‘నిద్రమేల్కోవడానికి’ ప్రజలకు సహాయం చేయండి
‘నిద్రమేల్కోవడానికి’ ప్రజలకు సహాయం చేయండి
‘మీరు కాలమును ఎరుగుదురు, నిద్రమేలుకొను వేళయైనదని మీకు తెలియును.’—రోమా. 13:11.
మీరు వీటిని వివరించగలరేమో చూడండి:
క్రైస్తవులు ఆధ్యాత్మికంగా మెలకువగా ఉండడం ఎందుకు ప్రాముఖ్యం?
అప్రమత్తంగా ఉండే ప్రచారకులు ఎందుకు జాగ్రత్తగా వినాలి, ఎందుకు పరిస్థితులను గమనిస్తూ ఉండాలి?
మనం పరిచర్య చేస్తున్నప్పుడు ఎందుకు మర్యాదపూర్వకంగా, మృదువుగా మాట్లాడాలి?
1, 2. చాలామంది ఇప్పుడు ఎలాంటి నిద్ర నుండి మేల్కోవాలి?
వాహనం నడుపుతున్నప్పుడు నిద్రతో కళ్లు మూతలు పడడం వల్ల లేదా నిద్రలోకి జారుకోవడం వల్ల ప్రతీ సంవత్సరం వేలాదిమంది చనిపోతున్నారు. పనికి వెళ్లేందుకు సమయానికి నిద్రలేవకపోవడం వల్ల లేదా పనిస్థలంలో నిద్రపోవడం వల్ల కొంతమంది ఉద్యోగాలు కోల్పోతున్నారు. అయితే, ఆధ్యాత్మిక నిద్రమత్తు వల్ల అంతకన్నా ఘోరమైన ఫలితాలు రావచ్చు. ఆ ప్రాముఖ్యమైన విషయం గురించి మాట్లాడుతూ, ‘మెలకువగా ఉండువాడు ధన్యుడు’ అని బైబిలు చెబుతోంది.—ప్రక. 16:14-16.
2 యెహోవా మహాదినం సమీపిస్తుండగా, ఎంతోమంది ఆధ్యాత్మికంగా నిద్రపోతున్నారు. నామకార్థ క్రైస్తవ మతనాయకుల్లోని కొంతమంది కూడా తమ చర్చీ సభ్యుల గురించి మాట్లాడుతూ వాళ్లు ‘నిద్రపోతులు’ అన్నారు. ఇంతకీ ఆధ్యాత్మికంగా నిద్రపోవడం అంటే ఏమిటి? నిజక్రైస్తవులు మెలకువగా ఉండడం ఎందుకు ప్రాముఖ్యం? అలా నిద్రపోతున్న ప్రజలను మేల్కొల్పడానికి మనమేమి చేయవచ్చు?
ఆధ్యాత్మికంగా నిద్రపోవడం అంటే ఏమిటి?
3. ఆధ్యాత్మికంగా నిద్రపోతున్నవాళ్లు ఎలా ఉంటారు?
3 సాధారణంగా, నిద్రపోతున్నవాళ్లు ఏమీ చేయలేరు. అయితే, ఆధ్యాత్మికంగా నిద్రపోతున్నవాళ్లు మాత్రం ఆధ్యాత్మిక విషయాల్లో కాక వేరే పనుల్లో చాలా బిజీగా ఉండవచ్చు. అలాంటి వాళ్లు రోజువారీ చింతలతో తలమునకలైపోతుండవచ్చు లేదా సుఖభోగాలు, హోదా, డబ్బు వంటివాటి కోసం పరుగులు తీస్తుండవచ్చు. వాటివల్ల వాళ్లు తమ ఆధ్యాత్మిక అవసరాలను అంతగా పట్టించుకోకపోవచ్చు. కానీ, ఆధ్యాత్మికంగా మెలకువగా ఉన్నవాళ్లు మాత్రం మనం ‘అంత్యదినాల్లో’ జీవిస్తున్నామని గుర్తిస్తారు కాబట్టి సాధ్యమైనంత చురుగ్గా దేవుని చిత్తం చేస్తారు.—2 పేతు. 3:3, 4; లూకా 21:34-36.
4. ‘ఇతరులవలే నిద్రపోక యుందము’ అని పౌలు ఎందుకు ఉపదేశమిచ్చాడు?
4 మొదటి థెస్సలొనీకయులు 5:4-8 చదవండి. ఆ లేఖనంలో, ‘ఇతరులవలే నిద్రపోక ఉండాలి’ అని అపొస్తలుడైన పౌలు తన తోటి విశ్వాసులకు ఉపదేశమిచ్చాడు. ఆయన ఏ ఉద్దేశంతో అలా అన్నాడు? ఒక విధంగా, యెహోవా నైతిక ప్రమాణాలను పట్టించుకోకపోవడం వల్ల మనం ‘నిద్రలోకి’ జారుకునే ప్రమాదం ఉంది. అంతేకాక, భక్తిహీన ప్రజలను అంతం చేయడానికి యెహోవా నియమించిన సమయం చాలా దగ్గర్లో ఉందనే విషయాన్ని పట్టించుకోకపోవడం వల్ల కూడా మనం ‘నిద్రలోకి’ జారుకునే ప్రమాదం ఉంది. అలాంటి భక్తిహీన ప్రజల్లా ఆలోచించకుండా, వాళ్ల పద్ధతుల్ని అనుసరించకుండా మనం జాగ్రత్తపడాలి.
5. ఆధ్యాత్మికంగా నిద్రపోతున్న ప్రజలు ఎలాంటి అభిప్రాయాల్ని కలిగివుంటారు?
5 కొంతమంది తాము చేసే పనుల గురించి అడిగే దేవుడే లేడని అనుకుంటారు. (కీర్త. 53:1) మరికొందరేమో, దేవునికి మానవుల విషయంలో పట్టింపు లేదని భావించి, ఆయన గురించి తెలుసుకోవాల్సిన అవసరం మనకు లేదనుకుంటారు. ఇంకొంతమంది, ఏదైనా ఒక మతంలో సభ్యులుగా ఉంటే దేవుని స్నేహితులుగా ఉండవచ్చని అనుకుంటారు. అలాంటి వాళ్లంతా ఆధ్యాత్మికంగా నిద్రపోతున్నారు. వాళ్లు నిద్ర మేల్కోవాలి. వాళ్లకు మనమెలా సహాయం చేయవచ్చు?
ముందు మనం మెలకువగా ఉండాలి
6. క్రైస్తవులు ఆధ్యాత్మికంగా మెలకువగా ఉండడానికి ఎందుకు కృషి చేయాలి?
6 ఇతరులను మేల్కొల్పాలంటే ముందు మనం మెలకువగా ఉండాలి. అయితే మనం ఎలా మెలకువగా ఉండవచ్చు? ఆధ్యాత్మికంగా నిద్రపోతున్నవాళ్లలా మనం ప్రవర్తించకూడదు. వాళ్లు ‘అంధకార క్రియలు’ చేస్తున్నారని బైబిలు చెబుతోంది. అల్లరితో కూడిన ఆటపాటలు, మత్తులో తూలడం, కామవిలాసాలు, పోకిరిచేష్టలు, కలహాలు, మత్సరం వంటివన్నీ అంధకార క్రియలే. (రోమీయులు 13:11-14 చదవండి.) అలాంటి ప్రవర్తనకు దూరంగా ఉండడం కష్టమే. అయితే మనం అప్రమత్తంగా ఉండడం ప్రాముఖ్యం. వాహనం నడుపుతున్నప్పుడు నిద్రలోకి జారుకోవడం వల్ల వచ్చే ప్రమాదాన్ని తక్కువ అంచనా వేస్తే ప్రాణాలకే ముప్పు. అలాగే, ఆధ్యాత్మికంగా నిద్రలోకి జారుకోవడం కూడా అపాయకరమని క్రైస్తవులు గుర్తించడం చాలా ప్రాముఖ్యం.
7. ప్రజల విషయంలో మనకు తప్పుడు అభిప్రాయం ఉంటే మనకేమి జరిగే ప్రమాదం ఉంది?
7 ఉదాహరణకు, మన క్షేత్రంలో సువార్తను వినడానికి ఎవ్వరూ ఇష్టపడరని మనకు అనిపించవచ్చు. (సామె. 6:10, 11) ‘వినడానికి ఎవ్వరూ ఇష్టపడరని తెలిసి కూడా వాళ్ల దగ్గరికి వెళ్లి వాళ్లకు సహాయం చేయడానికి ఎందుకు కష్టపడాలి?’ అని మనం అనుకోవచ్చు. చాలామంది ఇప్పుడు ఆధ్యాత్మికంగా నిద్రపోతున్నా వాళ్ల పరిస్థితులు, ఆలోచనలు మారే అవకాశం ఉంది. కొంతమంది ఆ నిద్ర నుండి మేల్కొని సువార్తను అంగీకరిస్తారు. రాజ్య సందేశం ప్రజలకు నచ్చేలా అందించడానికి కొత్త పద్ధతుల్ని ఉపయోగిస్తూ మనం మెలకువగా ఉంటేనే వాళ్లకు సహాయం చేయగలుగుతాం. మన పరిచర్య ఎందుకు ప్రాముఖ్యమైనదో గుర్తుంచుకోవడం వల్ల కూడా మనం మెలకువగా ఉండగలుగుతాం.
మన పరిచర్య ఎందుకు ప్రాముఖ్యమైనది?
8. క్రైస్తవ పరిచర్య ఎందుకు చాలా ప్రాముఖ్యమైనది?
8 ప్రస్తుతం ప్రజలు విన్నా వినకపోయినా మనం ప్రకటించే సువార్త యెహోవాను ఘనపరుస్తుంది, ఆయన సంకల్ప నెరవేర్పుకు తోడ్పడుతుంది. సువార్తను అంగీకరించని ప్రజలను త్వరలోనే దేవుడు శిక్షిస్తాడు. మనం ప్రకటించే సువార్తకు ప్రజలు స్పందించే దాన్ని బట్టే యెహోవా వాళ్లకు తీర్పు తీరుస్తాడు. (2 థెస్స. 1:6-10) “నీతిమంతులకును అనీతిమంతులకును పునరుత్థానము కలుగబోవుచున్నది” కాబట్టి కష్టపడి ప్రకటించాల్సిన అవసరం లేదని క్రైస్తవులు అనుకుంటే పొరబడినట్లే. (అపొ. 24:14, 15) ‘మేకలు’ అని తీర్పు తీర్చబడే ప్రజలు “నిత్యశిక్షకు” గురౌతారని లేక నాశనమౌతారని దేవుని వాక్యాన్ని బట్టి మనం గ్రహించాం. మన పరిచర్య వల్ల ప్రజలు దేవుని కనికరాన్ని పొందే అవకాశం ఉంది. అంటే, తమ వ్యక్తిత్వాల్ని మార్చుకుని “నిత్యజీవము” పొందే అవకాశం వాళ్లకు లభిస్తుంది. (మత్త. 25:32, 41, 46; రోమా. 10:13-15) మనం ప్రకటించకపోతే, జీవాన్నిచ్చే సందేశాన్ని వినే అవకాశం వాళ్లకు ఎలా దొరుకుతుంది?
9. సువార్త ప్రకటనాపనిలో పాల్గొనడం వల్ల మీకు, మీ బోధ వినేవాళ్లకు ఎలాంటి ప్రయోజనాలు చేకూరాయి?
9 సువార్త ప్రకటించడం వల్ల మనం కూడా ప్రయోజనం పొందుతాం. (1 తిమోతి 4:16 చదవండి.) యెహోవా గురించి, రాజ్య నిరీక్షణ గురించి ఇతరులతో మాట్లాడడం వల్ల ఆయనపై మనకున్న విశ్వాసం, ప్రేమ పెరుగుతాయి. దానివల్ల మనలో క్రైస్తవ లక్షణాలు వృద్ధి చెందుతాయి. పరిచర్యలో పాల్గొనడం ద్వారా దేవునిపై మనకున్న భక్తిని వ్యక్తం చేస్తే మనం సంతోషంగా ఉండగలుగుతాం. సత్యాన్ని ఇతరులకు బోధించే అవకాశం దొరికిన చాలామంది క్రైస్తవులు ఎంతో సంతోషాన్ని పొందారు. ఎందుకంటే, ప్రజలు పరిశుద్ధాత్మ సహాయంతో తమ జీవితాల్ని మెరుగుపర్చుకోవడాన్ని ఆ క్రైస్తవులు కళ్లారా చూశారు.
పరిస్థితులను గమనించండి
10, 11. (ఎ) అప్రమత్తంగా ఉంటూ పరిస్థితులను గమనించే విషయంలో యేసు, పౌలు ఎలా చక్కని మాదిరి ఉంచారు? (బి) మనం వాళ్లలా ఉంటే మన పరిచర్యను ఎలా మెరుగుపర్చుకోవచ్చు?
10 ప్రజలకు సువార్త పట్ల ఆసక్తి కలిగించడానికి ఎన్నో పద్ధతుల్ని ఉపయోగించవచ్చు. కాబట్టి, క్రైస్తవ ప్రచారకులు అప్రమత్తంగా ఉండి పరిస్థితులను గమనించాలి. ఈ విషయంలో యేసు మనకు ఆదర్శంగా ఉన్నాడు. ఆయన పరిపూర్ణుడైనందువల్ల పరిసయ్యుని మనసులోని కోపాన్ని, ఎన్నో పాపాలు చేసిన స్త్రీలో కలిగిన నిజమైన పశ్చాత్తాపాన్ని, విధవరాలు చూపించిన స్వయంత్యాగపూరిత స్వభావాన్ని గుర్తించగలిగాడు. (లూకా 7:37-50; 21:1-4) యేసు ప్రతీ ఒక్కరి ఆధ్యాత్మిక అవసరాన్ని అర్థం చేసుకొని సహాయం చేయగలిగాడు. అయితే, పరిస్థితుల్ని బాగా గమనించాలంటే మనం పరిపూర్ణులమై ఉండాల్సిన అవసరం లేదు. దీనికి అపొస్తలుడైన పౌలు చక్కని ఉదాహరణ. ఆయన వివిధ రకాల ప్రజలకు, వివిధ మనస్తత్వాల ప్రజలకు ఆకర్షణీయంగా ఉండేలా సువార్త ప్రకటించే విధానాన్ని మలచుకున్నాడు.—అపొ. 17:22, 23, 34; 1 కొరిం. 9:19-23.
11 యేసులా, పౌలులా మనం అప్రమత్తంగా ఉంటూ పరిస్థితులను గమనిస్తే మనం కలిసే ప్రజల్లో ఆసక్తిని కలిగించడానికి ఉత్తమమైన పద్ధతి ఏమిటో గుర్తించగలుగుతాం. ఉదాహరణకు, మీరు ప్రజలతో మాట్లాడే ముందు వాళ్ల సంస్కృతిని, అభీష్టాలను లేదా కుటుంబ పరిస్థితిని తెలిపే గుర్తులను పసిగట్టడానికి ప్రయత్నించండి. బహుశా మీరు వెళ్లే సమయానికి వాళ్లు ఏమి చేస్తున్నారో గమనించి, వాళ్లు చేస్తున్న పని గురించి గౌరవపూర్వకంగా ఒకట్రెండు మాటలు చెప్పి సంభాషణను మొదలుపెట్టడానికి ప్రయత్నించవచ్చు.
12. పరిచర్య చేస్తున్నప్పుడు మనం మాట్లాడుకునే విషయాల గురించి ఎందుకు జాగ్రత్త వహించాలి?
12 అప్రమత్తంగా ఉండి పరిస్థితులను గమనించే వ్యక్తి సాధారణంగా ఏకాగ్రతను కోల్పోకుండా ఉండడానికి ప్రయత్నిస్తాడు. పరిచర్య చేస్తున్నప్పుడు, మనతో కలిసి పనిచేస్తున్న సహోదరునితో మాట్లాడడం ప్రోత్సాహకరంగా ఉంటుంది. అయినా, ఇతరులకు ప్రకటించడం కోసమే మనం పరిచర్య చేస్తామనే విషయాన్ని మర్చిపోకూడదు. (ప్రసం. 3:1, 7) ఒక ఇంటి నుండి మరో ఇంటికి వెళ్తున్నప్పుడు మనం మాట్లాడుకునే విషయాల వల్ల పరిచర్యపై ఏకాగ్రత దెబ్బతినకుండా చూసుకోవాలి. ఆసక్తిగల ప్రజలతో మనం పంచుకునే విషయాల గురించి మాట్లాడుకుంటే మనం పరిచర్య మీదే ఏకాగ్రత నిలపగలుగుతాం. అంతేకాక, సమర్థవంతంగా పరిచర్య చేయడానికి కొన్నిసార్లు మనకు సెల్‌ఫోన్ సహాయకరంగా ఉన్నా, ఫోన్‌కాల్ వల్ల మనం గృహస్థులతో మాట్లాడుతున్నప్పుడు అంతరాయం ఏర్పడకుండా చూసుకోవాలి.
ప్రజల మీద వ్యక్తిగత శ్రద్ధ చూపించండి
13, 14. (ఎ) గృహస్థునికి ఏ విషయంపై ఆసక్తి ఉందనేది ఎలా తెలుసుకోవచ్చు? (బి) ఒక వ్యక్తికి ఆధ్యాత్మిక విషయాలపై ఎలా ఆసక్తి కలిగించవచ్చు?
13 అప్రమత్తంగా ఉండే ప్రచారకులు పరిచర్యలో తాము కలిసే ప్రజలు మాట్లాడుతున్నప్పుడు శ్రద్ధగా వింటారు. మీ క్షేత్రంలో ఒక వ్యక్తి అభిప్రాయాల్ని రాబట్టడానికి మీరు ఏ ప్రశ్నలు వేయవచ్చు? ఇన్ని మతాలు ఎందుకు ఉన్నాయనో, ఆ ప్రాంతంలో జరుగుతున్న హింసల గురించో లేదా ప్రజలకు సహాయం చేయడంలో ప్రభుత్వాల వైఫల్యం గురించో ఆయన ఆలోచిస్తుండవచ్చు. జీవరాశిలోని అద్భుతమైన రూపకల్పన గురించి మాట్లాడడం ద్వారా లేదా బైబిలు సలహాలను పాటించడం వల్ల ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో చెప్పడం ద్వారా మీరు ఆ వ్యక్తిలో ఆధ్యాత్మిక విషయాలపై ఆసక్తిని కలిగించగలరా? ప్రార్థన గురించి మాట్లాడితే దాదాపు అన్ని సంస్కృతుల ప్రజలకు నచ్చుతుంది, చివరకు కొంతమంది నాస్తికులకు కూడా నచ్చుతుంది. ‘మన ప్రార్థనలు వినేవాళ్లెవరైనా ఉన్నారా?’ అని చాలామంది ఆలోచిస్తుంటారు. మరికొంతమందికి ఇలాంటి ప్రశ్నలు వేస్తే ఆసక్తి కలగవచ్చు, ‘దేవుడు అన్ని ప్రార్థనలు వింటాడా? ఒకవేళ వినకపోతే, దేవుడు మన ప్రార్థనలను వినాలంటే మనం ఏమి చేయాలి?’
14 అనుభవంగల ప్రచారకులను చూసి, సంభాషణ సమర్థవంతంగా ఎలా మొదలుపెట్టాలో నేర్చుకోవచ్చు. వాళ్లు గృహస్థులను ప్రశ్నలతో ఉక్కిరిబిక్కిరి చేయకుండా, వ్యక్తిగత విషయాల్లో తలదూర్చకుండా ఎలా మాట్లాడుతున్నారో గమనించండి. గృహస్థుల అభిప్రాయాల్ని అర్థంచేసుకోవడానికి తమకున్న ఆసక్తిని స్వరంలో, ముఖకవళికల్లో ఎలా తెలియజేస్తున్నారో గమనించండి.—సామె. 15:13.
దయగా, నేర్పుగా వ్యవహరించండి
15. ప్రకటించేటప్పుడు మనం ఎందుకు మర్యాదపూర్వకంగా వ్యవహరించాలి?
15 గాఢనిద్రలో ఉన్నప్పుడు ఎవరైనా మిమ్మల్ని లేపితే మీకు నచ్చుతుందా? తటాలున నిద్రలేపితే చాలామంది చిరాకుపడతారు. నెమ్మదిగా లేపడానికి ప్రయత్నిస్తే మాత్రం లేస్తారు. ఆధ్యాత్మికంగా నిద్రపోతున్న వాళ్లను కూడా అలాగే లేపాలి. ఉదాహరణకు, మనం వాళ్లింటికి వెళ్లినందుకు గృహస్థునికి కోపం వస్తే సాధారణంగా మనం ఏమి చేయడం మంచిది? ఆయన భావాలను అర్థంచేసుకొని, ఆయన తన అభిప్రాయాన్ని నిర్మొహమాటంగా తెలియజేసినందుకు ధన్యవాదాలు చెప్పి అక్కడి నుండి శాంతంగా వచ్చేయడం మంచిది. (సామె. 15:1; 17:14; 2 తిమో. 2:24) మీరు మర్యాదపూర్వకంగా వ్యవహరిస్తే, మరోసారి వేరే సాక్షి వాళ్లింటికి వెళ్లినప్పుడు ఆయన సానుకూలంగా స్పందించవచ్చు.
16, 17. పరిచర్యలో మనం ఎలా పరిస్థితిని అర్థంచేసుకొని మెలగవచ్చు?
16 కొన్ని సందర్భాల్లో గృహస్థుడు ప్రతికూలంగా స్పందించినా మనం చక్కని సాక్ష్యమిచ్చే అవకాశం ఉంది. కొంతమంది, “మాకు అవసరంలేదు, మా మతం మాకుంది” అనో “నాకిష్టం లేదు” అనో చెప్పి సంభాషణను ఆపేయవచ్చని అనుకుంటారు. అయినా నేర్పుగా, మర్యాదపూర్వకంగా ప్రయత్నిస్తే గృహస్థునికి ఆధ్యాత్మిక విషయాలపై ఆసక్తి కలిగించే ప్రశ్న వేయవచ్చు.—కొలొస్సయులు 4:6 చదవండి.
17 కొన్నిసార్లు ప్రజలు మన సందేశాన్ని వినలేనంత బిజీగా ఉన్నారని గమనిస్తే, పరిస్థితిని అర్థంచేసుకొని అక్కడ నుండి వెళ్లిపోవడం మంచిది. అప్పుడప్పుడు బిజీగా ఉన్నవాళ్ల దగ్గర కూడా క్లుప్తమైన, అర్థవంతమైన సందేశాన్ని ఇచ్చే అవకాశం దొరకవచ్చు. కొంతమంది సహోదరులు నిమిషంలోపే, బైబిల్లో నుండి ఆలోచింపజేసే లేఖనాన్ని చదివి గృహస్థుణ్ణి ఒక ప్రశ్న అడగగలుగుతున్నారు. అలాంటి క్లుప్తమైన సందేశం వల్ల కొన్నిసార్లు గృహస్థునికి ఎంతో ఆసక్తి కలిగి కొద్దిసేపు మాట్లాడడానికి అనుమతించిన సందర్భాలున్నాయి. పరిస్థితులు అనుకూలించినప్పుడు మీరు కూడా అలా చేయవచ్చేమో ఆలోచించండి.
18. అవకాశం దొరికిన చోట చక్కగా సాక్ష్యమివ్వాలంటే మనం ఏమి చేయవచ్చు?
18 అవకాశం దొరికిన చోట సాక్ష్యమివ్వడానికి సిద్ధపడి ఉంటే, రోజులో మనం కలిసే వాళ్లలో సువార్త పట్ల ఆసక్తిని కలిగించగలుగుతాం. చాలామంది సహోదర సహోదరీలు జేబులో గానీ హ్యాండ్ బ్యాగులో గానీ కొన్ని ప్రచురణలు పెట్టుకొని వెళ్తారు. అవకాశం దొరికితే ఇతరులతో చర్చించడానికి వీలుగా వాళ్లు ఏదైనా ఒక లేఖనాన్ని మనసులో ఉంచుకుంటారు. మీరు కూడా అలా చేసేందుకు ఎలా సిద్ధపడాలో తెలుసుకోవడానికి మీ సంఘ సేవా పర్యవేక్షకునితో గానీ పయినీర్లతో గానీ మాట్లాడి చూడండి.
బంధువులకు సాక్ష్యమివ్వడానికి నెమ్మదిగా ప్రయత్నించండి
19. బంధువులకు సత్యాన్ని తెలియజేయడానికి చేసే ప్రయత్నాలను మనం ఎందుకు విరమించుకోకూడదు?
19 మన బంధువులు సువార్తను అంగీకరించేలా వాళ్లకు సహాయం చేయాలని సహజంగానే మనకు అనిపిస్తుంది. (యెహో. 2:13; అపొ. 10:24, 48; 16:31, 32) మొదట్లో మనం చేసే ప్రయత్నాలు బెడిసికొడితే మనలో ఉత్సాహం తగ్గి మనం మళ్లీ ప్రయత్నించకపోవచ్చు. మనం ఏమి చేసినా వాళ్ల అభిప్రాయాన్ని మార్చడం కష్టమని మనం అనుకోవచ్చు. కానీ పరిస్థితుల ప్రభావం వల్ల వాళ్ల జీవితాలు, అభిప్రాయాలు మారే అవకాశం ఉంది. లేదా సత్యాన్ని వివరించే విషయంలో బహుశా మీ సామర్థ్యం పెరిగినందువల్ల ఈసారి వాళ్లు సత్యాన్ని అంగీకరించవచ్చు.
20. బంధువులతో నేర్పుగా మాట్లాడడం ఎందుకు ప్రాముఖ్యం?
20 మన బంధువుల భావాలను అర్థంచేసుకోవడానికి మనం ప్రయత్నించాలి. (రోమా. 2:4) ప్రకటనాపని చేస్తున్నప్పుడు మనం ప్రజలతో ఎంత మర్యాదపూర్వకంగా మాట్లాడతామో మన బంధువులతో కూడా అంతే మర్యాదపూర్వకంగా మాట్లాడాలి. మృదువుగా, గౌరవపూర్వకంగా మాట్లాడాలి. మీరు అదేపనిగా సత్యం గురించి మాట్లాడకుండా, సత్యం మిమ్మల్ని ఎలా మంచి వ్యక్తిగా తీర్చిదిద్దిందో మీ ప్రవర్తన ద్వారా చూపించండి. (ఎఫె. 4:23, 24) మీకు ప్రయోజనం చేకూరేలా యెహోవా దేవుడు మీకెలా బోధించాడో వాళ్లకు స్పష్టంగా తెలియజేయండి. (యెష. 48:17) క్రైస్తవులంటే ఎలా ఉండాలో మీ ప్రవర్తనలో చూపించండి.
21, 22. బంధువులకు సత్యం తెలియజేయడానికి పట్టువిడువకుండా ప్రయత్నించాలని చూపించే ఒక అనుభవం చెప్పండి.
21 ఈ మధ్యే ఒక సహోదరి ఇలా రాసింది, “నా మాటల ద్వారా, ప్రవర్తన ద్వారా నా 13 మంది తోబుట్టువులకు సాక్ష్యమివ్వడానికి ఎంతగానో ప్రయత్నించాను. నేను మర్చిపోకుండా ప్రతీ సంవత్సరం వాళ్లకు ఉత్తరాలు రాస్తాను. అయినా, 30 సంవత్సరాలపాటు మా కుటుంబంలో నేను ఒక్కదాన్నే సాక్షిగా ఉన్నాను.”
22 ఆ సహోదరి ఇంకా ఇలా అంది, “ఒక రోజు నేను వందల మైళ్ల దూరంలో ఉన్న మా అక్కకు ఫోను చేశాను. ఆమె వాళ్ల చర్చి గురువును అడిగినా ఆయన ఏనాడూ తనతో బైబిలు అధ్యయనం చేయలేదని నాకు చెప్పింది. ఈ విషయంలో సహాయం చేయడానికి నేను సిద్ధంగా ఉన్నానని అన్నప్పుడు, ‘నాతో బైబిలు అధ్యయనం చెయ్యి కానీ, నేను మాత్రం ఎట్టిపరిస్థితుల్లోనూ యెహోవాసాక్షిగా మారను’ అని ఆమె అంది. బైబిలు నిజంగా ఏమి బోధిస్తోంది? పుస్తకాన్ని ఆమెకు పోస్టు ద్వారా పంపించి రెండుమూడు రోజులకు ఒకసారి ఫోను చేయడం మొదలుపెట్టాను. ఆమె చాలా రోజుల వరకు ఆ పుస్తకాన్ని తెరవలేదు. చివరకు ఒకరోజు, ఆ పుస్తకాన్ని తెచ్చుకోమని చెప్పి, దాదాపు 15 నిమిషాల పాటు ఫోనులోనే అందులో ఇచ్చిన లేఖనాలను చదివి చర్చించాను. అలా కొన్నిసార్లు జరిగిన తర్వాత ఆమె 15 నిమిషాల కన్నా ఎక్కువసేపు అధ్యయనం చేయడానికి ఇష్టపడింది. ఆ తర్వాత అధ్యయనం కోసం తనే నాకు ఫోను చేయడం మొదలుపెట్టింది. కొన్నిసార్లు, నేనింకా నిద్రలేవక ముందే ఫోనుచేసేది. మరికొన్నిసార్లు రోజుకు రెండుసార్లు ఫోను చేసేది. ఆ తర్వాతి సంవత్సరంలో ఆమె బాప్తిస్మం తీసుకుంది. ఒక ఏడాది గడిచాక పయినీరు సేవ మొదలుపెట్టింది.”
23. ఆధ్యాత్మికంగా నిద్రపోతున్న ప్రజల్ని లేపడానికి ఎందుకు పట్టువిడువకుండా ప్రయత్నించాలి?
23 ఆధ్యాత్మికంగా నిద్రపోతున్న ప్రజల్ని లేపడమనేది ఒక నైపుణ్యం. దాన్ని సంపాదించుకోవాలంటే మనం పట్టుదలతో కృషి చేయాలి. అయితే, తమను మేల్కొల్పడానికి మనం చేసే ప్రయత్నాలకు సాత్వికులు ఇప్పటికీ స్పందిస్తున్నారు. ప్రతీ నెల సగటున 20,000 మంది బాప్తిస్మం తీసుకొని యెహోవాసాక్షులు అవుతున్నారు. కాబట్టి, “ప్రభువునందు నీకు అప్పగింపబడిన పరిచర్యను నెరవేర్చుటకు దానిగూర్చి జాగ్రత్తపడుము” అని మొదటి శతాబ్దంలో అర్ఖిప్పు అనే సహోదరునికి పౌలు ఇచ్చిన సలహాను మనం పాటించాలి. (కొలొ. 4:17) ప్రకటనాపని ఎంత అత్యవసరమైనదో గుర్తించి దానిలో పాల్గొనాలంటే ఏమి చేయాలో తర్వాతి ఆర్టికల్‌లో చూద్దాం.
[అధ్యయన ప్రశ్నలు]
[13వ పేజీలోని బాక్సు]
ముందు మీరు ఎలా మెలకువగా ఉండవచ్చు?
▪ దేవుని చిత్తం చేయడంలో బిజీగా ఉండండి
▪ అంధకార సంబంధమైన క్రియలకు దూరంగా ఉండండి
▪ ఆధ్యాత్మిక నిద్రలోకి జారుకోకుండా జాగ్రత్తపడండి
▪ మీ ప్రాంతంలోని ప్రజలు వినరనే అభిప్రాయాన్ని కలిగివుండకండి
▪ ఇతరులకు ప్రకటించడానికి కొత్త పద్ధతుల్ని ఉపయోగించి చూడండి
▪ పరిచర్య ఎంత ప్రాముఖ్యమైనదో గుర్తుంచుకోండి