పరిశుద్ధాత్మతో నడిపించబడిన పూర్వకాల విశ్వాసులు
పరిశుద్ధాత్మతో నడిపించబడిన పూర్వకాల విశ్వాసులు
“ప్రభువగు యెహోవాయు ఆయన ఆత్మయు నన్ను పంపెను.”—యెష. 48:16.
1, 2. విశ్వాసం చూపించాలంటే మనకేమి అవసరం? పూర్వకాలంలోని విశ్వాసుల గురించి తెలుసుకుంటే మనం ఏ ప్రోత్సాహాన్ని పొందుతాం?
హేబెలు కాలం నుండి ఎంతోమంది విశ్వాసం చూపించినప్పటికీ, “విశ్వాసము అందరికీ లేదు” అని బైబిలు చెబుతోంది. (2 థెస్స. 3:2) ఇంతకీ ఈ లక్షణం ఎలా కలుగుతుంది? ఒక వ్యక్తి విశ్వాసం చూపించడానికి సహాయం చేసేదేమిటి? చాలామట్టుకు, దేవుని వాక్యం నుండి విన్నవాటి వల్లే విశ్వాసం కలుగుతుంది. (రోమా. 10:17) విశ్వాసం ఆత్మఫలంలోని లక్షణాల్లో ఒకటి. (గల. 5:22, 23) కాబట్టి, మనకు పరిశుద్ధాత్మ సహాయం ఉంటే బలమైన విశ్వాసం చూపించగలుగుతాం.
2 పూర్వకాలంలో విశ్వాసంగల స్త్రీపురుషులుగా పేరుగాంచిన వాళ్లకు పుట్టుకతోనే విశ్వాసం అనే లక్షణం ఉందనుకుంటే పొరబడినట్లే. బైబిల్లో మంచి ఉదాహరణలుగా ప్రస్తావించబడిన వ్యక్తులు కూడా ‘మనలాంటి భావాలు’ కలిగిన ప్రజలే. (యాకో. 5:17) వాళ్లకు కూడా సందేహాలు, భయాలు, బలహీనతలు ఉండేవి కానీ, వాటిని ఎదుర్కోవడానికి వాళ్లు పరిశుద్ధాత్మ చేత ‘బలపరచబడ్డారు.’ (హెబ్రీ. 11:34) వాళ్లపై యెహోవా ఆత్మ ఎలా పని చేసిందో తెలుసుకుంటే, మన విశ్వాసాన్ని బలహీనపర్చే పరిస్థితులు ఉన్న ఈ రోజుల్లో మనం విశ్వాసులుగా కొనసాగాలన్న ప్రోత్సాహాన్ని పొందుతాం.
దేవుని ఆత్మ మోషేకు శక్తినిచ్చింది
3-5. (ఎ) మోషే పరిశుద్ధాత్మ సహాయంతో పనిచేశాడని మనకు ఎలా తెలుసు? (బి) యెహోవా తన ఆత్మను ఇవ్వడం గురించి మోషే ఉదాహరణ నుండి మనమేమి నేర్చుకోవచ్చు?
3 మోషే తన సమకాలీనులందరిలో “మిక్కిలి సాత్వికుడు.” (సంఖ్యా. 12:3) సాత్వికుడైన ఈ సేవకునికి ఇశ్రాయేలు జనాంగాన్ని చూసుకునే బరువైన బాధ్యత అప్పగించబడింది. దేవుని పరిశుద్ధాత్మ సహాయంతో మోషే ప్రవచించాడు, న్యాయం తీర్చాడు, బైబిలు పుస్తకాలు రాశాడు, ఇశ్రాయేలీయులను నడిపించాడు, అద్భుతాలు చేశాడు. (యెషయా 63:11-14 చదవండి.) కానీ ఒక సమయంలో ఆయన, తనపై మోయలేని భారం ఉందని వాపోయాడు. (సంఖ్యా. 11:14, 15) కాబట్టి, యెహోవా మోషేకు ఇచ్చిన “ఆత్మలో” కొంత తీసి, ఆయన భారాన్ని తగ్గించేందుకు సహాయం చేసేలా దాన్ని 70 మంది ఇతరులకు ఇచ్చాడు. (సంఖ్యా. 11:16, 17) తనపై మోయలేని భారం ఉన్నట్లు మోషేకు అనిపించినా నిజానికి ఆయన సొంతగా ఆ భారాన్ని మోయలేదు. ఆయనకు సహాయం చేయడానికి నియమించబడిన 70 మంది ఇతరులు కూడా తమ సొంత శక్తితో దాన్ని మోయలేదు.
4 మోషే తన బాధ్యతను నిర్వర్తించడానికి అవసరమైనంత పరిశుద్ధాత్మను దేవుడు ఆయనకు ఇచ్చాడు. పై పేరాలో ప్రస్తావించబడిన మార్పు తర్వాత మోషే దగ్గర పరిశుద్ధాత్మ తక్కువైపోలేదు, ఆ 70 మందికి ఎక్కువైపోలేదు. మోషే దగ్గర ఇంకా కావాల్సినంత పరిశుద్ధాత్మ ఉంది. మన విషయంలో కూడా అంతే, మన పరిస్థితులను బట్టి మనకు కావాల్సినంత పరిశుద్ధాత్మ శక్తిని యెహోవా ఇస్తాడు. ఆయన తన ఆత్మను కొలిచి ఇవ్వడు కానీ ధారాళంగా ఇస్తాడు.—యోహా. 1:16; 3:33, 34.
5 మీరు కష్టాలు అనుభవిస్తున్నారా? బాధ్యతలు పెరిగిపోయి సమయం సరిపోవడం లేదనిపిస్తోందా? పెరుగుతున్న ఖర్చుల మధ్య లేదా ఆరోగ్యం గురించిన చింతల మధ్య నెట్టుకొస్తూ మీ కుటుంబ ఆధ్యాత్మిక, భౌతిక అవసరాలు తీర్చడానికి కృషి చేస్తున్నారా? సంఘంలో మీరు బరువైన బాధ్యతలు మోస్తున్నారా? యెహోవా తన శక్తిని ఉపయోగించి ఎలాంటి పరిస్థితిలోనైనా మీకు కావాల్సినంత బలాన్ని ఇవ్వగలడనే నమ్మకాన్ని కలిగివుండండి.—రోమా. 15:13.
పరిశుద్ధాత్మ వల్ల బెసలేలు సమర్థుడయ్యాడు
6-8. (ఎ) ఏ పనులు చేయడానికి దేవుని ఆత్మ బెసలేలు అహోలీయాబులను సమర్థుల్ని చేసింది? (బి) వాళ్లిద్దరికీ పరిశుద్ధాత్మ నడిపింపు ఉందని మనకెలా తెలుసు? (సి) ప్రత్యేకంగా బెసలేలు అనుభవం మనకెందుకు ప్రోత్సాహాన్నిస్తుంది?
6 మోషే సమకాలీనుడైన బెసలేలు ఉదాహరణను పరిశీలిస్తే దేవుని పరిశుద్ధాత్మ ఇంకా ఏయే విధాలుగా పనిచేస్తుందో తెలుసుకోవచ్చు. (నిర్గమకాండము 35:30-35 చదవండి.) గుడారానికి అవసరమైన వస్తువులను తయారుచేసే విషయంలో నాయకత్వం వహించే బాధ్యత బెసలేలుకు అప్పగించబడింది. ఈ పెద్ద పని చేపట్టే ముందు ఆయనకు అలాంటి పనిలో నైపుణ్యం ఉందా? ఉందేమో. కానీ, ఈ పనిని చేపట్టడానికి ముందు ఆయన ఐగుప్తీయుల కోసం ఇటుకలు తయారుచేసే పని చేసివుంటాడు. (నిర్గ. 1:13, 14) ఇంతకీ గుడారానికి సంబంధించి తనకు అప్పగించబడిన పనిని ఆయన ఎలా చేయగలిగాడు? ‘విచిత్రమైన పనులన్నిటిని చేయుటకు ప్రజ్ఞ వివేక జ్ఞానములు కలుగునట్లు’ యెహోవా బెసలేలులో తన ఆత్మను నింపాడు. అంతకుముందు బెసలేలుకు ఉన్న సామర్థ్యం పరిశుద్ధాత్మ శక్తి వల్ల మరింత పెరిగింది. అహోలీయాబుకు కూడా యెహోవా తన ఆత్మను ఇచ్చాడు. వాళ్లిద్దరూ పనిని చాలా బాగా నేర్చుకొని ఉంటారు, అందుకే వాళ్లు తమకు అప్పగించబడిన పనుల్ని నిర్వర్తించడమే కాక ఏమి చేయాలో ఇతరులకు కూడా నేర్పించారు. ఇతరులకు నేర్పించే సామర్థ్యాన్ని యెహోవాయే వాళ్లకు ఇచ్చాడు.
7 బెసలేలు, అహోలీయాబుల మీద యెహోవా ఆత్మ పనిచేసిందనడానికి మరో రుజువు ఏమిటంటే, వాళ్లు తయారు చేసినవి ఎంతోకాలంపాటు అంటే దాదాపు 500 సంవత్సరాల తర్వాత కూడా ఉపయోగంలో ఉన్నాయి. (2 దిన. 1:2-6) ఆధునిక కాలంలో ప్రజలు ఏదైనా వస్తువును తయారు చేశారంటే, దానికి ఘనత అంతా తమకే రావాలని ఆశిస్తారు. కానీ బెసలేలు, అహోలీయాబులు అలా అనుకోలేదు. వాళ్లు సాధించినవాటికి ఘనత అంతా యెహోవాకే వెళ్లింది.—నిర్గ. 36:1, 2.
8 ఈ రోజుల్లో, ప్రత్యేకమైన నైపుణ్యాలు అవసరమైన ఎన్నో పెద్ద పనులు చేపట్టాల్సిరావచ్చు. ఉదాహరణకు నిర్మాణ పని, ముద్రణా పని, సమావేశాలకు సంబంధించిన ఏర్పాట్లు చేయడం, విపత్తులు వచ్చినప్పుడు సహాయక చర్యలు చేపట్టడం, రక్తం ఉపయోగానికి సంబంధించిన విషయాల్లో లేఖనాధారమైన మన నమ్మకాల గురించి వైద్యులతో, ఆసుపత్రి సిబ్బందితో మాట్లాడడం వంటి ఎన్నో పనులు చేయాల్సి రావచ్చు. కొన్నిసార్లు ఈ పనులను నిపుణులు చేస్తారు కానీ ఎక్కువశాతం, ఆ పనులు చేయడంలో అంతగా నైపుణ్యం లేని స్వచ్ఛంద సేవకులే చేస్తుంటారు. యెహోవా ఇచ్చే పరిశుద్ధాత్మ వల్ల వాళ్ల ప్రయత్నాలు సఫలమౌతాయి. వేరేవాళ్లకు ఉన్నన్ని అర్హతలు మీకు లేవని అనుకుంటూ, మీరెప్పుడైనా యెహోవా సేవలో ఇవ్వబడిన నియామకం చేపట్టకుండా వెనకడుగు వేశారా? యెహోవా ఆత్మ మీ జ్ఞానాన్ని, సామర్థ్యాలను పెంచి ఆయన ఇచ్చిన ఏ నియామకాన్నైనా పూర్తిచేయడానికి మీకు సహాయం చేస్తుంది.
దేవుని ఆత్మ సహాయంతో యెహోషువ విజయం సాధించాడు
9. ఐగుప్తు నుండి విడుదలై వచ్చిన తర్వాత ఇశ్రాయేలీయులకు ఎలాంటి పరిస్థితి ఎదురైంది? అప్పుడు ఏ ప్రశ్న తలెత్తింది?
9 మోషే, బెసలేలుల సమకాలీనుడైన మరో వ్యక్తికి కూడా దేవుని ఆత్మ సహాయం చేసింది. ఐగుప్తు నుండి విడుదలై వచ్చిన కొంతకాలానికే దేవుని ప్రజలపై అమాలేకీయులు దాడి చేశారు. ఆ సమయంలో ఇశ్రాయేలీయులు వాళ్లతో యుద్ధం చేయాల్సి వచ్చింది. యుద్ధ రంగంలో అసలేమాత్రం అనుభవం లేకపోయినా ఇశ్రాయేలీయులు మొట్టమొదటిసారిగా యుద్ధంలో పాల్గొనాల్సి వచ్చింది. (నిర్గ. 13:17; 17:8) అప్పుడు ఎవరో ఒకరు సైన్యాన్ని నడిపించాల్సిన అవసరం ఏర్పడింది. మరి ఎవరు నడిపించారు?
10. యెహోషువ నాయకత్వంలో ఇశ్రాయేలీయులు ఎందుకు విజయం సాధించగలిగారు?
10 దేవుడు యెహోషువను ఎంచుకున్నాడు. ఆ పని చేపట్టేందుకు తనకున్న అర్హతలు ఏమిటో చెప్పాల్సి వస్తే ఆయనేమి చెబుతాడు? బానిసననా? ఇటుకలు తయారు చేయడానికి గడ్డిని సిద్ధం చేసేవాణ్ణనా? మన్నా ఏరుకునేవాణ్ణనా? నిజమే, యెహోషువవాళ్ల తాతయ్య ఎలీషామా ఎఫ్రాయిము గోత్రానికి పెద్ద, బహుశా ఆయన 1,08,100 మంది ఉన్న సైన్యానికి నాయకుడై ఉండవచ్చు. (సంఖ్యా. 2:18, 24; 1 దిన. 7:26, 27) అయితే, శత్రువులను నాశనం చేయడానికి సైన్యాన్ని నడిపించేలా ఎలీషామాను గానీ ఆయన కుమారుడైన నూనును గానీ ఎన్నుకోకుండా, యెహోషువనే ఎన్నుకోమని యెహోవా మోషేకు చెప్పాడు. యుద్ధం ఒక రోజంతా సాగింది. యెహోషువ యెహోవాకు సంపూర్ణ విధేయత చూపించినందుకు, యెహోవా ఇచ్చిన పరిశుద్ధాత్మ శక్తి విషయంలో మనస్ఫూర్తిగా కృతజ్ఞత చూపించినందుకు ఇశ్రాయేలీయులు యుద్ధంలో విజయం సాధించారు.—నిర్గ. 17:9-13.
11. యెహోషువలా మనం పరిశుద్ధ సేవలో మన పనులను ఎలా చక్కగా నిర్వర్తించగలుగుతాం?
11 మోషే తర్వాత, ‘జ్ఞానాత్మపూర్ణుడైన’ యెహోషువ ఇశ్రాయేలీయులకు నాయకుడయ్యాడు. (ద్వితీ. 34:9) పరిశుద్ధాత్మ ప్రవచించడానికి, అద్భుతాలు చేయడానికి మోషేకు శక్తిని ఇచ్చినట్లు యెహోషువకు ఇవ్వలేదు కానీ కనానీయులతో జరిగిన యుద్ధాల్లో ఇశ్రాయేలీయులను నడిపించడానికి కావాల్సిన శక్తిని ఆయనకు ఇచ్చింది. ఇప్పుడు కూడా పరిశుద్ధ సేవలో కొన్ని పనులు చేయడానికి కావాల్సిన అనుభవమూ అర్హతలూ లేవని మనకు అనిపించవచ్చు. కానీ, దేవుడు ఇచ్చే నిర్దేశాన్ని తూ.చా. తప్పకుండా పాటిస్తే యెహోషువలా మనం కూడా మన పనిని చక్కగా నిర్వర్తించగలుగుతాం.—యెహో. 1:7-9.
“యెహోవా ఆత్మ గిద్యోను” మీద కుమ్మరించబడింది
12-14. (ఎ) మూడు వందల మందితో కూడిన ఇశ్రాయేలు సైన్యం మిద్యానీయుల భీకర సైన్యాన్ని ఓడించిన సందర్భం నుండి మనమేమి నేర్చుకోవచ్చు? (బి) యెహోవా గిద్యోనును ఎలా బలపర్చాడు? (సి) ఈ రోజుల్లో యెహోవా మనల్ని ఎలా బలపరుస్తున్నాడు?
12 యెహోషువ మరణం తర్వాత కూడా, యెహోవా విశ్వాసులను బలపర్చడానికి తన ఆత్మను ఉపయోగించాడు. న్యాయాధిపతులు అనే పుస్తకంలో ‘బలహీనులుగా ఉండి బలపరచబడిన’ వాళ్ల ఉదాహరణలు ఎన్నో ఉన్నాయి. (హెబ్రీ. 11:34) యెహోవా తన ఆత్మను ఉపయోగించి తన ప్రజల తరఫున యుద్ధం చేసేలా గిద్యోనును ప్రేరేపించాడు. (న్యాయా. 6:34) గిద్యోను ఏర్పాటు చేసిన సైన్యపు లెక్క చూస్తే, ప్రతీ నలుగురు మిద్యానీయులకు ఒక ఇశ్రాయేలు సైనికుడు ఉన్నాడు. గిద్యోను ఏర్పాటు చేసిన ఆ చిన్న గుంపు యెహోవా దృష్టిలో చాలా పెద్దగా ఉంది. 450 మంది మిద్యానీయులకు ఒక ఇశ్రాయేలు సైనికుడు మాత్రమే ఉండేంత వరకు సైనికుల లెక్క తగ్గించేలా యెహోవా గిద్యోనును రెండుసార్లు నిర్దేశించాడు. (న్యాయా. 7:2-8; 8:10) యెహోవా చివరకు ఆ సంఖ్యను ఆమోదించాడు. ఒకవేళ అద్భుతమైన విజయం చేజిక్కితే, తమ సొంత ప్రయత్నాలతో లేదా జ్ఞానంతో గెలిచామని ఎవ్వరూ చెప్పలేరు.
13 గిద్యోను, ఆయన సైన్యం యుద్ధానికి దాదాపు సిద్ధమయ్యారు. ఆ చిన్న గుంపులో మీరు ఉండివుంటే, అప్పటివరకు గుంపులో ఉన్న పిరికివాళ్లను, అప్రమత్తంగా లేనివాళ్లను తీసేశారు కాబట్టి ఇక ఫర్వాలేదని ధైర్యంగా ఉండేవారా? లేక పరిస్థితులు ఎలా మలుపు తిరుగుతాయోనని కాస్త భయపడేవారా? గిద్యోను ఎలా భావించివుంటాడో మనం ఊహించాల్సిన అవసరం లేదు. ఆయన యెహోవా చెప్పిందే చేశాడు. (న్యాయాధిపతులు 7:9-14 చదవండి.) దేవుడు తమతో ఉన్నట్లు చూపించే ఒక గుర్తును ఇవ్వమని గిద్యోను అడిగినందుకు యెహోవా కోపగించుకోలేదు. (న్యాయా. 6:36-40) కానీ, ఆయన గిద్యోను విశ్వాసాన్ని బలపర్చాడు.
14 రక్షించే విషయంలో యెహోవాకున్న శక్తి అపరిమితమైనది. బలహీనులుగా, నిస్సహాయులుగా కనిపించేవాళ్లను ఉపయోగించుకొని ఆయన తన ప్రజల్ని ఎలాంటి కష్ట పరిస్థితి నుండైనా రక్షించగలడు. కొన్నిసార్లు మన శత్రువులు ఎక్కువమంది ఉన్నారని మనం భయపడవచ్చు లేదా దిక్కుతోచని పరిస్థితిలో ఉన్నట్లు మనకు అనిపించవచ్చు. యెహోవా అద్భుతరీతిలో గిద్యోనును బలపర్చినట్లు మనల్ని కూడా బలపర్చాలని మనం ఆశించం కానీ, దేవుని వాక్యం ద్వారా, ఆయన ఆత్మ నిర్దేశం కింద ఉన్న సంఘం ద్వారా మనం నడిపింపును, అభయాన్ని పొందవచ్చు. (రోమా. 8:31, 32) యెహోవా ప్రేమతో చేసిన వాగ్దానాలు మన విశ్వాసాన్ని బలపర్చి ఆయనే నిజమైన సహాయకుడనే నమ్మకాన్ని ఇస్తాయి.
“యెహోవా ఆత్మ యెఫ్తా మీదికి” వచ్చింది
15, 16. యెఫ్తా కూతురు త్యాగపూరిత స్వభావాన్ని ఎలా అలవర్చుకుంది? దాని నుండి తల్లిదండ్రులు ఎలా ప్రోత్సాహం పొందవచ్చు?
15 మరో ఉదాహరణ పరిశీలించండి. ఇశ్రాయేలీయులు అమ్మోనీయులతో యుద్ధం చేయాల్సి వచ్చినప్పుడు యెహోవా ఆత్మ “యెఫ్తా మీదికి” వచ్చింది. యెహోవాను మహిమపర్చే విజయం కోసం ఆతురపడుతూ, యెఫ్తా ఒక ప్రమాణం చేశాడు. ఆ ప్రమాణాన్ని నిలబెట్టుకోవడానికి తనకు ఎంతో విలువైనదాన్ని ఆయన ఇవ్వాల్సి వచ్చింది. ఒకవేళ దేవుడు అమ్మోనీయులను తన చేతికి అప్పగిస్తే, తాను ఇంటికి తిరిగి వెళ్లినప్పుడు తన ఇంట్లో నుండి బయటకు వచ్చే మొదటి వ్యక్తిని యెహోవాకే సమర్పిస్తానని యెఫ్తా మాటిచ్చాడు. అమ్మోనీయులపై విజయం సాధించి ఆయన ఇంటికి తిరిగి వెళ్లినప్పుడు ఆయన కూతురు ఆయనను కలవడానికి పరుగెత్తుకుంటూ వచ్చింది. (న్యాయా. 11:29-31, 34) అది యెఫ్తా ఊహించని విషయమా? కాదనిపిస్తోంది, ఎందుకంటే ఆయనకు ఉన్నది ఒక్క కూతురే. షిలోహులో ఉన్న యెహోవా ఆలయంలో సేవచేయడానికి తన కూతుర్ని సమర్పించి యెఫ్తా తన మాట నిలబెట్టుకున్నాడు. యెహోవా నమ్మకమైన ఆరాధకురాలిగా యెఫ్తా కూతురు తన తండ్రి ప్రమాణాన్ని నెరవేర్చడం సముచితమని నమ్మింది. (న్యాయాధిపతులు 11:36 చదవండి.) యెహోవా ఆత్మ వాళ్లిద్దరికీ అవసరమైన బలాన్ని ఇచ్చింది.
16 యెఫ్తా కూతురు అలాంటి త్యాగపూరిత స్వభావాన్ని ఎలా అలవర్చుకుంది? తన తండ్రి ఉత్సాహాన్ని, దైవభక్తిని గమనించినప్పుడు ఆమె విశ్వాసం తప్పకుండా బలపడి ఉంటుంది. తల్లిదండ్రులారా, మీ పిల్లలు కూడా మీ మాదిరిని గమనిస్తారు. మీరు చెప్పే వాటిని మీరు నమ్ముతున్నారని మీ నిర్ణయాలను బట్టి తెలుస్తుంది. మీ పిల్లలు మీరు చేసే హృదయపూర్వకమైన ప్రార్థనలను, మీరు బోధించే వాటిని శ్రద్ధగా వింటారు, యెహోవాను పూర్ణ హృదయంతో సేవించేందుకు మీరు చేసే ప్రయత్నాలను గమనిస్తారు. వాటన్నిటి వల్ల మీ పిల్లల్లో యెహోవాను సేవించాలన్న బలమైన కోరిక కలుగుతుంది. దాన్ని చూసినప్పుడు మీరు ఎంతో సంతోషిస్తారు.
సమ్సోను మీద “యెహోవా ఆత్మ” పనిచేసింది
17. దేవుని ఆత్మ సహాయంతో సమ్సోను ఏమి చేశాడు?
17 ఇంకో ఉదాహరణ చూడండి. ఇశ్రాయేలీయులు ఫిలిష్తీయుల చేతికి చిక్కినప్పుడు, వాళ్లను విడిపించడానికి “యెహోవా ఆత్మ” సమ్సోనును ప్రేరేపించింది. (న్యాయా. 13:24, 25) యెహోవా ఎవ్వరికీ లేనంత గొప్ప బలాన్ని సమ్సోనుకు ఇచ్చాడు. ఫిలిష్తీయులు ఇతర ఇశ్రాయేలీయులను ఉపయోగించుకొని సమ్సోనును పట్టుకోవడానికి ప్రయత్నించినప్పుడు, “యెహోవా ఆత్మ అతనిమీదికి బలముగా వచ్చినందున అతనిచేతులకు కట్టబడిన తాళ్లు అగ్నిచేత కాల్చబడిన జనుపనారవలె నాయెను; సంకెళ్లును అతనిచేతులమీదనుండి విడిపోయెను.” (న్యాయా. 15:14) సమ్సోను తీసుకున్న ఒక తప్పుడు నిర్ణయం వల్ల ఆయనకు శక్తి లేకుండా అయిపోయినప్పుడు కూడా “విశ్వాసము ద్వారా” బలవంతుడయ్యాడు. (హెబ్రీ. 11:32-34; న్యాయా. 16:18-21, 28-30) సమ్సోను ఉన్న పరిస్థితుల్లో యెహోవా ఆత్మ ఆయన మీద ఒక ప్రత్యేకమైన రీతిలో పనిచేసింది. ఆ చారిత్రక సంఘటనల నుండి మనం ఎంతో ప్రోత్సాహాన్ని పొందవచ్చు. ఎలా పొందవచ్చు?
18, 19. (ఎ) సమ్సోను అనుభవం మనకు ఏ అభయాన్నిస్తోంది? (బి) ఈ ఆర్టికల్‌లో కొందరు నమ్మకమైన సేవకుల ఉదాహరణలను పరిశీలించడం వల్ల మీరెలా ప్రయోజనం పొందారు?
18 సమ్సోనుకు సహాయం చేసిన పరిశుద్ధాత్మ మీదే మనం కూడా ఆధారపడతాం. ‘ప్రజలకు ప్రకటించి దృఢసాక్ష్యమివ్వమని’ యేసు అప్పగించిన పనిని చేయడానికి మనం పరిశుద్ధాత్మ మీదే ఆధారపడతాం. (అపొ. 10:42) ఆ పనిని చేయాలంటే మనలో సహజంగా లేని సామర్థ్యాలు అవసరమౌతాయి. యెహోవా మనకు అప్పగించిన వివిధ రకాల పనుల కోసం ఆయన మనల్ని సమర్థులను చేసేందుకు తన ఆత్మను ఉపయోగిస్తున్నాడు. దానికి మనం ఆయనకు ఎంత కృతజ్ఞులమో కదా! కాబట్టి, మనకు అప్పగించబడిన పనిని చేస్తున్నప్పుడు మనం యెషయా ప్రవక్తలాగే ఇలా అనగలుగుతాం, “ప్రభువగు యెహోవాయు ఆయన ఆత్మయు నన్ను పంపెను.” (యెష. 48:16) ఆ పనికోసం యెహోవా ఆత్మ మనల్ని పంపిస్తుంది. మోషే, బెసలేలు, యెహోషువలకు ఉన్న సామర్థ్యాలను పెంచినట్లే యెహోవా మన సామర్థ్యాలను కూడా పెంచుతాడనే నమ్మకంతో మనం ఆ పనికి అంకితం కావచ్చు. గిద్యోను, యెఫ్తా, సమ్సోనులకు బలాన్ని ఇచ్చినట్లే యెహోవా మనకూ బలాన్ని ఇస్తాడనే గట్టి నమ్మకంతో మనం “దేవుని వాక్యమను ఆత్మ ఖడ్గమును” తీసుకొని వెళ్తాం. (ఎఫె. 6:17, 18) అడ్డంకులను అధిగమించడానికి యెహోవా సహాయం మీద ఆధారపడితే, సమ్సోను శారీరకంగా ఎంత బలవంతుడయ్యాడో మనం ఆధ్యాత్మికంగా అంత బలవంతులమౌతాం.
19 సత్యారాధన పక్షాన ధైర్యంగా నిలబడేవాళ్లను యెహోవా ఆశీర్వదిస్తాడని స్పష్టంగా తెలుస్తోంది. మనం దేవుని పరిశుద్ధాత్మ నడిపింపుకు అనుగుణంగా నడుచుకుంటే మన విశ్వాసం ఎంతో బలపడుతుంది. కాబట్టి, క్రైస్తవ గ్రీకు లేఖనాల్లో ఉన్న ఆసక్తికరమైన కొన్ని సంఘటనలను పరిశీలించడం వల్ల కూడా మనం సంతోషాన్ని పొందుతాం. ఆ సంఘటనలను పరిశీలిస్తే, మొదటి శతాబ్దంలో సా.శ. 33 పెంతెకొస్తుకు ముందూ తర్వాతా యెహోవా పరిశుద్ధాత్మ నమ్మకమైన సేవకుల మీద ఎలా పనిచేసిందో మనం తెలుసుకోవచ్చు. మనం తర్వాతి ఆర్టికల్‌లో దాని గురించే తెలుసుకుంటాం.
యెహోవా పరిశుద్ధాత్మ వీళ్లపై ఎలా పనిచేసిందో తెలుసుకోవడం మీకెందుకు ప్రోత్సాహాన్నిస్తుంది?
• మోషే
• బెసలేలు
• యెహోషువ
• గిద్యోను
• యెఫ్తా
• సమ్సోను
[అధ్యయన ప్రశ్నలు]
[22వ పేజీలోని బ్లర్బ్]
దేవుని ఆత్మ సమ్సోనును శారీరకంగా ఎంత బలవంతుణ్ణి చేసిందో మనల్ని ఆధ్యాత్మికంగా అంత బలవంతుల్ని చేస్తుంది
[21వ పేజీలోని చిత్రం]
తల్లిదండ్రులారా, మీ మంచి మాదిరి వల్ల మీ పిల్లలు యెహోవా సేవ చేయాలని కోరుకుంటారు