కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

మన మనసులను విషపూరితం చేసే అసూయ

మన మనసులను విషపూరితం చేసే అసూయ

మన మనసులను విషపూరితం చేసే అసూయ

నెపోలియన్‌ బొనెపార్ట్‌, జూలియస్‌ సీజర్‌, అలెగ్జాండర్‌ ద గ్రేట్‌ ముగ్గురూ అసూయపడ్డారు. వాళ్లకు అధికారం, ఘనత ఉన్నా మనసుల్ని విషపూరితం చేసే ఆ లక్షణం వారి గుండెల్లో గూడు కట్టుకుంది. వాళ్లు ఎవరో ఒకరిమీద అసూయపడినవాళ్లే.

“నెపోలియన్‌కు సీజర్‌ అంటే అసూయ, సీజర్‌కు అలెగ్జాండర్‌ అంటే అసూయ. నాకు తెలిసి అలెగ్జాండర్‌కు అసలు ఎప్పుడూ జీవించని హెర్‌క్యులస్‌ అంటే అసూయ” అని బెర్ట్‌రాండ్‌ రస్సెల్‌ అనే ఇంగ్లీష్‌ తత్వవేత్త రాశాడు. ఒక వ్యక్తికి ఎన్ని సిరిసంపదలు ఉన్నా, ఎన్ని మంచి లక్షణాలు ఉన్నా, జీవితంలో ఎంత రాణించినా ఆయన అసూయపడే ప్రమాదం ఉంది.

ఇతరుల ఆస్తిపాస్తులు, అనుకూల పరిస్థితులు వంటివాటిని చూసి కుళ్లుకోవడమే అసూయ. ఒక బైబిలు రెఫరెన్సు గ్రంథం ప్రకారం, అసూయాపరులు ఇతరులకు ఉన్న వాటిని చూసి అసంతృప్తి చెందడంతో పాటు వాళ్ల దగ్గర నుండి వాటిని లాక్కోవాలని అనుకుంటారు.

మనలో అసూయ ఎలా పుడుతుందో, దాని పర్యవసానాలు ఎలా ఉంటాయో పరిశీలించడం మంచిది. ముఖ్యంగా దాని చేతుల్లో కీలుబొమ్మలం కాకుండా ఉండాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో మనం తెలుసుకోవాలి.

అసూయను పెంచే స్వభావం

అపరిపూర్ణ మానవులకు ‘మత్సరపడే’ లేదా అసూయపడే స్వభావం ఉంటుంది. అయితే వివిధ కారకాలు దాన్ని పెంచుతాయి. (యాకో. 4:5) వాటిలో ఒక దాని గురించి తెలియజేస్తూ పౌలు ఇలా రాశాడు, “ఒకరినొకరము వివాదమునకు రేపకయు, ఒకరియందొకరము అసూయపడకయు, వృథాగా అతిశయపడకయు ఉందము.” (గల. 5:26) పోటీపడే తత్వం అపరిపూర్ణులమైన మనలోని అసూయపడే స్వభావాన్ని మరింత పెంచే అవకాశం ఉంది. క్రీస్టీనా, హోసే a అనే ఇద్దరు క్రైస్తవులు అది నిజమేనని గ్రహించారు.

క్రమ పయినీరుగా సేవచేస్తున్న క్రీస్టీనా ఇలా అంటోంది, “నేను ఇతరులను చూసి అసూయ పడుతుంటాను. ఇతరులకు ఉన్నవి నాకు లేవే అని బాధపడుతుంటాను.” ఒక సందర్భంలో ఆమె, ప్రయాణ సేవలో ఉన్న ఒక జంటకు ఆతిథ్యం ఇచ్చింది. దంపతులుగా తమ వయసు, ప్రయాణ సేవలో ఉన్న ఆ దంపతుల వయసు దాదాపు ఒకటేనని, తన భర్తా ఆ సహోదరుడూ గతంలో ఒకేలాంటి సేవాధిక్యతలు చేపట్టారని తెలుసుకొని క్రీస్టీనా ఇలా అడిగింది, “మా ఆయన కూడా సంఘ పెద్దే కదా! మీరు ప్రయాణ సేవలో ఉన్నారు, మేమేమో ఇలాగే ఉన్నాం. ఎందుకలా?” ఆమె పోటీతత్వంతో పెరిగిపోయిన అసూయ వల్ల, సంఘంలో తాము చేస్తున్న సేవను మరచిపోయి జీవితంలో అసంతృప్తి చెందింది.

హోసేకు సంఘంలో పరిచర్య సేవకుడిగా సేవ చేయాలనే కోరిక ఉండేది. తాను తప్ప మిగతావాళ్లు పరిచర్య సేవకులు అవడం చూసి వాళ్ల మీద ఆయన అసూయ పడడమే కాక పెద్దల సభ సమన్వయకర్త మీద కోపం పెంచుకున్నాడు. హోసే ఇలా ఒప్పుకుంటున్నాడు, “అసూయ వల్ల నేను ఆయన మీద కోపాన్ని పెంచుకొని ఆయన ఉద్దేశాలను తప్పు పట్టడం మొదలుపెట్టాను. మనం అసూయ చేతుల్లో కీలుబొమ్మలం అయ్యామంటే మన గురించే ఎక్కువగా ఆలోచిస్తాం, దానివల్ల మన ఆలోచనా తీరు దెబ్బతింటుంది.”

ఈ విషయంలో బైబిలు ఉదాహరణల నుండి ఏమి నేర్చుకోవచ్చు?

మనం ఏమి చేయాలో, ఏమి చేయకూడదో చూపించే ఉదాహరణలు బైబిల్లో చాలా ఉన్నాయి. (1 కొరిం. 10:11) కొన్ని ఉదాహరణల నుండి మనం, అసూయ ఎలా పెరుగుతుందో తెలుసుకోవడమే కాక దాని చేతిలో కీలు బొమ్మలైన వాళ్ల మనసులను అది ఎలా విషపూరితం చేస్తుందో కూడా తెలుసుకోవచ్చు.

ఉదాహరణకు, ఆదాము హవ్వల మొదటి కుమారుడైన కయీను విషయమే తీసుకోండి. యెహోవా కయీను బలిని అంగీకరించకుండా ఆయన తమ్ముడైన హేబెలు అర్పించిన బలిని అంగీకరించినందుకు కయీనుకు తన తమ్ముడిపై కోపం వచ్చింది. ఆ సమయంలో ఆయన తనను తాను సరిదిద్దుకోగలిగేవాడే, కానీ అసూయతో ఆయన తన తమ్ముణ్ణి చంపేశాడు. (ఆది. 4:4-8) అందుకే బైబిలు కయీనును ‘దుష్టుడైన’ సాతాను “సంబంధి” అని సంబోధిస్తోంది.—1 యోహా. 3:12.

యోసేపు పదిమంది అన్నలు తమ తండ్రితో యోసేపుకు ఉన్న ప్రత్యేకమైన సంబంధాన్ని చూసి అసూయపడ్డారు. భవిష్యత్తు గురించి తనకు వచ్చిన కలలను యోసేపు చెప్పినప్పుడు తన అన్నలకు ఆయనపై ఉన్న ద్వేషం ఇంకా పెరిగింది. అంతేకాకుండా వాళ్లు ఆయనను చంపాలనుకున్నారు. వాళ్లు చివరికి ఆయనను బానిసగా అమ్మేసి, ఆయన చనిపోయాడని చెప్పి వాళ్ల నాన్నను నమ్మించారు. (ఆది. 37:4-11, 23-28, 31-33) ఎన్నో సంవత్సరాల తరువాత వాళ్లు తాము చేసిన తప్పును ఒప్పుకొని ఒకరితో ఒకరు ఇలా అనుకున్నారు, “నిశ్చయముగా మన సహోదరుని యెడల మనము చేసిన అపరాధమునకు శిక్ష పొందుచున్నాము. అతడు మనలను బతిమాలుకొనినప్పుడు మనము అతని వేదన చూచియు వినకపోతిమి.”—ఆది. 42:21; 50:15-19.

మరో ఉదాహరణ చూడండి. కోరహు, దాతాను, అబీరాము తమకున్న సేవాధిక్యతలను మోషే అహరోనులకు ఉన్న వాటితో పోల్చుకున్నప్పుడు వాళ్లలో అసూయ పుట్టింది. మోషే తమపై ‘ప్రభుత్వం చేస్తున్నాడని,’ అధికారం చెలాయిస్తున్నాడని వాళ్లు నిందించారు. (సంఖ్యా. 16:13) కానీ ఆ నింద పచ్చి అబద్ధం. (సంఖ్యా. 11:14, 15) యెహోవాయే మోషేను నియమించాడు. అయితే, ఆ తిరుగుబాటుదారులు మోషే స్థానాన్ని చూసి అసూయపడ్డారు. చివరికి ఆ అసూయ వల్లే వాళ్లు యెహోవా చేతుల్లో నాశనమయ్యారు.—కీర్త. 106:16, 17.

అసూయ ఒక వ్యక్తిని ఎంత దూరం తీసుకువెళ్తుందో రాజైన సొలొమోను కళ్లారా చూశాడు. ఒక స్త్రీ తనకు పుట్టిన బిడ్డ చనిపోయినప్పుడు, చనిపోయింది తన బిడ్డ కాదు తన తోటి స్త్రీ బిడ్డ అని నమ్మించాలనుకుంది. అప్పుడు ఆ ఇద్దరు స్త్రీలు రాజు దగ్గరకు వెళ్లారు. మోసం చేయాలనుకున్న ఆ స్త్రీ రాజదర్బారులో, బ్రతికున్న బిడ్డను చంపడానికి కూడా ఒప్పుకుంది. అయితే సొలొమోను రాజు బ్రతికున్న బిడ్డను అసలైన తల్లికే ఇప్పించాడు.—1 రాజు. 3:16-27.

అసూయ వల్ల హానికరమైన పర్యవసానాలు వస్తాయి. పైన చూసిన బైబిలు ఉదాహరణలను బట్టి అది ద్వేషానికి, అన్యాయానికి, హత్యకు కూడా దారి తీయగలదని తెలుస్తోంది. ఆ ఉదాహరణల్లో అసూయకు గురైన వ్యక్తులెవ్వరూ నిజానికి ఆయా శిక్షలు అనుభవించేంత తప్పేమీ చేయలేదు. అసూయ చేతుల్లో కీలుబొమ్మలు కాకుండా ఉండేందుకు మనమేమైనా చేయగలమా? అసూయకు విరుగుడుగా ఏ చిట్కాలను మనం పాటించవచ్చు?

అసూయకు విరుగుడుగా పనిచేసే మంచి చిట్కాలు

సహోదర ప్రేమను అలవర్చుకోండి. అపొస్తలుడైన పేతురు క్రైస్తవులకు ఇలా ఉపదేశించాడు, “నిష్కపటమైన సహోదరప్రేమ కలుగునట్లు, మీరు సత్యమునకు విధేయులవుటచేత మీ మనస్సులను పవిత్రపరచుకొనిన వారైయుండి, యొకనినొకడు హృదయపూర్వకముగాను మిక్కటముగాను ప్రేమించుడి.” (1 పేతు. 1:22) ఇంతకీ ప్రేమ అంటే ఏమిటి? అపొస్తలుడైన పౌలు ఇలా చెప్పాడు, “ప్రేమ దీర్ఘకాలము సహించును, దయ చూపించును. ప్రేమ మత్సరపడదు; ప్రేమ డంబముగా ప్రవర్తింపదు; అది ఉప్పొంగదు; అమర్యాదగా నడువదు; స్వప్రయోజనమును విచారించుకొనదు.” (1 కొరిం. 13:4, 5) మన హృదయంలో ఇతరులపై అలాంటి ప్రేమను పెంచుకుంటే అసూయ పడకుండా ఉండగలుగుతాం. (1 పేతు. 2:1) యోనాతాను దావీదుపై అసూయపడే బదులు, ‘తన ప్రాణ స్నేహితునిగా భావించి అతణ్ణి ప్రేమించాడు.’—1 సమూ. 18:1.

దేవుని ప్రజలతో సహవసించండి. ఏ కష్టాలూ లేకుండా భోగభాగ్యాలు అనుభవిస్తున్న దుష్టులను చూసి 73వ కీర్తనను రాసిన రచయిత అసూయపడ్డాడు. అయితే, ఆయన “దేవుని పరిశుద్ధ స్థలములోనికి” వెళ్లినప్పుడు తన అసూయను అధిగమించగలిగాడు. (కీర్త. 73:3-5, 17) తోటి ఆరాధకులతో సహవసించినప్పుడు కీర్తనకర్త దేవునికి దగ్గరవ్వడం వల్ల తనకు వచ్చిన ఆశీర్వాదాలను గుర్తించగలిగాడు. (కీర్త. 73:28) మనం కూడా క్రైస్తవ కూటాల్లో తోటి ఆరాధకులతో క్రమంగా సహవసించడం వల్ల అలాంటి ప్రయోజనాన్నే పొందుతాం.

మంచి చేయడానికి కృషి చేయండి. కయీనులో అసూయాద్వేషాలు పెరిగాయని గమనించి, ‘సత్క్రియలు చేయమని’ యెహోవా ఆయనకు చెప్పాడు. (ఆది. 4:7) ‘సత్క్రియలు’ లేదా మంచి పనులు చేయాలంటే క్రైస్తవులకు ఏమి అవసరం? మనం ‘మన పూర్ణ హృదయంతో, మన పూర్ణాత్మతో, మన పూర్ణ మనస్సుతో మన దేవుడైన యెహోవాను ప్రేమించాలనీ, మనల్ని మనం ప్రేమించుకున్నట్లే మన పొరుగువాళ్లను ప్రేమించాలనీ’ యేసు చెప్పాడు. (మత్త. 22:37-39) మన జీవితంలో యెహోవా సేవ చేయడానికి, ఇతరులకు సహాయం చేయడానికి మొదటిస్థానం ఇవ్వడం వల్ల మనకు కలిగే సంతృప్తి అసూయకు మంచి విరుగుడుగా పనిచేస్తుంది. రాజ్య ప్రకటనాపనిలో, శిష్యులను చేసే పనిలో సాధ్యమైనంత ఎక్కువగా పాల్గొంటే దేవుని సేవ చక్కగా చేయగలుగుతాం, ఇతరులకు సహాయం చేయగలుగుతాం. దానివల్ల మనకు “యెహోవా ఆశీర్వాదము” లభిస్తుంది.—సామె. 10:22.

‘సంతోషించే వాళ్లతో కలిసి సంతోషించండి.’ (రోమా. 12:15) తన శిష్యులు సాధించిన మంచి ఫలితాలను బట్టి యేసు సంతోషించాడు. అంతేకాక, ప్రకటనాపనిలో తాను చేసిన దానికన్నా తన శిష్యులు మరి ఎక్కువ చేస్తారని కూడా ఆయన అన్నాడు. (లూకా 10:17, 21; యోహా. 14:12) యెహోవా సేవకులముగా మనం ఐక్యంగా ఉన్నాం కాబట్టి, మనలో ఏ ఒక్కరు మంచి ఫలితాలు సాధించినా అందరికీ ఆశీర్వాదాలు వస్తాయి. (1 కొరిం. 12:24-26) అందుకే, ఇతరులకు పెద్ద పెద్ద బాధ్యతలు వచ్చినప్పుడు మనం అసూయపడే బదులు వాళ్లతో కలిసి సంతోషించాలి.

అసూయను తీసేసుకోవడం అంత సులభం కాదు

అసూయను తీసేసుకోవడానికి ఎంతోకాలంపాటు కృషి చేయాల్సి ఉంటుంది. క్రీస్టీనా ఇలా ఒప్పుకుంది, “అసూయపడే స్వభావం నాలో ఇంకా బలంగానే ఉంది. నాకు అది ఇష్టం లేకపోయినా, ఆ స్వభావం నాలో ఉండనే ఉంది, నేను దాన్ని ఎప్పటికప్పుడు అణిచివేస్తూ ఉండాలి.” హోసే కూడా అలాగే కృషి చేయాల్సి వచ్చింది. ఆయన ఇలా అన్నాడు, “పెద్దల సభ సమన్వయకర్తలో ఉన్న మంచి లక్షణాలను గుర్తించడానికి యెహోవా నాకు సహాయం చేశాడు. దేవునితో మంచి సంబంధం ఉండడం వల్ల నాకు ఎంతో ప్రయోజనం చేకూరింది.”

అసూయ ‘శరీరకార్యాల్లో’ ఒకటి, ప్రతీ క్రైస్తవుడు దానితో పోరాడాల్సిందే. (గల. 5:19-21) మనం అసూయ చేతుల్లో కీలుబొమ్మలం కాకుండా ఉంటే, మన జీవితాల్ని మరింత సంతోషభరితం చేసుకోవచ్చు, మన పరలోక తండ్రియైన యెహోవాను సంతోషపెట్టవచ్చు.

[అధస్సూచి]

a అసలు పేర్లు కావు.

[17వ పేజీలోని బ్లర్బ్‌]

‘సంతోషించే వాళ్లతో కలిసి సంతోషించండి’