కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

ఆనాటి జ్ఞాపకాలు

మన దగ్గరున్న ఆణిముత్యాలను భద్రపర్చుకుందాం

మన దగ్గరున్న ఆణిముత్యాలను భద్రపర్చుకుందాం

యెహోవా ప్రజలు ఎంతో కాలంగా యెహోవా సేవ చేస్తున్నారు. ఆ సేవకు సంబంధించిన చరిత్ర గురించి తెలుసుకోవడం ఎంతో ఆసక్తికరంగా ఉంటుంది. మన ప్రచురణల నుండి ఆ అద్భుతమైన చరిత్రను తెలుసుకోవచ్చు. అంతేకాక మన ఆరాధనకు, మన ప్రకటనాపనికి, మన చరిత్రకు సంబంధించిన ఫోటోలు, ఉత్తరాలు, వ్యక్తిగత అనుభవాలు, వస్తువులు వంటివాటి నుండి కూడా ఆ చరిత్ర గురించి తెలుసుకోవచ్చు. అయితే అలాంటి వాటిని భద్రపర్చుకుంటూ ఆ చరిత్ర గురించి తెలుసుకోవడం వల్ల మనకేమి ప్రయోజనం? ప్రాచీన ఇశ్రాయేలులో యెహోవా ఇచ్చిన ఆజ్ఞలను, ఆయన చేసిన అద్భుత కార్యాలను తమ పిల్లలకు తెలియజేయాల్సిన బాధ్యత తండ్రులకు ఉండేది. అలా చేయడం వల్ల పిల్లలు “దేవునియందు నిరీక్షణ” ఉంచగలిగేవాళ్లు.—కీర్త. 78:1-8.

ప్రాచీన చరిత్రను పరిశోధించడమనేది యెహోవా ఉద్దేశించినవి నెరవేరడానికి ఎప్పటి నుండో తోడ్పడుతూ వచ్చింది. ఉదాహరణకు కొంతమంది వ్యతిరేకులు యెరూషలేములో ఆలయ నిర్మాణ పనిని ఆపడానికి ప్రయత్నించినప్పుడు, మాదీయుల రాజధాని అయిన ఎగ్బతానాలోవున్న ప్రాచీన పత్రాలను అధికారికంగా వెదకడంతో, ఆ నిర్మాణ పనిని చేపట్టమని కోరెషు రాజు ఒకప్పుడిచ్చిన ఆజ్ఞవున్న పత్రం దొరికింది. (ఎజ్రా 6:1-4, 12) ఫలితంగా, దేవుడు ఉద్దేశించినట్లుగానే ఆలయం మళ్లీ నిర్మించబడింది. సువార్త రచయిత అయిన లూకా కూడా అలాంటి ప్రాచీన పత్రాలను ఉపయోగించే ‘అన్నిటిని మొదటనుండి తరచి పరిష్కారముగా తెలుసుకున్నాడు.’—లూకా 1:1-4.

మన దైవపరిపాలనా చరిత్ర విషయంలో పరిపాలక సభకు ఎంతో ఆసక్తి ఉంది. మన ఆధ్యాత్మిక సంపదను భద్రపర్చి, దాన్ని రాతరూపంలో పెట్టి, తర్వాతి తరాల వాళ్లకు దాన్ని అందజేయాల్సిన అవసరం ఉందని చెబుతూ పరిపాలక సభలోని ఒక సభ్యుడు ఇలా అన్నాడు, “మనం ఎక్కడికి వెళ్తున్నామో తెలుసుకోవాలంటే, ముందు మనం ఎక్కడి నుండి వచ్చామో తెలుసుకోవాలి.” అందుకే ఇటీవల, న్యూయార్క్‌లోని బ్రూక్లిన్‌లో ఉన్న ప్రపంచ ప్రధాన కార్యాలయంలో రైటింగ్‌ ఆర్కైవ్స్‌ (మన చరిత్రను పరిశోధించి, సమాచారాన్ని సేకరించి, దాని గురించి ఆర్టికల్స్‌ రాయడం) అనే ఒక కొత్త విభాగం ఏర్పడింది. ఈ విభాగం రైటింగ్‌ కమిటీ నిర్దేశం కింద పనిచేస్తుంది.

మన “కుటుంబ ఆల్బమ్‌,” మనకు “స్వాస్థ్యంగా వచ్చిన వస్తువులు”

గడిచిన కాలం తిరిగిరాదు కాబట్టి మన కుటుంబానికి సంబంధించిన అన్ని విషయాలు భద్రపర్చుకుని ఉంటే బాగుండేదని మనలో చాలామందికి అనిపిస్తుంది. మనకు స్వాస్థ్యంగా వచ్చినవాటిని భద్రపర్చి, దాన్ని రాతరూపంలో పెట్టడానికి ఇప్పుడు రైటింగ్‌ ఆర్కైవ్స్‌ విభాగంలో ఎంతో కృషి జరుగుతోంది. జాగ్రత్తగా భద్రపర్చిన ఫోటోలు మన ప్రపంచవ్యాప్త ‘కుటుంబ ఆల్బమ్‌లో’ భాగమనే చెప్పవచ్చు. మన తొలి ప్రచురణలు, ఆసక్తికరమైన సొంత అనుభవాలు, రాజ్య సేవలో వాళ్లు ఉపయోగించిన పరికరాలు వంటివి కూడా ఆణిముత్యాలనే చెప్పవచ్చు. అవి మనకు “స్వాస్థ్యంగా వచ్చిన వస్తువులు.” అవి మన ఆధ్యాత్మిక సంపద గురించి తెలియజేస్తాయి, మన ఆధ్యాత్మిక కుటుంబ భవిష్యత్తు గురించి ధైర్యంగా ఎదురుచూడడానికి సహాయం చేస్తాయి.

“ఆనాటి జ్ఞాపకాలు” అనే కొత్త శీర్షికతో వచ్చే ఆర్టికల్స్‌ చదవడం ద్వారా రైటింగ్‌ ఆర్కైవ్స్‌ విభాగం అందించే విషయాలను తెలుసుకోమని మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. ఈ కొత్త శీర్షిక కావలికోట అధ్యయన ప్రతిలో వస్తుంది. ఉదాహరణకు, డాన్‌ మొబైల్‌ (Dawn Mobile) అంటే ఏమిటి? దాన్ని ఎవరు ఉపయోగించారు? ఎప్పుడు ఉపయోగించారు? ఎందుకు ఉపయోగించారు? వంటి ప్రశ్నలకు సమాధానమిచ్చే ఆర్టికల్‌ను రాబోయే ఒక సంచికలో ప్రచురించాలనుకుంటున్నాం.

ఎన్నో విషయాలను గుర్తుకుతెచ్చే కుటుంబ ఆల్బమ్‌లా ఈ విభాగం సేకరించేవి మన గురించి, పూర్వకాలంలోని మన ఆధ్యాత్మిక సహోదరుల గురించి తెలియజేస్తాయి. వాటి ద్వారా, ఒకప్పుడు వాళ్లు చూపించిన విశ్వాసం గురించి, ధైర్యం గురించి, అలాగే మన ప్రేమగల పరలోక తండ్రి సేవలో వచ్చే ఆనందాల గురించి, సవాళ్ల గురించి, అంతేకాక దేవుడు తన ప్రజలకిచ్చే నిర్దేశం గురించి, మద్దతు గురించి మనం తెలుసుకోగలుగుతాం. (ద్వితీ. 33:27) మనం మరింత ఐక్యంగా ఉంటూ యెహోవా చిత్తం చేయడానికి కావాల్సిన బలాన్ని పొందగలిగేలా మన సంస్థ చరిత్రను భద్రపర్చడానికి చేస్తున్న కృషిని ఆయన ఆశీర్వదిస్తాడన్న నమ్మకం మనకు ఉంది.

[31వ పేజీలోని బాక్సు/చిత్రం]

మరింత నిశితంగా తెలుసుకుందాం

మన రచయితలు, కళాకారులు, పరిశోధకులు, ఇతరులు క్రైస్తవ సాహిత్యాలను, డీవీడీలను, ఇతర బైబిలు ఆధారిత సమాచారాన్ని సిద్ధం చేసేటప్పుడు ఇప్పటికే భద్రపర్చబడినవాటిని ఉపయోగిస్తారు. కాబట్టి బ్రాంచి కార్యాలయాలు, బెతెల్‌లోని వివిధ విభాగాలు, సంఘాలు, సహోదరసహోదరీలు, బయటి సంస్థలు వంటి మాధ్యమాల ద్వారా మన చరిత్రకు సంబంధించిన వివిధ రకాల సమాచారాన్ని సేకరించి భద్రపర్చడానికి రైటింగ్‌ ఆర్కైవ్స్‌ విభాగం తగిన జాగ్రత్తలు, చర్యలు తీసుకుంటుంది. ఆ విభాగం చేసే పనులు ఏమిటో ఇప్పుడు చూద్దాం.

సేకరణ, విశ్లేషణ: రైటింగ్‌ ఆర్కైవ్స్‌ విభాగం ప్రత్యేకమైన వస్తువులను ఎప్పటికప్పుడు సేకరిస్తూనే ఉంటుంది. ఆ వస్తువుల్లో చాలావరకు, ఎన్నో తరాలుగా యెహోవా సేవలో ఉన్న కుటుంబాల్లోని వ్యక్తులు దయతో విరాళంగా ఇచ్చినవే లేదా తిరిగి అప్పగించేయాలన్న షరతు మీద ఇచ్చినవే. అలాంటి వాటిని విశ్లేషించి, పోల్చి చూడడం వల్ల మన చరిత్ర గురించిన, ఆ కాలంలోని వ్యక్తుల గురించిన మన అవగాహన పెరుగుతుంది.

సేకరించినవాటి పట్టిక: రైటింగ్‌ ఆర్కైవ్స్‌ విభాగం సేకరించిన వస్తువులు వేల సంఖ్యలో ఉన్నాయి. వాటిలో కొన్ని 100 కన్నా ఎక్కువ సంవత్సరాల క్రితం ఉపయోగించినవి. ఈ విభాగంలో ఎన్నో రకాల వస్తువులు ఉన్నాయి కాబట్టి ప్రతీ వస్తువు గురించి తెలిపే పట్టిక తయారు చేయడం అవసరం. అలా చేయడం వల్ల, భవిష్యత్తులో ఏదైనా పరిశోధన చేయాల్సి వచ్చినప్పుడు వాటిని కనుగొని ఉపయోగించడం సులభమౌతుంది.

బాగుచేయడం, భద్రపర్చడం: పాతబడిపోయిన పుస్తకాలను, వస్తువులను నిపుణుల సహాయంతో బాగుచేసి భద్రపరుస్తారు. దస్తావేజులు, ఫోటోలు, వార్తా క్లిప్పింగ్‌లు, చిత్రాలు, రికార్డింగ్‌లు వంటివాటిని కంప్యూటర్‌లోకి ఎక్కిస్తారు. దస్తావేజుల అసలు ప్రతులను లేదా చారిత్రక ప్రాముఖ్యత సంతరించుకున్న ఇతర వస్తువులను పదేపదే ముట్టుకోవడం వల్ల అవి పాడయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి కంప్యూటర్‌లోనే వాటిని చూసుకోవచ్చు.

నిలువ ఉంచడం, కావాల్సినప్పుడు మళ్లీ తీసి ఉపయోగించడం: వెలుగు, తేమ వంటివాటి వల్ల పాడవకుండా కాపాడడానికి పాతవాటిని ఒక క్రమ పద్ధతిలో జాగ్రత్తగా నిలువ ఉంచుతారు. పూర్వకాల చరిత్రలోని అలాంటి ఆణిముత్యాల గురించి పరిశోధించడానికి, కావాల్సినప్పుడు వాటిని మళ్లీ తీసి ఉపయోగించడానికి వీలుగా ఒక కంప్యూటర్‌ డేటాబేస్‌ను తయారుచేస్తున్నారు.

[32వ పేజీలోని చిత్రాలు]

1. “ఫోటో డ్రామా ఆఫ్‌ క్రియేషన్‌” పోస్టరు. 2. చందా రిజిస్టరు. 3. సౌండు కారు. 4. వాచ్‌టవర్‌ ఏప్రిల్‌ 15, 1912 కవరు పేజీ. 5. జే.ఎఫ్‌. రూథర్‌ఫర్డ్‌కు వచ్చిన జైలు నోటీసు. 6. డబ్ల్యూ.బి.బి.ఆర్‌. మైకు. 7. ఫోనోగ్రాఫు. 8. పుస్తకాలు పెట్టుకొనే పెట్టె. 9. వ్యక్తిగత నోట్సు. 10. జే.ఎఫ్‌. రూథర్‌ఫర్డ్‌కు వచ్చిన టెలిగ్రాం.