కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

యెహోవాకు మనస్ఫూర్తిగా బలులు అర్పించండి

యెహోవాకు మనస్ఫూర్తిగా బలులు అర్పించండి

‘మీరేమి చేసినను ప్రభువు [“యెహోవా,” NW] నిమిత్తమని మనస్ఫూర్తిగా చేయుడి.’—కొలొ. 3:23.

1-3. (ఎ) యేసు విమోచన క్రయధన బలిని అర్పించేశాడు కాబట్టి ఇప్పుడు మనం యెహోవాకు ఏమీ అర్పించాల్సిన అవసరం లేదా? వివరించండి. (బి) ఇప్పుడు మనం అర్పించే బలుల విషయంలో ఏ ప్రశ్న రావచ్చు?

 యేసు విమోచన క్రయధన బలి మోషే ధర్మశాస్త్రాన్ని రద్దు చేసిందని సా.శ. మొదటి శతాబ్దంలో యెహోవా తన ప్రజలకు తెలియజేశాడు. (కొలొ. 2:13, 14) ఎన్నో వందల సంవత్సరాలుగా యూదులు అర్పిస్తూ వచ్చిన బలులన్నీ ఇకపై అర్పించాల్సిన అవసరం లేదు, వాటికి ఇప్పుడు విలువలేదు. ‘క్రీస్తు నొద్దకు మనలను నడిపించే బాలశిక్షకుడిగా’ ధర్మశాస్త్రం దాని పనిని పూర్తిచేసింది.—గల. 3:24.

2 ధర్మశాస్త్రం రద్దు చేయబడింది కాబట్టి బలుల గురించి క్రైస్తవులు పట్టించుకోవాల్సిన అవసరం లేదని కాదు. కానీ, “యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలములగు ఆత్మ సంబంధమైన బలులను” అర్పించాల్సిన అవసరం ఉందని అపొస్తలుడైన పేతురు చెప్పాడు. (1 పేతు. 2:5) అంతేకాక, సమర్పిత క్రైస్తవుని జీవితంలోని ప్రతీది ఒక “యాగము” లేదా అర్పణ అని అపొస్తలుడైన పౌలు స్పష్టం చేశాడు.—రోమా. 12:1.

3 కాబట్టి, యెహోవాకు ఏదైనా సమర్పించడం ద్వారా లేదా ఆయన కోసం ఏదైనా త్యాగం చేయడం ద్వారా ఒక క్రైస్తవుడు ఆయనకు బలులు అర్పిస్తాడు. ఇశ్రాయేలీయుల నుండి యెహోవా కోరినవాటి గురించి మనకు తెలిసినదాన్నిబట్టి, ఇప్పుడు మనం అర్పించే బలులన్నిటినీ యెహోవా అంగీకరిస్తాడని మనమెలా నిర్ధారించుకోవచ్చు?

రోజువారీ పనుల్లో మనం అర్పించే బలులు

4. రోజువారీ పనుల గురించి మనం ఏ విషయాన్ని గుర్తుంచుకోవాలి?

4 మనం ప్రతిరోజూ చేసే పనుల ద్వారా కూడా యెహోవాకు బలులు అర్పించవచ్చని గ్రహించడం మనకు కష్టమనిపించవచ్చు. విద్యాభ్యాసం, ఇంటిపని, ఉద్యోగం లేదా షాపింగ్‌ చేయడం వంటి వాటికి, మన ఆధ్యాత్మికతకు ఎలాంటి సంబంధమూ లేదని మనకనిపించవచ్చు. మనం యెహోవాకు సమర్పించుకున్నా లేక సమర్పించుకోవాలని అనుకుంటున్నా రోజువారీ పనులు మన ఆధ్యాత్మికతపై ప్రభావం చూపిస్తాయని గుర్తుంచుకోవడం ప్రాముఖ్యం. మనం 24 గంటలూ క్రైస్తవులమే. మనం మన జీవితంలోని ప్రతీ రంగంలో లేఖన సూత్రాలను పాటించాలి. అందుకే, పౌలు ఇలా ప్రోత్సహించాడు, “మీరేమి చేసినను అది మనుష్యుల నిమిత్తము కాక ప్రభువు [‘యెహోవా,’ NW] నిమిత్తమని మనస్ఫూర్తిగా చేయుడి.”—కొలొస్సయులు 3:18-24 చదవండి.

5, 6. మనం ప్రవర్తించే తీరు, బట్టలు వేసుకునే తీరు ఎలా ఉండాలో నిర్ణయించుకోవడానికి ఏది సహాయం చేస్తుంది?

5 ఒక క్రైస్తవుని రోజువారీ పనులు పరిశుద్ధ సేవలో భాగం కాదు. కానీ, ‘యెహోవా నిమిత్తమని మనస్ఫూర్తిగా చేయుడి’ అని పౌలు చెప్పినదాన్ని బట్టి, జీవితంలో మనం చేసే ప్రతీ పని గురించి ఆలోచించాలని తెలుస్తోంది. కాబట్టి, పౌలు ఇచ్చిన ఆ సలహాను మనమెలా పాటించవచ్చు? మనం అన్ని సందర్భాల్లో మర్యాదగా ప్రవర్తిస్తామా, సభ్యతగా బట్టలు వేసుకుంటామా? లేక రోజువారీ పనుల్లో మన ప్రవర్తనా తీరు వల్ల లేదా మనం వేసుకునే బట్టల వల్ల యెహోవాసాక్షులమని చెప్పుకునేందుకు సిగ్గుపడే పరిస్థితి వస్తోందా? ఎన్నడూ అలాంటి పరిస్థితి రాకుండా జాగ్రత్తపడాలి. యెహోవా ప్రజలు ఆయన నామానికి కళంకం తెచ్చే పనేదీ చేయడానికి ఇష్టపడరు.—యెష. 43:10; 2 కొరిం. 6:3, 4, 9.

6 ‘యెహోవా నిమిత్తమని మనస్ఫూర్తిగా చేయాలనే’ కోరిక ఉంటే మన జీవితంలోని వివిధ రంగాల్లో మనం ఏమి చేస్తామో ఇప్పుడు పరిశీలిద్దాం. అలా పరిశీలిస్తుండగా, ఆ కాలంలో ఇశ్రాయేలీయులు శ్రేష్ఠమైనవాటినే యెహోవాకు అర్పించాల్సి ఉండేదన్న విషయాన్ని గుర్తుంచుకోండి.—నిర్గ. 23:19.

జీవితంలోని ఇతర రంగాల్లో మనం అర్పించే బలులు

7. సాధారణంగా, యెహోవాకు సమర్పించుకున్నప్పుడు మనం ఏమి చేస్తాం?

7 మనం పూర్ణ హృదయంతో యెహోవాకు సమర్పించుకున్నాం, కాదంటారా? అలా సమర్పించుకోవడం ద్వారా, మనం మన జీవితంలోని ప్రతీ రంగంలో యెహోవాకే మొదటిస్థానం ఇస్తామని మాటిచ్చాం. (హెబ్రీయులు 10:7 చదవండి.) మనం మంచి నిర్ణయమే తీసుకున్నాం. ఒకానొక విషయంలో యెహోవా ఉద్దేశం ఏమిటో తెలుసుకొని, దానికి అనుగుణంగా నడుచుకోవడానికి కృషి చేయడంవల్ల మంచి ఫలితాలు వస్తాయని మనం గ్రహించాం. (యెష. 48:17, 18) యెహోవా చేత ఉపదేశం పొందుతున్నందుకు ఆయన ప్రజలు ఆయనలాగే పరిశుద్ధంగా, సంతోషంగా ఉంటారు.—లేవీ. 11:44; 1 తిమో. 1:11, NW.

8. యెహోవా ఇశ్రాయేలీయుల బలులను పరిశుద్ధమైనవిగా ఎంచాడనే విషయాన్ని బట్టి మనమేమి చేయాలని అర్థమౌతోంది?

8 ఇశ్రాయేలీయులు యెహోవాకు అర్పించిన బలులు పరిశుద్ధమైనవిగా పరిగణించబడేవి. (లేవీ. 6:25; 7:1) “పరిశుద్ధత” అని అనువదించబడిన హెబ్రీ పదానికి దేవుని కోసం వేరుగా ఉంచడం, ప్రత్యేకంగా ఉంచడం, పరిశుద్ధంగా ఉంచడం అనే అర్థాలున్నాయి. యెహోవా మన బలులను అంగీకరించాలంటే, అవి లోకంలోని వాటివల్ల కలుషితమవకుండా ఉండాలి. యెహోవా ద్వేషించే వేటినీ మనం ప్రేమించకూడదు. (1 యోహాను 2:15-17 చదవండి.) దీన్నిబట్టి, దేవుని దృష్టిలో మనం అపవిత్రులమయ్యేలా చేసే ఎలాంటి సహవాసాలకైనా మరితర విషయాలకైనా దూరంగా ఉండాలని స్పష్టమౌతోంది. (యెష. 2:4; ప్రక. 18:4) అంతేకాక, అపవిత్రమైన లేదా అనైతికమైన వేటినీ మనం చూడకూడదు లేదా అలాంటి వాటి గురించి అదే పనిగా ఆలోచిస్తూ ఉండకూడదు.—కొలొ. 3:5, 6.

9. మనం ఇతరులతో ఎలా వ్యవహరించాలి? అది ఎందుకు ప్రాముఖ్యం?

9 పౌలు తన తోటి విశ్వాసులను ఇలా ప్రోత్సహించాడు, “ఉపకారమును ధర్మమును చేయ మరచిపోకుడి, అట్టి యాగములు దేవునికిష్టమైనవి.” (హెబ్రీ. 13:16) కాబట్టి మనం ఇతరులతో మంచిగా ఉంటూ మంచి పనులు చేస్తూ ఉన్నట్లయితే యెహోవా అలాంటి ప్రవర్తనను తనకు అర్పించిన బలిగా స్వీకరిస్తాడు. ఇతరుల పట్ల ఉన్న ప్రేమపూర్వక శ్రద్ధ నిజ క్రైస్తవులకు గుర్తింపు చిహ్నంగా ఉంటుంది.—యోహా. 13:34, 35; కొలొ. 1:10.

ఆరాధనలో మనం అర్పించే బలులు

10, 11. మన క్రైస్తవ పరిచర్యను, ఆరాధనను యెహోవా ఎలా ఎంచుతాడు? ఆ విషయాన్ని మనసులో ఉంచుకుంటే మనం ఏమి చేస్తాం?

10 మన “నిరీక్షణ” గురించి మాట్లాడడం ద్వారా కూడా మనం ఇతరులకు మంచి చేయవచ్చు. సాక్ష్యమివ్వడానికి మనం ప్రతీ అవకాశాన్ని ఉపయోగించుకుంటున్నామా? క్రైస్తవులు చేసే ఈ ప్రాముఖ్యమైన పనిని పౌలు “స్తుతియాగము” అన్నాడు. అంటే అది, ‘దేవుని నామమును ఒప్పుకుంటూ అర్పించే జిహ్వాఫలం.’ (హెబ్రీ. 10:23; 13:15; హోషే. 14:2) దేవుని రాజ్యం గురించి ప్రకటించడానికి మనం ఎన్ని గంటలు వెచ్చిస్తున్నామో, ప్రకటించే తీరును మనమెలా మెరుగుపర్చుకుంటున్నామో ఆలోచిస్తే మనకు ప్రయోజనకరంగా ఉంటుంది. అలా ఆలోచించడానికి సేవాకూటంలోని వివిధ భాగాలు సహాయం చేస్తాయి. క్షేత్ర సేవలో పాల్గొనడం, అనియత సాక్ష్యమివ్వడం అనేవి మనం చేసే ‘స్తుతియాగాలు.’ అవి మన ఆరాధనలో భాగం కూడా. కాబట్టి అవి మనం అర్పించగల శ్రేష్ఠమైనవై ఉండాలి. మనందరి పరిస్థితులూ ఒకేలా ఉండకపోయినా మనం రాజ్య సువార్త ప్రకటించడానికి వెచ్చించే సమయాన్ని బట్టి ఆధ్యాత్మిక విషయాల పట్ల మనకు ఎంత కృతజ్ఞత ఉందో చూపించగలుగుతాం.

11 క్రైస్తవులు వ్యక్తిగతంగా గానీ పది మందితో కలిసి గానీ క్రమం తప్పకుండా ఆరాధన చేస్తారు. మనం అలా చేయాలని యెహోవాయే కోరుతున్నాడు. ఇప్పుడు మనం సబ్బాతు దినాన్ని ఆచరించాల్సిన అవసరం లేదు, పండుగల కోసం యెరూషలేముకు వెళ్లాల్సిన అవసరమూ లేదు. అయినా, ఆ కాలంలోని ప్రజలు చేసినలాంటి కొన్ని పనులను నేటి క్రైస్తవులు కూడా చేయాలి. మనం పనికిరాని విషయాలను పక్కనబెట్టి తన వాక్యాన్ని చదవాలని, ప్రార్థించాలని, క్రైస్తవ కూటాలకు హాజరవ్వాలని దేవుడు ఇప్పటికీ కోరుతున్నాడు. క్రైస్తవ కుటుంబ శిరస్సులు చొరవ తీసుకొని తమ కుటుంబాలతో కలిసి క్రమంగా కుటుంబ ఆరాధన చేస్తారు. (1 థెస్స. 5:17; హెబ్రీ. 10:24, 25) అయితే మన ఆధ్యాత్మిక కార్యకలాపాల గురించి మనల్ని మనం ఇలా ప్రశ్నించుకోవాలి, ‘నేను దేవుణ్ణి ఆరాధిస్తున్న విధానాన్ని ఇంకేమైనా మెరుగుపర్చుకోవాలా?’

12. (ఎ) ప్రాచీన కాలంలో ఆరాధన కోసం ఉపయోగించిన ధూపాన్ని ఈ రోజుల్లో దేనితో పోల్చవచ్చు? (బి) ఆ పోలికను అర్థం చేసుకుంటే మనం ఎలా ప్రార్థిస్తాం?

12 యెహోవాకు ప్రార్థిస్తూ దావీదు రాజు ఇలా పాడాడు, ‘నా ప్రార్థన ధూపం వలే నీ దృష్టికి అంగీకారమగును గాక.’ (కీర్త. 141:2) మన ప్రార్థనలు ఎలా ఉంటున్నాయో, అంటే మనం ఎంత తరచుగా ప్రార్థిస్తున్నామో, ఎంత మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నామో ఒకసారి పరిశీలించుకోవాలి. “పరిశుద్ధుల ప్రార్థనలు” మనోహరమైన, ప్రీతికరమైన సువాసనలా యెహోవాకు చేరతాయి. ఆ ఉద్దేశంతోనే ప్రకటన గ్రంథం వాళ్ల ప్రార్థనలను ధూపంతో పోలుస్తోంది. (ప్రక. 5:8) ఇశ్రాయేలీయుల కాలంలో, యెహోవా బలిపీఠంపై వేసే ధూపాన్ని చాలా జాగ్రత్తగా, నిర్దిష్టమైన పద్ధతిలో సిద్ధం చేసేవాళ్లు. తాను ఇచ్చిన నిర్దేశాల ప్రకారం సిద్ధం చేస్తేనే యెహోవా దాన్ని అంగీకరించేవాడు. (నిర్గ. 30:34-37; లేవీ. 10:1, 2) అలాగే, మనం కూడా యెహోవా నిర్దేశించిన ప్రకారం ప్రార్థిస్తే ఆయన మన ప్రార్థనను అంగీకరిస్తాడనే నమ్మకాన్ని కలిగివుండవచ్చు.

ఇవ్వడం, తీసుకోవడం

13, 14. (ఎ) పౌలుకు ఎపఫ్రొదితు, ఫిలిప్పీయులు ఎలాంటి సహాయం చేశారు? (బి) పౌలు వాళ్లు చేసిన సహాయాన్ని ఎలా ఎంచాడు? (సి) ఎపఫ్రొదితును, ఫిలిప్పీయులను మనం ఎలా అనుకరించవచ్చు?

13 ప్రపంచవ్యాప్త పనికోసం మనం డబ్బు రూపంలో ఎక్కువ ఇచ్చినా తక్కువ ఇచ్చినా అది యెహోవాకు బలి అర్పించినట్లే. (మార్కు 12:41-44) సా.శ. మొదటి శతాబ్దంలో, పౌలు భౌతిక అవసరాలు తీర్చడానికి ఫిలిప్పీలో ఉన్న సంఘం ఎపఫ్రొదితును రోముకు పంపించింది. ఫిలిప్పీయుల రాయబారిగా వెళ్లిన ఎపఫ్రొదితు డబ్బు రూపంలో సంఘం ఇచ్చిన బహుమానాన్ని తీసుకెళ్లి ఉంటాడు. అయితే ఫిలిప్పీయులు పౌలుకు అంతకుముందు కూడా అలాగే సహాయం చేశారు. పౌలు ఆర్థికపరమైన విషయాల గురించి ఆందోళన చెందకుండా పరిచర్యలో ఎక్కువ సమయం వెచ్చించాలనే ఉద్దేశంతో ఫిలిప్పీయులు ఆయనకు అలా సహాయం చేశారు. వాళ్లిచ్చిన బహుమతిని పౌలు ఎలా ఎంచాడు? అది, “మనోహరమైన సువాసనయు, దేవునికి ప్రీతికరమును ఇష్టమునైన యాగము” అని పౌలు అన్నాడు. (ఫిలిప్పీయులు 4:15-19 చదవండి.) ఫిలిప్పీయులు చేసిన సహాయాన్ని పౌలు ఎంతో విలువైనదిగా ఎంచాడు, యెహోవా కూడా అలాగే ఎంచాడు.

14 ఇప్పుడు, ప్రపంచవ్యాప్త పనికోసం మనమిచ్చే విరాళాలను కూడా యెహోవా ఎంతో విలువైనవిగా ఎంచుతాడు. అంతేకాక, మనం రాజ్య సంబంధమైన విషయాలకు మొదటిస్థానం ఇస్తూనే ఉంటే మన ఆధ్యాత్మిక, భౌతిక అవసరాలను తీరుస్తానని యెహోవా మాటిస్తున్నాడు.—మత్త. 6:33; లూకా 6:38.

కృతజ్ఞత చూపించాలి

15. యెహోవాకు మనం కృతజ్ఞత చూపించడానికి కొన్ని కారణాలు ఏమిటి?

15 యెహోవా పట్ల కృతజ్ఞతను చూపించడానికి మనకు లెక్కలేనన్ని కారణాలు ఉన్నాయి. యెహోవా మనకు జీవాన్ని ఇచ్చినందుకు మనం ఆయనకు ప్రతీరోజు కృతజ్ఞతలు చెప్పాలి. మన కోసం ఆహారం, బట్టలు, వసతి, మనం పీల్చుకోవడానికి గాలి అలా మన జీవాన్ని కాపాడుకోవడానికి అవసరమైన ప్రతీదాన్ని యెహోవా మనకు ఇస్తున్నాడు. అంతేకాక, ఖచ్చితమైన జ్ఞానాన్ని సంపాదించుకోవడం వల్ల మనలో కలిగిన విశ్వాసం మనకు నిరీక్షణను ఇస్తుంది. యెహోవా మన సృష్టికర్త, మన కోసం ఆయన ఎన్నో చేశాడు. కాబట్టి మనం ఆయనను ఆరాధించడం, ఆయనకు స్తుతియాగాలు చేయడం సముచితం.—ప్రకటన 4:10, 11 చదవండి.

16. క్రీస్తు విమోచన క్రయధన బలి పట్ల మనకు కృతజ్ఞత ఉందని మనమెలా చూపిస్తాం?

16 మనం ముందటి ఆర్టికల్‌లో చూసినట్లుగా, యెహోవా మానవులకు ఇచ్చిన అమూల్యమైన బహుమానం క్రీస్తు విమోచన క్రయధన బలి. యెహోవాకు మనపట్ల ఉన్న ప్రేమకు అది గొప్ప రుజువు. (1 యోహా. 4:10) యెహోవా చేసిన దానికి మనం ఎలా స్పందిస్తే సముచితంగా ఉంటుంది? పౌలు ఇలా అన్నాడు, “క్రీస్తు ప్రేమ మమ్మును బలవంతము చేయుచున్నది; ఏలాగనగా అందరికొరకు ఒకడు మృతిపొందెను. ... జీవించువారికమీదట తమకొరకు కాక, తమ నిమిత్తము మృతిపొంది తిరిగి లేచినవానికొరకే జీవించుటకు ఆయన అందరికొరకు మృతిపొందెను.” (2 కొరిం. 5:14, 15) దేవుడు చూపించిన కృపను మనం విలువైనదిగా ఎంచితే ఆయనను, ఆయన కుమారుణ్ణి మహిమపర్చడానికి మన జీవితాల్ని ఉపయోగిస్తామని పౌలు ఆ మాటల్లో సూచించాడు. దేవునికి, ఆయన కుమారునికి లోబడుతూ సువార్త ప్రకటించి శిష్యులను చేయాలనే కోరికను కలిగివుంటే మనం వారిద్దరి పట్ల మనకున్న ప్రేమను, కృతజ్ఞతను చూపించగలుగుతాం.—1 తిమో. 2:3, 4; 1 యోహా. 5:3.

17, 18. దేవునికి చేసే స్తుతియాగాన్ని కొంతమంది ఏయే విధాలుగా విస్తృతం చేసుకున్నారు? ఒక అనుభవం చెప్పండి.

17 దేవునికి మనం చేసే స్తుతియాగాన్ని మెరుగుపర్చుకోవడం సాధ్యమేనా? చాలామంది యెహోవా తమకోసం చేసిన మంచి అంతటి గురించి ధ్యానించిన తర్వాత రాజ్యసువార్త ప్రకటించడానికి, మరితర ఆధ్యాత్మిక కార్యకలాపాల్లో పాల్గొనడానికి ఎక్కువ సమయం వెచ్చించేలా తమ సమయాన్ని, పనులను సర్దుబాటు చేసుకోగలిగారు. కొంతమంది సంవత్సరంలో ఒకటి లేదా అంతకన్నా ఎక్కువ నెలలపాటు సహాయ పయినీరు సేవచేయగలిగారు, మరికొంతమందేమో క్రమ పయినీరు సేవ చేపట్టగలిగారు. ఇంకొంతమంది రాజ్య సంబంధమైన నిర్మాణ పనుల్లో భాగం వహిస్తున్నారు. కృతజ్ఞత చూపించడానికి అవన్నీ చక్కని మార్గాలే. యెహోవా పట్ల కృతజ్ఞత చూపించాలనే సరైన ఉద్దేశంతో చేస్తే పరిశుద్ధ సేవలో భాగమైన ఆ పనులన్నిటినీ యెహోవా అంగీకరిస్తాడు.

18 చాలామంది క్రైస్తవులు యెహోవా పట్ల కృతజ్ఞత చూపించడానికి తమ సేవను విస్తృతం చేసుకున్నారు. మోరేనా అనే సహోదరి కూడా అలాగే చేసింది. ఆమె ఒక క్యాథలిక్‌గా పెరిగింది కానీ ఆమెకు ఎన్నో ఆధ్యాత్మిక సందేహాలు ఉండేవి. వాటిని తీర్చుకోవడానికి ఆమె క్యాథలిక్‌ మతంలో, ఆసియాలోని వివిధ మతాల్లో పరిశోధించింది కానీ ఫలితం లేకపోయింది. అయితే, ఆమె యెహోవాసాక్షులతో బైబిలు అధ్యయనం చేసినప్పుడే ఆమె ఆధ్యాత్మిక దాహం తీరింది. లేఖనాల్లోని జవాబులను బట్టి, వాటివల్ల తన జీవితానికి చేకూరిన అర్థాన్ని బట్టి మోరేనాకు ఎంతో కృతజ్ఞతా భావం కలిగింది. అందుకే ఆమె యెహోవా సేవలో తన శక్తిసామర్థ్యాలన్నిటినీ ఉపయోగించి ఆయనకు కృతజ్ఞత చూపించాలనుకుంది. ఆమె బాప్తిస్మం తీసుకున్న వెంటనే క్రమంగా సహాయ పయినీరు సేవచేయడం మొదలుపెట్టి, కొంతకాలానికి పరిస్థితులు అనుకూలించడంతో క్రమ పయినీరు సేవ చేపట్టింది. 30 సంవత్సరాల క్రితం మొదలుపెట్టిన ఆ పూర్తికాల సేవను ఆమె ఇప్పటికీ కొనసాగిస్తోంది.

19. యెహోవాకు మనం ఆధ్యాత్మిక బలులు ఎక్కువగా ఎలా అర్పించవచ్చు?

19 పయినీరు సేవ చేపట్టేందుకు చాలామంది నమ్మకమైన సేవకుల పరిస్థితులు అనుకూలించడం లేదు. యెహోవా సేవలో మనం ఏమి చేయగలిగినా సరే, మనమందరం ఆయన అంగీకరించే ఆధ్యాత్మిక బలులు అర్పించవచ్చు. మన ప్రవర్తన విషయానికొస్తే, మనం 24 గంటలూ యెహోవాకు ప్రాతినిధ్యం వహిస్తామనే విషయాన్ని గుర్తుంచుకొని నీతిసూత్రాలను జాగ్రత్తగా పాటించాలి. విశ్వాసం విషయానికొస్తే, దేవుని సంకల్పాలు నెరవేరతాయని మనం పూర్తిగా నమ్మాలి. మంచి పనుల విషయానికొస్తే, మనం సువార్త వ్యాప్తి చేసేందుకు తోడ్పడాలి. యెహోవా మనకోసం చేసిన వాటన్నిటిని బట్టి ఆయన పట్ల మనకు కృతజ్ఞత ఉందని చూపించడానికి ఆయనకు మనస్ఫూర్తిగా ఆధ్యాత్మిక బలులు అర్పిస్తూనే ఉందాం.

[అధ్యయన ప్రశ్నలు]

[25వ పేజీలోని బ్లర్బ్‌]

యెహోవా మంచితనాన్ని బట్టి మీ స్తుతియాగాన్ని మెరుగుపర్చుకోవాలని మీకు అనిపిస్తోందా?

[23వ పేజీలోని చిత్రం]

సాక్ష్యమివ్వడానికి మీరు ప్రతీ అవకాశాన్ని ఉపయోగించుకుంటారా?