కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

వాళ్లు ధైర్యంగా దేవుని వాక్యాన్ని ప్రకటించారు

వాళ్లు ధైర్యంగా దేవుని వాక్యాన్ని ప్రకటించారు

వాళ్లు ధైర్యంగా దేవుని వాక్యాన్ని ప్రకటించారు

వ్యతిరేకతను ఎదుర్కోవాలంటే ధైర్యసాహసాలు ఉండాలి. చాలా కాలంగా నిజక్రైస్తవులు ధైర్యసాహసాలు చూపిస్తూనే ఉన్నారు. మొదటి శతాబ్దంలోని విశ్వాసుల్లా మనం కూడా దేవుని వాక్యాన్ని ధైర్యంగా ప్రకటించడానికి పరిశుద్ధాత్మ సహాయాన్ని ఇవ్వమని యెహోవాకు ప్రార్థిస్తాం.—అపొ. 4:23-31.

మొదటి ప్రపంచ యుద్ధం జరుగుతున్న రోజుల్లో నిజక్రైస్తవులు చేసిన ప్రకటనాపని గురించి ఒక సహోదరుడు ఇలా రాశాడు, “లేఖనాల్లో అధ్యయనాలు (ఆంగ్లం) పుస్తకంలో మర్మము సమాప్తమాయెను అనే శీర్షికతో వచ్చిన ఏడవ సంపుటిని దేవుని సేవకులు ఉత్సాహంగా పంచిపెట్టారు. ముందెన్నడూ లేనంత పెద్ద మొత్తంలో వాటిని పంచిపెట్టారు. 1918లో రాజ్య వార్త నం. 1 విడుదలైంది. ఆ తర్వాత విడుదలైన రాజ్య వార్త నం. 2 మర్మము సమాప్తమాయెను అనే సంపుటిని పంచిపెట్టకుండా అధికారులు ఎందుకు అడ్డుకున్నారో వివరించింది. దాని తర్వాత రాజ్య వార్త నం. 3 విడుదలైంది. ఈ ప్రచురణలను నమ్మకమైన అభిషిక్త తరగతి విస్తృతంగా పంచిపెట్టింది. రాజ్య వార్త పంచిపెట్టడానికి వాళ్లకు విశ్వాసం, ధైర్యం అవసరమయ్యాయి.”

సాధారణంగా ఇప్పుడు కొత్త ప్రచారకులకు పరిచర్యలో చక్కని శిక్షణ ఇవ్వబడుతోంది, కానీ అప్పట్లో అలాంటి శిక్షణ చాలా అరుదు. అమెరికాలో ఉంటున్న, పోలండ్‌కు చెందిన ఒక సహోదరుడు 1922లో మొదటిసారిగా పరిచర్య చేస్తున్నప్పుడు తనకు ఎదురైన అనుభవాన్ని గుర్తుచేసుకుంటూ ఇలా రాశాడు, “అప్పటికి నాకు సాహిత్యాలు ఎలా అందించాలో తెలియదు, అంతేకాకుండా ఇంగ్లీషు భాష కూడా అంతగా రాదు. ఒకరోజు నేను ఒక్కడినే వెళ్లి ఒక క్లినిక్‌ తలుపు తట్టాను. అప్పుడు ఒక నర్సు తలుపు తీసింది. ఆ అనుభవాన్ని ఎప్పటికీ మర్చిపోలేను, ఎందుకంటే నేనప్పుడు భయంతో గజగజ వణికిపోయాను. నేను బ్యాగు తెరుస్తుండగా పుస్తకాలన్నీ ఆ నర్సు కాళ్ల దగ్గర పడిపోయాయి. నేనేమి మాట్లాడానో నాకు గుర్తులేదు కానీ నేను ఆమెకు ఒక ప్రచురణ ఇచ్చాను. అక్కడ నుండి వెళ్లిపోయే సమయానికి నాకు ధైర్యం వచ్చింది, అంతేకాక యెహోవా నన్ను ఆశీర్వదించినట్లు అనిపించింది. దాంతో ఆ రోజు నేను అదే వీధిలో ఎన్నో చిన్న పుస్తకాలు ఇచ్చాను.”

ఒక సహోదరి ఇలా చెప్పింది, “దాదాపు 1933లో చాలామంది సహోదరులు రాజ్య సువార్తను వ్యాప్తి చేయడానికి సౌండు కార్లను ఉపయోగించేవాళ్లు.” ఒకానొక సమయంలో అమెరికాలోని కాలిఫోర్నియాలో ఉన్న ఒక పర్వతప్రాంతంలో ఆ సహోదరి, మరో జంట కలిసి ప్రకటనాపని చేస్తున్నారు. దాని గురించి ఆమె ఇలా జ్ఞాపకం చేసుకుంటోంది, “మాతోవున్న సహోదరుడు సౌండు కారును పర్వతం మీద ఎత్తైన ప్రాంతానికి తీసుకొనివెళ్లాడు, మేము కింద ఉన్నాము. రికార్డు చేయబడిన సందేశాన్ని ఆ సహోదరుడు ప్లే చేసినప్పుడు ఆ శబ్దం ఆకాశం నుండి వస్తున్నట్లు అనిపించింది. ఆ పట్టణపు ప్రజలు ఎంత వెదికినా ఆ సహోదరుడిని కనుక్కోలేకపోయారు. రికార్డులోని సందేశం ముగిసిన తర్వాత మేము ప్రజల దగ్గరికి వెళ్లి వాళ్లకు సువార్త ప్రకటించాం. నేను మరో రెండు సందర్భాల్లో, సౌండు కార్లను ఉపయోగించే సహోదరులతో పనిచేశాను. నిజం చెప్పాలంటే, చాలామందికి సువార్త వినే ఆసక్తి లేదు. కానీ, సౌండు కార్ల నుండి వచ్చే శబ్దం ఇళ్లల్లోకి చొచ్చుకుపోయేది కాబట్టి వాళ్లు ఆ ప్రసంగాలను వినాల్సి వచ్చేది. సరైన సమయంలో సరైన పద్ధతిని ఉపయోగించేందుకు యెహోవా చేసిన సహాయాన్ని మేము ఎల్లప్పుడూ చవిచూశాం. ఈ పద్ధతిలో సువార్త ప్రకటించడానికి మేము ధైర్యాన్ని కూడగట్టుకోవాల్సి వచ్చేది, కానీ దానివల్ల సువార్త ప్రకటనాపని బాగా జరిగేది, యెహోవా నామానికి ఘనత వచ్చేది.”

1930లలో, 1940ల తొలిభాగంలో ఫోనోగ్రాఫులను, రికార్డు చేయబడిన బైబిలు ప్రసంగాలను మన పరిచర్యలో ఉపయోగించేవాళ్లం. ఒక సహోదరి ఇలా జ్ఞాపకం చేసుకుంటోంది, “ఒక యువ సహోదరి ఫోనోగ్రాఫును ఉపయోగించి ఇంటింటి పరిచర్య చేస్తోంది. ఒక ఇంటి దగ్గర బైబిలు ప్రసంగాలను ప్లే చేసినప్పుడు గృహస్థుడు కోపంతో ఊగిపోయి ఫోనోగ్రాఫును తన్నాడు. కానీ ఒక్క రికార్డు కూడా విరిగిపోలేదు. దగ్గర్లో ఆగివున్న ఒక ట్రక్‌లో కూర్చొని భోజనం చేస్తున్న ముగ్గురు వ్యక్తులు జరిగింది చూసి ఆ సహోదరిని పిలిచి రికార్డులను ప్లే చేయమని అడిగారు. అంతేకాక సాహిత్యాలు కూడా తీసుకున్నారు. దాంతో, అంతకుముందు జరిగిన చేదు సంఘటనను మర్చిపోయి ఆ సహోదరి ఉపశమనం పొందింది.” అలాంటి పరీక్షలను ఎదుర్కోవడానికి చాలా ధైర్యం కావాలి.

ఆ సహోదరి ఇంకా ఇలా అంది, “వీధిలో పత్రికలను అందించే పద్ధతి 1940లో మొదలైనప్పటి రోజులు గుర్తుకొస్తున్నాయి. అంతకుముందు సమాచార ప్రదర్శనలు చేసేవాళ్లు. ఆ సమాచార ప్రదర్శనల్లో ‘మతం ఒక ఉరి, అదొక కుంభకోణం,’ ‘దేవునికీ రాజైన క్రీస్తుకూ సేవచేయండి’ అనే నినాదాలు రాసివున్న అట్టలతో సహోదర సహోదరీలు ఒకే పంక్తిలో రోడ్డు ప్రక్కన నడుచుకుంటూ వెళ్లేవాళ్లు. అదే సమయంలో కరపత్రాలను కూడా పంచిపెట్టేవాళ్లు. అలాంటి పద్ధతుల్లో ప్రకటించడానికి వాళ్లకు ధైర్యం అవసరం అయింది. అయితే అలా ప్రకటించడం వల్ల యెహోవా నామం గురించి, ఆయన ప్రజల గురించి లోకానికి తెలిసింది.”

మరొక సహోదరి ఇలా అంది, “చిన్న చిన్న పట్టణాల్లో పత్రికాపని చేయడం చాలా కష్టం. ముఖ్యంగా వ్యతిరేకత ఎక్కువగా ఉన్నప్పుడు కష్టమయ్యేది. . . . పత్రికలు పట్టుకుని రోడ్డు ప్రక్కన నిలబడి నినాదాలు చేయడానికి నిజంగా ధైర్యం అవసరమయ్యేది. అయినా దాదాపు ప్రతి శనివారం ఈ పని చేసేవాళ్లం. కొన్నిసార్లు ప్రజలు స్నేహశీలంగా ఉండేవాళ్లు. మరికొన్నిసార్లు అల్లరిమూకలు చుట్టుముట్టేవి కాబట్టి అప్పుడప్పుడు వాళ్ల దాడిని తప్పించుకోవడానికి మేము అక్కడనుండి జారుకోవాల్సివచ్చేది.”

రెండవ ప్రపంచ యుద్ధం జరుగుతున్న కాలంలో హింసలు ఎదురైనా యెహోవాసాక్షులు ధైర్యంగా సువార్తను ప్రకటించారు. 1940 డిసెంబరు 1 నుండి 1941 జనవరి 12 వరకు 43 రోజులపాటు జరిగిన ఒక ప్రచార కార్యక్రమంలో, అమెరికాలోవున్న దాదాపు 50,000 మంది ప్రచారకులు సుమారు 80 లక్షల చిన్న పుస్తకాలను పంచిపెట్టారు.

దేవుని సంస్థలోని అనేకమంది వృద్ధులకు, గతంలో ధైర్యాన్ని కూడగట్టుకోవాల్సిన అవసరత ఏర్పడిన పరిస్థితులు బాగా గుర్తున్నాయి. వాళ్లు తరచూ ఉపయోగించే, ‘యుద్ధాన్ని గుమ్మం దగ్గరకు పారదోలండి’ అనే నినాదంలో, ఎన్నో సంవత్సరాలపాటు వాళ్లు చూపించిన ధైర్యం స్పష్టంగా కనిపిస్తుందని కొందరు గుర్తుచేసుకుంటారు. ప్రస్తుత దుష్ట విధానం అంతమయ్యేలోగా దేవుడిచ్చిన సందేశాన్ని ఇంకా ఏయే పద్ధతుల్లో ప్రకటిస్తామో వేచి చూడాల్సిందే. అయితే యెహోవా సహాయంతో మనం విశ్వాసం చూపిస్తూ ధైర్యంగా ఆయన వాక్యాన్ని ప్రకటిస్తూనే ఉంటాం.

[9వ పేజీలోని బ్లర్బ్‌]

రాజ్య ప్రకటనాపనిలో భాగం వహించడానికి అన్నికాలాల్లో ధైర్యం అవసరమైంది