“కొంచెం మా ఫోటో తీస్తారా?”
“కొంచెం మా ఫోటో తీస్తారా?”
మెక్సికో బెతెల్‌లో సేవచేస్తున్న హోస్వే అనే సహోదరుడు, కెరెటారోలో జరుగుతున్న జిల్లా సమావేశపు రెండవ రోజు ముగిసిన తర్వాత ఆ నగరాన్ని చూడడానికి వెళ్లాడు. అప్పుడు, కొలంబియా నుండి కెరెటారో నగరాన్ని చూడడానికి వచ్చిన కావ్యర్, మారూ అనే జంట తమ ఫోటో తీయమని హోస్వేను అడిగారు. హోస్వే, ఆయన స్నేహితులు గౌరవప్రదంగా తయారై, సమావేశపు బ్యాడ్జీలు పెట్టుకొని ఉండడం చూసి, ‘మీరు స్నాతకోత్సవానికి గానీ ఏదైనా ప్రత్యేక కార్యక్రమానికి గానీ వెళ్లొస్తున్నారా?’ అని వాళ్లు అడిగారు. యెహోవాసాక్షుల జిల్లా సమావేశానికి వచ్చామని చెప్పి, హోస్వే వాళ్లను ఆదివారం కార్యక్రమానికి రమ్మని ఆహ్వానించాడు.
అలాంటి సందర్భానికి తగిన దుస్తులు లేనందువల్ల తాము రావడం అంత బాగుండదని వాళ్లు అన్నారు. వాళ్లు సమావేశానికి వచ్చేందుకు ఇష్టపడకపోయినా హోస్వే తన పేరు, తాను సేవ చేస్తున్న బ్రాంచి ఆఫీసు నంబరు వాళ్లకు ఇచ్చాడు.
నాలుగు నెలల తర్వాత కావ్యర్ నుండి ఫోను రావడంతో హోస్వే ఆశ్చర్యపోయాడు. ఆ రోజు తాము సమావేశానికి వచ్చామని ఆయన చెప్పాడు. ప్రస్తుతం తాము మెక్సికో నగరంలో ఉంటున్నామనీ, యెహోవాసాక్షులు తమ వద్దకు వచ్చి బైబిలు అధ్యయనం చేయాలనీ ఆయన కోరాడు. త్వరలోనే వాళ్లతో బైబిలు అధ్యయనం ప్రారంభమైంది, వెంటనే కూటాలకు రావడం కూడా మొదలుపెట్టారు. పది నెలల తర్వాత ప్రచారకులయ్యారు. కొంతకాలానికి వాళ్లు కెనడాలోవున్న టోరెంటోకు వెళ్లిపోయినా ఆధ్యాత్మిక ప్రగతి సాధించి బాప్తిస్మం తీసుకున్నారు.
కావ్యర్, సత్యాన్ని అంగీకరించడానికి తమను ఏది పురికొల్పిందో తెలియజేస్తూ హోస్వేకు ఇలా ఉత్తరం రాశాడు, “సమావేశానికి వచ్చే ముందు, మాకు ఆధ్యాత్మిక నిర్దేశం అవసరమనే విషయం గురించి నేను, నా భార్య మాట్లాడుకున్నాం. మీరు, మీ స్నేహితులు గౌరవప్రదంగా తయారై ఉండడాన్ని చూసి మీరు ఏదైనా ఒక ప్రత్యేక కార్యక్రమానికి వెళ్లొస్తున్నారేమో అనుకున్నాం. అయితే, మేము సమావేశానికి వచ్చినప్పుడు మేము కూర్చోవడానికి సీట్లు చూపించడం, బైబిలు తెరచి చూసుకోవడానికి సహాయం చేయడం, అక్కడున్న వాళ్లు చక్కగా ప్రవర్తించడం మాకెంతో నచ్చాయి. మా దుస్తులు అంత బాగా లేకపోయినా ఎవ్వరూ మమ్మల్ని చిన్నచూపు చూడలేదు.”
జ్ఞానవంతుడైన సొలొమోను రాజు మాటలు హోస్వే విషయంలో నిజమయ్యాయి. సొలొమోను ఇలా రాశాడు, “ఉదయమందు విత్తనమును విత్తుము, అస్తమయమందును నీ చేయి వెనుక తియ్యక విత్తుము, అది ఫలించునో యిది ఫలించునో లేక రెండును సరిసమానముగా ఎదుగునో నీవెరుగవు.” (ప్రసం. 11:6) రాబోయే జిల్లా సమావేశం గురించి, బహిరంగ ప్రసంగం గురించి ఇతరులకు చెప్పడం ద్వారా సత్యపు విత్తనాలు విత్తడానికి మీకు దొరికే అవకాశాలను ఉపయోగించుకుంటున్నారా? కావ్యర్, మారూల్లా ఆధ్యాత్మిక నిర్దేశం కోసం ఆకలిదప్పులతో ఉన్న వాళ్లను ఆకర్షించడానికి యెహోవా మిమ్మల్ని ఉపయోగించుకోవచ్చు.—యెష. 55:1.
[32వ పేజీలోని చిత్రం]
ఎడమ నుండి కుడికి: మెక్సికో బ్రాంచి దగ్గర ఆలహాండ్రో వోగ్లిన్, మారూ పినెడా, ఆలహాండ్రో పినెడా, కావ్యర్ పినెడా, హోస్వే రామిరెజ్