కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

జీవిత కథ

యెహోవా కుడిచేతి కింద ఉంటే నిరంతరం సంతోషంగా ఉంటాం

యెహోవా కుడిచేతి కింద ఉంటే నిరంతరం సంతోషంగా ఉంటాం

లోయస్‌ డీడర్‌ చెప్పినది

‘ఆ నిర్ణయం తీసుకోకుండా ఉండాల్సింది’ అని మనకు ఎప్పుడో ఒకసారి అనిపించి ఉంటుంది. కానీ 50 సంవత్సరాలు పూర్తికాల సేవలో గడిపినందుకు నేను ఏనాడూ బాధపడలేదు. దానికి కారణమేమిటో చెబుతాను.

నేను 1939లో పుట్టాను. మేము కెనడాలోని సస్కత్‌చెవాన్‌ అనే గ్రామంలో ఉండేవాళ్లం. నాకు ముగ్గురు అక్కలు, ఒక చెల్లి, ఒక తమ్ముడు. పచ్చని పంట పొలాల మధ్య సంతోషంగా జీవించేవాళ్లం. ఒకరోజు యెహోవాసాక్షులు మా ఇంటికి వచ్చి మా నాన్నతో మాట్లాడుతున్నప్పుడు, ‘దేవునికి పేరు ఉందా’ అని వాళ్లను అడిగాను. అప్పుడు వాళ్లు కీర్తన 83:18లో ఉన్న యెహోవా అనే పేరు చూపించారు. దానితో నాకు దేవుని గురించి, ఆయన వాక్యం గురించి ఎక్కువ తెలుసుకోవాలన్న ఆసక్తి కలిగింది.

ఆ కాలంలో, పొలాల్లో నివసించేవాళ్ల పిల్లలు ఎనిమిదవ తరగతి వరకు ఒకే గదిలో జరిగే గ్రామీణ పాఠశాలలో చదువుకునేవాళ్లు. పిల్లలు ఎన్నో మైళ్ల దూరంలో ఉండే ఆ పాఠశాలకు గుర్రాలమీద గానీ, నడిచి గానీ వెళ్లేవాళ్లు. ఆ జిల్లాలోని కుటుంబాలే ఉపాధ్యాయుని అవసరాలన్నిటినీ చూసుకునేవాళ్లు. ఒక సంవత్సరం జాన్‌ డీడర్‌ అనే కొత్త ఉపాధ్యాయుణ్ణి చూసుకోవలసిన వంతు మా తల్లిదండ్రులకు వచ్చింది.

యౌవనస్థుడైన ఆ ఉపాధ్యాయునికి కూడా దేవుని వాక్యం అంటే చాలా ఆసక్తి అని ఆ తర్వాత నాకు తెలిసింది. అయితే అప్పట్లో మా నాన్న కమ్యూనిజం, సామ్యవాదం పక్షం వహించేవాడు. ఒకసారి నేను వాటి గురించి మాట్లాడుతూ అవి మంచివని అన్నాను. అప్పుడు, “మరో మనిషి మీద అధికారం చెలాయించే హక్కు ఏ మనిషికీ లేదు, దేవునికి మాత్రమే ఆ హక్కు ఉంది” అని జాన్‌ ప్రశాంతంగా జవాబిచ్చాడు. దానితో మా మధ్య ఎన్నో ఆసక్తికరమైన చర్చలు జరిగాయి.

జాన్‌ 1931లో పుట్టాడు కాబట్టి యుద్ధం వల్ల వచ్చే కష్టాల గురించి విన్నాడు. 1950లో కొరియన్‌ యుద్ధం ప్రారంభమైనప్పుడు, ‘క్రైస్తవులు యుద్ధంలో పాల్గొనడం సరైనదేనా?’ అని జాన్‌ వేర్వేరు చర్చీ గురువుల్ని అడిగాడు. దానికి, ‘క్రైస్తవులు యుద్ధంలో పాల్గొంటే తప్పేమీ లేదు’ అని వాళ్లంతా జవాబిచ్చారు. ఆ తర్వాత ఆయన యెహోవాసాక్షులను కూడా అదే ప్రశ్న అడిగాడు. యుద్ధంలో పాల్గొనడం గురించి తొలి క్రైస్తవులు లేఖనాధారంగా నమ్మినదాన్ని వాళ్లు ఆయనకు చూపించారు. జాన్‌ 1955లో బాప్తిస్మం తీసుకున్నాడు. ఆ తర్వాతి సంవత్సరంలో నేను కూడా బాప్తిస్మం తీసుకున్నాను. జీవితాంతం యెహోవా సేవ చేయాలని మేమిద్దరం ఎంతో కోరుకున్నాం. (కీర్త. 37:3, 4) 1957 జూలైలో మా పెళ్లైంది.

చాలాసార్లు మా పెళ్లి రోజున సమావేశంలో ఉండేవాళ్లం. మాలాగే వివాహాన్ని గౌరవించే వేలాదిమంది మధ్యన ఉండడం మాకెంతో ఆనందంగా ఉండేది. మొట్టమొదటిసారిగా 1958లో మేము అంతర్జాతీయ సమావేశానికి హాజరయ్యాం. ఒక ఐదుగురం కలిసి సస్కత్‌చెవాన్‌ నుండి న్యూయార్క్‌ సిటీకి కారులో బయలుదేరాం. వారంపాటు పగలు ప్రయాణం చేస్తూ, రాత్రుల్లో టెంట్‌ వేసుకొని పడుకునేవాళ్లం. పెన్సిల్వేనియాలోని బెత్లెహేములో మేము కలిసిన ఒక సహోదరుడు మమ్మల్ని ఆ రాత్రికి తన ఇంట్లో ఉండమని ఆహ్వానించినప్పుడు మేము ఎంతో ఆశ్చర్యపోయాం. అప్పటికప్పుడు ఆయన చేసిన సహాయం వల్ల మేము శుభ్రంగా తయారై సమావేశానికి వెళ్లగలిగాం. ఆ పెద్ద సమావేశం, యెహోవా సేవ చేస్తూ ఆయన కుడిచేతి కింద ఉంటే నిరంతరం సంతోషంగా ఉంటామని కీర్తనకర్త రాసిన మాటలను మాకు గుర్తుచేసింది.—కీర్త. 16:11.

పయినీరు సేవ

ఒక సంవత్సరం తర్వాత 1959లో పయినీరు సేవ ప్రారంభించాం. సస్కత్‌చెవాన్‌లోని పచ్చగా ఉండే ఒక కొండమీద మేము ఒక చిన్న హౌస్‌ ట్రెయిలర్‌లో ఉండేవాళ్లం. అక్కడి నుండి చూస్తే కొన్ని మైళ్ల దూరం వరకు కనిపిస్తుంది, అందులో కొంతభాగం మా ప్రకటనా క్షేత్రం.

ఒకరోజు బ్రాంచి కార్యాలయం నుండి ఒక ఆసక్తికరమైన ఉత్తరం వచ్చింది. వెంటనే నేను పొలంలో ట్రాక్టర్‌ రిపేర్‌ చేస్తున్న జాన్‌ దగ్గరకు పరుగెత్తుకుంటూ వెళ్లాను. ఆ ఉత్తరంలో, ఒంటారియోలోని రెడ్‌ లేక్‌లో ప్రత్యేక పయినీరు సేవ చేయమనే ఆహ్వానం ఉంది. ఆ ప్రదేశం ఎక్కడ ఉందో మాకు తెలియదు కాబట్టి వెంటనే మ్యాపులో దాని కోసం వెదకడం మొదలుపెట్టాం.

మేము ఇంతకు ముందు నివసించిన పచ్చని పంట పొలాలకు, ఇక్కడి పరిస్థితికి ఎంతో తేడా ఉంది. ఎందుకంటే ఇక్కడ పెద్దపెద్ద అడవులూ, బంగారు గనుల దగ్గర చిన్నచిన్న పట్టణాలూ ఉన్నాయి. మొదటి రోజు మేము ఇంటి కోసం వెదుకుతూ ఒక స్త్రీతో మాట్లాడుతున్నప్పుడు వాళ్ల పొరుగున ఉండే ఒక చిన్న అమ్మాయి మా సంభాషణ విని, పరుగెత్తుకొని వెళ్లి వాళ్ల అమ్మతో ఆ విషయం చెప్పింది. అప్పుడు ఆ అమ్మాయి వాళ్లమ్మ మా పరిస్థితిని అర్థంచేసుకొని మేము ఆ రాత్రికి ఉండడానికి వసతి ఏర్పాటు చేసింది. అయితే ఆమె వసతి కోసం ఏర్పాటు చేసిన బేస్‌మెంటు చాలా మురికిగా ఉంది. ఆ తర్వాతి రోజు మేము ఒక ఇల్లు చూసుకున్నాం, అది రెండు గదులున్న చెక్క ఇల్లు. దానిలో నీటి సౌకర్యం, మరుగుదొడ్డి సౌకర్యం, ఇతర సామగ్రి వంటివేవీ లేవు. గదిని వెచ్చగా ఉంచడానికి వీలుగా చెక్కలను కాల్చుకునేందుకు చిన్న రేకు డబ్బా మాత్రం ఉంది. మేము సెకెండ్‌ హ్యాండ్‌ వస్తువులు దొరికే షాపు నుండి కొన్ని వస్తువులు కొని తెచ్చుకున్నాం, వాటితోనే చాలా తృప్తిగా జీవించాం.

ఆ చుట్టుప్రక్కల 209 కిలోమీటర్ల వరకూ ఒక్క సంఘం కూడా లేదు. బంగారు గనుల్లో పనిచేసే చాలామంది యూరప్‌ నుండి వచ్చారు. వాళ్లు తమ భాషలో బైబిలు కావాలని అడిగారు. కొంతకాలానికే మేము 30 ఫలవంతమైన బైబిలు అధ్యయనాలు నిర్వహించడం మొదలుపెట్టాం. ఆరు నెలల్లోపే అక్కడ ఒక చిన్న సంఘం ఏర్పడింది.

మేము బైబిలు అధ్యయనం చేస్తున్న ఒక స్త్రీ భర్త వాళ్ల ప్రీస్టుకు ఫోను చేసి, వచ్చి తన భార్య ఆలోచనను సరిచేయమని అడిగాడు. ఆ ప్రీస్టు వచ్చేసరికి మేము కూడా అక్కడే ఉన్నాం, అప్పుడు ఆ ప్రీస్టు మాట్లాడుతూ మేము ఇతర విషయాలతో పాటు త్రిత్వాన్ని కూడా బోధించాలని అన్నాడు. ఆ స్త్రీ క్యాథలిక్‌ బైబిలు తీసుకువచ్చి ఆయన చెబుతున్న విషయాలకు బైబిల్లో నుండి ఆధారం చూపించమని అడిగింది. వెంటనే ఆ ప్రీస్టు తానేదీ నిరూపించాల్సిన అవసరం లేదంటూ బైబిలును టేబుల్‌ మీదికి విసిరేశాడు. ఆయన వెళ్లిపోతూ, ‘వీళ్లను ఇంట్లో నుండి వెళ్లగొట్టి మళ్లీ ఎప్పుడూ రానివ్వకండి’ అని యుక్రెనియన్‌ భాషలో అన్నాడు. జాన్‌కు ఆ భాష అర్థమౌతుందని ఆ ప్రీస్టుకు తెలియదు.

ఆ తర్వాత కొంతకాలానికి జాన్‌ ప్రయాణ సేవ కోసం శిక్షణ పొందాల్సి ఉండడంతో మేము రెడ్‌ లేక్‌ నుండి వెళ్లిపోయాం. దాదాపు ఒక సంవత్సరం తర్వాత ఒక జిల్లా సమావేశంలో జాన్‌ బాప్తిస్మ ప్రసంగం ఇస్తున్నప్పుడు, నేను పైన ప్రస్తావించిన స్త్రీ భర్త బాప్తిస్మం తీసుకునేవాళ్లలో ఉన్నాడు. ప్రీస్టుతో ఎదురైన సంఘటన వల్ల ఆయనే సొంతగా బైబిలు లేఖనాలను పరిశోధించడం మొదలుపెట్టాడు.

ప్రయాణ సేవలో నిమగ్నమయ్యాం

ప్రయాణ సేవలో ఉన్నప్పుడు వేర్వేరు సహోదర సహోదరీల ఇళ్లల్లో వాళ్లతో కలిసి ఉండడం చాలా ఆనందాన్నిచ్చింది. అలా ఉన్నప్పుడు మేము వాళ్లకు చాలా దగ్గరయ్యాం. ఒకసారి మేము చలికాలంలో ఒక వృద్ధ సహోదరి ఇంట్లోని మేడగదిలో ఉన్నాం, గదిని వెచ్చగా ఉంచేదేదీ అక్కడ లేదు. ఆ సహోదరి ఉదయాన్నే మెల్లగా మా గదిలోకి వచ్చి గది వెచ్చగా అవడానికి ఒక చిన్న స్టౌ వెలిగించడం మాకు వినిపించేది. కాసేపయ్యాక, మేము ముఖాలు కడుక్కోవడానికి వేడి నీళ్లు, ఒక బేసిన్‌ తీసుకువచ్చేది. ఆమె నెమ్మదిగా, మృదువుగా వ్యవహరించిన తీరు చూసి నేను ఎంతో నేర్చుకున్నాను.

ప్రయాణ సేవ వల్ల నేను యెహోవాకు మరింత దగ్గరయ్యాను. ఆల్బర్టాలోని ఒక సర్క్యూట్‌లో ఆల్బర్టాకు ఉత్తరాన ఎంతో దూరంలో గనులున్న ఒక నగరంలో ఒక సహోదరి నివసించేది. సహోదర సహోదరీలకు దూరంగా నివసిస్తున్న ఆ సహోదరిని యెహోవా సంస్థ ఎలా దృష్టించింది? మామూలుగా పెద్ద సంఘాల్ని సందర్శించినట్లే ప్రతీ ఆరు నెలలకు ఒకసారి ఆ సహోదరి దగ్గరకు కూడా వెళ్లి ఒక వారం పాటు మేము ఆమెతో కలిసి పరిచర్య చేసి, కూటాలు నిర్వహించేవాళ్లం. గొర్రెల్లాంటి ప్రజలపై యెహోవాకు ప్రేమపూర్వక శ్రద్ధ ఉందనడానికి అది చక్కని నిదర్శనం.

మాకు వసతి కల్పించిన చాలామందికి ఉత్తరాలు రాస్తూ మేము వాళ్ల యోగక్షేమాలు తెలుసుకునేవాళ్లం. ఈ సందర్భంలో, నాకు జాన్‌ ఇచ్చిన మొదటి బహుమతుల్లో ఒకటైన, ఉత్తరాలు రాసే కాగితాలున్న రంగురంగుల బాక్సు గుర్తుకువస్తోంది. అలాంటి కాగితాలతోనే మా స్నేహితులతో ఉత్తర ప్రత్యుత్తరాలు జరపడం ద్వారా మేము ఎంతో సంతోషాన్ని పొందాం. ఉత్తరాలు రాసే కాగితాలున్న ఆ బాక్సంటే నాకు ఇప్పటికీ ఎంతో ఇష్టం.

మేము టోరెంటోలో ఉన్న ఒక సర్క్యూట్‌లో సేవ చేస్తున్నప్పుడు కెనడా బెతెల్‌ నుండి ఒక సహోదరుడు ఫోన్‌ చేసి ‘బెతెల్‌లో సేవ చేయడం మీకు ఇష్టమేనా?’ అని అడిగాడు. “వీలైతే రేపటికల్లా మీ అభిప్రాయం చెబుతారా?” అన్నాడు. మాకు ఇష్టమేనని మరుసటి రోజే చెప్పేశాం.

బెతెల్‌ సేవ

మా నియామకం మారినప్పుడల్లా మేము యెహోవా ప్రేమను చవిచూశాం. మేము 1977లో బెతెల్‌ సేవ ప్రారంభించినప్పుడు కూడా అలాగే జరిగింది. కొంతమంది అభిషిక్తులతో సహవసించడం వల్ల వాళ్ల వ్యక్తిత్వాల్ని తెలుసుకోగలిగాం, అంతేకాక వాళ్లకు దేవుని వాక్యంపై ఉన్న ప్రగాఢ గౌరవాన్ని కూడా చూడగలిగాం.

బెతెల్‌ జీవితం మాకు చాలా నచ్చింది. ఉదాహరణకు, మా దుస్తులు సూట్‌కేసులో ఉండే బదులు సొరుగుల్లో ఉండేవి. ఇంకా ఒక్కో సంఘాన్ని సందర్శించే బదులు కూటాల కోసం మేము ఒకే సంఘానికి వెళ్లేవాళ్లం. నాకు ఇచ్చిన పనితో పాటు బెతెల్‌ చూడడానికి వచ్చేవాళ్లకు బెతెల్‌ అంతా చూపించడాన్ని నేనెంతో ఇష్టపడేదాన్ని. బెతెల్‌లో పని ఎలా జరుగుతుందో వివరించేదాన్ని, వాళ్లు చెప్పేది వింటూ వాళ్లు అడిగే ప్రశ్నలకు జవాబులు ఇచ్చేదాన్ని.

సంవత్సరాలు చాలా త్వరగా గడిచిపోయాయి. 1997లో, న్యూయార్క్‌లో ఉన్న ప్యాటర్‌సన్‌లో బ్రాంచి కమిటీ సభ్యుల కోసం జరిగే పాఠశాలకు జాన్‌ను ఆహ్వానించారు. ఆ తర్వాత ‘యుక్రెయిన్‌కు వెళ్లడం మీకు ఇష్టమేనా?’ అని అడిగారు. ఆ కొత్త నియామకం గురించి యెహోవాకు ప్రార్థించి జాగ్రత్తగా ఆలోచించమని మమ్మల్ని ప్రోత్సహించారు. అక్కడికి వెళ్లడం మాకు ఇష్టమేనని ఆ సాయంత్రానికల్లా చెప్పాం.

యుక్రెయిన్‌లో మా నియమాకం

అంతకుముందు 1992లో రష్యాలోని సెయింట్‌ పీటర్స్‌బర్గ్‌లో, 1993లో యుక్రెయిన్‌లోని కీవ్‌లో జరిగిన అతిపెద్ద అంతర్జాతీయ సమావేశాలకు మేము హాజరయ్యాం. ఆ సమావేశాల వల్ల అప్పుడు తూర్పు యూరప్‌లోని సహోదరులకు మేము దగ్గరయ్యాం. ఇప్పుడు మా కొత్త నియామకంలో మళ్లీ యుక్రెయిన్‌కు వచ్చి లావోవ్‌లో ఒక పాత ఇంట్లో రెండవ అంతస్తులో ఉండేవాళ్లం. కిటికీలో నుండి కిందికి చూస్తే ఒక చిన్న తోట, ఎర్రగా ఉన్న పెద్ద కోడిపుంజు, కోడి పిల్లల గుంపు కనిపించేవి. అదంతా చూస్తుంటే, సస్కత్‌చెవాన్‌లో ఉన్నట్లే అనిపించేది. ఆ ఇంట్లో పన్నెండు మందిమి ఉండేవాళ్లం. బెతెల్‌లో పనిచేయడానికి ప్రతీ ఉదయం మేము పట్టణం దాటి వెళ్లాల్సి వచ్చేది.

యుక్రెయిన్‌లో ఉన్నప్పుడు మేము ఒక విషయాన్ని గమనించాం. అక్కడున్న ఎంతోమంది సహోదరులు అనుభవించిన శ్రమలు, నిషేధాలు, నిర్బంధాలతో పోలిస్తే మేము అనుభవించిన కష్టాలు లెక్కలోకి రావని అనిపిస్తుంది. అలాంటి పరిస్థితుల్లో కూడా ఆ సహోదరులు తమ విశ్వాసాన్ని దృఢంగా ఉంచుకున్నారు. మేము వాళ్ల విశ్వాసాన్ని మెచ్చుకుంటూ మాట్లాడినప్పుడు, “మేము వాటన్నిటినీ యెహోవా కోసమే అనుభవించాం” అనేవాళ్లు. దేవుడు తమను విడిచిపెట్టేశాడని వాళ్లు ఎప్పుడూ అనుకోలేదు. ఇప్పుడు కూడా వాళ్లు ఏదైనా చిన్న సహాయం చేసినందుకు మనం కృతజ్ఞతలు చెబితే, మంచివాటన్నిటినీ యెహోవాయే అనుగ్రహిస్తాడనే ఉద్దేశంతో, వాళ్లు “యెహోవాకు కృతజ్ఞతలు చెప్పండి” అంటారు.

యుక్రెయిన్‌లో చాలామంది కూటాలకు నడిచే వస్తారు. వాళ్లు గంట లేదా అంతకన్నా ఎక్కువసేపు నడవాల్సి ఉంటుంది కాబట్టి మాట్లాడుకోవడానికి, ఒకరినొకరు ప్రోత్సహించుకోవడానికి వాళ్లకు సమయం దొరుకుతుంది. లావోవ్‌లో 50 కన్నా ఎక్కువ సంఘాలు ఉన్నాయి, వాటిలో 21 సంఘాలు పెద్ద రాజ్యమందిర కాంప్లెక్సులో కూటాలు జరుపుకుంటాయి. ఆదివారాల్లో, కూటాలకు సహోదరులు వస్తూనే ఉండడాన్ని చూడడం కనువిందుగా ఉంటుంది.

మేము కొంతకాలానికే ఆ సహోదర సహోదరీలతో బాగా కలిసిపోయాం, ఎందుకంటే వాళ్లు ఎంతో ప్రేమ, శ్రద్ధ చూపించేవాళ్లు. నాకు భాష అర్థం చేసుకోవడం కష్టమైనప్పుడు వాళ్లు విసుక్కొనేవాళ్లు కాదు, వాళ్లు నన్ను అర్థంచేసుకున్నారని వాళ్ల ముఖకవళికల్లో కనిపించేది. నిజానికి ఇప్పటికీ నాకు ఆ భాష అంతగా రాదు.

కీవ్‌లో 2003లో జరిగిన అంతర్జాతీయ సమావేశంలో, మన సహోదరుల మధ్య ఎంత నమ్మకం ఉంటుందో చూపించే ఒక సంఘటన జరిగింది. భూగర్భ రైలు ఎక్కడానికి బిజీగావున్న ప్లాట్‌ఫాం మీదకు వెళ్లేసరికి, ఒక చిన్న అమ్మాయి మా దగ్గరకు వచ్చి, “నేను తప్పిపోయాను, మా అమ్మమ్మ కనబడడం లేదు” అని నెమ్మదిగా మాకు చెప్పింది. ఆ అమ్మాయి మేము పెట్టుకున్న బ్యాడ్జి కార్డులను చూసి, మేము సాక్షులమని గుర్తుపట్టింది. ఆ అమ్మాయి ఏడవకుండా చాలా ధైర్యంగా ఉంది. మాతోపాటు ఉన్న ప్రాంతీయ పర్యవేక్షకుని భార్య ఎంతో ప్రేమతో ఆ అమ్మాయిని స్టేడియంలోవున్న లాస్ట్‌ అండ్‌ ఫౌండ్‌ విభాగానికి తీసుకువెళ్లింది. కాసేపట్లోనే ఆ అమ్మాయి వాళ్ల అమ్మమ్మను తిరిగి కలుసుకుంది. వేలాదిమంది ఉన్నా ఆ చిన్న అమ్మాయికి సహోదరుల మీదున్న గొప్ప నమ్మకాన్ని చూసి చలించిపోయాను.

2001 మే నెలలో మా కొత్త బ్రాంచి ప్రతిష్ఠాపన కార్యక్రమానికి చాలా దేశాల నుండి సహోదర సహోదరీలు యుక్రెయిన్‌కు వచ్చారు. స్టేడియంలో ఆదివారం ఉదయం ప్రత్యేక ప్రసంగం అయిపోయిన తర్వాత అక్కడి నుండి సహోదర సహోదరీలు పెద్ద సంఖ్యలో బెతెల్‌ చూడడానికి ప్రశాంతంగా, ఒక పద్ధతి ప్రకారం నడుచుకుంటూ వచ్చారు. ఆ దృశ్యాన్ని నేను ఎప్పటికీ మర్చిపోలేను. దేవుని సేవ చేయడం కన్నా శ్రేష్ఠమైనదేదీ లేదని నాకు మరోసారి అనిపించింది.

ఒక పెద్ద మార్పు

విచారకరంగా, 2004లో జాన్‌కు క్యాన్సర్‌ అని తేలింది. చికిత్స కోసం మేము కెనడాకు వెళ్లాం. మొదటిసారి కీమోథెరపీ ఇచ్చినప్పుడు ఆయన శరీరం తట్టుకోలేకపోయింది, ఆయన కొన్ని వారాల పాటు ఇంటెన్సివ్‌ కేర్‌లో ఉన్నాడు. ఆ తర్వాత ఆయన స్పృహలోకి వచ్చాడు. ఆయన మాట్లాడలేకపోయినా తనను చూడడానికి వచ్చిన వాళ్లకు కళ్లతోనే కృతజ్ఞతలు తెలిపేవాడు.

కానీ ఆయన కోలుకోలేకపోయాడు, ఆ సంవత్సరం నవంబరు 27న ఆయన చనిపోయాడు. అప్పుడు నాకెంతో బాధ కలిగింది. మేమిద్దరం కలిసి యెహోవా సేవచేయడంలో ఎంతో ఆనందాన్ని పొందాం. కానీ ఆయన చనిపోయిన తర్వాత ఏమి చేయాలో నాకు అర్థంకాలేదు. అందుకే, యుక్రెయిన్‌కు తిరిగి వెళ్లిపోవాలని నిర్ణయించుకున్నాను. బెతెల్‌ కుటుంబం, అక్కడి సంఘం చూపించిన ప్రేమకు ఇప్పటికీ నేనెంతో కృతజ్ఞురాలిని.

మా నిర్ణయాలను బట్టి మేము ఏనాడూ బాధపడలేదు. మంచి సహవాసులతో జీవితాన్ని సంతోషంగా గడిపాం. యెహోవా మంచితనం గురించి నేర్చుకోవాల్సింది ఇంకా చాలా ఉందని నాకు తెలుసు. నేను జీవితాంతం ఆయన సేవలో గడపాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే నేను యెహోవా కుడిచేతి కింద ఉండి ఎంతో సంతోషాన్ని పొందాను.

[6వ పేజీలోని బ్లర్బ్‌]

“మా నిర్ణయాలను బట్టి మేము ఏనాడూ బాధపడలేదు”

[3వ పేజీలోని చిత్రం]

మా పెళ్లి రోజున

[4వ పేజీలోని చిత్రం]

ఒంటారియోలోని రెడ్‌ లేక్‌లో ప్రత్యేక పయినీరు సేవలో ఉన్నప్పుడు

[5వ పేజీలోని చిత్రం]

యుక్రెయిన్‌లో జాన్‌తో, 2002లో