కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

ఆనాటి జ్ఞాపకాలు

“కల్‌పోర్చర్‌ పనిపై రోజురోజుకూ ఇష్టం పెంచుకుంటున్నాను”

“కల్‌పోర్చర్‌ పనిపై రోజురోజుకూ ఇష్టం పెంచుకుంటున్నాను”

మిల్లీనియల్‌ డాన్‌ (1వ సంపుటి) వంద ప్రతులు 1886లో, అమెరికాకు చెందిన పెన్సిల్వేనియాలోని అల్గేనీలోవున్న బైబిల్‌ హౌజ్‌ నుండి ఇల్లినోయిస్‌లోని చికాగోకు పంపించబడ్డాయి. ఎందుకంటే, ఛార్లెస్‌ తేజ్‌ రస్సెల్‌ వాటిని బుక్‌స్టాల్‌ల ద్వారా ప్రజలకు అందుబాటులోకి తేవాలనుకున్నాడు. అమెరికాలో మత సంబంధ పుస్తకాలను అమ్మే ఒక పెద్ద బుక్‌స్టాల్‌ వాళ్లు మిల్లీనియల్‌ డాన్‌ పుస్తకాలను అమ్మడానికి ఒప్పుకున్నారు. కానీ వాళ్లు రెండు వారాల తర్వాత ఆ పుస్తకాలన్నిటినీ బైబిల్‌ హౌజ్‌కు తిరిగి పంపించేశారు.

పేరొందిన ఒక మతప్రచారకుడు బుక్‌స్టాల్‌లోని అరలో తన పుస్తకాల ప్రక్కన మిల్లీనియల్‌ డాన్‌ పుస్తకాలు అమ్మకానికి పెట్టడం చూసి కోపంతో ఊగిపోయి, ఆ అరలో ఆ పుస్తకాల్ని అలాగే ఉంచితే తానూ పేరొందిన మతప్రచారకులైన తన స్నేహితులందరూ తమ పుస్తకాలు అమ్మడానికి వేరే బుక్‌స్టాల్‌ను చూసుకోవాల్సి వస్తుందని చెప్పినట్లు తెలిసింది. దానితో ఆ బుక్‌స్టాల్‌ అతను డాన్‌ పుస్తకాల్ని అయిష్టంగానే వెనక్కి పంపించేశాడు. మరోవైపు, డాన్‌ పుస్తకాల గురించి వార్తాపత్రికల్లో ప్రకటనలు కూడా వేయించాం. కానీ వ్యతిరేకులు ఆ ప్రకటనలు కూడా రాకుండా చేశారు. మరైతే ఈ కొత్త పుస్తకం సత్యాన్వేషకులకు ఎలా చేరింది?

అప్పట్లో కల్‌పోర్చర్లు అని పిలువబడిన వాళ్లే ప్రజలందరికీ వాటిని చేరవేశారు. a 1881లో జాయన్స్‌ వాచ్‌టవర్‌ సంస్థ, బైబిలు సాహిత్యాలను పంచిపెట్టడంలో పూర్తికాలం గడపగలిగే 1,000 మంది ప్రచారకులు కావాలని పిలుపునిచ్చింది. కల్‌పోర్చర్లు కొన్ని వందల మందే ఉన్నప్పటికీ, ముద్రిత రూపంలోవున్న సత్యపు విత్తనాలను దూరదూరాలకు చేరవేశారు. 1897వ సంవత్సరానికల్లా 10 లక్షల డాన్‌ ప్రతులు పంచిపెట్టబడ్డాయి, వాటిలో ఎక్కువ ప్రతుల్ని పంచిపెట్టింది కల్‌పోర్చర్లే. కావలికోట పత్రిక కోసం చందాలు కట్టించినందుకు, పుస్తకాలు అందించినందుకు వచ్చే చిన్న మొత్తమే వాళ్లలో చాలామంది జీవనాధారం.

కల్‌పోర్చర్లుగా సేవ చేయడానికి ఎవరెవరు ధైర్యంగా ముందుకు వచ్చారు? కొంతమంది టీనేజర్లు, వృద్ధులు, చాలామంది పెళ్లి కానివాళ్లు, పిల్లల్లేని దంపతులు ముందుకు వచ్చారు. ఎన్నో కుటుంబాలు కూడా అలా ముందుకు వచ్చాయి. క్రమ కల్‌పోర్చర్లు రోజంతా సేవలో గడిపేవాళ్లు, సహాయ కల్‌పోర్చర్లేమో రోజులో గంట లేక రెండు గంటలు గడిపేవాళ్లు. కల్‌పోర్చర్‌ సేవ చేయడానికి కావాల్సిన మంచి ఆరోగ్యం, అనుకూలమైన పరిస్థితులు కొంతమందికే ఉండేవి. అయితే 1906లో జరిగిన ఒక సమావేశంలో, కల్‌పోర్చర్‌ సేవ చేయడానికి సహోదర సహోదరీలు “విద్యావంతులో, నైపుణ్యం గలవాళ్లో, దేవదూతల్లాంటి వక్తలో” అయ్యుండాల్సిన అవసరం లేదని చెప్పారు.

దాదాపు ప్రతీ ఖండంలోనూ సామాన్య ప్రజలు అసాధారణ ఫలితాలు సాధించారు. ఏడు సంవత్సరాల్లో 15,000 పుస్తకాలు అందించివుంటానని ఒక సహోదరుడు అన్నాడు. అయితే “పుస్తకాలమ్మేవాడిగా పనిచేయడానికి కాదుగానీ యెహోవాకు, ఆయన సత్యానికి సాక్షిగా ఉండడానికే కల్‌పోర్చర్‌ సేవ చేపట్టాను” అని ఆయన అన్నాడు. కల్‌పోర్చర్లు ఎక్కడికి వెళ్తే అక్కడ సత్యపు విత్తనాలు వేళ్లూని, బైబిలు విద్యార్థుల సంఖ్య ఎన్నోరెట్లు పెరిగింది.

‘పుస్తకాలమ్ముతూ తిరిగేవాళ్లు’ అంటూ మతనాయకులు కల్‌పోర్చర్లను అసహ్యించుకునేవాళ్లు. 1892 జనవరి వాచ్‌ టవర్‌ పత్రిక ఇలా వ్యాఖ్యానించింది, “వాళ్లు ప్రభువుకు నిజమైన ప్రతినిధులనీ, వాళ్లు చూపించిన వినయాన్ని బట్టి, స్వయంత్యాగాన్ని బట్టి ప్రభువు వాళ్లను ఘనమైనవారిగా ఎంచుతున్నాడనీ చాలామంది గుర్తించలేదు.” ఒక సహోదరి చెప్పినట్లుగా కల్‌పోర్చర్ల జీవితం “పూలబాట” కాదు. ఒక ప్రాంతం నుండి మరో ప్రాంతానికి వెళ్లడానికి గట్టి బూట్లు, సైకిళ్లు తప్పనిసరి. పుస్తకాలు తీసుకున్నవాళ్లు డబ్బులు ఇవ్వలేకపోతే కల్‌పోర్చర్లు వాళ్ల దగ్గర ఆహారం తీసుకునేవాళ్లు. రోజంతా క్షేత్రసేవలో గడిపి, అలసిపోయినా తాము నివాసముండే టెంట్లకు, అద్దె ఇళ్లకు సంతోషంగా తిరిగివచ్చేవాళ్లు. ఆ తర్వాత “కల్‌పోర్చర్‌ వ్యాగన్‌” అనే బండి వాడుకలోకి వచ్చింది, ఆ బండిలో ఇంటిలా అన్ని వసతులూ ఉండేవి. వాటి వల్ల ఎంతో సమయం, డబ్బు ఆదా అయ్యేవి. b

1893లో చికాగోలో జరిగిన సమావేశం మొదలుకొని, కల్‌పోర్చర్ల కోసం సమావేశాల్లో ఒక ప్రత్యేక సెషన్‌ ఉండేది. ఆ సెషన్‌లో వాళ్లు ఉత్సాహంగా తమ అనుభవాలు ఒకరితో ఒకరు పంచుకునేవాళ్లు, ప్రకటనాపని చేసే వివిధ పద్ధతుల గురించి తెలుసుకునేవాళ్లు, పాటించదగిన సలహాలు వినేవాళ్లు. ఉదయాన్నే తృప్తినిచ్చే టిఫిన్‌ తినమని, 10 గంటలకు గ్లాసెడు పాలు తాగమని, మధ్యాహ్నం వేడిగా ఉన్న సమయంలో ఐస్‌క్రీమ్‌ సోడా తాగమని కష్టపడి పనిచేసే సువార్తికులను ఒకసారి సహోదరుడు రస్సెల్‌ ప్రోత్సహించాడు.

సహ కల్‌పోర్చర్ల కోసం లేదా ప్రకటనాపనిలో సహచరుల కోసం చూసే కల్‌పోర్చర్లు సమావేశంలో పసుపు రంగు రిబ్బను పెట్టుకునేవాళ్లు. కొత్త కల్‌పోర్చర్లు ఎక్కువ అనుభవం ఉన్నవాళ్లతో పాటు వెళ్లేవాళ్లు. నిజంగానే అలాంటి శిక్షణ అవసరమైంది, ఎందుకంటే ఒక కొత్త కల్‌పోర్చరు ఒకసారి పుస్తకాలు అందించడానికి వెళ్లి కంగారులో, “ఇవి మీకు వద్దు కదా?” అనేసింది. అయితే సంతోషకరమైన విషయమేమిటంటే, ఆ ఇంటావిడ అవి కావాలని తీసుకొని ఆ తర్వాత సత్యంలోకి వచ్చింది.

ఒక సహోదరుడు, ‘నేను ఇలాగే సంపన్నుడిగా ఉంటూ, ఆ పని కోసం సంవత్సరానికి 1,000 (అమెరికన్‌) డాలర్లు విరాళంగా ఇవ్వనా లేక నేనే స్వయంగా కల్‌పోర్చర్‌గా సేవ చేయనా?’ అని అడిగాడు. ‘ఎలా చేసినా ప్రభువు సంతోషిస్తాడు కానీ నీ సమయాన్ని ప్రభువు పనికోసం వెచ్చిస్తే ఆయన మరింతగా ఆశీర్వదిస్తాడు’ అని ఆయనకు చెప్పారు. “ఎక్కువమందికి ఎంతో మేలు చేయడానికి శ్రేష్ఠమైన మార్గం” కల్‌పోర్చర్‌ సేవేనని మేరీ హైండ్స్‌ గ్రహించింది. ఎంతో బిడియస్థురాలైన ఆల్బర్ట క్రోస్బీ అనే సహోదరి, “కల్‌పోర్చర్‌ పనిపై రోజురోజుకూ ఇష్టం పెంచుకుంటున్నాను” అని చెప్పింది.

ఉత్సాహవంతులైన కల్‌పోర్చర్ల పిల్లలు, వాళ్ల బైబిలు విద్యార్థులు తరతరాలుగా ఇప్పటికీ ఆ సేవలోనే కొనసాగుతున్నారు. ఒకవేళ మీ వంశంలో ఇప్పటికింకా ఒక కల్‌పోర్చర్‌ లేదా పయినీరు లేకపోతే భవిష్యత్తులో ఉండేలా ఇప్పుడే పునాది వేయగలరేమో ఆలోచించండి. అలాచేస్తే, మీకు కూడా పూర్తికాల ప్రకటనాపనిపై రోజురోజుకూ ఇష్టం పెరుగుతుంది.

[అధస్సూచీలు]

a 1931 తర్వాత “కల్‌పోర్చర్‌” అనే పదానికి బదులు “పయినీరు” అనే పదం ఉపయోగించడం మొదలుపెట్టాం.

b ఆ బండ్ల గురించిన మరిన్ని వివరాలు రాబోయే ఒక సంచికలో వస్తాయి.

[32వ పేజీలోని బ్లర్బ్‌]

కల్‌పోర్చర్‌ సేవ చేయడానికి “విద్యావంతులో, నైపుణ్యం గలవాళ్లో, దేవదూతల్లాంటి వక్తలో” అయ్యుండాల్సిన అవసరం లేదు

[31వ పేజీలోని చిత్రం]

దాదాపు 1930లో ఘానాలో కల్‌పోర్చర్‌గా సేవ చేస్తున్న ఎ. డబ్ల్యు. ఆసే

[32వ పేజీలోని చిత్రాలు]

పైన: దాదాపు 1918లో ఇంగ్లాండ్‌లో కల్‌పోర్చర్లుగా సేవ చేస్తున్న ఈడెత్‌ కీన్‌, జర్‌ట్రూడ్‌ మోరీస్‌; కింద: అమెరికాలో కల్‌పోర్చర్లుగా సేవ చేస్తున్న స్టాన్లె కాసబూమ్‌, హెన్రీ నాన్కీస్‌, ప్రజలకు అందించడం కోసం వాళ్లు తీసుకువెళ్లిన పుస్తకాలు ఇచ్చేయడంతో ఖాళీ అయిన అట్టపెట్టెలు