ప్రకటనాపని ఎంత అత్యవసరమైనదో గుర్తుంచుకోండి
ప్రకటనాపని ఎంత అత్యవసరమైనదో గుర్తుంచుకోండి
‘వాక్యాన్ని ప్రకటించండి, ప్రయాసపడండి.’—2 తిమో. 4:2.
మీరు వివరించగలరేమో చూడండి:
మొదటి శతాబ్దపు క్రైస్తవులు ఎందుకు ప్రకటనాపని అత్యవసరమైనదని గుర్తించి పనిచేశారు?
ప్రకటనాపని అత్యవసరమైనదని మరచిపోకుండా ఉండాలంటే మనమేమి చేయాలి?
ప్రకటనాపని ముందెన్నటికన్నా ఇప్పుడు ఎందుకు అత్యవసరమైనది?
1, 2. ప్రకటనాపనిలో ‘ప్రయాసపడండి’ అని పౌలు చెప్పిన మాటలను బట్టి ఏ ప్రశ్నలు రావచ్చు?
సాధారణంగా, ప్రాణాల్ని రక్షించే పనిచేసే వ్యక్తులు తమ పని ఎంత అత్యవసరమైనదో గుర్తుంచుకొని పనిచేస్తారు. ఉదాహరణకు, ఎమర్జెన్సీ ఫోన్‌కాల్ వచ్చినప్పుడు అగ్నిమాపక దళ సభ్యులు హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకుంటారు. ఎందుకంటే ప్రాణాలు అపాయంలో ఉంటాయని వాళ్లకు తెలుసు.
2 యెహోవాసాక్షులముగా మనం, ప్రజలు తమ ప్రాణాల్ని రక్షించుకోవడానికి సహాయం చేయాలనుకుంటాం. అందుకే, రాజ్య సువార్త ప్రకటించడాన్ని మనం చాలా ప్రాముఖ్యమైనదిగా ఎంచుతాం. అలాగని అనాలోచితంగా పరుగులు తీయం. ‘వాక్యాన్ని ప్రకటించండి, ప్రయాసపడండి’ అని అపొస్తలుడైన పౌలు ఏ ఉద్దేశంతో చెప్పాడు? (2 తిమో. 4:2) ప్రకటనాపని అత్యవసరమైనదని గుర్తుంచుకొని మనం ఎలా ప్రకటించవచ్చు? మన పని ఎందుకంత అత్యవసరమైనది?
మన ప్రకటనాపని ఎందుకు అత్యవసరమైనది?
3. ప్రజలు రాజ్య సందేశాన్ని అంగీకరిస్తే ఏమౌతుంది, అంగీకరించకపోతే ఏమౌతుంది?
3 మన ప్రకటనాపని ఎలా ప్రాణాలను రక్షిస్తుందో ఆలోచిస్తే రాజ్య సువార్తను ప్రకటించడం అత్యవసరమని మనం గుర్తించవచ్చు. (రోమా. 10:13, 14) దేవుని వాక్యం ఇలా చెబుతోంది, “నిజముగా మరణము నొందుదువని దుర్మార్గునికి నేను సెలవియ్యగా అతడు తన పాపము విడిచి, నీతి న్యాయములను . . . అనుసరించినయెడల అతడు మరణము నొందక అవశ్యముగా బ్రదుకును. అతడు చేసిన పాపములలో ఏదియు అతని విషయమై జ్ఞాపకమునకు తేబడదు.” (యెహె. 33:14-16) అందుకే, రాజ్య సందేశాన్ని బోధించే వాళ్లకు బైబిలు ఇలా చెబుతోంది, “నిన్నును, నీ బోధ వినువారిని రక్షించుకొందువు.”—1 తిమో. 4:16; యెహె. 3:17-21.
4. తిమోతి ప్రకటనాపని చేయడం ఎందుకు అత్యవసరమైంది?
4 ప్రకటనాపని అత్యవసరమైనదని గుర్తుంచుకొని పనిచేయమని పౌలు తిమోతికి ఎందుకు చెప్పాడో అర్థం చేసుకోవాలంటే మనం ఈ ఆర్టికల్ ముఖ్య వచనాన్ని, దాని నేపథ్యంలో కొంత భాగాన్ని పరిశీలించాలి. అక్కడ ఇలా ఉంది, “వాక్యమును ప్రకటించుము; సమయమందును అసమయమందును ప్రయాసపడుము; సంపూర్ణమైన దీర్ఘశాంతముతో ఉపదేశించుచు ఖండించుము, గద్దించుము, బుద్ధి చెప్పుము. ఎందుకనగా జనులు హితబోధను సహింపక, దురద చెవులు గలవారై తమ స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధకులను తమకొరకు పోగుచేసికొని, సత్యమునకు చెవి నియ్యక కల్పనాకథలవైపునకు తిరుగుకాలము వచ్చును.” (2 తిమో. 4:2-4) మతభ్రష్టత్వం మొదలౌతుందని యేసు ముందే చెప్పాడు. (మత్త. 13:24, 25, 38) మతభ్రష్టత్వం మొదలైనప్పుడు, క్రైస్తవులు అబద్ధ బోధలకు ఆకర్షితులై తప్పుదోవ పట్టకుండా ఉండేందుకు తిమోతి సంఘంలో కూడా ‘వాక్యాన్ని ప్రకటించడం’ అత్యవసరమైంది. అప్పుడు ప్రాణాలు అపాయంలో ఉన్నాయి. మరి ఇప్పటి విషయమేమిటి?
5, 6. మనం పరిచర్యకు వెళ్లినప్పుడు, ప్రజాదరణ పొందిన ఎలాంటి బోధలను ప్రజలు నమ్మడాన్ని చూస్తుంటాం?
5 మతభ్రష్టత్వం ఇప్పుడు ఎంతగానో పెరిగిపోయి చాలా ప్రాంతాలకు వ్యాపించింది. (2 థెస్స. 2:3, 8) ఎలాంటి తప్పుడు బోధలకు ప్రజలు ఆకర్షితులౌతున్నారు? చాలా ప్రాంతాల్లో, మతం గురించి ఎంత బలమైన భావాలతో బోధిస్తున్నారో అంతే బలమైన భావాలతో పరిణామ సిద్ధాంతం గురించి కూడా బోధిస్తున్నారు. పరిణామ సిద్ధాంతం గురించి విజ్ఞానశాస్త్రపరమైన భాషలోనే వివరించినా, అది దేవుడు లేడని చెప్పే ఒక మతంగా రూపొందింది. దేవుని విషయంలో, ప్రజల విషయంలో కొంతమందికి ఉన్న అభిప్రాయాన్ని ఆ సిద్ధాంతం ప్రభావితం చేస్తోంది. ప్రజాదరణ పొందిన మరొక బోధ ఏమిటంటే, దేవునికి మన పట్ల శ్రద్ధ లేదు, కాబట్టి మనం ఆయన గురించి తెలుసుకోవాల్సిన అవసరం లేదు. లక్షలాదిమంది ఆధ్యాత్మిక నిద్రలోకి జారుకునేలా చేస్తున్న ఆ బోధలు ఎందుకంత ఆకర్షణీయంగా ఉన్నాయి? ఎందుకంటే, ‘మీరు చేసే పనుల గురించి అడిగేవాళ్లు లేరు కాబట్టి మీరేమైనా చేయవచ్చు’ అనే విషయం ఆ బోధల్లో దాగివుంది. చాలామందికి ఆ విషయం నచ్చింది, దాన్నే వాళ్లు వినాలనుకుంటున్నారు.—కీర్తన 10:4 చదవండి.
6 అయితే ఇతర బోధల్ని కూడా ప్రజలు నమ్ముతున్నారు. చర్చీలకు వెళ్తున్న కొంతమంది, ‘మీరు ఏమి చేసినా దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తూనే ఉంటాడు’ అన్న బోధను వినాలనే కోరికతో వెళ్తున్నారు. మతాచారాలు, మాస్‌లు, పండుగలు, విగ్రహాల వంటివాటివల్ల దేవుని ఆశీర్వాదాలు వస్తాయని ప్రీస్టులు, పాస్టర్లు తమకు బోధించాలని కోరుకుంటారు. తాము ప్రమాదంలో ఉన్నామని వాళ్లు గుర్తించకపోవచ్చు. (కీర్త. 115:4-8) అయితే, బైబిలు సత్యాన్ని అర్థంచేసుకునేలా మనం వాళ్లను ఆధ్యాత్మిక నిద్రలో నుండి లేపగలిగితే వాళ్లు దేవుని రాజ్యం తీసుకొచ్చే ఆశీర్వాదాలు పొందగలుగుతారు.
ప్రకటనాపని ఎంత అత్యవసరమైనదో గుర్తుంచుకొని ప్రకటించడమంటే ఏమిటి?
7. ప్రకటనాపని ఎంత అత్యవసరమైనదో గుర్తిస్తున్నామని ఎలా చూపించవచ్చు?
7 ఒక మంచి సర్జన్ రోగి ప్రాణాలను కాపాడాలంటే ఆపరేషన్ చేస్తున్నప్పుడు పూర్తి ఏకాగ్రత నిలపాలి. మన క్రైస్తవ పరిచర్య విషయంలో కూడా అంతే. మనం కలిసే ప్రజల్లో ఆసక్తిని కలిగించడానికి ఏ విషయాలను, ఏ ప్రశ్నలను లేదా ఏ సమాచారాన్ని ఉపయోగించాలో ఏకాగ్రతతో ఆలోచిస్తే మన పని ఎంత అత్యవసరమైనదో గుర్తిస్తున్నామని చూపించవచ్చు. అంతేకాక దానివల్ల, ప్రజలు వినడానికి సుముఖంగా ఉండే సమయాల్లోనే ప్రకటనాపని చేసేలా మన రోజువారీ పనుల్లో కూడా కొన్ని సర్దుబాట్లు చేసుకుంటాం.—రోమా. 1:15, 16; 1 తిమో. 4:16.
8. మన పని అత్యవసరమైనదని గుర్తించి నడుచుకోవాలంటే ఏమి చేయాల్సివుంటుంది?
8 ప్రకటనాపని ఎంత అత్యవసరమైనదో గుర్తిస్తున్నామని చూపించడానికి మరో మార్గమేమిటంటే మనం ముఖ్యమైనవాటినే ముందు చేయాలి. (ఆదికాండము 19:15 చదవండి.) ఉదాహరణకు, వైద్య పరీక్షల రిపోర్టులు చూసి మీ పరిస్థితి చాలా విషమంగా ఉందని, మీరు ఏమి చేసినా ఒక నెలలోపే చేయాలని డాక్టరు మీకు చెప్పాడనుకోండి. వెంటనే, అగ్నిమాపక దళ సభ్యుడు హుటాహుటిన పరుగులు తీసినట్లు మీరు పరుగులు తీస్తారా? అలా చేయరు కానీ, డాక్టర్ సలహాలను తీసుకొని, ఇంటికి వెళ్లి మీరు చేయాల్సిన ముఖ్యమైనవాటి గురించి బాగా ఆలోచిస్తారు కదా?
9. ఎఫెసులో ఉన్నప్పుడు పౌలు ప్రకటనాపని అత్యవసరమైనదని గుర్తించి పనిచేశాడని మనం ఎందుకు చెప్పవచ్చు?
9 పౌలు ఆసియా ప్రాంతంలో చేసిన ప్రకటనాపని గురించి ఎఫెసులోని పెద్దలతో చెప్పిన మాటల్లో ఆయన దాన్ని ఎంత అత్యవసరమైనదిగా ఎంచాడో తెలుసుకోవచ్చు. (అపొస్తలుల కార్యములు 20:18-21 చదవండి.) బహుశా ఆయన ఎఫెసుకు వెళ్లిన మొదటి రోజు నుండే ఇంటింటికీ వెళ్లి ప్రకటించే పనిలో నిమగ్నమై ఉంటాడు. అంతేకాక, రెండు సంవత్సరాల పాటు ఆయన “ప్రతిదినము తురన్ను అను ఒకని పాఠశాలలో తర్కించుచు వచ్చెను.” (అపొ. 19:1, 8-10) ప్రకటనాపని ఎంత అత్యవసరమైనదో పౌలు గుర్తించాడు కాబట్టి ఆయన దానిలో నిమగ్నమయ్యాడని స్పష్టమౌతోంది. ప్రకటనాపనిలో ‘ప్రయాసపడండి’ అని బైబిలు చెబుతున్నంత మాత్రాన మన శక్తికి మించింది చేయాలని కాదుగానీ, మన జీవితంలో దానికి ప్రాముఖ్యతను ఇవ్వాలని దానర్థం.
10. దాదాపు 100 సంవత్సరాల క్రితం క్రైస్తవులు ప్రకటనాపని అత్యవసరమైనదని గుర్తించి పనిచేశారనే విషయం మనకు ఎందుకు సంతోషాన్నిస్తుంది?
10 బైబిలు విద్యార్థుల చిన్న గుంపు 1914కు ముందు సువార్త ప్రకటించడం మొదలుపెట్టింది. వాళ్ల ఉదాహరణను చూసి ప్రకటనాపని అత్యవసరమైనదని గుర్తించి పనిచేయడమంటే ఏమిటో తెలుసుకోవచ్చు. వాళ్లు కొన్ని వేలమంది మాత్రమే ఉన్నా, తాము జీవిస్తున్న కాలాల పరిస్థితిని అర్థం చేసుకొని రాజ్య ప్రకటనాపనిని ఉత్సాహంగా చేపట్టారు. వందల కొలది వార్తాపత్రికల్లో ప్రసంగాలను ప్రచురించారు. అంతేకాక కలర్ స్లైడ్‌లతో, కదిలే బొమ్మలతో ‘ఫోటో డ్రామా ఆఫ్ క్రియేషన్‌ను’ ప్రదర్శించారు. అలా వాళ్లు లక్షలాదిమందికి సువార్త ప్రకటించారు. సువార్త ప్రకటించడం అత్యవసరమైనది అనే ఆలోచన వాళ్లకు లేకపోయుంటే, రాజ్య సందేశాన్ని వినే అవకాశం మనలో ఎంతమందికి దొరికేది?—కీర్తన 119:60 చదవండి.
ప్రకటనాపని అత్యవసరమైనదనే విషయాన్ని మరచిపోకుండా జాగ్రత్తపడండి
11. కొంతమంది యెహోవా సేవ అత్యవసరమైనదనే విషయాన్ని ఎందుకు మరచిపోయారు?
11 పక్కదారి పట్టించే ఎన్నో విషయాలు మనం ప్రకటనాపని ఎంత అత్యవసరమైనదో మరచిపోయేలా చేసే ప్రమాదం ఉంది. మన వ్యక్తిగత ఆశయాల వెంట, మరితర విషయాల వెంట పరుగులు తీసేలా చేయడానికి సాతాను ఈ వ్యవస్థను ఉపయోగిస్తున్నాడు. (1 పేతు. 5:8; 1 యోహా. 2:15-17) ఒకప్పుడు యెహోవా సేవకు మొదటిస్థానం ఇచ్చినవాళ్లలో కొంతమంది ఆ తర్వాత అది ఎంత అత్యవసరమైనదో మరచిపోయారు. ఉదాహరణకు, మొదటి శతాబ్దానికి చెందిన దేమా పౌలుకు ‘జతపనివానిగా’ ఉండేవాడు కానీ ఆ తర్వాత ఈ భక్తిహీన లోకం వల్ల పక్కదారి పట్టాడు. కష్టకాలాల్లో తన తోటి సహోదరుడైన పౌలును బలపరుస్తూ ఉండాల్సిందిపోయి దేమా ఆయనను విడిచిపెట్టి వెళ్లాడు.—ఫిలే. 23, 24; 2 తిమో. 4:10.
12. ఇప్పుడు మనకు ఏ అవకాశం ఉంది? నిత్యజీవాన్ని పొందినప్పుడు మనకు ఎలాంటి అవకాశాలు ఉంటాయి?
12 మనం ప్రకటనాపని అత్యవసరమైనదని ఎంచాలంటే, ఈ లోకాన్ని అమితంగా అనుభవించాలనే కోరికకు లొంగిపోకుండా ఉండేందుకు పోరాడాలి. “వాస్తవమైన జీవమును” సంపాదించుకోవడానికి మనం కృషిచేయాలి. (1 తిమో. 6:18, 19) దేవుని రాజ్య పరిపాలన కింద మనం నిరంతరం జీవిస్తాం కాబట్టి చేయడానికి ఎన్నో ఆసక్తికరమైన పనులు ఉంటాయి. కానీ ఇప్పుడైతే, అర్మగిద్దోనును దాటేందుకు ప్రజలకు సహాయం చేయడమే చాలా ప్రత్యేకమైన పని.
13. మనం యెహోవా సేవ అత్యవసరమైనదని గుర్తించి నడుచుకోవాలంటే ఏమి చేయాలి?
13 మన చుట్టూ ఉన్న ప్రపంచంలో చాలామందికి యెహోవా గురించి తెలియదు. మరి, మనం ఆయన సేవ అత్యవసరమైనదని గుర్తించి నడుచుకోవాలంటే ఏమి చేయాలి? మనకు కూడా ఒకప్పుడు యెహోవా గురించి తెలియక నిరీక్షణ లేకుండా ఉండేవాళ్లం. కానీ ఆ తర్వాత యెహోవా గురించి, యేసు గురించి తెలుసుకున్నందువల్ల ఇప్పుడు ఆ సత్యం గురించి ఇతరులకు తెలియజేసే చక్కని అవకాశం మనకు దొరికింది. (ఎఫెసీయులు 5:14 చదవండి.) పౌలు ఇలా రాశాడు, “దినములు చెడ్డవి గనుక, మీరు సమయమును పోనియ్యక సద్వినియోగము చేసికొనుచు, అజ్ఞానులవలె కాక, జ్ఞానులవలె నడుచుకొనునట్లు జాగ్రత్తగా చూచుకొనుడి.” (ఎఫె. 5:15, 16) ఈ దుష్టలోకంలో మనల్ని యెహోవాకు సన్నిహితం చేసే కార్యకలాపాల కోసం మనం సమయాన్ని వినియోగించడం ప్రాముఖ్యం.
మనం చాలా ప్రాముఖ్యమైన కాలాల్లో జీవిస్తున్నాం
14-16. రాజ్య ప్రకటనాపని చేయడం మునుపెన్నటికన్నా ఇప్పుడు ఎందుకు మరింత అత్యవసరమైనది?
14 క్రైస్తవ పరిచర్య అన్నికాలాల్లో అత్యవసరమైనదిగానే ఉంది. కానీ అది ముందెన్నటికన్నా ఇప్పుడు మరింత అత్యవసరమైనది. 1914 నుండి, ఎన్నో సంఘటనలు బైబిలు చెప్పిన విధంగానే జరుగుతుండడాన్ని మనం చూస్తున్నాం. (మత్త. 24:3-51) ప్రజలు నాశనమౌతామనే భయంతో బ్రదుకుతున్నారు. చాలా శక్తివంతమైన రాజ్యాలు శాంతి ఒప్పందాలు చేసుకున్నా, వాళ్ల దగ్గర ఇప్పటికీ 2,000 అణుబాంబులు ఉన్నాయి, వాటిని ఎక్కడైనా ప్రయోగించవచ్చు. అణ్వాయుధాల్లో కొన్ని కనిపించడం లేదనీ ఇంకొన్నైతే ఏకంగా పోయాయనీ వందల నివేదికల్లో అధికారులు పేర్కొన్నారు. వాటిలో కొన్ని తీవ్రవాదుల దగ్గర ఉన్నాయా? ఒక తీవ్రవాది యుద్ధం మొదలుపెట్టాడంటే మానవులందరూ నాశనమయ్యే అవకాశం ఉందని కొంతమంది అభిప్రాయపడుతున్నారు. అయితే, మానవ మనుగడకు ముప్పు తెచ్చిపెట్టేది యుద్ధం ఒక్కటే కాదు.
15 ద లాన్సెట్ అనే పత్రిక మరియు యూనివర్సిటీ కాలేజీ లండన్ 2009లో ఇచ్చిన నివేదికలో ఇలా ఉంది, “ప్రపంచ ప్రజల ఆరోగ్యానికి వాతావరణ మార్పులే విపరీతమైన ముప్పు తెచ్చిపెడుతున్నాయి.” వాతావరణంలో వచ్చే మార్పుల వల్ల చాలామంది ఆరోగ్యాలు దెబ్బతింటాయని, లక్షలాదిమంది ప్రాణాలు అపాయంలో పడతాయని కూడా ఆ నివేదిక చెప్పింది. సముద్ర మట్టం పెరగడం, కరువుకాటకాలు, తుఫాన్లు, రోగాలు, హరికేన్లు, వనరులు సరిపోక చేసే యుద్ధాలు వంటివాటి వల్ల చాలా ప్రాంతాలు నాశనమయ్యే ప్రమాదం ఉంది. యుద్ధాలు, విపత్తులు మానవ మనుగడకే ముప్పు తెచ్చిపెడుతున్నాయి.
16 అణు యుద్ధం వల్ల వచ్చే ప్రమాదం అంత్యదినాల గురించి యేసు చెప్పిన ప్రవచనాన్ని నెరవేర్చే సంఘటనలకు దారితీయగలదని కొందరు అనుకోవచ్చు. కానీ, యేసు చెప్పిన ప్రవచనానికి నిజమైన అర్థమేమిటో చాలామందికి తెలియదు. యేసు ప్రత్యక్షత వాస్తవమైనదనీ ఈ విధానాంతం దగ్గరపడిందనీ చూపించే సంఘటనలను ఎన్నో సంవత్సరాలుగా మనం చూస్తూనే ఉన్నాం. (మత్త. 24:3) యేసు ప్రవచనంలోని ఎన్నో సంఘటనలు మునుపెన్నడూ లేనంత స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇది, ప్రజలు ఆధ్యాత్మిక నిద్రలో నుండి మేల్కోవాల్సిన సమయం. మన పరిచర్య ద్వారా మనం వాళ్లను మేల్కొల్పవచ్చు.
17, 18. (ఎ) అంత్యదినాల్లో జీవిస్తున్నాం కాబట్టి ఇప్పుడు మనం ఏమి చేయాలి? (బి) ఎలాంటి పరిస్థితుల్ని బట్టి రాజ్య సందేశం పట్ల ప్రజల అభిప్రాయం మారవచ్చు?
17 యెహోవాపై మనకు ప్రేమ ఉందని నిరూపించుకోవడానికి, అంత్యదినాల్లో ఆయన మనకు అప్పగించిన ప్రకటనాపనిని పూర్తిచేయడానికి సమయం కొంచెమే ఉంది. మొదటి శతాబ్దంలో పౌలు రోములోని క్రైస్తవులకు రాసిన ఈ మాటలు ముందుకన్నా ఇప్పుడు మనకు మరింత ప్రాముఖ్యం, “మీరు కాలమునెరిగి, నిద్రమేలుకొను వేళయైనదని తెలిసికొని, ఆలాగు చేయుడి. మనము విశ్వాసులమైనప్పటికంటె ఇప్పుడు, రక్షణ మనకు మరి సమీపముగా ఉన్నది.”—రోమా. 13:11.
18 అంత్యదినాల్లో జరిగే సంఘటనల గురించి బైబిలు చెబుతున్న వాటిని బట్టి ప్రజలు దేవునితో సంబంధం ఏర్పర్చుకోవాలని గుర్తించగలుగుతారు. మరికొంతమంది ఆర్థిక సంక్షోభం, అణ్వాయుధాల వల్ల వచ్చే ప్రమాదాలు, క్రూరత్వం లేదా పర్యావరణం పాడవడం వంటి సమస్యల్ని పరిష్కరించే విషయంలో మానవ ప్రభుత్వాల వైఫల్యాన్ని చూసి, తమకు సహాయం అవసరమని గుర్తించగలుగుతారు. ఇంకొంతమందేమో తమ కుటుంబాల్లో తలెత్తే పరిస్థితుల్ని బట్టి అంటే ఆరోగ్య సమస్యలు, విడాకులు లేదా ప్రియమైనవాళ్లు చనిపోవడం వంటి వాటిని బట్టి తమ ఆధ్యాత్మిక అవసరాన్ని గుర్తించగలుగుతారు. మనం పరిచర్యలో పాల్గొంటే అలాంటి ప్రజలకు సహాయం చేయవచ్చు.
ప్రకటనాపని అత్యవసరమైనదని గుర్తించి నడుచుకోవడం
19, 20. ప్రకటనాపని అత్యవసరమైనదని గుర్తించిన చాలామంది ఎలాంటి సర్దుబాట్లు చేసుకున్నారు?
19 ప్రకటనాపని అత్యవసరమైనదని గుర్తించిన చాలామంది మరింత ఎక్కువగా పరిచర్యలో పాల్గొనాలని నిర్ణయించుకున్నారు. ఉదాహరణకు, ఈక్వెడార్‌కు చెందిన ఒక యువ జంట 2006లో “మీ కంటిని తేటగా ఉంచుకోండి” అనే ముఖ్యాంశంతో జరిగిన ప్రత్యేక సమావేశ దిన కార్యక్రమానికి హాజరై అక్కడ విన్న విషయాలను బట్టి తమ జీవితాన్ని సరళం చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. వాళ్లు తమకు అవసరం లేని వస్తువుల జాబితాను తయారు చేసుకున్నారు, మూడు నెలల్లోపే మూడు బెడ్‌రూమ్‌ల అపార్ట్‌మెంటు నుండి ఒక్క బెడ్‌రూమ్ ఉన్న అపార్ట్‌మెంటులోకి మారారు. కొన్ని వస్తువుల్ని అమ్మేశారు, అప్పులన్నీ తీర్చేశారు. కొంతకాలానికే, సహాయ పయినీరు సేవ మొదలుపెట్టి, ప్రాంతీయ పర్యవేక్షకుని సలహామేరకు అవసరం ఎక్కువగా ఉన్న ప్రాంతంలో సేవ చేయడానికి ముందుకు వచ్చారు.
20 ఉత్తర అమెరికాకు చెందిన ఒక సహోదరుడు ఇలా రాశాడు, ‘నేనూ నా భార్యా 2006లో ఒక సమావేశానికి హాజరయ్యేటప్పటికి మేము బాప్తిస్మం తీసుకొని 30 ఏళ్లు అయ్యింది. కార్యక్రమం తర్వాత ఇంటికి తిరిగి వస్తున్నప్పుడు, జీవితాన్ని సరళం చేసుకోవడం గురించి అక్కడ ఇచ్చిన ఉపదేశాలను ఎలా అన్వయించుకోవచ్చో ఇద్దరం చర్చించుకున్నాం. (మత్త. 6:19-22) అప్పటికి మాకు మూడు సొంత ఇళ్లు, స్థలం, విలాసవంతమైన కార్లు, ఒక పడవ, విహార యాత్రలకు వెళ్లడానికి అన్ని సదుపాయాలతో ఉండే ఒక పెద్ద వాహనం ఉన్నాయి. సమయాన్ని, శక్తిని వస్తుపరమైన విషయాల కోసం వృథా చేశామనిపించి పూర్తికాల సేవను మా లక్ష్యంగా చేసుకున్నాం. అప్పటికే క్రమ పయినీరుగా సేవచేస్తున్న మా అమ్మాయితో కలిసి 2008లో క్రమ పయినీరు సేవ మొదలుపెట్టాం. సహోదరులతో మరింత సన్నిహితంగా కలిసి పనిచేయడం ఎంతో సంతోషాన్నిచ్చింది. అవసరం ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో సేవ చేయగలిగాం. యెహోవా సేవలో ఎక్కువగా భాగం వహించడం వల్ల ఆయనకు మరింత దగ్గరయ్యాం. దేవుని వాక్య సత్యాన్ని విని అర్థం చేసుకున్నప్పుడు ప్రజల కళ్లల్లో ఆనందాన్ని చూడడం మాకు లభించిన గొప్ప ఆశీర్వాదం.’
21. మనం ప్రకటనాపని అత్యవసరమైనదని గుర్తించి పనిచేయడానికి ఏది మనల్ని ప్రేరేపిస్తుంది?
21 “భక్తిహీనుల తీర్పును, నాశనమును జరుగు దినము” వచ్చినప్పుడు ఈ దుష్ట విధానం అంతమౌతుందని మనకు తెలుసు. (2 పేతు. 3:7) రాబోయే మహాశ్రమల గురించి, ఆ తర్వాత ఈ భూమ్మీద స్థాపించబడే నూతనలోకం గురించి ఉత్సాహంగా ప్రకటించడానికి దేవుని వాక్యం విషయంలో మనకున్న జ్ఞానం మనల్ని ప్రేరేపిస్తుంది. ప్రజల్లో నిజమైన నిరీక్షణ నింపడం ఎంత అత్యవసరమో ఎల్లప్పుడూ గుర్తుంచుకుందాం. అత్యవసరమైన ఈ పనిలో పూర్తిగా పాల్గొనడం ద్వారా దేవునిపై, తోటివాళ్లపై నిజమైన ప్రేమను చూపించగలుగుతాం.
[అధ్యయన ప్రశ్నలు]