కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

సర్దుబాట్లు చేసుకోవడం వల్ల ఆశీర్వాదాలు పొందాం

సర్దుబాట్లు చేసుకోవడం వల్ల ఆశీర్వాదాలు పొందాం

సర్దుబాట్లు చేసుకోవడం వల్ల ఆశీర్వాదాలు పొందాం

జేమ్స్‌ ఎ. థాంప్సన్‌ చెప్పినది

నేను 1928లో దక్షిణ అమెరికాలో పుట్టాను. అప్పుడు తెల్ల జాతీయులు, నల్ల జాతీయులు కలవకూడదనే నియమం ఉండేది. దాన్ని ఉల్లంఘిస్తే జైల్లో వేసేవాళ్ళు లేదా అంతకన్నా కఠినంగా శిక్షించేవాళ్ళు.

అప్పుడు అమెరికాలోని కొన్ని ప్రాంతాల్లో తెల్ల జాతీయులైన యెహోవాసాక్షులకు, నల్ల జాతీయులైన యెహోవాసాక్షులకు సంఘాలు, సర్క్యూట్‌లు, డిస్ట్రిక్ట్‌లు వేర్వేరుగా ఉండాల్సి వచ్చేది. మా నాన్న 1937లో టెన్నెసీలోవున్న చట్టనూగా సంఘంలోని నల్ల జాతీయులకు కంపెనీ సర్వెంట్‌గా (ఇప్పుడు పెద్దల సభ సమన్వయకర్త అంటున్నాం) నియమించబడ్డాడు. హెన్రీ నికోల్స్‌ తెల్ల జాతీయులకు కంపెనీ సర్వెంట్‌గా నియమించబడ్డాడు.

నా చిన్న వయసులో మా నాన్న, సహోదరుడు నికోల్స్‌ రాత్రుళ్ళు పెరట్లో కూర్చొని మాట్లాడుకుంటుండగా వినడం నేనెంతో ఇష్టపడేవాణ్ణి. వాళ్ళు మాట్లాడుకునే విషయాల్లో చాలావరకు నాకు అర్థమయ్యేవి కావు. అయినా, అప్పుడున్న పరిస్థితుల్లో పరిచర్య ఎలా చేస్తే బావుంటుంది అనే విషయాన్ని వాళ్ళిద్దరూ చర్చించుకుంటుండగా నాన్న ప్రక్కన కూర్చొని ఎంతో ఇష్టంగా వినేవాణ్ణి.

అంతకంటే ముందు ఒక విషాద సంఘటన జరిగింది, 1930లో అమ్మ చనిపోయింది, అప్పటికి ఆమెకు ఇరవై ఏళ్ళే. దానితో నాలుగేళ్ళ మా అక్క డోరిస్‌ను, రెండేళ్ళ నన్ను చూసుకునే బాధ్యత నాన్నపై పడింది. నాన్న బాప్తిస్మం తీసుకుని అప్పటికి కొంత కాలమే అయినా ఆధ్యాత్మికంగా మంచి ప్రగతి సాధించాడు.

నా జీవితాన్ని మలచిన ఆదర్శవంతులు

మా నాన్న 1933లో లిలీ మే గ్వండలిన్‌ థామస్‌ అనే ఒక మంచి క్రైస్తవ సహోదరిని కలిశాడు, ఆ తర్వాత కొంతకాలానికి వాళ్ళు పెళ్ళి చేసుకున్నారు. నమ్మకంగా యెహోవా సేవ చేయడంలో అమ్మానాన్నలు డోరిస్‌కు, నాకు ఆదర్శంగా ఉన్నారు.

ఒకప్పుడు యెహోవాసాక్షుల సంఘాల్లో ఉన్న సభ్యులే సంఘ పెద్దలను ఎన్నుకునేవాళ్ళు. కానీ న్యూయార్క్‌లోని బ్రూక్లిన్‌లో ఉన్న ప్రధాన కార్యాలయమే వాళ్ళను నియమిస్తుందన్న తీర్మానం 1938లో ప్రవేశపెట్టబడింది. దానికి మద్దతు ఇవ్వాలని ప్రధాన కార్యాలయం సంఘాలను కోరింది. అప్పుడు చట్టనూగాలోని కొందరు ఆ మార్పును అంగీకరించడానికి వెనుకాడారు, కానీ సంస్థాపరంగా వచ్చిన ఆ మార్పుకు నాన్న మాత్రం పూర్తి మద్దతును తెలిపాడు. ఆయన నమ్మకంగా ఉండడం, అమ్మ దానికి మనస్ఫూర్తిగా సహకరించడం చూసి నేను కూడా వాళ్ళలా ఉండడం నేర్చుకున్నాను.

బాప్తిస్మం, పూర్తికాల పరిచర్య

1940లో మా సంఘంలోని కొంతమందిమి ఒక బస్సు అద్దెకు తీసుకొని మిచిగాన్‌లోని డెట్రాయిట్‌లో జరుగుతున్న సమావేశానికి వెళ్ళాం. బస్సులో మాతోపాటు వచ్చిన కొంతమంది అక్కడ బాప్తిస్మం తీసుకున్నారు. నేను ఐదేళ్ళ వయసు నుండే ప్రకటనాపని చేస్తూ పరిచర్యలో ఉత్సాహంగా పాల్గొనేవాణ్ణి కాబట్టి నేను కూడా బాప్తిస్మం తీసుకుంటానని కొందరు అనుకున్నారు కానీ, తీసుకోకపోయేసరికి వాళ్ళు ఆశ్చర్యపోయారు.

వాళ్ళు నన్ను దాని గురించి అడిగినప్పుడు, “బాప్తిస్మం గురించి నాకు అంతగా తెలియదు” అని చెప్పాను. నాన్న నా మాటలు విని ఆశ్చర్యపోయాడు. అప్పటినుండి బాప్తిస్మమంటే ఏమిటో, దాని ప్రాముఖ్యత ఏమిటో అర్థం చేసుకునేందుకు ఆయన నాకు సహాయం చేయడానికి కృషిచేశాడు. నాలుగు నెలల తర్వాత 1940లో ఎంతో చలిగా ఉన్న అక్టోబరు 1న చట్టనూగాకు కొంతదూరంలో ఉన్న ఒక చెరువులో నేను బాప్తిస్మం తీసుకున్నాను.

నాకు 14 ఏళ్ళున్నప్పుడు వేసవి సెలవుల్లో పయినీరు సేవ చేయడం మొదలుపెట్టాను. టెన్నెసీలోని చిన్నపట్టణాల్లో, దాని పొరుగు రాష్ట్రమైన జార్జియాలోని చిన్నపట్టణాల్లో ప్రకటించాను. నేను ఉదయాన్నే లేచి, ఒక బాక్సులో భోజనం పెట్టుకొని 6 గంటలకు బయలుదేరే ట్రైన్‌లో గానీ బస్సులో గానీ పరిచర్య ప్రాంతానికి వెళ్ళేవాణ్ణి. మళ్ళీ సాయంత్రం దాదాపు 6 గంటలకు తిరిగి వచ్చేవాణ్ణి. ఎన్నోసార్లు మధ్యాహ్నం కాకముందే బాక్సు ఖాళీ అయ్యేది. నా దగ్గర డబ్బులున్నా నేను నల్ల జాతీయుణ్ణి కాబట్టి అక్కడి దుకాణాల్లో ఏదైనా కొనుక్కోవడం వీలయ్యేది కాదు. ఒకసారి కోన్‌ ఐస్‌క్రీమ్‌ కొనుక్కోవడానికి ఒక దుకాణంలోకి వెళ్ళాను గానీ నన్ను బయటకు వెళ్ళగొట్టేశారు. అప్పుడు ఒక తెల్ల జాతీయురాలు దయతో ఒకటి కొనుక్కొచ్చి నాకు ఇచ్చింది.

నేను ఉన్నత పాఠశాలలో ప్రవేశించే సమయానికి, దక్షిణాన పౌరహక్కుల ఉద్యమం ఊపందుకుంటోంది. NAACP (National Association for the Advancement of Colored People) వంటి సంస్థలు విద్యార్థులను దానిలో పాల్గొనమని ప్రోత్సహించేవి. దాని సభ్యులవమని ఆ సంస్థలు మమ్మల్ని కోరాయి. మా స్కూల్‌తో సహా నల్ల జాతీయుల చాలా స్కూళ్ళు ప్రతీ విద్యార్థి దానిలో సభ్యులయ్యేలా చేయాలన్న లక్ష్యం పెట్టుకున్నాయి. “మన జాతికి మద్దతు ఇవ్వాలి” అంటూ స్కూల్‌ వాళ్ళు నన్ను ఒత్తిడి చేశారు. కానీ నేను దానికి నిరాకరించి, దేవుడు పక్షపాతం చూపించడనీ, ఆయన ఒక జాతికన్నా మరో జాతిని గొప్పదానిగా ఎంచడనీ, ఆయనే ఇలాంటి అన్యాయాలను తొలగిస్తాడన్న నమ్మకం నాకుందనీ వివరించాను.—యోహా. 17:14; అపొ. 10:34, 35.

ఉన్నత పాఠశాల విద్య ముగిసిన కొంతకాలానికే న్యూయార్క్‌ నగరానికి వెళ్ళాలని నిర్ణయించుకున్నాను. అయితే మధ్యలో, అంతకుముందు సమావేశంలో పరిచయమైన స్నేహితుల్ని కలవడానికి పెన్సిల్వేనియాలోని ఫిలడెల్ఫియాలో ఆగాను. అక్కడి సంఘంలో తెల్ల జాతీయులు, నల్ల జాతీయులు కలిసివున్నారు. నేను అలాంటి సంఘాన్ని చూడడం అదే మొదటిసారి. ప్రయాణ పర్యవేక్షకుడు ఆ సంఘాన్ని సందర్శిస్తున్న సమయంలో ఆయన నన్ను పక్కకు పిలిచి, తర్వాతి కూటంలో ఒక భాగం నిర్వహించమని నన్ను కోరాడు. దానితో ఆ సంఘంలోనే ఉండిపోవాలని నిర్ణయించుకున్నాను.

ఫిలడెల్ఫియాలో నాకు స్నేహితులైనవాళ్ళలో జెరల్డీన్‌ వైట్‌ అనే యౌవనస్థురాలు కూడా ఉంది. ఆ తర్వాత నేను ఆమెను జెరీ అని పిలిచేవాణ్ణి. ఆమెకు బైబిలు జ్ఞానం ఎంతో ఉంది, అంతేకాదు ఇంటింటి పరిచర్యలో చక్కగా మాట్లాడగలిగేది. నాకు ఎక్కువగా నచ్చిన విషయం ఏమిటంటే ఆమెకు కూడా పయినీరు కావాలన్న లక్ష్యమే ఉండేది. మేము 1949 ఏప్రిల్‌ 23న పెళ్ళి చేసుకున్నాం.

గిలియడ్‌కు ఆహ్వానం

గిలియడ్‌ పాఠశాలకు హాజరై విదేశాల్లో మిషనరీలుగా సేవ చేయాలన్నదే మొదటి నుండి మా లక్ష్యం. గిలియడ్‌కు వెళ్ళడానికి అర్హులమయ్యేందుకు మేము సంతోషంగా సర్దుబాట్లు చేసుకున్నాం. కొంతకాలానికే మమ్మల్ని న్యూజెర్సీలోని లాన్‌సైడ్‌కు, ఆ తర్వాత పెన్సిల్వేనియాలోని ఛెస్టర్‌కు, చివరికి న్యూజెర్సీలోని అట్లాంటిక్‌ నగరానికి పంపించారు. అట్లాంటిక్‌ నగరంలో ఉన్నప్పుడు మాకు పెళ్ళై రెండేళ్ళు కావడంతో గిలియడ్‌కు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులమయ్యాం. కానీ మాకు రావాల్సిన ఆహ్వానాన్ని ఆపేశారు. ఎందుకు?

1950ల తొలి భాగంలో చాలామంది యౌవనస్థులను సైన్యంలో చేర్చుకొని కొరియాతో జరుగుతున్న యుద్ధంలో పాల్గొనడానికి పంపించేవాళ్ళు. యెహోవాసాక్షులు యుద్ధంలో పాల్గొనరు కాబట్టి సైనికులుగా చేర్చుకొనే ఫిలడెల్ఫియా బోర్డు వాళ్ళపట్ల వివక్ష చూపిస్తున్నట్లు అనిపించేది. చివరకు, గతంలో నేను చేసిన పనులను FBI పరిశీలించినప్పుడు నేను యుద్ధంలో పాల్గొననని చెప్పడానికి తగిన రుజువులు దొరికాయని ఒక జడ్జీ నాకు తెలియజేశాడు. కాబట్టి 1952 జనవరి 11న ప్రెసిడెన్షియల్‌ అప్పీల్‌ బోర్డ్‌ క్రైస్తవ పరిచారకునిగా నేను సైన్యంలో చేరకుండా ఉండేందుకు నాకు మినహాయింపు ఇచ్చింది.

ఆ సంవత్సరం సెప్టెంబరులో మొదలయ్యే గిలియడ్‌ పాఠశాల 20వ తరగతికి హాజరవమనే ఆహ్వానం ఆగస్టులో మాకు అందింది. ఆ తరగతికి హాజరవుతున్నప్పుడు మాకు విదేశాల్లో నియామకం దొరుకుతుందనుకున్నాం. అప్పటికే మా అక్క డోరిస్‌ గిలియడ్‌ పాఠశాల 13వ తరగతి నుండి పట్టభద్రురాలై బ్రెజిల్‌లో సేవచేస్తోంది. దక్షిణ రాష్ట్రమైన అలబామాలోని నల్ల జాతీయుల సంఘాలను సందర్శించే ప్రయాణ పర్యవేక్షకుడిగా నాకు నియామకం దొరకడంతో నేను, జెరీ ఎంతో ఆశ్చర్యపోయాం. విదేశాల్లో సేవ చేసే నియామకం దొరుకుతుందనుకున్నాం కాబట్టి మాకు కాస్త నిరాశగా అనిపించింది.

మేము మొదటిగా హన్స్‌విల్లేలో ఉన్న సంఘాన్ని సందర్శించాం. అక్కడికి చేరుకున్న వెంటనే ఒక సహోదరి ఇంటికి వెళ్ళాం, మేము ఉండడానికి ఏర్పాటు చేసింది అక్కడే. మేము మా వస్తువులు గదిలోకి తీసుకువెళ్తుండగా ఆ సహోదరి టెలిఫోనులో మాట్లాడుతూ, “పిల్లలు వచ్చేశారు” అని చెప్పడం విన్నాం. మాకు అప్పటికి 24 ఏళ్ళే, మేము ఇంకాస్త చిన్నవాళ్ళలా కనిపించేవాళ్ళం. ఆ సర్క్యూట్‌లో సేవ చేస్తున్నప్పుడు మాకు “పిల్లలు” అనే పేరే స్థిరపడిపోయింది.

మేముంటున్న దక్షిణ ప్రాంతంలో చాలామందికి బైబిలంటే ఎంతో గౌరవం, కాబట్టి ఆ ప్రాంతాన్ని బైబిల్‌ బెల్ట్‌ అనేవాళ్ళు. అందుకే మేము తరచూ 3 విషయాలతో సంభాషణ ప్రారంభించేవాళ్ళం:

(1) ప్రపంచ పరిస్థితుల గురించి క్లుప్త వ్యాఖ్యానం.

(2) దానికి బైబిలు ఇస్తున్న పరిష్కారం.

(3) మనం చేయాలని బైబిలు చెబుతున్న విషయం.

ఆ తర్వాత ఆ సందర్భానికి తగిన బైబిలు సాహిత్యం ఇచ్చేవాళ్ళం. ఇలా చేయడం వల్ల మంచి ఫలితాలు రావడంతో న్యూయార్క్‌లో 1953లో జరిగిన ‘న్యూ వరల్డ్‌ సొసైటీ’ (నూతన లోక సమాజం) అనే సమావేశంలో నన్ను ఒక భాగం నిర్వహించమని అడిగారు. అప్పుడు నేను ఆ 3 విషయాలతో సంభాషణ ఎలా ప్రారంభించాలో ఒక ప్రదర్శన చేసి చూపించాను.

ఆ తర్వాత కొద్దికాలానికే అంటే 1953 వేసవిలో దక్షిణాన ఉన్న నల్ల జాతీయుల సర్క్యూట్లకు జిల్లా పర్యవేక్షకుడిగా నియమించబడ్డాను. వర్జీనియా నుండి ఫ్లోరిడా వరకు, పశ్చిమాన అలబామా, టెన్నెసీల వరకు ఉన్న ప్రాంతాలను మేము సందర్శించాలి. ప్రయాణ పర్యవేక్షకులు పరిస్థితులకు అనుగుణంగా సర్దుకుపోవడం అవసరం. ఉదాహరణకు మేము తరచూ మరుగుదొడ్డి, నీటి సరఫరా వంటి సౌకర్యాలు లేని ఇళ్ళలో ఉండేవాళ్ళం, పొయ్యి వెనకాల ఉన్న లోహపు టబ్బులో స్నానం చేసేవాళ్ళం. అయితే సంతోషకరమైన విషయం ఏమిటంటే ఆ ఇల్లంతటిలో అదే వెచ్చని స్థలం.

జాతి విభేదాల మధ్య నెట్టుకు వచ్చాం

దక్షిణాన సేవ చేయాలంటే ముందుచూపు, చాతుర్యం అవసరం. లాండ్రోమ్యాట్స్‌ను (డబ్బులు కట్టి వాషింగ్‌ మెషీన్లు ఉపయోగించుకునే స్థలాలను) వాడుకోవడానికి నల్ల జాతీయులకు అనుమతి ఉండేది కాదు. కాబట్టి జెరీ బట్టలు ఉతుక్కోవడానికి అక్కడికి వెళ్ళి ‘ఈ బట్టలు మిసెస్‌ థాంప్సన్‌వి’ అని చెప్పేది. దానితో చాలామంది ఆమెను ‘మిసెస్‌ థాంప్సన్‌’ వాళ్ళ పనిమనిషి అని అనుకునేవాళ్ళు. జిల్లా పర్యవేక్షకులు కార్యనిర్వహణలోనున్న నూతనలోక సంస్థ (ఆంగ్లం) అనే చిత్రం చూపించాల్సి వచ్చినప్పుడు, నేను షాపుకు ఫోను చేసి “మిస్టర్‌ థాంప్సన్‌” పేరు మీద పెద్ద తెరను (లార్జ్‌ స్క్రీన్‌ను) బుక్‌ చేసేవాణ్ణి. ఆ తర్వాత నేనే షాపుకు వెళ్ళి దాన్ని తీసుకువచ్చేవాణ్ణి. మేమెప్పుడూ మర్యాదపూర్వకంగా మసలుకొనేవాళ్ళం, సాధారణంగా ఎలాంటి సమస్యలూ లేకుండా పరిచర్య చేయగలిగేవాళ్ళం.

ఉత్తరాన ఉండేవాళ్ళకు, దక్షిణాన ఉండేవాళ్ళకు మధ్య మరో విధమైన వివక్ష ఉండేది. న్యూయార్క్‌కు చెందిన వాచ్‌టవర్‌ బైబిల్‌ అండ్‌ ట్రాక్ట్‌ సొసైటీ నుండి వచ్చిన జేమ్స్‌ ఎ. థాంప్సన్‌ జూనియర్‌ ఒక సమావేశంలో ప్రసంగిస్తారని అక్కడి వార్తాపత్రికలో వచ్చింది. అది చదివి కొంతమంది నేను న్యూయార్క్‌కు చెందినవాణ్ణని అనుకున్నారు, దానితో మేము అద్దెకు తీసుకున్న స్కూల్‌ ఆడిటోరియమ్‌ను మాకు ఇవ్వడానికి నిరాకరించారు. అందుకని నేను స్కూల్‌ బోర్డు వాళ్ళ దగ్గరకు వెళ్ళి నేను చట్టనూగా స్కూల్‌లో చదువుకున్నానని వాళ్ళకు వివరించాను. అప్పుడు మాకు ప్రాంతీయ సమావేశం జరుపుకోవడానికి అనుమతి దొరికింది.

1950ల మధ్యభాగంలో జాతి విభేదాలు ఎక్కువయ్యాయి, కొన్నిసార్లు కొంతమంది దౌర్జన్యానికి పాల్పడేవాళ్ళు. 1954లో జరిగిన చాలా జిల్లా సమావేశాల్లో నల్ల జాతీయులు ప్రసంగాలు ఇవ్వనందుకు కొంతమంది సాక్షులు అభ్యంతరపడ్డారు. దానితో మేము నల్లజాతి సహోదరులను ఓపిక పట్టమని ప్రోత్సహించాం. తర్వాతి వేసవిలో, సమావేశంలో ప్రసంగించే అవకాశం నాకు దొరికింది. ఆ తర్వాత, దక్షిణాన ఉన్న చాలామంది నల్లజాతి సహోదరులు ప్రసంగాలు ఇచ్చారు.

కొంతకాలానికి, దక్షిణాన జాతి విభేదాల వల్ల ఏర్పడే దౌర్జన్యాలు తగ్గుముఖం పట్టాయి. దాంతో సంఘాలన్నీ మెల్లమెల్లగా జాతి విభేదాలు లేకుండా కలిసిపోయాయి. దీనికోసం అప్పుడు సహోదర సహోదరీలను వేర్వేరు సంఘాలకు నియమించాల్సి వచ్చింది, సంఘ క్షేత్రంలో సర్దుబాట్లు చేయాల్సి వచ్చింది, సంఘాలను పర్యవేక్షిస్తున్న సహోదరుల బాధ్యతలను కూడా సవరించాల్సి వచ్చింది. నల్లజాతి సహోదరుల్లో కొంతమందికి, తెల్లజాతి సహోదరుల్లో కొంతమందికి ఈ కొత్త ఏర్పాటు నచ్చలేదు. అయితే చాలామంది మన పరలోక తండ్రిలాగే నిష్పక్షపాతంగా ఉన్నారు. నిజానికి నలుపు, తెలుపు అనే భేదం లేకుండా చాలామంది సహోదరులు మంచి స్నేహితులైపోయారు. నేను పెరిగి పెద్దవాడిని అవుతున్న రోజుల్లో అంటే 1930లలో, 1940లలో మా కుటుంబం కూడా అలాంటి పరిస్థితిని చవిచూసింది.

కొత్త నియామకం

1969 జనవరిలో దక్షిణ అమెరికాలోని గయానాలో సేవ చేయమనే ఆహ్వానం మాకు అందింది. ఆ నియామకాన్ని మేము సంతోషంగా స్వీకరించాం. మేము మొదట న్యూయార్క్‌లోని బ్రూక్లిన్‌కు వెళ్ళాం. నేను అక్కడ, గయానాలో ప్రకటనాపనిని పర్యవేక్షించడానికి సంబంధించిన శిక్షణను పొందాను. 1969 జూలైలో మేము గయానాకు చేరుకున్నాం. 16 సంవత్సరాలు ప్రయాణ సేవ చేసిన తర్వాత ఒకేచోట ఉండి సేవ చేయడమంటే మా జీవితంలో అది ఒక పెద్ద మార్పే. జెరీ మిషనరీగా ఎక్కువరోజులు పరిచర్యలో గడిపేది, నేనేమో బ్రాంచి కార్యాలయంలో సేవ చేసేవాణ్ణి.

నేను అక్కడ చేయని పనంటూ లేదు. గడ్డి కోయడం, 28 సంఘాలకు కావాల్సిన సాహిత్యాలను పంపించడం వంటివాటి నుండి బ్రూక్లిన్‌లో ఉన్న ప్రధాన కార్యాలయంతో సంప్రదింపులు జరపడం వరకు అన్ని పనులూ చేసేవాణ్ణి. నేను రోజులో 14-15 గంటలు పనిచేసేవాణ్ణి. మా ఇద్దరికీ అది కష్టంగానే ఉండేది, అయినా మేము మా నియామకంలో సంతోషించాం. మేము గయానాకు చేరుకున్నప్పుడు అక్కడ 950 మంది ప్రచారకులు ఉండేవాళ్ళు. ఇప్పుడు అక్కడ 2,500 కన్నా ఎక్కువమంది ఉన్నారు.

అక్కడి వాతావరణం చాలా బావుండేది, రుచికరమైన పండ్లూ కూరగాయలూ దొరికేవి. అంతకంటే ఎక్కువగా, బైబిలు సత్యాన్ని తెలుసుకోవాలని తపించిపోయిన వినయస్థులు దేవుని రాజ్యం గురించి నేర్చుకోవడం చూసి మేము సంతోషించాం. సాధారణంగా జెరీ వారానికి 20 బైబిలు అధ్యయనాలు నిర్వహించేది. మేము సత్యాన్ని నేర్పించిన చాలామంది బాప్తిస్మం తీసుకున్నారు. వాళ్ళలో కొంతమంది ఆ తర్వాత పయినీర్లుగా, సంఘ పెద్దలుగా సేవచేశారు. ఇంకొంతమందైతే గిలియడ్‌ పాఠశాలకు హాజరై మిషనరీలు అయ్యారు.

సవాళ్ళు, ముఖ్యంగా ఆరోగ్య సమస్యలు

అమెరికాలో ఉంటున్న మా అమ్మానాన్నలకు 1983లో సహాయం అవసరమైంది. మా అక్క డోరిస్‌, జెరీ, నేను కలిసి మాట్లాడుకున్నాం. బ్రెజిల్‌లో 35 ఏళ్ళపాటు మిషనరీగా సేవచేసిన డోరిస్‌ ఆ సేవను ఆపేసి అమ్మానాన్నలను చూసుకుంటానని చెప్పింది. ‘అమ్మానాన్నలను ఒక్కరు చూసుకోగలిగినప్పుడు ఇద్దరు మిషనరీ సేవ ఆపడం ఎందుకు?’ అని ఆమె అంది. మా అమ్మానాన్నలు చనిపోయినప్పటి నుండి డోరిస్‌ చట్టనూగాలో ఉంటూ ప్రత్యేక పయినీరుగా సేవచేస్తోంది.

నాకు ప్రోస్టేట్‌ క్యాన్సర్‌ ఉందని 1995లో నిర్ధారణ అవ్వడంతో తిరిగి అమెరికాకు వచ్చేశాం. మేము ఉత్తర కరోలీనలో ఉన్న గోల్డ్స్‌బరొలో స్థిరపడ్డాం. ఎందుకంటే అది టెన్నెసీలోని మా ఇంటికీ పెన్సిల్వేనియాలో ఉన్న జెరీవాళ్ళ ఇంటికీ మధ్యలో ఉంది. నాకు వచ్చిన క్యాన్సర్‌ ఇప్పుడు తగ్గుముఖం పట్టింది కాబట్టి మేము గోల్డ్స్‌బరొ సంఘంలో ఇన్‌ఫర్మ్‌ స్పెషల్‌ పయినీర్లుగా (అనారోగ్యం వంటి కారణాలవల్ల తక్కువ గంటలు చేసే అవకాశమున్న ప్రత్యేక పయినీర్లుగా) సేవచేస్తున్నాం.

65 కన్నా ఎక్కువ సంవత్సరాలపాటు మేము చేసిన పూర్తికాల సేవ గురించి ఆలోచిస్తే, యెహోవా సేవ చేయడానికి మేము సర్దుబాట్లు చేసుకోవడం వల్ల ఆయన మమ్మల్నిద్దరినీ ఆశీర్వదించినందుకు నేను ఆయనకు ఎంతో రుణపడివున్నాను. దావీదు రాసిన ఈ మాటలు ఎంతో సత్యం, ‘యథార్థవంతుల యెడల యెహోవా యథార్థవంతుడిగా ఉంటాడు.’—2 సమూ. 22:26.

[3వ పేజీలోని చిత్రాలు]

నాన్న, సహోదరుడు నికోల్స్‌ నాకు ఆదర్శంగా ఉన్నారు

[4వ పేజీలోని చిత్రాలు]

నేను, జెరీ 1952లో గిలియడ్‌ పాఠశాలకు వెళ్ళేందుకు సిద్ధమైనప్పుడు

[5వ పేజీలోని చిత్రాలు]

గిలియడ్‌ పాఠశాలకు హాజరైన తర్వాత దక్షిణాన ప్రయాణ సేవ చేసేందుకు నియమించబడ్డాం

[6వ పేజీలోని చిత్రం]

1966లో నల్ల జాతీయులు, తెల్ల జాతీయులు కలిసి జరుపుకుంటున్న జిల్లా సమావేశానికి ప్రయాణ పర్యవేక్షకులు, వాళ్ళ భార్యలు సిద్ధమౌతూ

[7వ పేజీలోని చిత్రం]

గయానాలో సంతోషంగా మిషనరీ సేవ చేశాం