత్తు కోసం వేచిచూస్తున్నాను” అని ఆమె చెబుతోంది.
జిబిగ్నీవ్ ఇలా చెబుతున్నాడు, “నా ఆరోగ్య సమస్య వల్ల నేను వినయ విధేయతలే కాక జ్ఞానవంతంగా నడుచుకోవడం, సరైన నిర్ణయాలు తీసుకోవడం, మనస్ఫూర్తిగా క్షమించడం నేర్చుకున్నాను. దయనీయ స్థితిలో ఉన్నానని బాధపడకుండా సంతోషంగా యెహోవా సేవ చేయడం నేర్చుకున్నాను. ఆధ్యాత్మికంగా ఇంకా ప్రగతి సాధిస్తూ ఉండాలనే ప్రోత్సాహాన్ని పొందాను.”
మీ ఓర్పును యెహోవా జాగ్రత్తగా గమనిస్తున్నాడని గుర్తుంచుకోండి. మీ బాధను అర్థం చేసుకొని, ఆయన మీపై కనికరంతో శ్రద్ధ చూపిస్తాడు. మీరు చేసిన సేవను, “తన నామమునుబట్టి చూపిన ప్రేమను” ఆయన మరచిపోడు. (హెబ్రీ. 6:10) “నిన్ను ఏమాత్రమును విడువను, నిన్ను ఎన్నడును ఎడబాయను” అని ఆయన తనపట్ల భయభక్తులు గల వాళ్ళందరికీ చేసిన వాగ్దానాన్ని గుర్తుంచుకోండి.—హెబ్రీ. 13:5.
ఎప్పుడైనా మీకు నిరాశగా అనిపిస్తే, నూతనలోకంలో జీవించే అద్భుతమైన నిరీక్షణ గురించి ఆలోచించండి. దేవుడు తన రాజ్యం ద్వారా ఈ భూమ్మీదకు తీసుకువచ్చే ఆశీర్వాదాలను కన్నులారా చూసే సమయం చాలా దగ్గర్లో ఉంది.
[28, 29 పేజీల్లోని బాక్సు/చిత్రాలు]
ఎంతోకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నప్పటికీ వాళ్ళు ప్రకటిస్తున్నారు
“ఇప్పుడు నేను నా సొంతగా ఎక్కడికీ వెళ్ళలేను, అందుకే నా భార్యతో గానీ, సంఘంలోని సహోదర సహోదరీలతో గానీ నేను పరిచర్యకు వెళ్తాను. బైబిలు లేఖనాలు బట్టీ పడతాను, సాహిత్యాలు ఇస్తున్నప్పుడు ఏమి మాట్లాడాలో గుర్తుపెట్టుకుంటాను.”—యెజీ, దృష్టి లోపంతో బాధపడుతున్నాడు.
“నేను టెలిఫోను సాక్ష్యమివ్వడమే కాక ఆసక్తిగల కొంతమందికి క్రమంగా ఉత్తరాలు రాస్తుంటాను. హాస్పిటల్‌లో ఉన్నప్పుడు నా మంచం దగ్గర బైబిలు, ప్రచురణలు ఉంచుకుంటాను. దానివల్ల ఎంతోమందికి సాక్ష్యమివ్వగలిగాను.”—మాగ్దాలేనా, సిస్టమిక్ లూపస్ ఎరిథమెటొసస్ అనే వ్యాధితో బాధపడుతోంది.
“ఇంటింటి పరిచర్యకు వెళ్ళడమంటే నాకు చాలా ఇష్టం, ఒకవేళ ఒంట్లో బాలేక అలా వెళ్ళలేకపోతే టెలిఫోనులో సాక్ష్యమిస్తాను.”—ఈజాబెలా, డిప్రెషన్‌తో బాధపడుతోంది.
“పునర్దర్శనాలు చేయడం, బైబిలు అధ్యయనాలు నిర్వహించడం నాకు చాలా ఇష్టం. నా ఆరోగ్యం కాస్త మెరుగ్గా ఉన్న రోజుల్లో ఇంటింటి పరిచర్యకు వెళ్ళడానికి ఇష్టపడతాను.”—బార్బారా, మెదడులో కంతితో బాధపడుతోంది.
“నేను పరిచర్యకు వెళ్ళేటప్పుడు చాలా తేలికగా ఉండే బ్యాగు తీసుకువెళ్తాను. నేను నిలబడగలిగినంతసేపే పరిచర్య చేస్తాను.”—జిబిగ్నీవ్, కీళ్ళ నొప్పులతో బాధపడుతున్నాడు.
[30వ పేజీలోని చిత్రం]
పిల్లలు, పెద్దవాళ్ళు ఇతరులను ప్రోత్సహించవచ్చు