కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

“వెనుకతట్టు” చూడకండి

“వెనుకతట్టు” చూడకండి

“వెనుకతట్టు” చూడకండి

“నాగటిమీద చెయ్యి పెట్టి వెనుకతట్టు చూచు వాడెవడును దేవుని రాజ్యమునకు పాత్రుడుకాడు.”—లూకా 9:62.

మీరెలా జవాబు ఇస్తారో చూడండి:

ఎందుకు “లోతు భార్యను జ్ఞాపకము” ఉంచుకోవాలి?

ఏ మూడు విషయాల గురించి మనం అదే పనిగా ఆలోచించకూడదు?

మనం యెహోవా సంస్థతో కలిసి ఎలా నడవవచ్చు?

1. యేసు ఏమని హెచ్చరించాడు, మనకు ఏ ప్రశ్న వస్తుంది?

 దాదాపు 2000 సంవత్సరాల క్రితం, “లోతు భార్యను జ్ఞాపకము చేసికొనుడి” అని యేసుక్రీస్తు చెప్పాడు. (లూకా 17:32) యేసు ఆ హెచ్చరికను ఇచ్చి అంత కాలమైనా అది ఇప్పుడు మరింత ప్రాముఖ్యమైనది. యేసు ఆ హెచ్చరిక ద్వారా ఏమి చెప్పాలనుకున్నాడు? యేసు మాటలు వింటున్న ఆ యూదులకు దాని గురించి అంతకన్నా ఎక్కువ వివరించాల్సిన అవసరం రాలేదు. ఎందుకంటే, లోతు భార్యకు ఏమి జరిగిందో వాళ్లకు తెలుసు. ఆమె తన కుటుంబంతో పాటు సొదొమ పట్టణం నుండి పారిపోతున్నప్పుడు, దేవుని ఆజ్ఞను మీరి వెనక్కి తిరిగి చూసినందువల్ల ఉప్పు స్తంభం అయిపోయింది.—ఆదికాండము 19:17, 26 చదవండి.

2. లోతు భార్య ఎందుకు వెనక్కి తిరిగి చూసివుండవచ్చు? దేవుని ఆజ్ఞను మీరినందుకు ఆమెకు ఏమి జరిగింది?

2 ఇంతకీ లోతు భార్య ఎందుకు వెనక్కి తిరిగి చూసింది? ఏమి జరుగుతోందో అనే కుతూహలంతోనా? అపనమ్మకంతోనా? లేక సొదొమలో వదిలేసిన వాటిమీదున్న ఇష్టాన్ని చంపుకోలేక అలా వెనక్కి తిరిగి చూసిందా? (లూకా 17:31) కారణమేదైనా, ఆమె అలా చూసినందుకు తన ప్రాణాల్ని కోల్పోయింది! సొదొమ గొమొర్రాలోని లైంగికోన్మాదులు నాశనమైన రోజే ఆమె కూడా మరణించింది. అందుకే యేసు “లోతు భార్యను జ్ఞాపకము చేసికొనుడి” అని హెచ్చరించాడు.

3. మనం వెనక్కి తిరిగి చూడకూడదని యేసు ఎలా నొక్కిచెప్పాడు?

3 ఒక రకంగా, మనం కూడా వెనక్కి తిరిగి చూడకూడని కాలంలో జీవిస్తున్నాం. శిష్యునిగా మారే ముందు ఇంట్లో వాళ్లకు చెప్పి వస్తానన్న వ్యక్తికి జవాబిస్తూ యేసు ఈ విషయాన్ని నొక్కి చెప్పాడు, “నాగటిమీద చెయ్యి పెట్టి వెనుకతట్టు చూచు వాడెవడును దేవుని రాజ్యమునకు పాత్రుడుకాడు.” (లూకా 9:62) యేసు ఆ సందర్భంలో మరీ కఠినంగా లేదా అన్యాయంగా మాట్లాడాడా? లేదు. ఎందుకంటే ఆ వ్యక్తి కేవలం బాధ్యతను తప్పించుకోవడానికే ఆ సాకు చెబుతున్నాడని యేసుకు తెలుసు. అలా వాయిదావేయడాన్ని యేసు ‘వెనక్కి తిరిగి’ చూడడంతో పోల్చాడు. పొలం దున్నుతున్న వ్యక్తి క్షణకాలంపాటు వెనక్కి తిరిగి చూడడం వల్ల లేదా నాగలి కింద పెట్టి వెనక్కి తిరగడం వల్ల ఏమైనా నష్టం జరుగుతుందా? అలాచేస్తే, పని మీద ఏకాగ్రత కోల్పోయి ఆయన సక్రమంగా దున్నలేకపోవచ్చు.

4. మనం వేటి గురించి ఎక్కువగా ఆలోచించాలి?

4 జరిగిపోయిన వాటి గురించి ఆలోచించే బదులు జరగబోయే వాటి గురించే మనం ఆలోచించాలి. ఆ విషయం సామెతలు 4:25లో స్పష్టంగా ఇలా ఉంది, “నీ కన్నులు ఇటు అటు చూడక సరిగాను నీ కనురెప్పలు నీ ముందర సూటిగాను చూడవలెను.”

5. మనం ఎందుకు వెనక్కి తిరిగి చూడకూడదు?

5 మనం ఎందుకు వెనక్కి తిరిగి చూడకూడదు? ఎందుకంటే, ఇవి ‘అంత్యదినాలు.’ (2 తిమో. 3:1) దేవుడు త్వరలోనే రెండు పట్టణాలను కాదుగానీ ఈ లోక విధానాన్నంతటినీ నాశనం చేస్తాడు. లోతు భార్యకు జరిగినట్లు మనకు జరగకుండా ఉండాలంటే ఏమి చేయాలి? మొదటిగా, మనల్ని వెనక్కి తిరిగి చూసేలా చేయగల అంశాలను గుర్తించాలి. (2 కొరిం. 2:11) ఆ అంశాలేమిటో, అలాంటి వాటి గురించి ఆలోచించకుండా ఉండాలంటే మనం ఏమి చేయాలో ఇప్పుడు చూద్దాం.

అప్పుడే బాగుండేది

6. మన జ్ఞాపకశక్తిపై ఎందుకు అన్నివేళలా ఆధారపడలేం?

6 అప్పుడే బాగుండేదని అనుకోవడం ప్రమాదకరం. జరిగిపోయిన వాటిని ఉన్నవి ఉన్నట్లుగా గుర్తుంచుకోలేం. గతంలో మన పరిస్థితి ఇంత ఘోరంగా ఉండేదికాదనీ, అప్పుడే చాలా ఆనందంగా ఉండేవాళ్లమనీ మనకు తెలియకుండానే అనుకునే అవకాశం ఉంది. నిజానికి అప్పటి పరిస్థితులు అంత బాగా లేకపోయినా, బాగుండేవని మీకు అనిపించవచ్చు. అలాంటి తప్పుడు ఆలోచన వల్ల అప్పటి పరిస్థితులు మళ్లీ కావాలని కోరుకునే ప్రమాదం ఉంది. కానీ బైబిలు ఇలా హెచ్చరిస్తోంది, “ఈ దినములకంటె మునుపటి దినములు ఏల క్షేమకరములు అని యడుగవద్దు; ఈ ప్రశ్నవేయుట జ్ఞానయుక్తము కాదు.” (ప్రసం. 7:10) అలా ఆలోచించడం ఎందుకంత ప్రమాదకరం?

7-9. (ఎ) ఐగుప్తులో ఉన్నప్పుడు ఇశ్రాయేలీయుల పరిస్థితి ఎలా ఉండేది? (బి) ఇశ్రాయేలీయులకు ఆనందాన్నిచ్చే ఏ సంఘటనలు జరిగాయి? (సి) వాళ్లు దేని గురించి సణగడం మొదలుపెట్టారు?

7 మోషే కాలంలోని ఇశ్రాయేలీయులకు ఏమి జరిగిందో చూడండి. ఐగుప్తు దేశంలో వాళ్లు ముందు అతిథులుగానే ఉండేవాళ్లు, కానీ యోసేపు చనిపోయిన తర్వాత ఐగుప్తీయులు, ‘ఇశ్రాయేలీయులమీద పెట్టిన భారములలో వారిని శ్రమపెట్టుటకు వెట్టి పనులు చేయించే అధికారులను నియమించారు.’ (నిర్గ. 1:11) వాళ్ల సంఖ్య పెరగకుండా అడ్డుకోవడానికి ఫరో ప్రయత్నించడంతో దేవుని ప్రజలు జాతినిర్మూలన లాంటి పరిస్థితిని ఎదుర్కోవాల్సి వచ్చింది. (నిర్గ. 1:15, 16, 22) అందుకే యెహోవా మోషేతో, “నేను ఐగుప్తులోనున్న నా ప్రజల బాధను నిశ్చయముగా చూచితిని, పనులలో తమ్మును కష్టపెట్టువారినిబట్టి వారు పెట్టిన మొరను వింటిని, వారి దుఃఖములు నాకు తెలిసే యున్నవి” అని చెప్పాడు.—నిర్గ. 3:7.

8 బానిసత్వం నుండి విడుదల పొంది స్వేచ్ఛాజీవులుగా బయటకు వస్తున్న ఇశ్రాయేలీయుల ఆనందాన్ని ఒక్కసారి ఊహించుకోండి. గర్వంతో కళ్లు మూసుకుపోయిన ఫరో మీదికి, అతని ప్రజల మీదికి 10 తెగుళ్లు రప్పించిన యెహోవా అద్భుత శక్తిని ఇశ్రాయేలీయులందరూ కళ్లారా చూశారు. (నిర్గమకాండము 6:1, 6, 7 చదవండి.) చివరకు ఐగుప్తీయులు ఇశ్రాయేలీయుల్ని వెళ్లనివ్వడం కాదు, తమ బంగారాన్ని, వెండిని ఇశ్రాయేలీయులకిచ్చి వాళ్లను వెళ్లిపొమ్మని బ్రతిమలాడారు. అందుకే దేవుని ప్రజలు ‘ఐగుప్తీయులను దోచుకొన్నారు’ అని చెప్పవచ్చు. (నిర్గ. 12:33-36) ఫరో, అతని సైన్యం ఎర్రసముద్రంలో నాశనమవడాన్ని చూసి ఇశ్రాయేలీయులు మరింత ఆనందించారు. (నిర్గ. 14:30, 31) అలాంటి సంఘటనలను ప్రత్యక్షంగా చూసిన వాళ్ల విశ్వాసం ఎంత బలపడివుంటుందో కదా!

9 విడ్డూరం ఏమిటంటే, ఇంత అద్భుతంగా విడుదల పొందిన కొంతకాలానికే ఆ ప్రజలు సణగడం మొదలుపెట్టారు! దేని గురించి సణిగారు? తిండి గురించి! యెహోవా వాళ్లకు అనుగ్రహించిన వాటితో తృప్తిపడకుండా సణగడం మొదలుపెట్టారు, “ఐగుప్తులో మేము ఉచితముగా తినిన చేపలును, కీరకాయలును, దోసకాయలును, కూరాకులును, ఉల్లిపాయలును, తెల్లగడ్డలును జ్ఞాపకమునకు వచ్చుచున్నవి. ఇప్పుడు మా ప్రాణము సొమ్మసిల్లెను. ఈ మన్నా కాక మా కన్నులయెదుట మరేమియు లేదు.” (సంఖ్యా. 11:5, 6) వాళ్ల ఆలోచనా తీరు ఎంతగా తప్పుదారి పట్టిందంటే, చివరికి వాళ్లు మళ్లీ ఆ బానిసత్వంలోకి వెళ్లిపోవడానికి కూడా సిద్ధపడ్డారు. (సంఖ్యా. 14:2-4) తాము వదిలేసి వచ్చిన వాటి గురించి ఆలోచించడం వల్ల ఇశ్రాయేలీయులు యెహోవా అనుగ్రహాన్ని కోల్పోయారు.—సంఖ్యా. 11:10.

10. ఇశ్రాయేలీయుల ఉదాహరణ నుండి మనం ఏమి నేర్చుకోవచ్చు?

10 ఇశ్రాయేలీయుల ఉదాహరణ నుండి ఇప్పుడు మనం ఏమి నేర్చుకోవచ్చు? కష్టాలు వచ్చినప్పుడు, ఒకప్పటి పరిస్థితులే బాగుండేవని, బహుశా మనం సత్యం తెలుసుకోకముందున్న పరిస్థితులే బాగుండేవని అదేపనిగా ఆలోచించకూడదు. గత అనుభవాల నుండి నేర్చుకున్న విషయాల గురించి ఆలోచించడం లేదా మధురస్మృతులను నెమరువేసుకోవడం తప్పు కాకపోయినా అప్పటి పరిస్థితుల గురించి సమతూకంగా ఆలోచిస్తూ విషయాలను ఉన్నవి ఉన్నట్లుగా చూడాలి. లేకపోతే ప్రస్తుతం అనుభవిస్తున్న పరిస్థితులను బట్టి మరింత అసంతృప్తి చెంది, పాత జీవితానికే తిరిగి వెళ్లిపోవాలని మనకు అనిపించవచ్చు.—2 పేతురు 2:20-22 చదవండి.

ఒకప్పుడు చేసిన త్యాగాలు

11. ఒకప్పుడు చేసిన త్యాగాల గురించి కొంతమంది ఎలా ఆలోచిస్తారు?

11 విచారకరంగా, కొంతమంది గతంలో తాము చేసిన త్యాగాలను గుర్తుచేసుకుంటూ అనవసరంగా మంచి అవకాశాల్ని పోగొట్టుకున్నామని బాధపడుతూవుంటారు. పెద్ద పెద్ద చదువులు, సమాజంలో పేరు ప్రఖ్యాతులు, ఆర్థిక భద్రత వంటివి సంపాదించుకొనే అవకాశాలు మీకు వచ్చినా మీరు వాటిని వదులుకొని ఉండవచ్చు. మన సహోదర సహోదరీల్లో చాలామంది వ్యాపారం, వినోదం, విద్య, క్రీడా వంటి రంగాల్లో ఉన్నత స్థానాలను వదులుకున్నారు. అలా కొంతకాలం గడిచిపోయింది అయినా అంతం రాలేదు. ఆ త్యాగాలు చేసివుండకపోతే జీవితం ఎంత బాగుండేదోనని ఊహాలోకాల్లో విహరిస్తుంటారా?

12. తాను చేసిన త్యాగాల గురించి పౌలు ఎలా భావించాడు?

12 అపొస్తలుడైన పౌలు, క్రీస్తును అనుసరించడానికి చాలా త్యాగాలు చేశాడు. (ఫిలి. 3:4-6) ఆయన చేసిన త్యాగాల గురించి ఎలా భావించాడు? ఆయన ఇలా చెప్పాడు, “ఏవేవి నాకు లాభకరములై యుండెనో వాటిని క్రీస్తునిమిత్తము నష్టముగా ఎంచుకొంటిని.” ఎందుకలా? ఆయన ఇంకా ఇలా చెబుతున్నాడు, “నిశ్చయముగా నా ప్రభువైన యేసుక్రీస్తునుగూర్చిన అతి శ్రేష్ఠమైన జ్ఞానము నిమిత్తమై సమస్తమును నష్టముగా ఎంచుకొనుచున్నాను.” a (ఫిలి. 3:7, 8) చెత్త బయట పారవేసిన తర్వాత అలా చేసినందుకు బాధపడం, అలాగే పౌలు కూడా ఈ లోకంలో తనకు వచ్చిన అవకాశాల్ని వదులుకున్నందుకు బాధపడలేదు. అలా వదులుకున్న తర్వాత అవి చాలా ప్రాముఖ్యమైనవని ఆయన అస్సలు అనుకోలేదు.

13, 14. పౌలు మాదిరిని మనమెలా అనుకరించవచ్చు?

13 గతంలో వదులుకున్న అవకాశాల గురించి మనం ఆలోచిస్తుంటే ఏమి చేయాలి? పౌలు మాదిరిని అనుకరించాలి. ఎలా? ప్రస్తుతం మీకున్న ఆశీర్వాదాలు ఎంత అమూల్యమైనవో ఆలోచించండి. యెహోవాతో అమూల్యమైన సంబంధాన్ని సంపాదించుకున్నారు, ఆయన దృష్టిలో మీరు నమ్మకస్థులని నిరూపించుకున్నారు. (హెబ్రీ. 6:10) మనం ప్రస్తుతం అనుభవిస్తున్న, భవిష్యత్తులో అనుభవించనైయున్న ఆధ్యాత్మిక ఆశీర్వాదాలతో పోలిస్తే ఈ లోకమిచ్చే విలువైన వస్తుసంపదలేవీ సాటిరావు.—మార్కు 10:28-30 చదవండి.

14 నమ్మకంగా ముందుకు సాగడానికి మనకు సహాయం చేసే వాటి గురించి పౌలు ఆ తర్వాత ప్రస్తావించాడు. ‘వెనుక ఉన్నవి మరచి ముందున్న వాటికొరకై వేగిరపడుతున్నాను’ అని ఆయన అన్నాడు. (ఫిలి. 3:13) ఇక్కడ ప్రాముఖ్యమైన రెండు అంశాల గురించి పౌలు మాట్లాడాడు. మొదటిది, వదిలేసిన వాటి గురించి అతిగా ఆలోచిస్తూ విలువైన సమయాన్ని, శక్తిని వృథా చేయకుండా వాటిని మర్చిపోవాలి. రెండవది, పరుగుపందెంలో లక్ష్యానికి దగ్గర్లో ఉన్నవాళ్లలా మనం ముందున్న వాటి కోసమే వేగిరపడుతూ వాటివైపే సాగాలి.

15. దేవుని నమ్మకమైన సేవకుల ఉదాహరణలను ధ్యానిస్తే మనం ఏ ప్రయోజనం పొందుతాం?

15 పూర్వకాలాల్లోని, మన కాలంలోని దేవుని నమ్మకమైన సేవకుల ఉదాహరణలను మనం ధ్యానిస్తే, వెనకున్న వాటివైపు చూడకుండా, ముందుకే సాగడానికి మరింత ప్రోత్సాహాన్ని పొందవచ్చు. ఉదాహరణకు అబ్రాహాము, శారా ఊరు పట్టణం గురించే ఆలోచిస్తూ ఉంటే “అక్కడికి తిరిగి వెళ్ళే అవకాశం వారికి దొరికి ఉండేది.” (హెబ్రీ. 11:13-15, పవిత్ర గ్రంథం వ్యాఖ్యాన సహితం) కానీ వాళ్లు అలా తిరిగి వెళ్లలేదు. మోషే ఐగుప్తును మొదటిసారి విడిచి వెళ్లిపోయినప్పుడు వదులుకున్నవాటితో పోలిస్తే, ఆ తర్వాత ఇశ్రాయేలీయులు ఆ దేశాన్ని విడిచి వెళ్లేటప్పుడు వదులుకున్నవి చాలా తక్కువ. అయినా ఆయన వాటిని తిరిగి పొందాలని ఆశపడినట్లు బైబిల్లో ఎక్కడా లేదు. కానీ ఆయన “ఐగుప్తు ధనముకంటె క్రీస్తువిషయమైన నింద గొప్ప భాగ్యమని యెంచుకొని . . . ప్రతిఫలముగా కలుగబోవు బహుమానమందు దృష్టి యుంచెను” అని బైబిల్లో ఉంది.—హెబ్రీ. 11:24-26.

గతంలోని చేదు అనుభవాలు

16. గతంలోని అనుభవాలు మనమీద ఎలాంటి ప్రభావం చూపించవచ్చు?

16 గతంలో మనకు కొన్ని చేదు అనుభవాలు ఎదురైవుండవచ్చు. మనం చేసిన తప్పులు, పొరపాట్ల గురించిన ఆలోచనలతో మనం కృంగిపోతుండవచ్చు. (కీర్త. 51:3) ఎవరైనా మనల్ని గట్టిగా మందలించినందుకు మనం ఇప్పటికీ బాధపడుతుండవచ్చు. (హెబ్రీ. 12:11) అన్యాయం జరిగిందని అనిపించినా లేదా నిజంగానే జరిగినా మనం దాని గురించే ఎక్కువగా ఆలోచిస్తుండవచ్చు. (కీర్త. 55:2) అలాంటి జ్ఞాపకాల వల్ల, వదిలేసి వచ్చిన వాటి మీదికి మన ఆలోచన తిరిగి మళ్లకుండా ఉండాలంటే మనం ఏమి చేయవచ్చు? మూడు ఉదాహరణలు పరిశీలించండి.

17. (ఎ) పౌలు “పరిశుద్ధులందరిలో అత్యల్పుడను” అని ఎందుకన్నాడు? (బి) బాధపెట్టే ఆలోచనల వల్ల కృంగిపోకుండా ఉండేందుకు పౌలు ఏమి చేశాడు?

17 గతంలో చేసిన పొరపాట్లు: అపొస్తలుడైన పౌలు తన గురించి చెప్పుకుంటూ “పరిశుద్ధులందరిలో అత్యల్పుడను” అన్నాడు. (ఎఫె. 3:8-11) ఆయన ఎందుకలా అన్నాడు? “దేవుని సంఘమును హింసించినందుకు” అని ఆయన చెప్పాడు. (1 కొరిం. 15:9) గతంలో తాను హింసించినవాళ్లను తిరిగి కలిసినప్పుడు పౌలుకు ఎలా అనిపించివుంటుందో ఒక్కసారి ఆలోచించండి. బాధపెట్టే అలాంటి ఆలోచనల వల్ల పౌలు కృంగిపోలేదు, బదులుగా దేవుడు తనపట్ల చూపించిన కృప గురించే ఆయన ఎక్కువగా ఆలోచించాడు. (1 తిమో. 1:12-16) దానివల్ల ఆయన, కృతజ్ఞతతో పరిచర్యను ఇంకా ఎక్కువగా చేయగలిగాడు. వదులుకున్న వాటిని మర్చిపోవాలని పౌలు నిశ్చయించుకున్నప్పుడు తన తప్పుడు ప్రవర్తనను కూడా మర్చిపోవాలని ఆయన కోరుకున్నాడు. మనం కూడా యెహోవా మనపై చూపిన కృప గురించే ఎక్కువగా ఆలోచిస్తే, మన చేయిదాటి పోయిన గతం గురించి అనవసరంగా ఆందోళనపడము, బలహీనులం కాము. కానీ ప్రస్తుతం చేయాల్సిన పనికోసం మన శక్తిని ఉపయోగిస్తాం.

18. (ఎ) ఎవరైనా మనల్ని గట్టిగా మందలించినందుకు మనకు కోపం వస్తే ఏమి జరగవచ్చు? (బి) సలహాను స్వీకరించాలని సొలొమోను చెప్పిన మాటల్ని మనమెలా పాటించవచ్చు?

18 బాధపెట్టిన మందలింపు: మనల్ని గట్టిగా మందలించినందుకు మనసులో కోపం ఉంచుకుంటే మనకు బాధ కలగడమే కాక నిరుత్సాహపడి, సలహా ఇచ్చిన వ్యక్తిని ‘విసుక్కుంటాం.’ (హెబ్రీ. 12:5) మనం సలహా వినకుండా ‘తృణీకరించినా,’ ఒకవేళ విని దాన్ని పాటించడానికి ‘విసుక్కున్నా’ మనం ఆ సలహా నుండి ప్రయోజనం పొందలేం, మనల్ని మనం సరిచేసుకోలేం. “ఉపదేశమును విడిచిపెట్టక దాని గట్టిగా పట్టుకొనుము. అది నీకు జీవము గనుక దాని పొందియుండుము” అని సొలొమోను చెప్పిన మాటల్ని పాటించడం ఎంత మంచిదో కదా! (సామె. 4:13) డ్రైవర్లు వాహనం నడుపుతున్నప్పుడు సైన్‌బోర్డుల మీదుండే సూచనలకు లోబడి ముందుకు సాగినట్లే, మనం కూడా సలహాను స్వీకరించి, దాన్ని పాటిస్తూ ముందుకు సాగిపోవాలి.—సామె. 4:26, 27; హెబ్రీయులు 12:12, 13 చదవండి.

19. హబక్కూకు, యిర్మీయాల విశ్వాసాన్ని మనం ఎలా అనుకరించవచ్చు?

19 అన్యాయం జరిగిందని అనిపించినా లేదా నిజంగానే జరిగినా: యెహోవా అన్యాయం జరగడానికి ఎందుకు అనుమతిస్తున్నాడో అర్థంకాక న్యాయం కోసం ఆయనను అర్థించిన ప్రవక్తయైన హబక్కూకులానే కొన్నిసార్లు మనమూ బాధపడవచ్చు. (హబ. 1:2, 3) అయితే ఆ ప్రవక్త చూపించిన విశ్వాసాన్ని మనం కూడా చూపించడం చాలా ప్రాముఖ్యం. ఆయన ఇలా అన్నాడు, “నేను యెహోవాయందు ఆనందించెదను. నా రక్షణకర్తయైన నా దేవునియందు నేను సంతోషించెదను.” (హబ. 3:18) పూర్వకాలంలో యిర్మీయా చేసినట్లే, న్యాయవంతుడైన యెహోవా దేవునిపై పూర్తి విశ్వాసంతో, ‘ఆశగా’ ఎదురు చూస్తే, తగిన సమయంలో ఆయన అన్నిటినీ సరిచేస్తాడనే నమ్మకంతో ఉండవచ్చు.—విలా. 3:19-24.

20. “లోతు భార్యను జ్ఞాపకము” ఉంచుకున్నామని ఎలా నిరూపించుకోవచ్చు?

20 మనం పెను మార్పులు జరిగే కాలంలో జీవిస్తున్నాం. ఇప్పుడు ఎన్నో అద్భుతమైన సంఘటనలు జరుగుతున్నాయి, భవిష్యత్తులో మరెన్నో జరుగుతాయి. మనలో ప్రతీ ఒక్కరం యెహోవా సంస్థతో కలిసి నడుద్దాం. వదులుకున్న వాటి గురించి ఆలోచించకుండా ముందుకు సాగమనే లేఖన సలహాను పాటిద్దాం. అలా చేస్తే, “లోతు భార్యను జ్ఞాపకము” ఉంచుకున్నామని నిరూపించుకుంటాం!

[అధస్సూచి]

a ఈ వచనంలో “నష్టము” అని అనువదించబడిన మూలపదానికి “కుక్కలకు వేసినది,” “పేడ,” “మలం” వంటి అర్థాలు కూడా ఉన్నాయి. పౌలు ఉపయోగించిన ఆ పదం, “ఎందుకూ పనికిరాని వాటికి దూరంగా ఉండాలనే దృఢ సంకల్పంతో ఉండడాన్ని, ఇకమీదట అవసరం లేనివాటిని అసహ్యించుకోవడాన్ని” సూచిస్తుందని ఒక బైబిలు పండితుడు అన్నాడు.

[అధ్యయన ప్రశ్నలు]