కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

పాఠకుల ప్రశ్న

పాఠకుల ప్రశ్న

పాఠకుల ప్రశ్న

ఒక క్రైస్తవుడు అశ్లీల చిత్రాలు (పోర్నోగ్రఫీ) చూడడానికి అలవాటు పడితే అతడు సంఘం నుండి బహిష్కరించబడతాడా?

▪ అవును, అలా జరిగే అవకాశం ఉంది. అందుకే, అశ్లీల సమాచారాన్ని చదవడం, పత్రికల్లో సినిమాల్లో వీడియోల్లో ఇంటర్నెట్‌లో అశ్లీల దృశ్యాలు చూడడం వంటి ఉరిలో చిక్కుకోకుండా ఉండేందుకు తీవ్రంగా కృషి చేయాలి.

లోకంలో అశ్లీల సాహిత్యాలు, చిత్రాలు మరీ ఎక్కువైపోయాయి. ఇంటర్నెట్‌ వల్ల అశ్లీల సమాచారం, చిత్రాలు, దృశ్యాలు ముందెన్నటికన్నా ఎక్కువగా అందుబాటులోకి వచ్చాయి, అంతేకాక ఎంతోమంది వాటి బారినపడుతున్నారు. కొంతమంది యౌవనులకు, వృద్ధులకు అనుకోకుండా అశ్లీల వెబ్‌సైట్‌లు తారసపడ్డాయి. మరికొందరైతే, తమ ఇంట్లో గానీ ఆఫీసులో గానీ రహస్యంగా అశ్లీల సాహిత్యాన్ని చదివితే లేదా అశ్లీల చిత్రాలు చూస్తే అడ్డుచెప్పేవాళ్లు ఉండరనే ఉద్దేశంతో కావాలనే అలాంటి వెబ్‌సైట్‌లను ఎంచుకున్నారు. దీని గురించి క్రైస్తవులు ఎందుకు గంభీరంగా ఆలోచించాలి?

“ఒక స్త్రీని మోహపుచూపుతో చూచు ప్రతివాడు అప్పుడే తన హృదయమందు ఆమెతో వ్యభిచారము చేసినవాడగును” అని యేసు ఇచ్చిన హెచ్చరికలో ఒక ప్రాథమిక కారణం కనిపిస్తుంది. (మత్త. 5:28) అయితే, భార్యాభర్తల మధ్య సాధారణంగా ఉండే లైంగిక సంబంధం సరైనదే, అంతేకాక అది వాళ్లకు ఆనందాన్నిస్తుంది. (సామె. 5:15-19; 1 కొరిం. 7:2-5) కానీ అశ్లీల చిత్రాలు, సాహిత్యాలు మాత్రం అలాంటివి కావు. యేసు హెచ్చరించినలాంటి అనైతికమైన ఆలోచనల్ని ఒక వ్యక్తి మనసులో కలుగజేసే అక్రమ లైంగిక సంబంధాల గురించే వాటిలో ఉంటుంది. స్పష్టంగా చెప్పాలంటే అలాంటివి చదివినా, చూసినా దేవుడిచ్చిన ఈ నిర్దేశానికి పూర్తి విరుద్ధంగా ప్రవర్తించినట్లే: “భూమిమీదనున్న మీ అవయవములను, అనగా జారత్వమును, అపవిత్రతను, కామాతురతను, దురాశను, విగ్రహారాధనయైన ధనాపేక్షను చంపి వేయుడి.”—కొలొ. 3:5.

ఒకట్రెండు సందర్భాల్లో ఒక క్రైస్తవుడు అశ్లీల చిత్రాలను చూస్తే ఏమౌతుంది? ఒకరకంగా చెప్పాలంటే, కీర్తనకర్తయైన ఆసాపు ఒకసారి ఎదుర్కొన్నలాంటి ప్రమాదకరమైన పరిస్థితినే ఆ క్రైస్తవుడు కూడా ఎదుర్కొంటాడు. ఆసాపు ఇలా రాశాడు, “నా పాదములు జారుటకు కొంచెమే తప్పెను. నా అడుగులు జార సిద్ధమాయెను.” నగ్నంగా ఉన్న స్త్రీపురుషుల చిత్రాలను గానీ జారత్వానికి పాల్పడుతున్నట్లున్న దృశ్యాలను గానీ చూస్తూ ఉండే క్రైస్తవుడు శుద్ధమైన మనస్సాక్షిని, దేవునితో సమాధానాన్ని కలిగివుండలేడు. తనకు ఎదురైన పరిస్థితిని బట్టి ఆసాపుకు కూడా అలాంటి సమాధానం కరువైంది. ఆయనిలా అన్నాడు, “దినమంతయు నాకు బాధ కలుగుచున్నది. ప్రతి ఉదయమున నాకు శిక్ష వచ్చుచున్నది.”—కీర్త. 73:2, 14.

అలాంటి చెడుతనంలో కూరుకుపోయిన క్రైస్తవుడు తన తప్పు తెలుసుకొని తగిన ఆధ్యాత్మిక సహాయాన్ని తీసుకోవాలి. సంఘం అలాంటి సహాయాన్ని ఇస్తుంది, “ఒకడు ఏ తప్పితములోనైనను చిక్కుకొనినయెడల ఆత్మసంబంధులైన మీలో ప్రతివాడు తానును శోధింపబడుదునేమో అని తన విషయమై చూచుకొనుచు, సాత్వికమైన మనస్సుతో అట్టివానిని మంచి దారికి తీసికొని రావలెను.” (గల. 6:1) ఒకరిద్దరు సంఘ పెద్దలు ఆ క్రైస్తవునికి కావాల్సిన ఆధ్యాత్మిక సహాయం చేస్తారు. అంతేకాక, వాళ్లు ‘ఆ రోగిని స్వస్థపర్చే విశ్వాససహితమైన ప్రార్థనలు’ చేస్తారు. అప్పుడు ఆయన ‘పాపక్షమాపణ’ పొందే అవకాశం ఉంటుంది. (యాకో. 5:13-15) అలాంటి చెడ్డ అలవాటు వల్ల వచ్చిన మచ్చను పోగొట్టుకోవడానికి సహాయాన్ని తీసుకున్నవాళ్లు, దేవునికి దగ్గరవ్వడం వల్ల ఆసాపుకు మంచి జరిగినట్లే తమకూ మంచి జరిగిందని తెలుసుకున్నారు.—కీర్త. 73:28.

“అపవిత్రత, జారత్వము,” దుష్కామ ప్రవర్తన వంటి పాపాలు చేసిన కొంతమంది, వాటి విషయంలో పశ్చాత్తాపపడలేదని అపొస్తలుడైన పౌలు చెప్పాడు. a (2 కొరిం. 12:21) ఆ వచనంలో “అపవిత్రత” అని అనువదించబడిన గ్రీకు పదం గురించి మాట్లాడుతూ ఆ పదానికి “నీచాతినీచం” అనే అర్థం ఉందని ప్రొఫెసర్‌ మార్వన్‌ ఆర్‌. విన్సంట్‌ రాశాడు. దుఃఖకరమైన విషయమేమిటంటే కొన్ని రకాల అశ్లీల సాహిత్యాల్లో, వీడియోల్లో నగ్నంగా ఉన్న స్త్రీపురుషుల చిత్రాలూ జారత్వానికి పాల్పడుతున్నట్లున్న దృశ్యాలూ వంటివాటికన్నా మరింత హీనమైనవి ఉంటాయి. స్వలింగ సంపర్కం (స్త్రీలు స్త్రీలతో, పురుషులు పురుషులతో సెక్స్‌లో పాల్గొనడం), గ్రూప్‌ సెక్స్‌ (గుంపుగా సెక్స్‌లో పాల్గొనడం), జంతువులతో సంపర్కం, చిన్నపిల్లల అశ్లీల చిత్రాలు, సామూహిక అత్యాచారం, స్త్రీలను లైంగికంగా హింసించడం, లైంగిక ఆనందాన్ని పొందడానికి ఒక వ్యక్తిని చిత్రహింసలు పెట్టడం లేదా కట్టేయడం వంటి నీచాతినీచమైనవి కూడా వాటిలో ఉంటాయి. పౌలు కాలంలో ‘అంధకారమైన మనస్సు గల’ కొంతమంది ‘సిగ్గులేనివాళ్లై నానావిధమైన అపవిత్రతను అత్యాశతో జరిగించడానికి తమ్మునుతామే కాముకత్వమునకు అప్పగించుకున్నారు.’—ఎఫె. 4:18, 19.

గలతీయులు 5:19లో పౌలు “అపవిత్రత” గురించి కూడా మాట్లాడాడు. ఆ పదం ‘ముఖ్యంగా ఇక్కడ అన్నిరకాల అసహజమైన లైంగిక కోరికలను సూచిస్తుండవచ్చు’ అని ఒక బ్రిటీష్‌ విద్వాంసుడు అన్నాడు. పైన ప్రస్తావించబడిన అసహ్యమైన, నీచమైన లైంగిక పనులతో కూడిన అశ్లీల సాహిత్యాలు, చిత్రాలు వంటివన్నీ “అసహజమైన లైంగిక కోరికలు” అని, నీచాతినీచమైనవి అని క్రైస్తవులందరూ ఒప్పుకుంటారు. అలాంటి అపవిత్రమైన ‘వాటిని చేస్తూ ఉండేవాళ్లు’ “దేవుని రాజ్యమును స్వతంత్రించుకొనరు” అని పౌలు గలతీయులు 5:19-21లో చెప్పాడు. బహుశా ఎవరైనా కొంతకాలంగా అసహ్యమైన, నీచమైన లైంగిక పనులతో కూడిన అశ్లీల చిత్రాలను చూడడానికి అలవాటు పడి, తమ తప్పు తెలుసుకొని పశ్చాత్తాపంతో మారుమనస్సు పొందకపోతే, వాళ్లు క్రైస్తవ సంఘంలో ఉండలేరు. సంఘ పవిత్రతను, స్ఫూర్తిని కాపాడడానికి అలాంటివాళ్లను సంఘం నుండి బహిష్కరించాల్సి రావచ్చు.—1 కొరిం. 5:4, 5, 11.

సంతోషకరమైన విషయమేమిటంటే, అలాంటి వాటికి అలవాటు పడిన కొంతమంది స్వయంగా సంఘ పెద్దల దగ్గరకు వెళ్లి మార్పులు చేసుకోవడానికి కావాల్సిన ఆధ్యాత్మిక సహాయాన్ని తీసుకున్నారు. ప్రాచీన సార్దీస్‌లోని క్రైస్తవులకు యేసు ఇలా చెప్పాడు, “చావనైయున్న మిగిలినవాటిని బలపరచుము. నీవేలాగు ఉపదేశము పొందితివో యేలాగు వింటివో జ్ఞాపకము చేసికొని దానిని గైకొనుచు మారుమనస్సు పొందుము. నీవు జాగరూకుడవై యుండనియెడల . . . ఏ గడియను నీ మీదికి వచ్చెదనో నీకు తెలియనే తెలియదు.” (ప్రక. 3:2, 3) ఒక విధంగా చెప్పాలంటే పశ్చాత్తాపపడి, అగ్నిలోనుండి లాగబడడం సాధ్యమే.—యూదా 22, 23.

అయితే మనలో ప్రతీ ఒక్కరం, అలాంటి ప్రమాదకరమైన పరిస్థితి దరిదాపుల్లోకి కూడా వెళ్లకుండా ఉండాలని గట్టిగా నిర్ణయించుకోవడం ఎంతో మంచిది. మనం అన్నిరకాల పోర్నోగ్రఫీకి దూరంగా ఉండాలని స్థిరంగా నిశ్చయించుకోవాలి.

[అధస్సూచి]

a అపవిత్రత, జారత్వము, దుష్కామ ప్రవర్తన వంటివాటి మధ్య ఉన్న తేడాను తెలుసుకోవడానికి కావలికోట జూలై 15, 2006 సంచికలోని 29-31 పేజీలు చదవండి.

[30వ పేజీలోని బ్లర్బ్‌]

అశ్లీల చిత్రాలు చూడడానికి అలవాటు పడిన క్రైస్తవుడు తన తప్పు తెలుసుకొని తగిన ఆధ్యాత్మిక సహాయం తీసుకోవాలి