జీవిత కథ
జ్ఞానవంతులైన పెద్దవాళ్లతో స్నేహం చేశాను
ఎల్వ జెర్డీ చెప్పినది
దాదాపు 70 ఏళ్ల క్రితం మా ఇంటికి వచ్చిన ఒక వ్యక్తి మా నాన్నతో అన్న మాట నా జీవితాన్నే మార్చేసింది. ఆ రోజు ఎంతో ప్రత్యేకమైనది. అప్పటినుండి ఇంకా ఎంతోమందితో స్నేహం చేయడం వల్ల కూడా నా జీవితం మారిపోయింది. కొంతకాలానికి, అందరికన్నా నాకెంతో ప్రియమైన ఒకరితో స్నేహబంధం ఏర్పరచుకోగలిగాను. అదెలాగో వివరిస్తాను.
నేను 1932లో ఆస్ట్రేలియాలోని సిడ్నీలో పుట్టాను. మా అమ్మానాన్నలు దేవుణ్ణి నమ్మేవాళ్లు కానీ చర్చికి వెళ్లేవాళ్లు కాదు. నేను ఏదైనా తప్పుచేస్తే శిక్షించడానికి దేవుడు ఎప్పుడూ నన్ను గమనిస్తూ ఉంటాడని మా అమ్మ చెప్పేది. దానితో దేవుడంటే నాకు భయం పట్టుకుంది. కానీ బైబిలంటే మాత్రం ఆసక్తి ఉండేది. వారాంతాల్లో మా పెద్దమ్మ మా ఇంటికి వచ్చినప్పుడెల్లా నాకు ఆసక్తికరమైన బైబిలు కథలెన్నో చెప్పేది. నేనెప్పుడూ ఆమె రాక కోసం ఎదురుచూసేదాన్ని.
నేను టీనేజీలో ఉన్నప్పుడు, యెహోవాసాక్షియైన ఒక వృద్ధ స్త్రీ దగ్గర మా అమ్మ తీసుకున్న పుస్తకాలను మా నాన్న చదివేవాడు. ఆ క్రైస్తవ ప్రచురణల్లో ఉన్న విషయాలు మా నాన్నకు ఎంతో నచ్చి, ఆయన సాక్షులతో బైబిలు అధ్యయనం చేయడానికి ఇష్టపడ్డాడు. ఒక సాయంకాలం ఆయన బైబిలు అధ్యయనం చేస్తుండగా నేను చాటుగా వింటూ ఆయనకు దొరికిపోయాను. అప్పుడు మా నాన్న నన్ను అక్కడి నుండి వెళ్లిపొమ్మని చెప్పేలోగా, మా నాన్నతో అధ్యయనం చేస్తున్న వ్యక్తి, “ఎల్వను కూడా కూర్చోనివ్వచ్చు కదా?” అన్నాడు. ఆయన అన్న ఆ మాట వల్ల నా జీవితం మలుపు తిరిగింది. అప్పుడే సత్య దేవుడైన యెహోవాతో స్నేహం చేయడం మొదలుపెట్టాను.
ఆ తర్వాత కొంతకాలానికే నేను, మా నాన్న కలిసి క్రైస్తవ కూటాలకు వెళ్లడం మొదలుపెట్టాం. ఆయన తాను తెలుసుకుంటున్న విషయాల వల్ల జీవితంలో మార్పులు చేసుకున్నాడు. ఆయన కోపం కూడా తగ్గించుకున్నాడు. దానితో మా అమ్మ, మా అన్నయ్య ఫ్రాంక్ కూటాలకు రావడం మొదలుపెట్టారు. a మేము నలుగురం కావాల్సిన మార్పులు చేసుకొని, బాప్తిస్మం తీసుకొని యెహోవాసాక్షులమయ్యాం. అప్పటినుండి నేను ఎంతోమంది పెద్దవాళ్లతో స్నేహం చేశాను, వాళ్లు నా జీవితమంతటిలో ఎంతగానో సహాయం చేశారు.
జీవితంలో నేను ఏమి చేయాలి?
టీనేజీలో ఉన్న నేను సంఘంలోని పెద్దవాళ్లతో స్నేహం చేశాను. వాళ్లల్లో ఒకరు వృద్ధురాలైన ఆలెస్ ప్లేస్. మా ఇంటికి వచ్చిన మొదటి యెహోవాసాక్షి ఆవిడే. ఆవిడ నాకు బామ్మలాంటిది. నాకు పరిచర్య చేయడం నేర్పించి, నేను కావాల్సిన మార్పులు చేసుకొని బాప్తిస్మం తీసుకునేలా నన్ను ప్రోత్సహించింది కూడా ఆవిడే. నేను 15 ఏళ్ల వయసులో బాప్తిస్మం తీసుకున్నాను.
పెర్సీ డనమ్, మాజ్ [మార్గరేట్] డనమ్ అనే వృద్ధ దంపతులకు కూడా నేనెంతో దగ్గరయ్యాను. వాళ్లతో స్నేహం చేయడం వల్ల నా లక్ష్యాలు మారాయి. నాకు గణితంపై ఉన్న మక్కువ వల్ల లెక్కల టీచర్ అవ్వాలని ఉండేది. 1930లలో లాట్వియాలో మిషనరీలుగా సేవ చేస్తున్న పెర్సీ, మాజ్ యూరప్‌లో రెండవ ప్రపంచ యుద్ధం మొదలైనప్పుడు సిడ్నీలో ఉన్న ఆస్ట్రేలియా బెతెల్‌లో సేవ చేయడానికి వచ్చారు. వాళ్లిద్దరూ నా విషయంలో ఎంతో శ్రద్ధ
తీసుకున్నారు. మిషనరీ సేవలో వాళ్లకు ఎదురైన ఆసక్తికరమైన అనుభవాలెన్నో చెప్పారు. లెక్కల టీచర్‌గా పని చేయడం కన్నా బైబిలు గురించి బోధించడం ఎంతో సంతృప్తికరంగా ఉంటుందని నాకు అర్థమయ్యింది. కాబట్టి నేను మిషనరీగా సేవ చేయాలనుకున్నాను.పయినీరు సేవ చేయడం ద్వారా మిషనరీ సేవకు సిద్ధపడమని వాళ్లు నన్ను ప్రోత్సహించారు. కాబట్టి 1948లో నాకు 16 ఏళ్లున్నప్పుడు నేను క్రమ పయినీరునయ్యాను. అప్పటికే, సిడ్నీలోని హస్ట్‌విల్లేలో ఉన్న మా సంఘంలో పదిమంది ఇతర యౌవనస్థులు సంతోషంగా పయినీరు సేవ చేస్తున్నారు.
ఆ తర్వాతి నాలుగు సంవత్సరాల్లో నేను న్యూ సౌత్ వేల్స్‌లో, క్వీన్స్‌లాండ్‌లో ఉన్న నాలుగు పట్టణాల్లో సేవ చేశాను. నా మొదటి బైబిలు విద్యార్థుల్లో ఒకరు బెట్టీ లా (ఇప్పుడు బెట్టీ రెమ్నంట్), ఆమె ఎంతో ప్రేమగలది. ఆమె నాకన్నా రెండేళ్లు పెద్దది. ఆమె ఆ తర్వాత, సిడ్నీకి పశ్చిమాన దాదాపు 230 కిలోమీటర్ల దూరంలో ఉన్న కౌరా పట్టణంలో నేను పయినీరు సేవ చేస్తున్నప్పుడు నాతోపాటు పయినీరు సేవ చేసింది. మేమిద్దరం కలిసి పయినీరు సేవ చేసింది కొద్దికాలమే అయినా ఇప్పటికీ మేము మంచి స్నేహితులం.
కౌరా పట్టణానికి నైరుతి దిక్కున 220 కిలోమీటర్ల దూరంలో ఉన్న నరాండ్రలో సేవ చేయడానికి నన్ను ప్రత్యేక పయినీరుగా నియమించారు. అక్కడ నేను ఎంతో ఉత్సాహంగల పయినీరైన జాయ్ లెన్నాక్స్ (ఇప్పుడు జాయ్ హంటర్) అనే సహోదరితో కలిసి సేవ చేశాను. ఆమె కూడా నాకన్నా రెండేళ్లు పెద్దది. అప్పట్లో ఆ పట్టణంలో మేమిద్దరమే సాక్షులం. మేము అతిథిప్రియులైన రే ఐరన్స్, ఎస్తెర్ ఐరన్స్ అనే దంపతుల ఇంట్లో ఉండేవాళ్లం. వాళ్లు, వాళ్ల అబ్బాయి, వాళ్ల ముగ్గురు అమ్మాయిలు సత్యం పట్ల ఆసక్తి చూపించారు. రే, వాళ్లబ్బాయి వారమంతా ఊరి బయటవున్న గొర్రెల దొడ్డిలో, గోధుమల పొలంలో పనిచేసేవాళ్లు. ఎస్తెర్, వాళ్లమ్మాయిలు కలిసి వసతిగృహాన్ని నడిపించేవాళ్లు. ప్రతీ ఆదివారం సాయంకాలం నేను, జాయ్ కలిసి ఆ కుటుంబానికి, వాళ్ల వసతిగృహంలో ఉండే దాదాపు పన్నెండుమంది రైల్వే కూలీలకు వంట చేసిపెట్టేవాళ్లం. వాళ్లు ఆకలితో నకనకలాడుతూ ఉండేవాళ్లు. అంతమంది కోసం చాలా పెద్ద మొత్తంలో మాంసం వండేవాళ్లం. అలా చేయడం వల్ల మేము కట్టాల్సిన అద్దెలో కొంత తగ్గించేవాళ్లు. భోజనాలయ్యాక అంతా శుభ్రం చేసేసి, ఆ కుటుంబానికి మేము కమ్మని ఆధ్యాత్మిక విందు ఇచ్చేవాళ్లం అంటే వాళ్లతో కలిసి ఆ వారపు కావలికోట అధ్యయనం చేసేవాళ్లం. రే, ఎస్తెర్, వాళ్ల నలుగురు పిల్లలు సత్యంలోకి వచ్చారు, నరాండ్ర సంఘంలో వాళ్లే మొదటి సభ్యులు.
1951లో సిడ్నీలో జరిగిన యెహోవాసాక్షుల జిల్లాసమావేశానికి హాజరయ్యాను. అప్పుడు, మిషనరీ సేవ చేయాలనే ఆసక్తి ఉన్న పయినీర్ల కోసం ఏర్పాటు చేసిన ఒక ప్రత్యేక కూటానికి నేను హాజరయ్యాను. ఒక పెద్ద టెంట్ కింద జరిగిన ఆ కూటానికి 300 కన్నా ఎక్కువమంది హాజరయ్యారు. ఆ కూటంలో బ్రూక్లిన్ బెతెల్ నుండి వచ్చిన సహోదరుడు నేథన్ నార్ ప్రసంగిస్తూ భూమి నలుమూలలకు సువార్త వ్యాప్తి చేయడం అత్యవసరమని చెప్పాడు. ఆయన చెబుతున్న ప్రతీ మాట మేము చాలా శ్రద్ధగా విన్నాం. ఆ కూటానికి హాజరైన పయినీర్లలో చాలామంది దక్షిణ పసిఫిక్‌లో, ఇతర ప్రాంతాల్లో రాజ్య ప్రకటనాపనిని ప్రారంభించారు. 1952లో నన్ను గిలియడ్ పాఠశాల 19వ తరగతికి ఆహ్వానించడంతో నేను ఎంతో పులకించిపోయాను, నాతోపాటు మరో 16 మంది ఆస్ట్రేలియన్లను ఆహ్వానించారు. మిషనరీ సేవ చేయాలన్న నా కల నిజమయ్యే అవకాశం వచ్చింది! అప్పటికి నాకు 20 ఏళ్లే!
నాలో ఇంకా మార్పులు అవసరమయ్యాయి
గిలియడ్ పాఠశాలలో నాకు లభించిన నిర్దేశం, సహవాసం వల్ల బైబిలు విషయాల్లో నాకున్న జ్ఞానం అధికమైంది, నా విశ్వాసం బలపడింది. అంతేగాక, వాటివల్ల నా వ్యక్తిత్వంలో కూడా ఎంతో మార్పు వచ్చింది. నేను అప్పటికి వయసులో చిన్నదాన్ని, అన్ని విషయాల్లో పద్ధతిగా ఉండడానికి ప్రయత్నించేదాన్ని. నా పరిమితుల్ని, ఇతరుల పరిమితుల్ని అర్థం చేసుకోకుండా పరిపూర్ణతను ఆశించేదాన్ని. కొన్ని విషయాల్లో మరీ కఠినంగా ఉండేదాన్ని. ఉదాహరణకు, సహోదరుడు నార్ బెతెల్‌లో ఉన్న కొంతమంది కుర్రాళ్లతో కలిసి గ్రౌండ్‌లో ఆడడం చూసి నేను అవాక్కయ్యాను.
ఎన్నో సంవత్సరాల అనుభవమున్న, జ్ఞానవంతులైన గిలియడ్ ఉపదేశకులు నేను పడుతున్న అవస్థను గమనించివుంటారు. అందుకే వాళ్లు నాపై శ్రద్ధ చూపించి నా ఆలోచనా విధానాన్ని సరిచేసుకోవడానికి సహాయం చేశారు. యెహోవా కఠినుడు కాదని, క్రూరుడు కాదని, ఆయన ప్రేమగల దేవుడని, మనం చేసే దాన్ని విలువైనదిగా ఎంచుతాడని నేను మెల్లగా గ్రహించడం మొదలుపెట్టాను. ఈ విషయంలో నా తోటి విద్యార్థులు కూడా నాకు సహాయం చేశారు. వాళ్లలో ఒకరు నాకిలా చెప్పడం గుర్తుంది, “యెహోవా కొరడా ఝుళిపించేవాడు కాదు ఎల్వా. నీ విషయంలో
నువ్వు మరీ అంత కఠినంగా ఉండకు.” నిర్మొహమాటంగా ఆమె చెప్పిన మాటలు నా మనసును తాకాయి.గిలియడ్ తరగతి ముగిసిన తర్వాత నన్ను, నా తోటి విద్యార్థుల్లో నలుగురిని ఆఫ్రికాలోని నమీబియాకు మిషనరీలుగా పంపించారు. ఆ తర్వాత ఎంతోకాలం గడవకముందే అక్కడ మేము నిర్వహిస్తున్న బైబిలు అధ్యయనాల సంఖ్య 80కి చేరుకుంది. నమీబియా క్షేత్రం, మిషనరీ జీవితం నాకెంతో నచ్చాయి. కానీ నేనక్కడ ఒక్క సంవత్సరమే ఉన్నాను. ఎందుకంటే నేను అంతకుముందే నాతోపాటు గిలియడ్ విద్యార్థిగావున్న ఒకతన్ని ప్రేమించాను. అతణ్ణి స్విట్జర్లాండ్‌కు మిషనరీగా పంపించారు కాబట్టి నేను కూడా అక్కడికి వెళ్లిపోయాను. ఆయన ప్రాంతీయ పర్యవేక్షకుడిగా సేవ చేస్తుండడంతో, మా పెళ్లయిన తర్వాత నేను కూడా ఆయనతో పాటు వెళ్లాను.
తట్టుకోలేని దెబ్బ
మేము ప్రయాణ సేవలో సంతోషంగా ఐదు సంవత్సరాలు గడిపిన తర్వాత స్విట్జర్లాండ్ బెతెల్‌లో సేవ చేసేందుకు ఆహ్వానాన్ని అందుకున్నాం. అక్కడి బెతెల్ కుటుంబంలో, నాకన్నా పెద్దవాళ్లైన ఆధ్యాత్మిక పరిణతి గల సహోదర సహోదరీల మధ్య ఉండడం నాకెంతో సంతోషాన్నిచ్చింది.
ఆ తర్వాత కొంతకాలానికే నా మనసుకు తట్టుకోలేని గాయమైంది. నా భర్త యెహోవాకు, నాకు నమ్మకద్రోహం చేశాడని తెలిసింది. ఆ తర్వాత ఆయన నన్ను వదిలేసి వెళ్లిపోయాడు. నేనెంతో వేదన పడ్డాను. బెతెల్ కుటుంబంలోని పెద్దవాళ్లైన నా ప్రియ స్నేహితులు నా పక్కన లేకపోయుంటే నా పరిస్థితి ఎలా ఉండేదో! నా బాధ చెప్పుకుంటున్నప్పుడు వాళ్లు వినేవాళ్లు, నాకు విశ్రాంతి అవసరమైనప్పుడు వాళ్లు నన్ను ఒంటరిగా విడిచిపెట్టేవాళ్లు. మాటల్లో చెప్పలేనంత వేదన అనుభవిస్తున్న సమయంలో వాళ్లు ఓదార్పుకరంగా మాట్లాడడం వల్ల, దయతో సహాయం చేయడం వల్ల నాకు కావాల్సిన ఆదరణ దొరికింది, యెహోవాకు మరింత దగ్గరయ్యాను.
కష్టాల వల్ల వేదనను అనుభవించిన మాజ్ డనమ్‌లాంటి జ్ఞానవంతులైన పెద్దవాళ్లు నాకు ఒకప్పుడు చెప్పిన మాటలను కూడా నేను గుర్తుచేసుకున్నాను. ఆమె ఒకసారి నాతో ఇలా అంది, “యెహోవా సేవకు అంకితం చేసుకున్న జీవితంలో నీకెన్నో కష్టాలు ఎదురౌతాయి ఎల్వా. నీకు ఎంతో కావాల్సిన వాళ్ల నుండే పెద్ద పరీక్షలు ఎదురుకావచ్చు. ఆ సమయాల్లో నువ్వు యెహోవాపై నమ్మకముంచాలి. నువ్వు అపరిపూర్ణ మనుష్యులను కాదుగానీ యెహోవాను సేవిస్తున్నావన్న విషయం మర్చిపోకూడదు.” ఆమె ఇచ్చిన ఆ ఉపదేశం, నా జీవితంలో వేదనకరమైన పరిస్థితులు వచ్చినప్పుడు ఎంతగానో ఉపయోగపడింది. నా భర్త తప్పు చేశాడనే కారణాన్ని బట్టి నేను యెహోవాకు ఎన్నడూ దూరమవ్వకూడదని గట్టిగా నిర్ణయించుకున్నాను.
కొంతకాలానికి, నా కుటుంబానికి దగ్గరగా ఉండి పయినీరు సేవచేయడానికి ఆస్ట్రేలియాకు తిరిగి వెళ్లిపోవాలని నిర్ణయించుకున్నాను. నేను ఇంటికి వెళ్లడానికి చేసిన సుదీర్ఘమైన సముద్రయానంలో నా తోటి ప్రయాణికులతో బైబిలు నుండి ఎన్నో ఆసక్తికరమైన విషయాల్ని చర్చించాను. ఆ గుంపులో ఆర్న జెర్డీ అనే వ్యక్తి కూడా ఉన్నాడు. ఆయన నార్వే దేశానికి చెందినవాడు. ఆయన చాలా నెమ్మదస్థుడు. నేను చెబుతున్న విషయాలు ఆయనకు నచ్చాయి. ఆర్న ఆ తర్వాత సిడ్నీకి వచ్చి నన్ను, మా కుటుంబాన్ని కలిశాడు. ఆయన త్వరత్వరగా మార్పులు చేసుకొని సత్యంలోకి వచ్చాడు. 1963లో నేను, ఆర్న పెళ్లి చేసుకున్నాం. రెండు సంవత్సరాల తర్వాత మాకు ఒక బాబు పుట్టాడు, వాడి పేరు గ్యారీ.
నాకు మరో కష్టం వచ్చిపడింది
మేము, మా అబ్బాయి కలిసి ఎంతో సంతోషంగా జీవించసాగాం. కొంతకాలానికి, వృద్ధులైన మా అమ్మానాన్నలను చూసుకోవాల్సి వచ్చింది. అయితే, వాళ్లను మాతో పాటు ఉంచుకొని చూసుకోవడానికి మా ఇల్లు సరిపోదు కాబట్టి ఆర్న ఇంకొన్ని గదులు కట్టించాడు. మా పెళ్లైన ఆరు సంవత్సరాలకు, మాకు మరో రకమైన కష్టం వచ్చిపడింది. ఆర్నకు బ్రెయిన్ క్యాన్సర్ అని తేలింది. వికిరణ చికిత్స (రేడియేషన్ థెరపీ) కోసం ఆయన ఎన్నో రోజుల పాటు ఆసుపత్రిలో ఉండాల్సి రావడంతో నేను ప్రతీరోజు ఆయన దగ్గరికి వెళ్లొచ్చేదాన్ని. కొన్నిరోజులు ఆయన పరిస్థితి మెరుగైనట్లు కనిపించింది కానీ, ఆయన పరిస్థితి మళ్లీ విషమంగా తయారై ఆయనకు పక్షవాతం వచ్చింది. ఆయన ఇక కొన్నివారాలే బ్రతుకుతాడని చెప్పారు కానీ ఆర్న కోలుకున్నాడు. ఆయన ఇంటికి తిరిగి వచ్చాక
నేను ఆయన దగ్గరే ఉండి చూసుకున్నాను, అలా ఆయన ఆరోగ్యం కుదుటపడింది. కొంతకాలానికి, ఆయన మళ్లీ లేచి నడవసాగాడు, మళ్లీ సంఘపెద్దగా తన బాధ్యతల్ని కొనసాగించాడు. ఆయన సంతోషంగా, సరదాగా ఉండే మనిషి కావడం వల్ల త్వరగా కోలుకోగలిగాడు, ఆయనను చూసుకోవడం నాకు కూడా కాస్త సులభమైంది.చాలా సంవత్సరాలు గడిచాక 1986లో ఆర్న ఆరోగ్యం మళ్లీ పాడైంది. అప్పటికే మా అమ్మానాన్నలు చనిపోయారు కాబట్టి, మేము సిడ్నీకి బయట ఉన్న అందమైన బ్లూ మౌంటెన్స్ ప్రాంతానికి తరలి వెళ్లాం. అక్కడ మా ఇల్లు మా స్నేహితుల ఇళ్లకు దగ్గరగా ఉండేది. ఆ తర్వాత మా అబ్బాయి, క్యారన్ అనే ప్రేమగల ఆధ్యాత్మిక సహోదరిని పెళ్లి చేసుకున్నాడు. నలుగురం కలిసి ఒకే ఇంట్లో ఉందామని వాళ్లు అన్నారు. కొన్ని నెలల్లోనే, మేము అందరం కలిసి ఉండేందుకు వీలుగా ఒక కొత్త ఇంటికి మారాం. ఆ కొత్త ఇల్లు అప్పటివరకు నేను, నా భర్త ఉంటున్న ఇంటికి దగ్గర్లోనే ఉంది.
ఆర్న మంచాన పడడంతో ఆయన జీవితంలోని చివరి 18 నెలల్లో ఎప్పుడూ ఆయన దగ్గరే ఉండి చూసుకోవాల్సి వచ్చింది. నేను ఎక్కువ సమయం ఇంట్లోనే ఉండాల్సి వచ్చేది కాబట్టి ప్రతీరోజు రెండు గంటల పాటు బైబిలు, బైబిలు ఆధారిత ప్రచురణలు చదివేదాన్ని. నేను అధ్యయనం చేస్తూ గడిపిన ఆ సమయంలో, నేనున్న పరిస్థితిని ఎలా తాళుకోవాలనే దాని గురించి ఎన్నో మంచి సలహాలు తెలుసుకున్నాను. మా సంఘంలోని కొంతమంది పెద్దవాళ్లు మమ్మల్ని పలకరించడానికి వస్తుండేవాళ్లు. వాళ్లలో కొంతమంది అలాంటి కష్టాల్నే ఎదుర్కొన్నారు. వాళ్లు అలా వచ్చిపోతూ ఉండడం వల్ల నేను ఎంతో ప్రోత్సాహాన్ని పొందాను. ఆర్న 2003 ఏప్రిల్‌లో చనిపోయాడు. ఆయనకు పునరుత్థానం చేయబడతాననే గట్టి నమ్మకం ఉండేది.
నాకు దొరికిన అత్యంత గొప్ప సహాయం
చిన్న వయసులో ఉన్నప్పుడు నేను అన్నివిషయాల్లో చాలా పద్ధతిగా ఉండడానికి ప్రయత్నించేదాన్ని. కానీ, జీవితం మనమనుకున్నట్లు ఉండదని గ్రహించాను. నమ్మకద్రోహం వల్ల ఒక భర్తను, అనారోగ్యం వల్ల మరో భర్తను కోల్పోవడం వంటి రెండు పెద్ద కష్టాలను ఎదుర్కొన్నాను. అయితే, నేను యెహోవా సేవలో ఎన్నో ఆశీర్వాదాలు కూడా పొందాను. జీవితంలో ఎన్నో విధాలుగా మార్గనిర్దేశాన్ని, ఓదార్పును నేను పొందాను. అయితే, ‘మహావృద్ధుడైన’ యెహోవా దేవుని నుండే నాకు ఇప్పటికీ అత్యంత గొప్ప సహాయం దొరుకుతోంది. (దాని. 7:9) ఆయన ఉపదేశం వల్ల నా వ్యక్తిత్వం మారింది. దానివల్ల నేను మిషనరీ సేవలో ఎన్నో చక్కని అనుభవాలు పొందాను. కష్టాలు వచ్చినప్పుడు, ‘యెహోవా కృప నన్ను బలపర్చింది, ఆయన ఇచ్చిన ఆదరణ నా ప్రాణానికి నెమ్మది కలగజేసింది.’ (కీర్త. 94:18, 19) ‘దుర్దశలో సహోదరులుగా ఉండే నిజమైన స్నేహితుల,’ నా కుటుంబ సభ్యుల ప్రేమను, సహాయసహకారాలను కూడా పొందాను. (సామె. 17:17) వాళ్లలో చాలామంది జ్ఞానవంతులైన పెద్దవాళ్లే.
“వృద్ధులయొద్ద జ్ఞానమున్నది, దీర్ఘాయువువలన వివేచన కలుగుచున్నది” అని పితరుడైన యోబు అన్నాడు. (యోబు 12:12) నా జీవితంలోని అనుభవాల్ని బట్టి ఆ మాటలు నిజమేనని నేను చెప్పగలను. జ్ఞానవంతులైన పెద్దవాళ్లు ఇచ్చిన సలహాలు నా జీవితంలో ఎంతగానో ఉపయోగపడ్డాయి, వాళ్లిచ్చిన ఓదార్పు వల్ల నేను కష్టాల్ని తట్టుకోగలిగాను, వాళ్ల స్నేహం వల్ల నా జీవితం మెరుగైంది. వాళ్లతో స్నేహం చేయగలిగినందుకు నేను ఎంతో కృతజ్ఞురాలిని.
నాకు 80 ఏళ్లు కాబట్టి ఇప్పుడు నేను కూడా పెద్దదాన్నే. జీవితంలో నాకెదురైన అనుభవాల వల్ల పెద్ద వయసులో ఉన్న తోటివాళ్ల అవసరాలను నేను అర్థం చేసుకోగలుగుతున్నాను. ఇప్పటికీ వాళ్ల దగ్గరికి వెళ్లి వాళ్లను పలకరించడమంటే నాకు ఎంతో ఇష్టం. అయితే, యౌవనులతో సమయం గడపడం కూడా నాకిష్టమే. వాళ్ల యౌవన బలాన్ని చూస్తే నాకూ బలం వచ్చినట్లు అనిపిస్తుంది, వాళ్ల ఉత్సాహాన్ని చూస్తే నాకూ ఉత్సాహం కలుగుతుంది. మార్గనిర్దేశం కోసం లేదా సహాయం కోసం యౌవనులు నా దగ్గరికి వచ్చినప్పుడు, వాళ్లకు అందుబాటులో ఉండగలిగినందుకు నాకు చాలా సంతోషంగా ఉంటుంది.
[అధస్సూచి]
a ఎల్వ వాళ్ల అన్నయ్య ఫ్రాంక్ లాంబెర్ట్ ఆస్ట్రేలియాలోని మారుమూల ప్రాంతాల్లో ఉత్సాహంగా పయినీరు సేవ చేశాడు. పరిచర్యలో ఆయనకు ఎదురైన ఆసక్తికరమైన అనుభవాల గురించి 1983 యెహోవాసాక్షుల వార్షిక పుస్తకము (ఆంగ్లం)లోని 110-112 పేజీల్లో ఉంది.
[14వ పేజీలోని చిత్రం]
నరాండ్రలో జాయ్ లెన్నాక్స్‌తో కలిసి పయినీరు సేవచేస్తున్నప్పుడు
[15వ పేజీలోని చిత్రం]
1960లో స్విట్జర్లాండ్‌లోని బెతెల్ కుటుంబ సభ్యులతో
[16వ పేజీలోని చిత్రం]
అనారోగ్యంతో ఉన్న ఆర్నను చూసుకుంటున్నప్పుడు