మెలకువగా ఉండే విషయంలో యేసు అపొస్తలులను ఆదర్శంగా తీసుకోండి
“నాతోకూడ మెలకువగా నుండుడి.”—మత్త. 26:38.
1-3. యేసు భూమ్మీద గడిపిన చివరిరాత్రి అపొస్తలులు ఏ పొరపాటు చేశారు? దాని నుండి వాళ్లు పాఠం నేర్చుకున్నారని మనకెలా తెలుసు?
యేసు భూమ్మీద గడిపిన చివరిరాత్రి ఏమి జరిగిందో ఒకసారి గుర్తుచేసుకోండి. ఆయన తన నమ్మకమైన అపొస్తలులతో కలిసి తనకు ఇష్టమైన గెత్సెమనే తోటకు వెళ్లాడు, అది యెరూషలేముకు తూర్పున ఉంది. ఎన్నో ప్రాముఖ్యమైన విషయాల గురించి ఆలోచించాలి కాబట్టి ఏకాంతంగా ప్రార్థన చేసుకోవడానికి ఆయనకు ఒక చోటు కావాలి.—మత్త. 26:36; యోహా. 18:1, 2.
2 యేసుతోపాటు పేతురు, యాకోబు, యోహాను ఆ తోటలో ఒక ఏకాంత ప్రదేశానికి చేరుకున్నారు. ఆయన వాళ్లతో ‘మీరిక్కడే ఉండి, నాతోపాటు మెలకువగా ఉండండి’ అని చెప్పి ప్రార్థన చేసుకోవడానికి వెళ్లాడు. తిరిగి వచ్చేసరికి తన స్నేహితులు నిద్రపోతుండడం చూశాడు. ‘మెలకువగా ఉండండి’ అని ఆయన వాళ్లను మళ్లీ వేడుకున్నాడు. అయినాసరే మరో రెండుసార్లు వాళ్లు అలాగే నిద్రపోయారు! ఆ తర్వాత, అదే రాత్రి అపొస్తలులందరూ ఆధ్యాత్మికంగా మెలకువగా ఉండలేకపోయారు! చివరకు వాళ్లు యేసును విడిచి పారిపోయారు!—మత్త. 26:38, 41, 56.
3 మెలకువగా ఉండలేకపోయినందుకు ఆ అపొస్తలులు బాధపడేవుంటారు. కొంతకాలానికే, ఆ నమ్మకస్థులు తాము చేసిన పొరపాటు నుండి పాఠం నేర్చుకున్నారు. వాళ్లు ఆధ్యాత్మికంగా మెలకువగా ఉండే విషయంలో చక్కని మాదిరి ఉంచారని అపొస్తలుల కార్యముల పుస్తకం తెలియజేస్తోంది. వాళ్లను ఆదర్శంగా తీసుకొని వాళ్ల తోటి క్రైస్తవులు కూడా మెలకువగా ఉండేవుంటారు. అప్పటికన్నా ఇప్పుడు మనం మరింత మెలకువగా ఉండాలి. (మత్త. 24:42) కాబట్టి మెలకువగా ఉండే విషయంలో అపొస్తలుల కార్యముల పుస్తకం నుండి మనం నేర్చుకోగల మూడు పాఠాలను ఇప్పుడు చర్చిద్దాం.
ఎక్కడ ప్రకటించాలనే విషయంలో నిర్దేశం కోసం ఎదురుచూస్తూ మెలకువగా ఉన్నారు
4, 5. పౌలును, ఆయన ప్రయాణ సహవాసులను పరిశుద్ధాత్మ ఎలా నడిపించింది?
4 మొదటి పాఠమేమిటంటే, ఎక్కడ ప్రకటించాలనే విషయంలో నిర్దేశం కోసం అపొస్తలులు ఎదురుచూస్తూ మెలకువగా ఉన్నారు. అపొస్తలుడైన పౌలు, ఆయన ప్రయాణ సహవాసులు చేసిన ఒకానొక ప్రయాణాన్ని నిర్దేశించడానికి యేసు తనకు యెహోవా అనుగ్రహించిన పరిశుద్ధాత్మను ఎలా ఉపయోగించాడో బైబిల్లో చూస్తాం. (అపొ. 2:33) దాని గురించి ఇప్పుడు పూర్తిగా తెలుసుకుందాం.—అపొస్తలుల కార్యములు 16:6-10 చదవండి.
5 పౌలు, సీల, తిమోతి దక్షిణ గలతీయ నగరమైన లుస్త్ర నుండి బయలుదేరారు. కొన్నిరోజుల తర్వాత వాళ్లు పశ్చిమంగా, అధిక జనాభాగల ఆసియా ప్రాంతానికి వెళ్లే రోము ప్రధాన రహదారికి చేరుకున్నారు. క్రీస్తు గురించి తెలుసుకోవాల్సిన వేలాదిమంది ఉన్న ఆ నగరాల్లో ప్రకటించడానికి వాళ్లు ఆ మార్గంలో వెళ్లాలనుకున్నారు. అయితే వాళ్లు అలా వెళ్లకుండా ఏదో అడ్డుకుంది. 6వ వచనం ఇలా చెబుతోంది: “ఆసియలో వాక్యము చెప్పకూడదని పరిశుద్ధాత్మ వారి నాటంకపరచినందున, వారు ఫ్రుగియ గలతీయ ప్రదేశముల ద్వారా వెళ్లిరి.” ఆసియాలో ప్రకటించడానికి ఉత్సాహం చూపించిన ఆ ప్రయాణికులను అక్కడికి వెళ్లకుండా పరిశుద్ధాత్మ ఏదో విధంగా అడ్డుకుంది. దీన్నిబట్టి, యేసే పరిశుద్ధాత్మ ద్వారా పౌలును, ఆయన తోటివాళ్లను మరో ప్రాంతానికి నడిపించాలనుకున్నాడని తెలుస్తోంది.
6, 7. (ఎ) బితూనియ దగ్గర పౌలుకు, ఆయన సహవాసులకు ఏమి జరిగింది? (బి) శిష్యులు ఏ నిర్ణయం తీసుకున్నారు, దాని ఫలితమేమిటి?
6 ప్రకటించడానికి ఉత్సాహం చూపించిన ఆ ప్రయాణికులు ఎక్కడికి వెళ్లారు? వాళ్లు “ముసియ దగ్గరకు వచ్చి బితూనియకు వెళ్లుటకు ప్రయత్నము చేసిరి గాని యేసుయొక్క ఆత్మ వారిని వెళ్లనియ్యలేదు” అని 6వ వచనంలోని రెండవ భాగం, 7వ వచనం చెబుతున్నాయి. ఆసియాలో ప్రకటించేందుకు పరిశుద్ధాత్మ అనుమతించకపోవడంతో పౌలు, ఆయన తోటివాళ్లు బితూనియ నగరాల్లో ప్రకటించాలని ఉత్తర దిశలో ప్రయాణించడం మొదలుపెట్టారు. కానీ వాళ్లు బితూనియ ప్రాంతాన్ని సమీపించినప్పుడు, యేసు మళ్లీ పరిశుద్ధాత్మ ద్వారా వాళ్లను అడ్డుకున్నాడు. అప్పటికల్లా, ఆ ప్రయాణికులు తికమకపడి ఉండవచ్చు. ఏమి ప్రకటించాలో, ఎలా ప్రకటించాలో వాళ్లకు తెలుసు, కానీ ఎక్కడ ప్రకటించాలో వాళ్లకు తెలియలేదు. వాళ్లు ఆసియాకు వెళ్లడానికి ప్రయత్నించారు, కానీ అనుమతించబడలేదు. అలాగే వాళ్లు బితూనియకు వెళ్లడానికి ప్రయత్నించారు, అక్కడా అనుమతించబడలేదు. అలాగని వాళ్లు తమ పనిని మానుకున్నారా? మానుకోలేదనే తెలుస్తోంది!
7 అప్పుడు వాళ్లు కాస్త వింతగా అనిపించే నిర్ణయం తీసుకున్నారు. 8వ వచనం ఇలా చెబుతోంది: “అంతట వారు ముసియను దాటిపోయి త్రోయకు వచ్చిరి.” వాళ్లు పశ్చిమం వైపుకు తిరిగి ఒక్కొక్క నగరం దాటుకుంటూ 563 కిలోమీటర్లు నడిచి చివరకు మాసిదోనియకు సహజ ముఖ ద్వారంగావున్న త్రోయకు చేరుకున్నారు. పౌలు, ఆయన సహవాసులు సువార్త ప్రకటించేందుకు మూడవసారి ప్రయత్నించారు. అప్పుడు వాళ్లకు ప్రకటించేందుకు అవకాశం దొరికింది. ఆ తర్వాత జరిగినదాని గురించి 9వ వచనం ఇలా చెబుతోంది: “అప్పుడు మాసిదోనియ దేశస్థుడొకడు నిలిచి—నీవు మాసిదోనియకు వచ్చి మాకు సహాయము చేయుమని తనను వేడుకొనుచున్నట్టు రాత్రివేళ పౌలునకు దర్శనము కలిగెను.” చివరికి, ఎక్కడ ప్రకటించాలో పౌలుకు తెలిసింది. ఇక ఆలస్యం చేయకుండా వాళ్లందరూ మాసిదోనియకు ప్రయాణమయ్యారు.
8, 9. పౌలు ప్రయాణాల గురించి చెప్పే బైబిలు లేఖనాల నుండి మనమేమి నేర్చుకోవచ్చు?
8 ఈ వృత్తాంతం నుండి మనమేమి నేర్చుకోవచ్చు? పౌలు ఆసియాకు బయలుదేరిన తర్వాతే పరిశుద్ధాత్మ ఆయనకు నిర్దేశాన్ని ఇచ్చిందని గమనించండి. పౌలు బితూనియ ప్రాంతాన్ని సమీపించిన తర్వాతే యేసు నిర్దేశాన్నిచ్చాడు. చివరకు పౌలు త్రోయకు చేరుకున్న తర్వాతే యేసు ఆయనను మాసిదోనియకు వెళ్లమన్నాడు. సంఘ శిరస్సుగా యేసు, ఇప్పుడు మనల్ని కూడా అలాగే నడిపించవచ్చు. (కొలొ. 1:18) ఉదాహరణకు, మీరు పయినీరు సేవ చేయాలని లేదా ప్రచారకుల అవసరం ఎక్కువగా ఉన్నచోట సేవచేసేందుకు అక్కడికి వెళ్లాలని ఆలోచిస్తుండవచ్చు. అయితే ఆ లక్ష్యసాధనకు మీరు ఖచ్చితమైన చర్యలు తీసుకున్న తర్వాతే పరిశుద్ధాత్మ ద్వారా యేసు మిమ్మల్ని నడిపిస్తాడు. ఉదాహరణకు, కారు కదులుతున్నప్పుడే డ్రైవరు దానిని ఎడమకు గానీ కుడికి గానీ తిప్పగలుగుతాడు. అదే విధంగా, మనం చర్య తీసుకున్నప్పుడే అంటే లక్ష్యసాధనకు మనం కృషిచేసినప్పుడే మన పరిచర్యను విస్తృతపర్చుకునేలా యేసు మనల్ని నడిపించవచ్చు.
9 కానీ మీ కృషికి తగిన ఫలితం వెంటనే లభించకపోతే అప్పుడేమిటి? పరిశుద్ధాత్మ మిమ్మల్ని నడిపించడం లేదనుకొని ప్రయత్నించడం మానేయాలా? పౌలుకు కూడా అడ్డంకులు ఎదురయ్యాయనే విషయం గుర్తుంచుకోండి. అయినాసరే, అవకాశం దొరికే వరకు ఆయన తన అన్వేషణను, ప్రయత్నాల్ని విరమించుకోలేదు. అదే విధంగా ‘ఫలవంతమైన సేవ చేయడానికి గొప్ప అవకాశం’ దొరికే వరకు పట్టుదలతో కృషిచేస్తే మీరు కూడా ఆయనలాగే ప్రతిఫలం పొందవచ్చు.—1 కొరిం. 16:9, పరిశుద్ధ బైబల్: తెలుగు ఈజీ-టు-రీడ్ వర్షన్.
మెలకువగా ఉండేందుకు పట్టుదలతో ప్రార్థించండి
10. మెలకువగా ఉండాలంటే పట్టుదలతో ప్రార్థించడం ప్రాముఖ్యమని ఏది చూపిస్తోంది?
10 మెలకువగా ఉండే విషయంలో మన మొదటి శతాబ్దపు క్రైస్తవ సహోదరుల నుండి నేర్చుకోగల రెండవ పాఠమేమిటంటే, వాళ్లు మెలకువగా ఉండేందుకు పట్టుదలతో ప్రార్థన చేశారు. (1 పేతు. 4:7) కాబట్టి, మెలకువగా ఉండాలంటే పట్టుదలతో ప్రార్థించడం ప్రాముఖ్యం. గెత్సెమనే తోటలో బంధించబడడానికి ముందు యేసు తన ముగ్గురు అపొస్తలులతో, “మెలకువగా ఉండి ప్రార్థనచేయుడి” అని చెప్పాడని గుర్తుచేసుకోండి.—మత్త. 26:41.
11, 12. పేతురుతో, ఇతర క్రైస్తవులతో హేరోదు ఎలా వ్యవహరించాడు? ఎందుకలా వ్యవహరించాడు?
11 ఆ సమయంలో అక్కడున్న పేతురు, పట్టుదలతో చేసే ప్రార్థనలకు ఎంత బలముంటుందో ఆ తర్వాత అనుభవపూర్వకంగా తెలుసుకున్నాడు. (అపొస్తలుల కార్యములు 12:1-6 చదవండి.) ఆ వృత్తాంతంలోని ఆరంభ వచనాల్లో, యూదులను ప్రీతిపర్చడానికి హేరోదు క్రైస్తవులను హింసించాడనే విషయాన్ని తెలుసుకుంటాం. యాకోబు యేసుతో సన్నిహితంగా మెలిగిన అపొస్తలుడని బహుశా హేరోదుకు తెలిసివుండవచ్చు. అందుకే హేరోదు యాకోబును “ఖడ్గముతో” చంపించాడు. (2వ వచనం) అలా సంఘం ప్రియమైన అపొస్తలుణ్ణి పోగొట్టుకుంది. ఆ సహోదరులకు అదెంత పెద్ద పరీక్షో కదా!
12 హేరోదు ఆ తర్వాత ఏమి చేశాడు? 3వ వచనమిలా వివరిస్తోంది: “ఇది యూదులకు ఇష్టమైన కార్యమని తెలిసికొని పేతురును కూడ పట్టుకొనెను.” పేతురులాగే ముందు కూడా కొందరు అపొస్తలులు బంధించబడ్డారు, కానీ వాళ్లంతా అద్భుతరీతిలో విడిపించబడ్డారు. (అపొ. 5:17-20) హేరోదుకు అది తెలిసే ఉంటుంది. అందుకే పేతురు విడిపించబడకుండా అతడు ఈసారి పక్కా ఏర్పాట్లుచేశాడు. ఆయన, “పస్కాపండుగైన పిమ్మట ప్రజలయొద్దకు అతని తేవలెనని ఉద్దేశించి, అతనికి కావలియుండుటకు నాలుగు చతుష్టయముల [లేక ‘పదునారుగురు,’ అధస్సూచి] సైనికులకు అతనిని అప్పగించెను.” (4వ వచనం) ఒక్కసారి ఆ పరిస్థితిని ఊహించుకోండి! పేతురు ఎట్టి పరిస్థితుల్లోనూ తప్పించుకోకుండా చూసేందుకు ఆయనను ఇద్దరు సైనికుల మధ్య సంకెళ్లతో బంధించి, 16 మంది బటులు వంతులవారీగా రాత్రీపగలూ కావలికాసేలా హేరోదు ఏర్పాటు చేశాడు. పస్కా పండుగ తర్వాత పేతురును ప్రజల దగ్గరకు తీసుకొచ్చి, వాళ్లు సంతోషించేలా ఆయనకు మరణశిక్ష విధించాలని అనుకున్నాడు. అలాంటి భయానక పరిస్థితుల్లో పేతురు తోటి క్రైస్తవులు ఏమి చేశారు?
13, 14. (ఎ) పేతురు బంధించబడ్డాడని విన్నప్పుడు సంఘ సభ్యులు ఎలా స్పందించారు? (బి) ప్రార్థన విషయంలో వాళ్ల నుండి మనమేమి నేర్చుకోవచ్చు?
13 అలాంటి పరిస్థితుల్లో ఏమి చేయాలో సంఘంలోని వాళ్లకు తెలుసు. 5వ వచనంలో మనమిలా చదువుతాం: “పేతురు చెరసాలలో ఉంచబడెను, సంఘమయితే అతనికొరకు అత్యాసక్తితో దేవునికి ప్రార్థన చేయుచుండెను.” వాళ్లు తమ ప్రియ సహోదరుని కోసం తీవ్రంగా, హృదయపూర్వకంగా ప్రార్థన చేశారు. యాకోబు మరణం వల్ల వాళ్లు కృంగిపోలేదు; లేదా ప్రార్థన చేయడంవల్ల లాభంలేదని అనుకోలేదు. నమ్మకమైన ఆరాధకుల ప్రార్థనలు యెహోవాకు ఎంతో ప్రాముఖ్యమైనవని వాళ్లకు తెలుసు. అలాంటి ప్రార్థనలు దేవుని చిత్తానికి అనుగుణంగా ఉంటే ఆయన వాటికి జవాబిస్తాడు.—హెబ్రీ. 13:18, 19; యాకో. 5:16.
14 పేతురు గురించి విన్నప్పుడు ఇతర క్రైస్తవులు స్పందించిన తీరు నుండి మనమేమి నేర్చుకోవచ్చు? మెలకువగా ఉండడమంటే, కేవలం మన కోసమే ప్రార్థించుకోవడం కాదుగానీ, మన సహోదర సహోదరీల కోసం కూడా ప్రార్థించాలని అర్థం. (ఎఫె. 6:18) కష్టాలు ఎదుర్కొంటున్న సహోదర సహాదరీలెవరైనా మీకు తెలుసా? కొందరు హింసను, ప్రభుత్వ నిషేధాల్ని, లేదా ప్రకృతి విపత్తులను ఎదుర్కొంటుండవచ్చు. వాళ్ల గురించి మనం హృదయపూర్వకంగా ప్రార్థించాలి. పైకి అంతగా కనిపించని కష్టాలు ఎదుర్కొంటున్న మరితరులు కూడా మీకు తెలిసివుండవచ్చు. వాళ్లు కుటుంబ సమస్యల్ని, నిరుత్సాహాన్ని లేదా ఆరోగ్య సమస్యల్ని ఎదుర్కొంటుండవచ్చు. ‘ప్రార్థన ఆలకించే’ యెహోవాను వేడుకునే ముందు మీరు కాస్త ఆలోచిస్తే ఎవరెవరి కోసం ప్రార్థించాలో మీకు గుర్తుకురావచ్చు.—కీర్త. 65:2.
15, 16. (ఎ) యెహోవా దూత పేతురును చెరసాల నుండి ఎలా విడిపించాడో వివరించండి. (క్రింది చిత్రాన్ని చూడండి.) (బి) యెహోవా పేతురును విడిపించిన తీరు గురించి ఆలోచించడం మనకు ఎందుకు ప్రోత్సాహకరంగా ఉంటుంది?
15 ఇంతకీ పేతురుకు ఏమి జరిగింది? పేతురు చెరసాలలో ఉన్న చివరి రాత్రి ఇద్దరు సైనికుల మధ్య ఆయన గాఢంగా నిద్రపోతున్నప్పుడు కొన్ని అద్భుత సంఘటనలు ఒకదాని తర్వాత ఒకటి చోటుచేసుకున్నాయి. (అపొస్తలుల కార్యములు 12:7-11 చదవండి.) పేతురు ఉన్న చెరసాల గదిలో ఒక్కసారిగా వెలుగు ప్రకాశించింది. ఒక దేవదూత అక్కడికి వచ్చాడు, కానీ సైనికులకు ఆ దూత కనిపించి ఉండకపోవచ్చు. ఆ దూత పేతురును తట్టి లేపాడు. అప్పుడు పేతురు చేతులకున్న బలమైన సంకెళ్లు ఊడిపడ్డాయి! ఆ తర్వాత, దూత పేతురును వెంటబెట్టుకుని బయట కావలివున్న భటులను దాటుకుంటూ తిన్నగా ఇనుప ద్వారం దగ్గరకొచ్చినప్పుడు అది ‘దానంతట అదే తెరుచుకుంది.’ వాళ్లు చెరసాల దాటి బయటికి వచ్చిన తర్వాత, ఆ దూత వెళ్లిపోయాడు. అలా పేతురు విడుదలయ్యాడు.
16 యెహోవాకు తన సేవకులను రక్షించే అపారమైన శక్తి ఉందని గ్రహించడం మన విశ్వాసాన్ని బలపరుస్తుంది. అయితే మనకాలంలో యెహోవా తన సేవకుల్ని అద్భుతరీతిలో విడిపిస్తాడని ఆశించం. కానీ యెహోవా ఈ రోజుల్లో తన ప్రజల కోసం తన శక్తిని ఉపయోగిస్తాడనే పూర్తి విశ్వాసం మనకు ఉంది. (2 దిన. 16:9) ఆయన శక్తివంతమైన తన పరిశుద్ధాత్మను ఉపయోగించి మనకు ఎదురయ్యే ఎలాంటి కష్టాన్నైనా తట్టుకోవడానికి కావాల్సిన బలాన్నిస్తాడు. (2 కొరిం. 4:7; 2 పేతు. 2:9, 10) అయితే యెహోవా త్వరలోనే తన కుమారుని ద్వారా లక్షలాదిమందిని దుర్భేద్యంగా కనిపించే మరణ బంధకాల నుండి విడిపిస్తాడు. (యోహా. 5:28, 29) యెహోవా వాగ్దానాలపై మనకు విశ్వాసం ఉంటే, ఇప్పుడు మనకు ఎలాంటి పరీక్షలు వచ్చినా వాటిని ధైర్యంగా ఎదుర్కోగలుగుతాం.
అడ్డంకులు ఎదురైనా పూర్తిగా సాక్ష్యమిచ్చారు
17. పౌలు తాను జీవిస్తున్న కాలాల ప్రాముఖ్యతను గుర్తుంచుకొని ఉత్సాహంగా ప్రకటించడంలో మనకు ఎలా ఆదర్శంగా ఉన్నాడు?
17 మెలకువగా ఉండే విషయంలో అపొస్తలుల నుండి మనం నేర్చుకోగల మూడవ పాఠమేమిటంటే, వాళ్లు ఎన్ని అడ్డంకులు ఎదురైనా పూర్తిగా సాక్ష్యమిస్తూనే ఉన్నారు. మెలకువగా ఉండాలంటే మనం జీవిస్తున్న కాలాల ప్రాముఖ్యతను గుర్తుంచుకొని ఉత్సాహంగా ప్రకటించడం చాలా ప్రాముఖ్యం. ఈ విషయంలో అపొస్తలుడైన పౌలు మనకు ఆదర్శంగా ఉన్నాడు. ఆయన ఎన్నో ప్రాంతాలకు వెళ్తూ, చాలా సంఘాలు స్థాపిస్తూ దేవుని సేవలో ఉత్సాహంగా పనిచేశాడు. ఎన్ని కష్టాలు ఎదురైనా ఆయన ఎప్పుడూ తన ఉత్సాహాన్ని కోల్పోలేదు, తను జీవిస్తున్న కాలాల ప్రాముఖ్యతను మర్చిపోలేదు.—2 కొరిం. 11:23-29.
18. పౌలు రోములో బంధించబడి ఉన్నప్పుడు ఎలా సాక్ష్యమిస్తూనే ఉన్నాడు?
18 అపొస్తలుల కార్యములు 28వ అధ్యాయంలో, పౌలు గురించి ఉన్న చివరి మాటలను మనం చదువుతాం. నీరో ముందు తన వాదన చెప్పుకోవడానికి ఆయన రోముకు చేరుకున్నాడు. అప్పుడు, ఆయనకు సంకెళ్లు వేసి వాటిని కావలిగావున్న భటుని చేతికి కట్టి ఆయనను బంధించి ఉండవచ్చు. అయినా ఉత్సాహవంతుడైన ఆ అపొస్తలుడి ప్రకటనాపనిని ఏ సంకెళ్లూ ఆపలేకపోయాయి! పౌలు ఎలా వీలైతే అలా సాక్ష్యమిస్తూనే ఉన్నాడు. (అపొస్తలుల కార్యములు 28:17, 23, 24 చదవండి.) మూడురోజుల తర్వాత, సాక్ష్యమిచ్చేందుకు యూదుల్లోని ముఖ్యులైనవాళ్లను తన దగ్గరకు పిలిపించుకున్నాడు. ఆ తర్వాత ఒకరోజు ఆయన చాలామందికి సాక్ష్యమిచ్చాడు. 23వ వచనంలో, “అతనికి ఒక దినము నియమించి, అతని బసలోనికి అతని యొద్దకు [స్థానిక యూదులు] అనేకులు వచ్చిరి. ఉదయము నుండి సాయంకాలము వరకు అతడు దేవుని రాజ్యమును గూర్చి పూర్తిగా సాక్ష్యమిచ్చుచు, మోషే ధర్మశాస్త్రములో నుండియు ప్రవక్తలలోనుండియు సంగతులెత్తి యేసునుగూర్చి వివరముగా బోధించుచు వారిని ఒప్పించుచుండెను” అని మనం చదువుతాం.
19, 20. (ఎ) పౌలు ఎందుకు సమర్థవంతంగా సాక్ష్యమివ్వగలిగాడు? (బి) సువార్తను కొందరు అంగీకరించకపోయినా పౌలు ఏమి చేశాడు?
19 పౌలు ఎందుకంత సమర్థవంతంగా సాక్ష్యమివ్వగలిగాడు? దానికి చాలా కారణాలు ఉన్నాయని 23వ వచనంలో గమనించవచ్చు. (1) ముఖ్యంగా దేవుని రాజ్యం గురించి, యేసుక్రీస్తు గురించి సాక్ష్యమిచ్చాడు. (2) శ్రోతలను ‘ఒప్పిస్తూ’ మాట్లాడాడు. (3) లేఖనాలను ఉపయోగించి తర్కించాడు. (4) ‘ఉదయం నుండి సాయంకాలం వరకు’ సాక్ష్యమిస్తూ నిస్వార్థంగా ప్రకటించాడు. పౌలు సమర్థవంతంగా సాక్ష్యమిచ్చినా, అందరూ సువార్తను అంగీకరించలేదు. “అతడు చెప్పిన సంగతులు కొందరు నమ్మిరి, కొందరు నమ్మకపోయిరి” అని 24వ వచనం చెబుతోంది. భేదాభిప్రాయాలు కలగడంతో వాళ్లు వెళ్లిపోయారు.
20 సువార్తను కొందరు మాత్రమే అంగీకరించారని పౌలు నిరుత్సాహపడ్డాడా? లేదు! అపొస్తలుల కార్యములు 28:30, 31 వచనాల్లో మనం ఇలా చదువుతాం, “పౌలు రెండు సంవత్సరములు పూర్తిగా తన అద్దె యింట కాపురముండి, తనయొద్దకు వచ్చువారినందరిని సన్మానించి ఏ ఆటంకమునులేక పూర్ణ ధైర్యముతో దేవుని రాజ్యమునుగూర్చి ప్రకటించుచు, ప్రభువైన యేసుక్రీస్తును గూర్చిన సంగతులు బోధించుచు ఉండెను.” ఊరటనిచ్చే ఆ మాటలతో దైవప్రేరిత పుస్తకమైన అపొస్తలుల కార్యములు ముగుస్తుంది.
21. గృహ నిర్భంధంలో ఉన్నప్పుడు పౌలు చేసిన దాని నుండి మనమేమి నేర్చుకోవచ్చు?
21 పౌలు మాదిరి నుండి మనమేమి నేర్చుకోవచ్చు? గృహ నిర్బంధంలో ఉన్నప్పుడు ఆయన ఇంటింటికి వెళ్లి ప్రకటించలేకపోయాడు. అయినా ఆయన ఆశావహ దృక్పథంతో, తన దగ్గరకు వచ్చిన వాళ్లందరికీ సాక్ష్యమిచ్చాడు. అదే విధంగా నేడు కూడా దేవుని ప్రజల్లో చాలామంది తమ విశ్వాసం నిమిత్తం అన్యాయంగా జైల్లో వేయబడినా ఆనందంగా ప్రకటిస్తూనే ఉంటారు. మన ప్రియ సహోదర సహోదరీల్లో కొందరు బయటకు వెళ్లలేని స్థితిలో ఉన్నారు, వృద్ధాప్యం వల్ల లేదా అనారోగ్యం వల్ల వాళ్లు నర్సింగ్ హోమ్‌లలో జీవిస్తుండవచ్చు. వాళ్లకు సాధ్యమైనప్పుడు డాక్టర్లకు, అక్కడ పనిచేసే సిబ్బందికి, తమను చూడడానికి వచ్చే వాళ్లకు, మరితరులకు ప్రకటిస్తారు. దేవుని రాజ్యం గురించి పూర్తిగా సాక్ష్యమివ్వాలని వాళ్లు హృదయపూర్వకంగా కోరుకుంటారు. వాళ్లు మనకు ఎంత ఆదర్శవంతంగా ఉన్నారో కదా!
22. (ఎ) అపొస్తలుల కార్యముల పుస్తకం నుండి ప్రయోజనం పొందడానికి మనకు ఏది సహాయం చేస్తుంది? (పైనున్న బాక్సు చూడండి.) (బి) ఈ విధానాంతం దగ్గరపడుతుండగా మీరు ఏమి చేయాలని తీర్మానించుకున్నారు?
22 అపొస్తలుల కార్యముల పుస్తకంలో ప్రస్తావించబడిన అపొస్తలుల నుండి, మొదటి శతాబ్దంలోని ఇతర క్రైస్తవుల నుండి మెలకువగా ఉండడం గురించి మనం చాలా నేర్చుకోవచ్చు. ఈ విధానాంతం దగ్గరపడుతుండగా మనం మొదటి శతాబ్దపు క్రైస్తవుల్లాగే ధైర్యంగా, ఉత్సాహంగా సాక్ష్యమిచ్చే పనిలో కొనసాగాలని తీర్మానించుకుందాం. ఇప్పుడు దేవుని రాజ్యం గురించి పూర్తిగా సాక్ష్యమివ్వడంలో పాల్గొనడం కన్నా గొప్ప పని మరేదీ లేదు!—అపొ. 28:23.
[అధ్యయన ప్రశ్నలు]
[13వ పేజీలోని బాక్సు]
“అపొస్తలుల కార్యముల పుస్తకాన్ని ఇకపై కొత్త అవగాహనతో చదవగలుగుతాను”
దేవుని రాజ్యం గురించి ‘సమగ్ర సాక్ష్యమివ్వండి’ (ఆంగ్లం) అనే పుస్తకం చదివిన తర్వాత ఒక ప్రయాణ పర్యవేక్షకుడు ఇలా చెప్పాడు, “అపొస్తలుల కార్యముల పుస్తకాన్ని ఇకపై కొత్త అవగాహనతో చదవగలుగుతాను. అంతకుముందు దాన్ని మసకబారిన కళ్లద్దాలతో, దీపం వెలుతురులో చదువుతున్నట్లుగా ఉండేది. కానీ ఇప్పుడు ప్రకాశవంతమైన సూర్యకాంతిలో చదువుతున్నట్లు అనిపిస్తోంది.”
[12వ పేజీలోని చిత్రం]
పెద్ద ఇనుప ద్వారం గుండా దేవదూత పేతురును బయటకు తీసుకువచ్చాడు