మొదటి శతాబ్దంలోని క్రైస్తవులకు, నేటి క్రైస్తవులకు పరిశుద్ధాత్మ నడిపింపు
మొదటి శతాబ్దంలోని క్రైస్తవులకు, నేటి క్రైస్తవులకు పరిశుద్ధాత్మ నడిపింపు
‘ఆ ఆత్మ ఒక్కటే అన్నిటినీ చేస్తుంది.’—1 కొరిం. 12:11, NW.
1. మనం ఈ ఆర్టికల్‌లో ఏమి పరిశీలిస్తాం?
పెంతెకొస్తు అనే మాట వినగానే ఎన్నో అద్భుతమైన సంఘటనలు మనకు గుర్తుకువస్తాయి. (అపొ. 2:1-4) మొదటి శతాబ్దంలోని ఆ సందర్భంలో పరిశుద్ధాత్మ కుమ్మరించబడినప్పుడు, మానవులతో యెహోవా వ్యవహరించే తీరులో పెనుమార్పు చోటుచేసుకుంది. పూర్వకాలంలోని కొంతమంది నమ్మకస్థులైన సేవకులు చాలా కష్టమైన నియామకాల్ని నిర్వర్తించడానికి పరిశుద్ధాత్మ వాళ్లను సమర్థుల్ని చేసిన కొన్ని విధానాలను ముందటి ఆర్టికల్‌లో పరిశీలించాం. అయితే దేవుని పరిశుద్ధాత్మ క్రైస్తవపూర్వ కాలంలో పనిచేసిన తీరుకూ మొదటి శతాబ్దంలో పనిచేసిన తీరుకూ మధ్య తేడా ఏమిటి? ఈ రోజుల్లో పరిశుద్ధాత్మ పనిచేయడం వల్ల క్రైస్తవులు ఎలా ప్రయోజనం పొందుతున్నారు? వీటి గురించి ఇప్పుడు చూద్దాం.
“ఇదిగో ప్రభువు దాసురాలను”
2. యెహోవా ఆత్మ అద్భుతాలు చేయగలదని మరియకు ఎలా తెలుసు?
2 యేసు వాగ్దానం చేసిన పరిశుద్ధాత్మ, యెరూషలేములోని ఒక మేడగదిలో ఉన్న శిష్యులపై కుమ్మరించబడిన సమయంలో మరియ కూడా అక్కడే ఉంది. (అపొ. 1:13, 14) అయితే, ఆ సంఘటన జరగడానికి 30 కన్నా ఎక్కువ సంవత్సరాల క్రితమే, యెహోవా ఆత్మ అద్భుతాలు చేయగలదని మరియ చవిచూసింది. మరియ కన్యకగా ఉన్నప్పుడే యెహోవా తన కుమారుని జీవాన్ని పరలోకం నుండి ఆమె గర్భంలోకి మార్చాడు. ఆమె “పరిశుద్ధాత్మ వలన” గర్భం దాల్చింది.—మత్త. 1:20.
3, 4. మరియ ఎలాంటి వైఖరి చూపించింది? మనం ఆమెను ఎలా అనుకరించవచ్చు?
3 ఆ అరుదైన అవకాశం మరియకు ఎందుకు దొరికింది? మరియ విషయంలో దేవుని చిత్తమేమిటో దేవదూత ఆమెకు చెప్పినప్పుడు, ఆమె సంభ్రమాశ్చర్యాలతో ఇలా అంది, “ఇదిగో ప్రభువు దాసురాలను; నీ మాట చొప్పున నాకు జరుగును గాక.” (లూకా 1:38) మరియ అలా అనడం ద్వారా యెహోవా అప్పటికే ఆమెలో గమనించిన మంచి హృదయ పరిస్థితిని చూపించింది. అలా వెంటనే ప్రతిస్పందించిన తీరునుబట్టి, యెహోవా చిత్తాన్ని అంగీకరించడానికి ఆమె ఇష్టపడినట్లు తెలుస్తోంది. తను గర్భవతి అయిన విషయం తెలిస్తే నలుగురూ ఏమనుకుంటారో లేదా తనకు కాబోయే భర్తతో సంబంధం తెగిపోతుందేమో అంటూ ఆమె సందేహాలను వ్యక్తం చేయలేదు. “దాసురాలను” అనడం ద్వారా మరియ యెహోవాపై తనకు పూర్తి నమ్మకం ఉందని చూపించింది.
4 దేవుని సేవలో వచ్చే సవాళ్లను బట్టి గానీ బాధ్యతలను బట్టి గానీ మీరెప్పుడైనా కాస్త ఆందోళన చెందారా? ఈ ప్రశ్నలు వేసుకోవడం మంచిది, ‘యెహోవా అన్ని పనులూ తన చిత్తానికి అనుగుణంగా జరిగేలా చూస్తాడని నేను పూర్తిగా నమ్ముతున్నానా? ఆయన నా నుండి ఆశిస్తున్న పనులను చేయడానికి నేను నిజంగా ఇష్టపడుతున్నానా?’ మనస్ఫూర్తిగా తనపై నమ్మకముంచి సర్వోన్నతమైన తన చిత్తాన్ని గ్రహించేవాళ్లకు దేవుడు తన ఆత్మను తప్పకుండా ఇస్తాడు.—అపొ. 5:32.
పరిశుద్ధాత్మ పేతురుకు సహాయం చేసింది
5. పరిశుద్ధాత్మ పనిచేయడాన్ని పేతురు సా.శ. 33 పెంతెకొస్తుకు ముందే ఎలా చవిచూశాడు?
5 దేవుని ఆత్మ ఎంత అద్భుతంగా పనిచేస్తుందో మరియలాగే అపొస్తలుడైన పేతురు కూడా సా.శ. 33 పెంతెకొస్తుకు ముందే వ్యక్తిగతంగా చవిచూశాడు. పేతురుకు, ఇతర అపొస్తలులకు దయ్యాలను వెళ్లగొట్టే అధికారాన్ని యేసు ఇచ్చాడు. (మార్కు 3:14-16) లేఖనాల్లో ఎక్కువ వివరాలు లేకపోయినా, పేతురు ఆ అధికారాన్ని ఉపయోగించాడని తెలుస్తోంది. గలిలయ సముద్రంలో నీళ్ల మీద నడుస్తూ తన దగ్గరికి రమ్మని యేసు పేతురుకు చెప్పినప్పుడు ఆయన పరిశుద్ధాత్మ సహాయంతోనే నడవగలిగాడు. (మత్తయి 14:25-29 చదవండి.) దీన్నిబట్టి, పేతురు పరిశుద్ధాత్మ సహాయంతోనే గొప్ప కార్యాలు చేశాడని తెలుస్తోంది. ఆ తర్వాత పేతురు, ఆయన తోటి శిష్యులు వేరే పనులు చేయడానికి కూడా పరిశుద్ధాత్మ సహాయం చేసింది.
6. పేతురు పరిశుద్ధాత్మ సహాయంతో సా.శ. 33 పెంతెకొస్తు రోజే కాక ఆ తర్వాత కూడా ఏమేమి చేయగలిగాడు?
6 సా.శ. 33 పెంతెకొస్తు పండుగ రోజున సుదూర ప్రాంతాల నుండి యెరూషలేముకు వచ్చినవాళ్ల భాషల్లో మాట్లాడే అద్భుతమైన వరాన్ని పేతురు, మరితరులు పొందారు. ఆ తర్వాత పేతురు జన సమూహాన్ని ఉద్దేశించి ఒక ప్రసంగం ఇచ్చాడు. (అపొ. 2:14-36) అప్పుడప్పుడు దుడుకు స్వభావాన్ని లేదా పిరికితనాన్ని కనబర్చిన పేతురు బెదిరింపులు, హింస ఎదురైనా ధైర్యంగా సాక్ష్యమివ్వగలిగాడు. (అపొ. 4:18-20, 31) దేవుడు తన పరిశుద్ధాత్మ సహాయంతో ఆయనకు ప్రత్యేకమైన జ్ఞానాన్ని ఇచ్చాడు. (అపొ. 5:8, 9) అంతేకాక, అదే పరిశుద్ధాత్మ సహాయంతో ఆయన పునరుత్థానం కూడా చేశాడు.—అపొ. 9:40.
7. పేతురుపై పరిశుద్ధాత్మ కుమ్మరించబడిన తర్వాత ఆయనకు ఏయే విషయాలు అర్థమయ్యాయి?
7 యేసు బోధించిన చాలా సత్యాలను పేతురు పెంతెకొస్తుకు ముందు కూడా అర్థం చేసుకున్నాడు. (మత్త. 16:16, 17; యోహా. 6:68) కానీ, యేసు బోధల్లోని కొన్ని అంశాలు మాత్రం పెంతెకొస్తుకు ముందు ఆయనకు సరిగ్గా అర్థంకాలేదు. ఉదాహరణకు, యేసు మూడవ దినాన ఆత్మ ప్రాణిగా పునరుత్థానం చేయబడతాడని లేదా ఆయన రాజ్యం పరలోకంలో ఉంటుందని పేతురు అర్థం చేసుకోలేదు. (యోహా. 20:6-10; అపొ. 1:6) మానవులు పరలోకానికి వెళ్లి పరిపాలించడం అనేది పేతురుకు కొత్త విషయం. తనపై పరిశుద్ధాత్మ కుమ్మరించబడి పరలోక నిరీక్షణ అనుగ్రహించబడిన తర్వాతే పై విషయాల గురించి యేసు చెప్పిన మాటలు ఆయనకు అర్థమయ్యాయి.
8. ఆత్మాభిషిక్త క్రైస్తవులకు, ‘వేరేగొర్రెలకు’ ఏ జ్ఞానం అందుబాటులో ఉంది?
8 యేసు శిష్యులకు అంతకుముందు అర్థంకాని విషయాలు పరిశుద్ధాత్మ కుమ్మరించబడిన తర్వాత అర్థమయ్యాయి. క్రైస్తవ గ్రీకు లేఖనాలను రాసినవాళ్లు యెహోవా ప్రేరణతో ఆయన సంకల్పానికి సంబంధించిన అద్భుతమైన విషయాలను మన ప్రయోజనం కోసం తెలియజేశారు. (ఎఫె. 3:8-11, 18) ఈ రోజుల్లో ఆత్మాభిషిక్త క్రైస్తవులు, ‘వేరేగొర్రెలకు’ చెందినవాళ్లు ఒకే విధమైన సత్యాలను నేర్చుకుంటూ ఆధ్యాత్మికంగా పోషించబడుతున్నారు. (యోహా. 10:16) అలా పరిశుద్ధాత్మ అందిస్తున్న లేఖన జ్ఞానాన్ని, అవగాహనను మీరు విలువైనదిగా ఎంచుతున్నారా?
పౌలు ‘పరిశుద్ధాత్మతో నింపబడ్డాడు’
9. పరిశుద్ధాత్మ సహాయంతో పౌలు ఏమేమి చేయగలిగాడు?
9 అపొస్తలుడైన పౌలుగా ప్రజలందరికీ తెలిసిన సౌలు కూడా సా.శ. 33 పెంతెకొస్తు అయిపోయిన దాదాపు ఒక సంవత్సరం తర్వాత పరిశుద్ధాత్మను పొందాడు. దానివల్ల ఆయన చేసిన కొన్ని పనులు మనకు ఇప్పటికీ ప్రయోజనం చేకూరుస్తున్నాయి. బైబిల్లోని 14 పుస్తకాలు రాయడానికి ఆయన ప్రేరేపించబడ్డాడు. పరిశుద్ధాత్మ పేతురు మీద పనిచేసినట్లే పౌలు మీద కూడా పనిచేయడం వల్ల ఆయన పరలోకంలో అమర్త్యతను, అక్షయతను పొందే నిరీక్షణను అర్థం చేసుకొని దానిగురించి స్పష్టంగా రాయగలిగాడు. అంతేకాక, పరిశుద్ధాత్మ సహాయంతోనే ఆయన స్వస్థతలు చేయగలిగాడు, దయ్యాలను వెళ్లగొట్టగలిగాడు, చివరకు పునరుత్థానం కూడా చేయగలిగాడు. అయితే మరో ప్రాముఖ్యమైన పని చేయడానికి పరిశుద్ధాత్మ పౌలుకు సహాయం చేసింది. అది ఇప్పుడు మనం కూడా ఆ ప్రాముఖ్యమైన పని చేయడానికి మనకు సహాయం చేస్తోంది. కానీ దాన్ని మనం అద్భుతరీతిలో పొందం.
10. ప్రకటనాపని చేసేందుకు పరిశుద్ధాత్మ పౌలుకు ఎలా సహాయం చేసింది?
10 ‘పరిశుద్ధాత్మతో నింపబడిన’ పౌలు ఒక గారడీవానితో ధైర్యంగా మాట్లాడాడు. వాళ్ల సంభాషణ కుప్ర ముఖ్యాధికారిని ఎంతో ప్రభావితం చేసింది. ఆ అధిపతి “ప్రభువు బోధకు ఆశ్చర్యపడి” సత్యాన్ని అంగీకరించాడు. (అపొ. 13:8-12) సత్యాన్ని ప్రకటించేందుకు కావాల్సిన ధైర్యాన్ని పరిశుద్ధాత్మ మాత్రమే ఇవ్వగలదని పౌలుకు తెలుసు. (మత్త. 10:20) ఆ తర్వాత, తనకు “వాక్ఛక్తి” అనుగ్రహించబడేలా తనకోసం ప్రార్థించమని పౌలు ఎఫెసులో ఉన్న సంఘాన్ని వేడుకున్నాడు.—ఎఫె. 6:18-20.
11. పరిశుద్ధాత్మ పౌలును ఎలా నడిపించింది?
11 పరిశుద్ధాత్మ పౌలు ప్రకటించడానికి సహాయం చేయడమే కాక కొన్ని ప్రాంతాల్లో ప్రకటించకుండా ఆయనను ఆటంకపరచింది. పౌలు మిషనరీ యాత్రలు చేస్తున్నప్పుడు పరిశుద్ధాత్మ ఆయనను నిర్దేశించింది. (అపొ. 13:2; అపొస్తలుల కార్యములు 16:6-10 చదవండి.) ఇప్పుడు కూడా యెహోవా తన పరిశుద్ధాత్మను ఉపయోగించి ప్రకటనాపనిని నిర్దేశిస్తున్నాడు. పౌలులాగే, యెహోవాకు లోబడే సేవకులందరూ సత్యాన్ని ధైర్యంగా, ఉత్సాహంగా ప్రకటించడానికి కృషి చేస్తారు. దేవుని నిర్దేశం పౌలు కాలంలో తెలిసినంత స్పష్టంగా మనకు తెలియకపోయినా, సరైన మనోవైఖరి గల ప్రజలు సత్యాన్ని వినేలా యెహోవా తన పరిశుద్ధాత్మను ఉపయోగిస్తున్నాడని మనం నమ్మవచ్చు.—యోహా. 6:44.
“నానావిధములైన కార్యములు”
12-14. దేవుని పరిశుద్ధాత్మ ఆయన సేవకులందరి మీద ఒకేలా పనిచేస్తుందా? వివరించండి.
12 మొదటి శతాబ్దంలోని అభిషిక్తుల సంఘాన్ని యెహోవా ఆశీర్వదించినట్లు చూపించే వృత్తాంతాల నుండి నేటి దేవుని సమర్పిత సేవకులు ఏమైనా ప్రోత్సాహాన్ని పొందవచ్చా? ఖచ్చితంగా పొందవచ్చు. పౌలు తన కాలంలో అద్భుతంగా అనుగ్రహించబడిన పరిశుద్ధాత్మ వరాల గురించి కొరింథులో ఉన్న సంఘానికి రాసిన ఈ ప్రేరేపిత మాటలను గుర్తుంచుకోండి, ‘కృపావరములు నానావిధములుగా ఉన్నవి గాని ఆత్మ ఒక్కటే. పరిచర్యలు నానావిధములుగా ఉన్నవి గాని ప్రభువు ఒక్కడే. నానావిధములైన కార్యములు కలవు గాని అందరిలోను అన్నిటిని జరిగించు దేవుడు ఒక్కడే.’ (1 కొరిం. 12:4-6, 11) నిర్దిష్టమైన ఉద్దేశంతో పరిశుద్ధాత్మ వేర్వేరు వ్యక్తుల మీద వేర్వేరు రకాలుగా పనిచేస్తుంది. నిజానికి, పరిశుద్ధాత్మ క్రీస్తు ‘చిన్న మందకూ,’ ఆయన ‘వేరేగొర్రెలకూ’ సహాయం చేస్తుంది. (లూకా 12:32; యోహా. 10:16) అలాగని అది సంఘంలోని ప్రతీ ఒక్కరి మీదా ఎప్పుడూ ఒకేలా పని చేయదు.
13 ఉదాహరణకు, సంఘ పెద్దలను పరిశుద్ధాత్మ నియమిస్తుంది. (అపొ. 20:28) కానీ, ఆత్మాభిషిక్తులందరూ సంఘంలో పెద్దలుగా సేవచేయరు. దీన్నిబట్టి మనకేమి తెలుస్తోంది? దేవుని ఆత్మ సంఘ సభ్యులపై వేర్వేరు రకాలుగా పనిచేస్తుంది.
14 అభిషిక్తులకు “దత్తపుత్రాత్మను” ఇచ్చే ఆత్మ, అలాగే యెహోవా తన అద్వితీయ కుమారుణ్ణి అమర్త్యమైన ఆత్మప్రాణిగా పరలోకానికి పునరుత్థానం చేయడానికి ఉపయోగించిన ఆత్మ ఒక్కటే. (రోమీయులు 8:11, 15 చదవండి.) యెహోవా అదే ఆత్మను ఉపయోగించి ఈ విశ్వాన్నంతటినీ సృష్టించాడు. (ఆది. 1:1-3) అంతేకాక, యెహోవా అదే పరిశుద్ధాత్మను ఉపయోగించి గుడారానికి సంబంధించిన ప్రత్యేకమైన పనిచేయడానికి బెసలేలును సమర్థుణ్ణి చేశాడు, ఎంతో బలం అవసరమయ్యే పెద్ద పెద్ద పనులు చేయడానికి సమ్సోనుకు శక్తిని ఇచ్చాడు, నీళ్ల మీద నడవడానికి పేతురుకు సహాయం చేశాడు. కాబట్టి, దేవుని పరిశుద్ధాత్మ మనకు తోడుగా ఉండడం, ఆత్మతో అభిషేకించబడడం ఒక్కటి కాదు. ఆత్మతో ఒక వ్యక్తిని అభిషేకించడం అనేది దేవుని పరిశుద్ధాత్మ చేసే ఒక ప్రత్యేకమైన పని మాత్రమే. నిజానికి ఎవరిని ఆత్మతో అభిషేకించాలో దేవుడే నిర్ణయిస్తాడు.
15. పరిశుద్ధాత్మతో అభిషేకించడం ఎల్లప్పుడూ కొనసాగుతుందా? వివరించండి.
15 దేవుని పరిశుద్ధాత్మ తన నమ్మకమైన సేవకుల మీద వేర్వేరు రకాలుగా పనిచేసింది. దేవుడు తన ఆత్మతో ప్రజల్ని అభిషేకించడం మొదలుపెట్టడానికి వేల సంవత్సరాల పూర్వం నుండే ఆయన సేవకులపై పరిశుద్ధాత్మ పనిచేస్తూ వచ్చింది. దేవుడు తన ఆత్మతో ప్రజల్ని అభిషేకించడం సా.శ. 33 పెంతెకొస్తు రోజున మొదలైంది. కానీ అలా అభిషేకించడం ఎల్లప్పుడూ కొనసాగదు, అది ఆగిపోతుంది. అయితే, దేవుని ప్రజలు నిరంతరం ఆయన చిత్తం చేసేలా వాళ్లమీద పరిశుద్ధాత్మ పనిచేస్తూనే ఉంటుంది.
16. పరిశుద్ధాత్మ సహాయంతో దేవుని సేవకులు ఇప్పుడు ఏమి చేస్తున్నారు?
16 యెహోవా పరిశుద్ధాత్మ సహాయంతో నేడు భూమ్మీద ప్రత్యేకంగా ఏ పని జరుగుతోంది? ప్రకటన 22:17 ఇలా జవాబిస్తోంది, “ఆత్మయు పెండ్లి కుమార్తెయు రమ్ము అని చెప్పుచున్నారు; వినువాడును రమ్ము అని చెప్పవలెను; దప్పిగొనిన వానిని రానిమ్ము; ఇచ్ఛయించువానిని జీవజలమును ఉచితముగా పుచ్చుకొననిమ్ము.” దేవుని ఆత్మ పురికొల్పుతో, ఇప్పుడు క్రైస్తవులు జీవానికి సంబంధించిన ఆహ్వానం జీవజలాన్ని “ఇచ్ఛయించు” వాళ్లందరికీ ఇస్తున్నారు. ఈ పనిలో అభిషిక్త క్రైస్తవులు నాయకత్వం వహిస్తున్నారు. అయితే, వేరేగొర్రెలు వాళ్లతో కలిసి పనిచేస్తున్నారు. ఒకే పరిశుద్ధాత్మ నడిపింపుతో ఆ రెండు తరగతుల వాళ్లూ ఈ పనిని పూర్తి చేయడానికి ప్రయత్నిస్తున్నారు. వాళ్లంతా యెహోవాకు సమర్పించుకొని తమ సమర్పణకు గుర్తుగా “తండ్రియొక్కయు కుమారునియొక్కయు, పరిశుద్ధాత్మయొక్కయు నామములో” బాప్తిస్మం తీసుకున్నారు. (మత్త. 28:19) వాళ్లందరూ దేవుని ఆత్మ ఫలంలోని లక్షణాలను చూపిస్తారు. (గల. 5:22, 23) దేవుని పరిశుద్ధాత్మ సహాయంతో వాళ్లు ఆయనకు ఇష్టమైన విధంగా నిష్కళంకంగా జీవించడానికి కృషి చేస్తారు.—2 కొరిం. 7:1; ప్రక. 7:9, 14.
పరిశుద్ధాత్మ కోసం అడుగుతూ ఉండండి
17. మనకు దేవుని ఆత్మ సహాయం ఉందని ఎలా చూపించవచ్చు?
17 మీరు పరలోక నిరీక్షణ గలవారైనా భూనిరీక్షణ గలవారైనా, మీ యథార్థతను కాపాడుకొని బహుమానాన్ని అందుకునేలా యెహోవా మీకు ‘బలాధిక్యాన్ని’ ఇస్తాడు. (2 కొరిం. 4:7) మీరు సువార్త ప్రకటనాపని కొనసాగిస్తుండగా హేళనకు గురికావచ్చు. అయినా పట్టువిడువకుండా ఆ పనిలో కొనసాగితే దేవుని ఆత్మ సహాయం మీకుందని చూపించవచ్చు. కానీ, ‘క్రీస్తు నామం నిమిత్తం మీరు నిందపాలైనయెడల మహిమాస్వరూపియైన ఆత్మ, అనగా దేవుని ఆత్మ, మీమీద నిలుచును గనుక మీరు ధన్యులు.’—1 పేతు. 4:14.
18, 19. యెహోవా తన పరిశుద్ధాత్మతో మీకు ఎలా సహాయం చేస్తాడు? ఈ విషయంలో మీ కృత నిశ్చయం ఏమిటి?
18 నిజాయితీగా అడిగేవాళ్లకు యెహోవా పరిశుద్ధాత్మను ధారాళంగా ఇస్తాడు. అది మన సామర్థ్యాలను పెంచడమే కాకుండా, ఆయన సేవలో చేయగలిగినదంతా చేయాలన్న కోరికను కూడా పెంచుతుంది. “మీరు ఇచ్ఛయించుటకును కార్యసిద్ధి కలుగజేసికొనుటకును, తన దయాసంకల్పము నెరవేరుటకై మీలో కార్యసిద్ధి కలుగజేయువాడు దేవుడే.” ‘జీవవాక్యాన్ని చేతపట్టుకొని’ ఉండడానికి మనం చేసే గట్టి ప్రయత్నంతో పాటు దేవుడిచ్చే పరిశుద్ధాత్మ అనే అమూల్యమైన బహుమానం ‘భయంతోను వణకుతోను మన సొంతరక్షణ’ కోసం శ్రమిస్తూ ఉండడానికి మనకు సహాయం చేస్తుంది.—ఫిలి. 2:12, 13, 16.
19 దేవుని ఆత్మపై పూర్తి నమ్మకంతో, మీ నియామకాల్ని నిర్వర్తించడానికి మీరు చేయగలిగినదంతా చేస్తూ మీకివ్వబడిన ఏ నియామకంలోనైనా నైపుణ్యాన్ని సంపాదించుకుంటూ సహాయం కోసం యెహోవాపై ఆధారపడండి. (యాకో. 1:5) తన వాక్యాన్ని అర్థం చేసుకోవడానికి, జీవిత సమస్యలతో పోరాడడానికి, సువార్త ప్రకటించడానికి అవసరమైన దాన్ని యెహోవా మీకు ఇస్తాడు. “అడుగుడి, మీ కియ్యబడును; వెదకుడి, మీకు దొరకును; తట్టుడి, మీకు తీయబడును.” (లూకా 11:9, 13) మీరు అలా పొందేవాటిలో పరిశుద్ధాత్మ కూడా ఒకటి. దేవుని ఆత్మచే నడిపించబడిన ఆ విశ్వాసులందరిలా ఉండేందుకు సహాయం చేయమని మీరు యెహోవాకు ప్రార్థిస్తూ ఉండండి.
మీరు వివరించగలరా?
• మరియలా మనం కూడా ఏ వైఖరిని చూపిస్తే ఆశీర్వాదాలు పొందుతాం?
• పౌలును పరిశుద్ధాత్మ ఎలా నడిపించింది?
• ఇప్పుడు దేవుని సేవకులను పరిశుద్ధాత్మ ఎలా నడిపిస్తోంది?
[అధ్యయన ప్రశ్నలు]
[24వ పేజీలోని చిత్రం]
దేవుని ఆత్మ సహాయంతో పౌలు దయ్యాలను వెళ్లగొట్టాడు
[26వ పేజీలోని చిత్రం]
ఏ నిరీక్షణగల క్రైస్తవులకైనా పరిశుద్ధాత్మ ఇప్పుడు సహాయం చేస్తోంది