కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

మానవులందరికీ ప్రయోజనం చేకూర్చే రాజులైన యాజక సమూహం

మానవులందరికీ ప్రయోజనం చేకూర్చే రాజులైన యాజక సమూహం

‘మీరు ఏర్పర్చబడిన వంశమును, రాజులైన యాజకసమూహమును, పరిశుద్ధజనమును, దేవుని సొత్తయిన ప్రజలునై యున్నారు.’—1 పేతు. 2:9.

1. “ప్రభువు రాత్రి భోజనము” అనేదాన్ని ‘జ్ఞాపకార్థ ఆచరణ’ అని కూడా ఎందుకు పిలుస్తారు? దాన్ని ఎందుకు ఆచరిస్తారు?

 యేసుక్రీస్తు, ఆయన 12 మంది అపొస్తలులు సా.శ. 33, నీసాను 14 సాయంకాలం యూదుల పస్కా పండుగను చివరిసారిగా ఆచరించారు. నమ్మకద్రోహియైన ఇస్కరియోతు యూదాను పంపించిన తర్వాత యేసు ఒక కొత్త ఆచరణను ప్రవేశపెట్టాడు. దానికి ఆ తర్వాత “ప్రభువు రాత్రి భోజనము” అనే పేరు వచ్చింది. (1 కొరిం. 11:20) “నన్ను జ్ఞాపకము చేసికొనుటకై దీనిని చేయుడి” అని యేసు రెండుసార్లు చెప్పాడు. దానికి ‘జ్ఞాపకార్థ ఆచరణ’ అనే పేరు కూడా ఉంది, అది క్రీస్తు మరణాన్ని జ్ఞాపకం చేసుకోవడానికి జరిపే ఆచరణ. (1 కొరిం. 11:24, 25) ప్రపంచవ్యాప్తంగా ఉన్న యెహోవాసాక్షులు యేసు ఇచ్చిన ఆ ఆజ్ఞకు లోబడి ప్రతీ సంవత్సరం దాన్ని ఆచరిస్తారు. బైబిలు క్యాలెండరులోని నీసాను 14, ఈ సంవత్సరంలో ఏప్రిల్‌ 5, గురువారం సూర్యాస్తమయం తర్వాత మొదలౌతుంది.

2. యేసు తాను ఉపయోగించిన చిహ్నాల గురించి ఏమి చెప్పాడు?

2 ఆ సాయంకాలం యేసు చేసిన దాని గురించి, ఆయన చెప్పిన దాని గురించి లూకా ఇలా రాశాడు, ‘పిమ్మట ఆయన యొక రొట్టె పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దాని విరిచి, వారికిచ్చి—ఇది మీ కొరకు ఇయ్యబడుచున్న నా శరీరము; నన్ను జ్ఞాపకము చేసికొనుటకు దీనిని చేయుడని చెప్పెను. ఆ ప్రకారమే భోజనమైన తరువాత ఆయన గిన్నె పట్టుకొని—ఈ గిన్నె మీకొరకు చిందింపబడుచున్న నా రక్తము వలననైన క్రొత్త నిబంధన అని చెప్పెను.’ (లూకా 22:19, 20) అపొస్తలులు ఆ మాటల్ని ఎలా అర్థం చేసుకొనివుంటారు?

3. చిహ్నాల గురించి యేసు చెప్పిన మాటలను అపొస్తలులు ఎలా అర్థం చేసుకోగలిగారు?

3 అపొస్తలులు కూడా యూదులే కాబట్టి వాళ్లకు యెరూషలేము దేవాలయంలో యాజకులు అర్పించిన జంతు బలుల గురించి బాగా తెలుసు. యెహోవా అనుగ్రహం పొందడానికి అలాంటి బలులు అర్పించేవాళ్లు. వాటిలో చాలావరకు పాపక్షమాపణ పొందడానికి అర్పించేవాళ్లు. (లేవీ. 1:4; 22:17-29) ‘వాళ్ల కోసం తన శరీరం ఇవ్వబడుతుందనీ తన రక్తం చిందించబడుతుందనీ’ యేసు అన్నప్పుడు ఆయన తన పరిపూర్ణ ప్రాణాన్ని బలిగా అర్పిస్తాడని అపొస్తలులు అర్థం చేసుకోగలిగారు. యేసు బలి జంతు బలుల కన్నా ఎంతో విలువైనది.

4. “ఈ గిన్నె మీకొరకు చిందింపబడుచున్న నా రక్తము వలననైన క్రొత్త నిబంధన” అని యేసు ఏ ఉద్దేశంతో అన్నాడు?

4 “ఈ గిన్నె మీకొరకు చిందింపబడుచున్న నా రక్తము వలననైన క్రొత్త నిబంధన” అని యేసు చెప్పిన మాటల విషయమేమిటి? యిర్మీయా 31:31-33లో కొత్త నిబంధన గురించి చెప్పబడిన ప్రవచనం అపొస్తలులకు తెలుసు. (చదవండి.) మోషే ద్వారా యెహోవా ఇశ్రాయేలీయులతో చేసిన ధర్మశాస్త్ర నిబంధన స్థానంలో యేసు ఆ కొత్త నిబంధనను ప్రవేశపెడుతున్నాడనే విషయం ఆ సమయంలో ఆయన చెప్పిన మాటలను బట్టి అర్థమౌతుంది. ఆ రెండు నిబంధనలకు ఏమైనా సంబంధం ఉందా?

5. ధర్మశాస్త్ర నిబంధన ఇశ్రాయేలీయులకు ఎలాంటి చక్కని అవకాశాలను వాగ్దానం చేసింది?

5 ఆ రెండు నిబంధనల ఉద్దేశాలకు చాలా దగ్గరి సంబంధం ఉంది. ధర్మశాస్త్ర నిబంధనను ఇస్తున్నప్పుడు యెహోవా ఇశ్రాయేలు జనాంగంతో ఇలా అన్నాడు, “మీరు నా మాట శ్రద్ధగా విని నా నిబంధన ననుసరించి నడిచినయెడల మీరు సమస్తదేశ జనులలో నాకు స్వకీయ సంపాద్యమగుదురు. సమస్తభూమియు నాదేగదా. మీరు నాకు యాజక రూపమైన రాజ్యముగాను పరిశుద్ధమైన జనముగాను ఉందురు.” (నిర్గ. 19:5, 6) ఇశ్రాయేలీయులు ఆ మాటలను ఎలా అర్థం చేసుకున్నారు?

రాజులైన యాజక సమూహం గురించిన వాగ్దానం

6. ఏ వాగ్దానాన్ని నెరవేర్చడంలో భాగంగా యెహోవా ధర్మశాస్త్ర నిబంధనను ఇచ్చాడు?

6 ఇశ్రాయేలీయులు “నిబంధన” అనే మాటను అర్థం చేసుకొని ఉంటారు, ఎందుకంటే వాళ్ల పూర్వీకులైన నోవహుతో, అబ్రాహాముతో దేవుడు అంతకుముందు కొన్ని నిబంధనలు చేశాడు. (ఆది. 6:18; 9:8-17; 15:18; 17:1-9) అబ్రాహాముతో చేసిన నిబంధనలో భాగంగా యెహోవా ఆయనకిలా వాగ్దానం చేశాడు, ‘భూలోకములోని జనములన్నీ నీ సంతానమువలన ఆశీర్వాదాలను సంపాదించుకుంటాయి.’ (ఆది. 22:18, NW) ఈ వాగ్దానాన్ని నెరవేర్చడంలో భాగంగా యెహోవా ధర్మశాస్త్ర నిబంధనను ఇచ్చాడు. దాని ఆధారంగానే ఇశ్రాయేలీయులు ‘సమస్త దేశ జనుల్లో యెహోవాకు స్వకీయ సంపాద్యము’ అయ్యుండేవాళ్లు. యెహోవాకు ‘యాజక రూపమైన రాజ్యముగా’ అయ్యేందుకే వాళ్లకు ఆ అవకాశం ఇవ్వబడింది.

7. ‘యాజక రూపమైన రాజ్యముగా’ తయారయ్యే వాళ్లకు యెహోవా ఏ అవకాశాన్ని ఇచ్చాడు?

7 రాజుల గురించి, యాజకుల గురించి ఇశ్రాయేలీయులకు బాగా తెలుసు. అయితే, పూర్వకాలానికి చెందిన మెల్కీసెదెకు మాత్రమే యెహోవా ఆమోదంతో రాజుగా, యాజకునిగా సేవచేశాడు. (ఆది. 14:18) ‘యాజక రూపమైన రాజ్యముగా’ తయారయ్యే అవకాశాన్ని యెహోవా ఇశ్రాయేలీయులకు ఇచ్చాడు. ఆ తర్వాతి కాలంలో రాయబడిన ప్రేరేపిత లేఖనాలు చూపిస్తున్నట్లుగా, రాజులైన యాజక సమూహంగా ఏర్పడే అవకాశాన్ని, అంటే ఒకవైపు రాజులుగా సేవచేస్తూనే మరోవైపు యాజకులుగా కూడా సేవచేసే అవకాశాన్ని యెహోవా వాళ్లకు ఇచ్చాడు.—1 పేతు. 2:9.

8. దేవుడు నియమించిన యాజకులు ఏయే పనులు చేస్తారు?

8 సాధారణంగా రాజులు పరిపాలిస్తారు. మరి యాజకులు ఏమి చేస్తారు? హెబ్రీయులు 5:1 ఇలా వివరిస్తోంది, “ప్రతి ప్రధానయాజకుడును మనుష్యులలోనుండి యేర్పరచబడినవాడై, పాపములకొరకు అర్పణలను బలులను అర్పించుటకు దేవుని విషయమైన కార్యములు జరిగించుటకై మనుష్యుల నిమిత్తము నియమింపబడును.” కాబట్టి, యెహోవా నియమించిన యాజకులు ఆయన ఎదుట ప్రజలకు ప్రాతినిధ్యం వహిస్తారు. అంతేకాక, పాపులైన ప్రజల తరఫున బలులు అర్పించడం ద్వారా వాళ్ల కోసం యెహోవాను క్షమాపణ కోరతారు. అయితే, యాజకులు మరో పని కూడా చేస్తారు. ప్రజలకు యెహోవా నియమాలను బోధించడం ద్వారా వాళ్ల ఎదుట యెహోవాకు ప్రాతినిధ్యం వహిస్తారు. (లేవీ. 10:8-11; మలా. 2:7) ఆ విధంగా, ప్రజలు దేవునితో సమాధానపడేందుకు యాజకులు తోడ్పడతారు.

9. (ఎ) ఇశ్రాయేలీయులు ఏమి చేస్తే ‘యాజక రూపమైన రాజ్యముగా’ ఉండగలిగేవాళ్లు? (బి) యెహోవా ఎందుకు ఇశ్రాయేలీయుల మధ్యే యాజక సమూహాన్ని ఏర్పాటు చేశాడు? (సి) ఇశ్రాయేలీయులు ధర్మశాస్త్ర నిబంధన ప్రకారం ‘యాజక రూపమైన రాజ్యముగా’ ఎందుకు ఏర్పడలేకపోయారు?

9 అలా ధర్మశాస్త్రం, ‘సమస్త దేశ జనులకు’ ప్రయోజనం చేకూర్చే రాజులైన యాజక సమూహంగా ఏర్పడే అవకాశాన్ని ఇశ్రాయేలీయులకు ఇచ్చింది. అయితే, ‘వాళ్లు యెహోవా మాట శ్రద్ధగా విని, ఆయన నిబంధనను అనుసరించి నడిస్తేనే’ ఆ చక్కని అవకాశాన్ని పొందగలిగేవాళ్లు. మరి ఇశ్రాయేలీయులు, ‘యెహోవా మాటకు’ లోబడగలిగారా? కొంతమేరకు లోబడగలిగారు. కానీ పరిపూర్ణంగా లోబడలేకపోయారు. (రోమా. 3:19, 20) అందుకే, యెహోవా ఇశ్రాయేలీయుల మధ్యే యాజక సమూహాన్ని ఏర్పాటు చేశాడు. వాళ్లు రాజులుగా పరిపాలించేవాళ్లు కాదుగానీ ఇశ్రాయేలీయుల పాపాల కోసం జంతు బలులు అర్పించేవాళ్లు. (లేవీ. 4:1–6:7) అంతేకాక, తమ సొంత పాపాల కోసం కూడా యాజకులు బలులు అర్పించేవాళ్లు. (హెబ్రీ. 5:1-3; 8:3) యెహోవా అలాంటి బలులను అంగీకరించేవాడు కానీ ఆ బలులు ప్రజల పాపాలను పూర్తిగా తీసివేయలేకపోయేవి. ధర్మశాస్త్ర నిబంధన ప్రకారం ఏర్పడిన యాజకసమూహం యథార్థపరులైన ఇశ్రాయేలీయులు దేవునితో సమాధానపడేందుకు పూర్తిగా తోడ్పడలేకపోయింది. అపొస్తలుడైన పౌలు ఇలా చెప్పాడు, “ఎడ్లయొక్కయు మేకలయొక్కయు రక్తము పాపములను తీసివేయుట అసాధ్యము.” (హెబ్రీ. 10:1-4) ధర్మశాస్త్రాన్ని మీరినందువల్ల ఇశ్రాయేలీయులు శపించబడ్డారు. (గల. 3:10) అలాంటి స్థితిలో వాళ్లు సమస్త జనుల కోసం రాజులైన యాజక సమూహంగా పనిచేయలేకపోయారు.

10. ధర్మశాస్త్రం దేనిలా పనిచేసింది?

10 అలాగని ఇశ్రాయేలీయులు యెహోవా వాగ్దానం చేసినట్లుగా ‘యాజక రూపమైన రాజ్యముగా’ అసలేమాత్రం ఏర్పడలేకపోయారని కాదు. వాళ్లు యెహోవాకు లోబడడానికి నిజాయితీగా కృషి చేసివుంటే వాళ్లకు ఆ అవకాశం ఉండేది. కానీ ధర్మశాస్త్ర నిబంధన కింద ఉండగా అది సాధ్యం కాలేదు. ఎందుకు? (గలతీయులు 3:19-25 చదవండి.) ధర్మశాస్త్రాన్ని పాటించడానికి నమ్మకంగా ప్రయత్నించినవాళ్లు అబద్ధ ఆరాధనకు దూరంగా ఉండగలిగారు. అంతేకాక, తాము పాపులమని, ప్రధాన యాజకుడు అర్పించే బలి కన్నా గొప్ప బలి ఒకటి అవసరమని తెలుసుకోగలిగారు. ధర్మశాస్త్రం క్రీస్తు దగ్గరికి నడిపించే బాలశిక్షకుడిగా పనిచేసింది. ‘క్రీస్తు’ లేక ‘మెస్సీయ’ అనే పదాలకు “అభిషిక్తుడు” అని అర్థం. అయితే, ఆ తర్వాత మెస్సీయ వచ్చి, యిర్మీయా ప్రవచించిన కొత్త నిబంధనను ప్రవేశపెట్టాడు. క్రీస్తును అంగీకరించినవాళ్లు ఆ కొత్త నిబంధనలో భాగమై నిజంగా ‘యాజక రూపమైన రాజ్యముగా’ ఏర్పడడానికి ఆహ్వానించబడ్డారు. అదెలాగో ఇప్పుడు చూద్దాం.

కొత్త నిబంధనలో భాగమైన సభ్యులు రాజులైన యాజక సమూహంగా ఏర్పడ్డారు

11. రాజులైన యాజక సమూహంగా ఏర్పడేవాళ్లకు యేసు ఎలా పునాది అయ్యాడు?

11 నజరేయుడైన యేసు సా.శ. 29లో మెస్సీయగా ప్రజల మధ్యకు వచ్చాడు. ఆయన దాదాపు 30 ఏళ్ల వయసులో బాప్తిస్మం తీసుకున్నాడు. అలా, తన విషయంలో యెహోవా కలిగివున్న ప్రత్యేకమైన సంకల్పాన్ని నెరవేర్చడానికి ఇష్టపడుతున్నానని చూపించాడు. అప్పుడు యెహోవా ఆయనను “నా ప్రియ కుమారుడు” అని అన్నాడు. ఆ సమయంలో యెహోవా ఆయనను తైలంతో కాదుగానీ పరిశుద్ధాత్మతో అభిషేకించాడు. (మత్త. 3:13-17; అపొ. 10:38) దాంతో, విశ్వాసం చూపించే మానవులందరికీ ఆయన ప్రధానయాజకునిగా, భవిష్యత్తులో వాళ్లను ఏలబోయే రాజుగా నియమించబడ్డాడు. (హెబ్రీ. 1:8, 9; 5:5, 6) రాజులైన యాజక సమూహంగా ఏర్పడేవాళ్లకు ఆయన పునాది అయ్యాడు.

12. యేసు అర్పించిన బలి వల్ల ఏమి సాధ్యమైంది?

12 విశ్వాసం చూపించే మానవుల పాపాలను పూర్తిగా తీసివేసేందుకు ప్రధానయాజకునిగా యేసు ఎలాంటి బలిని అర్పించగలిగాడు? ‘ప్రభువు రాత్రి భోజనాన్ని’ మొదలుపెట్టిన సమయంలో తాను సూచించినట్లుగానే యేసు తన పరిపూర్ణ ప్రాణాన్ని బలిగా అర్పించాడు. (హెబ్రీయులు 9:11, 12 చదవండి.) సా.శ. 29లో బాప్తిస్మం తీసుకున్నప్పటి నుండి మరణించేంత వరకు ప్రధానయాజకునిగా యేసు ఇష్టపూర్వకంగా శ్రమలు అనుభవించాడు, శిక్షణ పొందాడు. (హెబ్రీ. 4:15; 5:7-10) పునరుత్థానం చేయబడిన తర్వాత ఆయన పరలోకానికి వెళ్లి తన బలి విలువను యెహోవాకు సమర్పించాడు. (హెబ్రీ. 9:24) అప్పటినుండి, యేసు తన బలిపై విశ్వాసం ఉంచేవాళ్ల తరఫున యెహోవాకు “విజ్ఞాపనము” చేయగలుగుతున్నాడు, నిరంతర జీవాన్ని పొందుతామనే నిరీక్షణతో దేవుని సేవచేయడానికి వాళ్లకు సహాయం చేయగలుగుతున్నాడు. (హెబ్రీ. 7:25) అంతేకాక, యేసు అర్పించిన బలి వల్ల కొత్త నిబంధన అమల్లోకి వచ్చింది.—హెబ్రీ. 8:6; 9:15.

13. కొత్త నిబంధనలో భాగమయ్యేందుకు ఆహ్వానించబడిన వాళ్లకు ఏ చక్కని అవకాశాలు దొరుకుతాయి?

13 కొత్త నిబంధనలో భాగమయ్యేందుకు ఆహ్వానించబడినవాళ్లు కూడా పరిశుద్ధాత్మతో అభిషేకించబడ్డారు. (2 కొరిం. 1:21) దానిలో నమ్మకమైన యూదులు భాగమయ్యారు, ఆ తర్వాత అన్యులు కూడా భాగమయ్యారు. (ఎఫె. 3:5, 6) కొత్త నిబంధనలో భాగమయ్యే వాళ్లకు ఏ చక్కని అవకాశాలు దొరుకుతాయి? వాళ్లు తమ పాపాలకు నిజమైన క్షమాపణ పొందుతారు. “నేను వారి దోషములను క్షమించి వారి పాపములను ఇక నెన్నడును జ్ఞాపకము చేసికొనను” అని యెహోవా వాగ్దానం చేశాడు. (యిర్మీ. 31:34) న్యాయపరంగా వాళ్ల పాపాలు కొట్టివేయబడతాయి కాబట్టి, వాళ్లు ‘యాజక రూపమైన రాజ్యముగా’ ఏర్పడే అవకాశం ఉంటుంది. అభిషిక్త క్రైస్తవులను ఉద్దేశించి పేతురు ఇలా రాశాడు, “మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురముచేయు నిమిత్తము, ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజకసమూహమును, పరిశుద్ధజనమును, దేవుని సొత్తయిన ప్రజలునై యున్నారు.” (1 పేతు. 2:9) యెహోవా ఇశ్రాయేలీయులకు ధర్మశాస్త్రాన్ని ఇస్తున్నప్పుడు చెప్పిన మాటలను పేతురు ఎత్తిచెబుతూ, కొత్త నిబంధనలో భాగమయ్యే క్రైస్తవులకు ఆ మాటలను అన్వయించాడు.—నిర్గ. 19:5, 6.

రాజులైన యాజక సమూహం మానవులందరికీ ప్రయోజనం చేకూరుస్తుంది

14. రాజులైన యాజక సమూహంలోని వాళ్లు ఎక్కడ సేవ చేస్తారు?

14 కొత్త నిబంధనలో భాగమయ్యే వాళ్లు ఎక్కడ సేవచేస్తారు? వాళ్లు ఒక గుంపుగా ఈ భూమ్మీద యాజకులుగా సేవచేస్తారు. అంటే, యెహోవా ‘గుణాతిశయములను ప్రచురము చేయడం’ ద్వారా, ఆధ్యాత్మిక ఆహారాన్ని అందించడం ద్వారా వాళ్లు ప్రజల ఎదుట యెహోవాకు ప్రాతినిధ్యం వహిస్తారు. (మత్త. 24:45; 1 పేతు. 2:4, 5) మరణించి పునరుత్థానం చేయబడిన తర్వాత వాళ్లు క్రీస్తుతో పాటు పరలోకంలో రాజులుగా, యాజకులుగా పూర్తిస్థాయిలో సేవచేస్తారు. (లూకా 22:29; 1 పేతు. 1:3-5; ప్రక. 1:6) దానికి రుజువుగా, పరలోకంలో యెహోవా సింహాసనం దగ్గర ఎంతోమంది ఆత్మ ప్రాణులు ఉండడాన్ని అపొస్తలుడైన యోహాను ఒక దర్శనంలో చూశాడు. ‘గొర్రెపిల్లను’ ఉద్దేశించి పాడిన ‘కొత్త పాటలో’ వాళ్లు ఇలా అన్నారు, “నీ రక్తమిచ్చి, ప్రతి వంశములోను, ఆయా భాషలు మాటలాడువారిలోను, ప్రతి ప్రజలోను, ప్రతి జనములోను, దేవునికొరకు మనుష్యులను కొని, మా దేవునికి వారిని ఒక రాజ్యముగాను యాజకులనుగాను చేసితివి; గనుక వారు భూలోకమందు ఏలుదురు.” (ప్రక. 5:8-10) ఆ తర్వాత కలిగిన ఒక దర్శనంలో ఆ పరిపాలకుల గురించి యోహాను ఇలా అన్నాడు, “వీరు దేవునికిని క్రీస్తుకును యాజకులై క్రీస్తుతోకూడ వెయ్యి సంవత్సరములు రాజ్యము చేయుదురు.” (ప్రక. 20:6) క్రీస్తుతోపాటు వాళ్లు, మానవులందరికీ ప్రయోజనం చేకూర్చే రాజులైన యాజక సమూహంగా ఏర్పడతారు.

15, 16. రాజులైన యాజక సమూహంలోని వాళ్లు భూమ్మీదున్న మానవులకు ఎలాంటి ప్రయోజనాలు చేకూరుస్తారు?

15 భూమ్మీదున్న మానవులకు 1,44,000 మంది ఎలాంటి ప్రయోజనాలు చేకూరుస్తారు? ప్రకటన 21వ అధ్యాయంలో వాళ్లు ‘గొర్రెపిల్ల భార్య’ అని పిలువబడిన పరలోక పట్టణమైన నూతన యెరూషలేముగా చిత్రీకరించబడ్డారు. (ప్రక. 21:9) ఆ అధ్యాయంలోని 2 నుండి 4 వచనాలు ఇలా చెబుతున్నాయి, “నేను నూతనమైన యెరూషలేము అను ఆ పరిశుద్ధపట్టణము తన భర్తకొరకు అలంకరింపబడిన పెండ్లికుమార్తెవలె సిద్ధపడి పరలోకమందున్న దేవుని యొద్దనుండి దిగి వచ్చుట చూచితిని. అప్పుడు—ఇదిగో దేవుని నివాసము మనుష్యులతో కూడ ఉన్నది, ఆయన వారితో కాపురముండును, వారాయన ప్రజలైయుందురు, దేవుడు తానే వారి దేవుడైయుండి వారికి తోడైయుండును. ఆయన వారి కన్నుల ప్రతి బాష్పబిందువును తుడిచివేయును, మరణము ఇక ఉండదు, దుఃఖమైనను ఏడ్పైనను వేదనయైనను ఇక ఉండదు, మొదటి సంగతులు గతించిపోయెను.” ఎంత గొప్ప ఆశీర్వాదాలో కదా! మరణం తీసివేయబడుతుంది కాబట్టి దాని వల్ల వచ్చే కన్నీళ్లు, దుఃఖం, ఏడ్పు, వేదన ఇక ఉండవు. అంటే మానవులు పరిపూర్ణులౌతారు, మానవులకూ దేవునికీ మధ్య పూర్తి సమాధానం నెలకొంటుంది.

16 రాజులైన ఈ యాజక సమూహం చేకూర్చే ఆశీర్వాదాల గురించి ప్రకటన 22:1, 2లో ఇంకా ఇలా ఉంది, “స్ఫటికమువలె మెరయునట్టి జీవజలముల నది దేవునియొక్కయు గొఱ్ఱెపిల్లయొక్కయు సింహాసనమునొద్దనుండి ఆ పట్టణపు [నూతన యెరూషలేము] రాజవీధిమధ్యను ప్రవహించుట ఆ దూత నాకు చూపెను. ఆ నదియొక్క ఈవలను ఆవలను జీవవృక్షముండెను; అది నెలనెలకు ఫలించుచు పండ్రెండు కాపులు కాయును. ఆ వృక్షముయొక్క ఆకులు జనములను స్వస్థపరచుటకై వినియోగించును.” ఈ అలంకారిక ఏర్పాట్లతో ‘జనములు’ అంటే మానవులందరూ ఆదాము వల్ల వచ్చిన అపరిపూర్ణత నుండి పూర్తి స్వస్థత పొందుతారు. అప్పుడు నిజంగానే, ‘మొదటి సంగతులు గతించిపోతాయి.’

రాజులైన యాజక సమూహంలోని వాళ్లు తమ పని పూర్తి చేస్తారు

17. రాజులైన యాజక సమూహంలోని వాళ్లు చివరకు ఏమి సాధిస్తారు?

17 రాజులైన యాజక సమూహం వెయ్యేళ్లు సేవచేయడంతో భూమ్మీదున్న మానవులు పరిపూర్ణులౌతారు. అప్పుడు ప్రధానయాజకునిగా, రాజుగా ఉన్న క్రీస్తు వాళ్లను యెహోవాకు అప్పగిస్తాడు. (1 కొరింథీయులు 15:22-26 చదవండి.) దాంతో, రాజులైన యాజక సమూహం పని పూర్తౌతుంది.

18. రాజులైన యాజక సమూహాన్ని ఆ తర్వాత యెహోవా ఎలా ఉపయోగించుకుంటాడు?

18 రాజులైన యాజక సమూహాన్ని ఆ తర్వాత యెహోవా ఎలా ఉపయోగించుకుంటాడు? ప్రకటన 22:5 ప్రకారం, వాళ్లు “యుగయుగములు రాజ్యము చేయుదురు.” ఎవరిపై రాజ్యం చేస్తారు? దాని గురించి బైబిల్లో లేదు. అయితే వాళ్లు అమర్త్యతను, అక్షయతను పొందుతారు. అంతేకాక, అపరిపూర్ణ మానవులకు సహాయం చేసిన అనుభవం కూడా వాళ్లకుంటుంది కాబట్టి వాళ్లు రాజులుగానే కొనసాగుతారు. యెహోవా తన సంకల్పాలను నెరవేర్చడానికి వాళ్లను ఎప్పటికీ ఉపయోగించుకుంటాడు.

19. క్రీస్తు మరణ జ్ఞాపకార్థ ఆచరణకు హాజరైన వాళ్లందరికీ ఏమి గుర్తుకొస్తాయి?

19 మనం ఈ సంవత్సరం ఏప్రిల్‌ 5, గురువారం యేసు మరణ జ్ఞాపకార్థ ఆచరణకు హాజరైనప్పుడు, ఈ ఆర్టికల్‌లో చర్చించిన బైబిలు బోధలన్నీ మనకు గుర్తుకొస్తాయి. ఆ సమయంలో, ఈ భూమ్మీద మిగిలి ఉన్న కొంతమంది అభిషిక్తులు తాము కొత్త నిబంధనలో భాగమని చూపిస్తూ యేసు శరీరానికి, రక్తానికి చిహ్నాలుగా ఉన్న పులియని రొట్టెను, ద్రాక్షారసాన్ని తీసుకుంటారు. క్రీస్తు బలికి సూచనగా ఉన్న ఆ చిహ్నాలను చూసినప్పుడు, దేవుని నిత్య సంకల్పంలో తమకు ఉన్న గొప్ప సేవావకాశాలు, బాధ్యతలు వాళ్లకు గుర్తుకువస్తాయి. మానవులందరికీ ప్రయోజనం చేకూర్చడానికి రాజులైన యాజక సమూహాన్ని ఏర్పాటు చేసినందుకు యెహోవాపట్ల ప్రగాఢమైన కృతజ్ఞతతో మనమందరం క్రీస్తు మరణ జ్ఞాపకార్థ ఆచరణకు హాజరౌదాం.

[అధ్యయన ప్రశ్నలు]

[29వ పేజీలోని చిత్రం]

రాజులైన యాజక సమూహంలోని వాళ్లు మానవులందరికీ శాశ్వత ప్రయోజనాలు చేకూరుస్తారు