కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

మీరెలా సలహాలు ఇస్తారు?

మీరెలా సలహాలు ఇస్తారు?

మీరెలా సలహాలు ఇస్తారు?

సలహా కావాలని ఎవరైనా మీ దగ్గరకు వచ్చారా? ఉదాహరణకు, ‘నేనేమి చెయ్యాలి? నేను ఆ పార్టీకి వెళ్లవచ్చా? నేను ఈ ఉద్యోగం చేయవచ్చా? పెళ్లి చేసుకోవాలనే ఉద్దేశంతో ఆ వ్యక్తితో పరిచయం పెంచుకోవచ్చా?’ అని మిమ్మల్ని ఎవరైనా అడిగారా?

మంచి ఉద్దేశంగల ప్రజలు తమ స్నేహితులతో, తమ కుటుంబంతో, చివరికి యెహోవాతో తమకున్న సంబంధాన్ని ప్రభావితం చేసే నిర్ణయాలు తీసుకునేటప్పుడు మీ సహాయం కోరవచ్చు. అప్పుడు మీ సొంత అభిప్రాయం ఆధారంగా సలహా ఇస్తారా లేక బైబిలు ఆధారంగా ఇస్తారా? ఇతరులు ఒక నిర్ణయానికి వచ్చేందుకు సాధారణంగా మీరెలా సహాయం చేస్తారు? విషయం చిన్నదిగా అనిపించినా, పెద్దదిగా అనిపించినా ‘నీతిమంతుడు ప్రత్యుత్తరం ఇచ్చే ముందు ఆలోచిస్తాడు’ అని సామెతలు 15:28 [NW] చూపిస్తోంది. దీనికి సంబంధించి బైబిల్లో ఇవ్వబడిన ఐదు సూత్రాలు ఎలా సహాయం చేస్తాయో చూద్దాం.

1 వాళ్లు అసలు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారో తెలుసుకోండి.

వాళ్లు అసలు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారో తెలుసుకోండి. “సంగతి వినకముందు ప్రత్యుత్తరమిచ్చువాడు తన మూఢతను బయలుపరచి సిగ్గునొందును.”—సామె. 18:13.

మంచి సలహా ఇవ్వాలంటే, సలహా అడుగుతున్న వ్యక్తి పరిస్థితులు ఏమిటో, ఆయన ఏ ఉద్దేశంతో సలహా అడుగుతున్నాడో అర్థంచేసుకోవాలి. ఉదాహరణకు, ఒక వ్యక్తి మీకు ఫోన్‌చేసి మీ ఇంటికి రావడానికి దారి చెప్పమని అడిగినప్పుడు ఆయనకు దారి చెప్పాలంటే మీకు ఏమి తెలిసివుండాలి? ప్రస్తుతం ఆయన ఎక్కడ ఉన్నాడో తెలుసుకోకుండా మీరు దారి చెప్పగలుగుతారా? చెప్పలేరు. అదే విధంగా సరైన సూచనలు ఇవ్వాలంటే, ప్రస్తుతం ఆయన ‘ఎక్కడ ఉన్నాడో’ అంటే ఆయన పరిస్థితులు ఏమిటో, ఆయన ఏ ఉద్దేశంతో సలహా అడుగుతున్నాడో అర్థంచేసుకోవాలి. ఆ వ్యక్తి పరిస్థితులు తెలిసివుంటేనే మనం సరైన సలహా ఇవ్వగలుగుతాం. కానీ పరిస్థితులపై సరైన అవగాహన లేకుండా మనం సలహా ఇస్తే ఆయన మరింత తికమకపడవచ్చు.—లూకా 6:39.

ఆ వ్యక్తి ఎంత పరిశోధన చేశాడో తెలుసుకోండి. సలహా కోసం వచ్చిన వ్యక్తిని ఈ ప్రశ్నలు అడగడం మంచిది, “ఈ విషయంలో బైబిల్లోని ఏ సూత్రాలు అన్వయిస్తాయని మీరు అనుకుంటున్నారు?” “మీ ముందున్న ఎంపికల వల్ల మీకు ఎలాంటి ప్రయోజనాలు, నష్టాలు ఉండవచ్చు?” “ఈ విషయంపై మీరు ఎంత పరిశోధన చేశారు?” “ఇతరులు అంటే సంఘ పెద్దలు, మీ తల్లిదండ్రులు, మీతో బైబిలు అధ్యయనం చేసిన వ్యక్తి ఇప్పటికే మీకు ఎలాంటి సలహా ఇచ్చారు?”

ఆ వ్యక్తి ఇచ్చే సమాధానాలను బట్టి, సరైన సలహా కోసం అప్పటికే ఆయన ఎంత కృషి చేశాడో మనం గ్రహించవచ్చు. ఇతరులు చెప్పిన విషయాలను కూడా పరిగణనలోకి తీసుకుంటూ మనం సలహా ఇవ్వవచ్చు. ఆ వ్యక్తి తాను వినాలనుకుంటున్న సలహా కోసమే చూస్తున్నాడా అనేది కూడా మనం గ్రహించవచ్చు.—2 తిమో. 4:3.

2 అనాలోచితంగా సలహాలు ఇవ్వకండి.

“ప్రతి మనుష్యుడు వినుటకు వేగిరపడువాడును, మాటలాడుటకు నిదానించువాడునై యుండవలెను.”యాకో. 1:19.

మనం మంచి ఉద్దేశంతోనే త్వరపడి స్పందించవచ్చు. అయితే అలా చేయడం, ముఖ్యంగా మనం అంతగా పరిశోధన చేయని విషయం గురించి చర్చిస్తున్నప్పుడు అలా చేయడం సరైనదేనా? “ఆతురపడి మాటలాడువాని చూచితివా? వానికంటె మూర్ఖుడు సుళువుగా గుణపడును” అని సామెతలు 29:20 చెబుతుంది.

మీరిచ్చే సలహా దైవిక జ్ఞానానికి పూర్తి అనుగుణంగా ఉందో లేదో నిర్ధారించుకోవడానికి సమయం తీసుకోండి. మీరిలా ప్రశ్నించుకోండి, ‘నా చుట్టూ ఉన్నవాళ్ల వైఖరి, “లౌకికాత్మ” నా ఆలోచనా విధానంపై ప్రభావం చూపిస్తున్నాయా?’ (1 కొరిం. 2:12, 13) మనకు మంచి ఉద్దేశం ఉన్నంత మాత్రాన మనమిచ్చే సలహా సరైనదిగా ఉంటుందని చెప్పలేం. యేసు ఎదుర్కోబోయే ఒక కష్టతరమైన పరిస్థితి గురించి విన్న తర్వాత పేతురు ఆయనకు ఇలా సలహా ఇచ్చాడు, “ప్రభువా, అది నీకు దూరమగుగాక, అది నీకెన్నడును కలుగదు.” పేతురు స్పందించిన తీరు నుండి మనమేమి గ్రహించవచ్చు? జాగ్రత్తగా లేకపోతే మంచి ఉద్దేశంగల వ్యక్తి కూడా ‘దేవుని తలంపులకు కాక మనుష్యుల తలంపులకు’ ప్రాముఖ్యతను ఇచ్చే అవకాశం ఉంటుంది. (మత్త. 16:21-23) మాట్లాడే ముందు ఆలోచించడం ఎంతో ప్రాముఖ్యం. నిజానికి, దేవుని జ్ఞానంతో పోలిస్తే మన సొంత అనుభవం చీమ తలకాయంతే.—యోబు 38:1-4; సామె. 11:2.

3 వినయంతో దేవుని వాక్యాన్ని అన్వయించండి.

‘నా అంతట నేనే ఏమీ చేయక, తండ్రి నాకు నేర్పినట్టు ఈ సంగతులు మాట్లాడుతున్నాను.’యోహా. 8:28.

‘మీ పరిస్థితుల్లో ఉంటే, నేనైతే ఇలా చేస్తాను, అలా చేస్తాను’ అని మీరు చెబుతారా? వాళ్లు అడిగిన దానికి సమాధానం స్పష్టంగా తెలిసినా వినయం, అణకువ విషయంలో యేసు చూపించిన చక్కని మాదిరిని పాటిస్తే మంచిది. ఏ మానవునికీ లేనంత జ్ఞానం, అనుభవం ఆయనకు ఉన్నా ఆయన ఇలా అన్నాడు, “నా అంతట నేనే మాటలాడలేదు; నేను ఏమనవలెనో యేమి మాటలాడవలెనో . . . తండ్రియే నాకాజ్ఞ యిచ్చియున్నాడు.” (యోహా. 12:49, 50) యేసు బోధలు, సలహాలు ఎప్పుడూ తండ్రి చిత్తానికి అనుగుణంగానే ఉండేవి.

ఉదాహరణకు, యేసును బంధించడానికి సైనికులు వస్తున్నప్పుడు వాళ్లతో పోరాడాలా వద్దా అని శిష్యులు ఆయనను అడిగినట్లు మనం లూకా 22:49లో చదువుతాం. ఒక శిష్యుడు కత్తి దూసాడు. ఆ పరిస్థితుల్లో కూడా యేసు సమయం తీసుకొని తన శిష్యులతో యెహోవా చిత్తం గురించి తర్కించాడని అదే సన్నివేశం గురించి తెలియజేస్తున్న మత్తయి 26:52-54 వచనాలు చెబుతున్నాయి. యేసుకు, ఆదికాండము 9:6లోని సూత్రం, 22వ కీర్తనలో, యెషయా 53వ అధ్యాయంలో ఉన్న ప్రవచనాలు తెలుసు కాబట్టి ఎంతోమంది ప్రాణాలను రక్షించే, యెహోవాకు సంతోషం కలిగించే జ్ఞానయుక్తమైన నిర్దేశం ఆయన ఇవ్వగలిగాడు.

4 మీ దగ్గరున్న బైబిలు ప్రచురణలను ఉపయోగించండి.

“యజమానుడు తన యింటివారికి తగినవేళ అన్నము పెట్టుటకు వారిపైన ఉంచిన నమ్మకమైనవాడును బుద్ధిమంతుడునైన దాసుడెవడు?”మత్త. 24:45.

ప్రాముఖ్యమైన ఆధ్యాత్మిక ఆహారాన్ని అందించే నమ్మకమైన దాసుని తరగతిని యేసు నియమించాడు. ముఖ్యమైన విషయాల గురించి సలహాను గానీ నిర్దేశాలను గానీ ఇస్తున్నప్పుడు మీరు సమయం తీసుకొని బైబిలు ప్రచురణలను పరిశోధిస్తారా?

కావలికోట డిసెంబరు సంచిక చివరి పేజీలో వచ్చే విషయసూచికలో సలహాల కోసం సహాయపడే ఎన్నో ఆర్టికల్స్‌ ఉంటాయి. అంతేకాక, వాచ్‌టవర్‌ లైబ్రరీలో a ప్రయోజనకరమైన సమాచారాన్ని కనుక్కోవడానికి సహాయం చేయమని మీరు ఎవరినైనా అడగవచ్చు. అంతటి అమూల్యమైన సమాచారాన్ని వాడుకోకపోవడం ఎంత అవివేకమో కదా! సలహా అవసరమైన వ్యక్తికి సహాయం చేయడానికి వేలాది అంశాలపై ఎన్నో ఆర్టికల్స్‌ వాటిలో ఉన్నాయి. బైబిలు సూత్రాలను గుర్తించి, దేవుని వాక్యం గురించి తర్కించడానికి ఇతరులకు సహాయం చేయగలుగుతున్నారా? ఒక వ్యక్తి తన గమ్యాన్ని చేరుకోవడానికి ఏ దారిలో వెళ్లాలో నిర్ణయించుకునేందుకు మ్యాపు సహాయం చేసినట్లే నిత్యజీవమనే గమ్యాన్ని చేరుకోవడానికి మనం ఏ నిర్ణయాలు తీసుకోవాలో గ్రహించేందుకు మన పరిశోధనా పరికరాలు సహాయం చేస్తాయి.

చాలామంది పెద్దలు తమ సంఘంలో ఉన్న ప్రచారకులకు, ప్రతీ సంవత్సరం కావలికోట పత్రికలో వచ్చే విషయసూచికలను, సీడీ-రామ్‌లోవున్న వాచ్‌టవర్‌ లైబ్రరీని ఉపయోగిస్తూ వాటిలో ఉన్న ఆర్టికల్స్‌ను ఎలా చూడాలో నేర్పించారు. అలా, లేఖనాలను తమ జీవితాల్లో అన్వయించుకోవడానికి సహోదర సహోదరీలకు సహాయం చేశారు. దానివల్ల ప్రచారకులు వెంటనే అవసరమైన పరిశోధన చేయగలుగుతారు. అంతేగాక పరిశోధన చేసే అలవాటును, యెహోవా ఇస్తున్న ఆధ్యాత్మిక సదుపాయాలపై ఆధారపడే అలవాటును వృద్ధి చేసుకోగలుగుతారు. అప్పుడు వాళ్లు, “అభ్యాసముచేత మేలు కీడులను వివేచించుటకు సాధకము చేయబడిన జ్ఞానేంద్రియములు” కలిగివుండగలుగుతారు.—హెబ్రీ. 5:14.

5 ఇతరులు ఏమి చేయాలనేది మీరు నిర్ణయించకండి.

“ప్రతివాడును తన బరువు తానే భరించుకొనవలెను.”గల. 6:5.

ప్రతీవ్యక్తి ఏ ఉపదేశాన్ని, ఏ సలహాను పాటించాలో చివరికి తానే ఎంపిక చేసుకోవాలి. యెహోవా వాక్య ప్రకారం నడుచుకోవాలా వద్దా అనేది నిర్ణయించుకునే స్వేచ్ఛ ఆయన మనకిచ్చాడు. (ద్వితీ. 30:19, 20) కొన్ని పరిస్థితుల్లో బైబిల్లోని వివిధ సూత్రాలను అన్వయించుకొనే అవకాశం ఉంటుంది, కానీ ఏ సూత్రాన్ని పాటించాలనేది సలహా అడుగుతున్న వ్యక్తే నిర్ణయించుకోవాలి. విషయాన్ని బట్టి, సలహా అడిగే వ్యక్తి వయస్సును బట్టి ‘ఈ ప్రశ్నకు సమాధానం ఇచ్చే అధికారం నాకు ఉందా?’ అని మనం ఆలోచించాల్సిన అవసరం కూడా ఉండవచ్చు. కొన్ని విషయాలకు సంఘ పెద్దలను సంప్రదించమనడం మంచిది లేదా అడుగుతున్నది చిన్నపిల్లవాడైతే తన తల్లిదండ్రులను సంప్రదించమని చెప్పడం మంచిది.

[అధస్సూచి]

a సీడీ-రామ్‌లోవున్న వాచ్‌టవర్‌ లైబ్రరీ ప్రస్తుతం 39 భాషల్లో అందుబాటులో ఉంది.

[8వ పేజీలోని బాక్సు/చిత్రం]

కుటుంబ ఆరాధనలో పరిశీలించవచ్చు

ఇటీవల ఎవరైనా మిమ్మల్ని అడిగిన ప్రశ్నలకు జవాబుల కోసం కుటుంబ ఆరాధనలో పరిశోధన చేయవచ్చు. అలాంటి ప్రశ్నలు ఎవరైనా అడిగినప్పుడు వాళ్లకు సహాయం చేసే ఏ ఆర్టికల్స్‌ను, బైబిల్లోని ఏ సూత్రాలను మీరు చూపించవచ్చు? ఒక సహోదరుడు గానీ, సహోదరి గానీ పెళ్లి చేసుకోవాలనే ఉద్దేశంతో ఒక వ్యక్తితో పరిచయం పెంచుకోవడం గురించి మిమ్మల్ని అడిగారనుకోండి. ఆ విషయానికి సంబంధించి, ప్రతీ సంవత్సరం కావలికోట పత్రికలో వచ్చే విషయసూచికలను ఉపయోగించి పరిశోధన చేస్తున్నప్పుడు “అధ్యయన శీర్షికలు” లేదా “క్రైస్తవ జీవితం, లక్షణాలు” అనే ఉపశీర్షికలను చూడండి. అంతేకాక, సీడీరామ్‌లోవున్న వాచ్‌టవర్‌ లైబ్రరీలోని పబ్లికేషన్స్‌ ఇండెక్స్‌లో “Dating” (డేటింగ్‌) లేదా “Marriage” (వివాహం) అనే శీర్షికల కింద కూడా మీరు సహాయకరమైన సమాచారాన్ని పొందవచ్చు. ఆ తర్వాత వాటికి సంబంధించిన వేరే ఆర్టికల్స్‌ కోసం చూడండి. ఏదైనా ఒక అంశాన్ని చూస్తున్నప్పుడు “See also” (ఇవి కూడా చూడండి) అనేది ఉందేమో చూడండి. దానిలో మీరు వెదుకుతున్న విషయానికి సంబంధించిన సమాచారం దొరకవచ్చు.

[9వ పేజీలోని బాక్సు]

యెహోవా తన సంస్థ ద్వారా చేసిన ఏర్పాట్ల వల్ల మనం సరైన సలహాలు ఇవ్వగలుగుతున్నాం, పొందగలుగుతున్నాం. ప్రసంగి 12:11 ఇలా చెబుతోంది, “జ్ఞానులు చెప్పు మాటలు ములుకోలలవలెను, చక్కగా కూర్చబడి బిగగొట్టబడిన మేకులవలెను ఉన్నవి; అవి ఒక్క కాపరివలన అంగీకరింపబడినట్టున్నవి.” “ములుకోలుల” వలే అంటే పశువులను నడిపించడానికి ఉపయోగించే ముల్లుకర్రల్లా ప్రేమపూర్వకమైన మంచి సలహాలు ఒక వ్యక్తిని సరైన దారిలో నడిపిస్తాయి. “బిగగొట్టబడిన మేకులు” స్థిరత్వాన్నిస్తాయి. అదే విధంగా, మంచి సలహాల వల్ల జీవితానికి స్థిరత్వాన్ని చేకూర్చే మంచి ఫలితాలు వస్తాయి. ‘చక్కగా కూర్చబడిన మాటలు’ “ఒక్క కాపరి” అయిన యెహోవా జ్ఞానాన్ని ప్రతిబింబిస్తాయి, వాటిని పరిశీలించడం ద్వారా జ్ఞానవంతులు ఎంతో సంతోషాన్ని పొందుతారు.

మనం మన కాపరిలా సలహా ఇవ్వాలి. సలహా కోసం వచ్చిన వ్యక్తి మాట్లాడుతున్నప్పుడు శ్రద్ధగా విని, మనం సలహా ఇవ్వగలిగిన విషయమైతే సహాయకరమైన సలహా ఇవ్వవచ్చు. బైబిలు సూత్రాల ఆధారంగా సలహా ఇచ్చినప్పుడు మంచి ఫలితాలు రావచ్చు, శాశ్వత ప్రయోజనం చేకూరవచ్చు.