కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

సంఘంలో మంచి స్ఫూర్తిని కాపాడండి

సంఘంలో మంచి స్ఫూర్తిని కాపాడండి

సంఘంలో మంచి స్ఫూర్తిని కాపాడండి

‘ప్రభువైన యేసుక్రీస్తు కృప మీరు చూపించే స్ఫూర్తికి తోడై ఉండునుగాక.’—ఫిలి. 4:23, NW.

వీటి గురించి ఆలోచించండి:

సహోదర సహోదరీలతో సహవసిస్తున్నప్పుడు సంఘంలో మంచి స్ఫూర్తిని ఎలా పెంచవచ్చు?

క్షేత్ర సేవలో ఉత్సాహాన్ని చూపించడం ద్వారా సంఘంలో మంచి స్ఫూర్తిని ఎలా పెంచవచ్చు?

గంభీరమైన పాపాల గురించి పెద్దలకు తెలియజేయడం ద్వారా సంఘంలో మంచి స్ఫూర్తిని ఎలా పెంచవచ్చు?

1. ఫిలిప్పీ, తుయతైర సంఘాల్లోని క్రైస్తవులు ఎందుకు ప్రశంసించబడ్డారు?

 మొదటి శతాబ్దానికి చెందిన ఫిలిప్పీ సంఘంలోని క్రైస్తవులు పేదవాళ్లు. అయినా, ఉదార స్వభావాన్ని చూపిస్తూ, తోటి విశ్వాసుల పట్ల ఎంతో ప్రేమను కనబరిచేవాళ్లు. (ఫిలి. 1:3-5, 9; 4:15, 16) అందుకే అపొస్తలుడైన పౌలు ఫిలిప్పీయులకు రాసిన పత్రిక ముగింపులో ఇలా అన్నాడు, ‘ప్రభువైన యేసుక్రీస్తు కృప మీరు చూపించే స్ఫూర్తికి తోడై ఉండునుగాక.’ (ఫిలి. 4:23, NW) తుయతైరలోని క్రైస్తవులు కూడా అలాంటి స్ఫూర్తినే చూపించారు కాబట్టి మహిమాన్వితుడైన యేసుక్రీస్తు వాళ్లతో ఇలా అన్నాడు, “నీ క్రియలను, నీ ప్రేమను, నీ విశ్వాసమును, నీ పరిచర్యను, నీ సహనమును నేనెరుగుదును; నీ మొదటి క్రియలకన్న నీ కడపటి క్రియలు మరియెక్కువైనవని యెరుగుదును.”—ప్రక. 2:19.

2. మన సంఘం చూపించే స్ఫూర్తికి మనం ఎలా తోడ్పడతాం?

2 ఇప్పుడు కూడా యెహోవాసాక్షుల సంఘాలన్నీ ఏదో ఒక విధమైన మంచి స్ఫూర్తినే చూపిస్తున్నాయి. కొన్ని సంఘాలు ప్రేమ చూపించే విషయంలో ముందుంటాయి. మరికొన్ని సంఘాలు రాజ్య ప్రకటనాపనిలో ఉత్సాహంగా పాల్గొంటూ పూర్తికాల పరిచర్యను ఎంతో విలువైనదిగా ఎంచుతాయి. మనలో ప్రతీ ఒక్కరం మంచి స్ఫూర్తిని అలవర్చుకుంటే సంఘం ఐక్యంగా ఉంటుంది, సంఘ సభ్యులందరూ ఆధ్యాత్మికంగా ప్రగతి సాధించగలుగుతారు. (1 కొరిం. 1:10) అలాకాకుండా మనం ప్రతికూల స్ఫూర్తి చూపిస్తే సంఘ సభ్యులు ఆధ్యాత్మిక నిద్రమత్తులోకి జారుకోవచ్చు, పరిచర్యలో పాల్గొనాలనే వాళ్ల ఉత్సాహం నీరుగారిపోవచ్చు, సంఘ సభ్యుల్లో ఒకరు గంభీరమైన పాపం చేసినా పట్టించుకోని పరిస్థితి ఏర్పడవచ్చు. (1 కొరిం. 5:1; ప్రక. 3:15, 16) మీ సంఘంలో ఎలాంటి స్ఫూర్తి ఉంది? సంఘంలో మంచి స్ఫూర్తిని పెంచడానికి వ్యక్తిగతంగా మీరు ఏమి చేయవచ్చు?

మంచి స్ఫూర్తిని పెంచండి

3, 4. యెహోవాను “మహాసమాజములో” మనమెలా స్తుతించవచ్చు?

3 కీర్తనకర్త ఇలా పాడాడు, “మహాసమాజములో నేను నిన్ను [యెహోవాను] స్తుతించెదను. బహు జనులలో నిన్ను నుతించెదను.” (కీర్త. 35:18) కీర్తనకర్త తోటి ఆరాధకులతో ఉన్నప్పుడు కూడా యెహోవాను స్తుతించాడు. వ్యాఖ్యానించడం ద్వారా మనకున్న ఉత్సాహవంతమైన స్ఫూర్తిని కనబర్చేందుకు కావలికోట అధ్యయనంలో, వారంలో జరిగే ఇతర కూటాల్లో మనకు ఎన్నో అవకాశాలు దొరుకుతాయి. మనమందరం ఈ ప్రశ్నలు వేసుకోవాలి, ‘కూటాల్లో పాల్గొనే గొప్ప అవకాశాన్ని నేను పూర్తిగా సద్వినియోగం చేసుకుంటున్నానా? నేను వాటికి చక్కగా సిద్ధపడి, ఇతరులు ప్రయోజనం పొందేలా వ్యాఖ్యానిస్తున్నానా? వ్యాఖ్యానాలను ముందుగానే సిద్ధం చేసుకోవడానికి, తమ సొంత మాటల్లో జవాబులు చెప్పడానికి తండ్రిగా నేను నా పిల్లలకు సహాయం చేస్తున్నానా?’

4 మన హృదయం నిబ్బరంగా ఉండడానికీ మనం పాటలు పాడడానికీ మధ్య సంబంధం ఉందని చెబుతూ కీర్తనకర్తయైన దావీదు ఇలా అన్నాడు, “నా హృదయము నిబ్బరముగా నున్నది. దేవా, నా హృదయము నిబ్బరముగా నున్నది. నేను పాడుచు స్తుతిగానము చేసెదను.” (కీర్త. 57:7) క్రైస్తవ కూటాల్లో పాడే పాటల వల్ల నిబ్బరమైన హృదయంతో యెహోవాకు “పాడుచు స్తుతిగానము చేసే” అవకాశం మనకు దొరుకుతుంది. ఒకవేళ మనకు కొన్ని పాటలు రాకపోతే, కుటుంబ ఆరాధనలో వాటిని ప్రాక్టీసు చేస్తే మంచిది. ‘మన జీవిత కాలమంతా యెహోవాకు కీర్తనలు పాడాలని, మనం ఉన్నంత కాలం మన దేవుణ్ణి కీర్తించాలని’ గట్టిగా నిర్ణయించుకుందాం.—కీర్త. 104:33.

5, 6. మనం ఇతరులకు ఎలా ఆతిథ్యాన్ని ఇవ్వవచ్చు? ఉదారతను ఎలా చూపించవచ్చు? అలా చేస్తే సంఘంలో ఏమి నెలకొంటుంది?

5 మన సహోదర సహోదరీలకు ఆతిథ్యం ఇవ్వడం వల్ల కూడా సంఘంలో ప్రేమపూర్వక వాతావరణం నెలకొంటుంది. హెబ్రీయులకు రాసిన పత్రికలోని చివరి అధ్యాయంలో పౌలు ఈ ఉపదేశాన్ని చేర్చాడు, “సహోదర ప్రేమ నిలువరముగా ఉండనీయుడి, ఆతిథ్యము చేయ మరవకుడి.” (హెబ్రీ. 13:1, 2) ప్రయాణ పర్యవేక్షకులను, వాళ్ల భార్యలను లేదా సంఘంలోని పూర్తికాల సేవకులను భోజనానికి పిలిస్తే ఆతిథ్యమిచ్చేందుకు చక్కని అవకాశం దొరుకుతుంది. అప్పుడప్పుడు మీతో కలిసి భోజనం చేయడానికి లేదా కుటుంబ ఆరాధనలో పాల్గొనడానికి మీరు విధవరాండ్రను, ఒంటరి తల్లి/తండ్రి ఉన్న కుటుంబాలను, మరితరులను ఆహ్వానించవచ్చేమో ఆలోచించండి.

6 ఇతరులను ఇలా ప్రోత్సహించమని పౌలు తిమోతికి చెప్పాడు, “వాస్తవమైన జీవమును సంపాదించుకొను నిమిత్తము, రాబోవు కాలమునకు మంచి పునాది తమకొరకు వేసికొనుచు, మేలుచేయువారును, సత్క్రియలు అను ధనము గలవారును, ఔదార్యముగలవారును, తమ ధనములో ఇతరులకు పాలిచ్చువారునై యుండవలెను.” (1 తిమో. 6:17-19) ఆ మాటల ద్వారా, ఉదార స్వభావాన్ని అలవర్చుకోవాలని తోటి విశ్వాసులను పౌలు ప్రోత్సహించాడు. ఆర్థిక సంక్షోభం ఉన్నప్పుడు కూడా మనం ఉదార స్వభావాన్ని చూపించవచ్చు. కూటాలకు, పరిచర్యకు వెళ్లడానికి రవాణా అవసరమైన సహోదర సహోదరీలకు తగిన సహాయం చేస్తే మీరు ఉదార స్వభావాన్ని చూపించగలుగుతారు. మరి అలా ప్రయోజనం పొందినవాళ్లు ఉదార స్వభావాన్ని ఎలా చూపించవచ్చు? రవాణాకయ్యే ఖర్చులకు సహాయంగా ఉండేలా తాము ఇవ్వగలిగింది ఇవ్వడం ద్వారా చూపించవచ్చు. అంతేకాక, సహోదర సహోదరీలతో ముందుగానే ఏర్పాట్లు చేసుకొని వాళ్ల దగ్గరికి వెళ్లి ఎక్కువ సమయం గడపడానికి ప్రయత్నించినట్లయితే మన దృష్టిలో వాళ్లు విలువైనవాళ్లని, వాళ్లను ప్రేమిస్తున్నామని చూపించగలుగుతాం. మనం “విశ్వాసగృహమునకు చేరినవారియెడల” సత్క్రియలు చేస్తే, మన సమయాన్నీ వనరులనూ వాళ్లతో పంచుకోవడానికి సిద్ధంగా ఉంటే వాళ్ల పట్ల మనకున్న ప్రేమ పెరగడమే కాక సంఘంలో ప్రేమపూర్వకమైన వాతావరణాన్ని, మంచి స్ఫూర్తిని పెంచగలుగుతాం.—గల. 6:10.

7. సహోదరుల వ్యక్తిగత విషయాల్ని నలుగురికీ చెప్పకుండా జాగ్రత్తపడడం ద్వారా సంఘంలో ఉండే మంచి స్ఫూర్తిని ఎలా కాపాడవచ్చు?

7 అంతేకాక మన తోటి విశ్వాసులతో మనకున్న బంధం బలపడాలంటే, మనం వాళ్లతో స్నేహం చేయాలి. వాళ్లు మనల్ని నమ్మి మనతో చెప్పుకున్న వ్యక్తిగత విషయాలను నలుగురికీ చెప్పకుండా జాగ్రత్తపడాలి. (సామెతలు 18:24 చదవండి.) నిజమైన స్నేహితులు అలా చెప్పరు. కొన్నిసార్లు సహోదరులు మనల్ని నమ్మి తమ వ్యక్తిగత చింతలను మనతో పంచుకోవచ్చు. అప్పుడు మనం వాళ్ల నమ్మకాన్ని వమ్ము చేయకుండా ఉంటే మనకు వాళ్లతో ఉన్న బంధం మరింత బలపడుతుంది. కాబట్టి, అలా నమ్మకస్థులైన స్నేహితులుగా ఉండడం ద్వారా సంఘంలో ప్రేమను, కుటుంబ వాతావరణాన్ని పెంచగలుగుతాం.—సామె. 20:19.

పరిచర్యలో ఉత్సాహంగా పాల్గొనండి

8. లవొదికయ సంఘ సభ్యులకు యేసు ఏ ఉపదేశాన్నిచ్చాడు? ఎందుకు?

8 లవొదికయ సంఘాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ యేసు ఇలా అన్నాడు, “నీ క్రియలను నేనెరుగుదును, నీవు చల్లగానైనను వెచ్చగానైనను లేవు; నీవు చల్లగానైనను వెచ్చగానైనను ఉండిన మేలు. నీవు వెచ్చగానైనను చల్లగానైనను ఉండక, నులివెచ్చనగా ఉన్నావు గనుక నేను నిన్ను నా నోటనుండి ఉమ్మివేయ నుద్దేశించుచున్నాను.” (ప్రక. 3:15, 16) లవొదికయ సంఘ సభ్యులు పరిచర్య చేసే విషయంలో ఉత్సాహం చూపించలేదు. దానివల్ల, వాళ్ల మధ్య ఉన్న సంబంధాలు కూడా దెబ్బతిన్నాయి. కాబట్టి, యేసు ప్రేమతో వాళ్లకు ఇలా చెప్పాడు, “నేను ప్రేమించువారినందరిని గద్దించి శిక్షించుచున్నాను గనుక నీవు ఆసక్తి కలిగి మారుమనస్సు పొందుము.”—ప్రక. 3:19.

9. పరిచర్య విషయంలో మనం ఎక్కువ ఆసక్తి చూపిస్తే సంఘంపై ఎలాంటి ప్రభావం ఉంటుంది?

9 సంఘంలో మంచి స్ఫూర్తిని పెంచాలంటే పరిచర్య పట్ల మనం ఎంత ఉత్సాహాన్ని చూపిస్తున్నామో పరిశీలించుకోవాలి. క్షేత్రంలో ఉన్న గొర్రెల్లాంటి ప్రజల్ని కనుగొని వాళ్లను ఆధ్యాత్మికంగా బలపర్చేందుకే సంఘం వ్యవస్థీకరించబడింది. కాబట్టి, మనం యేసులాగే శిష్యులను తయారుచేసే పనిలో ఉత్సాహంగా పాల్గొనాలి. (మత్త. 28:19, 20; లూకా 4:43) పరిచర్య విషయంలో మనం ఎంత ఎక్కువ ఆసక్తి చూపిస్తే, ‘దేవుని జతపనివాళ్లముగా’ మనం అంత ఎక్కువ ఐక్యంగా ఉంటాం. (1 కొరిం. 3:9) ఇతర సహోదర సహోదరీలు క్షేత్ర సేవలో తమ విశ్వాసాన్ని సమర్థించుకుంటూ ఆధ్యాత్మిక విషయాల పట్ల తమకున్న కృతజ్ఞతను వ్యక్తం చేయడాన్ని చూసినప్పుడు వాళ్లను మరింత ఎక్కువగా ప్రేమించి గౌరవించాలనిపిస్తుంది. అంతేకాక, పరిచర్యలో ‘ఏకమనస్కులమై’ పాల్గొంటే సంఘంలో ఐక్యత నెలకొంటుంది.—జెఫన్యా 3:9 చదవండి.

10. క్షేత్ర సేవలో మనం మంచి ఫలితాలు సాధించడానికి గట్టిగా కృషి చేస్తే సంఘంలోని ఇతర సహోదర సహోదరీలు చూపించే స్ఫూర్తిలో ఎలాంటి మార్పు రావచ్చు?

10 పరిచర్యలో మనం మంచి ఫలితాలు సాధించడానికి కృషి చేస్తున్నట్లయితే ఇతర సహోదర సహోదరీలు కూడా అలా చేయాలనే ప్రోత్సాహాన్ని పొందుతారు. మనం కలిసే ప్రజల పట్ల మరింత శ్రద్ధ చూపిస్తూ వాళ్ల హృదయాలను చేరుకోవడానికి గట్టిగా కృషి చేస్తే పరిచర్య విషయంలో మనకున్న ఉత్సాహం రెట్టింపు అవుతుంది. (మత్త. 9:36, 37) మన ఉత్సాహాన్ని చూసి ఇతరులు కూడా అలాంటి ఉత్సాహాన్నే చూపించవచ్చు. యేసు తన శిష్యులను ఒంటరిగా పంపించకుండా ఇద్దరిద్దరిని పంపించాడు. (లూకా 10:1) అలా వాళ్లు ప్రోత్సాహాన్ని, శిక్షణను పొందారు. అంతేకాక, పరిచర్య పట్ల వాళ్లకున్న ఉత్సాహం రెట్టింపయ్యింది. ఉత్సాహవంతులైన రాజ్య ప్రచారకులతో పనిచేసినప్పుడు మనం కూడా ప్రయోజనం పొందుతాం. వాళ్ల ఉత్సాహం మనకు ప్రోత్సాహాన్ని ఇవ్వడమే కాక ప్రకటనాపనిలో ఉత్సాహంగా పాల్గొనాలనే ప్రేరణను ఇస్తుంది.—రోమా. 1:12.

సణగకండి, గంభీరమైన పాపాల్ని దాచిపెట్టకండి

11. మోషే కాలంలోని కొంతమంది ఇశ్రాయేలీయులు ఎలాంటి స్ఫూర్తి చూపించడం మొదలుపెట్టారు? దానివల్ల వాళ్లకు ఏమి జరిగింది?

11 యెహోవా ఇశ్రాయేలీయులను ఒక కొత్త జనాంగంగా స్వీకరించిన కొన్ని వారాలకే వాళ్లు అసంతృప్తితో సణగడం మొదలుపెట్టారు. దానివల్ల వాళ్లు యెహోవాకు, ఆయన ప్రతినిధులకు ఎదురుతిరిగారు. (నిర్గ. 16:1, 2) ఐగుప్తు నుండి బయటకు వచ్చిన ఇశ్రాయేలీయుల్లో కొంతమంది మాత్రమే వాగ్దాన దేశంలోకి ప్రవేశించగలిగారు. అంతెందుకు, ఇశ్రాయేలీయుల ప్రవర్తనకు మోషే స్పందించిన తీరు వల్ల, చివరకు ఆయన కూడా అందులోకి ప్రవేశించలేకపోయాడు. (ద్వితీ. 32:48-52) ప్రతికూల స్ఫూర్తి చూపించే ప్రమాదంలో చిక్కుకోకుండా ఉండాలంటే మనం ఏమి చేయవచ్చు?

12. మనలో సణిగే తత్వం మొదలవకుండా ఉండాలంటే ఏమి చేయాలి?

12 మనలో సణిగే తత్వం మొదలవకుండా చూసుకోవాలి. దీనికోసం మనం వినయాన్ని, అధికారం పట్ల గౌరవాన్ని అలవర్చుకోవడమే కాకుండా మనం ఎవరితో స్నేహం చేస్తున్నామో కూడా చూసుకోవాలి. చెడ్డ వినోదాన్ని ఎంచుకోవడం వల్ల లేదా నీతి సూత్రాల పట్ల ఏమాత్రం గౌరవం లేని సహోద్యోగులతో, తోటి విద్యార్థులతో ఎక్కువ సమయం గడపడం వల్ల ప్రమాదం తలెత్తే అవకాశం ఉంది. మనం ప్రతికూల స్వభావాన్ని చూపించే లేదా స్వేచ్ఛా వైఖరిని పెంపొందించే ప్రజలతో స్నేహాన్ని పెంచుకోకుండా జాగ్రత్తపడాలి.—సామె. 13:20.

13. సణగడమనే చెడ్డ లక్షణం సంఘంలో ఆధ్యాత్మిక హాని కలిగించే ఏ ఇతర పరిణామాలకు దారితీయవచ్చు?

13 సణగడమనే చెడ్డ లక్షణం ఆధ్యాత్మిక హాని కలిగించే ఇతర పరిణామాలకు దారితీయవచ్చు. ఉదాహరణకు సణగడం వల్ల సంఘంలోని శాంతికి, ఐక్యతకు భంగం వాటిల్లవచ్చు. తోటి విశ్వాసుల గురించి చెడ్డగా చెబితే అది వాళ్ల మనసులను గాయపర్చవచ్చు. అంతేకాక కొండెములు చెప్పడానికి, దూషించడానికి అది దారితీయవచ్చు. (లేవీ. 19:16; 1 కొరిం. 5:11) మొదటి శతాబ్దపు సంఘంలో సణిగే స్వభావం ఉన్న కొంతమంది ‘ప్రభుత్వమును నిరాకరించారు, మహాత్ములను దూషించారు.’ (యూదా 8, 15, 16) సంఘంలో బాధ్యతగల స్థానాల్లో ఉన్న సహోదరుల మీద సణగడాన్ని దేవుడు ఆమోదించలేదు.

14, 15. (ఎ) ఒక వ్యక్తి చేసిన పాపాన్ని చూసీచూడనట్లు వదిలేస్తే సంఘానికి ఏమి జరిగే ప్రమాదం ఉంది? (బి) ఒక వ్యక్తి రహస్యంగా పాపం చేస్తున్నారని మనకు తెలిస్తే మనం ఏమి చేయాలి?

14 ఎవరైనా మద్యాన్ని అతిగా సేవిస్తున్నారని, అశ్లీల చిత్రాలను చూస్తున్నారని లేదా అనైతికమైన జీవితాన్ని గడుపుతున్నారని మనకు తెలిస్తే మనం ఏమి చేయాలి? (ఎఫె. 5:11, 12) గంభీరమైన పాపాల్ని చూసీచూడనట్లు వదిలేస్తే, సంఘం మీద యెహోవా పరిశుద్ధాత్మ సరిగ్గా పని చేయదు, సంఘమంతటి సమాధానం దెబ్బతింటుంది. (గల. 5:19-23) అప్పటి కొరింథులోని క్రైస్తవులు తమ మధ్యవున్న చెడును తీసిపారేయాల్సి వచ్చినట్లుగానే, ఇప్పుడు కూడా సంఘాన్ని కలుషితం చేసేవాటిని సంఘంలో నుండి నిర్మూలించాలి. అలా చేస్తే, సంఘంలో మంచి స్ఫూర్తిని కాపాడగలుగుతాం. సంఘ సమాధానానికి తోడ్పడేందుకు మీరు ఏమి చేయవచ్చు?

15 మనం ముందటి పేరాల్లో చూసినట్లు, సంఘంలో కొన్ని విషయాలను అందరికీ వ్యాప్తి చేయకూడదు. ముఖ్యంగా ఇతర సహోదర సహోదరీలు మనల్ని నమ్మి మనతో చెప్పుకున్నవాటిని మనం నలుగురికీ చెప్పకూడదు. అలా చెప్పడం చాలా తప్పు. దానివల్ల ఆ వ్యక్తి ఎంతగానో నొచ్చుకోవచ్చు. అయితే, గంభీరమైన పాపం జరిగిందని తెలిసినప్పుడు మాత్రం సంఘ పెద్దలకు దాన్ని తెలియజేయాలి. ఎందుకంటే, లేఖనాల ప్రకారం అలాంటి విషయాలను చూసుకునే బాధ్యత వాళ్లమీద ఉంది. (లేవీయకాండము 5:1 చదవండి.) కాబట్టి, ఒక సహోదరుడు లేదా సహోదరి గంభీరమైన పాపం చేశారని మనకు తెలిస్తే, ఆయనను లేదా ఆమెను సంఘ పెద్దల దగ్గరికి వెళ్లి వాళ్ల సహాయాన్ని తీసుకోమని చెప్పాలి. (యాకో. 5:13-15) ఒకవేళ ఆ వ్యక్తి సముచితమైన గడువు లోపల అలా చేయకపోతే మనమే దాన్ని పెద్దలకు తెలియజేయాలి.

16. గంభీరమైన పాపాల గురించి సంఘ పెద్దలకు తెలియజేయడం వల్ల సంఘంలోని మంచి స్ఫూర్తిని ఎలా కాపాడవచ్చు?

16 క్రైస్తవ సంఘం ఒక మంచి ఆధ్యాత్మిక ఆశ్రయం. గంభీరమైన పాపాల గురించి సంఘ పెద్దలకు తెలియజేయడం ద్వారా మనం దాన్ని కాపాడడానికి తోడ్పడాలి. గంభీరమైన పాపం చేసిన వ్యక్తి తన తప్పు తెలుసుకోవడానికి పెద్దలు సహాయం చేసినప్పుడు ఆయన దిద్దుబాటును స్వీకరించి పశ్చాత్తాపపడితే, ఆయన/ఆమె ఇక సంఘ స్ఫూర్తికి ప్రమాదం కలుగజేయరు. ఒకవేళ పెద్దలు ప్రేమతో ఇచ్చిన ఉపదేశాన్ని త్రోసిపుచ్చి పశ్చాత్తాపపడకపోతే అప్పుడేమిటి? ఆ వ్యక్తిని సంఘంలో నుండి బహిష్కరిస్తారు, అలా సంఘాన్ని పాడుచేసే చెడు ప్రభావం ‘నాశనమౌతుంది’ లేదా తొలగిపోతుంది. అప్పుడు, సంఘంలో ఉన్న మంచి స్ఫూర్తిని కాపాడవచ్చు. (1 కొరింథీయులు 5:4, 5 చదవండి.) దాని కోసం ప్రతీ ఒక్కరం సరైన చర్య తీసుకోవాలి, పెద్దల సభతో సహకరించాలి, తోటి విశ్వాసులకు ఆధ్యాత్మిక హాని జరగకుండా చూడాలి.

‘ఐక్యతను’ పెంచండి

17, 18. మనం ‘ఐక్యతను’ ఎలా పెంచవచ్చు?

17 మొదటి శతాబ్దంలోని క్రైస్తవులు “అపొస్తలుల బోధయందు” విశ్వాసం ఉంచడం ద్వారా సంఘ ఐక్యతకు తోడ్పడ్డారు. (అపొ. 2:42) వాళ్లు సంఘ పెద్దల నుండి వచ్చిన లేఖన ఉపదేశాలను, నిర్దేశాలను విలువైనవిగా ఎంచారు. ఇప్పుడు సంఘ పెద్దలు నమ్మకమైనవాడును, బుద్ధిమంతుడునైన దాసుని తరగతితో సహకరిస్తున్నందువల్ల సంఘంలోని వాళ్లంతా ఐక్యంగా ఉండడానికి కావాల్సిన ప్రోత్సాహాన్ని, సహాయాన్ని పొందుతున్నారు. (1 కొరిం. 1:10) యెహోవా సంస్థ ఇచ్చే లేఖనాధార ఉపదేశానికి లోబడుతూ, సంఘ పెద్దల నిర్దేశాల్ని పాటిస్తే, మనం ‘సమాధానమనే బంధం చేత ఐక్యతను కాపాడడానికి’ పట్టుదలతో కృషి చేస్తున్నామని చూపించగలుగుతాం.—ఎఫె. 4:1-3.

18 కాబట్టి మనమందరం సంఘంలో ఉన్న మంచి స్ఫూర్తిని కాపాడడానికి శాయశక్తులా కృషిచేద్దాం. అలా చేస్తే, ‘ప్రభువైన యేసుక్రీస్తు కృప మనం చూపించే స్ఫూర్తికి తోడై ఉంటుంది’ అనే నమ్మకాన్ని కలిగివుండవచ్చు.—ఫిలి. 4:23, NW.

[అధ్యయన ప్రశ్నలు]

[19వ పేజీలోని చిత్రం]

ఇతరులు ప్రయోజనం పొందేలా వ్యాఖ్యానించడానికి సిద్ధపడడం ద్వారా మీరు సంఘంలోని మంచి స్ఫూర్తికి తోడ్పడుతున్నారా?

[20వ పేజీలోని చిత్రం]

మన పాటలను నేర్చుకోవడం ద్వారా సంఘంలో మంచి స్ఫూర్తికి తోడ్పడండి