కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

స్వచ్ఛారాధనను నమ్మకంగా సమర్థించిన నాతాను

స్వచ్ఛారాధనను నమ్మకంగా సమర్థించిన నాతాను

స్వచ్ఛారాధనను నమ్మకంగా సమర్థించిన నాతాను

అధికారంలోవున్న ఒక వ్యక్తి తప్పు చేశాడని, దాన్ని దిద్దుకోవాల్సి ఉందని ఆయనను ఒప్పించడం అంత సులభం కాదు. పరువు కాపాడుకోవడానికి ఒకరిని చంపించాడని తెలిసి కూడా మీరు ఆయన ముందుకు వెళ్లి మాట్లాడే ధైర్యం చేస్తారా?

ప్రాచీన ఇశ్రాయేలు రాజైన దావీదు బత్షెబతో వ్యభిచారం చేశాడు, దానివల్ల ఆమె గర్భవతి అయ్యింది. తమ తప్పును కప్పిపుచ్చుకోవడానికి దావీదు ఆమె భర్తను చంపించి, ఆమెను తన భార్యగా తెచ్చుకున్నాడు. దావీదు అప్పటికి కొన్ని నెలలుగా ద్వంద్వ జీవితం గడుపుతున్నాడు. ఆయన రాజుగా తన విధులను ఇంకా నిర్వర్తిస్తూనే ఉన్నాడు. కానీ దావీదు రాజు చేసిన పాపాన్ని బయటపెట్టడానికి యెహోవా నాతాను ప్రవక్తను ఆయన దగ్గరికి పంపించాడు.

నాతాను దావీదు దగ్గరికి వెళ్లి ఆయన తప్పు బయటపెట్టడం అంత చిన్న విషయమేమీ కాదు. మీరు నాతాను స్థానంలో ఉన్నట్లు ఊహించుకోండి. యెహోవా పట్ల నమ్మకంగా ఉండాలనే, దేవుని ప్రమాణాలను పాటించాలనే కోరిక ఉండడం వల్ల నాతాను దావీదు దగ్గరికి వెళ్లడానికి సిద్ధమై ఉంటాడు. దావీదు రాజు పశ్చాత్తాపపడాల్సి ఉందని నాతాను ఆయనను ఎలా ఒప్పించగలిగాడు?

నేర్పుగల బోధకుడు

కొంత సమయం తీసుకొని 2 సమూయేలు 12:1-25 చదవండి. మీరు నాతాను స్థానంలో ఉండి ఆయన దావీదుకు ఈ కథ చెప్తున్నట్లు ఊహించుకోండి, “ఒకానొక పట్టణమందు ఇద్దరు మనుష్యులు ఉండిరి. ఒకడు ఐశ్వర్యవంతుడు ఒకడు దరిద్రుడు. ఐశ్వర్యవంతునికి విస్తారమైన గొఱ్ఱెలును గొడ్లును కలిగియుండెను. అయితే ఆ దరిద్రునికి తాను కొనుక్కొనిన యొక చిన్న ఆడు గొఱ్ఱెపిల్ల తప్ప ఏమియు లేకపోయెను. వాడు దానిని పెంచుకొనుచుండగా అది వానియొద్దను, వాని బిడ్డలయొద్దను ఉండి పెరిగి వాని చేతిముద్దలు తినుచు వాని గిన్నెలోనిది త్రాగుచు వాని కౌగిట పండుకొనుచు వానికి కుమార్తెవలె ఉండెను. అట్లుండగా మార్గస్థుడొకడు ఐశ్వర్యవంతుని యొద్దకు వచ్చెను. అతడు తనయొద్దకు వచ్చిన మార్గస్థునికి ఆయత్తము చేయుటకు తన గొఱ్ఱెలలోగాని గొడ్లలోగాని దేనిని ముట్టనొల్లక, ఆ దరిద్రుని గొఱ్ఱెపిల్లను పట్టుకొని, తనయొద్దకు వచ్చినవానికి ఆయత్తము చేసెను.”—2 సమూ. 12:1-4.

దావీదు గొర్రెలకాపరి కాబట్టి నాతాను చెప్పింది నిజంగా జరిగిన సంఘటన అని నమ్మి ఉంటాడు. ఒక వ్యాఖ్యాత ఇలా అన్నాడు, “ఏదో విధంగా నష్టపోయి నిస్సహాయ స్థితిలో ఉన్నవాళ్ల తరఫున మాట్లాడడానికి నాతాను దావీదు దగ్గరికి వస్తుండేవాడు కాబట్టి ఆ సందర్భంలో కూడా అలాగే వచ్చాడని ఆయన అనుకుని ఉంటాడు.” ఒకవేళ అదే నిజమైనా, దావీదుతో అలా మాట్లాడడానికి నాతానుకు యెహోవా పట్ల నమ్మకం, అలాగే ధైర్యం అవసరమయ్యాయి. నాతాను చెప్పిన కథ వినేసరికి దావీదుకు చాలా కోపం వచ్చి, “యెహోవా జీవముతోడు నిశ్చయముగా ఈ కార్యము చేసినవాడు మరణపాత్రుడు” అన్నాడు. అప్పుడు నాతాను, “ఆ మనుష్యుడవు నీవే” అంటూ అసలు విషయం బయటపెట్టాడు.—2 సమూ. 12:5-7.

నాతాను ఆ సమస్యను ఎందుకలా ఒక కథ రూపంలో ప్రస్తావించాడో చూద్దాం. ఎవరి వ్యామోహంలోనైనా పడిన వ్యక్తి తన పరిస్థితిని ఉన్నదున్నట్లు చూడలేడు. సాధారణంగా మనం, చేసిన తప్పును సమర్థించుకోవడానికే ప్రయత్నిస్తాం. కానీ నాతాను చెప్పిన కథ వల్ల, దావీదు తాను చేసిన తప్పును అనుకోకుండానే ఖండించాడు. నాతాను చెప్పిన కథలోని ధనవంతుడు తప్పు చేశాడని రాజు స్పష్టంగా గ్రహించాడు. దావీదు ఆ ధనవంతుని తప్పును ఖండించిన తర్వాతే నాతాను ఆ కథ నిజానికి రాజు గురించేనని చెప్పాడు. అప్పుడు దావీదు తాను ఎంత పెద్ద తప్పు చేశాడో గ్రహించాడు. దానితో ఆయన గద్దింపును స్వీకరించడానికి సుముఖత చూపించాడు. బత్షెబతో తప్పు చేయడం ద్వారా తాను యెహోవాను ‘నిర్లక్ష్యం’ చేశానని గుర్తించి, గద్దింపును స్వీకరించాడు.—2 సమూ. 12:9-14; కీర్త. 51, పైవిలాసం.

దీని నుండి మనం ఏమి నేర్చుకోవచ్చు? శ్రోతలు సరైన ముగింపుకు రావడానికి సహాయం చేయడమే బైబిలు బోధకుల లక్ష్యం. నాతానుకు దావీదు పట్ల గౌరవం ఉంది, అందుకే నాతాను ఆయనతో నేర్పుగా మాట్లాడాడు. దావీదు నీతి న్యాయాలను ప్రేమించాడని నాతానుకు తెలుసు. దావీదు తనకున్న ఆ మంచి లక్షణాలను బట్టి తగిన చర్య తీసుకుంటాడన్న ఉద్దేశంతోనే నాతాను ఆ కథ చెప్పాడు. అలాగే మనం కూడా, యెహోవా ఉద్దేశమేమిటో తెలుసుకోవడానికి యథార్థ హృదయులకు సహాయం చేయవచ్చు. ఎలా? తప్పొప్పుల విషయంలో తమకున్న వివేచనను ఉపయోగించి చర్య తీసుకునేలా సహాయం చేయడం ద్వారా మనం అలా చేయవచ్చు. అంతేగానీ నైతిక లేక ఆధ్యాత్మిక విషయాల్లో మనం వాళ్లకన్నా ఉన్నతులమని చూపించుకోవడానికి ప్రయత్నించకూడదు. తప్పొప్పుల గురించి మనకున్న అభిప్రాయాన్ని కాదుగానీ వాటి గురించి బైబిలు అభిప్రాయం ఏమిటో వివరించాలి.

అన్నిటికన్నా ప్రాముఖ్యంగా, దేవుని పట్ల నమ్మకంగా ఉన్నందువల్లే నాతాను అధికారంలోవున్న దావీదును గద్దించగలిగాడు. (2 సమూ. 12:1) అలాంటి నమ్మకత్వాన్ని మనం కూడా చూపిస్తే యెహోవా నీతి సూత్రాల ప్రకారం నడుచుకోవడానికి కావాల్సిన ధైర్యాన్ని పొందుతాం.

స్వచ్ఛారాధనను పెంపొందించాడు

దావీదు, నాతాను మంచి స్నేహితులు అయ్యుండవచ్చు, ఎందుకంటే దావీదు తన కుమారుల్లో ఒకరికి నాతాను అని పేరు పెట్టాడు. (1 దిన. 3:1, 5) బైబిల్లో మొట్టమొదటిసారిగా నాతాను గురించి ప్రస్తావించబడిన సందర్భంలో ఆయన దావీదు దగ్గరే ఉన్నాడు. ఇద్దరూ యెహోవాను ప్రేమించేవాళ్లే. నాతాను వివేచనపై దావీదు రాజుకు నమ్మకం ఉండివుండవచ్చు. అందుకే, యెహోవాకు ఆలయం నిర్మించాలనే తన కోరికను దావీదు నాతాను ప్రవక్తకు తెలియజేశాడు. దావీదు ఇలా అన్నాడు, “నేను దేవదారుమ్రానుతో కట్టిన నగరియందు వాసము చేయుచుండగా దేవుని మందసము డేరాలో నిలిచియున్నది.” దానికి నాతాను దావీదుతో ఇలా అన్నాడు, “యెహోవా నీకు తోడుగా నున్నాడు, నీకు తోచినదంతయు నెరవేర్చుము.”—2 సమూ. 7:2, 3.

నాతాను యెహోవాకు నమ్మకమైన ఆరాధకుడు కాబట్టి స్వచ్ఛారాధన కోసం భూమ్మీద మొట్టమొదటి శాశ్వత భవనాన్ని నిర్మించాలనే దావీదు ప్రణాళికతో సమ్మతించాడు. అయితే, ఈ సందర్భంలో నాతాను యెహోవా నామం తరఫున మాట్లాడే బదులు తన సొంత అభిప్రాయాన్ని వ్యక్తం చేసి ఉంటాడు. ఆ రాత్రి, దేవుడు నాతానుకు వేరే సందేశాన్ని తెలియజేసి, దాన్ని రాజుకు చెప్పమన్నాడు. దావీదు యెహోవాకు ఆలయం కట్టడనీ, ఆయన కుమారుల్లో ఒకరు దాన్ని కడతారనీ చెప్పమన్నాడు. అయితే, దావీదు సింహాసనాన్ని ‘నిత్యముగా స్థిరపరుస్తాను’ అని యెహోవా చేసిన నిబంధన గురించి నాతాను దావీదుకు తెలియజేశాడు.—2 సమూ. 7:4-16.

ఆలయ నిర్మాణ విషయంలో దేవుని చిత్తం నాతాను అనుకున్నట్లుగా లేదు. అయితే, వినయంగల ఆ ప్రవక్త ఏమాత్రం సణుగుకోకుండా యెహోవా ఉద్దేశంతో సమ్మతించి దానికి సహకరించాడు. ఏదైనా ఒక విషయంలో యెహోవా మనల్ని సరిదిద్దే పరిస్థితి ఏర్పడితే మనం నాతాను చక్కని మాదిరిని అనుసరించవచ్చు. ఆ తర్వాత కూడా ప్రవక్తగా నాతాను చేసిన పనులను బట్టి చూస్తే ఆయన దేవుని అనుగ్రహం కోల్పోలేదని తెలుస్తోంది. నిజానికి, ఆలయ సేవలో 4000 మంది సంగీతకారులను దావీదు నియమించేలా నాతాను ప్రవక్తను, దీర్ఘదర్శియైన గాదును యెహోవాయే ప్రేరేపించాడనిపిస్తోంది.—1 దిన. 23:1-5; 2 దిన. 29:25.

రాచరికాన్ని సమర్థించాడు

దావీదు తర్వాతి రాజు సొలొమోనే అని నాతానుకు తెలుసు. కాబట్టి, దావీదు వృద్ధుడైనప్పుడు సింహాసనాన్ని చేజిక్కించుకోవాలని అదోనీయా ప్రయత్నించినప్పుడు నాతాను వెంటనే చర్య తీసుకున్నాడు. ఈ సందర్భంలో కూడా నాతాను నేర్పుగా, నమ్మకంగా నడుచుకున్నాడు. మొదటిగా, సొలొమోనును రాజుగా చేస్తానని దావీదు చేసిన ప్రమాణాన్ని ఆయనకు గుర్తుచేయమని బత్షెబకు చెప్పాడు. రెండవదిగా, తన తర్వాతి రాజుగా ఉండేందుకు అదోనీయాను దావీదు ఎంపిక చేశాడా అని తెలుసుకోవడానికి నాతాను ప్రవక్తే రాజు సముఖంలోకి ప్రవేశించాడు. పరిస్థితి ఎంత దూరం వెళ్లిందో గ్రహించాక, వృద్ధాప్యంలో ఉన్న దావీదు రాజు సొలొమోనును అభిషేకించి రాజుగా ప్రకటించమని నాతానుకు, మరితర నమ్మకమైన సేవకులకు తెలియజేశాడు. అదోనీయా పన్నాగం విఫలమైంది.—1 రాజు. 1:5-53.

వినయంగల చరిత్రకారుడు

1 సమూయేలు 25-31 అధ్యాయాలను, 2 సమూయేలు పుస్తకాన్ని నాతాను, గాదు రాశారని చెప్పబడుతోంది. ఆ పుస్తకాల్లో దైవప్రేరణతో రాయబడిన చరిత్రాపరమైన విషయాల గురించి ఇలా చెప్పబడింది, “రాజైన దావీదునకు జరిగినవాటన్నిటిని గూర్చియు, అతని రాజరికమంతటిని గూర్చియు, పరాక్రమమును గూర్చియు, అతనికిని ఇశ్రాయేలీయులకును దేశముల రాజ్యములన్నిటికిని వచ్చిన కాలములను గూర్చియు దీర్ఘదర్శి సమూయేలు మాటలనుబట్టియు, ప్రవక్తయగు నాతాను మాటలనుబట్టియు, దీర్ఘదర్శి గాదు మాటలనుబట్టియు వ్రాయబడి యున్నది.” (1 దిన. 29:29, 30) నాతాను ప్రవక్త “సొలొమోను చేసిన కార్యములన్నిటిని గూర్చి” ఒక గ్రంథాన్ని కూడా రాశాడు. (2 దిన. 9:29) దావీదు మరణం తర్వాత కూడా నాతాను రాజదర్బారుకు సంబంధించిన పనుల్లో కొనసాగి ఉండవచ్చు.

ఇంతవరకు నాతాను ప్రవక్త గురించి మనకు తెలిసిన వివరాల్లో చాలామట్టుకు ఆయన రాసినవే అయ్యుండవచ్చు. కానీ కొన్ని విషయాల గురించి ఆయన ఏమీ ప్రస్తావించకపోవడాన్ని బట్టి మనకు ఆయన వ్యక్తిత్వం గురించి ఎంతో తెలుస్తోంది. నాతాను ప్రవక్త వినయంగల చరిత్రకారుడని తెలుస్తోంది. పేరుప్రతిష్ఠలు సంపాదించుకోవాలనే కాంక్ష ఆయనకు లేదు. ఒక బైబిలు నిఘంటువు ప్రకారం, దైవప్రేరేపిత వృత్తాంతాల్లో “ఆయన వంశావళి గురించి” ఏమీలేదు. ఆయన వ్యక్తిగత జీవితం గురించి, ఆయన పూర్వీకుల గురించి మనకు ఏమీ తెలియదు.

యెహోవాపట్ల నమ్మకంగా ఉండాలనే కోరిక ఆయనకు ఉండేది

లేఖనాల్లో నాతాను ప్రవక్త గురించి మనకు అందుబాటులో ఉన్న కొన్ని వివరాలను బట్టి ఆయన వినయంగల వ్యక్తే అయినా దైవిక ఏర్పాట్లను ధైర్యంగా సమర్థించాడని తెలుస్తోంది. యెహోవా ఆయనకు బరువైన బాధ్యతలు అప్పగించాడు. దేవుని పట్ల నమ్మకంగా ఉండడం, దేవుడు కోరేవాటిని విలువైనవిగా ఎంచడం వంటి మంచి లక్షణాలను నాతాను చూపించాడు. అలాంటి లక్షణాల గురించి ధ్యానించండి, మీ జీవితంలో అలాంటి లక్షణాలు చూపించడానికి కృషి చేయండి.

వ్యభిచారం చేసిన రాజులను గద్దించడానికో, కుయుక్తితో పన్నిన పన్నాగాలను విఫలం చేయడానికో యెహోవా మిమ్మల్ని ఎంచుకోకపోవచ్చు. అయితే, యెహోవా సహాయంతో మీరు ఆయన పట్ల నమ్మకంగా ఉండి ఆయన నీతి ప్రమాణాలను సమర్థించడం సాధ్యమే. అంతేకాక, మీరు ధైర్యంగా ఉంటూనే నేర్పుగా సత్యాన్ని బోధించే బోధకులుగా, స్వచ్ఛారాధనను పెంపొందించే వ్యక్తులుగా ఉండడం సాధ్యమే.

[25వ పేజీలోని చిత్రం]

రాచరికాన్ని సమర్థించే వ్యక్తిగా నాతాను బత్షెబతో నేర్పుగా మాట్లాడాడు