కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

హృదయపూర్వకంగా యెహోవా సేవలో కొనసాగండి

హృదయపూర్వకంగా యెహోవా సేవలో కొనసాగండి

హృదయపూర్వకంగా యెహోవా సేవలో కొనసాగండి

‘నా కుమారుడా, నీ తండ్రి యొక్క దేవుణ్ణి తెలిసికొని హృదయపూర్వకంగా ఆయనను సేవించు.’ —1 దిన. 28:9.

ఈ ప్రశ్నలకు జవాబులు కనుక్కోండి:

హృదయం అంటే ఏమిటి?

హృదయాన్ని పరిశీలించుకోవడానికి మనం ఏ పద్ధతిని ఉపయోగించవచ్చు?

హృదయపూర్వకంగా యెహోవా సేవలో కొనసాగడానికి మనం ఏమి చేయాలి?

1, 2. (ఎ) మానవ శరీరంలోని ఏ భాగం ఇతర భాగాల కన్నా ఎక్కువసార్లు దేవుని వాక్యంలో అలంకారికంగా ఉపయోగించబడింది? (బి) హృదయం దేన్ని సూచిస్తుందో అర్థంచేసుకోవడం ఎందుకు ప్రాముఖ్యం?

 దేవుని వాక్యం మానవ శరీరంలోని భాగాల్ని తరచూ అలంకారికంగా ఉపయోగిస్తుంది. ఉదాహరణకు, ‘నా చేతుల్లో బలాత్కారము లేదు’ అని పూర్వీకుడైన యోబు అన్నాడు. “మంచి సమాచారము ఎముకలకు పుష్టి ఇచ్చును” అని సొలొమోను రాజు అన్నాడు. “నీ నుదురు చెకుముకి రాతికంటె కఠినముగా ఉండు వజ్రమువలె చేసెదను” అని యెహోవా యెహెజ్కేలుకు అభయమిచ్చాడు. “కొన్ని క్రొత్త సంగతులు మా చెవులకు వినిపించుచున్నావు” అని ప్రజలు అపొస్తలుడైన పౌలుతో అన్నారు.—యోబు 16:16; సామె. 15:30; యెహె. 3:9; అపొ. 17:20.

2 అయితే బైబిల్లో, మానవ శరీరంలోని ఒక్క భాగం మాత్రం అంటే, గుండె మాత్రం ఇతర భాగాల కన్నా ఎక్కువసార్లు అలంకారికంగా ఉపయోగించబడింది. విశ్వాసురాలైన హన్నా చేసిన ప్రార్థనలో దాని ప్రస్తావన ఉంది, “నా హృదయము [మూలభాషలో, “గుండె”] యెహోవాయందు సంతోషించుచున్నది.” (1 సమూ. 2:1) నిజానికి మూలభాషలో, బైబిలు రచయితలు ‘గుండె’ అనే పదాన్ని సుమారు వెయ్యి సార్లు ఉపయోగించారు. దాదాపు ఆ సందర్భాలన్నిటిలో అలంకారిక గుండెను అంటే హృదయాన్ని సూచించడానికే ఆ పదాన్ని ఉపయోగించారు. హృదయాన్ని కాపాడుకోమని బైబిలు చెబుతోంది కాబట్టి, ఆ ‘హృదయం’ దేన్ని సూచిస్తుందో అర్థంచేసుకోవడం చాలా ప్రాముఖ్యం.—సామెతలు 4:23 చదవండి.

హృదయం అంటే ఏమిటి?

3. బైబిల్లో ఉపయోగించబడిన ‘హృదయం’ అనే పదానికి అర్థమేమిటో గ్రహించాలంటే మనం ఏమి చేయాలి? ఉదాహరణతో చెప్పండి.

3 బైబిల్లో ‘హృదయం’ అనే పదానికి నిర్వచనం లేదు కానీ దాని అర్థాన్ని గ్రహించడానికి కావాల్సిన సమాచారం ఉంది. అలాగని ఎలా చెప్పవచ్చు? ఉదాహరణకు, వేర్వేరు రంగుల్లో ఉన్న వెయ్యి చిన్నచిన్న గులకరాళ్లను ఒక గోడమీద దగ్గరదగ్గరగా పేర్చి రూపొందించిన ఒక చిత్రం (వాల్‌ మొజాయిక్‌) గురించి ఆలోచించండి. దాంట్లో ఏ రూపం ఉందో తెలుసుకోవాలంటే మనం ఒక అడుగు వెనక్కి వెళ్లి దూరం నుండి పూర్తి చిత్రాన్ని పరిశీలించాలి. అలాగే, బైబిల్లో కూడా ‘హృదయం’ అనే పదం ఉపయోగించబడిన చాలా సందర్భాలను పరిశీలిస్తే, ఆ పదాలన్నీ కలిపి ఒక రూపాన్ని లేదా చిత్రాన్ని రూపొందిస్తాయని గ్రహించగలుగుతాం. మరి ఆ చిత్రం ఏమిటి?

4. (ఎ) ‘హృదయం’ దేన్ని సూచిస్తుంది? (బి) మత్తయి 22:37లోని యేసు మాటలకు అర్థమేమిటి?

4 ఒక వ్యక్తి అంతరంగ వ్యక్తిత్వాన్ని వర్ణించడానికి బైబిలు రచయితలు ‘హృదయం’ అనే పదాన్ని ఉపయోగించారు. మన కోరికలు, ఆలోచనలు, మానసిక స్థితి, వైఖరి, సామర్థ్యాలు, ప్రేరణలు, లక్ష్యాలు వంటివాటన్నిటినీ ఆ పదం సూచిస్తుంది. (ద్వితీయోపదేశకాండము 15:7; సామెతలు 16:9; అపొస్తలుల కార్యములు 2:26 చదవండి.) అయితే కొన్ని సందర్భాల్లో ‘హృదయం’ అనే పదం పరిమిత భావంలో ఉపయోగించబడింది. ఉదాహరణకు, యేసు ఇలా అన్నాడు, “నీ పూర్ణహృదయముతోను నీ పూర్ణాత్మతోను నీ పూర్ణమనస్సుతోను నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలెను.” (మత్త. 22:37) ఈ సందర్భంలో, ‘హృదయం’ అనే పదం ఒక వ్యక్తి అంతరంగంలోని భావాలను, కోరికలను, భావావేశాలను సూచిస్తోంది. హృదయం, ఆత్మ, మనసు అని వేర్వేరుగా ప్రస్తావించడం ద్వారా దేవుని పట్ల మనకున్న ప్రేమను మన భావాల్లో, మన జీవన విధానంలో, మన మానసిక సామర్థ్యాలను ఉపయోగించే తీరులో వ్యక్తం చేయాలని యేసు నొక్కి చెప్పాడు. (యోహా. 17:3; ఎఫె. 6:6) అయితే, ‘హృదయం’ అనే పదం విడిగా ఉపయోగించబడినప్పుడు మాత్రం అది అంతరంగ వ్యక్తిత్వాన్ని సూచిస్తుంది.

హృదయాన్ని ఎందుకు కాపాడుకోవాలి?

5. హృదయపూర్వకంగా యెహోవాను సేవించడానికి మనం చేయగలిగినదంతా చేయాలని ఎందుకు కోరుకుంటాం?

5 హృదయం గురించి దావీదు రాజు సొలొమోనుకు ఇలా గుర్తుచేశాడు, “నా కుమారుడా, నీ తండ్రియొక్క దేవుడైన యెహోవా అందరి హృదయములను పరిశోధించువాడును, ఆలోచనలన్నిటిని సంకల్పములన్నిటిని ఎరిగినవాడునై యున్నాడు.” (1 దిన. 28:9) యెహోవా, మన హృదయంతో సహా అందరి హృదయాలను పరిశోధిస్తాడు. (సామె. 17:3; 21:2) మన హృదయంలో కనుగొన్నదాన్ని యెహోవా ఇష్టపడితేనే మనం ఇప్పుడు ఆయన స్నేహితులుగా ఉండడమే కాక, సంతోషకరమైన భవిష్యత్తు కోసం కూడా ఎదురుచూడవచ్చు. కాబట్టి, హృదయపూర్వకంగా యెహోవాను సేవించడానికి మనం చేయగలిగినదంతా చేయడం ద్వారా దావీదు ఇచ్చిన సలహాను పాటించాలని కోరుకుంటాం.

6. యెహోవాను సేవించాలనే మన కృత నిశ్చయం విషయంలో మనమేమి గుర్తుంచుకోవాలి?

6 యెహోవా ప్రజలముగా మనం ఉత్సాహంగా చేసే కొన్ని పనుల ద్వారా, ఆయనను హృదయపూర్వకంగా సేవించాలని ఎంతగానో కోరుకుంటున్నట్లు చూపిస్తాం. అయితే, సాతాను దుష్ట లోకంలోని ఒత్తిళ్లు, మన పాపభరిత ఆలోచనలు దేవుణ్ణి హృదయపూర్వకంగా సేవించాలనే మన కృత నిశ్చయాన్ని నీరుగార్చగలవని మనం గుర్తుంచుకుంటాం. (యిర్మీ. 17:9; ఎఫె. 2:2) కాబట్టి, దేవుణ్ణి హృదయపూర్వకంగా సేవించాలనే మన కృత నిశ్చయం ఇంకా బలంగానే ఉందో లేదో తెలుసుకోవడానికి మనం మన హృదయాన్ని క్రమంగా పరిశీలించుకుంటూ ఉండాలి. మరి దాన్ని మనమెలా పరిశీలించుకోవచ్చు?

7. మన హృదయం ఎలా ఉందో తెలుసుకోవాలంటే ఏమి చేయాలి?

7 ఒక చెట్టు లోపలి భాగం మన కంటికి కనిపించనట్లే, మన అంతరంగ వ్యక్తిత్వం కూడా బయటకు కనిపించదు. అయినా, కొండమీది ప్రసంగంలో యేసు చెప్పిన విధంగా, ఒక చెట్టు ఫలాల్ని బట్టి ఆ చెట్టు ఎలాంటిదో తెలుసుకోగలిగినట్లే, మనం చేసే పనులను బట్టి మన హృదయం ఎలా ఉందో తెలుసుకోవచ్చు. (మత్త. 7:17-20) ఇప్పుడు మనం అలాంటి ఒక విషయం గురించి చూద్దాం.

హృదయాన్ని పరిశీలించుకోవడానికి సహాయం చేసే ఒక విధానం

8. మత్తయి 6:33లోని యేసు మాటలకు, మన హృదయంలోని విషయాలకు సంబంధం ఏమిటి?

8 యెహోవాను హృదయపూర్వకంగా సేవించాలనే కోరిక ఉందని చూపించడానికి ఏమి చేయాలో యేసు అదే ప్రసంగంలో తన శ్రోతలకు చెప్పాడు. ఆయన ఇలా అన్నాడు, “మీరు ఆయన రాజ్యమును, నీతిని మొదట వెదకుడి; అప్పుడవన్నియు మీకనుగ్రహింపబడును.” (మత్త. 6:33) మన జీవితంలో మనం దేనికి మొదటిస్థానం ఇస్తున్నామనే దాన్ని బట్టే, మనం హృదయలోతుల్లో ఏమి కోరుకుంటున్నామో, ఏమి ఆలోచిస్తున్నామో తెలుస్తుంది. యెహోవాను హృదయపూర్వకంగా సేవిస్తున్నామో లేదో తెలుసుకోవడానికి జీవితంలో మనం వేటికి మొదటిస్థానం ఇస్తున్నామో పరిశీలించుకోవాలి.

9. యేసు కొంతమందికి ఏ ఆహ్వానాన్నిచ్చాడు? వాళ్లు ప్రతిస్పందించిన తీరును బట్టి ఏమి అర్థమౌతోంది?

9 ‘దేవుని రాజ్యాన్ని మొదట వెదకండి’ అని యేసు తన అనుచరులకు చెప్పిన కొంతకాలానికే ఒక సంఘటన జరిగింది. ఆ సంఘటనను పరిశీలిస్తే, ఒక వ్యక్తి తన జీవితంలో దేనికి మొదటిస్థానం ఇస్తున్నాడనే దాన్నిబట్టి ఆయన హృదయంలో ఏముందో తెలుసుకోవచ్చని అర్థమౌతుంది. కొంతకాలానికి యెరూషలేములో బాధలను అనుభవించాల్సి వస్తుందని తెలిసి కూడా యేసు ‘యెరూషలేముకు వెళ్లడానికి మనస్సు స్థిరపరచుకున్నాడు’ అని చెబుతూ లూకా ఆ సంఘటన గురించి వివరించాడు. యేసు, ఆయన అపొస్తలులు “మార్గమున వెళ్లుచుండగా” కొంతమంది ఎదురయ్యారు. “నా వెంట రమ్ము” అంటూ యేసు వాళ్లను ఆహ్వానించాడు. అయితే, కొన్ని షరతుల మీద వాళ్లు యేసు ఆహ్వానాన్ని స్వీకరించడానికి ఇష్టపడ్డారు. ఒక వ్యక్తి ఇలా అడిగాడు, “నేను వెళ్లి మొదట నా తండ్రిని పాతిపెట్టి వచ్చుటకు సెలవిమ్ము.” మరో వ్యక్తి, “ప్రభువా, నీ వెంట వచ్చెదను గాని నా యింటనున్న వారి యొద్ద సెలవు తీసికొని వచ్చుటకు మొదట నాకు సెలవిమ్ము” అని అడిగాడు. (లూకా 9:51, 57-61) యేసు స్థిర నిశ్చయానికి, ఏమంత ప్రాముఖ్యంకాని వాళ్ల షరతులకు ఎంత తేడా ఉందో! రాజ్య సంబంధమైన విషయాల కన్నా తమ సొంత విషయాలకే మొదటిస్థానం ఇవ్వడం ద్వారా తాము దేవుణ్ణి హృదయపూర్వకంగా సేవించడం లేదని వాళ్లు చూపించారు.

10. (ఎ) తన అనుచరులుగా ఉండమని యేసు ఇచ్చిన ఆహ్వానానికి మనమెలా స్పందించాం? (బి) యేసు క్లుప్తమైన ఏ ఉపమానం చెప్పాడు?

10 ఆ వ్యక్తుల్లా కాక మనం, యేసు ఇచ్చిన ఆహ్వానాన్ని స్వీకరించాం, ప్రతీరోజు యెహోవాను సేవిస్తున్నాం. ఆ విధంగా, యెహోవా గురించి మనం హృదయంలో ఏమనుకుంటున్నామో చూపిస్తున్నాం. అయితే, సంఘంలో మనం చురుగ్గానే ఉన్నా మన హృదయానికి తలెత్తగల ప్రమాదం గురించి మనం జాగ్రత్తపడాలి. ఏమిటా ప్రమాదం? తన అనుచరులుగా ఉండమని ఆహ్వానించిన ఆ వ్యక్తులతో మాట్లాడుతున్నప్పుడు యేసు ఆ ప్రమాదం ఏమిటో చెబుతూ ఇలా అన్నాడు, “నాగటి మీద చెయ్యి పెట్టి వెనుకతట్టు చూచు వాడెవడును దేవుని రాజ్యమునకు పాత్రుడుకాడు.” (లూకా 9:62) ఆ ఉపమానం నుండి మనం ఏమి నేర్చుకోవచ్చు?

మనం “మంచిదానిని హత్తుకొని” ఉంటామా?

11. యేసు ఉపమానంలోని వ్యక్తి పని ఎలా సాగింది, ఎందుకు?

11 యేసు చెప్పిన ఆ క్లుప్తమైన ఉపమానంలోని పాఠాన్ని స్పష్టంగా అర్థంచేసుకోవడానికి మనం కొన్ని వివరాలు కలిపి దాన్ని ఊహించుకుందాం. పొలంలో పనిచేసే ఒక పనివాడు పొలాన్ని దున్నుతూ తన కుటుంబం, స్నేహితులు, వాళ్ల నవ్వులు, ఆహారం, సంగీతం, చల్లని నీడ ఉండే తన ఇంటి గురించే ఆలోచిస్తున్నాడనుకోండి. వాళ్లతో కలిసి వాటన్నిటినీ ఆస్వాదించాలని ఆయనకు అనిపిస్తుంది. అయితే, చాలాసేపు దున్నిన తర్వాత ఆయన కోరిక ఎంత బలంగా తయారౌతుందంటే, పని ఆపేసి ‘వెనక్కి’ వెళ్లిపోవాలనుకుంటాడు. పొలంలో నాట్లు వేయడానికి ముందు చేయాల్సిన పని ఎంతో ఉన్నా, ఆ పనివాడి ఆలోచన పక్కకు మళ్లినందువల్ల ఆయన పని సరిగ్గా చేయలేడు. ఆయన పట్టుదలగా పని చేయనందుకు యజమాని ఖచ్చితంగా నిరాశపడతాడు.

12. యేసు ఉపమానంలోని పనివాడితో ఒక క్రైస్తవుణ్ణి ఎలా పోల్చవచ్చు?

12 ఇప్పుడు ఆ ఉపమానాన్ని మన కాలంలోని పరిస్థితికి అన్వయించి చూద్దాం. పొలంలో పనిచేసే ఆ పనివాడు, సంఘంలో చురుగ్గానే ఉన్నా ఆధ్యాత్మిక ప్రమాదంలో పడిన ఒక క్రైస్తవుణ్ణి సూచిస్తున్నాడు. ఆ ఉపమానంలోని పనివాడితో, పరిచర్యలో క్రమంగా పాల్గొంటున్న ఒక సహోదరుణ్ణి పోల్చి చూద్దాం. కూటాలకు హాజరౌతూ, పరిచర్యలో పాల్గొంటూ ఉన్నప్పటికీ ఆ క్రైస్తవుడు ఈ లోకంలో తనకు నచ్చిన కొన్ని విషయాల గురించే ఆలోచిస్తూ ఉండవచ్చు. ఆయన తన హృదయలోతుల్లో వాటిని ఎంతగానో కోరుకుంటుండవచ్చు. ఎన్నో ఏళ్లపాటు పరిచర్యను కొనసాగించిన తర్వాత చివరకు, ఆయన కోరిక ఎంత బలంగా తయారుకావచ్చంటే ఆయన వాటికోసం ‘వెనక్కి’ వెళ్లిపోయే అవకాశం ఉంది. పరిచర్యలో చేయాల్సింది ఇంకా ఎంతో ఉన్నా, “జీవవాక్యమును” గట్టిగా పట్టుకొని ఉండకపోవడం వల్ల ఆయన దేవునికి ఒకప్పుడు చేసినంత సేవ చేయకపోవచ్చు. (ఫిలి. 2:16) ఆ సహోదరునికి తన సేవలో ముందున్నంత పట్టుదల లేకపోవడం చూసి ‘కోత యజమాని’ అయిన యెహోవా బాధపడతాడు.—లూకా 10:2.

13. యెహోవాను హృదయపూర్వకంగా సేవించాలంటే ఏమి చేయాలి?

13 అందులోని పాఠం సుస్పష్టం! క్రైస్తవ కూటాలకు హాజరవడం, పరిచర్యలో పాల్గొనడం వంటి మంచి, సంతృప్తికరమైన పనులు క్రమంగా చేయడమనేది మెచ్చుకోదగినదే. అయితే, యెహోవాను హృదయపూర్వకంగా సేవించాలంటే అవి మాత్రమే సరిపోవు. (2 దిన. 25:1, 2, 27) ఒక క్రైస్తవునికి ‘వెనుకటి’ విషయాల పట్ల అంటే, లోకంలో తనకు నచ్చిన విషయాల పట్ల హృదయలోతుల్లో ఇంకా ప్రేమ ఉన్నట్లయితే, ఆయన దేవుని దృష్టిలో తనకున్న మంచి స్థానాన్ని పోగొట్టుకునే ప్రమాదం ఉంది. (లూకా 17:32) మనం నిజంగా ‘చెడ్డదాన్ని అసహ్యించుకొని మంచిదాన్ని హత్తుకొని ఉంటేనే’ ‘దేవుని రాజ్యానికి పాత్రులమౌతాం.’ (రోమా. 12:9; లూకా 9:62) సాతాను లోకంలోని కొన్ని ఎంతో ఉపయోగకరమైనవని లేదా ఎంతో మంచివని మనకు అనిపించినా, వాటివల్ల దేవునికి మనం చేసే హృదయపూర్వకమైన సేవ ఆపేసే పరిస్థితి రాకుండా మనమందరం జాగ్రత్తపడాలి.—2 కొరిం. 11:14; ఫిలిప్పీయులు 3:13, 14 చదవండి.

అప్రమత్తంగా ఉండండి!

14, 15. (ఎ) సాతాను మన హృదయాన్ని తప్పుదోవ పట్టించడానికి ఎలా ప్రయత్నిస్తున్నాడు? (బి) సాతాను ఉపయోగించే పద్ధతి ఎందుకు ప్రమాదకరమైనదో ఉదాహరణతో చెప్పండి.

14 యెహోవా మీద ప్రేమతోనే మనం ఆయనకు సమర్పించుకున్నాం. అప్పటినుండి మనలో చాలామంది హృదయపూర్వకంగా యెహోవా సేవలో ఎన్నో సంవత్సరాలుగా కొనసాగుతున్నారు. అయితే, సాతాను మాత్రం తన పట్టువిడువలేదు. ఇప్పటికీ, మన హృదయాల్ని తప్పుదోవ పట్టించాలన్నదే అతని లక్ష్యం. (ఎఫె. 6:12) అయితే, మనం అంత సులభంగా యెహోవాకు దూరం కామని సాతానుకు తెలుసు. కాబట్టి, దేవుని విషయంలో మనకున్న హృదయపూర్వకమైన ఉత్సాహాన్ని మెల్లమెల్లగా తగ్గించడానికి సాతాను కుయుక్తిగా ఈ లోక విధానాన్ని ఉపయోగించుకుంటాడు. (మార్కు 4:18, 19 చదవండి.) సాతాను ఉపయోగించే ఆ పద్ధతి ఎందుకు బాగా పనిచేస్తుంది?

15 దాన్ని అర్థంచేసుకోవడానికి ఒక ఉదాహరణ చూద్దాం. మీరు 100 వాట్ల బల్బు వెలుగులో ఒక పుస్తకం చదువుతున్నారు. ఉన్నట్టుండి బల్బు ఆరిపోయింది. అకస్మాత్తుగా అంతా చీకటైపోవడంతో, మీరు ఆ మాడిపోయిన బల్బు తీసేసి కొత్త బల్బు పెట్టుకుంటారు. మీ గదిలో మళ్లీ వెలుగు వస్తుంది. మరుసటి రోజు మీరు మళ్లీ ఆ బల్బు వెలుగులోనే చదువుతున్నారు. అయితే అంతకుముందే మీకు తెలియకుండా ఎవరో వచ్చి 100 వాట్ల బల్బును తీసేసి 95 వాట్ల బల్బును పెట్టారు. మీకు తేడా తెలుస్తుందా? బహుశా తెలియకపోవచ్చు. అయితే, మరో రోజు ఎవరో వచ్చి 90 వాట్ల బల్బును పెట్టారు. మీకు తేడా తెలుస్తుందా? అప్పుడు కూడా మీరు తేడాను గుర్తించకపోవచ్చు. ఎందుకు? వెలుగు మెల్లమెల్లగా తగ్గుతూ వస్తోంది కాబట్టి ఆ తేడాను మీరు గుర్తించలేకపోవచ్చు. అలాగే, సాతాను లోకంలోని ప్రభావాలు మన ఉత్సాహాన్ని మెల్లమెల్లగా తగ్గించవచ్చు. ఒకవేళ అలా జరిగితే, యెహోవా సేవపట్ల మీకున్న 100 వాట్ల ఉత్సాహాన్ని తగ్గించడంలో సాతాను విజయం సాధించినట్లే! అప్రమత్తంగా లేకపోతే, క్రైస్తవులు మెల్లమెల్లగా జరిగే అలాంటి మార్పును గుర్తించలేకపోవచ్చు.—మత్త. 24:42; 1 పేతు. 5:8.

ప్రార్థించడం ప్రాముఖ్యం

16. సాతాను ఉపయోగించే అలాంటి పద్ధతుల నుండి మనల్ని మనం ఎలా కాపాడుకోవచ్చు?

16 సాతాను ఉపయోగించే అలాంటి పద్ధతుల నుండి మనల్ని మనం కాపాడుకుంటూ హృదయపూర్వకంగా యెహోవా సేవలో కొనసాగాలంటే ఏమి చేయాలి? (2 కొరిం. 2:11) ప్రార్థించడం ప్రాముఖ్యం. ‘అపవాది తంత్రాలను ఎదిరించండి’ అని పౌలు తోటి విశ్వాసులను ప్రోత్సహించాడు. ఆ తర్వాత, ‘ప్రతి సమయమునందు ప్రతి విధమైన ప్రార్థన, విజ్ఞాపన చేయండి’ అని ఆయన అన్నాడు.—ఎఫె. 6:11, 18; 1 పేతు. 4:7.

17. యేసు ప్రార్థనల నుండి మనమేమి నేర్చుకోవచ్చు?

17 సాతానును ఎదిరించి నిలబడాలంటే, యేసులా మనం ప్రార్థన చేస్తూ ఉండాలి. ప్రార్థన విషయంలో యేసు వైఖరిని బట్టి, హృదయపూర్వకంగా యెహోవా సేవలో కొనసాగాలని ఆయన ఎంతగానో కోరుకున్నాడని స్పష్టమౌతోంది. ఉదాహరణకు, మరణించడానికి ముందు రోజు రాత్రి యేసు ప్రార్థించిన తీరు గురించి రాస్తూ, “ఆయన వేదనపడి మరింత ఆతురముగా [“పట్టుదలగా,” NW] ప్రార్థన చేసెను” అని లూకా రాశాడు. (లూకా 22:44) యేసు అంతకుముందు కూడా పట్టుదలగానే ప్రార్థించాడు కానీ ఈ సందర్భంలో తన భూజీవితంలో అప్పటివరకు ఎదుర్కోనంత పెద్ద పరీక్షను ఎదుర్కోబోతున్నందుకు ఆయన ‘మరింత పట్టుదలగా’ ప్రార్థించాడు. ఆయన ప్రార్థనకు జవాబు కూడా వచ్చింది. ప్రార్థనలకు ఒక్కో సందర్భంలో ఒక్కో విధమైన తీవ్రత ఉంటుందని యేసు ఉదాహరణ చూపిస్తోంది. కాబట్టి, మనకు ఎంత పెద్ద శ్రమలు ఎదురైతే, సాతాను ఉపయోగించే పద్ధతులు ఎంత మోసపూరితంగా ఉంటే యెహోవా కాపుదల కోసం మనం ‘అంత పట్టుదలగా’ ప్రార్థించాలి.

18. (ఎ) ప్రార్థన గురించి మనం ఏమని ప్రశ్నించుకోవాలి? ఎందుకు? (బి) ఏ విషయాలు మన హృదయాన్ని ప్రభావితం చేస్తాయి? ఏయే విధాలుగా చేస్తాయి? ( 16వ పేజీలోని బాక్సు చూడండి.)

18 మనం అలా ప్రార్థించడం వల్ల వచ్చే ఫలితాలు ఎలా ఉంటాయి? పౌలు ఇలా అన్నాడు, ‘ప్రతి విషయములోను ప్రార్థన విజ్ఞాపనములచేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియజేయుడి. అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము మీ హృదయములకు కావలియుండును.’ (ఫిలి. 4:6, 7) హృదయపూర్వకంగా యెహోవా సేవలో కొనసాగాలంటే పట్టుదలగా, తరచుగా ప్రార్థించాలి. (లూకా 6:12) కాబట్టి, ‘నేను ఎంత పట్టుదలగా, ఎంత తరచుగా ప్రార్థిస్తున్నాను?’ అని మనల్ని మనం ప్రశ్నించుకోవాలి. (మత్త. 7:7; రోమా. 12:12) ఆ ప్రశ్నకు మీ జవాబును బట్టి, యెహోవాను సేవించాలని మీరు మీ హృదయంలో ఎంత బలంగా కోరుకుంటున్నారో తెలుస్తుంది.

19. హృదయపూర్వకంగా యెహోవా సేవలో కొనసాగడానికి మీరు ఏమి చేయాలనుకుంటున్నారు?

19 మన జీవితంలో మనం వేటికి మొదటిస్థానం ఇస్తామనే దాన్ని బట్టే మన హృదయం ఎలా ఉందో తెలుస్తుందని మనం ఇప్పటివరకు చూశాం. మనం వదిలేసి వచ్చిన వాటివల్ల గానీ సాతాను కుతంత్రాల వల్ల గానీ యెహోవాను హృదయపూర్వకంగా సేవించాలనే మన కృతనిశ్చయం బలహీనం కాకుండా చూసుకోవాలి. (లూకా 21:19, 34-36 చదవండి.) కాబట్టి దావీదులా మనం, “నా హృదయమునకు ఏకదృష్టి కలుగజేయుము” అని ప్రార్థిస్తూ ఉందాం.—కీర్త. 86:11.

[అధ్యయన ప్రశ్నలు]

[16వ పేజీలోని బాక్సు]

మన హృదయాన్ని ప్రభావితం చేసే మూడు విషయాలు

మన గుండెను ఆరోగ్యవంతంగా ఉంచుకోవడానికి కొన్ని చిట్కాలను పాటించినట్లే, మన హృదయాన్ని కాపాడుకోవడానికి కొన్ని చర్యలు తీసుకోవచ్చు. ప్రాముఖ్యమైన ఈ మూడు విషయాలను పరిశీలించండి:

1 పోషణ: మన గుండె ఆరోగ్యంగా ఉండాలంటే పుష్టికరమైన ఆహారం తగినంత తీసుకోవాలి. అలాగే, క్రమంగా వ్యక్తిగత అధ్యయనం చేయడం ద్వారా, ధ్యానించడం ద్వారా, కూటాలకు హాజరవడం ద్వారా పుష్టికరమైన ఆధ్యాత్మిక ఆహారం తగినంత తీసుకోవాలి.—కీర్త. 1:1, 2; సామె. 15:28; హెబ్రీ. 10:24, 25.

 2 వ్యాయామం: మనం ఆరోగ్యంగా ఉండాలంటే మన గుండె కొన్నిసార్లు రక్తాన్ని వేగంగా ప్రసరింపజేయాల్సి ఉంటుంది. అలాగే, ఆధ్యాత్మిక కార్యకలాపాలను విస్తృతపర్చుకోవడం ద్వారా పరిచర్యలో ఉత్సాహంగా పాల్గొంటే మన హృదయం మంచి స్థితిలో ఉంటుంది.—లూకా 13:24; ఫిలి. 3:12.

3 సహవాసం: మనం జీవించాల్సింది, పని చేయాల్సింది ఈ భక్తిహీన లోకంలోనే కాబట్టి కొన్నిసార్లు మన గుండెకు, హృదయానికి చాలా ఒత్తిడి కలుగుతుంది. కానీ, దేవుణ్ణి హృదయపూర్వకంగా సేవిస్తూ మనపై నిజమైన శ్రద్ధ చూపించే తోటి విశ్వాసులతో సాధ్యమైనంత తరచుగా సహవసించడానికి ప్రయత్నిస్తే మనం ఆ ఒత్తిడిని తగ్గించుకోవచ్చు.—కీర్త. 119:63; సామె. 13:20.