ధర్మశాస్త్రంలోని ప్రాథమిక సత్యాల నుండి నేర్చుకోండి
‘మీరు జ్ఞానసత్యస్వరూపమైన ధర్మశాస్త్రము గలవారై ఉన్నారు.’—రోమా. 2:19.
1. మనం మోషే ధర్మశాస్త్రంలోని అంశాలను అర్థం చేసుకోవడం ఎందుకు ప్రాముఖ్యం?
అపొస్తలుడైన పౌలు రాసిన ప్రేరేపిత లేఖనాలు మన దగ్గర లేకపోతే, మోషే ధర్మశాస్త్రంలోని చాలా అంశాల ప్రాముఖ్యతను అర్థం చేసుకోవడం మనకు కష్టమై ఉండేది. ఉదాహరణకు, యేసు ‘నమ్మకమైన ప్రధానయాజకునిగా పాపాలకు పరిహారం’ చెల్లించడానికి ఒకేసారి బలి ఎలా అర్పించగలిగాడో పౌలు హెబ్రీయులకు రాసిన పత్రికలో తెలియజేశాడు. దాని మీద విశ్వాసం ఉంచేవాళ్లు ‘నిత్యమైన విమోచనను’ పొందవచ్చని చూపించాడు. (హెబ్రీ. 2:17; 9:11, 12) గుడారము “పరలోకసంబంధమగు వస్తువుల ఛాయారూపకం” మాత్రమేనని, మోషే ద్వారా చేయబడిన నిబంధన కన్నా “మరి శ్రేష్ఠమైన నిబంధనకు” యేసు మధ్యవర్తి అయ్యాడని పౌలు వివరించాడు. (హెబ్రీ. 7:20-22; 8:1-5) ధర్మశాస్త్రానికి సంబంధించిన అలాంటి వివరణలు పౌలు కాలంలోని క్రైస్తవులకే కాక మనకు కూడా ఎంతో విలువైనవి. ఆ వివరణల వల్ల, దేవుడు మన కోసం చేసిన ఏర్పాట్ల విలువను సంపూర్ణంగా గ్రహించగలుగుతాం.
2. అన్యులకు లేని ఏ అవకాశం యూదా క్రైస్తవులకు ఉండేది?
2 పౌలు రోమా సంఘంలోని క్రైస్తవులకు రాసినప్పుడు, వాళ్లలో మోషే ధర్మశాస్త్రం గురించి తెలిసిన యూదులను ఉద్దేశించి కొన్ని విషయాలు రాశాడు. అలాంటి వాళ్లకు ధర్మశాస్త్రం గురించి బాగా తెలిసి ఉంటుంది కాబట్టి యెహోవాకు, ఆయన నీతి సూత్రాలకు సంబంధించిన ‘జ్ఞానసత్యస్వరూపం’ గురించి అంటే ధర్మశాస్త్రంలోని ప్రాథమిక సత్యాల గురించి కూడా వాళ్లకు అవగాహన ఉంటుందని ఆయన అంగీకరించాడు. వాళ్లకు ‘సత్యస్వరూపం’ గురించి కాస్త అవగాహన ఉండడమే కాక దాని పట్ల ప్రగాఢమైన గౌరవం ఉండేది. దానివల్ల, పూర్వకాలంలోని నమ్మకమైన యూదుల్లాగే ఆ యూదా క్రైస్తవులు కూడా ధర్మశాస్త్రం గురించి తెలియనివాళ్లకు దాని గురించి బోధించగలిగారు.—రోమీయులు 2:17-20 చదవండి.
యేసు బలికి పూర్వఛాయలు
3. యూదులు అర్పించిన బలుల గురించి తెలుసుకోవడం వల్ల మనమెలా ప్రయోజనం పొందుతాం?
3 యెహోవా సంకల్పాలను అర్థం చేసుకోవాలంటే పౌలు ప్రస్తావించిన ధర్మశాస్త్రంలోని ప్రాథమిక సత్యాలు మనకు ఇప్పటికీ ప్రాముఖ్యమే. ధర్మశాస్త్రాన్ని ఉపయోగించి యెహోవా తన ప్రజలకు నేర్పించిన విషయాలు మనకు ఇప్పుడు కూడా అవసరమే. ఈ విషయాన్ని మనసులో ఉంచుకొని, మనం ధర్మశాస్త్రంలోని ఒక అంశం గురించి అంటే, వివిధ రకాల బలులు, అర్పణలు వినయస్థులైన యూదులను ఎలా క్రీస్తు దగ్గరికి నడిపించాయో, దేవుడు తమ నుండి కోరే వాటిని అర్థం చేసుకోవడానికి వాళ్లకు ఎలా సహాయం చేశాయో ఇప్పుడు పరిశీలిద్దాం. యెహోవా సేవకులు పాటించాల్సిన నియమాలు మారవు కాబట్టి బలులు, అర్పణల విషయంలో దేవుడు ఇశ్రాయేలీయులకు ఇచ్చిన నియమాలు మనం పరిశుద్ధ సేవను ఎంత చక్కగా చేస్తున్నామో తెలుసుకోవడానికి సహాయం చేస్తాయనే దాని గురించి కూడా పరిశీలిద్దాం.—మలాకీ 3:6.
4, 5. (ఎ) మోషే ధర్మశాస్త్రం దేవుని ప్రజలకు ఏమి గుర్తుచేసేది? (బి) బలుల గురించి దేవుడిచ్చిన నియమం దేనికి పూర్వఛాయగా ఉంది?
4 మోషే ధర్మశాస్త్రంలోని చాలా అంశాలు, తాము పాపులమని యూదులు గుర్తించేలా చేసేవి. ఉదాహరణకు, మానవ శవాన్ని ముట్టుకున్నవాళ్లు పవిత్రపర్చబడాలని ధర్మశాస్త్రం కోరింది. దానికోసం వాళ్లు ఎర్రని ఆవును వధించి దహించేవాళ్లు. దాని బూడిదను ‘పాపపరిహార జలాన్ని’ తయారు చేయడానికి ఉపయోగించేవాళ్లు. ఆ జలాన్ని ఒక వ్యక్తి అపవిత్రుడైన తర్వాత మూడవ రోజున, ఏడవ రోజున ఆయన మీద చిలకరించేవాళ్లు. (సంఖ్యా. 19:1-13) అంతేకాక, పునరుత్పత్తి ద్వారా మానవులు తమ తర్వాతి తరానికి అపరిపూర్ణతను, పాపాన్ని సంక్రమింపజేస్తారని గుర్తుచేసేందుకు, ఒక స్త్రీ శిశువుకు జన్మనిచ్చిన తర్వాత కొన్నిరోజులపాటు అపవిత్రురాలిగా ఉండి ఆ తర్వాత ఒక బలి అర్పించి తన పాపానికి ప్రాయశ్చిత్తం చేసుకోవాలనే నియమం ఉండేది.—లేవీ. 12:1-8.
5 యూదులు తమ పాపాలకు ప్రాయశ్చిత్తం చేసుకోవాల్సి వచ్చే సందర్భాలు ఎన్నో ఉండేవి కాబట్టి వాటికోసం జంతు బలులు అర్పించాల్సి ఉండేది. బలి అర్పించేవాళ్లు గ్రహించినా గ్రహించకపోయినా, వాళ్లు గుడారం దగ్గర అర్పించిన బలులు, ఆ తర్వాత యెహోవా ఆలయంలో అర్పించిన బలులు అన్నీ యేసు పరిపూర్ణ బలికి ‘పూర్వఛాయగా’ ఉన్నాయి.—హెబ్రీ. 10:1-10.
ఎలాంటి ఉద్దేశంతో బలులు అర్పించాలి?
6, 7. (ఎ) బలి అర్పించేందుకు దేన్నైనా ఎంచుకున్నప్పుడు ఇశ్రాయేలీయులు ఏమి గుర్తుంచుకోవాల్సి ఉండేది? (బి) అది దేనికి పూర్వఛాయగా ఉంది? (సి) మనం ఏ ప్రశ్నలు వేసుకోవచ్చు?
6 యెహోవాకు అర్పించే ఏ జంతువైనా “దోషము లేనిదై” ఉండాలి. అది గుడ్డిది, దెబ్బతిన్నది, అవిటిది, రోగంగలది అయ్యుండకూడదు. (లేవీ. 22:20-22) ఇశ్రాయేలీయులు పండ్లను లేదా ధాన్యాన్ని యెహోవాకు అర్పిస్తే తమ పంటలోని ‘ప్రథమఫలాలను,’ ‘ప్రశస్తమైనవాటిని’ అర్పించాలి. (సంఖ్యా. 18:12, 29) ప్రశస్తంకాని వాటిని యెహోవా అంగీకరించలేదు. జంతు బలుల విషయంలో యెహోవా పెట్టిన నియమం వల్ల, యేసు బలి నిర్దోషంగా, నిష్కళంకంగా ఉంటుందనీ మానవులను రక్షించడానికి యెహోవా తన దగ్గరున్న ప్రశస్తమైనదాన్ని, ప్రియమైనదాన్ని బలిగా అర్పిస్తాడనీ తెలిసింది.—1 పేతు. 1:18, 19.
7 బలి అర్పించే వ్యక్తికి యెహోవా చూపించిన మంచితనమంతటి పట్ల నిజంగా కృతజ్ఞత ఉంటే, తన దగ్గరున్న వాటిలో ప్రశస్తమైనదాన్ని సంతోషంగా ఇవ్వడా? ప్రశస్తమైనదాన్ని అర్పించాలా వద్దా అనేది ఆయన చేతుల్లోనే ఉండేది. అయితే, లోపంగల దాన్ని బలిగా అర్పిస్తే యెహోవా సంతోషించడనే విషయం ఆయనకు తెలుసు. ఒకవేళ అలా అర్పిస్తే ఏదో అర్పించాలి కదా అని బలి అర్పించినట్లయ్యేది, చివరికి భారంగా అర్పించినట్లయ్యేది. (మలాకీ 1:6-8, 13 చదవండి.) ఈ ఉదాహరణను బట్టి, మనం దేవునికి చేసే సేవ గురించి ఆలోచించుకోవడం అవసరం. మనం ఈ ప్రశ్నలు వేసుకోవచ్చు, ‘నేను ఎలాంటి ఉద్దేశంతో యెహోవా సేవ చేస్తున్నాను? నేను యెహోవా సేవ చేసే విధానంలో మార్పులు చేసుకోవాల్సి ఉందా? నేను చేయగలిగినదంతా చేస్తున్నానా?’
8, 9. బలులు అర్పించే విషయంలో ఇశ్రాయేలీయుల ఉద్దేశాల గురించి ఎందుకు తెలుసుకోవాలి?
8 యెహోవా పట్ల కృతజ్ఞత చూపించడానికి ఇష్టపూర్వకంగా బలి అర్పిస్తున్నప్పుడు గానీ యెహోవా అనుగ్రహం పొందడానికి దహనబలి అర్పిస్తున్నప్పుడు గానీ ప్రశస్తమైన జంతువును ఎంచుకోవడం ఇశ్రాయేలీయులకు కష్టమైవుండకపోవచ్చు. వాళ్లు ప్రశస్తమైనదాన్ని సంతోషంగా యెహోవాకు అర్పించేవాళ్లు. ఇప్పుడు క్రైస్తవులు మోషే ధర్మశాస్త్రం కోరినలాంటి బలులు అర్పించరు కానీ మరో రకమైన బలులు అర్పిస్తారు. అంటే, యెహోవా సేవ చేయడానికి తమ సమయాన్ని, శక్తిని, వనరులను ఉపయోగిస్తారు. క్రైస్తవ నిరీక్షణ గురించి ఇతరులకు ప్రకటించడం, “ఉపకారమును, ధర్మమును” చేయడం అనేవి దేవునికి సంతోషం కలిగించే బలులని అపొస్తలుడైన పౌలు అన్నాడు. (హెబ్రీ. 13:15, 16) యెహోవా ప్రజలు అలాంటి పనుల్లో సరైన ఉద్దేశంతో పాల్గొనడాన్ని చూస్తే, యెహోవా తమకు ఇచ్చిన సమస్తాన్ని బట్టి ఆయన పట్ల వాళ్లకు ఎంత కృతజ్ఞత ఉందో స్పష్టమౌతుంది. పూర్వకాలాల్లో ఇష్టపూర్వకంగా బలులు అర్పించిన ఇశ్రాయేలీయుల ఉద్దేశాలూ ఇప్పుడు యెహోవా సేవలో పాల్గొనే క్రైస్తవుల ఉద్దేశాలూ ఒకటే.
9 ఒక వ్యక్తి తప్పు చేసినప్పుడు పాపపరిహారార్థ బలి లేదా అపరాధ పరిహారార్థ బలి అర్పించమని మోషే ధర్మశాస్త్రం కోరింది, మరి అలాంటి బలుల విషయమేమిటి? అలాంటి బలులు ఖచ్చితంగా అర్పించాల్సి ఉండేది కాబట్టి వాటిని అర్పించడం ఇశ్రాయేలీయులకు కష్టంగా ఉండేదా? అలాంటి వాటిని బహుశా సణుగుతూ అర్పించేవాళ్లా? (లేవీ. 4:27, 28) యెహోవాతో మంచి సంబంధాన్ని కాపాడుకోవాలనే కోరిక ఉన్నవాళ్లు అలా చేసివుండకపోవచ్చు.
10. మనం ఏదైనా తప్పు చేస్తే ఎలాంటి “బలులు” అర్పించాల్సి ఉంటుంది?
10 ఇప్పుడు కూడా, కొన్నిసార్లు అనాలోచితంగానో, అనుకోకుండానో ఒక సహోదరుని మనసు నొప్పించామని మీరు గ్రహించవచ్చు. మీరు తప్పు చేశారని మీ మనస్సాక్షి మీకు చెప్పవచ్చు. యెహోవా సేవచేయాలనే నిజమైన కోరిక ఉన్నవాళ్లు తమ తప్పు దిద్దుకోవడానికి తాము చేయగలిగినదంతా చేస్తారు. దానికోసం మీరు ఆ సహోదరుణ్ణి నిజాయితీగా క్షమాపణ అడగాలి. లేదా ఒకవేళ మీరు ఏదైనా గంభీరమైన తప్పు చేసివుంటే ప్రేమగల క్రైస్తవ పర్యవేక్షకుల ఆధ్యాత్మిక సహాయాన్ని కోరాలి. (మత్త. 5:23, 24; యాకో. 5:14, 15) కాబట్టి, తోటి సహోదరుని విషయంలో గానీ యెహోవా విషయంలో గానీ మనం చేసిన తప్పును సరిదిద్దుకోవడానికి ఏదో ఒకటి చేయాల్సి ఉంటుంది. మనం అలాంటి “బలులు” అర్పించినప్పుడు యెహోవాతో, మన సహోదరునితో మన సంబంధాన్ని, మంచి మనస్సాక్షిని తిరిగి సంపాదించుకోగలుగుతాం. దీన్నిబట్టి, మనకు ఏది మంచిదో యెహోవాకే బాగా తెలుసనే నమ్మకం కుదురుతుంది.
11, 12. (ఎ) సమాధాన బలుల వల్ల ఏమి సాధ్యమయ్యేది? (బి) ఆ బలులకు, నేటి స్వచ్ఛారాధనకు మధ్య పోలిక ఏమిటి?
11 సమాధాన బలులు అర్పించాలని కూడా మోషే ధర్మశాస్త్రం కోరింది. ఇవి ఒక వ్యక్తి యెహోవాతో సమాధానంగా ఉన్నాడని సూచించేవి. అలాంటి బలులు అర్పించే వ్యక్తి, ఆయన కుటుంబ సభ్యులు బలి అర్పించిన జంతు మాంసాన్ని బహుశా ఆలయంలోని ఒక భోజనశాలలో కలిసి తినేవాళ్లు. ఆ మాంసంలో కొంత భాగాన్ని ఆ జంతువును వధించిన యాజకునికి, ఆలయంలో సేవ చేస్తున్న ఇతర యాజకులకు ఇచ్చేవాళ్లు. (లేవీ. 3:1; 7:31-33) దేవునితో మంచి సంబంధాన్ని కాపాడుకోవాలన్న ఉద్దేశంతోనే ఒక వ్యక్తి అలాంటి బలి అర్పించేవాడు. ఒక రకంగా ఆ వ్యక్తి, ఆయన కుటుంబం, యాజకులు, యెహోవా అందరూ కలిసి సమాధానంగా భోజనం చేస్తున్నట్లుగా ఉండేది.
12 అలాంటి భోజనానికి సూచనార్థకంగా యెహోవాను ఆహ్వానించడం, ఆయన దాన్ని స్వీకరించడం నిజంగా ఎంత గొప్ప అవకాశమో కదా! ఏ ఆతిథేయి అయినా అలాంటి గౌరవనీయుడైన అతిథికి తన దగ్గరున్న ప్రశస్తమైనదాన్నే ఇవ్వాలనుకుంటాడు. సమాధాన బలులు అర్పించడమనేది ధర్మశాస్త్రంలోని ప్రాథమిక సత్యాల్లో ఒకటి. సృష్టికర్తతో సమాధానకరమైన సన్నిహిత సంబంధాన్ని ఏర్పర్చుకోవాలని కోరుకునే వాళ్లందరూ యేసు అర్పించే గొప్ప బలి మూలంగా అలా ఏర్పర్చుకోవడం సాధ్యమేనని అది సూచించింది. ఇప్పుడు మనం యెహోవా సేవలో మన వనరులను, శక్తిని ఇష్టపూర్వకంగా వెచ్చించి ఆయనతో మంచి స్నేహాన్ని ఏర్పర్చుకోవచ్చు.
బలులు అర్పిస్తున్నప్పుడు ఏమి గుర్తుంచుకోవాలి?
13, 14. సౌలు రాజు అర్పించాలనుకున్న బలిని యెహోవా ఎందుకు ఇష్టపడలేదు?
13 ఆ కాలంలో మోషే ధర్మశాస్త్రం చెప్పిన బలులను సరైన ఉద్దేశంతో, మంచి మనసుతో అర్పించినప్పుడే యెహోవా వాటిని అంగీకరించేవాడు. అయితే, దేవుడు ఎలాంటి బలులను అంగీకరించడో తెలియజేసే ఉదాహరణలు బైబిల్లో ఉన్నాయి. ఆయన వాటిని ఎందుకు అంగీకరించలేదు? రెండు సందర్భాలను మనం చూద్దాం.
14 యెహోవా అమాలేకీయులకు శిక్ష విధించే సమయం వచ్చిందని సమూయేలు ప్రవక్త సౌలు రాజుకు చెప్పాడు. కాబట్టి సౌలు ఆ శత్రు జనాంగంతోపాటు దాని పశు సంపదను కూడా నాశనం చేయాల్సింది. అయితే, సౌలు విజయం సాధించిన తర్వాత అమాలేకీయుల రాజైన అగగును ప్రాణాలతో ఉండనిచ్చాడు. అంతేకాక, యెహోవాకు అర్పించవచ్చన్నట్లుగా పశుసంపదలో శ్రేష్ఠమైనవాటిని చంపలేదు. (1 సమూ. 15:2, 3, 21) అప్పుడు యెహోవా ఏం చేశాడు? సౌలు అవిధేయత చూపించినందుకు యెహోవా ఆయనను తిరస్కరించాడు. (1 సమూయేలు 15:22, 23 చదవండి.) దీని నుండి మనం ఏమి నేర్చుకోవచ్చు? మనం అర్పించే బలిని దేవుడు అంగీకరించాలంటే మనం ఆయన ఆజ్ఞలకు కూడా విధేయత చూపించాలి.
15. యెషయా కాలంలో బలులు అర్పించిన కొంతమంది ఇశ్రాయేలీయుల చెడు ప్రవర్తన ఏమి నిరూపించింది?
15 యెషయా గ్రంథంలో కూడా అలాంటి ఉదాహరణే ఉంది. యెషయా కాలంలో ఇశ్రాయేలీయులు యెహోవాకు బలులు అర్పించారు కానీ వాళ్ల చెడు ప్రవర్తన వల్ల వాళ్ల బలులు విలువలేనివి అయిపోయాయి. యెహోవా వాళ్లతో ఇలా అన్నాడు, “విస్తారమైన మీ బలులు నాకేల? దహనబలులగు పొట్టేళ్లును బాగుగా మేపిన దూడల క్రొవ్వును నాకు వెక్కసమాయెను. కోడెల రక్తమందైనను గొఱ్ఱెపిల్లల రక్తమందైనను మేకపోతుల రక్తమందైనను నాకిష్టములేదు. ... మీ నైవేద్యము వ్యర్థము, అది నాకు అసహ్యము పుట్టించు ధూపార్పణము. దాని నికను తేకుడి.” యెహోవా ఎందుకు తేవద్దన్నాడు? “మీరు బహుగా ప్రార్థనచేసినను నేను వినను. మీ చేతులు రక్తముతో నిండియున్నవి. మిమ్మును కడుగుకొనుడి, శుద్ధి చేసికొనుడి. మీ దుష్క్రియలు నాకు కనబడకుండ వాటిని తొలగింపుడి” అని దేవుడు వాళ్లతో చెప్పాడు.—యెష. 1:11-16.
16. దేవుడు ఎలాంటి బలులను అంగీకరిస్తాడు?
16 పశ్చాత్తాపపడని వాళ్ల బలులను యెహోవా ఇష్టపడలేదు. అయితే, దేవుని ఆజ్ఞలకు అనుగుణంగా జీవించడానికి మనస్ఫూర్తిగా కృషి చేసినవాళ్ల ప్రార్థనలను, బలులను ఆయన అంగీకరించాడు. అలాంటివాళ్లు ధర్మశాస్త్రంలోని ప్రాథమిక సత్యాలను బట్టి తాము పాపులమని, తమకు క్షమాపణ అవసరమని గ్రహించారు. (గల. 3:19) అలా గ్రహించడం వల్ల వాళ్లు తమ స్థితిని అర్థం చేసుకుని ఎంతో బాధపడేవాళ్లు. అలాగే ఇప్పుడు మనం కూడా క్రీస్తు బలి మనకు ఎంత అవసరమో గుర్తించాలి. ఆయన అర్పించిన బలివల్ల మాత్రమే మన పాపాలకు ప్రాయశ్చిత్తం కలుగుతుంది. ఈ విషయాన్ని మనం అర్థం చేసుకుంటే, మనం ఆయనకు చేసే సేవలో అర్పించేవాటన్నిటినీ ఆయన సంతోషంగా ‘అంగీకరిస్తాడు.’—కీర్తన 51:17, 19 చదవండి.
యేసు బలిపై విశ్వాసం ఉంచండి!
17-19. (ఎ) యేసు విమోచన క్రయధన బలి విషయంలో మన కృతజ్ఞతను యెహోవాకు ఎలా చూపించవచ్చు? (బి) తర్వాతి ఆర్టికల్‌లో ఏమి నేర్చుకుంటాం?
17 ఇశ్రాయేలీయులు దేవుని సంకల్పాల “ఛాయ” మాత్రమే చూశారు కానీ మన దగ్గరైతే వాస్తవం ఉంది. (హెబ్రీ. 10:1) దేవునితో మంచి సంబంధాన్ని ఏర్పర్చుకోవాలంటే ఆయన పట్ల నిజమైన కృతజ్ఞతను, ఆయనకు ప్రశస్తమైనవి అర్పించాలనే కోరికను, తమకు క్షమాపణ అవసరమనే గ్రహింపును వృద్ధి చేసుకోవాలని బలులకు సంబంధించిన ఆజ్ఞలు యూదులను ప్రోత్సహించాయి. క్రైస్తవ గ్రీకు లేఖనాల్లో ఉన్న వివరణ వల్ల, విమోచన క్రయధనం ద్వారా పాపపు ప్రభావాలను యెహోవా నిర్మూలిస్తాడనీ, మనం మంచి మనస్సాక్షిని కాపాడుకోవచ్చనీ అర్థం చేసుకోవచ్చు. యేసు విమోచన క్రయధన బలి నిజంగా అద్భుతమైన ఏర్పాటు!—గల. 3:13, 14; హెబ్రీ. 9:9, 14.
18 విమోచన క్రయధనం నుండి మనం ప్రయోజనం పొందాలంటే దాన్ని అర్థం చేసుకోవడం మాత్రమే సరిపోదు. “మనము విశ్వాస మూలమున నీతిమంతులమని తీర్చబడునట్లు క్రీస్తు నొద్దకు మనలను నడిపించుటకు ధర్మశాస్త్రము మనకు బాలశిక్షకుడాయెను” అని అపొస్తలుడైన పౌలు రాశాడు. (గల. 3:24) అలాంటి విశ్వాసాన్ని క్రియల్లో చూపించాలి. (యాకో. 2:26) కాబట్టి, మోషే ధర్మశాస్త్రంలోని ప్రాథమిక సత్యాల గురించిన జ్ఞానం ఉన్న మొదటి శతాబ్దపు క్రైస్తవులు దాన్ని క్రియల్లో చూపించాలని పౌలు వాళ్లను ప్రోత్సహించాడు. అలా చేస్తే, వాళ్ల ప్రవర్తన వాళ్లు నేర్పించే దైవిక సూత్రాలకు అనుగుణంగా ఉంటుంది.—రోమీయులు 2:21-23 చదవండి.
19 నేడు క్రైస్తవులు మోషే ధర్మశాస్త్రాన్ని పాటించాల్సిన అవసరం లేకపోయినా ఇప్పుడు కూడా వాళ్లు యెహోవా అంగీకరించే బలులు అర్పించాలి. వాటిని ఎలా అర్పించవచ్చో మనం తర్వాతి ఆర్టికల్‌లో నేర్చుకుంటాం.
[అధ్యయన ప్రశ్నలు]
[17వ పేజీలోని బ్లర్బ్]
యెహోవా సేవకులు పాటించాల్సిన ప్రాథమిక నియమాలు ఎప్పుడూ మారవు
[18వ పేజీలోని చిత్రం]
యెహోవాకు మీరు ఏ జంతువును అర్పించి ఉండేవాళ్లు?
[19వ పేజీలోని చిత్రం]
యెహోవాకు ఇష్టమైన బలులు అర్పించేవాళ్లు ఆయన అనుగ్రహాన్ని పొందుతారు