కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

దేవుని బహుమానమైన వివాహాన్ని నిజంగా విలువైనదిగా ఎంచుతున్నారా?

దేవుని బహుమానమైన వివాహాన్ని నిజంగా విలువైనదిగా ఎంచుతున్నారా?

దేవుని బహుమానమైన వివాహాన్ని నిజంగా విలువైనదిగా ఎంచుతున్నారా?

“మీలో ఒక్కొక్కతె పెండ్లి చేసికొని తన యింట నెమ్మదినొందునట్లు యెహోవా దయచేయును గాక.”—రూతు 1:9.

వీటికి జవాబివ్వగలరేమో చూడండి:

దేవుని బహుమానమైన వివాహాన్ని గతంలోని దేవుని సేవకులు విలువైనదిగా ఎంచారని ఎందుకు చెప్పవచ్చు?

మనం ఎవరిని జీవితభాగస్వామిగా ఎంచుకుంటామనే విషయంలో యెహోవాకు శ్రద్ధ ఉందని ఎందుకు చెప్పవచ్చు?

వివాహబంధానికి సంబంధించి బైబిల్లో ఉన్న ఏ ఉపదేశాన్ని పాటించాలని మీరనుకుంటున్నారు?

1. ఆదాము తనకు భార్య లభించినప్పుడు ఎలా స్పందించాడో వివరించండి.

 “నాయెముకలలో ఒక యెముక నా మాంసములో మాంసము, ఇది నరునిలోనుండి తీయబడెను గనుక నారి అనబడును.” (ఆది. 2:23) మొదటి మానవుడైన ఆదాము తనకు భార్య లభించినందుకు ఎంత సంతోషించాడో! ఆ సందర్భంలోనే ఆయన ఆనందపారవశ్యంతో ఆ చక్కని కవిత చెప్పాడు. యెహోవా ఆదాముకు గాఢనిద్ర వచ్చేలా చేసి, ఆయన ప్రక్కటెముకల్లో ఒకటి తీసి అందమైన స్త్రీని సృష్టించాడు. ఆదాము ఆమెకు హవ్వ అని పేరు పెట్టాడు. వాళ్లు సంతోషంగా జీవించేలా దేవుడు వాళ్లిద్దరికి వివాహం చేశాడు. యెహోవా హవ్వను సృష్టించడానికి ఆదాము ప్రక్కటెముకను ఉపయోగించాడు కాబట్టి, ఇప్పుడున్న భార్యాభర్తలందరి బంధం కంటే వాళ్ల బంధం చాలా సన్నిహితమైనది.

2. స్త్రీపురుషుల్లో ఒకరి పట్ల ఒకరికి ఎందుకు ఆకర్షణ ఉంటుంది?

2 యెహోవాకు సాటిలేని జ్ఞానం ఉంది కాబట్టి, ఒకరినొకరు ప్రేమించుకునే సామర్థ్యంతో ఆయన స్త్రీపురుషులను సృష్టించాడు. దాని వల్లే వాళ్లలో ఒకరి పట్ల ఒకరికి ఆకర్షణ ఉంటుంది. “పెళ్లి చేసుకునే స్త్రీపురుషులు లైంగిక సంబంధాన్ని ఆనందించాలని, ఒకరినొకరు జీవితాంతం ప్రేమించుకోవాలని కోరుకుంటారు” అని ద వరల్డ్‌ బుక్‌ ఎన్‌సైక్లోపీడియా చెబుతోంది. యెహోవా ప్రజలు ఎంతోమంది పెళ్లి చేసుకొని అలాగే సంతోషంగా జీవిస్తున్నారు.

వివాహమనే బహుమానాన్ని ఇచ్చినందుకు వాళ్లు దేవునికి కృతజ్ఞత చూపించారు

3. ఇస్సాకుకు భార్య ఎలా లభించింది?

3 నమ్మకస్థుడైన అబ్రాహాము వివాహాన్ని ఎంతో ఉన్నతమైనదిగా ఎంచాడు. అందుకే ఆయన ఇస్సాకుకు పెళ్లి చేసేందుకు అమ్మాయి కోసం తన పెద్ద దాసుణ్ణి మెసొపొతమియకు పంపించాడు. ఆ విషయం గురించి ఆ దాసుడు ప్రార్థన చేయడం వల్ల మంచి ఫలితాలు వచ్చాయి. దైవభయంగల రిబ్కా ఇస్సాకుకు భార్యయై ఆయన ప్రేమను పొందింది. అబ్రాహాము వంశంలో ఒక వారసుడు ఉండేలా చూడడానికి యెహోవా చేసిన ఏర్పాటులో ఆమెకు కూడా వంతు ఉంది. (ఆది. 22:18; 24:12-14, 67) ఈ వృత్తాంతాన్ని ఆధారంగా తీసుకుని, ఒక వ్యక్తి సదుద్దేశంతోనే అయినా, పెళ్లిళ్ల పేరయ్యగా తయారవ్వడం మంచిదికాదు. ఈ రోజుల్లో చాలామంది తమ జీవితభాగస్వామిని తామే ఎంచుకుంటున్నారు. పెళ్లిళ్లు స్వర్గంలో జరుగుతాయన్నది నిజం కాకపోయినా క్రైస్తవులు దేవుని నిర్దేశం కోసం ప్రార్థిస్తే, పరిశుద్ధాత్మ ద్వారా ఆయన ఇచ్చే నడిపింపును స్వీకరిస్తే, ఆయన ఈ విషయంలో, అలాగే జీవితానికి సంబంధించిన ఇతర విషయాల్లో వాళ్లకు కావాల్సిన నిర్దేశాల్ని ఇస్తాడు.—గల. 5:18, 25.

4, 5. షూనేమీయురాలు, గొర్రెల కాపరి ఒకరినొకరు ప్రేమించుకున్నారని మనమెలా చెప్పవచ్చు?

4 అప్పటికే ఎంతోమంది భార్యలున్న సొలొమోనును పెళ్లి చేసుకోమని ప్రాచీన ఇశ్రాయేలుకు చెందిన ఒక అందమైన షూనేమీయురాలిని (షూలమ్మీతీ) ఆమె స్నేహితురాళ్లు ఒత్తిడి చేశారు, కానీ ఆమె దాన్ని ఇష్టపడలేదు. ఆమె ఇలా అంది, ‘యెరూషలేము కుమార్తెలారా, ప్రేమ దానంతటదే మేల్కొనే వరకు దాన్ని లేపము, పురికొల్పము అని ప్రమాణం చేయండి.’ (పరమ. 8:4, పవిత్ర గ్రంథం, వ్యాఖ్యాన సహితం) ఆ షూనేమీయురాలు, ఒక గొర్రెల కాపరి ప్రేమించుకున్నారు. ఆమె వినయంగా, “నేను షారోను పొలములో పూయు పుష్పము వంటిదానను, లోయలలో పుట్టు పద్మము వంటిదానను” అంది. దానికి ఆ అబ్బాయి ఇలా అన్నాడు, “బలురక్కసి చెట్లలో వల్లిపద్మము కనబడునట్లు స్త్రీలలో నా ప్రియురాలు కనబడుచున్నది.” (పరమ. 2:1, 2) వాళ్లు నిజంగా ఒకరినొకరు ప్రేమించుకున్నారు.

5 ఆ షూనేమీయురాలికి, ఆ గొర్రెల కాపరికి దేవుని మీద ఎంతో ప్రేమ ఉంది కాబట్టి, వాళ్ల వైవాహిక బంధం పటిష్ఠంగా ఉంటుంది. నిజానికి, ఆ షూనేమీయురాలు తన ప్రియుడైన ఆ గొర్రెల కాపరితో ఇలా అంది, “ప్రేమ మరణమంత బలవంతమైనది. ఈర్ష్య పాతాళమంత కఠోరమైనది. దాని జ్వాలలు అగ్నిజ్వాలా సమములు. అది యెహోవా పుట్టించు జ్వాల. నీ హృదయముమీద నన్ను నామాక్షరముగా ఉంచుము. నీ భుజమునకు నామాక్షరముగా నన్నుంచుము. అగాధసముద్రజలము ప్రేమను ఆర్పజాలదు. నదీప్రవాహములు దాని ముంచివేయజాలవు. ప్రేమకై యొకడు తన స్వాస్థ్యమంత ఇచ్చినను తిరస్కారముతో అతడు త్రోసివేయబడును.” (పరమ. 8:6, 7) అలాగే, తమ జీవిత భాగస్వామి తమకు నమ్మకంగా కట్టుబడి ఉండాలని నేటి క్రైస్తవులు కూడా ఆశించాలి కదా.

మన నిర్ణయం విషయంలో దేవునికి శ్రద్ధ ఉంది

6, 7. మనం ఎవరిని జీవితభాగస్వామిగా ఎంచుకుంటామనే విషయంలో యెహోవాకు శ్రద్ధ ఉందని మనకెలా తెలుసు?

6 మనం ఎవరిని జీవితభాగస్వామిగా ఎంచుకుంటామనే విషయంలో యెహోవాకు శ్రద్ధ ఉంది. కనాను దేశస్థుల విషయంలో యెహోవా ఇశ్రాయేలీయులకు ఇలా ఆజ్ఞాపించాడు, “నీవు వారితో వియ్యమందకూడదు, వాని కుమారునికి నీ కుమార్తె నియ్యకూడదు, నీ కుమారునికి వాని కుమార్తెను పుచ్చుకొనకూడదు. నన్ను అనుసరింపకుండ ఇతర దేవతలను పూజించునట్లు నీ కుమారుని వారు మళ్లించుదురు; అందునుబట్టి యెహోవా కోపాగ్ని నీమీద రగులుకొని ఆయన నిన్ను త్వరగా నశింపజేయును.” (ద్వితీ. 7:3, 4) కొన్ని శతాబ్దాల తర్వాత, యాజకుడైన ఎజ్రా ఇలా ప్రకటించాడు, “మీరు ఆజ్ఞను మీరి అన్యస్త్రీలను పెండ్లిచేసికొని, ఇశ్రాయేలీయుల అపరాధమును ఎక్కువ చేసితిరి.” (ఎజ్రా 10:10) ఆ తర్వాత, అపొస్తలుడైన పౌలు తన తోటి క్రైస్తవులకు ఇలా చెప్పాడు, “భార్య తన భర్త బ్రదికియున్నంతకాలము బద్ధురాలైయుండును. భర్త మృతిపొందినయెడల ఆమె కిష్టమైనవానిని పెండ్లి చేసికొనుటకు స్వతంత్రురాలై యుండునుగాని ప్రభువునందు మాత్రమే పెండ్లిచేసికొనవలెను.”—1 కొరిం. 7:39.

7 యెహోవాకు సమర్పించుకున్న ఒక వ్యక్తి అవిశ్వాసిని పెళ్లి చేసుకుంటే యెహోవాకు అవిధేయత చూపించినట్లే అవుతుంది. ఎజ్రా కాలంలోని ఇశ్రాయేలీయులు “అన్యస్త్రీలను పెండ్లిచేసికొని,” యెహోవాకు నమ్మకంగా ఉండలేదు. లేఖనాల్లో స్పష్టంగా ఉన్న నియమాలను తేలిగ్గా తీసుకోవడం తప్పు. (ఎజ్రా 10:10; 2 కొరిం. 6:14, 15) అవిశ్వాసుల్ని పెళ్లి చేసుకునే క్రైస్తవులు దేవుని బహుమానమైన వివాహాన్ని నిజంగా విలువైనదిగా ఎంచడంలేదని చెప్పవచ్చు, అలాంటివాళ్లు ఇతరులకు ఆదర్శంగా ఉండలేరు. బాప్తిస్మం తీసుకున్న తర్వాత అలా అవిశ్వాసులను పెళ్లి చేసుకుంటే వాళ్లు కొన్ని సేవావకాశాల్ని పోగొట్టుకుంటారు. ‘యెహోవా, నేను కావాలనే అవిధేయత చూపించాను. కానీ దయచేసి ఎలాగైనా నన్ను ఆశీర్వదించు’ అని ప్రార్థిస్తూ యెహోవా ఆశీర్వాదాల కోసం ఆశించడం సముచితం కాదు.

మనకేది మంచిదో మన పరలోక తండ్రికే బాగా తెలుసు

8. వివాహం విషయంలో యెహోవా దేవుని నిర్దేశాల్ని మనం ఎందుకు పాటించాలో వివరించండి.

8 ఒక యంత్రాన్ని తయారుచేసిన వ్యక్తికి అది సరిగ్గా ఎలా పనిచేస్తుందో తెలిసి ఉంటుంది. ఆ యంత్రానికి సంబంధించిన ఒక్కో భాగాన్ని ఎలా అమర్చాలో ఆయన చెప్పగలుగుతాడు. కానీ మనం ఆయన ఇచ్చిన సూచనలను పట్టించుకోకుండా దాని భాగాల్ని మన ఇష్టం వచ్చినట్లు అమరిస్తే ఏమౌతుంది? ఫలితాలు చాలా ప్రమాదకరంగా ఉండవచ్చు, అసలది పనిచేయక పోవచ్చు కూడా. వివాహం విషయంలో కూడా అంతే, మన వైవాహిక జీవితం సంతోషంగా సాగాలంటే, వివాహ ఏర్పాటును ప్రారంభించిన యెహోవా దేవుని నిర్దేశాల్ని పాటించాలి.

9. ఒంటరితనం వల్ల కలిగే బాధను, వివాహం వల్ల వచ్చే సంతోషాన్ని యెహోవా అర్థం చేసుకోగలడని ఎందుకు చెప్పవచ్చు?

9 మానవజాతి గురించి, వివాహం గురించి యెహోవాకు పూర్తిగా తెలుసు. మానవులు “ఫలించి అభివృద్ధి” పొందడానికి వీలుగా ఆయన వాళ్లల్లో లైంగిక అవసరతను ఉంచాడు. (ఆది. 1:28) తోడు లేకుండా ఒంటరిగా ఉంటే ఎలా ఉంటుందో ఆయన అర్థం చేసుకోగలడు. అందుకే ఆయన మొదటి స్త్రీని సృష్టించే ముందు ఇలా అన్నాడు, “నరుడు ఒంటరిగా నుండుట మంచిది కాదు; వానికి సాటియైన సహాయమును వానికొరకు చేయుదును.” (ఆది. 2:18) భార్యాభర్తలు వివాహ బంధంలో పొందగల ఆనందం గురించి కూడా యెహోవాకు పూర్తిగా తెలుసు.—సామెతలు 5:15-18 చదవండి.

10. క్రైస్తవ భార్యాభర్తల మధ్య ఉండాల్సిన లైంగిక సంబంధాన్ని ఏవి నిర్దేశించాలి?

10 మానవజాతికి వారసత్వంగా వచ్చిన పాపం వల్ల, అపరిపూర్ణత వల్ల, ఈ రోజుల్లో జరిగే పెళ్లిళ్లు పరిపూర్ణమైనవి కావు. అయితే, దేవుని వాక్య ప్రకారం నడుచుకుంటే, వివాహం చేసుకునే యెహోవా సేవకులు నిజమైన సంతోషాన్ని పొందవచ్చు. ఉదాహరణకు, భార్యాభర్తల మధ్య ఉండే లైంగిక సంబంధం గురించి పౌలు ఇచ్చిన స్పష్టమైన ఉపదేశాన్ని పరిశీలించండి. (1 కొరింథీయులు 7:1-5 చదవండి.) భార్యాభర్తలు పిల్లల్ని కనడానికి మాత్రమే లైంగిక సంబంధాన్ని కలిగివుండాలని లేఖనాలు చెప్పడం లేదు. అలాంటి సంబంధం వల్ల భావోద్వేగపరమైన, శారీరకమైన అవసరాలు తీరతాయి. కానీ అసహజమైన లైంగిక కృత్యాలను దేవుడు ఎంతమాత్రం ఇష్టపడడు. క్రైస్తవ భార్యాభర్తలు ఒకరి పట్ల ఒకరు నిజమైన అనురాగాన్ని చూపించుకుంటూ జీవితంలోని ప్రాముఖ్యమైన ఈ విషయంలో సున్నితంగా వ్యవహరిస్తారు. ఈ విషయంలో యెహోవాకు ఇష్టంలేని ఎలాంటి పనులూ చేయకూడదు.

11. యెహోవా ఇష్టపడే విధంగా నడుచుకున్నందుకు రూతు ఏ ఆశీర్వాదాలు పొందింది?

11 వైవాహిక జీవితం ఆనందంగా సాగాలే గానీ అందులో అసంతోషానికి, అసంతృప్తికి తావుండకూడదు. ముఖ్యంగా క్రైస్తవ గృహం శాంతి సమాధానాలకు నెలవుగా ఉండాలి. దాదాపు 3,000 సంవత్సరాల క్రితం ఏమి జరిగిందో పరిశీలించండి. వృద్ధ విధవరాలైన నయోమి, తమ తమ భర్తల్ని పోగొట్టుకున్న ఆమె కోడళ్లయిన ఓర్పా, రూతు మోయాబు దేశం నుండి యూదా దేశానికి వెళ్తున్నప్పుడు నయోమి వాళ్లిద్దరినీ వాళ్ల ఇళ్లకు వెళ్లిపొమ్మంది. మోయాబీయురాలైన రూతు నయోమితోనే ఉండడానికి ఇష్టపడింది, ఆమె సత్య దేవుడైన యెహోవాకు నమ్మకంగా ఉంది, ఆమె ‘యెహోవా రెక్కలక్రింద సురక్షితముగా ఉండేందుకు వచ్చింది కాబట్టి యెహోవా సంపూర్ణమైన బహుమానమిస్తాడు’ అనే అభయాన్ని పొందింది. (రూతు 1:9; 2:12) దేవుని బహుమానమైన వివాహాన్ని ఆమె ఎంతో విలువైనదిగా ఎంచినందువల్ల యెహోవా ఆరాధకుడైన వృద్ధ బోయజుకు భార్య అయ్యింది. దేవుని నూతనలోకంలో ఆమె భూమ్మీద జీవించడానికి పునరుత్థానం చేయబడినప్పుడు, తాను యేసుక్రీస్తుకు పూర్వీకురాలినయ్యానని తెలుసుకుని ఆమె ఎంత సంతోషిస్తుందో! (మత్త. 1:1, 5, 6; లూకా 3:23, 32) యెహోవా ఇష్టపడే విధంగా నడుచుకున్నందుకు ఆమె గొప్ప ఆశీర్వాదాలు పొందింది.

సంతోషభరితమైన వైవాహిక జీవితానికి అవసరమైన చక్కని ఉపదేశం

12. వైవాహిక జీవితానికి అవసరమైన చక్కని ఉపదేశం ఎక్కడ లభిస్తుంది?

12 వైవాహిక జీవితం సంతోషభరితంగా సాగాలంటే మనం ఏ విషయాలు తెలుసుకుని ఉండాలో వివాహ ఏర్పాటును ప్రారంభించిన యెహోవా మనకు చెబుతున్నాడు. దీని గురించి ఆయనకు తెలిసినంతగా మరే మానవుడికీ తెలియదు. ఈ విషయంలో సరైన సలహాలు కేవలం బైబిల్లోనే ఉన్నాయి, కాబట్టి ఎవరైనా సలహాలు ఇస్తున్నప్పుడు బైబిలు ప్రమాణాల ఆధారంగానే ఇవ్వాలి. ఉదాహరణకు, అపొస్తలుడైన పౌలు దేవుని ప్రేరణతో ఇలా రాశాడు, “మీలో ప్రతి పురుషుడును తననువలె తన భార్యను ప్రేమింపవలెను, భార్యయైతే తన భర్తయందు భయము కలిగియుండునట్లు చూచుకొనవలెను.” (ఎఫె. 5:33) అలాంటి బైబిలు ఉపదేశం గురించి పరిణతిగల క్రైస్తవులు అర్థం చేసుకోలేనిదంటూ ఏమీ లేదు. అయితే, వాళ్లు యెహోవా వాక్యం చెబుతున్న దాని ప్రకారం నడుచుకుంటారా లేదా అన్నదే ప్రశ్న. వాళ్లు దేవుని బహుమానమైన వివాహాన్ని నిజంగా విలువైనదిగా ఎంచితే అలా నడుచుకుంటారు. a

13. మొదటి పేతురు 3:7లోని ఉపదేశాన్ని అనుసరించకపోతే ఏమి జరగవచ్చు?

13 క్రైస్తవ భర్త తన భార్యతో ప్రేమగా వ్యవహరించాలి. అపొస్తలుడైన పేతురు ఇలా చెప్పాడు, “పురుషులారా, జీవమను కృపావరములో మీ భార్యలు మీతో పాలివారైయున్నారని యెరిగి, యెక్కువ బలహీనమైన ఘటమని భార్యను సన్మానించి, మీ ప్రార్థనలకు అభ్యంతరము కలుగకుండునట్లు, జ్ఞానము చొప్పున వారితో కాపురము చేయుడి.” (1 పేతు. 3:7) ఒక భర్త యెహోవా ఉపదేశం ప్రకారం నడుచుకోకపోతే, ఆయన ప్రార్థనలకు అభ్యంతరం లేదా ఆటంకం కలుగవచ్చు. భార్యాభర్తలిద్దరూ ఆధ్యాత్మిక ప్రమాదంలో పడేందుకు అది దారితీయవచ్చు, దాని వల్ల వాళ్లు ఎంతో ఒత్తిడికి గురికావచ్చు, ఇద్దరి మధ్య గొడవలు జరగవచ్చు, ఒకరితో ఒకరు కఠినంగా వ్యవహరించుకునే పరిస్థితి రావచ్చు.

14. ప్రేమగల భార్య వ్యవహరించే తీరు వల్ల కుటుంబ జీవితం ఎలా ఉంటుంది?

14 యెహోవా వాక్యం, ఆయన పరిశుద్ధాత్మ ఇచ్చే నిర్దేశాన్ని పాటించే భార్య తన గృహం శాంతి సంతోషాలకు నెలవు అయ్యేలా చేయగలదు. దేవునికి భయపడే భర్త సహజంగానే తన భార్యను ప్రేమిస్తాడు, భౌతికంగా ఆధ్యాత్మికంగా ఆమెకు కావాల్సిన సంరక్షణను ఇస్తాడు. ఆమె ఆయన ప్రేమ కోసం పరితపిస్తుంది, అయితే ఆమె ఆయన ప్రేమను చూరగొనే విధంగా నడుచుకోవాలి. “జ్ఞానవంతురాలు తన యిల్లు కట్టును, మూఢురాలు తన చేతులతో తన యిల్లు ఊడ బెరుకును” అని సామెతలు 14:1 చెబుతోంది. జ్ఞానవంతురాలైన, ప్రేమగల భార్య తన కుటుంబ జీవితం సాఫీగా, సంతోషంగా సాగేందుకు ఎంతగానో తోడ్పడుతుంది. దేవుని బహుమానమైన వివాహాన్ని నిజంగా విలువైనదిగా ఎంచుతున్నానని కూడా ఆమె చూపిస్తుంది.

15. ఎఫెసీయులు 5:22-25 వచనాల్లో ఉన్న ఉపదేశం ఏమిటి?

15 సంఘంతో యేసు వ్యవహరించిన విధానాన్ని అనుసరించి నడుచుకునే భార్యాభర్తలు దేవుడిచ్చిన వివాహమనే బహుమానం పట్ల కృతజ్ఞత చూపిస్తారు. (ఎఫెసీయులు 5:22-25 చదవండి.) వివాహాన్ని విచ్ఛిన్నం చేయగల అహంకారాన్ని, ఇతర చెడ్డ లక్షణాలను చూపించకుండా, చిన్న పిల్లల్లా మూతి ముడుచుకోకుండా ఒకరినొకరు ప్రేమించుకునే భార్యాభర్తలు గొప్ప ఆశీర్వాదాలు పొందుతారు.

భార్యాభర్తల్ని ఎవ్వరూ వేరుపర్చకూడదు

16. కొంతమంది క్రైస్తవులు ఎందుకు ఒంటరిగా ఉండిపోతారు?

16 చాలామంది ఏదో ఒకరోజు పెళ్లి చేసుకుందామనే అనుకుంటారు. అయితే కొంతమంది క్రైస్తవులు యెహోవా సేవకుల్లో తమకు నచ్చిన వ్యక్తి దొరక్కపోవడం వల్ల పెళ్లి చేసుకోకుండా ఒంటరిగానే ఉండిపోతారు. మరికొంతమంది పెళ్లి వల్ల వచ్చే ఆటంకాలు లేకుండా యెహోవా సేవకు అంకితమయ్యేందుకు వీలుగా ఒంటరిగానే ఉండిపోవాలని నిర్ణయించుకుంటారు. అది కూడా దేవుని బహుమానమే. అయితే, అలా ఒంటరిగా ఉండాలని నిర్ణయించుకున్నవాళ్లు కూడా యెహోవా నియమించిన హద్దుల్లోనే జీవితాన్ని ఆనందించాలి.—మత్త. 19:10-12; 1 కొరిం. 7:1, 6, 7, 17.

17. (ఎ) వివాహం గురించి యేసు చెప్పిన ఏ మాటలను మనం మనసులో ఉంచుకోవాలి? (బి) క్రైస్తవులెవరైనా మరొకరి భార్యను లేదా భర్తను ఆశించడం మొదలుపెడితే వాళ్లు వెంటనే ఏమి చేయాలి?

17 ఒంటరివాళ్లమైనా, వివాహితులమైనా మనమందరం యేసు చెప్పిన ఈ మాటల్ని మనసులో ఉంచుకోవాలి, “సృజించిన వాడు [దేవుడు] ఆదినుండి వారిని పురుషునిగాను స్త్రీనిగాను సృజించెననియు—ఇందు నిమిత్తము పురుషుడు తలిదండ్రులను విడిచి తన భార్యను హత్తుకొనును, వారిద్దరును ఏకశరీరముగా ఉందురని చెప్పెననియు మీరు చదువలేదా? కాబట్టి వారికను ఇద్దరుకాక ఏకశరీరముగా ఉన్నారు గనుక దేవుడు జతపరచినవారిని మనుష్యుడు వేరుపరచకూడదు.” (మత్త. 19:4-6) మరొకరి భార్యను లేదా భర్తను ఆశించడం తప్పు. (ద్వితీ. 5:21) క్రైస్తవులెవరైనా అలా ఆశించడం మొదలుపెడితే ఆ అశుద్ధమైన కోరికను వెంటనే అణచివేసుకోవడం మంచిది. అలాంటి స్వార్థపూరిత కోరికలు తలెత్తడానికి అనుమతించినందుకు ఆ తర్వాత ఎంతో మనోవేదన అనుభవించాల్సి వచ్చినా సరే అలాంటి కోరికను అణచివేసుకోవాలి. (మత్త. 5:27-30) అలాంటి ఆలోచనను సరిదిద్దుకుని, మోసపూరితమైన మన హృదయంలోని పాపభరిత కోరికల్ని అణచివేసుకోవడం ఎంతో ప్రాముఖ్యం.—యిర్మీ. 17:9.

18. దేవుని బహుమానమైన వివాహాన్ని ఎలా దృష్టించాలని మీరు అనుకుంటున్నారు?

18 యెహోవా దేవుని గురించి, ఆయన అద్భుత బహుమానమైన వివాహం గురించి అంతగా తెలియని లేదా అసలే తెలియని చాలామంది కూడా వివాహ బంధాన్ని కొద్దోగొప్పో విలువైనదిగానే ఎంచారు. అలాంటప్పుడు, ‘సంతోషంగల దేవుడైన’ యెహోవాకు సమర్పించుకున్న మనం దేవుడు చేసిన ఏర్పాట్లను బట్టి సంతోషిస్తూ ఆయన బహుమానమైన వివాహాన్ని ఇంకెంత విలువైనదిగా ఎంచాలో కదా!—1 తిమో. 1:11, NW.

[అధస్సూచి]

a వివాహం గురించి మరిన్ని వివరాల కోసం ‘దేవుని ప్రేమలో నిలిచి ఉండండి’ అనే పుస్తకంలోని 1011 అధ్యాయాలు చూడండి.

[అధ్యయన ప్రశ్నలు]

[6వ పేజీలోని బ్లర్బ్‌]

సాఫీగా సాగే వైవాహిక జీవితం యెహోవాకు ఘనతను తీసుకొస్తుంది, కుటుంబంలో ప్రతి ఒక్కరికీ ఎంతో సంతోషాన్ని కలిగిస్తుంది

[5వ పేజీలోని చిత్రం]

దేవుని బహుమానమైన వివాహాన్ని విలువైనదిగా ఎంచుతున్నానని రూతు చూపించింది

[7వ పేజీలోని చిత్రం]

దేవుని బహుమానమైన వివాహాన్ని నిజంగా విలువైనదిగా ఎంచుతున్నారని మీరు చూపిస్తున్నారా?