కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

జీవిత కథ

‘ఒక యూదుని చెంగు పట్టుకొని’ డెబ్బై ఏళ్లు గడిపాను

‘ఒక యూదుని చెంగు పట్టుకొని’ డెబ్బై ఏళ్లు గడిపాను

లెన్నర్డ్‌ స్మిత్‌ చెప్పినది

టీనేజీలో ఉన్నప్పుడు రెండు బైబిలు లేఖనాలు నన్ను ఆకట్టుకున్నాయి. ఇప్పుడు దాదాపు 70 కన్నా ఎక్కువ సంవత్సరాలు గడిచాక, జెకర్యా 8:23 ను నేను మొదటిసారిగా అర్థం చేసుకున్న సమయం నాకింకా గుర్తుంది. ఆ లేఖనంలో ఇలా ఉంది, ‘పదేసిమంది ఒక యూదుని చెంగు పట్టుకొని—దేవుడు మీకు తోడుగా ఉన్నాడను సంగతి మాకు వినబడినది గనుక మేము మీతోకూడ వత్తుమని చెప్పుదురు.’

ఆ లేఖనంలోని యూదుడు అభిషిక్త క్రైస్తవులను సూచిస్తున్నాడు, “పదేసిమంది” ‘వేరే గొర్రెలను’ సూచిస్తున్నారు. అప్పట్లో వేరేగొర్రెలకు ‘యెహోనాదాబులు’ అనే పేరు కూడా ఉండేది. a (యోహా. 10:16) నేను ఆ సత్యాన్ని గ్రహించినప్పుడు, అభిషిక్త తరగతికి నమ్మకంగా మద్దతు ఇస్తేనే భూమ్మీద నిరంతరం జీవించాలన్న నా నిరీక్షణ నిజమౌతుందని నాకు అర్థమైంది.

మత్తయి 25:31-46 లో ఉన్న, ‘గొర్రెలు, మేకల’ గురించి యేసు చెప్పిన ఉపమానం కూడా నన్ను ఎంతగానో ఆకట్టుకుంది. ఇంకా భూమ్మీద మిగిలివున్న అభిషిక్త క్రైస్తవులకు మంచి చేసినందువల్ల అంత్యకాలమున దేవుని నుండి అనుకూలమైన తీర్పు పొందేవాళ్లే ఆ ఉపమానంలోని ‘గొర్రెలు.’ చిన్న యెహోనాదాబుగా నేను నా మనసులో ఇలా అనుకున్నాను, ‘లెన్‌, క్రీస్తు నిన్ను ఒక గొర్రెగా ఎంచాలంటే, ఆయన అభిషిక్త సహోదరులకు నువ్వు మద్దతు ఇవ్వాలి. దేవుడు వాళ్లకు తోడుగా ఉన్నాడు కాబట్టి నువ్వు వాళ్ల నాయకత్వాన్ని అంగీకరించాలి.’ ఆ అవగాహన ఏడు దశాబ్దాల కన్నా ఎక్కువ కాలంపాటు నన్ను నడిపించింది.

‘దేవుని సంస్థలో నా స్థానం ఏమిటి?’

మా అమ్మ బెతెల్‌కు దగ్గర్లో ఉన్న ఒక హాల్‌లో 1925లో బాప్తిస్మం తీసుకుంది. అప్పట్లో ఆ హాల్‌ను లండన్‌ టాబర్నాకల్‌ అని పిలిచేవాళ్లు. ఆ ప్రాంతంలోని సహోదరులు కూటాలు జరుపుకోవడానికి ఆ హాల్‌ను ఉపయోగించుకునేవాళ్లు. నేను 1926 అక్టోబరు 15న పుట్టాను. 1940 మార్చిలో ఇంగ్లాండ్‌ తీరాన ఉన్న డోవర్‌లో జరిగిన ఒక సమావేశంలో బాప్తిస్మం తీసుకున్నాను. నాకు చిన్నప్పటి నుండే బైబిలు సత్యాలంటే ఎంతో ఇష్టం. మా అమ్మ అభిషిక్తురాలు కాబట్టి, ఒక విధంగా చెప్పాలంటే నేను మొదటిగా పట్టుకున్న ‘యూదుని చెంగు’ అమ్మదే. అప్పటికి మా నాన్న, మా అక్క యెహోవా సేవకులు కాలేదు. అప్పట్లో మేము ఆగ్నేయ ఇంగ్లండ్‌లో ఉన్న గిల్లింగ్‌హమ్‌ సంఘ సభ్యులుగా ఉండేవాళ్లం. ఆ సంఘంలో ఎక్కువశాతం అభిషిక్త క్రైస్తవులే ఉండేవాళ్లు. మా అమ్మ ఎంతో ఉత్సాహంగా ప్రకటనాపని చేసేది, ఆమె నాకు చక్కని ఆదర్శం.

1941 సెప్టెంబరులో లీసెస్టర్‌ నగరంలో జరిగిన ఒక జిల్లా సమావేశంలో, “యథార్థత” అనే అంశంతో ఒక ప్రసంగం ఇవ్వబడింది, అందులో విశ్వ సర్వాధిపత్యపు అంశం గురించి వివరించారు. ఆ ప్రసంగం విన్న తర్వాతే యెహోవాకు, సాతానుకు మధ్య తలెత్తిన ఒక వివాదాంశంలో మనమూ భాగంగా ఉన్నామని నేను మొట్టమొదటిసారిగా గ్రహించాను. ఆ వివాదాంశంలో మనమూ భాగంగా ఉన్నాం కాబట్టి, యెహోవా పక్షాన స్థిరంగా నిలబడి, విశ్వ సర్వాధిపతియైన యెహోవా పట్ల మనం ఎల్లప్పుడూ యథార్థంగా ఉండాలి.

ఆ జిల్లా సమావేశంలో, పయినీరు సేవ గురించే ఎక్కువగా నొక్కి చెప్పారు, పయినీరు సేవను లక్ష్యంగా చేసుకోమని యౌవనస్థులను ప్రోత్సహించారు. “యెహోవా సంస్థలో పయినీర్ల స్థానం” అనే ప్రసంగం విన్నప్పుడు, ‘యెహోవా సంస్థలో నా స్థానం ఏమిటి?’ అని నేను ఆలోచించాను. ఆ సమావేశం తర్వాత, యెహోనాదాబుగా ప్రకటనాపనిలో నా సామర్థ్యాన్నంతా ఉపయోగించి అభిషిక్త తరగతికి మద్దతు ఇవ్వాల్సిన బాధ్యత నాపై ఉందని బలంగా అనిపించింది. లీసెస్టర్‌లో ఉండగానే నేను పయినీరు సేవకోసం దరఖాస్తు పెట్టుకున్నాను.

యుద్ధం జరుగుతున్న రోజుల్లో పయినీరు సేవ

నేను 15 ఏళ్ల వయసులో 1941 డిసెంబరు 1న ప్రత్యేక పయినీరుగా సేవచేసే నియామకాన్ని పొందాను. మొదట్లో అమ్మ, నేను కలిసి పయినీరు సేవ చేసేవాళ్లం. దాదాపు ఒక సంవత్సరం అలా గడిచాక, తన ఆరోగ్య పరిస్థితిని బట్టి అమ్మ పయినీరు సేవను ఆపేయాల్సి వచ్చింది. అప్పుడు రాన్‌ పార్కన్‌ అనే మరో సహోదరునితో కలిసి పయినీరు సేవచేసే నియామకాన్ని లండన్‌ బ్రాంచి కార్యాలయం నాకు ఇచ్చింది. ఆ సహోదరుడు ప్రస్తుతం ప్యూర్టోరికోలో బ్రాంచి కమిటీ సభ్యునిగా సేవచేస్తున్నాడు.

మమ్మల్ని మొదటిగా కెంట్‌ కౌంటీలో ఉన్న బ్రాడ్‌స్టార్జ్‌, రామ్స్‌గేట్‌ అనే తీరపట్టణాలకు పంపించారు. అక్కడ మేము ఒక గది అద్దెకు తీసుకున్నాం. అప్పట్లో ప్రత్యేక పయినీర్ల ఖర్చుల కోసం నెలకు 40 షిల్లింగ్స్‌ (ఇప్పటి లెక్కల ప్రకారం దాదాపు 416 రూపాయలు) ఇచ్చేవాళ్లు. అద్దె డబ్బులు పోగా మాకు వేరే ఖర్చుల కోసం చేతిలో డబ్బు అంతగా ఉండేది కాదు, కొన్నిసార్లు మరో పూట కోసం భోజనం ఎక్కడ నుండి వస్తుందో అనుకునేవాళ్లం. కానీ, ఏదో ఒక విధంగా యెహోవా ఎప్పుడూ మా అవసరాలు తీర్చేవాడు.

ఉత్తర సముద్రం వైపు నుండి వీచే బలమైన గాలులకు ఎదురీదుతూ ఎన్నో వస్తువులతో భారంగా ఉన్న మా సైకిళ్లను చాలా కష్టపడి తొక్కేవాళ్లం. అప్పుడు మరో సమస్య కూడా ఉండేది. లండన్‌పై బాంబు దాడి చేయడానికి వెళ్లే సైనిక విమానాలు, జర్మన్‌ V-1 మిస్త్సెల్స్‌ కెంట్‌ కౌంటీలో చాలా కింద నుండి వెళ్లేవి. ఒకసారైతే ఒక బాంబు నా తల మీదుగా దూసుకెళ్లినప్పుడు నేను నా సైకిల్‌ను వదిలేసి ఒక గుంటలోకి దూకాల్సి వచ్చింది, ఆ బాంబు దగ్గర్లోని ఒక పొలంలో పడి పేలింది. అలాంటి పరిస్థితులు ఉన్నా, మేము కెంట్‌ కౌంటీలో పయినీరు సేవ చేసిన సంవత్సరాలు చాలా సంతోషంగా గడిచాయి.

నేను ‘బెతెల్‌ బాయ్‌’ అయ్యాను

మా అమ్మ ఎప్పుడూ బెతెల్‌ గురించి ఎంతో మెప్పుకోలుగా మాట్లాడేది. “నువ్వు బెతెల్‌ బాయ్‌ అవడం కన్నా నాకు కావాల్సింది ఇంకేమీ లేదు” అని ఆమె అంటుండేది. 1946 జనవరిలో మూడు వారాల పాటు ఒక పనికోసం లండన్‌ బెతెల్‌కు నన్ను ఆహ్వానించినప్పుడు నేను ఆనందాశ్చర్యాలకు లోనయ్యాను. ఆ మూడు వారాలు గడిచాక, బ్రాంచి సేవకునిగా సేవచేస్తున్న ప్రైస్‌ హ్యూస్‌ అనే సహోదరుడు నన్ను బెతెల్‌లోనే ఉండమని అడిగాడు. అక్కడ నేను పొందిన శిక్షణ నా జీవితమంతా ఉపయోగపడింది.

అప్పట్లో లండన్‌ బెతెల్‌లో 30 మందే ఉండేవాళ్లు. వాళ్లలో చాలామంది పెళ్లికాని యువకులే. ప్రైస్‌ హ్యూస్‌, ఎడ్గర్‌ క్లే, జాక్‌ (జాన్‌) బార్‌ వంటి కొంతమంది అభిషిక్త సహోదరులు కూడా అక్కడ ఉండేవాళ్లు. సహోదరుడు జాన్‌ బార్‌ ఆ తర్వాత పరిపాలక సభ సభ్యునిగా సేవచేశాడు. యువకుడినైన నేను అలాంటి “స్తంభములుగా” ఉన్న క్రీస్తు సహోదరుల ఆధ్యాత్మిక పర్యవేక్షణలో ఉంటూ వాళ్లకు మద్దతు ఇవ్వగలగడం నాకు లభించిన గొప్ప అవకాశం.—గల. 2:8, 9.

ఒకరోజు, ఎవరో నన్ను కలవడానికి వచ్చారని ఒక సహోదరుడు నాకు చెప్పాడు. వచ్చింది ఎవరో కాదు మా అమ్మే! ఆమె నా కోసం ఒక కవరులో ఏదో తీసుకొచ్చింది. తాను లోపలికి వస్తే నా పనికి అంతరాయం కలుగుతుందని ఆమె లోపలికి రాకుండా ఆ కవరు నాకు ఇచ్చేసి వెళ్లిపోయింది. ఆ కవరులో ఒక ఉలెన్‌ కోటు ఉంది. దాన్ని చూసిన వెంటనే, ఆలయ గుడారంలో సేవచేస్తున్న బాలుడైన సమూయేలు కోసం వాళ్లమ్మ హన్నా ఒక అంగీ తీసుకెళ్లిన సందర్భం నాకు గుర్తుకువచ్చింది.—1 సమూ. 2:18, 19.

గిలియడ్‌ పాఠశాల—మర్చిపోలేని అనుభవం

1947లో, నాతోపాటు బెతెల్‌లో సేవచేస్తున్న మరో నలుగురు సహోదరులకు అమెరికాలో జరిగే గిలియడ్‌ పాఠశాలకు రమ్మని ఆహ్వానం అందింది. ఆ తర్వాతి సంవత్సరం మేము 11వ తరగతికి హాజరయ్యాం. మేము గిలియడ్‌ పాఠశాల కోసం న్యూయార్క్‌కు వెళ్లేసరికి అక్కడ చాలా చలిగా ఉంది. మా అమ్మ ఇచ్చిన ఉలెన్‌ కోటు అక్కడ ఉపయోగపడినందుకు నేనెంతో సంతోషించాను.

గిలియడ్‌ పాఠశాలలో గడిపిన ఆరు నెలల్ని నేను ఎప్పటికీ మర్చిపోలేను. 16 దేశాల నుండి వచ్చిన తోటి విద్యార్థులతో కలిసి గడపడం వల్ల నా ఆలోచనాతీరు మెరుగైంది. గిలియడ్‌ పాఠశాలలో దొరికిన ఆధ్యాత్మిక ఉపదేశాల నుండే కాక పరిణతి గల సహోదరుల సహవాసం నుండి కూడా ప్రయోజనం పొందాను. నా తోటి విద్యార్థుల్లో సహోదరుడు లాయిడ్‌ బ్యారీ కూడా ఉన్నాడు. ఉపదేశకుల్లో సహోదరుడు ఆల్బర్ట్‌ ష్రోడర్‌ ఉన్నాడు, అప్పుడు సహోదరుడు జాన్‌ బూత్‌ కింగ్‌డమ్‌ ఫార్మ్‌ (గిలియడ్‌ పాఠశాల జరిగే స్థలం) పర్యవేక్షకుడిగా ఉన్నాడు. వాళ్లంతా ఆ తర్వాత పరిపాలక సభ సభ్యులయ్యారు. ఆ సహోదరులు ప్రేమతో ఇచ్చిన సలహాలనూ యెహోవాకు, ఆయన సంస్థకు నమ్మకంగా ఉండే విషయంలో వాళ్ల మాదిరినీ నేను ఎంతో విలువైనవిగా ఎంచుతాను.

ప్రాంతీయ పర్యవేక్షకుడిగా సేవ చేశాను ఆ తర్వాత బెతెల్‌కు తిరిగి వెళ్లాను

గిలియడ్‌ పాఠశాల ముగిసిన తర్వాత అమెరికాలో ఉన్న ఓహియో రాష్ట్రంలో నన్ను ప్రాంతీయ పర్యవేక్షకుడిగా నియమించారు. అప్పటికి నా వయసు కేవలం 21, కానీ యువకునిగా నాలో ఉన్న ఉత్సాహాన్ని సహోదరులు ఆప్యాయంగా స్వాగతించారు. నేను అక్కడ సేవ చేస్తున్నప్పుడు అనుభవంగల సహోదరుల నుండి ఎంతో నేర్చుకున్నాను.

కొన్ని నెలల తర్వాత, నాకు మరింత శిక్షణ ఇచ్చేందుకు నన్ను బ్రూక్లిన్‌ బెతెల్‌కు మళ్లీ ఆహ్వానించారు. ఆ సమయంలో, స్తంభాలుగావున్న మిల్టన్‌ హెన్షల్‌, కార్ల్‌ క్లేన్‌, నేథన్‌ నార్‌, టీ. జే. (బడ్‌) సల్లీవన్‌, లైమన్‌ స్వింగిల్‌ వంటి సహోదరులతో పరిచయం ఏర్పడింది. వాళ్లంతా పరిపాలక సభ సభ్యులుగా సేవ చేశారు. వాళ్ల పనిని, వాళ్ల క్రైస్తవ విధానాల్ని గమనించడం మంచి అనుభూతిని ఇచ్చింది. యెహోవా సంస్థపై నా నమ్మకం వంద రెట్లు పెరిగింది. నా పరిచర్యను కొనసాగించడానికి నన్ను మళ్లీ యూరప్‌కు పంపించారు.

1950 ఫిబ్రవరిలో మా అమ్మ చనిపోయింది. అంత్యక్రియలు అయిపోయిన తర్వాత మా నాన్నతో, మా అక్క డోరాతో నిర్మొహమాటంగా మాట్లాడాను. అమ్మ ఇక లేదు, నేనేమో వేరే చోట ఉంటున్నాను కాబట్టి, ‘బైబిలు సత్యం విషయంలో మీరేమి చేయాలనుకుంటున్నారు?’ అని వాళ్లను అడిగాను. వాళ్లకు హ్యారీ బ్రౌనింగ్‌ అనే వృద్ధ అభిషిక్త సహోదరుడు తెలుసు, ఆయనంటే వాళ్లకు గౌరవం కాబట్టి ఆయన దగ్గర సత్యం నేర్చుకోవడానికి వాళ్లు ఒప్పుకున్నారు. ఒక సంవత్సరం తిరిగేలోపే మా నాన్న, మా అక్క బాప్తిస్మం తీసుకున్నారు. మా నాన్న ఆ తర్వాత గిల్లింగ్‌హామ్‌ సంఘంలో సేవకునిగా (పరిచర్య సేవకునిగా) నియమించబడ్డాడు. నాన్న చనిపోయిన తర్వాత, మా అక్క రాయ్‌ మార్టన్‌ అనే నమ్మకమైన సంఘ పెద్దను పెళ్లి చేసుకుంది. 2010లో చనిపోయేంతవరకు ఆమె నమ్మకంగా యెహోవా సేవచేసింది.

ఫ్రాన్స్‌లో సేవచేశాను

నేను పబ్లిక్‌ స్కూల్‌లో చదువుకున్నప్పుడు ఫ్రెంచ్‌, జర్మన్‌, లాటిన్‌ భాషలు నేర్చుకున్నాను. కానీ ఫ్రెంచ్‌ భాష మాట్లాడడం నాకు చాలా కష్టంగా ఉండేది. ఫ్రాన్స్‌లోని పారిస్‌ బెతెల్‌లో సేవచేసే నియామకం అందుకున్నప్పుడు సంతోషపడాలో బాధపడాలో అర్థంకాలేదు. అక్కడ బ్రాంచి సేవకునిగా సేవ చేస్తున్న వృద్ధ అభిషిక్త సహోదరుడైన ఏన్రీ జీజేతో కలిసి పనిచేసే అవకాశం నాకు దొరికింది. నాకు దొరికిన నియామకాన్ని నిర్వర్తించడం కొన్నిసార్లు కష్టంగా ఉండేది, నేను ఎన్నో పొరపాట్లు కూడా చేశాను. అయినా, మానవ సంబంధాల గురించి ఎంతో నేర్చుకున్నాను.

దానికి తోడు, యుద్ధం ముగిసిన తర్వాత 1951లో పారిస్‌లో మొట్టమొదటి అంతర్జాతీయ సమావేశం ఏర్పాటు చేసేందుకు నన్ను కూడా నియమించారు. యువ ప్రాంతీయ పర్యవేక్షకుడైన లేయోపాల్‌ జోన్టా అనే సహోదరుడు నాకు సహాయం చేయడానికి బెతెల్‌కు వచ్చాడు. ఆ తర్వాత ఆ సహోదరుడు బ్రాంచి పర్యవేక్షకుడిగా నియమించబడ్డాడు. ఈఫిల్‌ టవర్‌కు దగ్గర్లో పాలే డె స్పార్‌లో అంతర్జాతీయ సమావేశం జరిగింది. ఆ సమావేశానికి 28 దేశాల వాళ్లు వచ్చారు. 6,000 మందిగా ఉన్న ఫ్రెంచి సహోదరులు చివరి రోజున 10,456 మంది హాజరవడాన్ని చూసి ఎంతో సంతోషించారు.

నేను మొదటిసారి ఫ్రాన్స్‌కు చేరుకునే సమయానికి నాకు ఫ్రెంచ్‌ భాష అంతగా రాదు. నేను చేసిన పెద్ద పొరపాటు ఏమిటంటే, నాకు నమ్మకంగా అనిపించిన కొన్ని సందర్భాల్లో మాత్రమే ఫ్రెంచ్‌ భాష మాట్లాడేవాణ్ణి. కానీ మనం పొరపాట్లు చేయకపోతే, మనల్ని ఎవరూ సరిదిద్దరు, అప్పుడు మనం ప్రగతి సాధించలేం.

ఈ సమస్యను పరిష్కరించడానికి విదేశీయులకు ఫ్రెంచ్‌ భాష నేర్పించే ఒక పాఠశాలలో చేరాలని నిర్ణయించుకున్నాను. నేను కూటాలు లేని సాయంత్రాల్లో క్లాసులకు వెళ్లేవాణ్ణి. మెల్లమెల్లగా నాకు ఫ్రెంచ్‌ భాషపై మక్కువ ఏర్పడింది, సంవత్సరాలు గడుస్తుండగా అది ఇంకా పెరిగింది. ఆ భాష నాకు ఎంతగానో ఉపయోగపడింది, ఎందుకంటే నేను దానివల్ల ఫ్రాన్స్‌ బ్రాంచి కార్యాలయంలో అనువాద పనికి సహాయం చేయగలిగాను. కొంతకాలానికి, నేనే అనువాదకుణ్ణి అయిపోయాను. అక్కడ ఇంగ్లీషు నుండి ఫ్రెంచ్‌లోకి అనువదించడం మొదలుపెట్టాను. దాసుని తరగతి సమృద్ధిగా అందిస్తున్న ఆధ్యాత్మిక ఆహారాన్ని ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఫ్రెంచ్‌ సహోదరుల కోసం వాళ్ల భాషలో అందించడం నాకు దొరికిన గొప్ప అవకాశం.—మత్త. 24:45-47.

పెళ్లి, మరితర సేవావకాశాలు

నేను అంతకు ముందు కొన్ని సంవత్సరాల క్రితం స్విట్జర్లాండ్‌కు చెందిన ఎస్తేర్‌ అనే పయినీరును కలిశాను. 1956లో నేను ఆమెను పెళ్లి చేసుకున్నాను. లండన్‌ బెతెల్‌కు దగ్గర్లో ఉన్న రాజ్యమందిరంలో (మా అమ్మ బాప్తిస్మం తీసుకున్న లండన్‌ టాబర్నాకల్‌లో) మా పెళ్లి జరిగింది. మా పెళ్లి ప్రసంగాన్ని సహోదరుడు హ్యూస్‌ ఇచ్చాడు. మా పెళ్లప్పుడు అక్కడే ఉన్న ఎస్తేర్‌ వాళ్లమ్మ కూడా అభిషిక్తురాలే. పెళ్లి చేసుకోవడం వల్ల నాకు ప్రేమగల, నమ్మకస్థురాలైన భార్య దొరికింది. అంతేకాదు, మంచి ఆధ్యాత్మిక దృక్కోణం గల మా అత్తగారితో ఎన్నో గంటలపాటు సహవసించే అవకాశం కూడా దొరికింది. ఆమె 2000వ సంవత్సరంలో తన భూజీవితాన్ని చాలించింది.

మా పెళ్లి తర్వాత నేను, ఎస్తేర్‌ బెతెల్‌ నుండి వచ్చేశాం. నేను బయటే ఉండి బెతెల్‌ అనువాదకుడిగా పని చేసేవాణ్ణి, ఎస్తేర్‌ ఆ సమయంలో పారిస్‌ నగర శివార్లలో ప్రత్యేక పయినీరుగా సేవ చేసేది. ఆమె చాలామందికి యెహోవా సేవకులుగా మారడానికి సహాయం చేసింది. 1964లో మళ్లీ బెతెల్‌లో సేవ చేసేందుకు మాకు ఆహ్వానం వచ్చింది. ఆ తర్వాత 1976లో బ్రాంచి కమిటీలను ఏర్పాటు చేసే పద్ధతి ప్రవేశపెట్టబడినప్పుడు నన్ను ఆ కమిటీలో ఒక సభ్యునిగా నియమించారు. ఎన్నో సంవత్సరాలుగా, ఎస్తేర్‌ నాకు ప్రేమపూర్వకంగా మద్దతిస్తోంది.

“నేనెల్లప్పుడు మీతోకూడ ఉండను”

అప్పుడప్పుడు న్యూయార్క్‌లోని ప్రపంచ ప్రధాన కార్యాలయానికి వెళ్లే చక్కని అవకాశం నాకు దొరికింది. అలా సందర్శించిన ప్రతీసారి పరిపాలక సభలోని వివిధ సహోదరులు నాకు మంచి సలహాలు ఇస్తుండేవాళ్లు. ఉదాహరణకు, ఒకసారి నేను ఒక పనిని సమయానికి ముగించగలనో లేదో అని కంగారుపడుతుంటే సహోదరుడు నార్‌ చిరునవ్వు చిందించి, “ఆందోళనపడకు, పనిచేస్తూ ఉండు” అన్నాడు. అప్పటి నుండి, చేయాల్సిన పనులు ఎన్నో ఉన్నప్పుడల్లా నేను భయపడే బదులు ఒకదాని తర్వాత ఒకటి చేసుకుంటూ వెళ్తాను, అంతే పనులన్నీ సాధారణంగా సమయానికే అయిపోతాయి.

మరణానికి కొన్నిరోజుల ముందు యేసు తన శిష్యులతో ఇలా అన్నాడు, “నేనెల్లప్పుడు మీతోకూడ ఉండను.” (మత్త. 26:11) వేరేగొర్రెలమైన మనకు కూడా, క్రీస్తు అభిషిక్త సహోదరులు ఈ భూమ్మీద ఎల్లప్పుడూ ఉండరని తెలుసు. కాబట్టి, 70 కన్నా ఎక్కువ సంవత్సరాల పాటు ఎంతోమంది అభిషిక్తులతో చాలా సన్నిహితంగా కలిసి పనిచేయడం నాకు దొరికిన అత్యంత గొప్ప అవకాశంగా భావిస్తున్నాను. కృతజ్ఞతతో నేను ఇప్పటికీ ‘ఒక యూదుని చెంగు పట్టుకొనే’ ఉన్నాను.

[అధస్సూచి]

a “యెహోనాదాబు” అనే పదం గురించి తెలుసుకోవడానికి యెహోవాసాక్షులు—దేవుని రాజ్య ప్రచారకులు (ఆంగ్లం) అనే పుస్తకంలోని 83, 165, 166 పేజీలు, కావలికోట జనవరి 1, 1998 సంచికలోని 13వ పేజీలో ఉన్న 5, 6 పేరాలు చదవండి.

[21వ పేజీలోని బ్లర్బ్‌]

సహోదరుడు నార్‌ చిరునవ్వు చిందించి, “ఆందోళనపడకు, పనిచేస్తూ ఉండు” అన్నాడు

[19వ పేజీలోని చిత్రాలు]

(ఎడమ వైపున) మా అమ్మానాన్నలు

(కుడి వైపున) మా అమ్మ ఇచ్చిన ఉలెన్‌ కోటు వేసుకొని, 1948లో గిలియడ్‌ పాఠశాల ప్రాంగణంలో

[20వ పేజీలోని చిత్రం]

1997లో ఫ్రాన్స్‌ బ్రాంచి కార్యాలయ ప్రతిష్ఠాపన కార్యక్రమంలో సహోదరుడు లాయిడ్‌ బ్యారీ ప్రసంగాన్ని అనువదిస్తూ

[21వ పేజీలోని చిత్రాలు]

(ఎడమ వైపున) ఎస్తేర్‌తో, మా పెళ్లి రోజున

(కుడి వైపున) ఇద్దరం కలిసి పరిచర్య చేస్తూ