కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

మీరు యెహోవా మహిమను ప్రతిబింబిస్తున్నారా?

మీరు యెహోవా మహిమను ప్రతిబింబిస్తున్నారా?

మీరు యెహోవా మహిమను ప్రతిబింబిస్తున్నారా?

‘మనమందరం ప్రభువు [“యెహోవా,” NW] యొక్క మహిమను అద్దమువలె ప్రతిఫలింపజేయుచున్నాము.’—2 కొరిం. 3:18.

మీరెలా జవాబిస్తారో చూడండి:

మనం పాపులమైనప్పటికీ యెహోవా మహిమను ప్రతిబింబించడం ఎలా సాధ్యమౌతుంది?

మనం చేసే ప్రార్థనలు, క్రైస్తవ కూటాలు దేవుని మహిమను ప్రతిబింబించడానికి మనకెలా సహాయం చేస్తాయి?

మనం ఎల్లప్పుడూ యెహోవాను మహిమపర్చాలంటే ఏమి చేయాలి?

1, 2. మనం యెహోవా లక్షణాలను ప్రతిబింబించడం సాధ్యమేనని ఎందుకు చెప్పవచ్చు?

 మనమందరం ఏదో ఒక విధంగా మన తల్లిదండ్రుల్లా ఉంటాం. “నువ్వు అచ్చం మీ నాన్నలాగే ఉన్నావ్‌” అని, “నిన్ను చూస్తుంటే మీ అమ్మే గుర్తుకొస్తుంది” అని పిల్లలతో ఎవరైనా అన్నప్పుడు మనం ఆశ్చర్యపోము. పిల్లలు కూడా వాళ్ల అమ్మానాన్నలను చూసి తరచూ వాళ్లలాగే ప్రవర్తిస్తుంటారు. అయితే మన విషయమేమిటి? మనం మన పరలోక తండ్రియైన యెహోవాలా ఉండడం సాధ్యమేనా? మనం యెహోవాను చూడకపోయినా ఆయన వాక్యాన్ని చదవడం ద్వారా, ఆయన సృష్టిని గమనించడం ద్వారా మనం ఆయన అమూల్యమైన లక్షణాలను గ్రహించగలుగుతాం. అంతేగాక లేఖనాలను ముఖ్యంగా, ఆయన కుమారుడైన యేసుక్రీస్తు మాటల్ని, పనుల్ని ధ్యానించడం ద్వారా కూడా ఆయన అమూల్యమైన లక్షణాలను గ్రహించగలుగుతాం. (యోహా. 1:18; రోమా. 1:20) కాబట్టి, మనం యెహోవా మహిమను ప్రతిబింబించడం సాధ్యమే.

2 దేవుడు మానవులను సృష్టించకముందు, వాళ్లు తన చిత్తాన్ని నెరవేర్చగలుగుతారని, తన లక్షణాలను ప్రతిబింబించగలుగుతారని, తనకు మహిమను తీసుకురాగలుగుతారని దేవునికి తెలుసు. (ఆదికాండము 1:26, 27 చదవండి.) క్రైస్తవులముగా మనం మన సృష్టికర్త లక్షణాల్ని చూపించాలనుకుంటాం. మనమలా చేస్తే మన జాతి, సంస్కృతి, విద్య వంటివాటితో సంబంధం లేకుండా దేవుని మహిమను ప్రతిబింబించే అత్యంత గొప్ప అవకాశం మనకుంటుంది. ఎందుకంటే, ‘దేవుడు పక్షపాతి కాడు. ప్రతీ జనంలో ఆయనకు భయపడి నీతిగా నడుచుకునే వాళ్లను ఆయన అంగీకరిస్తాడు.’—అపొ. 10:34, 35.

3. యెహోవా సేవ చేస్తుండగా క్రైస్తవులు ఎలాంటి అనుభూతిని పొందవచ్చు?

3 అభిషిక్త క్రైస్తవులు యెహోవా మహిమను ప్రతిబింబిస్తారు. అందుకే, ఆత్మాభిషిక్త అపొస్తలుడైన పౌలు ఇలా రాశాడు, ‘మనమందరము ముసుకులేని ముఖముతో ప్రభువు [“యెహోవా,” NW] యొక్క మహిమను అద్దమువలె ప్రతిఫలింపజేయుచు, మహిమ నుండి అధిక మహిమను పొందుచున్నాము.’ (2 కొరిం. 3:18) సీనాయి పర్వతం మీద యెహోవా మోషేతో మాట్లాడాడు కాబట్టి, పది ఆజ్ఞలున్న రాతి పలకలను చేతపట్టుకొని మోషే ఆ పర్వతం మీద నుండి దిగి వచ్చినప్పుడు ఆయన ముఖం ప్రకాశించింది. (నిర్గ. 34:29, 30) మోషే విషయంలో జరిగినట్లు క్రైస్తవుల విషయంలో జరగకపోయినా, వాళ్ల ముఖం ప్రకాశించకపోయినా యెహోవా గురించి, ఆయన లక్షణాల గురించి, మానవుల విషయంలో ఆయనకున్న అద్భుతమైన సంకల్పం గురించి ఇతరులతో మాట్లాడుతున్నప్పుడు వాళ్ల ముఖం సంతోషంతో వెలిగిపోతుంది. వెనకటి రోజుల్లోని తళతళలాడే లోహపు అద్దాల్లా అభిషిక్త క్రైస్తవులు, భూమ్మీదున్న వాళ్ల సహచరులు తమ జీవితంలో, పరిచర్యలో యెహోవా మహిమను ప్రతిబింబిస్తారు. (2 కొరిం. 4:1) యెహోవాకు ఇష్టమైన విధంగా జీవించడం ద్వారా, ప్రకటనాపనిలో క్రమంగా పాల్గొనడం ద్వారా మీరు యెహోవా మహిమను ప్రతిబింబిస్తున్నారా?

మనం యెహోవా మహిమను ప్రతిబింబించాలని కోరుకుంటాం

4, 5. (ఎ) పౌలు ఎదుర్కొన్న ఏ సమస్యను మనమూ ఎదుర్కొంటున్నాం? (బి) పాపం వల్ల మానవుల పరిస్థితి ఎలా ఉంది?

4 యెహోవా సేవకులముగా మనం చేసే ప్రతీ పనిలో ఆయనను ఘనపరచాలని, మహిమపరచాలని మనం ఖచ్చితంగా కోరుకుంటాం. అయితే, మనం ఒకటి చేయాలనుకొని మరొకటి చేస్తుంటాం. అపొస్తలుడైన పౌలు కూడా అలాంటి సమస్యను ఎదుర్కొన్నాడు. (రోమీయులు 7:21-25 చదవండి.) తప్పుడు కోరికలతో ఎందుకు పోరాడాల్సి ఉంటుందో వివరిస్తూ పౌలు ఇలా అన్నాడు, “అందరును పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేక పోవుచున్నారు.” (రోమా. 3:23) ఆదాము పాపం చేశాడు కాబట్టి, మనుష్యులందరికీ పాపం వారసత్వంగా వచ్చింది, దానివల్ల అది మనందరిపై ‘ఏలుతోంది.’—రోమా. 5:12; 6:12.

5 పాపం అంటే ఏమిటి? యెహోవా వ్యక్తిత్వానికి, విధానాలకు, ప్రమాణాలకు, చిత్తానికి వ్యతిరేకంగా ఉన్నదేదైనా సరే, అది పాపమే. పాపం దేవునితో మనకున్న సంబంధాన్ని దెబ్బతీస్తుంది. ఉదాహరణకు, ఏదైనా ఒక కారణాన్ని బట్టి విలుకాని బాణం గురి తప్పవచ్చు, అలాగే పాపం వల్ల మనం దేవుని మహిమను ప్రతిబింబించే విషయంలో తప్పిపోతుంటాం. మనం కొన్నిసార్లు తెలిసికూడా పాపం చేస్తాం, మరి కొన్నిసార్లు అనుకోకుండా జరిగిపోతుంది. (సంఖ్యా. 15:27-31) పాపం మానవుల నరనరాల్లో ఇంకిపోయి ఉంది కాబట్టి అది మనకూ సృష్టికర్తకూ మధ్య అడ్డుగోడలా నిలుస్తుంది. (కీర్త. 51:5; యెష. 59:2; కొలొ. 1:21) అందుకే, లోకంలోని ప్రజలు యెహోవాకు అసలేమాత్రం నచ్చని పనులే చేస్తున్నారు, దానివల్ల ఆయన మహిమను ప్రతిబింబించే సువర్ణావకాశాన్ని కోల్పోతున్నారు. దీన్నిబట్టి, పాపం వల్ల మానవులందరిలో ఒక పెద్ద లోపం ఏర్పడిందని చెప్పవచ్చు.

6. మనం పాపులమైనప్పటికీ యెహోవా మహిమను ప్రతిబింబించడం ఎలా సాధ్యమౌతుంది?

6 మనం పాపులమైనా, యెహోవా మనలో “నిరీక్షణ” నింపుతున్నాడు. (రోమా. 15:13) పాపాన్ని తీసివేయడానికి యెహోవా ఒక ఏర్పాటు చేశాడు. అదే యేసుక్రీస్తు అర్పించిన విమోచన క్రయధన బలి. ఆ బలిపై విశ్వాసం ఉంచితే మనమిక ‘పాపమునకు దాసులముగా’ ఉండము కానీ, యెహోవా మహిమను ప్రతిబింబించగలుగుతాం. (రోమా. 5:19; 6:6; యోహా. 3:16) దేవునికి ఇష్టమైన వ్యక్తులుగా జీవిస్తే, ఇప్పుడు మనం ఆయన ఆశీర్వాదాల్ని పొందుతాం. అంతేకాక భవిష్యత్తులో పరిపూర్ణతను, నిత్యజీవాన్ని పొందుతాం. పాపులమైనప్పటికీ మనం యెహోవా దృష్టిలో తన మహిమను ప్రతిబింబించే వ్యక్తులుగా ఉండడం ఎంత గొప్ప ఆశీర్వాదమో కదా!

దేవుని మహిమను ఏవిధంగా ప్రతిబింబించవచ్చు?

7. మనం దేవుని మహిమను ప్రతిబింబించాలంటే ఏమి గుర్తించాలి?

7 మనం దేవుని మహిమను ప్రతిబింబించాలంటే, మనలో ఉన్న పాపభరిత స్వభావాన్ని మనం గుర్తించాలి. (2 దిన. 6:36) మన బలహీనతలేమిటో గుర్తించి, వాటితో పోరాడడానికి ప్రయత్నిస్తే మనం నిజంగా దేవుణ్ణి మహిమపర్చే దిశగా ఎదుగుతాం. ఉదాహరణకు, మనం అశ్లీల చిత్రాలు చూసే చెడ్డ అలవాటుకు బానిసలమైతే, మనకు పెద్దల సహాయం అవసరమనే వాస్తవాన్ని గుర్తించి, వాళ్ల సహాయాన్ని కోరాలి. (యాకో. 5:14, 15) దేవుణ్ణి మహిమపర్చాలంటే మనం చేయాల్సిన మొదటి పని అదే. యెహోవా ఆరాధికులముగా, మనం ఆయన నీతి ప్రమాణాలకు తగిన విధంగా జీవిస్తున్నామో లేదో తెలుసుకోవడానికి ఎప్పటికప్పుడు మనల్ని మనం పరిశీలించుకుంటూ ఉండాలి. (సామె. 28:18; 1 కొరిం. 10:12) మనం దేవుని మహిమను ప్రతిబింబించాలంటే, మనకు ఎలాంటి బలహీనత ఉన్నా దానితో పోరాడుతూనే ఉండాలి.

8. పరిపూర్ణులం కాకపోయినా, మనం ఏమి చేయాలి?

8 ఇప్పటివరకు ఈ భూమ్మీద జీవించిన మానవులందరిలో యేసు మాత్రమే సంపూర్ణంగా యెహోవాకు ఇష్టమైన పనులు చేశాడు, ఆయన మహిమను ప్రతిబింబించాడు. అయితే, యేసులా మనం పరిపూర్ణులం కాకపోయినా మనం ఆయనలా జీవించడం సాధ్యమే, అలా జీవించడానికి కృషి చేయాలి కూడా. (1 పేతు. 2:21) యెహోవాకు ఇష్టమైన పనులు చేయడానికి మనం ఎంతగా ప్రయత్నిస్తున్నామో, ఆ విషయంలో మనం ఏ స్థాయికి చేరుకున్నామో యెహోవా అర్థంచేసుకుంటాడు, తనకు మహిమ తెచ్చేందుకు మనం పట్టుదలతో చేసే కృషిని ఆశీర్వదిస్తాడు.

9. మనం యెహోవా మహిమను మరింత బాగా ప్రతిబింబించడానికి బైబిలు ఎలా సహాయం చేస్తుంది?

9 దేవుని వాక్యం సహాయంతో మనం ఆయనను మహిమపర్చే విషయంలో మెరుగవ్వవచ్చు. దానికోసం మనం లేఖనాలను పరిశోధించాలి, తెలుసుకున్న విషయాలను ధ్యానించాలి. (కీర్త. 1:1-3) ప్రతీరోజు లేఖనాలు చదివితే మనం ప్రగతి సాధిస్తాం. (యాకోబు 1:22-25 చదవండి.) బైబిలు జ్ఞానాన్ని సంపాదించుకుంటే మనలో విశ్వాసం కలుగుతుంది. అంతేకాక, ఘోరమైన పాపం చేయకుండా యెహోవాకు ఇష్టమైన విధంగా జీవించాలనే మన స్థిర నిశ్చయం బలపడుతుంది.—కీర్త. 119:11, 47, 48.

10. యెహోవా సేవను మరింత బాగా చేయడానికి ప్రార్థన మనకెలా సహాయం చేస్తుంది?

10 దేవుని మహిమను ప్రతిబింబించాలంటే, మనం ‘పట్టుదలగా ప్రార్థించాలి’ కూడా. (రోమా. 12:12) తనకు ఇష్టమైన విధంగా ఆరాధించడానికి సహాయం చేయమని మనం యెహోవాకు ప్రార్థించాలి. అంటే పరిశుద్ధాత్మను, ఎక్కువ విశ్వాసాన్ని, శోధనను ఎదిరించడానికి కావాల్సిన బలాన్ని, ‘సత్యవాక్యమును సరిగ్గా ఉపదేశించే’ సామర్థ్యాన్ని ఇవ్వమని మనం కోరాలి. (2 తిమో. 2:15; మత్త. 6:13; లూకా 11:13; 17:5) ఒక పిల్లవాడు తన తండ్రి సహాయం తీసుకున్నట్లే, మనం మన పరలోక తండ్రియైన యెహోవా సహాయం తీసుకోవాలి. తన సేవను మరింత బాగా చేయడానికి సహాయం చేయమని యెహోవాను కోరితే, ఆయన మన కోరికను తీరుస్తాడనే నమ్మకాన్ని కలిగివుండవచ్చు. మన ప్రార్థనలు యెహోవాకు చికాకు తెప్పిస్తాయని మనం ఎప్పుడూ అనుకోకూడదు. కానీ మనం ప్రార్థనలో ఆయనను స్తుతించాలి, కృతజ్ఞతలు చెల్లించాలి, అన్నిసమయాల్లో ముఖ్యంగా కష్టాల్లో ఉన్నప్పుడు ఆయన నిర్దేశం కోసం అడగాలి. అంతేకాక, తన పరిశుద్ధ నామాన్ని మహిమపర్చే విధంగా తనను సేవించేందుకు సహాయం చేయమని కూడా అడగాలి.—కీర్త. 86:12; యాకో. 1:5-7.

11. దేవుని మహిమను ప్రతిబింబించడానికి కూటాలు ఎలా సహాయం చేస్తాయి?

11 దేవుడు తన అమూల్యమైన గొర్రెల్ని చూసుకునే బాధ్యతను ‘నమ్మకమైనవాడును బుద్ధిమంతుడునైన దాసునికి’ అప్పగించాడు. (మత్త. 24:45-47; కీర్త. 100:3) తోటి విశ్వాసులు యెహోవా మహిమను ఎలా ప్రతిబింబిస్తున్నారనే విషయంలో దాసుని తరగతి ఎంతో శ్రద్ధ చూపిస్తుంది. ఉదాహరణకు, మనం చక్కగా కనిపించడానికి టైలర్‌ ఎలాగైతే మన బట్టల్ని ఆల్టర్‌ చేస్తాడో, అలాగే మన జీవితంలో కావాల్సిన మార్పులు చేసుకొని క్రైస్తవ లక్షణాల్ని మెరుగుపర్చుకోవడానికి కూటాలు సహాయం చేస్తాయి. (హెబ్రీ. 10:24, 25) కాబట్టి, మనం కూటాలకు సమయానికి వెళ్లాలి. ఒకవేళ మనకు ఆలస్యంగా వెళ్లే అలవాటుంటే, కూటాల నుండి పూర్తిగా ప్రయోజనం పొందలేము.

మనం దేవుని పోలి నడుచుకుందాం

12. మనం ఎలా దేవుని పోలి నడుచుకోవచ్చు?

12 మనం దేవుని మహిమను ప్రతిబింబించాలంటే, ‘దేవుని పోలి నడుచుకోవాలి.’ (ఎఫె. 5:1) ఏదైనా ఒక విషయం గురించి యెహోవా ఎలా ఆలోచిస్తాడో తెలుసుకొని, అలా ఆలోచించడానికి ప్రయత్నించడం ద్వారా మనం ఆయనను పోలి నడుచుకోగలుగుతాం. అలా కాకుండా మనం ఇంకెలా ఉన్నా, ఆయనను అగౌరవపరుస్తాం, మనకు హాని తెచ్చుకుంటాం. లోకం అపవాదియైన సాతాను చెప్పుచేతల్లో ఉంది కాబట్టి, మనం యెహోవా అసహ్యించుకునేవాటిని అసహ్యించుకోవడానికి, ఆయన ప్రేమించేవాటిని ప్రేమించడానికి గట్టిగా ప్రయత్నించాలి. (కీర్త. 97:10; 1 యోహా. 5:19) మనం ప్రతీది దేవుని మహిమ కోసం చేస్తేనే మనం ఆయన సేవను సరైన విధంగా చేయగలుగుతామనే దృఢ నమ్మకం మనకుండాలి.—1 కొరింథీయులు 10:31 చదవండి.

13. మనం పాపాన్ని ఎందుకు అసహ్యించుకోవాలి? అలా అసహ్యించుకుంటే మనం వేటికి దూరంగా ఉంటాం?

13 యెహోవా పాపాన్ని అసహ్యించుకుంటాడు కాబట్టి మనం కూడా దాన్ని అసహ్యించుకోవాలి. మనం పాపానికి సాధ్యమైనంత దూరంగా ఉండాలి, దాని దరిదాపుల్లోకి కూడా పోకూడదు. ఉదాహరణకు, మనం మతభ్రష్టత్వానికి దూరంగా ఉండాలి. ఎందుకంటే, అది దేవుణ్ణి మహిమపర్చడానికి మనలను అనర్హుల్ని చేస్తుంది. (ద్వితీ. 13:6-9) కాబట్టి, మతభ్రష్టులకు దూరంగా ఉందాం. అంతేకాక, ఆధ్యాత్మిక సహోదరులమని చెప్పుకుంటూనే దేవుణ్ణి అగౌరవపరుస్తున్న వాళ్లకు కూడా దూరంగా ఉందాం. అలాంటివాళ్లు మన సొంత కుటుంబ సభ్యులైనా సరే, మనం వాళ్లకు దూరంగా ఉండాలి. (1 కొరిం. 5:11) మతభ్రష్టుల లేదా యెహోవా సంస్థను విమర్శించే వాళ్ల వాదనలు తప్పని నిరూపించడానికి ప్రయత్నించడం వల్ల ఒరిగేదేమీ ఉండదు. నిజానికి, వాళ్ల పుస్తకాలను చదివితే, వాళ్ల ఇంటర్నెట్‌ సైట్లకు వెళ్తే మనకు ఆధ్యాత్మిక ప్రమాదం కలుగుతుంది, ఆ ప్రయత్నాలు చేయడం కూడా తప్పే.—యెషయా 5:20; మత్తయి 7:6 చదవండి.

14. దేవుని మహిమను ప్రతిబింబించడానికి ప్రయత్నిస్తున్నప్పుడు మనం ముఖ్యంగా ఏ లక్షణం చూపించాలి? ఎందుకు?

14 మన పరలోక తండ్రిని పోలి నడుచుకోవాలంటే ప్రాముఖ్యంగా మనం ప్రేమ చూపించాలి. (1 యోహా. 4:16-19) పైగా మన మధ్య ఉన్న ప్రేమను బట్టే యేసు శిష్యులముగా, యెహోవా సేవకులముగా గుర్తించబడతాం. (యోహా. 13:34, 35) మనలో పాతుకుపోయిన పాపం కొన్నిసార్లు అడ్డొచ్చినా, దాన్ని పక్కకు నెట్టి మనం అన్ని సందర్భాల్లో ప్రేమ చూపించాలి. ప్రేమను, ఇతర మంచి లక్షణాలను అలవర్చుకుంటే నిర్దయగా ప్రవర్తించం, తప్పుడు పనులు చేయం.—2 పేతు. 1:5-7.

15. ప్రేమ ఉంటే ఇతరులతో మన సంబంధాలు ఎలా ఉంటాయి?

15 మనలో ఉన్న ప్రేమను బట్టే ఇతరులకు మంచి చేయాలని చూస్తాం. (రోమా. 13:8-10) ఉదాహరణకు, భార్యపై లేక భర్తపై ప్రేమ ఉంటే వాళ్లకు నమ్మకద్రోహం చేయకుండా ఉంటాం. సంఘ పెద్దల మీద ప్రేమ, వాళ్లు చేసే సేవపై గౌరవం ఉంటే వాళ్లకు లోబడి ఉంటాం, వాళ్ల నిర్దేశాలకు కట్టుబడి ఉంటాం. తల్లిదండ్రుల్ని ప్రేమించే పిల్లలు వాళ్ల మాట వింటారు, వాళ్లను గౌరవిస్తారు, వాళ్ల గురించి చెడుగా మాట్లాడరు. తోటివాళ్ల మీద మనకు ప్రేమ ఉంటే, వాళ్లను చిన్నచూపు చూడం, వాళ్లతో అమర్యాదగా మాట్లాడం. (యాకో. 3:9) దేవుని గొర్రెల్ని ప్రేమించే పెద్దలు వాళ్ల పరిస్థితిని అర్థంచేసుకొని వ్యవహరిస్తారు.—అపొ. 20:28, 29.

16. ప్రేమ ఉంటే మనం పరిచర్యను ఎలా చేస్తాం?

16 మనం పరిచర్యలో కూడా ప్రేమ చూపించాలి. యెహోవాపై మనకు అపారమైన ప్రేమ ఉంటే, ప్రజలు సువార్త వినకపోయినా లేదా మనల్ని తిట్టినా మనం ప్రకటనాపని చేయడం ఆపము కానీ, దాన్ని కొనసాగిస్తూనే ఉంటాం. ప్రేమ ఉంటే మనం చక్కగా సిద్ధపడతాం, పరిచర్యలో సమర్థవంతంగా సాక్ష్యమిచ్చేందుకు కృషి చేస్తాం. దేవునిపై, ప్రజలపై నిజమైన ప్రేమ ఉంటే, రాజ్య ప్రకటనాపని చేయడం మనకు దొరికిన గొప్ప అవకాశమని ఎంచి దాన్ని సంతోషంగా చేస్తాం. అంతేగానీ, చేయక తప్పదన్నట్లు చేయము.—మత్త. 10:7.

యెహోవాను మహిమపరుస్తూ ఉండండి

17. మనం పాపం వల్ల దేవుని మహిమను ప్రతిబింబించలేకపోతున్నామని గుర్తిస్తే మనమేమి చేస్తాం?

17 పాపం ఎంత తీవ్రమైనదో లోకంలోని ప్రజలకు తెలియదు కానీ మనకు తెలుసు. అందుకే, పాపం చేయాలనే శోధనను ఎదిరించాలనుకుంటాం. మనం పాపులమని గుర్తిస్తే మన మనస్సాక్షికి సరైన శిక్షణ ఇస్తాం. అందువల్ల తప్పుడు ఆలోచన రాగానే దాన్ని ఎదిరించగలుగుతాం. (రోమా. 7:22, 23) మనం బలహీనులమే కావచ్చు కానీ, ఎలాంటి పరిస్థితిలోనైనా సరైన పని చేయడానికి కావాల్సిన బలాన్ని దేవుడు మనకిస్తాడు.—2 కొరిం. 12:10.

18, 19. (ఎ) దురాత్మల సమూహాలతో మనం చేసే పోరాటంలో గెలవాలంటే ఏమి చేయాలి? (బి) మనం ఏమి చేయాలని గట్టిగా నిర్ణయించుకోవాలి?

18 యెహోవాను మహిమపర్చాలంటే మనం దురాత్మల సమూహాలతో పోరాడడం కూడా ప్రాముఖ్యం. దేవుడు మనకిచ్చిన ఆధ్యాత్మిక సర్వాంగ కవచాన్ని ధరిస్తే మనం వాటితో చేసే పోరాటంలో గెలుస్తాం. (ఎఫె. 6:11-13) యెహోవాకు మాత్రమే చెందాల్సిన మహిమను తాను పొందాలని సాతాను పట్టువిడవకుండా ప్రయత్నిస్తున్నాడు. యెహోవాతో మనకున్న స్నేహాన్ని తెంచేయడానికి కూడా సాతాను నిర్విరామంగా ప్రయత్నిస్తున్నాడు. మనం, ఇంకా లక్షలాదిమంది స్త్రీలు, పురుషులు, పిల్లలు దేవునికి విశ్వసనీయంగా ఉండి ఆయనను మహిమపర్చడం సాతానుకు గట్టి చెంపపెట్టు! కాబట్టి, పరలోకంలోని దూతల్లా మనం యెహోవాను ఇలా స్తుతిస్తూ ఉందాం, ‘యెహోవా, మా దేవా, నీవు సమస్తమును సృష్టించితివి; నీ చిత్తమునుబట్టి అవి యుండెను; దానిని బట్టియే సృష్టింపబడెను గనుక నీవే మహిమ ఘనత ప్రభావములు పొందనర్హుడవు.’—ప్రక. 4:10, 11.

19 ఏమి జరిగినా సరే, యెహోవాను మహిమపరుస్తూనే ఉండాలని గట్టిగా నిర్ణయించుకుందాం. తనను పోలి నడుచుకోవడానికి, తన మహిమను ప్రతిబింబించడానికి ఎంతోమంది నమ్మకస్థులు శాయశక్తులా కృషిచేయడం చూసి యెహోవా ఖచ్చితంగా సంతోషిస్తాడు. (సామె. 27:11) దావీదులాంటి భావాల్నే మనమూ కలిగి ఉందాం. ఆయనిలా పాడాడు, “నా పూర్ణహృదయముతో నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను. నీ నామమును నిత్యము మహిమపరచెదను.” (కీర్త. 86:12) యెహోవా మహిమను సంపూర్ణంగా ప్రతిబింబిస్తూ, ఆయనను నిరంతరం స్తుతించే రోజు కోసం మనం ఎంత ఆశగా ఎదురుచూస్తున్నామో కదా! దేవుని మాట వినే ప్రజలకున్న ఆ కల నిజమౌతుంది. యెహోవా మహిమను నిరంతరం ప్రతిబింబించాలనే ఆశతో మీరు ఇప్పుడు అలా చేస్తున్నారా?

[అధ్యయన ప్రశ్నలు]

[27వ పేజీలోని చిత్రాలు]

మీరు ఇవన్నీ చేస్తూ యెహోవా మహిమను ప్రతిబింబిస్తున్నారా?