కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

తన ప్రజల్ని ఎలా తప్పించాలో యెహోవాకు తెలుసు

తన ప్రజల్ని ఎలా తప్పించాలో యెహోవాకు తెలుసు

తన ప్రజల్ని ఎలా తప్పించాలో యెహోవాకు తెలుసు

“భక్తులను శోధనలోనుండి తప్పించుటకు . . . ప్రభువు [‘యెహోవా,’ NW] సమర్థుడు.”—2 పేతు. 2:9, 10.

వీటి గురించి ఆలోచించండి:

తన ఉద్దేశాలు నెరవేరే దిశగా ఎప్పుడేమి జరుగుతుందో యెహోవాకు తెలుసనే నమ్మకాన్ని మనం ఎందుకు కలిగివుండవచ్చు?

యెహోవా తన ప్రజల తరఫున తన శక్తిని ఉపయోగిస్తాడనే నమ్మకాన్ని మనం ఎందుకు కలిగివుండవచ్చు?

మహాశ్రమల కాలంలో ఎలాంటి సంఘటనలు చోటుచేసుకుంటాయో యెహోవాకు తెలుసనే నమ్మకాన్ని మనం ఎందుకు కలిగివుండవచ్చు?

1. మహాశ్రమలు వచ్చినప్పుడు ఎలాంటి పరిస్థితి ఉంటుంది?

 ఎవ్వరూ ఊహించని సమయంలో హఠాత్తుగా సాతాను వ్యవస్థ మీదికి నాశనం వస్తుంది. (1 థెస్స. 5:2, 3) “యెహోవా మహా దినము” వచ్చినప్పుడు లోకమంతా అయోమయంలో పడుతుంది. (జెఫ. 1:14-17) అప్పుడు ఎన్ని కష్టాలూ శ్రమలూ ఉంటాయంటే, ఆ పరిస్థితి గురించి మాట్లాడుతూ “లోకారంభము నుండి ఇప్పటివరకును అట్టి శ్రమ కలుగలేదు” అని బైబిలు చెబుతోంది.—మత్తయి 24:21, 22 చదవండి.

2, 3. (ఎ) మహాశ్రమల సమయంలో దేవుని ప్రజలు ఏమి ఎదుర్కొంటారు? (బి) తన ప్రజల్ని రక్షించగల సామర్థ్యం యెహోవాకు ఉందనే మన నమ్మకం బలపడాలంటే మనం ఏమి చేయాలి?

2 మహాశ్రమల ముగింపులో దేవుని ప్రజలపై చివరిసారిగా దాడి జరుగుతుందని యెహెజ్కేలు ప్రవచించాడు. అది “మాగోగు దేశపువాడగు గోగు” చేసే దాడి. అప్పుడు ‘మేఘము భూమిని కమ్మినట్లు విస్తారమైన సైన్యములు’ దేవుని ప్రజలపై దాడి చేస్తాయి. (యెహె. 38:2, 14-16) యెహోవా ప్రజల తరఫున పోరాడడానికి మానవ సంస్థలేవీ ముందుకు రావు. వాళ్లను రక్షించేది యెహోవా మాత్రమే. తమను నాశనం చేయడానికి వచ్చిన వాళ్లను చూసి ఆయన ప్రజలు ఎలా స్పందిస్తారు?

3 మీరు యెహోవా సేవకులైతే, ఆయన తన ప్రజలను మహాశ్రమల నుండి కాపాడగలడని, కాపాడతాడని మీరు నమ్ముతున్నారా? అపొస్తలుడైన పేతురు ఇలా రాశాడు, ‘భక్తులను శోధనలోనుండి తప్పించుటకును, దుర్ణీతిపరులనూ శిక్షలో ఉంచబడినవారినీ తీర్పుదినము వరకు కావలిలో ఉంచుటకును యెహోవా సమర్థుడు.’ (2 పేతు. 2:9, 10) తన ప్రజల్ని రక్షించగల సామర్థ్యం యెహోవాకు ఉందనే మన నమ్మకం బలపడాలంటే, గతంలో ఆయన తన సేవకుల్ని ఎలా విడుదల చేశాడో ధ్యానించాలి. ఇప్పుడు మనం మూడు ఉదాహరణలను పరిశీలిద్దాం.

భూవ్యాప్త జలప్రళయాన్ని తప్పించుకున్నారు

4. జలప్రళయం రావడానికి ముందే ఏమి జరగాల్సివుంది?

4 మొదటిగా, నోవహు కాలంలో వచ్చిన జలప్రళయం గురించి ఆలోచిద్దాం. జలప్రళయం రావడానికి ముందే కొన్ని పనులు జరగాల్సివుంది. పెద్ద ఓడ కట్టాలి, ప్రళయం రాకముందే జంతువులను సురక్షితంగా ఓడలోకి తేవాలి. యెహోవా దేవుడు ముందు ఓడ కట్టించి ఆ తర్వాత జలప్రళయం రప్పించాలని నిర్ణయించుకున్నట్లు ఆదికాండములోని వృత్తాంతం చెప్పడం లేదు. సమయానికి ఓడ కట్టడం పూర్తవుతుందో లేదో అని చింతించకుండా జలప్రళయం రప్పించడానికి యెహోవా ఒక తేదీని నిర్ణయించుకోగలిగాడు. నిజానికి, నోవహుకు ఓడ కట్టమని చెప్పడానికి ఎంతోకాలం ముందే జలప్రళయం వచ్చే రోజును దేవుడు నిర్ణయించాడు. అది మనకెలా తెలుసు?

5. ఆదికాండము 6:3లో యెహోవా ఏమని ప్రకటించాడు? ఎప్పుడు ప్రకటించాడు?

5 యెహోవా పరలోకంలో తన నిర్ణయాన్ని ప్రకటించాడని బైబిలు చూపిస్తోంది. ఆదికాండము 6:3లో, “నా ఆత్మ నరులతో ఎల్లప్పుడును వాదించదు; వారు తమ అక్రమ విషయములో నరమాత్రులై యున్నారు; అయినను వారి దినములు నూట ఇరువది యేండ్లగును” అని యెహోవా అన్నాడు. ఆ లేఖనంలో, మానవుల సగటు ఆయుష్కాలం ఇంతని దేవుడు చెప్పలేదు కానీ, భక్తిహీనులందరినీ భూమ్మీద నుండి ఎప్పుడు నిర్మూలిస్తాడో ప్రకటించాడు. a సా.శ.పూ. 2370లో జలప్రళయం మొదలైంది కాబట్టి సా.శ.పూ. 2490లో యెహోవా ఆ తీర్పును ప్రకటించాడని అర్థమౌతోంది. అప్పుడు నోవహుకు 480 ఏళ్లు. (ఆది. 7:6) దేవుడు తన తీర్పును ప్రకటించిన దాదాపు 20 సంవత్సరాల తర్వాత అంటే సా.శ.పూ. 2470లో నోవహుకు మొదటి కుమారుడు పుట్టాడు, ఆ తర్వాత ఇంకా ఇద్దరు కుమారులు పుట్టారు. (ఆది. 5:32) జలప్రళయం రావడానికి అప్పటికింకా దాదాపు 100 సంవత్సరాలు మిగిలి ఉన్నాయి. మానవులను కాపాడడానికి నోవహు చేయాల్సిన ప్రత్యేకమైన పని గురించి యెహోవా అప్పటికి ఇంకా ఆయనకు చెప్పలేదు. ఇంతకీ యెహోవా ఆ విషయాన్ని నోవహుకు ఎప్పుడు చెప్పాడు?

6. ఓడ కట్టమని యెహోవా నోవహుకు ఎప్పుడు ఆజ్ఞాపించాడు?

6 ఎన్నో దశాబ్దాలు గడిచిపోయేంతవరకు యెహోవా తాను చేయబోయే దాని గురించి నోవహుకు చెప్పలేదు. అలాగని ఎలా చెప్పవచ్చు? ఓడ కట్టమని యెహోవా నోవహుకు చెప్పేటప్పటికి నోవహు కుమారులు పెద్దవాళ్లయి పెళ్లిళ్లు కూడా చేసుకున్నారని లేఖనాలు చూపిస్తున్నాయి. యెహోవా నోవహుకు ఇలా చెప్పాడు, “నీతో నా నిబంధన స్థిరపరచుదును; నీవును నీతోకూడ నీ కుమారులును నీ భార్యయు నీ కోడండ్రును ఆ ఓడలో ప్రవేశింపవలెను.” (ఆది. 6:9-18) జలప్రళయం రావడానికి బహుశా 40, 50 ఏళ్లు మాత్రమే మిగిలి ఉన్నాయనగా యెహోవా ఓడ కట్టే పనిని నోవహుకు అప్పగించి ఉంటాడు.

7. (ఎ) నోవహు, ఆయన కుటుంబ సభ్యులు ఎలా విశ్వాసం చూపించారు? (బి) జలప్రళయం ఎప్పుడు మొదలౌతుందనే దానిగురించి నోవహుకు దేవుడు ఎన్ని రోజుల ముందు చెప్పాడు?

7 నోవహు, ఆయన కుటుంబ సభ్యులు ఓడ కడుతున్నప్పుడు, ‘దేవుడు తన ఉద్దేశాన్ని ఎలా నెరవేరుస్తాడో, జలప్రళయం ఎప్పుడు వస్తుందో’ అనుకొని ఉంటారు. కానీ ఆ వివరాలు తమకు తెలియదనే సాకుతో వాళ్లు తమ పనిని ఆపలేదు. లేఖనాలు ఇలా చెబుతున్నాయి, “నోవహు అట్లు చేసెను, దేవుడు అతని కాజ్ఞాపించిన ప్రకారము యావత్తు చేసెను.” (ఆది. 6:22) ఇంకా ఏడు రోజుల్లో జలప్రళయం వస్తుందని యెహోవా నోవహుకు చెప్పాడు. జంతువుల్ని ఓడలోకి తీసుకెళ్లేందుకు నోవహుకు, ఆయన కుటుంబానికి ఆ సమయం సరిగ్గా సరిపోయింది. కాబట్టి, “నోవహు వయసు యొక్క ఆరువందల సంవత్సరము రెండవ నెల పదియేడవ దినమున” ఆకాశపు తూములు విప్పబడే సమయానికి అంతా సిద్ధంగా ఉంది.—ఆది. 7:1-5, 11.

8. జలప్రళయం గురించిన వృత్తాంతం, తన ప్రజల్ని ఎప్పుడు విడుదల చేయాలో యెహోవాకు తెలుసనే నమ్మకాన్ని ఎలా కలిగిస్తుంది?

8 జలప్రళయం గురించిన వృత్తాంతం చూపిస్తున్నట్లుగా, తన ప్రజల్ని సరిగ్గా ఎప్పుడు, ఎలా విడుదల చేయాలో యెహోవాకు బాగా తెలుసు. ఈ విధానాంతం దగ్గరపడుతుండగా, యెహోవా ఉద్దేశించిన ప్రతీది సరిగ్గా ఆయన అనుకున్న ‘దినంలోనే, గడియలోనే’ నెరవేరి తీరుతుందన్న నమ్మకాన్ని మనం కలిగివుండవచ్చు.—మత్త. 24:36; హబక్కూకు 2:3 చదవండి.

ఎర్ర సముద్రం దగ్గర దేవుడు తన ప్రజల్ని రక్షించాడు

9, 10. యెహోవా ఐగుప్తు సైన్యాలకు ఉరియొడ్డడానికి తన సేవకుల్ని ఎలా ఉపయోగించుకున్నాడు?

9 యెహోవా తన ఉద్దేశాల్ని సరిగ్గా సమయానికే నెరవేర్చగలడని ఇప్పటివరకు మనం చూశాం. యెహోవా తన ప్రజల్ని రక్షించేందుకు, తన ఉద్దేశాలు నెరవేర్చుకునేందుకు తనకున్న అపారమైన శక్తిని ఉపయోగిస్తాడని ఇప్పుడు మనం పరిశీలించబోయే రెండవ ఉదాహరణ చూపిస్తుంది. తన సేవకుల్ని రక్షించే విషయంలో యెహోవాకు సామర్థ్యం ఉందని ఎలా చెప్పవచ్చంటే, ఆయన కొన్నిసార్లు తన శత్రువులకు ఉరియొడ్డడానికి తన సేవకుల్ని ఉపయోగించుకున్నాడు. ఇశ్రాయేలీయుల్ని ఐగుప్తు బానిసత్వం నుండి విడుదల చేసినప్పుడు యెహోవా అదే చేశాడు.

10 మోషే నాయకత్వంలో ఐగుప్తు నుండి బయటకు వచ్చిన ఇశ్రాయేలీయుల సంఖ్య దాదాపు ముప్పై లక్షలు. వాళ్లు దారితప్పి దిక్కుతోచని స్థితిలో ఉన్నారని ఫరో అనుకునే విధంగా యెహోవా వాళ్లను నడిపించాడు. (నిర్గమకాండము 14:1-4 చదవండి.) కాబట్టి, ఫరో తన సైన్యాలతో కలిసి ఎర్ర సముద్రం దగ్గరకు వచ్చి తన మునుపటి బానిసల్ని మళ్లీ పట్టుకోవాలని చూశాడు. ఆ సమయంలో ఇశ్రాయేలీయులకు తప్పించుకునే అవకాశం లేనట్లు అనిపించింది. (నిర్గ. 14:5-10) నిజానికి, వాళ్లు ప్రమాదకరమైన పరిస్థితిలో ఏమీ చిక్కుకోలేదు. ఎందుకంటే, ఆ సమయంలో యెహోవాయే వాళ్ల తరఫున చర్య తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు.

11, 12. (ఎ) యెహోవా తన ప్రజల తరఫున ఎలా జోక్యం చేసుకున్నాడు? (బి) అప్పుడు ఏమి జరిగింది? (సి) ఆ వృత్తాంతం యెహోవా గురించి ఏమి బోధిస్తోంది?

11 ఇశ్రాయేలీయుల్ని నడిపిస్తున్న “మేఘస్తంభము” వాళ్ల వెనకకు వచ్చి ఫరో సైన్యాలను అడ్డగించింది. అప్పుడు ఫరో సైన్యాలకు చీకటి కమ్ముకుంది. కానీ రాత్రిపూట ఆ స్తంభం ఇశ్రాయేలీయులకు అద్భుతరీతిలో వెలుగునిచ్చింది. (నిర్గమకాండము 14:19, 20 చదవండి.) యెహోవా బలమైన తూర్పుగాలి వీచేలా చేసి ఆ ‘సముద్రము మధ్య ఆరిన నేల’ ఏర్పడేలా చేసినప్పుడు సముద్రం రెండు పాయలుగా విడిపోయింది. అలా జరగడానికి బహుశా చాలా సమయమే పట్టివుంటుంది. ఎందుకంటే “రాత్రి అంతయు” బలమైన గాలి వీచిందని, ఆ తర్వాత ‘ఇశ్రాయేలీయులు సముద్రము మధ్యను ఆరిన నేల మీద నడిచిపోయారని’ ఆ వృత్తాంతం చెబుతోంది. ఫరో సైన్యాలు యుద్ధ రథాలతో వచ్చిన వేగంతో పోలిస్తే ఇశ్రాయేలీయులు చాలా నెమ్మదిగా నడుచుకుంటూ వెళ్లారు. అయినా, ఐగుప్తీయులు వాళ్లను పట్టుకోలేకపోయారు ఎందుకంటే, యెహోవాయే ఇశ్రాయేలీయుల తరఫున పోరాడాడు. యెహోవా “ఐగుప్తీయుల దండును కలవరపరచి వారి రథచక్రములు ఊడిపడునట్లు చేయగా వారు బహు కష్టపడి తోలుచుండిరి.”—నిర్గ. 14:21-25.

12 ఇశ్రాయేలీయులు సురక్షితంగా అవతలి ఒడ్డుకు చేరుకున్న తర్వాత, యెహోవా మోషేతో ఇలా అన్నాడు, “ఐగుప్తీయుల మీదికిని వారి రథముల మీదికిని వారి రౌతుల మీదికిని నీళ్లు తిరిగి వచ్చునట్లు సముద్రముమీద నీ చెయ్యి చాపుము.” సముద్రం తిరిగి పొర్లినప్పుడు సైనికులు తప్పించుకోవడానికి ప్రయత్నించారు కానీ, “యెహోవా సముద్రము మధ్యను ఐగుప్తీయులను నాశము చేసెను.” వాళ్లకు తప్పించుకునే అవకాశం లేకపోయింది. “వారిలో ఒక్కడైనను మిగిలి యుండలేదు.” (నిర్గ. 14:26-28) ఆ విధంగా, ఎలాంటి పరిస్థితి నుండైనా తన ప్రజల్ని రక్షించే శక్తి తనకు ఉందని యెహోవా నిరూపించాడు.

యెరూషలేము నాశనాన్ని తప్పించుకున్నారు

13. యేసు ఏ నిర్దేశాలు ఇచ్చాడు? ఆయన అనుచరులకు ఏ ప్రశ్న వచ్చివుంటుంది?

13 తన ఉద్దేశాలు నెరవేరే దిశగా ఎప్పుడేమి జరుగుతుందో యెహోవాకు తెలుసు. మనం చూడబోయే మూడవ ఉదాహరణ ఆ విషయాన్నే నిరూపిస్తుంది. మొదటి శతాబ్దంలో రోమా సైన్యాలు యెరూషలేముపై దాడి చేశాయి. సా.శ. 70లో వచ్చే నాశనాన్ని తప్పించుకోవడానికి యెరూషలేములో, యూదయలో ఉన్న తన సేవకులు ఏమి చేయాలో యెహోవా తన కుమారుని ద్వారా ముందుగానే తెలియజేశాడు. యేసు ఇలా చెప్పాడు, “ప్రవక్తయైన దానియేలు ద్వారా చెప్పబడిన నాశనకరమైన హేయవస్తువు పరిశుద్ధ స్థలమందు నిలుచుట మీరు చూడగానే . . . యూదయలో ఉండువారు కొండలకు పారిపోవలెను.” (మత్త. 24:15, 16) ‘కానీ ఆ ప్రవచనం ఎప్పుడు నెరవేరుతుంది?’ అని యేసు అనుచరులకు అనిపించివుంటుంది.

14. యేసు చెప్పిన మాటల భావాన్ని అర్థంచేసుకోవడానికి సహాయం చేసేలా ఏ సంఘటనలు జరిగాయి?

14 కొన్ని సంఘటనలు జరిగినప్పుడు యేసు చెప్పిన మాటల భావం వాళ్లకు స్పష్టంగా అర్థమైంది. సా.శ. 66లో సెస్టియస్‌ గ్యాలస్‌ ఆధిపత్యంలో రోమా సైన్యం యెరూషలేము తిరుగుబాటును అడ్డుకోవడానికి వచ్చింది. అప్పుడు యూదా మతోన్మాదులుగా పేరుగాంచిన తిరుగుబాటుదారులు యెరూషలేము ఆలయంలో దాక్కోవడంతో ఆ సైనికులు ఆలయ గోడను కూలగొట్టడం మొదలుపెట్టారు. ఆ సమయంలో అప్రమత్తంగా ఉన్న క్రైస్తవులకు విషయం అర్థమైంది. తాము విగ్రహాలుగా భావించే పతాకాలతో వచ్చిన రోమా సైన్యం (“హేయవస్తువు”) యెరూషలేము దేవాలయపు గోడ (ఒక “పరిశుద్ధ స్థలం”) దగ్గరి వరకు వచ్చింది. యేసు అనుచరులు ‘కొండలకు పారిపోవాల్సిన’ సమయం అదే. కానీ పట్టుబడిన ఆ నగరం నుండి వాళ్లు ఎలా బయటికి వచ్చారు? పరిస్థితులు అనుకోని మలుపులు తిరిగాయి.

15, 16. (ఎ) యేసు ఏ స్పష్టమైన నిర్దేశం ఇచ్చాడు? (బి) అప్పట్లో యేసు అనుచరులు ఆయనిచ్చిన నిర్దేశాన్ని పాటించడం ఎందుకు ప్రాముఖ్యమైంది? (సి) మనం ఏమి చేస్తేనే రక్షించబడతాం?

15 ఏ కారణం చేతనో గానీ సెస్టియస్‌ గ్యాలస్‌, ఆయన సైన్యాలు యెరూషలేమును వదిలేసి తిరిగి వెళ్లిపోయారు. అది చూసి మతోన్మాదులు వాళ్లను తరుముకుంటూ వెళ్లారు. యుద్ధానికి తలపడే రెండు గుంపులూ అక్కడ లేకపోవడంతో యేసు అనుచరులకు పారిపోవడానికి అనుకోకుండా ఒక అవకాశం దొరికింది. తమ వస్తుసంపదలన్నిటినీ వదిలేసి ఆలస్యం చేయకుండా వెళ్లిపొమ్మని ముందుగానే యేసు వాళ్లకు స్పష్టంగా చెప్పాడు. (మత్తయి 24:17, 18 చదవండి.) వాళ్లు యేసు ఇచ్చిన హెచ్చరికకు లోబడి వెంటనే అక్కడి నుండి వెళ్లిపోవడం అత్యంత ప్రాముఖ్యం. ఎందుకంటే, కొన్నిరోజులకే మతోన్మాదులు మళ్లీ యెరూషలేములోకి ప్రవేశించి యెరూషలేము, యూదయ ప్రాంతాల్లో నివసిస్తున్న వాళ్లను తిరుగుబాటులో తమతో కలవమని ఒత్తిడి చేయడం మొదలుపెట్టారు. యూదామత గుంపులెన్నో ఆధిపత్యం కోసం పోరాడడంతో అక్కడి పరిస్థితులు మరీ ఘోరంగా తయారయ్యాయి. ఇక అక్కడి నుండి పారిపోవడం ప్రజలకు చాలా కష్టమైపోయింది. సా.శ. 70లో రోమన్లు మళ్లీ దండెత్తి వచ్చినప్పుడు పారిపోవడం అసలు సాధ్యం కాలేదు. (లూకా 19:43) అప్పటివరకు అక్కడే ఉండి వెళ్దామా వద్దా అని తచ్చాడుతున్న ప్రజలు ఇరుక్కుపోయారు. యేసు ఇచ్చిన హెచ్చరికను పాటించి కొండలకు పారిపోయిన క్రైస్తవులు తమ ప్రాణాల్ని రక్షించుకున్నారు. యెహోవాకు తన ప్రజల్ని ఎలా రక్షించాలో తెలుసనే విషయాన్ని వాళ్లు అనుభవపూర్వకంగా గ్రహించారు. ఆ వృత్తాంతం నుండి మనం ఏమి నేర్చుకోవచ్చు?

16 మహాశ్రమల కాలంలో దేవుని వాక్యం, ఆయన సంస్థ ఇచ్చే నిర్దేశాలకు క్రైస్తవులు లోబడాలి. ఉదాహరణకు, ‘కొండలకు పారిపోవాలి’ అని యేసు ఇచ్చిన ఆజ్ఞకు ఆధునిక కాల అన్వయింపు కూడా ఉంది. మహాశ్రమల సమయంలో మనం ఎక్కడికి, ఎలా పారిపోతామో వేచి చూడాల్సిందే. b అయితే, సమయం వచ్చినప్పుడు ఆ నిర్దేశాలను పాటించగలిగేలా వాటిని స్పష్టంగా అర్థంచేసుకోవడానికి యెహోవా సహాయం చేస్తాడనే నమ్మకాన్ని మనం కలిగివుండవచ్చు. మనం విధేయత చూపిస్తేనే రక్షించబడతాం కాబట్టి ఈ ప్రశ్నలు వేసుకోవాలి, ‘యెహోవా ఇప్పుడు తన ప్రజలకు ఇస్తున్న నిర్దేశాలకు నేను ఎలా స్పందిస్తున్నాను? నేను ఆ నిర్దేశాలను వెంటనే పాటిస్తున్నానా లేక పాటించడానికి వెనకాడుతున్నానా?’—యాకో. 3:17.

భవిష్యత్తును ఎదుర్కోవడానికి బలాన్ని పొందాం

17. దేవుని ప్రజల మీద జరగబోయే దాడి గురించి హబక్కూకు ప్రవచనం ఏమి వెల్లడిస్తోంది?

17 మనం ప్రారంభంలో మాట్లాడుకున్న గోగు చేసే దాడి గురించి మళ్లీ ఒకసారి పరిశీలిద్దాం. దానికి సంబంధించిన ఒక ప్రవచనంలో హబక్కూకు ఇలా అన్నాడు, “నేను వినగా జనుల మీదికి వచ్చువారు సమీపించువరకు నేను ఊరకొని శ్రమదినముకొరకు కనిపెట్టవలసి యున్నది, నా అంతరంగము కలవరపడుచున్నది, ఆ శబ్దమునకు నా పెదవులు కదలుచున్నవి, నా యెముకలు కుళ్లిపోవుచున్నవి, నా కాళ్లు వణకుచున్నవి.” (హబ. 3:16) దేవుని ప్రజల మీద జరగబోయే దాడి గురించి కేవలం విన్నందుకే ఆ ప్రవక్త అంతరంగం కలవరపడింది, పెదవులు వణికాయి, బలం క్షీణించింది. గోగు తన సైన్యాలతో మన మీదికి దాడి చేయడానికి వచ్చినప్పుడు మన పరిస్థితి ఎంత భయంకరంగా ఉంటుందో హబక్కూకు ప్రతిస్పందనను బట్టి తెలుస్తోంది. అయినా, యెహోవా తన ప్రజల్ని రక్షిస్తాడనే నమ్మకంతో యెహోవా మహాదినం కోసం ఆ ప్రవక్త ప్రశాంతంగా ఎదురుచూశాడు. మనం కూడా ఆ ప్రవక్త చూపించినలాంటి నమ్మకాన్నే చూపించవచ్చు.—హబ. 3:18, 19.

18. (ఎ) శత్రువులు మన మీద చేయబోయే దాడి గురించి మనం ఎందుకు భయపడాల్సిన అవసరం లేదు? (బి) తర్వాతి ఆర్టికల్‌లో ఏమి పరిశీలిస్తాం?

18 మనం ఈ ఆర్టికల్‌లో పరిశీలించిన మూడు ఉదాహరణలను బట్టి, తన ప్రజలను ఎలా రక్షించాలో యెహోవాకు తెలుసనే విషయం రుజువైంది. యెహోవా ఉద్దేశాలు విఫలమవ్వవు, అవి తప్పకుండా నెరవేరతాయి. ఆ విజయోత్సవంలో మనమూ ఉండాలంటే చివరివరకు నమ్మకంగా కొనసాగాలి. అయితే, ఇప్పుడు మనం నమ్మకంగా ఉండడానికి యెహోవా మనకెలా సహాయం చేస్తాడు? మనం తర్వాతి ఆర్టికల్‌లో ఆ ప్రశ్నకు జవాబు చూస్తాం.

[అధస్సూచీలు]

b కావలికోట మే 1, 1999 సంచికలోని 19వ పేజీ చదవండి.

[అధ్యయన ప్రశ్నలు]

[24వ పేజీలోని చిత్రం]

ఫరో సైన్యం వల్ల ఇశ్రాయేలీయులు నిజంగా ఏదైనా ప్రమాదంలో చిక్కుకున్నారా?